దీపధారి!

Spread the love

‘వసుంధర గారి అటెండెంట్ ఎవరండీ?’

నిశ్శబ్దంగా ఉన్న ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వార్డులో నర్స్ చిన్నగా అడిగినా గట్టిగానే వినబడింది.

చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడుతుంటే చేత్తో పైకి పట్టుకుని నర్సు దగ్గరికి పరిగెత్తాను.

‘నేనే’

‘డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి…’ అంటూ ముందుకు నడిచింది.

ఆమె వెనకే రూమ్ లోకి వెళ్ళాను.

కుర్చీలో కూర్చుని చక్కటి చిరునవ్వుతో నా వైపే చూస్తూ అన్నది డాక్టర్ రోహిణి, ‘వసుంధర గారి రిపోర్ట్స్ చూసాను. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ డిటెక్ట్ అయ్యాయి.’

నా మొహంలో ఆందోళన గమనించి మళ్ళీ ఆవిడే అంది.

‘సమయానికి తీసుకురావడం వల్ల పెద్ద ప్రమాదం లేదు. కానీ చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొలిసిస్టెక్టమీ.’

‘మెడిసిన్స్ తో క్యూర్ అయ్యే ఛాన్స్ లేదంటారా మేడమ్.’

‘స్టోన్స్ సైజ్ 10 mm ఉంది. సర్జరీ చేయాల్సిందే. పోస్ట్ సర్జరీ ఒకరోజు హాస్పిటల్

లో ఉంటే చాలు. మీరు ఓకే అంటే రేపే చేద్దాం. ఏమంటారు?’

‘ఓకే మేడం. నెలరోజుల్నించి ఆవిడ నొప్పితో అల్లాడిపోతోంది. వెంటనే చేసేయండి.’

పక్కనే ఉన్న నర్సు ఫైల్ ఓపెన్ చేసి ఒక ఫామ్ లో డీటైల్స్ ఫిల్ చేస్తోంది. పేషెంట్ తో అటెండెంట్ రిలేషన్షిప్ అనే కాలమ్ దగ్గర ఆగింది. 

‘ఆవిడ మీకేం అవుతారు?’

ఎవరంటే ఏం చెప్పను? అమ్మ కాదు, అత్త కాదు, స్నేహితురాలు కాదు, బంధువూ కాదు, నైబర్ కూడా కాదు.

మా ఇద్దరి రిలేషన్ ఏంటో చెప్పే కరెక్ట్ పదం

ఈ లోకంలో లేదేమో. ఆవిడని ఎప్పుడూ మీరు అనడమే నాకు అలవాటు. అప్పుడప్పుడు వసుంధర అని పేరు పెట్టే పిలుస్తాను. కొత్త వాళ్ళకి మాత్రం ‘ఆంటీ’ అని చెబుతాను.

‘జస్ట్ ఎ ఫార్మాలిటీ. చెప్పండి మేడం.’

‘అమ్మ అనే రాయండి.’

బయటికొచ్చి ఇందాక కూర్చున్న సీట్లోనే జారగిలబడ్డాను.పదేళ్ళల్లో ఎప్పుడూ లేనిది మొదటిసారి ఆమెను నేనెందుకు ‘అమ్మ’ అని చెప్పాను. వసుంధరని మొదటిసారి చూసినరోజు జ్ఞాపకం వచ్చింది.

***

సివిల్స్ రాసి కలెక్టర్ అవుదాం అని కలలుకన్నాను. ఈలోపు గ్రూప్ వన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కొట్టాను. మంచి ర్యాంకు రావడం వల్ల ఉన్న ఊర్లోనే పోస్టింగు. జాబ్ లో చేరగానే పెళ్ళి. సివిల్స్ కి ఇంకొక అటెంప్ట్ ఇచ్చాను గానీ ముందున్న ఆసక్తి పోయింది. ఈలోపు పాప పుట్టింది.

ఆఫీస్ కి వెళ్ళే దారిలోనే పాప స్కూల్. ఎప్పట్లాగే ఆ రోజు కూడా పాపని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్తున్నాను. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. కారాపి క్యాజువల్ గా పక్కకు చూశాను. బ్లాక్ కలర్ పోర్షే కారు. డ్రైవింగ్ సీట్లో నాన్న. విండోదించి పలకరిద్దాం అనుకునేలోపు నాన్న పక్కన ఒక స్త్రీ. ఆల్మోస్ట్ నాన్న భుజమ్మీద పడి నవ్వుతోంది. ఇద్దరు వ్యక్తులు దగ్గరగా ఉండడాన్ని చూసి జడ్జ్ చేసే మెంటాలిటీ నాకు లేదు. అందుకే అది నా బుర్రలో రిజిస్టర్ కాలేదు.మధ్యలో రెండుమూడుసార్లు అమ్మ దగ్గరికెళ్లాను కానీ ఆరోజు సిగ్నల్ దగ్గర చూసిన విషయం మర్చిపోయాను.

*** 

ఆర్నెల్ల తర్వాత ఓరోజు అమ్మ ఫోన్.

‘ఓసారి ఇంటికొస్తావా, నీతో కొంచెం మాట్లాడాలి.’

అమ్మ స్వరం అంత దిగాలుగా ఉండడం నేనెప్పుడూ వినలేదు.

అమ్మ పెద్దగా చదువుకోలేదు గానీ ఎంత ప్రపంచ జ్ఞానముండేదో. ఇంటిని శ్రద్దగా చూసుకునేది. నాన్న వెటర్నరీ డాక్టర్. మూగజీవాలంటే పంచప్రాణాలు. ఉద్యోగం తప్ప ఇంటి విషయాలు ఏమీ పట్టించుకునేవారు కాదు. నాన్న లేని ప్రతీచోటా అమ్మ నిలబడేది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ అవసరం ఉన్నా తనతోనే చెప్పుకునేవాళ్ళం.

చాలా జోవియల్ గా ఉండేది. నేను చెల్లి ఇద్దరం అన్ని విషయాలు అమ్మతో షేర్ చేసుకునేవాళ్ళం. ఎవరైనా అబ్బాయిలు వెనక ఫాలో అయితే భయమేసేది. అమ్మతో చెబితే, ‘వాళ్ళ మొకం. ఏవీ చేయరు. మీరు

లిమిట్ లో మాట్లాడితే స్నేహంగా ఉంటారు. వాళ్ళతో పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ పెద్దరికం ముసుగేసుకుని తిరిగే వాళ్ళతోనే చాలా డేంజర్. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్ళ దగ్గరే.’ అనేది.

రోజుకొక్కసారైనా మా ముగ్గురికీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. నాకు సాధారణంగా ఆఫీస్ లో లంచ్ అవర్ అయిపోతుండగా చేస్తుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా పదినిమిషాలు అమ్మతో మాట్లాడితే నార్మల్ అయిపోతా.

ఇవ్వాళ అమ్మ స్వరంలో ఎప్పుడూ ధ్వనించే ఆ జోష్ లేదు. కొంచెం డల్ గా అనిపించింది. వెంటనే బయలుదేరాను.

నేను వెళ్ళేసరికే ఇంట్లో తమ్ముడు, చెల్లి, నాన్న ఉన్నారు. ఎందుకో కొంచెం దడదడగా

అనిపించింది.

***

‘చెప్పండి నాన్నా, ఏం జరిగింది’? 

తలదించుకుని కూర్చున్నాడు నాన్న, దోషిలా.

తమ్ముడు ఆయనకి ఎదురు సీట్లో, చెల్లి డైనింగ్ చెయిర్లో కూర్చుని ఉన్నారు. అమ్మ మాత్రం అన్నీ పోగొట్టుకున్నదానిలా గుమ్మానికి ఆనుకుని నిలబడుంది. 

‘నువ్వన్నా చెప్పరా?’ తమ్ముడిని అడిగాను.

వాడు నాన్నవైపు చూస్తూ ‘నన్నడిగితే నేనేం చెప్తాను, ఆ పెద్దమనిషినే అడుగు.’ అన్నాడు

విసురుగా.

నాన్న తలెత్తి వాణ్ని చూసి మళ్ళీ తలదించుకున్నాడు.

నేను అమ్మ దగ్గరికెళ్లి, భుజం చుట్టూ చేయివేసి ‘నువ్వైనా చెప్పమ్మా’ అనబోతుండగానే ఒక్కసారిగా నన్ను చుట్టుకుని నిండుకుండ భళ్ళున బద్దలైనట్టు భోరుమంది అమ్మ.

అమ్మని సముదాయించడం నావల్ల కాలేదు. బలవంతంగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను. అయిదు నిమిషాలయ్యాక అమ్మ ఏడుపాపింది.

విషాదంలాంటి నిశ్శబ్దం ఇల్లంతా పరుచుకుంది.

చివరిగా చెల్లివైపు చూశాను. అమ్మ ఏడుపు చూసింది కదా, అడక్కుండానే నోరు విప్పింది.

ఆవిడ పేరు వసుంధర. నాన్న కొలీగ్. భర్తపోయి మూడేళ్లయింది. ఒక్కడే కొడుకు, అంకిత్. మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తాడు. ‘మా అమ్మకి నేనంటే ప్రాణం. ఇప్పుడు మీ నాన్నొచ్చి మా అమ్మని నాకు దూరం చేస్తున్నారు. ఈ వయసులో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీడం లేదు. కనీసం మీరైనా చెప్పండి అన్నాడు నాతో.’

ఆర్నెల్ల క్రితం నాన్న పక్కన కనిపించినావిడ మొహం లీలగా గుర్తొస్తోంది నాకు.

‘ఇదిగో అందరూ వినండి.’

నాన్న సడన్ గా లేచి కోపంగా అరిచాడు.

‘దీన్ని రహస్యంగా ఉంచలేను. అలాగని ఓపెన్ గా చెప్పలేను. నేనూ వసుంధర ఒకర్నొకరం ఇష్టపడ్డాం. మీ అమ్మని బాధపెట్టడం నాకిష్టం లేదు. అలాగని వసుంధరకి దూరం కాలేను. మీ ముగ్గురూ చదువుకున్నవాళ్ళు, మా ఇద్దరినీ ఎలా అర్థం చేసుకుంటారో ఇక మీ ఇష్టం.’

చెప్పాల్సిన నాలుగు ముక్కలు కక్కేసి గదిలోకెళ్ళి ధడేల్మని తలుపేసుకున్నాడు నాన్న.

సిట్యువేషన్ లోని సీరియస్ నెస్ నాకిప్పుడు పూర్తిగా అర్థమయింది.

ఏడ్చీఏడ్చీ కన్నీళ్ళింకిపోయినట్టు అభావంగా ఉన్న అమ్మ కళ్ళల్లోకి చూశాను.

‘అమ్మా, మా ఇంటికి వెళ్దామా?’

ఏమనుకుందో ఏమో, బెడ్ రూమ్ లోకి వెళ్లి చిన్న బ్యాగ్ సర్దుకుని వచ్చింది.

మా ఇంటికెళ్ళాక అమ్మతో ఈ టాపిక్ గురించి నేనేం మాట్లాడ్లేదు. తను పాపతోనే ఎక్కువ సమయం గడిపేది. సాయంత్రంపూట ఇద్దరూ పార్క్ కి వెళ్లేవారు. అమ్మ తనని తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది.

అయిదోరోజు ఇంటికి వెళ్ళిపోతుంటే వసుంధర గురించి ఏదో మాట్లాడబోయాను. విచిత్రంగా టాపిక్ మార్చేసింది.

ఆమె కళ్ళల్లోకి చూశాను.

అవే నిర్మల నిశ్చల నిష్కల్మష నేత్రాలు.

***

‘హలో వసుంధర గారా?’

‘అవును.’

‘నేను శేఖర్ గారి పెద్దమ్మాయిని.’

చెల్లి ద్వారా వసుంధర నెంబర్ పట్టుకుని కాల్ చేసాను. కలవాలని చెప్పాను. ఎందుకు ఏంటని అడగలేదు. అడ్రస్ చెప్పింది. హాఫ్ డే లీవ్ పెట్టుకుని వెళ్ళాను.

ఆమెలాగా ఇల్లు కూడా పద్దతిగా, ప్రశాంతంగా ఉంది.

లోపలికి అడుగుపెట్టగానే లెమన్ గ్రాస్ పరిమళం అల్లుకుంది. ఓ మూల క్రాఫ్టెడ్ ఉడెన్ స్టూల్ మీద బంగారు కాంతులీనుతూ అర్థనిమీలిత నేత్రాల బోధిసత్వుడు. ఇంకో మూల బ్రాస్ ఫ్లవర్ వేజ్ లో చలాకీగా తుళ్ళిపడుతున్న లిల్లీలు, వాటితో పోటీపడుతున్న చిట్టి చామంతులు. గాలికి హుందాగా ఊగుతున్న లెమన్ ఎల్లో, చిలకపచ్చ రంగు కాంబోలో హాండ్లూమ్ కర్టెన్లు.

ఆమెని చూడగానే కొంత, ఇంటిని చూడగానే మరికొంత నాలో ఆవేశం తగ్గడం నేనే గమనించాను. అవశేష ఆవేశాన్ని ఆమె గమనించింది. చొరవగా నా చేతులు

పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది.

‘కన్నకొడుకే నన్ను చీదరించుకుని వెళ్లిపోయాడు. మా బంధువులు కూడా నన్ను వెలేసారు. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో నేనూహించగలను నీలిమా.’

ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. 

‘అన్నీ తెలిసిన మీరు, ఇంకో స్త్రీకి ఇలా అన్యాయం చేయడం తప్పనిపించలేదా?’

ఒక్కక్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిర్వేదంగా చెబుతోంది.

‘కొన్ని పరిచయాలు అంతే నీలిమా. కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతదూరం వచ్చామా అనిఆశ్చర్యపోతాం. అప్పటికే ‘పాయింటాఫ్ నో రిటర్న్’ చేరుకుంటాం. ఇది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకే తెలియదు. ఇక నీకేం చెప్పగలను. ఇద్దరి మనుషుల మధ్య నిజమైన ప్రేమ పుట్టడానికి పెద్ద కారణాలు ఉండవేమో.’

ఆవేశంతో వచ్చిన వాళ్ళని ఆలోచనలో పడేయగల అమాయకత్వంలాంటి సున్నితత్వమేదో ఆమెలో ఉంది.

 ‘మీ కొడుకు స్థానంలో మా ఇంట్లో ముగ్గురం ఉన్నాం. మేం మా నాన్నని ఏం చేయాలి? ఒకవేళ మీరే మా అమ్మ స్థానంలో ఉంటే చేస్తారు?’ సూటిగా అడిగాను.

ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా అంది, ‘అంత లాజికల్ గా ఆలోచించేదాన్నయితే

ఇన్ని బంధాలున్న మీ నాన్నని ఎందుకు ఇష్టపడతాను. అదలా జరిగిపోయిందంతే. ఒక్కటి మాత్రం చెప్పగలను. మీ ఇంటిని కూల్చి నా ఇంటిని కట్టుకోవాలన్న ఆశగానీ, ఆలోచన గానీ నాకెప్పుడూ లేదు. అటువైపున్నది కూడా నాలాంటి ఇంకో స్త్రీనే కదా అని ఎప్పుడూ లోపల కొట్టుకుంటూనే ఉంటుంది.’

ఎప్పటినుండో పరిచయం ఉన్నట్టు, ఓ స్నేహితురాలు మరో స్నేహితురాలితో అంతరంగం పంచుకుంటున్నట్టు మనస్ఫూర్తిగా చెప్పిందామె.

చిన్న నిశబ్దం తర్వాత అడిగింది.

‘జెన్యూన్ గా చెప్పు నీలూ, నా ప్లేస్ లో నువ్వుంటే ఇంత ప్రేమని వదులుకుంటావా?’

ఊహించని ప్రశ్న. సమాధానం లేదు నా దగ్గర. పోట్లాడ్డానికే వచ్చాను కానీ మాట్లాడ్డానికి మాటలే దొరకడం లేదు. జవాబుల కోసం వచ్చిన నాకు ఇప్పుడు తనే ప్రశ్నై ఎదురు నిలబడింది.

అభిమానంగా ఆమె చేతిని నొక్కి ఇంటికి వచ్చేసాను, అంతే.

***

ఇద్దరం అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడం, ఎప్పుడో ఒకసారి కలుసుకోవడంగా మొదలైన మా పరిచయం ఈ పదేళ్లలో మరింత బలంగా అల్లుకుంది.

వయసులో మా ఇద్దరికీ చాలా వ్యత్యాసం

ఉన్నా, అభిరుచులు, అలవాట్లలో చాలా సారూప్యత ఉంది. ఇద్దరికీ హ్యాండ్లూమ్ చీరల పిచ్చి. కలిసి షాపింగ్ కి వెళ్ళేవాళ్ళం. నా రెసిపీలు ఆమెకి, తన కలినరీ స్కిల్స్ నాకూ నేర్పించే క్రమంలో కిచెన్ లో బోల్డన్ని ఇంటలెక్చువల్ డిబేట్లు, నాలెడ్జ్ షేరింగ్ సెమినార్లు గంటలుగంటలు జరిగేవి.

కమర్షియల్ సినిమాల కంటే, ఆర్టిస్టిక్ గా ఉండే సినిమాలే ఇద్దరికీ ఇష్టం. ‘పరోమితార్ ఏక్ దిన్’ లో అపర్ణాసేన్ నటన గురించీ, ‘కాస్ట్ అవే’ లో టామ్ హ్యాంక్స్ సర్వైవల్ స్పిరిట్ గురించీ, ‘ఇన్ టు ద వైల్డ్’ లో క్రిస్- ద సూపర్ ట్రాంప్ చెప్పిన ‘హాపీనెస్ ఈజ్ రియల్ వెన్ షేర్డ్’ అన్న వాక్యం గురించి గంటలుగంటలు మాట్లాడుకునేవాళ్ళం.

తనకున్న పెద్ద లగ్జరీ బంగ్లామీద పెరడు ఉండడం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు పెంచేది. పూల మొక్కలు మాత్రం నా క్రెడిట్టే. పువ్వు పూసినా, కాయ కాసినా ఫోటో తీసి వాట్సప్ చేసేది. ఇద్దరం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న సన్నకారు రైతుల్లా ఫీలయేవాళ్ళం

నేను మా ఫ్యామిలీతో కలిసినప్పుడు మాత్రం ఎవరం ఆమె గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. అంతా ఒక కోడ్ మెయింటెన్ చేస్తున్నట్టుగా ఉండేది. ఎవరికీ ఎవరి ద్వారా ఏ ఇబ్బందీలేకుండా అందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆవిడ ఫోన్, నెల రోజుల నుండి భరించలేని కడుపునొప్పని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తే ఇదీ విషయం.

***

‘సర్జరీ అయిపోయింది, మీ అమ్మగారు స్పృహలోకి వచ్చారు. మీరెళ్ళి చూడొచ్చు.’ నర్స్ మాటలతో ఆలోచనల్లోంచి బయటపడి లోపలికెళ్లాను.

బెడ్ మీద పడుకుని అనస్తీషియా మత్తు నుంచి అప్పుడే తేరుకుంటూ కళ్ళుతెరిచింది.

దగ్గరకెళ్లి చూశాను, చాలా బలహీనంగా ఉంది.

‘అంతా ఓకేనా డాక్టర్. ఏం ప్రాబ్లం లేదుగా.?”

‘నథింగ్ టు వర్రీ, రేపు తీసుకెళ్ళిపోవచ్చు.’

ఏమేం మందులు ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతకాలం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి భోజనం పెట్టాలి, డైలీ రొటీన్ ఎలా ఉండాలి అని డాక్టర్ చెబుతుంటే ఒక చెయ్యి బెడ్ మీద పెట్టి నిలబడి వింటున్నాను.

పందిరిని అల్లుకుంటూ దోసపాదు పాకినట్టు సన్నని చల్లని వేళ్ళు నా చేతి మీద తారాడాయి.

ఉలిక్కిపడి చూశాను.

బేలగా బెంగగా నావైపు చూస్తూ నా చేతిని తన చేతిలోకి తీసుకోవాలని ఆరాట పడుతుందామె. 

కఠిన పాషాణం కూడా కరిగి నీరయ్యే చూపులవి.

నేను ఆఫ్ట్రాల్ మనిషిని. బొటబొటా రెండు కన్నీటి చుక్కలు రాల్చగలిగాను.

నుదుటిమీద పడుతున్న ఆమె ముంగురుల్ని సర్ది, తన చేతిని నా రెండుచేతుల్లోకి తీసుకుని, పెదవులకు ఆనించుకుని, నెమ్మదిగా అన్నాను.

‘నేనున్నాను కదమ్మా.’

***

‘ఆర్యూ మ్యాడ్ నీలూ, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా?’

మా ఇల్లంతా పిల్లిలా అటూఇటూ తిరుగుతూ ఆవేశంగా అరిచాడు నాన్న.

వసుంధరని కొంతకాలం మనింట్లోనే పెట్టుకుందామని అరవింద్ కు రాత్రి ఫోన్ చేసి చెప్పాను. పొద్దుటికల్లా నాన్న, తమ్ముడు, అరవింద్ కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

‘నీలూ, నిన్నే అడుగుతున్నాను. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా?’

ఈసారి మరింత గట్టిగా అరిచాడు నాన్న.

నేనేం మాట్లాడలేదు. అరవింద్ సున్నితంగా అందుకున్నాడు. 

‘చూడు నీలూ, నిన్న మా బాబురావు మామయ్య ఫోన్ చేశాడు. హాస్పిటల్లో నీలిమతో పాటు ఉన్నావిడ ఎవరు ఏంటి

అని. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు.’

అతని స్వరంలో మందలింపు నాకు అర్థమవుతోంది.

‘బావా, మా అత్తగారివైపు వాళ్ళైతే ఆమెతో మీ అక్క తిరగడం ఏంటీ అని మోహమ్మీదే వెటకారంగా మాట్లాడుతున్నారు’ తమ్ముడు చిరాగ్గా అన్నాడు.

‘మీరంతా ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.’ అన్నాను.

నేను డిఫెన్స్ లో పడిపోయానని నాన్నకు అర్థం అయింది.

వచ్చి నా పక్కన కూర్చుంటూ పరిస్థితిని నాకు అర్థమయ్యేలా వివరించడం

మొదలుపెట్టాడు.

‘నీలూ, నువ్వు వసూతో తిరగడం అందరూ గమనిస్తున్నారు. అరవింద్ వాళ్ళది పేరున్న పొలిటికల్ ఫ్యామిలీ. ఈ విషయం తెలిస్తే మీ అత్తగారు, ఆడబిడ్డలు, వాళ్ల బంధువులు ఏమనుకుంటారు చెప్పు?’

 ఎలాగో గొంతు పెగుల్చుకుని అడగగలిగాను.

‘వసుంధర ముందు మీకే కాల్ చేసిందట. సర్జరీ ఉందని నేను కూడా చెప్పినా మీరు రాలేదు. ఎందుకు నాన్నా’?

నాన్న ఆరునెలల నుండి వసుంధరను కలవడం లేదు. కారణం తెలీదు.

సహనం నశించినట్టు కోపంగా అరిచాడు

నాన్న, ‘నువ్వు బజారున పడింది చాలదా. నేను కూడా అల్లరి కావాలా?’

తమాయించుకున్నాను.

‘అలా మాట్లాడతారేంటి నాన్నా? మీకేం బాధ్యత లేదా?

‘నాకేం బాధ్యత ఉంటుంది? నేనేమన్నా తాళి కట్టి పెళ్ళి చేసుకున్నానా? అయినా, ఆమెకో కొడుకు ఉన్నాడు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద బంధుబలగం ఉంది.’ 

‘వాళ్ళందరూ ఎప్పుడో మీవల్లే ఆవిడకు దూరమయ్యారుగా. ఆమెకున్న ఒకే ఒక బంధం మీరు. ఈ వయసులో మీరు కాకుండా ఆవిడని ఎవరు పట్టించుకుంటారు.’

‘నువ్వొక్కదానివే అడ్డగోలుగా సొంత నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా?’

నిస్సహాయంగా అరవింద్ వైపు చూశాను.

‘ఆపదవచ్చినపుడో అవసరం పడ్డప్పుడో మనిషికి మనిషి నిలబడకపోతే మనం మనుషులం ఎలా అవుతాం అరవింద్.’

‘నీలూ, మీ నాన్నకే లేని రిలేషన్ నీకెందుకు చెప్పు. డాడీపోయాక నేను మొదటిసారి దిగుతున్న ఎలక్షన్ ఇది. టికెట్ ఇచ్చేముందు నన్నే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళని కూడా స్క్రూటినీ చేస్తారు. ఇలాంటి సమయంలో నువ్వామెను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నాకెంత నామోషీ?’

‘ఆపదలో ఉన్న స్త్రీకి ఆశ్రయమివ్వడం మీ పార్టీ దృష్టిలో తప్పయితే అలాంటి పార్టీ తరఫున నువ్వు పోటీ చేయడం, నాకు అంతకన్నా నామోషీ.’

నా గొంతులోంచి షార్ప్ గా వచ్చేసింది మాట. అరవింద్ ఖంగుతిన్నాడు.

పరిస్థితి ఎటో వెళ్తుందని గ్రహించాడు నాన్న. నా పక్కన చేరి ప్రేమగా తల నిమురుతూ అన్నాడు.

‘నీలూ… నువ్వు తెలివైనదానివి. అర్థం చేసుకో. హాస్పిటల్ ఖర్చంతా భరించావుగా. అది చాలు. ఇంకా కావాలంటే నేనో నాలుగైదు లక్షలు సర్దుతాను. తీసుకెళ్ళి సెటిల్ చెయ్. లీవ్ హర్.’

నేను రోల్ మోడల్ అనుకున్న నా తండ్రి ఒక మామూలు మగాడి కన్నా తక్కువ స్థాయి అన్న నిజం మొదటిసారి గ్రహించాను. ఉల్లిపాయ ఘాటును మించిన బాధేదో కళ్ళల్లో దూరి జలజలా రాలిపోతోంది.

‘నాన్నా! ఆరోజు వసుంధరని వదిలి బతకలేనని అరిచి మరీ చెప్పారు. ఇప్పుడేమో మీరు వదిలేయడమే కాకుండా నన్ను కూడా వదిలేయమంటున్నారు. అప్పుడు ఆమె మీద చూపించింది ప్రేమ కాదా? నటనేనా?

అక్కడ నాకు మా నాన్న కనిపించలేదు. పరువు ప్రతిష్టలు అంటూ లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్పి ఒక అమాయకురాలిని వదిలించుకోవాలనుకుంటున్న మగాడే కనిపిస్తున్నాడు.

‘వాదనలు అనవసరమక్కా. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం మాకెవరికీ ఇష్టం లేదు.’ తమ్ముడు తేల్చేసి చెప్పాడు.

అవును. వీళ్ళతో వాదనలు అనవసరం. నేనూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి విసురుగా వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపాడు నాన్న.

‘నీలూ… నేను వసుంధరని వదిలేసానని మీ అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంది. నువ్విలా చేస్తే అమ్మెంత బాధపడుతుంది? కన్నతల్లి కంటే నీకు పరాయామె ఎక్కువైందా?’

ఆఖరి బ్రహ్మాస్త్రం వేశాడు. 

“అమ్మతో మాట్లాడాకే నేనీ డెసిషన్

తీసుకున్నా నాన్నా?”

‘వాట్?” ముగ్గురూ ఒకేసారి అరిచారు.

‘యస్. ‘నన్నొదిలేసి మీనాన్న ఆమెతో ఉంటుంటే నాలోనే ఏదోలోపం ఉందనుకున్నాను. కానీ ఈరోజు అంతకష్టంలో ఆమెను వదిలేశాడు చూడూ, లోపం మీ నాన్నలోనే ఉందని అర్థమైంది. నువ్వు వసుంధరకి తోడుంటే మీనాన్న చేసిన తప్పుని సరిదిద్దినట్టే నీలూ’ అని చెప్పింది. దటీజ్ మై మదర్. నిన్ను ప్రేమించిన ఇద్దరు స్త్రీల వ్యక్తిత్వం ముందు నువ్వో గడ్డిపోచవి నాన్నా. మొగుణ్ణి నమ్మి మాఅమ్మా, మగాణ్ణి నమ్మి వసుంధరమ్మా ఇద్దరూ మోసపోయారు.’

నాన్న మొహంలో నెత్తురుచుక్క లేదు.

‘అందరూ వినండి, వసుంధరకి ఇంకోమనిషి అవసరం ఉంది. నేనూ మనిషినే అని రుజువు చేసుకునే అవకాశం నాకొచ్చింది. తల్లీకూతురు అనుకుంటారో, ఫ్రెండ్సనుకుంటారో మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. మీకెవరికీ ఆవిడ ఇక్కడకి రావడం ఇష్టంలేదు కాబట్టి, నేనే తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వసుంధరమ్మకి తోడుగా ఆమెతోనే ఉంటాను.’

స్థిరంగా బలంగా సూటిగా చెప్పి వీధి తలుపుతీసి బయటకెళ్ళి ధడేల్మని తలుపేసేసాను.

ఆ శబ్దానికి హాల్లో ఉన్న ముగ్గురు మగాళ్ళూ అదిరిపడ్డారు.  

***

స్వర్ణ కిలారి

Spread the love

2 thoughts on “దీపధారి!

  1. ఈ కథలో నాన్న పాత్ర వసుంధరకు ఎందుకు దగ్గరయ్యిందో..తర్వాత ఎందుకు వదిలించుకోవాలనుకుందో అన్న అంశంలో స్పష్టత లోపించింది.మరింత వివరణ,చర్చ అవసరం.మరిన్ని బలమైన అంశాలను జోడించి చెప్పి ఉంటే బావుండేది.కథలోని పరిస్థితులు,దాన్ని పెంచి పోషించిన మగాడి చిత్తచాంచల్యాల్ని పాఠకుడి ముందు పెట్టి వారినే పాత్ర స్వభావాల్ని అర్ధం చేసుకోమని చెప్పాలి గాని రచయిత్రి ముందు పడి ఆ పని కాస్త చేసి పెట్టడం నాకైతే అంతగా బాగుందనిపించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *