యాత్ర అంటే onlineలో టికెట్టూ, హోటలూ బుక్ చేసుకుని గూగుల్లో Top 5 విజిటింగ్ ప్లేస్ లు సర్ఫింగ్ చేసి, ఇంటినుండి అడుగు బయటబెట్టిన క్షణంనుండి మళ్ళీ ఇంట్లో పడేవరకూ ప్రతీ చిన్న విషయం కూడా ముందే చక్కగా, పక్కాగా ప్లాన్ చేసుకుని, చిన్న ఇబ్బంది కూడా లేకుండా కంఫర్టబుల్ గా యాత్రలు చేసే వాళ్ళు కలలో కూడా ఊహించని యాత్రలు- వివేక్ లంకమల యాత్రలు.
‘ఇన్ టు ద వైల్డ్’ సినిమా గుర్తొచ్చింది నాకు ఈ పుస్తకం చదువుతుంటే. అందులో హీరో ఒక లాంగ్ ట్రిప్ కి బయలుదేరుతాడు. వెళ్లే ముందు అతను చేసే మొట్టమొదటి పని తన దగ్గరున్న డబ్బులన్నీ కాల్చెయ్యడం. యాత్ర ఎలా ఉంటుంది, ఏం చేయబోతున్నాం అనేది ముందే తెలిస్తే అది ప్రయాణం అవుతుంది కానీ యాత్ర కాదు అని అతని ఉద్దేశ్యం.
ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా “జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ది నేచర్” అనే కాన్సెప్ట్ తో యాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. పార్టీ చేసుకోడానికి బయలుదేరినంత ఈజీగా యాత్రలు చేయడానికి వెళ్తాడు వివేక్. దానికి చాలా తెగింపూ, ఉత్సాహం ఉండాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకృతి మీద ప్రేమ ఉండాలి.
అది వివేక్ ప్రతీ యాత్రలో, ప్రతీ అడుగులో కనబడుతుంది మనకు.
చెట్టు, పుట్ట, గుట్ట, మిట్ట, కొండకోనలు, వాగువంకలు, చెరువులు, నదులు, జలపాతాలు, డ్యామూలూ, చిట్టి అడవులూ కీకారణ్యాలు, ఇవీ వివేక్ యాత్రాక్షేత్రాలు.
కనపడిన ప్రతీ చెట్టునూ పుట్టనూ, పక్షినీ, మనిషిని పలకరిస్తాడు. అడవి జీవాలని, ఆదివాసీ జీవితాలను సమానంగా స్పృశిస్తాడు. కైఫియత్తుల కథలూ చెప్తాడు.
220 కేజీల బరువున్న పంక్చర్ అయిన బైక్ ను రాళ్ళదారుల్లో మోసినా, తిండీ, నీళ్ళు దొరకని డొంకదారుల్లో నడిచినా, ముళ్ళకంపలు ఒళ్ళంతా ముద్దులుపెట్టి గీకినా ప్రయాణం ఆపడు.
వెదురుగుడిసెల్లో నులకమంచాలమీదనో, పచ్చని పచ్చిక బయళ్ళమీదనో, చల్లని చెట్లనీడలోనో, తడిసిన యేటి ఒడ్డుమీదనో అతను నిద్రను అలుముకుంటాడు. ప్రకృతిని గుండెలో పులుముకుంటాడు.
నీళ్లు దొరకని కరువుకాలంలో కొండల్లో బాయిని వెతుక్కుంటాడు. “జివ్వాలు” తాగడానికని దీర్ఘచతురస్రాకారపు రాతి దొన్నెలు కనుక్కుంటాడు. అడవి తనను తాను సిద్ధం చేసుకునే వసంతహేళను ప్రత్యక్షంగా చూసి తరిస్తాడు. దాన్ని బహుచక్కగా మనకు వివరిస్తాడు. ‘గేట్ వే ఆఫ్ లంకమల’ లాంటి ‘రెడ్డిబాయి’ బోసిబోవడం చూసి బాధపడతాడు.
పిట్టల అరుపుల్లో, నెమళ్ల క్రీంకారాల్లో, రాళ్లను ఒరుసుకుంటూ పారే యేటి రవంలో, దూకే జలపాతపు హోరులో, చెట్లమీంచి వీచే ఆకుల గలగలలో మెలోడీని వింటాడు, మనకు వినిపిస్తాడు.
వానకు తడిసిన మామిడిచెట్ల చిగురుటాకులనుండి వచ్చే ఘుమాళింపు పీలుస్తాడు. పచ్చి మామిడికాయ పులుపుని, పచ్చిపల్లికాయల వాసనని, కాల్చిన మక్కకంకుల కమురుల కమ్మదనాన్ని తినుకుంటూ మనల్ని చిన్నపిల్లల్ని చేసి ఊరిస్తాడు.
తాను తిరిగిన ప్రతి ప్రాంతపు హిస్టరీని, జాగ్రఫీని క్షుణ్ణంగా విస్తారంగా చదివి మనకు క్లుప్తంగా చెప్పుకుంటా ఒక గైడ్ లాగా మనల్నీ ఆ ప్రాంతాల్లో తిప్పుకుంటూ ‘రీడింగ్ టూర్’ చేయిస్తాడు.
సంతోషం, బాధా, దుఖం- ఒకటేమిటి- జీవితంలోని అన్ని అనుభూతులను పొట్లంకట్టి మన చేతిలో పెడతాడు.
జలమయమై రెండునెలల్లో పచ్చదనాన్ని పైకి చిమ్మిన పొలాలని చూసి సంబరపడతాడు. నెర్రెలుబారి గ్రీష్మంవైపు ఆశగా చూస్తున్న బీడు భూములను చూసి బాధపడతాడు. చెరువులో ఎద్దులని కడుక్కొని నడిపించుకుపోతున్న రైతులను చూసి అబ్బురపడతాడు.
చేపలు కొనడానికి వెళ్లి ఆదివాసి ముసలమ్మతో ముచ్చట పెడతాడు. ఆ సంభాషణ అంతా మనకు కథలో పాత్రలు మాట్లాడినంత బాగా వినిపిస్తాడు. ఎదురైన మనుషుల్ని పలకరించి, వాళ్ళని కదిలించి వాళ్ళు చెప్పే కథల్ని, వ్యథల్ని వింటాడు. వాళ్లని తనకిష్టమైన నవలలోని, కథలలోని, సినిమాలలోని పాత్రలతో పోల్చి మనకి చూపించి తన యాత్రని ఒక సాహితీయాత్రగా, ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లాగా, మధ్యమధ్యలో జానపద గీతాలు వినిపించి ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా మార్చేస్తాడు.
పేజీలు తిరగేస్తుంటే ఇది యాత్రాపుస్తకమా, వివేక్ కథల సంకలనమా, గిరిజన జీవితాలమీద వ్యాస సంకలనమా అని ఆశ్చర్యపోతాం. అతని యాత్రలలాగానే అతని యాత్రారచన కూడా వైవిధ్యభరితంగా, ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా యూనిక్ స్టైల్ లో సాగింది.
చెరువులో పెట్టిన కాళ్ళ చర్మాన్ని ఏమీ తెలియని అమాయకపు చేప పిల్లలు కొరుకుతూ శుభ్రం చేస్తుంటే, పెద్ద చేపలు మాత్రం తన దగ్గరికి రాలేదంటాడు. బహుశా మనిషి నైజాన్ని అవి కనిపెట్టాయేమో అని వాపోతాడు.
కొండమీదకి ఎక్కడానికి భయపడుతున్న స్నేహితుడితో “అడుగు ముందుకు వేస్తేనే కదా వెనక్కి ఎలా రావాలో తెలిసేది” అంటాడు ఒకచోట.
“లక్ష్యానికి అవసరమైన శ్రమ పెట్టలేని ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు కాలం” అని చెప్తాడు మరోచోట.
పుస్తకాల్లో ఎంత చదివినా పత్ర్యక్షంగా చూస్తేనే ఏ భౌగోళిక స్వరూపమైనా అంతుబట్టేది అంటాడు. ఎంత నిజమో కదా!
ఇవన్నీ ఎక్కడో చదివితేనో, ఎవరో చెప్పగా వింటేనో అతనికి తెలిసిన పైపైమాటలు కాదు. రచయిత స్వయంగా అనుభవించినపుడు గుండె చెలిమెలోంచి ఉబికిన సుజలధారలు.
వివేక్ కేవలం యాత్రికుడు, వ్యక్తిత్వం ఉన్న స్వాప్నికుడు మాత్రమే కాదు, సామాజిక స్పృహ ఉన్నవాడు.
యానాదుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం, ‘In to the nature’ టీంతో కలిసి ‘నో ప్లాస్టిక్ లంకమల’ క్యాంపెయిన్ ప్రారంభించడం సాధారణ విషయాలేం కావు. తీరికలేని జీవిత పరుగులో, స్వసమయాన్ని ఇలాంటి సుకార్యాలకి కేటాయించే వివేక్ మనకు నిజంగా ఆచరణీయుడైన ఉదాహరణే.
వివేక్ రచనలో భౌతికయాత్రతో పాటు అతని ‘ఇన్నర్ ట్రావెలింగ్’ కూడా కనిపిస్తుంది. అతికొద్దిమంది యాత్రా రచయితలు మాత్రమే ఇది చేయగలరు.
ఒక యాత్రా రచనలో ఇంత భావుకత ఉండటం నేనైతే మొదటిసారి చూశాను. ఈ పుస్తకంలో అతను కవిత్వం రాశాడు, జీవితం రాశాడు, ఫిలాసఫీ రాసాడు, జీవిత సత్యాలను చెప్పాడు.
ఇంత బలమైన వాక్యం ఉన్నోడు కేవలం యాత్రా రచనలతో ఆగిపోడని నా నమ్మకం. ముందుముందు వివేక్ అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఖచ్చితంగా అడుగుపెడతాడు. తప్పకుండా తనదైన ఒక ముద్ర వేస్తాడు.
సాహిత్యాన్ని, ప్రకృతినీ ప్రేమించే ప్రతీ ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
For copies
వివేక్ గారి సజీవ యాత్రా గమనం