ఎవరు రాస్తారు మాడిపోయిన మా బతుకుల్ని, ఎందుకు రాస్తారు ఒట్టిపోయిన ఈ కథల్ని!!
ఎన్ని పేజీలు తిరగేసినా, యెన్ని చరిత్రల్లో తొంగి చూసినా ఒక్క పేజీ మాకోసం లేదు..!!
ఐనా మాకు నాలుగు అక్షరాలు అబ్బితేనే కదా మేము రాయగలం, పిడికెడు జ్ఞానం ఉంటేనే కదా మా గొంతుక పెగలగలదు. కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా మమ్మల్ని మా బతుకుల్ని ఈ మీ ఊరికి మీ ప్రపంచాలకి దూరంగా విసిరేశారు. సంఘంలో మేమంటూ ఉన్నట్టు ఈ చరిత్రకి యెవరు చెప్పారని.
ఎక్కడో ఒకచోట మా తాతలు కథలుగా అయినా చెప్పుకుంటే ఆ చరిత్ర మిగిలే ఉంటుంది. కానీ పనిగట్టుకొని మా కోసం యెవరు రాసినోళ్ళు లేరు.
ఇప్పుడిప్పుడే మా కష్టాలని గౌరవంగా చెప్పులుగుతూ ఉన్నాం మేము తింటున్న తిండి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మాలో చైతన్య గీతురాళ్ళు రాయుడు అన్న లాంటి వాళ్ళు నడుం కట్టి మా కథల్ని రాస్తున్నారు.
సాహిత్యం ఒకనాడు ఒకరి ఇంట్లో వస్తువుగా ఉన్నన్నాళ్ళు వాళ్ల భోగాలే రాసుకున్నారు. ఇప్పుడు మా కథల్ని, మా వ్యథల్ని మేము రాసుకునే సమయం వచ్చింది.
ఐనా ఇంకెక్కడి కులం..!?
అనే వాళ్లకు ఈ కథల్ని వినిపించడానికి ఈ కథల్ని రాయాల్సి వస్తుంది.
ఇవన్నీ ఎప్పుడో జరిగినవి కావు
నేడు కూడా ఏదో ఒక మూల ఎందరో “రాయుడన్న” లాంటి బాధితుల ఘోషే ఇది.
ఇది కేవలం మా కులానికి సంబంధించిన అంశం కాదు తరాలుగా వంచనకు గురికాబడుతున్న ఆత్మ వంచన కథలు ఒక బిచ్చగాడి కి అతడి పరిస్థితీ కన్నా కులం గొప్పది ఐన సందర్భంలో అతన్ని చూసి జాలి పడాలో, ఈ సమాజం చేసిన కుట్రను చూసి భయపడాలో అర్థం కాదు.
ఇది యెంత కాలం ఉంటుందో తెలీదు, యెన్ని తరాలు కొనసాగుతుంది అర్థం కాదు. వివక్ష రాజ్యం, రాజ్యాంగం లాంటి వాటికి మారుతున్నా దాని తీరు మారింది కానీ ఎక్కడ దాని ఉనికి కోల్పోలేదు.
ఇది ఒక జన్యు పదార్థంగా వాళ్ల తరాలకు అందుతూ ఉంది ప్రాణం కన్నా విలువైంది కులం అంటారు మరి వారి దిగువ నలిగిపోతున్న వాళ్లకు అది గొప్పది ఎలా అవుతుంది.
ఇలాంటి కథలు రావాలి నిదానంగా నడుస్తూ ఈ కాలానికి ఒక ప్రశ్నను అడిగి వెళ్లి పోవాలి ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుంది అని మా భావి తరాలకు ఆశను అందించడమే ప్రధాన ఉద్దేశం.
ముందే చెప్తున్న. ఇవి కథలు కాదు.
ఇవి ఊరు అవతల గొంతు నుండి ఉబికిన అక్షరాలు.
మా కన్నీళ్ళను అక్షరికరిస్తూ ఉన్నారు!?
ఈ దిగివింటోడు కథలు మరో పార్శ్వాన్ని మీకు పరిచయం చేస్తాయి వివక్ష మూలలో మిమ్మల్ని మోసుకుని పోతాయి..!
ఇవి ఒట్టి అక్షరాలు కాదు
ఊరికి వాడకి మధ్య నలిగిన
కొన్ని తరాల ప్రశ్నలు…!!
గుండెల నిండా బరువును దించేసుకునే సందర్భం
తరాల నుండి, మారుతున్న కాలంతో పాటు రూపు రేఖలు మార్చుకుంటూ వస్తుంది “వివక్ష”
ఎక్కడో ఊరుకి అవతల చెడిన బతుకుల్ని చేరదిశాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఇవాళ నాలుగు అక్షరాలు నేర్చి, పిడికెడు అత్మ గౌరవంతో బతుకుతున్నారు చాలా మంది.
అసలు ఈ వివక్ష గురించి యెందుకు రాయాలి. అసలు ఇప్పుడు కూడా వివక్ష ఎక్కడ ఉంది అనే వాళ్ల కోసమైన ఇలాంటి పుస్తకాలు వచ్చి చెర్నా కోలలై చెలగాలి.
మా ఆడవాళ్ళ రొమ్ములకూ సిస్తూ విధిస్తే రొమ్ము తెగ్గోసుకున్న నంగేలీ గురించి యెవరో చెప్పబట్టే కదా ఈ ప్రపంచానికి తెలిసింది. అందుకే ప్రతి తరంలో ఒకరు పెన్ను పట్టుకొని వెన్నులో వణుకు వచ్చేలా రాసి పెడుతూ ఉండాలి.
ఇకపోతే సాహిత్యాన్ని ఇన్నాళ్లు ఒక ఇంటి అంగడి సొత్తుగా మార్చి వాళ్లు వండి వార్చిన కథలే ఒగ్గు పట్టారు కానీ ఎక్కడ మా పాత్రలు ఉండవు.
ఇవే కాక మొన్నటి వరకు ఎక్కడైనా సినిమాలో మా జీవన విధానం గురించి చూద్దాం అన్నా ఉండేది కాదు.
మొన్న తంగాలన్ వచ్చే దాక మా ఒట్టి తునకల సంగతి ఈ ప్రపంచానికి తెలీదు.
అది చూపించిన పాపానికి ఇలా ఎలా తీస్తారు అంతా కవుసు కంపు సినిమా అంతా అని ఒక పెద్ద విద్యా సంస్థల అధినేత అంటాడు.
ఇన్నాళ్ళు మరుగున పడిన జీవితాలను, చరిత్రను ఈ మధ్యనే ఇండస్ మార్టిన్, సొలొమాన్ విజయ్ కుమార్ అన్న లాంటి వాళ్ళు భుజాన వేసుకొని రాసుకొచ్చారు గతంలో చాలా మంది ఇటువంటి సాహిత్యాన్ని అందించారు కానీ అది చివరి వర్గాల దాకా చర్చల దాకా రాలేదు
ఇప్పుడు అలాంటి ఇంకో మింగుడు పడని పుస్తకం దిగివింటోడి కథలు
కథల్ని చదువుతున్నంత సేపు గుండెలు చూచాయగా బరువెక్కడం, అప్రయత్నంగా కళ్ళల్లో నుండి జారిపడే కన్నీళ్లు !! చుట్టూ మూగే ప్రశ్నలు, సమాధాన పరుచుకోలేక బరువైన మనసుతో ఆకరి పేజీ వరకు పాఠకుణ్ణి ఉంచడం కేశవ రెడ్డి గారి నవల “చివరి గుడిసె” తరువాత ఈ పుస్తకానికే అనిపించింది నాకు..!!
ఈ కథలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, కదిలిస్తాయి. కానీ ఎక్కడ ఎవరినో ఒకరిని నిందితులుగా చూపలేదు ఈ సమాజాన్ని అసలైన ముద్దాయిగా ఉంచారు.
“ఛాయ” ప్రచురించిన ఈ పుస్తకం అమెజాన్‌లోనూ, chaayabooks.com లోనూ దొరుకుతుంది.