జ్ఞాపకాల చెలిమె!

Spread the love

కటిక పేదరికంలో పుట్టినా, అష్టైశ్వర్యాల్లో పెరిగినా ఎవరి బాల్యం వాళ్ళకి గొప్పదే. ప్రతిమనిషీ పదేపదే స్మరించుకునేది తన బాల్యాన్నే.

నా బాల్యం తియ్యటి మిఠాయి పొట్లం.

కొబ్బరాకుల, రంగురంగుల కాగితపు పెళ్లిమండపాల బాల్యం. ఇనపసామానువాడిచ్చే చెక్కర పల్లిపట్టిని గిల్లుకుని, గిచ్చుకొని తినే బాల్యం. తెల్లటి దోతితో గుడ్లగంప మోసుకుని వచ్చే తాత దగ్గర అమ్మ గుడ్లు కొంటున్నప్పుడు పక్కన కూర్చుని గుడ్లప్పగించిన బాల్యం. కుర్చీలు, పీటలు, చాపలు, చెద్దర్లు మోసుకుంటూ క్లబ్బుకి వెళ్లి తెర సినిమాలు చూసిన బాల్యం. రోడ్డు పక్కన పుట్టే పుట్టగొడుగులను నాన్న తెస్తే బొగ్గుబకీట్ మీద అమ్మ వొండుతున్నప్పుడు వచ్చే మసాలా వాసనని గుండెలానిండా పీల్చుకున్న కమ్మటి బాల్యం. ఎడ్లబండి మీద వచ్చే కందగడ్డలు, కంది కాయలు, మక్కంకులు, పచ్చి పల్లికాయలు, గేగులు కొనియ్యమని అమ్మ కొంగుబట్టుకుని లాగుతూ ఏడ్చిన బాల్యం. రామాయణాన్ని, మహాభారతాన్ని, చిత్రలహరిని, చిందు బాగోతాలను చూడటానికి దోస్తుల ఇంటికెళ్లి అమ్మతో తిట్లు తిన్న బాల్యం. రామాలయం గోడమీద కూర్చుని గోడవతలున్న మసీదునుండి వచ్చే అజాను విన్న బాల్యం. ఫ్రెండ్ తో మొదటిసారి చర్చికి వెళ్లి, నిశ్శబ్దం కూడా ఇంత బాగుంటుందా అనుకున్న బాల్యం. అడవి పళ్ళను కడుక్కోకుండా తిన్న బాల్యం. భూమి పొరలనుంచి వచ్చే వడగట్టని బొగ్గునీళ్లను తాగిన బాల్యం.

జ్ఞాపకం. రెండు వైపులా పదునున్న కత్తి.

మైమరిపించే జ్ఞాపకాలు, మర్చిపోవాలని ప్రయత్నించినా వెంటాడే జ్ఞాపకాలు, గుండెని మెలిపెట్టే జ్ఞాపకాలు, మనసుని చక్కిలిగిలిపెట్టే జ్ఞాపకాలు. కొన్ని రస భరితాలు. కొన్ని నవరస భరితాలు. ఇంకొన్ని వేదనా భరితాలు. మరికొన్ని  ఆవేదనా పూరితాలు. ఇంతేగా! ఎవరి జీవితమైనా, ఇదేగా! ఎవరి బాల్యమైనా.

నేలమీద ఎక్కడినుంచి చూసినా ఆకాశంలో జాబిల్లి అపురూపంగా కనిపించినట్టు, మనుషులందరూ ఏ నేల మీద బతుకుతున్నా వాళ్ళు పుట్టి పెరిగి ఆడి పాడి నడిచిన ఆ నేలని, ఆ బాల్య జ్ఞాపకాలని అంతే అపురూపంగా నెమరేసుకుని సంతోషపడతారు. నేనూ అంతే. నా బాల్యం నాకు గొప్పదే కాదు, ప్రత్యేకమైనది కూడా.

ఊరు మొత్తం కూకటివేళ్లతో పెకిలించాక, సమాధుల ఆనవాళ్లు కూడా లేని స్మశానంగా మారిన కటికచేదు జ్ఞాపకం నాది. ఈ ప్రపంచపటం నుండి మా ఊరుని శాశ్వతంగా చెరిపేసారు, కానీ నా మనోఫలకంలో అది ఇంకా సజీవంగా ఉంది. నా కళ్ళల్లో సజలంగా ఉంది.

రూపంలేని నా ఊరికి నేనివ్వాలనుకున్న అక్షరరూపమే ఈ ‘నల్ల బంగారం’ కథలు. 

సింగరేణి బొగ్గుబాయి చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల వెతలు, కన్నీళ్లు, జీవన వైరుధ్యాలు, కులమతాల కట్టుబాట్లు, ప్రేమలు, పెళ్లిళ్లు, గృహహింస, బొగ్గుతో పెనవేసుకున్న కష్టాలు, అనారోగ్యాలు, తాగుడికి బానిసవడం, జీవితం కోల్పోవడం అన్నీ దగ్గరనుండి చూసిన నాకు ఏదో ఒక రూపంలో వీటిని డాక్యుమెంట్ చేయాలనిపించింది. ఈ కథల్లో కొన్నిట్లో నేను ఉన్నాను. కొన్నిటిని విన్నాను. మరికొన్నిటిని చూసాను. మొత్తానికి వాస్తవాన్నే చూపించే ప్రయత్నం చేశాను.

భాష విషయానికొస్తే, ఫలానా యాస నాది అని చెప్పుకోలేని చిరునామాలేనిదాన్ని. మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, శ్రీకాకుళం, అమలాపురం, కృష్ణ, గుంటూరు, నల్గొండ వరకూ అన్ని ప్రాంతాల వాళ్ళతో నా బాల్యం అల్లుకుంది. అందువల్ల రాసేటప్పుడు అన్ని జిల్లాల వాడుక పదాలూ వచ్చేవి. కచ్చితంగా అడిగితే ఫలానా పదం ఫలానా జిల్లా వాళ్ళు మాట్లాడతారని చెప్పలేను. ఇది ప్లస్సో మైనస్సో కూడా నాకు తెలీదు.

పాతికేళ్ల తండ్లాట ఇది. నాలుగు సంవత్సరాల నుంచి నాలో నలుగుతున్న సంఘర్షణ ఇది. రంగురంగుల జ్ఞాపకాలను పుష్పగుచ్చంలా అల్లి పాఠకులకు అందించాలనే చేసిన చిన్న ప్రయత్నం ఇది. దీనివల్ల నీకేం వస్తుంది అంటే, బిడ్డ పుట్టినప్పుడు కలిగే అవ్యక్త ఆనందం లాంటిదేదో ఈ పుస్తకం చేతిలోకి వచ్చినప్పుడు కలుగుతుందన్న చిన్న ఆశ మాత్రమే.

ఈ కథలు కచ్చితంగా మీ బాల్యాన్ని తట్టి లేపి, మీ కళ్ళల్లోనో, గుండెలోనో కాసింత చెమ్మను పుట్టిస్తాయి. మీకు ఊరుంటే గనక ఒక్కసారి అర్జెంటుగా వెళ్లి అక్కడ ఉండే మీ అమ్మనో, నాన్ననో, తోబుట్టువులనో, స్నేహితులనో, చెట్టునో, పుట్టనో, గుడినో, చర్చినో, మసీదునో, పోస్టుమాన్ నో,  కిరాణా కొట్టాయననో ఒకసారి తడిమి, హత్తుకోవాలనిపిస్తుంది. ఊరును పోగొట్టుకున్న మాలాంటోళ్ళ గోస మీకు ఎప్పటికీ రాకూడదని కోరుకుంటూ…

స్వర్ణ కిలారి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *