యుద్ధం చంపేది మనుషుల్ని కాదు…

Spread the love

“యుద్ధంలో చనిపోయేది మనుషులు మాత్రమే చనిపోరు. ముందుగా చనిపోయేది వారిలో ఉండే సున్నితత్వం, మానవత్వం.”
ప్రపంచ సాహిత్యంలో రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వేలాది పుస్తకాలు వచ్చాయి. కొన్ని యుద్ధ విజయాల గాథలు. కొన్ని సైనికుల అసాధారణ ధైర్యసాహసాలని కళ్లకి కట్టిన కథలు. ఇంకొన్ని రాజకీయ ఎత్తుగడలను వివరిస్తూ ఉన్నవీ. అయితే ఇన్ని వేల పుస్తకాలలో కొన్ని రచనలు మాత్రమే యుద్ధాన్ని చరిత్రనుంచి వేరు చేసి… మానవీయ కోణంలో చర్చిస్తాయి. ఇవి యుద్ధాన్ని వివరించటం దగ్గరే ఆగిపోవు ఒక మనిషిలో జరిగే సంఘర్షణనీ, మానవ విలువల ధంసాన్నీ చూపిస్తాయి.

వ్లాదిమిర్ బోగోమోలోవ్ రాసిన పసివాడి పగ (ఇవాన్) అలాంటి అరుదైన రచనల్లో ఒకటి.

ఇది యుద్ధంలో ఒక పిల్లవాడు చేసిన సాహసాల కథ కాదు. యుద్ధం ఆ పసివాడినుంచి నుంచి బాల్యాన్ని ఎలా దోచుకుందో చెప్పే దుఃఖగాథ. ఈ నవలికలో తుపాకీ శబ్దాల కంటే ఎక్కువగా వినిపించేది ఆ పసివాడి మౌనమే . పేలుళ్ల కంటే భయంకరంగా కనిపించేది అతని కళ్లలో స్థిరపడిపోయిన వయసుకు మించిన ఓ నిశ్శబ్దం. ఈ కథ చదివాక తర్వాత మనం యుద్ధాన్ని మర్చిపోతాం… ఒక పన్నెండేళ్ల బాలుడి ముఖం మాత్రమే గుర్తుంటుంది.

రాత్రివేళ మంచులా చల్లగా ఉన్న వాగు దాటి, శత్రు ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న చిన్నారి పిల్లవాడు ఇవాన్…
నవల మొదలు పెట్టగానే మనకు పరిచయమయ్యే ఈ అబ్బాయి సాధారణ పిల్లవాడిలా కనిపించడు. అతని కళ్లలో పసివాళ్ళలో కనిపించే ఆసక్తి ఉండదు. ఆ వయసు వాడు చేసే అల్లరి ఉండదు. భవిష్యత్తు గురించి కలలకి అసలు చోటే లేదు. ప్రతీ విషయాన్నీ, ప్రతీ కదలికనీ, చిన్న శబ్దాన్ని కూడా జాగ్రత్తగా గమనించే అప్రమత్తత మాత్రమే వాడిలో ఉంది.
ఇవాన్ తల్లిని జర్మన్లు చంపేశారు. తండ్రి అంతకన్నా ముందే యుద్ధంలో మరణించాడు. చెల్లెలు కూడా లేదు. ఇల్లు లేదు. కుటుంబం లేదు. అంటే బాల్యాన్ని గుర్తుచేసే ఒక్క సంతోషమైన జ్ఞాపకం కూడా వాడికి మిగల్లేదు.
ఇవేవీ లేని చోట వాడికి మిగిలింది ఒకే ఒకటి… యుద్ధం. ఆ పన్నెండేళ్ల పసివాడికి ఈ ప్రపంచం ఇచిన గొప్ప బహుమతి అదే. ఓ మహా రక్తపాతంలో వాన్ని ముంచి వేసిన యుద్ధం మాత్రమే వాడి లోకమైంది.

ఆ వయసులో వాడికి యుద్ధం జరిగే ప్రాంతంలో ఏం పని?

ఆ పసివాడు ఇవాన్ ఒక సైనిక గూఢచారి. శత్రు భూభాగంలోకి చొరబడి సమాచారం సేకరించి తిరిగి వస్తాడు. అవును ఆనాటి యుద్ధ తీవ్రత ఎలా ఉండేదో ఈ ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు. పిల్లలూ పెద్దలూ అని లేదు, పగలా రాత్రా అని లేదు… యుద్ధం ఎంత భయంకరమైందీ… కను రెప్ప మూసి తెరిచేలోపు ప్రాణాలు పోయే పనిలోకి పన్నెండేళ్ల పిల్లవాడిని తోసిందా యుద్ధం

అతని ధైర్యాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోతారు. కానీ రచయిత బోగోమోలోవ్ చెప్పలనుకున్నది బాలుడి సాహసాలు కాదు. ఆ వయసులో వాడు సాహసాలు చేయాల్సిన పరిస్థితి గురించి. బడి దారిలో పోవాల్సిన ఆ పిల్లవాడు యుద్ధపు దారులని ఎంచుకోవాల్సి వచ్చిన పరిస్థితుల గురించి…
యుద్ధం ఒక పిల్లవాడిని పెద్దవాడిగా మార్చదు. అలాగని అతన్ని బాలుడిగానే ఉండనివ్వదు.

ఇవాన్‌ను చూసిన ప్రతి సైనిక అధికారి ఒకే విషయం కోరుకుంటాడు. “ఈ పసివాన్ని యుద్ధం నుంచి బయటకు పంపాలి.” అనుకున్నట్టే అతన్ని సైనిక పాఠశాలకు పంపాలని నిర్ణయిస్తారు. అక్కడ అతను మళ్లీ చదువుకోవచ్చు. మళ్లీ మామూలు జీవితాన్ని గడపొచ్చు. కానీ ఇవాన్ ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి జీవితం అంటే ఇప్పుడు ప్రతీకారమే. తన తల్లీ, తండ్రీ మరణాలకు కారణమైన జర్మన్ల మీద పగ మాత్రమే అతనికి మిగిలింది.
ఇది చదువుతున్నప్పుడు ఒక విషాదకరమైన నిజం అర్థమవుతుంది. యుద్ధం మనిషికంటే ముందు, అతని భవిష్యత్తును చంపేస్తుంది.

ఈ నవలలో గుండెని తాకే అద్భుతమైన కవితాత్మకమైన భాగాలు ఉంటాయి. అవి ఇవాన్ కలలు. వాడి కలల్లో ఓ గొప్ప ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు…
ఆ కలల్లో యుద్ధం ఉండదు. తల్లి ఉంటుంది. అందమైన ఉదయాలు ఉంటాయి. కాలువల్లో పరుగులు తీసే చిన్న పసివాడుంటాడు. పచ్చని చెట్లు, పొలాలూ ఉంటాయి.
నిజమైన ఇవాన్ వాడే, ఈ యుద్ధంలో ఉన్నవాడు కాదు. వడి జీవితాన్ని కలల్లో చూసుకునేలా చేసింది యుద్ధం… అందమైన కలల్లో మునిగి పోయి కళ్లు తెరిస్తే… మళ్లీ యుద్ధం మొదలవుతుంది.
కలలు వాడి గతం. మిగిలిన విషాదమే నిజం…
* * *
ప్రపంచ చరిత్రలో యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ఒక విషయంలో ప్రత్యేకమైనది. అది యుద్ధాన్ని కేవలం సైనికులకే పరిమితం చేయలేదు. యుద్దం సరిహద్దులు దాటి జనావాసాల్లోకి వచ్చింది. గ్రామాలు యుద్ధరంగాలయ్యాయి. పాఠశాలలు ఆసుపత్రులయ్యాయి. ఇళ్లు బంకర్లయ్యాయి. పౌరులు చనిపోయారు. పిల్లలు అనాథలయ్యారు.

సోవియట్ యూనియన్‌లో లక్షలాది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. కొందరు ఆకలితో చనిపోయారు. కొందరు శరణార్థులయ్యారు. మరికొందరు అడవుల్లోని పార్టిసన్ దళాలకు తోడయ్యారు. కొందరు వార్తలు మోశారు. మరికొందరు గూఢచారులయ్యారు. వారి వయసు చిన్నది. కానీ వారి బాధ్యతలు పెద్దవయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం కేవలం మనం ఇప్పుడు పాఠాల్లో చదువుతున్న రెండున్నర పేజీల చరిత్ర కాదు… అది మహావిషాదం.
ఈ చారిత్రక వాస్తవాన్ని సాహిత్యంలో అత్యంత హృదయాన్ని తాకేలా మలిచిన రచనల్లో పసివాడి పగ (ఇవాన్) ఒకటి.

1941 జూన్ 22… ఆ రోజు ఉదయం నాజీ జర్మనీ, సోవియట్ యూనియన్‌పై చరిత్రలోనే అతిపెద్ద సైనిక దాడిని ప్రారంభించింది. దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ బార్బరోస్సా. హిట్లర్ లక్ష్యం కేవలం ఒక దేశాన్ని జయించడం కాదు. సోవియట్ యూనియన్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం. లక్షలాది ప్రజలను బానిసలుగా మార్చడం. తూర్పు ఐరోపా భూభాగాన్ని జర్మన్ సామ్రాజ్యంలో కలిపేయడం. కొన్ని నెలల్లోనే సోవియట్ సైన్యం తీవ్రంగా దెబ్బతిన్నది. వేలాది గ్రామాలు నేలమట్టమయ్యాయి. నగరాలు శిథిలాలయ్యాయి. కుటుంబాలు విడిపోయాయి. ఈ యుద్ధాన్ని రష్యాలో “గ్రేట్ పేట్రియాటిక్ వార్” అని పిలుస్తారు. కానీ ఆ పేరులో దేశభక్తికంటే ఎక్కువగా విషాదం ఉంది. యుద్ధం చేసిన విధ్వంసం ఉంది.

ఈ యుద్ధంలో సుమారు ఇరవై ఏడు మిలియన్ల సోవియట్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో సైనికులు మాత్రమే కాదు మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇవి కేవలం లెక్కలూ, అనేలూ కావు. ప్రతి మరణం వెనుక ఒక జీవితం ఉంది. ఒక కుటుంబం ఉంది. కూలిపోయిన ఒక కల ఉంది.

రచయిత బోగోమోలోవ్ ఈ కథను ఒక హీరో కథలా రాయలేదు. ఆ పసివాడు ఇవాన్ ఎక్కడా గొప్ప ప్రసంగాలు చేయడు. దేశభక్తి నినాదాలు ఇవ్వడు. శత్రువులను ద్వేషిస్తూ పెద్ద మాటలు మాట్లాడడు. అతను కేవలం తన కుటుంబాన్ని కోల్పోయిన ఒక పిల్లవాడు మాత్రమే. తన వయసుకు మించిన పగను మోస్తున్న ఒక పసిశరీరం మాత్రమే…

ఇదే ఈ రచనను ప్రపంచ సాహిత్యంలోనే గొప్పస్థాయిలో నిలబెట్టింది. సోవియట్ యుద్ధ సాహిత్యంలో చాలా రచనలు సైనికుల వీరత్వాన్ని పొగుడుతున్న కాలంలో, బోగోమోలోవ్ ఒక చిన్నారి కళ్లలో కనిపించే యుద్ధాన్ని రాశాడు. అందుకే ఇవాన్ యుద్ధాన్ని గ్లోరిఫై చేసే రచనగా మిగిలిపోలేదు.

యుద్ధం ఒక పిల్లవాడి మనసుమీద చేసిన దాడికి సాక్ష్యంగా నిలిచిపోయింది.

పుస్తకం: పసివాడి పగ
మూలం: వ్లాదిమిర్ బోగోమోలోవ్
తెలుగు అనువాదం: ఆర్వీఆర్
ప్రతులకు: www.balabooks.in, Amazon

నరేష్కుమార్ సూఫీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *