బాల్యాన్ని బ్రతికించే పుస్తకం, ‘రైలుబడి’

Spread the love

రెండుప్రపంచ యుద్ధాలు ప్రపంచ ప్రజల జీవితాల నెన్నిటినో ఛిన్నాభిన్నం చేశాయి. అలా రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబుదాడికి గురై, తన ఉనికిని కోల్పోయిన మరో అస్తిత్వం, జపాన్ లోని భవిష్యత్తరాలను తయారు చేసిన చదువులమ్మ గుడి, “రైలు బడి”కూడా! ప్రపంచమంతటా గొప్ప విద్యావేత్తలున్నారు. వాళ్లవి ఉన్నతాదర్శాలు. వాళ్ళకు పిల్లల పట్ల ప్రగాఢమైన ప్రేమ! ఆదర్శపాఠశాలల్ని నెలకొల్పాలని, అద్భుత స్వప్నాలను కన్నవారుకూడ. కాని, ఆ స్వప్నాలను వాస్తవంలోకి అనువదించి, ఒక అద్భుతమైన తరాన్ని తయారు చేసిన వారిలో జపానుకు చెందిన, ‘సాసాకు కొబయాషి’ (1893-1963) పేర్కొనదగినవారు! ఏళ్లతరబడి అధ్యయనం చేసి, 1937 లో టోక్యోలో బడి (టోమో)ని ప్రారంభించి, ఎన్నో ఆణిముత్యాలను ప్రపంచానికి అందించిన వారు. ఆయన ప్రారంభించిన బడి కూడా చాలా ప్రత్యేకమైనది. వాడడానికి పనికిరాని పాత రైలుపెట్టెలను కొని, వాటిని తరగతి గదులుగా మార్చిన బడి. ఒకవైపు నల్లబల్ల, దానికెదురుగా పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు అమర్చిన, కొబయాషి, అంతే సృజనాత్మకతను, విద్యాబోధన విషయంలోనూ చూపారు.

కొబయాషి ప్రకృతి పరిశీలకుడు. పిల్లల మనోభావాలను ఎదగనివ్వాలనుకొనే వ్యక్తి. వారిలోని ఊహాత్మక శక్తి విలువను తెలిసిన వాడు. జీవిత పాఠాలను వాచ్యంగా చెప్పడం గాక, వారే గ్రహించేలా చేయగలిగిన సహనశీలి. మనకన్నా ప్రకృతి మంచి గురువు అన్న అంశాన్ని గ్రహించడమే కాదు, ప్రకృతి నుండి పిల్లలు పాఠాలను నేర్వడానికి, తాము ఉపకరణంగా మాత్రమే ఉండాలని , ఆచరించి చూపిన వ్యక్తి. ‘ఇలా ఉండు’, ‘అలా చేయవద్దు’ అని వాచ్యంగా మన అభిప్రాయాలను పిల్లల పై రుద్దడం తప్పనీ, జీవితంలో చేయరానివీ, చేయవలసినవీ ఏవి, అని వారే గ్రహించేలా చేయడమే పెద్దలు, ముఖ్యంగా, గురువులపని, అని గుర్తెరిగిన వాడు. ఒక్క పరుషపు మాట కూడా మాట్లాడకుండ, పిల్లలను క్రమశిక్షణలో పెట్టగల గొప్ప గురువు. సాధారణంగా, ఐదారు ఏళ్లనుండి, దాదాపు పది సంవత్సరాల మధ్య పిల్లలు, నేర్చుకొనే తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ వయస్సులో మంచి గురువులు లభించడం ఆ పిల్లల అదృష్టం అని యీ రైలుబడి నిరూపిస్తుంది.

ఈ పుస్తకాన్ని రాసిన ‘టెట్సుకో కురొయనాగి’ (1933—)ఈ బడి విద్యార్థిని! ఆరేళ్ళ వయస్సులోనే, తన తొలి బడిలో, చేరిన కొన్ని రోజులకే, తనలోని సృజానాత్మకోత్సాహానికి ప్రతిఫలంగా, టి.సి.,ఇవ్వబడిన బాలిక. ఆమె ఉపాధ్యాయురాలి మాటల్లోనే, ఆమె నియమాతిక్రమణ ఏదీ చేయలేదు. ఏదైనా వస్తువును తీసేటపుడు మాత్రమే మేజాబల్లను తెరవాలి, అన్న టీచర్ మాటను జవదాటలేదు. కాని, పుస్తకం, పెన్సిలు, రబ్బరు, ఒక్కో వస్తువును, బయటకు తీసేటపుడు ఒకసారి, మళ్లీ వాటిని ఒక్కొక్కటిగా లోపల పెట్టేటపుడు ఒకసారి అంటూ, దాదాపు ఆరుసార్లు , మేజా బళ్ళను పెద్ద శబ్దంతో మూయడమే ఆమె చేసే పని. ఆ పని ముగిసిన తరువాత, కిటికీ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, పిట్టలతో, పూలతో మాట్లాడటం; వీధి భాజావాళ్లను పిలవడం; శిక్షగా, వరండాలో నిలబెడితే, తన ప్రశ్నలతో, ఆ వరండా వైపు వేరే ఉపాధ్యాయులు రావడానికి భయపడేలా చేయడం మాత్రమే ఆమె క్రమశిక్షణా రాహిత్యం. వెదికి వెదికి, ఈ రైలుబడిలో చేర్చింది, ఆమె తల్లి, తన పేరు పలకడం రాక టోటోచాన్ గా మారిన టెట్సుకోను.

ఆమె అల్లరి లోని ‘సృజనను’ గుర్తించిన సాసాకు కొబయాషి, ఆమెతో పలికే, “నువ్వు మంచి దానవు” అన్న ఒకే ఒక వాక్యం, ఆమెను, టోక్యో సంగీత రూపకాల గానాన్ని అధ్యయనం చేసే స్థాయికి ఎదగనిచ్చింది. జంతు ప్రేమికురాలిగా మార్చి, ప్రపంచ వన్యప్రాణి రక్షణసంస్థ –జపాన్ విభాగానికి ఒక డైరెక్టర్ గా చేసింది. వరుసగా అయిదుసంవత్సరాలు, అందరికంటే ఎక్కువ ఆదరణ పొందిన టి.వి. వ్యాఖ్యాతగా గౌరవించింది. ‘రైలుబడి’ చరిత్రను సంవత్సరం ఎనిమిదినెలలపాటు ‘యంగ్ విమెన్’ పత్రికలో ధారావాహికగా వెలువరించేలా చేసింది. వేలాదిమంది…. ఆరేళ్ళ పిల్లలనుండి, నూటమూడుసంవత్సరాల వృద్ధుల దాకా… వేలాది మంది అభిమానాన్ని చూరగొనేలా చేసింది. చక్రవర్తి ప్రతి సంవత్సరం యిచ్చే, వసంతోత్సవం విందులో అతిధిగా పాల్గొనే అదృష్టాన్ని కలిగించింది. జపాన్ లో అత్యధిక ఆదరణ పొందిన పుస్తకాలలో, ఒక మహిళ రాసిన పుస్తకంగా ప్రథమ స్ఠానాన్ని పొందేలా చేసింది. ఆమెను, యూనిసెఫ్, గుడ్విల్ అంబాసిడర్ గా నియమించే, అదృష్టాన్ని కలిగించింది. బధిరుల కొరకు, తన మరణానంతరం కూడా కొనసాగేలా, ఒక పాఠశాలను స్థాపించి, వారికి శిక్షణ నిచ్చి, వారితో ప్రదర్శనలను ఇప్పించే స్థాయికి ఎదగనిచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒకటా, రెండా?!… ఆమె సాధించిన ప్రగతికి ఆధారం, “నువ్వు మంచిదానివి. నువ్వనుకొనే దేనినైనా సాధించగలవు” అని, బాల్యంలో ఆమె ప్రధానోపాధ్యాయులు, ‘సాసాకు కొబయాషి’ ఆమెను ఉత్తేజ పరచిన మాటలు మాత్రమే!

ఇంతకూ ఆ పాఠశాల విద్యా విధానం ఎలా ఉండేది? పొద్దున తరగతులు మొదలవగానే, టీచర్,ఆరోజు మొత్తం చదవవలసిన విషయాలను, జవాబు చెప్పవలసిన ప్రశ్నలను చెబుతుంది. అందులో ఎవరికిష్టమైన క్రమంలో వారు, సజ్జెక్టులను మొదలు పెట్టి, పూర్తి చేయవచ్చు. అన్ని పాఠాలను నేర్చుకున్న పిల్లలతో, ఆటలు ఆడించడం, లేదా తమకిష్టమైన పుస్తకాలను చదువుకోనివ్వడం, తమకిష్టమైన ప్రయోగాలను చేసికోనివ్వడం, ప్రక్కనే నున్న బుద్ధ దేవాలయం దాకా నడిపించి, వెనక్కి రావడం,….. ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఈ నడిపించడం ఊరికే కాదు. ప్రకృతిలో ఋతువులవారీగా వస్తున్న మార్పులను, పువ్వులు, తుమ్మెదలు, చిన్ని, చిన్ని కీటకాలు, చివురులకు, ఆకులకు ఉన్న రంగుల భేదాలు, పలధీకరణంలో క్రిమికీటకాదుల పాత్ర, ….ఇలా ఎన్నో పాఠాలను, తరగతిలో కాకుండా స్వయంగా ప్రకృతి ఒడినుంచే చూచి నేర్చుకొంటారు. ఈ ఆట విడుపు కోసమే, పిల్లలు తాము చదవ వలసిన పాఠాలను తొందరగా పూర్తిచేసేస్తారు కూడా!

మరో గమ్మత్తయిన ఆటవిడుపు ఉండేది. విశాలమైన ఆ బడి ఆవరణలో, చాలా చెట్లు ఉండేవి. ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క చెట్టుస్వంతం. చేయడానికి ఏ పనీ లేనపుడు, పిల్లలు తమ తమ చెట్ల మీదెక్కి కూర్చొని, చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలించవచ్చు. ఇటువంటి బడి ఒకటి గత శతాబ్దిలో, నిజంగానే ఉండింది అన్న విషయమే మనకు ఊపిరాడనీయదు. అందులో, ఒక పిల్లవాడు, ‘యసువాకి చాన్’ పోలియో వలన ఒక కాలు, చేయీ పనిచేయనివాడు, చెట్టునెక్కలేడు. అందుకని స్వంత చెట్టు లేనివాడు. టోటోచాన్ కి ఆ పిల్లవాని పట్ల అపారమైన దయ. బడికి సెలవులు ఇవ్వగానే, మరుసటి రోజు అతనిని తన చెట్టు పైకి ఎక్కనిస్తానని, మాట యిస్తుంది. అనుకున్నట్లు గానే ఇద్దరు మరునాడు బడికి వచ్చారు. టోటోచాన్, కాపలాదారు గది నుంచి నిచ్చెనను మోసుకొని వచ్చి చెట్టుకానించి, అతడు ఎక్కడానికి సాయం చేస్తుంది. కాని, తాను చెట్టుపైకెక్కి, ఆ పిల్ల వానిని పైకి లాగాలని చూసినా, అతనిని ఆ నిచ్చెనను ఎక్కించాలని చూసినా ఏదీ, వీలుకాలేదు. చివరికి, ఆ గదంతా పరిశీలించి, తనకు తానే నిలబడే నాలుగు కాళ్లున్న నిచ్చెనను లాక్కువస్తుంది. ఓడిపోవడం ఇష్టం లేని ఆ అమ్మాయి, చెట్టునెక్కాలని ఉత్సాహపడిన ఆ పిల్లవాడు కొన్ని గంటల శ్రమతో, ఆ చెట్టుమీదికి చేరుకున్నారు. ఆకలి దప్పులను మరిచి, ఎన్నో కబురులు చెప్పుకొన్నారు. అమెరికాలో టి. వి. ఉందని, ఇంట్లో కూర్చునే ఎన్నో విషయాలని దానిలో చూడవచ్చునని, యసువాకి నుండి, అక్కడే టోటోచాన్ మొదటిసారిగా విన్నది. ఇటువంటి మరపురాని ఘటనలను ఎన్నిటినో, గుర్తుచేసుకుంటుంది టోటోచాన్, యీ పుస్తకంలో.

రైలుబడి, 1945 లో బాంబు దాడిలో పూర్తిగా దగ్ధమయిపోయింది, అన్న వార్తను చూసిన టోటోచాన్, తన మనసులో ఆ బడి పట్ల నిత్య నూతనంగా, విలసిల్లుతుండిన, జ్ఞాపకాలతో ఈ పుస్తకాన్ని రాసింది. ఒక టి,వి. కార్యక్రమంలో, పాల్గొవడానికి వచ్చిన తన తొలి బడి ఉపాధ్యాయురాలు, తన అల్లరిని గురించి చెప్పిన వివరాలను విని ఆశ్చర్యపోయింది. తనకీ విషయాన్ని తెలియనివ్వని తలిదండ్రుల, గురువుల సానుకూల ధృక్పథమే జీవితంలో తన ఉన్నతికి కారణమని గుర్తించింది. 1937-45 మధ్య రైలు బడిలో చదివిన పాత విద్యార్థులందరిని కలవాలని వార్తా పత్రికలలో, టి. వి. లో ప్రకటనలిచ్చింది. ఇక అప్పటి నుండి, ఇప్పటి దాకా ప్రతి సంవత్సరం, ఎనభైలు దాటిన ఆనాటి విద్యార్థులందరూ కలుస్తూనే ఉన్నారు. ఒక రోజంతా, రైలుబడి జ్ఞాపకాలతో ఆనందంగా గడుపుతూనే ఉన్నారు. ఆ విధంగా ఆ రైలుబడికి చిరంజీవత్వాన్ని కలిగిస్తూనే ఉన్నారు.

మొదటి సంవత్సరంలోనే నలభై ఐదు లక్షల ప్రతులు అమ్ముడు పోయిన, యీ పుస్తకం, మనం మర్చిపోయిన మన బాల్యాన్ని, బడి చదువులను, ఆనాటి మిత్రులని జ్ఞాపకాల పొరల్లోనుంచి, బయటకు లాక్కువచ్చేలా చేస్తుంది. ప్రతి అక్షరం మన పెదవులపై చిరునవ్వులను పూయిస్తూనే ఉంటుంది. దేశకాలాలకు అతీతంగా, మనమూ ఆ బడిలో విద్యార్థులమే నన్న, ఒక సుందరమైన భావంతో మన మనసంతా నిండిపోయేలా చేస్తుంది. “కన్నా! ప్రకృతిలో మ్రోగే శ్రుతిలయల్ని విందాం, పద”అని తన కుమార్తెను వేకువనే వాహ్యాళికి తీసుకెళ్లే సాసాకో తో బాటు మనమూ, మానసికంగా షికారుకు బయలుదేరేలా చేస్తుంది. చదివి ముగిసిన తరువాత, ఇందులోని ప్రతి ఘటనా, మనలను వెంటాడుతూనే ఉంటుంది.

మనలోని బాల్యాన్ని నిదురలేపే, ఈపుస్తకాన్ని తెలుగులోనికి అనువదించిన ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్ గార్లకు, మళ్ళీ మళ్ళీ ముద్రించి మనకు అందించిన హైదారాబాద్ బుక్ ట్రస్ట్ వారికి మనం,ఎంతో ఋణపడిఉన్నాము.

డా. రాయదుర్గం విజయలక్ష్మి

డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు  కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా  పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో  'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను  'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ  వ్యాసాలు ప్రచురించబడ్డాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *