డాక్టర్ మోదుగు శ్రీసుధ గారి కథలతో ఆమె మొదటి కథాసంకలనం నుంచీ పరిచయం. ‘డిస్టోపియ’ కథలు చదివి ఆశ్చర్యపోయాను. కథలు బాగా రాయడం ముఖ్యం కాదు. కథనంలో సృజనాత్మక అభివ్యక్తి ఉన్నప్పుడే అది సాహిత్యం అవుతుంది. సాహిత్యానికి మూలద్రవ్యం అది. ఒక దీర్ఘ నిట్టూర్పు వంటి కథలవి. A streak of melancholy. ‘అనుభవం’ పాత్రగా తెలుగులో కథలు రాస్తున్నవాళ్ళు తక్కువ. చాలామంది తెలుగు పాఠకులకీ, రచయితలకీ ‘అనుభవం’ ‘వాస్తవం’ తమ చేతికి అందుబాటులో ఉన్న డ్రాయరు సొరుగుల్లాంటివి. ఏ సొరుగు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవచ్చు. అది నిజం కాదు. అనేకమందికి భౌతిక ప్రపంచం ఒక్కటే తిరుగులేని వాస్తవం. ఏది చూడలేమో, స్పృశించలేమో దాని వాస్తవికతను గురించిన చర్చ వ్యర్ధం అనే అభిప్రాయం ఉంది. స్మృతులు, మనిషి అంతరిక ప్రపంచం గురించి నేను ఐదు దశాబ్దాలకు పైగా ఆలోచిస్తూ తెలుసు కుంటున్నాను. అస్తిత్వవాద దృక్పథాన్ని కూడా ఆ దృష్టి తోనే అర్ధం చేసుకున్నాను. చర్చ అప్రస్తుతం. సుధ గారి కథలకీ నేను అంటున్న విషయానికీ సంబంధం చాలా ఉంది. ఈ కథలు చదివితే అర్ధం అవుతుంది. మూడు దశాబ్దాల పైమాట. మార్క్విజ్ గార్షియా తన కథా సంకలనానికి ముందుమాట రాస్తూ అన్నాడు. ఆయన తన అంత్యక్రియలకు తన ఆత్మీయ మిత్రులతో పాటు హాజరైనట్టు కలగన్నాడు. అంతా పూర్తైన తర్వాత తను మళ్ళీ అందరితో కలిసి ఇంటికి వెళ్ళడం కుదరదని అర్ధమైంది. ఈ అసాధారణమైన కల తన ఉనికిని మాత్రమే కాక సాటి దక్షిణ అమెరికా విద్యార్ధులు ఇటీవల మానసికంగా పడుతున్న బాధల్ని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడిందంటా డాయన. కలలు మనకు తెలియని, అర్ధం కాని సత్యాలు. అవి మన జీవితానికీ, సమాజానికీ, గతానికీ, వర్తమానానికీ సంబంధించినవే కాక వాటి సరిహద్దుల్ని, విభజన రేఖల్నీ తొలగిస్తాయి. A fluid flowing life. సుధగారి కథల్లో అంతర్లీనంగా ఈ ప్రవాహశీలత కనిపిస్తుంది. ‘సముద్రం-రాస్’ అనే కథ అటువంటి వాటిలో నాకు నచ్చినది.
ఎన్నో సంవత్సరాల క్రితం ఏదో వ్యాసంలో మూడు వాక్యాలు నాలోకి వెళ్ళిపోయాయి. ఒక బౌద్ధ దార్శనికుడు శిష్యుడితో అంటున్నాడు.
“నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం వాస్తవం కాదు.”
“భంతే, ఎందుచేత?”
“నువ్వు చూస్తున్నావు కనుక”
సుధగారి కొత్త కథా సంకలనం “జాగృత స్వప్నం, Lucid dreaming” అన్న పేరు చూడగానే ఈ ఆలోచనలు అనేకం wind chimer లాగా నాలో సవ్వడి చేసాయి. Lucid Dreams అన్నమాట ఈ కథలకి మూల సూత్రం. It’s a beautiful word. నేను రాసిన ఉపోద్ఘాతానికి క్లుప్తీకరణ. కొంతకాలం క్రితం తన బొమ్మ గీసుకొని, పికాసో రాసుకున్న ఒక వాక్యం చూసాను. “Imagination is the only reality”. మర్చిపోలేకపోయాను.
పరిచయం చెయ్యడానికి, అన్ని కథలూ ఎంచుకుని, వాటి గురించి రాయాలనుకున్నాను. కానీ కథలన్నీ రెండుసార్లు చదువుకున్న తరువాత ఆ ప్రయత్నం విరమించుకున్నాను. వీటిని వివరించబోవడం న్యాయం చెయ్యడం కాదనిపించింది. పైగా ఏదో ఒక కథా వస్తువు నెపంగా తీసుకొని రాస్తే వివరణ ఉపకరిస్తుంది. ఇది వేరు. ఈ కథలు మనకి అనేక విధాలుగా అనుభూతం అవుతాయి. రైల్లో కిటికీ పక్కన కూచుని రాత్రి ప్రయాణిస్తున్నప్పుడో ఏకాంతంగా కూచున్నప్పుడో లోపల్నించి దృశ్యాదృశ్యాలుగా వెలువడుతుంటాయి. తాత్కాలికంగా స్థల కాలాదుల నుంచి విడివడి మన ఉనికి స్ఫురణకు రాదు. ఇటువంటి సాహిత్యానుభవాలు అనేక వైరుధ్యాలనూ, అసమతనీ క్షాళనం చెయ్యడం వల్ల మనం సమాజానికీ మనుషులకీ దగ్గిరవుతాం; ప్రాపంచిక దృక్పథం మారడం వల్ల.
నా ఉద్దేశ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సుధగారి కథలు (ఆమె రాసే మందు చీటీల్లాగా) అర్ధం కావని చెప్పడం కాదు. అద్భుతం, అధివాస్తవికత, స్మృతి, సృజనాత్మక భావనల కలనేత ఈ కథలు. అంటే dream of memory = dreamory. ఒకటి రెండు కథలలో Inter connectedness కనిపిస్తుంది. ఇవన్నీ మన అనుభవాలే. కానీ వాటిని అలా గుర్తించడం అరుదుగా జరుగుతుంది.
ఈ మొత్తం కథలలో గోల్డెన్ టస్క్ అనే కథ నాకు బాగా నచ్చింది. ఇంగ్లీషులోకి, ఇతర భారతీయ భాషల్లోకి వెళ్ళవలసిన కథ. పత్రికలో వచ్చినప్పుడు చదివేను. కథల్లో అనేకమంది విదేశీయులు కనిపిస్తారు. కొన్ని కథలు విదేశాల్లో జరుగుతాయి. తెలుగు కథల్లో కనిపించే విదేశీయులు పొరపాటున కథలో పడ్డట్టు కనిపిస్తారు. కానీ ఈ కథల్లో ఆ పాత్రల్లో సహజమైన నేటివిటీ కనిపిస్తుంది.
సుధగారి కథల్లో నాకు కనిపించిన మరో విశేషం, కథ ఆమె చెప్పినట్టుంటుంది. బహుశా అందువల్ల చాలా కథలకి ఆత్మాశ్రయ స్పర్శ ఉన్నదనిపిస్తుంది. అసంకల్పితంగా కథల్ని దృశ్యమానం చేస్తారామె. ఇటువంటి కథల్ని నిర్వహించడం సులభం కాదు. కానీ సుధగారు నిరలంకారమైన శైలిలో కథ చెప్పడమే గాక, ముచ్చటైన క్లుప్తత సాధించారు. ఆమె ఎంచుకున్న వస్తువులోనే ఆ వైవిధ్యం కనిపిస్తుంది. కథనంలో అంత వైవిధ్యం కనిపించదు.
ఇతర కథలకంటే భిన్నమైన ఒక మంచికథ “పరి అలియాస్ పార్వతి”. నిరాడంబరమైన శైలిలో చెప్పిన ఆసక్తికరమైన కథ. ఆమె చాలా కథల్లో కథాస్థలం ముఖ్యపాత్ర నిర్వహిస్తుంది. నిజానికి ఈ కథల్ని పాఠకుల ముందుంచడానికి సాహసం, ఆత్మవిశ్వాసం అవసరం. తమ కథలకీ తమకీ ఉండవలసిన దూరం గురించి చాలా మంది రచయితలు పట్టించుకోరని నేననుకుంటాను. ఆ స్పృహ సుధ గారికి ఉందనిపించింది. దానిక్కారణం బహుశా వ్యక్తిగతమైన ఆమె తాత్త్విక దృక్పథం కావొచ్చు.
సుధగారి కథల శీర్షికలన్నీ చిన్న పజిల్సు. వచనం, శీర్షికలూ కూడా క్లుప్తంగా ఉంటాయి. “అలౌకికం” అనే కథలో వాక్యాలు చూడండి. “నాతోపాటు పక్కనే నుంచున్నాడు సిఫు. ఆకళ్లలో ఇదివరకటి దిగులు లేదు. సిఫు చిన్న వెన్నెల నీడ నా వొడిలో పడుతోంది. ఇలాంటి సమయంలో నీతోపాటు ఒక మిత్రుడు అనంతమైన చీకటిని, చలిని, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ పక్కన ఉండడం ఒక అనుభవం”. ఈ కథలోనే రచయిత మౌలికభావన అనదగ్గ వాక్యాలు రెండున్నాయి. “అమ్మూ! అతీతమైన అనుభవాలు అంటూ ఏమీ ఉండవు. మనం అనుభవించాల్సినవే మనకు అనుభవానికి వస్తాయి. వాటిని అనుభవించి తీరాల్సిందే.
“మూడు పిల్లులు” అని మరో కథ. మంచి కథ. బహుశా possession గురించి అనుకుంటున్నాను. అనుకోకుండా ఒక గొప్ప మనసున్న అపరిచితురాలు దగ్గరయి తన బంగళా లీల అనే ఆమెకు రాసిచ్చి మరణిస్తుంది. యజమానురాలి మనవడు ఒకవేళ వచ్చి అందులో ఉంటానంటే అతనికి ఇవ్వాలని ఒక నైతికబాధ్యత లీల మీద పెడుతుంది. ఆమెకి ప్రాణ సమానమైన రెండు పిల్లులు. ఒకటి లీలని వెన్నంటి ఉంటుంది. మరొకటి కనిపించదు. పెద్దామె మనవడు వచ్చి కాగితాల మీద సంతగించి ఎటో వెళ్ళిపోతాడు. లీల సంపన్నురాలై బంగళాని అమ్మకానికి పెడుతుంది. సంగతి మనవడికి తెలిసి అక్కడే ఉండటానికి నిర్ణయించుకుంటాడు. మిగతా అన్ని కథల్లో వలె ఇందులో కూడా ప్రకృతి ప్రధాన పాత్ర. ఎక్కడికో వెళ్ళిపోయిన పెద్దామె పిల్లి తిరిగి ఇంటికి వస్తుంది. మరి మూడో పిల్లి ఎవరు?
కళకి సంబంధించి ఎటువంటి పరిమితులూ అంగీకారం కాదు. ఈ జీవితాన్ని. అన్ని కళలూ భిన్న మార్గాల్లో సారవంతం చేస్తాయి. అది మనం గ్రహించనంతకాలం కళ ప్రయోజనం గురించి మాట్లాడుతూనే ఉంటాం. సుధగారి వంటి రచయితల సాహిత్యం మౌలికమైన ఈ మానవావసరాన్ని తీరుస్తూనే ఉంటుంది.
మీ చేతుల్లో ఉన్నవి మోదుగుపూల గుత్తులు.
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి 14 మే 1945న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి మొదటి కథ సీతన్న తాట 1962లో ఆంధ్ర ప్రభలో అచ్చయింది. అయిదు కథా సంపుటాలు - వడ్ల చిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, రామేశ్వరం కాకులు, సమాంతరాలు; నాలుగు నవలలు, నాలుగు నాటకాలు, భమిడిపాటి కామేశ్వరరావు గారి సంక్షిప్త జీవిత చరిత్ర, ఒక కవితా సంపుటి ప్రచురించారు. ఆర్కియాలజీ చదివి, పర్యావరణ కార్యకర్తగా పని చేశారు.