మహా నగరం ఓ దీవుల సమూహం

Spread the love

నగరం ఇప్పుడు సముద్రం కాదు
దీవుల దుఃఖగాథ
గాజుతో కట్టిన గూళ్ళల్లో
మనుషులు బ్రతుకుతున్నారు
కానీ
మనిషి మాత్రం కనిపించడం లేదు
ఎత్తైన బహుళ అంతస్తులు
ఆకాశాన్ని తాకుతున్నాయి,
కానీ
ఒక్క పలకరింపయినా
పక్కింటి తలుపు దాటడం లేదు
ప్రతి కమ్యూనిటీ
తనకో రాజ్యం కట్టుకుంది
వాటిల్లో జిమ్‌లు ఉన్నాయి
పూలతో నిండిన చిన్న చిన్న తోటలు ఉన్నాయి
పిల్లల నవ్వుల కోసం
రబ్బరు నేలలున్న ఆటస్థలాలున్నాయి
కానీ
అవి బయటివారికి నిషేధిత ప్రదేశాలు
మనుషుల కోసం కట్టిన ఇళ్లు
మనుషుల్నే విడదీస్తున్నాయి
ఒకప్పుడు నగరం ఒక పెద్ద ఆవరణ
ఇరానీ హోటల్‌ టేబుల్‌ మీద ఒక కప్పు చాయ్‌

నాలుగు అపరిచిత హృదయాలను
స్నేహితులుగా మార్చేది
“మామా… ఎక్ చాయ్‌.. అంటే
అది టీ కోసం వేసే ఆర్డర్‌ కాదు, ఒక అనుబంధం
రేడియోలోనో రికార్డ్ ప్లేయర్లోనో
మనసు కోరిన పాటల కోసం
ఎందరో ఎదురు చూసేవారు
పాట మొదలైతే
హోటల్‌లో కూర్చున్న ప్రతి మనిషి
తన ఒంటరితనాన్ని కొద్దిసేపు మరిచిపోయేవాడు
అన్నీ
ఒకే చాయ్‌ ఆవిరిలో కలిసిపోయేవి
పార్కుల బెంచీల మీద
సాయంత్రాలు మెల్లగా వికసించేవి
పెన్షన్‌ కథలు, ఉద్యోగ ఆందోళనలు, ప్రేమ విఫలాలు
రాజకీయ కోపాలు
పచ్చదనపు గాలిలో ముచ్చట్ల ఆనందంలో
ఆవిరయిపోయేవి
ఇప్పుడు
చాయ్‌ కప్పులు ఖరీదయ్యాయి
మనుషులు మరింత చౌకబడ్డారు
బహుళ అంతస్తుల్లో లిఫ్ట్‌ తలుపులు తెరుచుకుంటాయి
కానీ ముఖాలు మూసుకుపోతాయి
పక్కింట్లో ఒకరు చనిపోయినా
వారెవరో తెలియని నగరం ఇది

బాల్కనీల్లో వేలాడుతున్న బట్టలు మాత్రమే
ఇక్కడ ఇంకా మనుషులు ఉన్నారని
సాక్ష్యం చెబుతున్నాయి
మామలు లేరు, కాకలు లేరు
“ఏరా బిడ్డా!”
అని ఆప్యాయంగా పిలిచే
పాత నగరపు గొంతులు లేవు
ఈ మెగా సిటీ
ఇప్పుడు
వెలుగులతో మెరిసే
ఒంటరితనపు శ్మశానం
మనిషి
ఇల్లునేమో పెద్దది చేసుకున్నాడు
కానీ
తన హృదయం మాత్రం
చాలా చిన్నదైపోయింది.
వారాల ఆనంద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *