వెళ్ళేటప్పుడు అడక్కూడదు…
ఎక్కడికనేనా?
శుభము కలుగుగాక!
గుడికి.
పర్లేదు, దేవుణ్ణి చూడడానికీ విఘ్నమేముంటుంది?
ఏదైనా మనలోనే వుంటుంది.
ఏమిటి?, దైవమా?
అర్థమైంది, గుళ్ళోనే కాదు, నాలోనూ నేను దర్శించాల్సినది వుంది.
అంతః దర్శనం లేకుండా బహిర్ దర్శనం యెందుకనా?
సంభాషణతో పాటు గుడిలోకి పడాల్సిన అడుగులూ ఆగిపోయాయి. దారి తప్పాను. తిరిగి అడుగులు వేస్తూవుంటే-
అదేంటి గుళ్ళోకి పోలేదు?
నాకు ప్రశాంతత కావాలి.
దేవుడు యివ్వలేడా?
నేనే తీసుకోలేను.
దేవుడంటే నమ్మకం పోయిందా?
నేనేమీ నాస్తికుణ్ణి కాదు. నాకు దేవుడంటే నమ్మకం వుంది.
మరెందుకు గుళ్ళోకి వెళ్ళలేదూ?
అలిగాను.
ఎవరిమీద?
దేవుడిమీద.
అదేంటి?
ఏం అమ్మనాన్నలమీద అలగమా?, యిదీ అంతే.
అలకేనా లేకపోతే…?
నిరసన అని కూడా అనుకోవచ్చు.
అంటే… వుపవాసం వుండడమంటే నిరాహారదీక్ష చేసినట్టా?
మరీ?
దేవునితో పోరాటాలా?
తెగడినా పొగడినా… వోడిపోయిన మనషి యెవరితో గొడవ పడతాడు, దేవునితోనే కదా?
అసలు నువ్వు మనిషిననే అనుకుంటున్నావా?
కానా?
జాతి తక్కువ మనిషి జంతువుకన్నా హీనం.
ఔను… గుళ్ళోకి పందివస్తే వరహావతారమని ఆ పందికి పూజలు చేస్తారు, దండలు వేస్తారు. గుళ్ళోకి విషసర్పం వస్తే నాగదేవత వచ్చిందని పూజలు చేస్తారు, పాలు పోస్తారు. గుళ్ళోకి కోతివస్తే సాక్షాత్తూ ఆ రామబంటు మారుతే వచ్చాడని పూజలు చేస్తారు, కొబ్బరిచిప్పిచ్చి హారతి పడతారు. గుళ్ళోకి చిలక వస్తే ‘రామ’చిలుక రాముణ్ణి వదల్లేక వచ్చిందని పూజలు చేస్తారు, పళ్ళూ పలహారాలు పెడతారు. మరి మనిషి అడుగు పెడితే? ఆ మనిషి పంచముడైతే?
పంచ ప్రాణాలు తోడేస్తారు. జీవాలు ఆర్పేస్తారు.
నువ్వు నువ్వేనా?
నేనూ నువ్వూ వేరా?
నాలోపల నేను. అటూ యిటూ నేను. కుతకుతా వుడుకుతూ నేను. రోజుకు యాభై నుండి డబ్బై వేల ఆలోచనలు చేస్తాడట మనిషి. తానున్న పరిస్థితిని బట్టి అది తక్కువా వుండొచ్చు, యింకా యెక్కువా వుండొచ్చు.
నడుస్తుంటే రోడ్డు పక్కన కోతి కనిపించింది.
‘హాయ్ తాతగారూ…’ పలుకరించాను. కోతి పలుకలేదు. కనీసం తలతిప్పి చూడలేదు. నన్ను గుర్తుపట్టనట్టు వుంది. ఎలా గుర్తుపడుతుంది? తన వారసత్వాన్ని యెలా అంగీకరిస్తుంది?
నాకు తోక లేదు, దాని స్థానంలో తాటాకు వుంది. మూతికి ముంతకట్టి వుంది. ఎన్నడో విసర్జించినవి తెచ్చి యెవరో నా టక్కూ టైమీదే మళ్ళీ కట్టేస్తున్నారు. పొద్దున్న అద్దంలో చూసుకున్నప్పుడూ నాకు నేను అలానే కనిపించాను. పొద్దున్నే కాదు, యీ మధ్య యెప్పటికప్పుడు నాకు నేను అలానే కనిపిస్తున్నాను.
నాలోని దేవుడు నాకెందుకలా దర్శనమిస్తున్నాడు?
గుళ్ళలో అడుగు పెట్టారని బట్టలిప్పికొట్టిన వీడియోలు యేమైనా నా మైండ్లో నాకు తెలీకుండా నాన్‌స్టాప్‌గా ప్లే అవుతున్నాయా? లేకపోతే దేశం గౌరవించే పదవిలో వున్నా, గుడిలో అడుగు పెట్టాడని వెళ్ళాక పంచద్రవ్యాలతో కడుక్కున్న వార్తల వల్లనా? మీరు మా గుళ్ళలోకి వస్తారెందుకు, మీ అమ్మతల్లులదగ్గరకు పొండని యెవరో నా కాలర్‌పట్టి గుంజి అవతలకు తోసేసిన అనుభవాల వల్లనా?
ఈ రివైండర్ ప్లే యెవరు నొక్కుతున్నారు?
నాలో నేను తిరుగుతూ అలసిపోయాను.
అడుగులు ఆగిపోయాయి.
నువ్విక్కడ ఆగి సేదతీరవచ్చు… తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు… అన్నట్టు స్వాగతిస్తున్నట్టు యెదురుగా కనిపించింది సురస్థానం. అందరితో కలిసి నేనూ.
లోపలకు అడుగు పెట్టాను. పగలే వెన్నెల. జగమే వూయల. కూర్చున్నానే గాని వూగుతున్నాను. గుర్రమెక్కాను.
గుర్రమెక్కాడని టీనేజ్ కుర్రాన్ని కొట్టి చంపేసిందీ గుర్తుకొచ్చింది. గుక్కెడు తాగి అప్పటికి చెరిపేశాను. గొంతులో మంట గుండెల్లో మంటని ఆర్పేసింది. గాల్లో తేలాను. నా చుట్టూ యిప్పుడు నక్షత్రాలు ప్రదక్షిణం చేస్తున్నాయి.
తలతిప్పి చూశాను. నవ్వుకున్నాను. నిజానికి యేడవాలి.
ఔను, దూరం పెట్టినవాళ్ళు కూడా దగ్గరగా వున్నారు. ఇంకా చెప్పాలంటే పక్కపక్కనే వున్నారు. అంటు లేదు. ముట్టు లేదు. ఎంగిలి సంగిలి అసలే లేదు. అడ్డు నామం నిలువు నామం తేడా లేదు. స్వమతం అన్యమతం తేడా అసలు లేదు. అందరూ సమానమే.
సమభావం. ఇది గదా వుండాల్సిన స్నేహభావం. ఎంత ప్రశాంతంగా వుందీ? అక్కడక్కడా అలజడులు లేవని కాదు, అంతకు మించిన ఆత్మీయతలని చూస్తున్నాను. అనుబంధాలు. ఏ బంధమూ లేని సంబంధాలు. అన్నా తమ్మీ అల్లుడూ మావా కాకా నానీ బాబాయ్… బాబోయ్ యెన్ని వావి వరుసలు? ఎంతెంత ప్రేమలు? నీకు నేనున్నా నువ్వు ఫికర్ పడకు… మాట చాలు మస్తు సపోర్ట్. అందరూ మనుషులవుతున్నారు… హృదయం పరుస్తున్నారు… యిక్కడ కదా దేవుడు తిరగాలి? అంతటా నిండిన దేవుడు యీ మనుషుల్లో మాత్రం లేడా? వున్నాడు. దేవుడు జీవుడ్ని అర్థం చేసుకుంటున్నాడు.
లోపల దాచుకున్న దుఃఖపు సముద్రాల్ని తోడేస్తున్నారు. ఉగ్గబట్టుకున్న కోపం కక్కేస్తున్నారు. లోపల వున్న ప్రేమనే కాదు, దేన్నీ బంధించడం లేదు. ఉగ్గబట్టుకోవడం అసలు లేదు. ఉక్కపోత లేనేలేదు. స్వచ్ఛత. పరిశుద్ధత. పవిత్రత. ప్రశాంతత. అన్నీ వొక దగ్గరే. సింగిల్ విండో.
నేనో నా జాతి జనులు వచ్చారని వెలేసినవాళ్ళూ నగ్నంగా వూరిగించినవాళ్ళూ కొట్టి చంపేవాళ్ళూ యిక్కడ యెవరూ లేరు. నే వచ్చి వెళ్ళానని అపవిత్రమైందని పంచద్రవ్యాలతో యెవరూ శుద్ధి చేయరు. తూలితే ఆసరా యిస్తున్నారు. పడితే లేపి నిలబెడుతున్నారు. నీ జేబు చిల్లు పడిందా, పోనీ నా జేబు నీది. నాదీ నీదీ అన్న తేడా లేదు.
తీరని దాహం. ఆరని తడి. లోపలా బైటా. ఇంతకంటే అపురూపం యేముంటుంది? తన్మయంలో నేను తానమాడుతున్నప్పుడు యింటి దగ్గర్నుంచి ఫోను వచ్చింది.
ఎక్కడున్నారు?
గుళ్ళో!
గుళ్ళోకెళ్తే కాసేపు అక్కడే కూర్చొని రావాలట.
ఆ… సేదతీరుతున్నాను.
ప్రమాదం లేదా?, అవమానించరు కదా?
నవ్వాను, హాయిగా. ధైర్యంగా. నేను పీల్చి వదిలిన వూపిరి గాలిని నాచుట్టూ వున్నవాళ్ళు పీల్చుతున్నారు. వాళ్ళు పీల్చి వదిలిన వూపిరి గాలిని నేను పీల్చుతున్నాను. ఎందుకో యెంగిలి అన్నవాళ్ళు వొక్కరూ లేరు.
ఆ గోలేమిటి?
ఉత్సవం.
దేవుడు?
నేనే!
అదేంటి?
మహిమాన్వితుడైన దేవుడు విశ్వవ్యాపితుడు. ప్రతి అణువులో వున్నాడు. నీలో నాలో ప్రతివొక్కరిలో వున్నాడు. ఎంచుకొని లేడు.
ఏమైంది మీకు?
దర్శనమైంది.
ఇంతకీ యెక్కడున్నారు మీరు?
చెప్పాను కదా, గుళ్ళో!



బజరా గారి కథ అంటేనే వేయి ఆలోచనల విస్పోటనం.నిగ్గు తేల్చిన నిజాల విశ్వరూపం..మండుతున్న కొలిమిలోంచి ఎగసిపడిన వ్యధాగ్నికణం.. క్లుప్తత..వ్యంగ్యం ..భావ తీవ్రత సేమ్మిపరకాయ కారమంతా ఘాటు.. అతని కథ పవిత్ర స్థలం.ఇక కొత్తగా చెప్పేదేముంది.అభినందనలు సర్.