ఫ్రెండొకడు ముప్పై ఏళ్ళు దాటాక నానాతిప్పలు పడి ఒక సంబంధం వెతికి పట్టుకుని అమ్మాయి మెళ్ళో ఎట్టకేలకు తాళి కట్టగలిగాడు. జీవితంలో ఇంతకుమించి సాధించదగిన ఘనకార్యమేదీ లేదని కూడా నిర్ధారించేసుకున్నాడు.
అయితే ఆ ఫ్రెండ్ కర్మేకాలిందో, ఆ అమ్మాయి జాతకం మహాద్భుతంగా ఉందో తెలియదు కానీ, ఫస్ట్‌నైట్ నాడే పెళ్ళి పెటాకులైపోయింది.
ఇంతటి మొరటు మొగుడు తనకొద్దంటూ ఆ కొత్త పెళ్ళికూతురు తల్లితో చెప్పుకుంది. విడాకులు మినహా మరింకే రాజీ యత్నాలు పొసగవని తేల్చి చెప్పేసింది. ఇలా మావాడి పెళ్ళికథ ఫస్ట్‌నైట్ ముగియకముందే తెల్లారిపోయి కంచికి చేరుకుంది.
ఇంతకీ ఆ మిత్రుడు అంతటి మొరటుదనం ఏం ప్రదర్శించాడన్నది అసలు ప్రశ్న. నాతో ఉన్న చనువుకొద్దీ ఆ చిక్కుముడినీ అతగాడే ఓపిగ్గా విప్పి చెప్పాడు.
ఈ ఓపికేదో చీర చిక్కుముడిని విప్పేటపుడు చూపి ఉంటే, నీకీ దుర్గతి తప్పేది కదా? అని నేను హితవాక్యాలూ పలికాను. ఇప్పుడు ఏం చెప్పుకున్నా ప్రయోజనం ఏమిటి?
ఫస్ట్‌నైట్‌న వెయ్యి కళ్ళతో, లక్ష కోరికలతో కాచుక్కూచున్న మిత్రుడు, ఆవేశంలో కాస్తంత ఆరాటంగా చీర కుచ్చెళ్ళు తప్పించబోతే… ఆ పెళ్ళికూతురు అతి జాగ్రత్తగా కట్టుదిట్టాలతో పెట్టుకున్న పిన్నీసు ఓపెన్ అయి చీరకు పట్టుకుని అది చిరిగిందట.
ఊహించని ఈ ఉపద్రవంతో సెంటిమెంట్ హర్ట్ అయిన పెళ్ళికూతురు తోకతొక్కిన తాచులా చటుక్కున మంచం మీదనుంచి ఒక్క అంగలో దూకి తలుపు తీసుకుని శోభనం గదినుంచి బయటపడిందట. క్షణాల్లో జరిగిన ఈ విపరిణామంతో మిత్రుడు ఉక్కిరిబిక్కిరై, మెదడు మొద్దు బారిపోయి వెర్రిచూపులు చూస్తూ అలాగే తెల్లార్లూ ఉండిపోయాట్ట.
ఇలా కొత్తజంట తొలిరాత్రి మర్నాడే విడాకులు తీసుకుని, పెళ్ళి జంజాటం నుంచి విముక్తి పొందారు. ఆ తర్వాత ఈ విషాద స్మృతిని మెదడులో నుంచి చెరిపేసుకుని మరో పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో స్థిరపడ్డాడు మిత్రుడు.
కానీ నేను మాత్రం మా మిత్రుడి మొరటుదనాన్ని, తత్కారణంగా అతనికి ఎదురైన చేదు ఫలితాన్ని మరవలేకపోతున్నాను. ఏ పుస్తకావిష్కరణ కార్యక్రమానికో వెళితే మిత్రుడి పిన్నీసోపాఖ్యానం చటుక్కున బుర్రలో మెరుస్తోంది. స్వయంగా ఆ ప్రోగ్రామ్‌కు వెళ్ళకపోయినా, ఏ టీవీలోనో, యూట్యూబ్‌లోనో ఆవిష్కరణ వార్త కంటపడినా, అవే జ్ఞాపకాలు బుర్రని బద్దలు చేసేస్తున్నాయి.
మీ వాడి విషాదయోగానికీ, పుస్తకావిష్కరణ ప్రోగ్రామ్‌కి లింకేమిటి మహాశయా? అనే ధర్మసందేహం మీకు రావటంలో అధర్మమేమీలేదు.
ఆ సంగతికే వస్తున్నాను. పుస్తకం ఏదైనా, దాన్ని ఆవిష్కరించటానికి ఒక ప్రముఖుడిని ముఖ్య అతిథిగా పిలుస్తారు. రచయితతోపాటు సభా నిర్వహణకు ఒక అధ్యక్షుడిని, పుస్తక పరిచయానికి ఒక సమీక్షకుడిని, ఒకరిద్దరు సాహితీ ప్రముఖులను రారమ్మంటారు. వెరశి సభావేదికపై అయిదారుగురికి తగ్గకుండా కూచుని ఉంటారు. అతిథులను వేదికపై ఆహ్వానించేందుకు ఒకరు, వందన సమర్పణ చేయటానికి మరొకరు అదనం. సభాధ్యక్షుడు ఉన్నా ఆయనను డమ్మీ చేసి కూర్చోబెట్టి సభను ఆసాంతం నడిపే సభా సమ్రాట్టులూ ఉంటారు. సరేపోనిండి, పుస్తకం రాసిన ఆ సారు ముచ్చటను మనం ఎందుకు కాదనాలి.
ఆవిష్కరించబోయే పుస్తకం కాపీలను కొన్నింటిని కలిపి అందమైన రేపర్‌లో చుట్టి ఆపైన రిబ్బన్‌తో బిగిస్తారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ముఖ్యఅతిథి తానొక్కడే ఆ పుస్తకాల బరువును మోయడం అసాధ్యం. అందులో ఏ పదో పన్నెండో పుస్తకాలు ఉంచి ప్యాక్ చేస్తారు. ఒక చేత్తో బరువును మోస్తూ మరో చేత్తో ప్యాకెట్‌ను తెరవడం అంత సులువైన విన్యాసం కాదు. ముఖ్య అతిథి ఇబ్బందిని తెలిసినవాడై రచయితే స్వయంగా ప్యాకెట్‌ను మోస్తుండగా ఆవిష్కర్త రిబ్బనుముడిని లాగుతారు. ఆ ముడి సున్నితంగా విడివడటం నేనింతవరకూ ఏ సభలోనూ చూడలేదు. ఎట్టకేలకు రిబ్బనుముడి విప్పి, రేపర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తే ఒక పట్టాన అది ఊడిరాదు. ప్యాక్ చేసిన మహానుభావుడెవరో గానీ అతి జాగ్రత్తకుపోయి నాలుగు పక్కలా పకడ్బందీగా గమ్‌టేపులతో గట్టిగా బందోబస్తు చేస్తాడు. ఆ గమ్‌టేప్ మొదలు, తుది కనిపెట్టడం సామాన్యం కాదు. ప్రయత్నాలన్నీ ఫెయిలై ఇక సభా మర్యాదను కాలరాసి రేపర్‌తో నేరుగా కుస్తీ పోటీకి దిగి దాన్ని లాగి పీకి పక్కన పెట్టేసి, ఎవరెస్టు ఎక్కినంత విజయగర్వాన్ని ఫీలవుతాడు.
ఇంత కష్టపడి తవ్వితీసిన పుస్తకాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఉద్యుక్తుడవుతాడు చీఫ్ గెస్ట్.
అతడి ఉత్సాహాన్ని ఈవెంట్ కవరేజికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు నీరు కార్చేస్తారు. వేదిక మీదున్నవారందరికీ తలో కాపీ పంచేవరకూ ఫ్లాష్‌లు వెలగవు. కొందరు ఫోటోగ్రాఫర్లు మరో అడుగు ముందుకువేసి చీఫ్‌గెస్ట్‌కు ఈ మేరకు ఆదేశాలు ఇస్తుంటారు.
వేదిక మీదున్న ప్రతిఒక్కరి చేతిలో పుస్తకం ఉంటే, అసలు ఆవిష్కర్తను గుర్తించడం ఎలా? అనే సందేహాన్ని, అసంతృప్తిని సినారె చాలాసార్లు బాహటంగానే వ్యక్తపరిచేవారు. కానీ అంతటి పెద్దాయన అభిమతాన్ని సైతం ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక మనబోంట్లమాటేం చెల్లుబడి అవుతుంది చెప్పండి.
ఒక ట్రేలో పుస్తకాన్ని ఉంచి దాన్ని అప్పుడు దొరికే పూలరేకులతో కప్పి చీఫ్‌గెస్ట్ గారి ముందుపెడితే, ఆయన సుతారంగా ఆ రేకులను ఒంటిచేత్తో పక్కకు తొలగించి, పూలరేకుల మధ్యనుంచి పుస్తకాన్ని వెలికితీస్తే ఆ దృశ్యం ఎంత బావుంటుంది?
ఈ ‘అరాచక’ పర్వం అంతటితో ముగిసిపోయిందనుకోవడం పొరబాటు. ఆవిష్కరణ తర్వాత ఎవరు ఏ వరసలో ప్రసంగించాలో నిర్వాహకులు నిర్ణయించుకుని, ఆ పేర్ల జాబితను అధ్యక్షుల వారి చేతికిస్తారు. ఆ ప్రకారమే వక్తను పిలవబోతుంటే ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు అడ్డు తగులుతారు. తమకు మరో కార్యక్రమం ఉందనీ, చీఫ్‌గెస్ట్‌తో ముందు మాట్లాడిస్తే తమ దుకాణం ముగించుకు వెళ్తామని కమాండ్ జారీ చేస్తారు. చీఫ్‌గెస్ట్ చేత చివరలో మాట్లాడిస్తే, ఆయన ప్రసంగం కోసం అందరూ వేచి వుంటారు అని నిర్వాహకులు ఆరాటపడతారు. కానీ ఆ ప్రయత్నం సాఫీగా సాగనివ్వరు.
పైగా చీఫ్‌గెస్ట్ గారు పని ఒత్తిడిలో ఉండి ఆ పుస్తకం కనీసం తిరగేసి ఉండరు. ఆ రచయిత గురించీ వారి రచనా పాటవం గురించీ తెలిసే అవకాశమూ తక్కువ. ఇలాంటపుడు చివరగా మాట్లాడితే తనేమి మాట్లాడవచ్చో ప్రిపేర్ కావటానికి చీఫ్‌గెస్ట్ కు వీలవుతుంది.
ముందు మాట్లాడిన వారి ప్రసంగాల్లో నుంచి పాయింటు అందుకుని అల్లుకుపోవచ్చు. కానీ పాపం చీఫ్‌గెస్ట్‌కు ఆ వెసులుబాటూ దొరక్కుండా చేస్తారు.
రొటీన్‌కు భిన్నంగా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న యంగ్‌రైటర్స్ లేకపోలేదు. మంత్రులను, ప్రముఖులను పక్కనపెట్టేసి, స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆహ్లాద వాతావరణంలో వినూత్నంగా సభలు జరుపుతున్నారు. రచయితలంతా తమ ఆలోచనలకు పదునుపెడితే మహా బేషుగ్గా సభలు జరుపుకోవచ్చు.
ఇకముందైనా ఆవిష్కరణ సభల సందర్భంగా, మా ఫ్రెండ్ మొరటుదనం గుర్తుకురాకుండా చూడాల్సిన సామాజిక, నైతిక బాధ్యత మాత్రం మీదేనండి బాబూ!





