“I admit that twice two makes four is an excellent thing, but if we are going to praise everything, then I say that twice two makes five is sometimes also a very charming little thing”.
– Fyodor Dostoevsky’s ‘Notes from Underground’
‘రెండురెళ్ళు ఐదయితే అది నాకు అందం’ అని చెప్పే కథలివి. తార్కికత, హేతుబద్ధత, నిశ్చిత నిర్ణయాలు, కొలత బద్దలకు అతీతంగా స్వేచ్ఛను తీసుకున్న కథలివి. జీవితమూ, ప్రపంచం పట్ల అవగాహనను నేల పైనుండీ ఒక అంగుళం పైకి లేపగలిగిన కథలివి.
ఈ కథలన్నింటినీ అచ్చమైన అస్తిత్వవాద కథలనీ, transcendental కథలనీ పిలవవచ్చునేమో. ఈ కథల్లో పాత్రలు, వాటి ప్రవర్తన, సంభాషణలు, వాటి భవితవ్యాలు మామూలు కథల్లో వాటికంటే భిన్నంగా అగుపిస్తున్నాయి. నీలిమేఘం ఆకుపచ్చని అడవితో మాట్లాడే భాష… ఎవరికీ కనిపించని వ్యక్తులతో సంభాషించే పాత్రలు… కొండలు, గుట్టలు చెప్పే మాటలు ఈ కథల్లో వినిపిస్తాయి. “చీకటిని బంతాడే సూర్యుడిలాగా, మరో ప్రపంచపు కలలాగా, స్వప్నాలకే స్వప్నంలాగా సంభాషించే” పాత్రలు, దేవుడు కలిగించే సుఖ దుఖాలకు ఎదురెళ్ళి అటకాయించిన పాత్రలు కనిపిస్తాయి.
బయటి వ్యక్తిగా పాఠకుడికి కనిపించే తనను “నా మరో నేను” అనుకొనే పాత్రలు…
‘ఏకాంతం అంటే ఏమిటి?
ఒకటితో అంతమయ్యేది.
రెండవది లేనిది. అదేమిటి?’ అని చింతించే పాత్రలు … సామాజిక సామూహిక అస్తిత్వంలో టోకుగా ఇమిడిపోతున్న మనిషిలో రెండవది లేనిదైన, తనదైన ‘నేను’ ని అన్వేషించే పాత్రలు..
కిందికి లాక్కుంటూ ఎగిరిపోతున్నట్లు భ్రాంతిని కలిగించే జీవితపు లోయ చెప్పిన చివరి రహస్యాన్ని కలగంటూ ఆ లోయలోని అవ్యక్త దివ్యత్వాన్ని చింతన చేసే పాత్రలు… ఇంకా ఇలాంటివే చాలా పాత్రలు ఈ పుస్తకంలో ఎదురవుతాయి.
అలాగే చాలా కథలు నాలోని ‘నేను’ ని పట్టించుకొన్నట్లు కనిపిస్తాయి. తనలోని తనను ‘పో’ అన్నవాడు ‘పోతన’ అని చెప్పినట్లు ఈ కథల్లోని పాత్రలు ఆ అన్వేషణలో ఉన్నట్లనిపిస్తాయి. తనలోని తనకు చెప్పుకొన్నట్లు సాగే రెండు కథలు ఇందులో కనిపిస్తాయి.
చాలా కథలు పూర్తిగా కవితలే. వాటి ముగింపులోంచీ మళ్ళీ ప్రారంభాలు మొదలవుతాయి. ముగింపునుండీ మొదటికి, మొదటినుండీ ముగింపుకీ ఒక చక్రీయ గమనంలో పాఠకుడు ప్రయాణిస్తాడనిపిస్తుంది. మొదటిసారి చదివినప్పటికంటే ఈ చక్ర గమనపు పఠనంలోనే సాక్షాత్కారం దర్శించినట్లు పాఠకుడు అనుభూతి చెందగలడు. చాలా కథలు ప్రచారంలో ఉన్న కథన, రచనా పద్ధతుల్ని నిరాకరించి స్వీయగమనంతో సాగుతాయి. మొదటి పఠనంలో అయోమయానికి గురి చేసిన ఈ కథలు మళ్ళీ మళ్ళీ ఇలా చదివాక వెంటాడే కథలుగా మనల్ని తరుముతూనే ఉంటాయి. టోకు సామాజిక, సామూహిక సమస్యల్ని దాటి, అసలైన అస్తిత్వపు లోతుల్లోకి సాగి ఇంతవరకు తరచి చూడని దాని ఆంతర కుహరాల్లోకి తీసుకువెళతాయి.
కొన్ని కథల్లో చిన్న సంఘటనా శకలాలుగానూ లేదా మరణ సన్నివేశంగానూ చెప్పబడిన ఘటనలు మొత్తం జీవితపు వైశాల్యాన్ని తాకి, మానవ అస్తిత్వ వేదనని అనుభవంలోకి తీసుకురావటం పాఠకుడికి విభ్రమ కలిగిస్తుంది. తెలుగు కథా సాహిత్యపు విస్తృతిని ఇంకా విశాలం చేస్తూ వస్తున్న ఈ కథల సంకలనం చాలా ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.
ఈ ప్రత్యేకత తీసుకొన్న వస్తువుల ఉనికికి సంబంధించిందా, చెప్పిన పద్ధతులకు చెందినదా అనేది అంత తేలిగ్గా చెప్పగలిగేది కాదు. ప్రతి కథలోనూ ఒక రహస్య స్వరం ఏవో కొన్ని అతీత అంశాలను చింతన చేస్తూ వినిపిస్తుంది. అదొక అభౌతిక స్వరం కూడా కావొచ్చు.
అందుకే ఇవి అపురూప చింతన కథలు. ఇందులోని చాలా కథలు అంతర్జాల పత్రిక ‘ఉదయిని’ కోసం కథకుడు బి.అజయ్ ప్రసాద్ ప్రత్యేకంగా ఏరి కూర్చిన కథలు. వీటిని ప్రచురించడానికి కుమార్ కూనపరాజు చేస్తున్న సాహిత్య కృషి తెలుగు కథా సాహిత్యంలో కొత్త వంగడాలను సృష్టిస్తుందని నమ్మకంగా చెప్పొచ్చు.
కాకుమాని శ్రీనివాసరావు
డా.కాకుమాని శ్రీనివాసరావు గారి స్వగ్రామం ప్రకాశం జిల్లా (నెల్లూరు), ఉలవపాడు. శ్రీ కాకుమాని శ్రీరాములు, సుదర్శనమ్మలకు ఫిబ్రవరి 5, 1972 న కందుకూరులో జన్మించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు. చలం రచనల్లో కళాంశాలు, ఈస్థటిక్స్ పై వీరి పరిశోధన సాగింది. కథా సాహిత్య విమర్శ , కళాతత్త్వశాస్త్రానికి చెందిన వీరి వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇటీవలే వీరి కథా సాహిత్య విమర్శ వ్యాస సంపుటి 'వివృత' వెలువరించబడింది. వృత్తిరీత్యా ఆంధ్రోపన్యాసకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమవరంలో పని చేస్తున్నారు. తెలుగు కథను నిశితంగా పరిశీలిస్తున్న విమర్శకుడిగా గుర్తింపు పొందారు.