నిధి చాల సుఖమా!
రాముని సన్నిధి చాల సుఖమా! అనే సందేహ డోలలో ఊగిసలాడాడు త్యాగయ్య.
ఎవరికైనా, ఎప్పుడైనా ఎటు మళ్ళాలో ఎటు వెళ్ళాలో అనే విచికిత్స ఎదురవుతూనే ఉంటుంది.
నేను రాయకపోతేనేం? అనే సందేహం కొంతమందికైనా వచ్చే ఉంటుంది. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లానే రచనా వైరాగ్యమిది. ఏదో ఒకానొక పరిస్థితుల్లో ఈ ప్రశ్న ఎదురై ఇంతై,ఇంతింతై,వటుడింతై పెరిగి మనసునంతా ఆవహిస్తుంది.
ఎంత గింజుకున్నా అక్షరం పెగలనప్పుడో, కలం కదలనని మొరాయిస్తున్నప్పుడో రాతను పక్కన పెట్టేస్తాం. నేనెంతటివాణ్ణి, ఇంతటి వాణ్ణి అని అప్పటి దాకా జబ్బలు చరుచుకుంటున్న రచయితకు స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. వాస్తవంగా తన శక్తి సామర్థ్యాలేమిటో తెలిసి వస్తాయి. అప్పుడు బుద్ధిగా ర్యాకుల్లో భద్రంగా గుట్టలుగా జోగుతున్న పుస్తకాలపైకి చూపు మరలుతుంది. నా కలెక్షన్ లో ఇన్ని అపురూప పుస్తకాలుండగా వాటిలో చదవాల్సినవే ఎక్కువగా ఉండగా ఈ రాతలెందుకు? అనవసరపు ప్రయాసలెందుకు? హాయిగా చదువుకుంటే పోలా? అనే జ్ఞానోదయం కలుగుతుంది.
ప్రపంచమంతటా సుమారు ఏడువేల భాషలున్నాయి.మెజారిటీ భాషల్లో పలురకాల ప్రక్రియల్లో సాహిత్య సృజన సాగుతోంది. మనం ఆ సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేయాలన్నా పది జన్మల కాలమైనా సరిపోదు. ఆ మాటకొస్తే తెలుగులో వెలువడిన సాహిత్యాన్ని, అందునా ఏదో ఒక ప్రక్రియకే పరిమితమై చదవాలన్నా ఏళ్లూ పూళ్లూ పడుతుంది.
తెలుగుతో పాటు ఇంగ్లీషో,హిందీయో, తమిళమో వంటి మరో ఒకటి రెండు భాషలు వచ్చి ఉంటే ఆ భారం ఇంకా పెరుగుతుంది. పి.వి.నరసింహారావు వంటి ప్రతిభా మూర్తులకు ఇంకా ఎక్కువ భాషలు వచ్చు. ఆయన పరిస్థితి మరీ భిన్నం.
సాయంత్రం పూట ఆరుబయట పడక కూర్చి వేసుకుని ఇష్టమైన రచయిత పుస్తకంలో లీనమైతే వేరే ప్రపంచంలోకి వెళతాం. చుట్టూ పరిసరాలను మరచిపోతాం. టైమ్ ఎంతయ్యిందో పట్టించుకోం.
ఏది చదివితే ఏమీ చదవకపోయినా అన్నీ చదివినట్లవుతుందో ..
ఏది చదవలేకపోతే అన్నీ చదివినా ఏమీ చదవనట్టు అవుతుందో – ఆ చదువు చదివావా? అని కేనోపనిషత్తు ప్రశ్నిస్తుంది.
రాయటాన్ని పూర్తిగా కట్టిపెట్టేసి చదవటానికే అంకితమైపోగలడా రచయిత?
పోలేడు. ఆ పుస్తక పఠనమే మళ్లీ లోలోపలి రచనా జ్వాలను ఎగదోస్తుంది. ఏదో చదువుతారు. స్విచ్ వేస్తే బుల్బ్ వెలిగినట్టు మెదడు మరింకే దానికో కనెక్ట్ అవుతుంది.
లోలోపల నుంచి భావాల ఊట పైకి తన్నుకొస్తుంది. రాయకుండా ఉండలేని కంపల్సివ్ మూడ్‍లోకి నడుస్తారు.
వివిధ భాషల్లో టన్నుల కొద్దీ సాహిత్యం వెలువడి ఉండొచ్చు. మరో పక్క చరిత్ర పరిశోధకులు మన గతాన్ని సరికొత్త ఆధారాలతో కళ్ల ముందు నిలుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. దీంతో పాటు వివిధ రంగాల జ్ఞానమూ అక్షరబద్ధమవుతూ తర్వాతి తరానికి అందుతోంది. ఇదంతా నిరంతర ప్రక్రియ.
ఒలింపిక్ జ్యోతిని అంచెలంచెలుగా క్రీడాస్థలికి చేర్చినట్లు, చినుకు చినుకే వానయి వరదై ముంచెత్తినట్లు మన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
రచయిత కూడా చరిత్రకారుడే. తానున్న కాలంలోని అనుభవాలను ఆలోచనలను సామాజిక స్థితిగతులను రాజకీయార్థిక వ్యవస్థలను సాహిత్యంలో రూపు కట్టిస్తాడు. మన ముందు తరాల రచయితలంతా చేసింది ఇదే.
నిన్నటి పునాదిపై రేపటి భవిష్యత్తు నిర్మితమవుతూ వస్తోంది. తమ రచనలు, పరిశోధనల ద్వారా ఆ పునాదిని ఏర్పరస్తున్నది సృజనకారులు, సాహిత్యకారులే.
రాతలోని వ్యక్తిగత ఆనందాలతో పాటు తమ వంతు సామాజిక బాధ్యతగా నిరంతరం రచనలు చేస్తూనే ఉండాలి. తమ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులను పట్టి చూపుతూనే ఉండాలి.
రాయకపోతే తామేమిటో తర్కించుకునే అవకాశం సమకాలికులకు ఉండదు. తమ పెద్దలు ఎలా ఉండేవారో, ఎలా బతుకులు వెళ్లదీశారో రేపటి తరానికి తెలీదు.