పాలస్తీనా విధ్వంస చిత్రణ – లెమెన్ ట్రీ

Spread the love

యుద్దాలు దేశాల మధ్య జరుగుతాయి
అధినేతలు సవాళ్లు విసురుకుంటారు
ఐక్యరాజ్య సమితి కళ్లుమూసుకుంటుంది
అగ్ర రాజ్యాలు ఆయుధాలు అమ్ముకొని, సైనిక ఒప్పందాలు చేసుకుంటాయి
పోరాటం సైనికులు చేస్తారు… రెండుదేశాలలోని పౌరులు ఆస్తులూ, ప్రాణాలూ, మానాలు పోగొట్టుకుంటారు… నిజమే యుద్దంలో ఏ దేశం గెలిచిన ఓడేది మాత్రం రెండు దేశాలలోని పౌరులు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు.

ఆమె పేరు సల్మా, రమాలత్ పట్టణం సమీపంలో ఆమె ఇళ్లు, ఆ ఇంటిని ఆనుకొని ఒక నిమ్మతోట. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. నాన్న ఇచ్చిన ఆస్తి, ఆమె ఇప్పటి జీవనాధారం ఆ నిమ్మతోటే. వచ్చిన సమస్యల్లా ఆ నిమ్మతోట సరిహద్దుగా మారటం. ఆమె నిమ్మతోటకి అవతలి పక్కకు కొత్తగా ఒక అథిథి వస్తాడు. మామూలు అతిథి కాదు ఇజ్రాయెల్ దేశపు రక్షణ మంత్రి. అతను వచ్చీ రావటంతోనే నిమ్మతోటకి ప్రమాదం వచ్చిపడుతుంది. తిరుగుబాటుదారులు దాడులు చేయటానికి ఆ తోట అనుకూలంగా ఉంది కాబట్టి. ఆ చెట్లన్నీ నరికివేసి ఆ ప్రాంతాన్ని చదును చేయాలనుకున్న ఇజ్రాయెల్ సైనికాధికారులు సల్మాకి విషయం తెలియజేస్తూ నోటీసులు పంపుతారు. ఆ తోటని నిర్మూలిస్తున్నందుకు గానూ ఆమెకు దయతో నష్టపరిహారాన్ని కూడా ఇస్తున్నామంటూ వచ్చిన లేఖని చూసిన సల్మా నివ్వెరపోతుంది. దేశాలని కాపాడాలనుకునే మనుషుల రక్షణకోసం చెట్లని నరికివేయటం ఆమెని కలవరపరుస్తుంది.
ఆ లెమన్ ట్రీ ఫార్మ్ కేవల తోటకాదు. ఆమె తండ్రి ఙ్ఞాపకం, ఆమె బాల్యం, ఏ దేశాలకీ సంబంధం లేని ఆమె జీవితం. అందుకే ఎవ్వరు చెప్పినా వినకుండా ఎదురుతిరగాలని నిశ్చయించుకుంటుంది. కానీ భర్తలేని ఒంటరి స్త్రీ ఒక దేశాన్ని ఎదిరించగలదా? అమెరికాలో వంటవాడిగా పని చేస్తున్న కొడుకు “ఆ గొడవలు మనకెందుకు? ఆ నష్టపరిహారం తీసుకొని నాదగ్గరికి వచ్చేయ్ అంటాడు.” రమల్లాలో ఉన్న కూతురు “నాకేం తోచటం లేదు, కానీ మనం వాళ్లని ఎదిరించలేం” అంటుంది. సల్మా ఒంటరిగానే తన భూమిని కాపాడుకోవటానికి నిశ్చయించుకుంటుంది. ఒక కుర్ర లాయర్‌ జైదీ కోర్టుకు వెళ్తుంది. కానీ సైనికాధికారుల మాటే నెగ్గుతుంది. కోర్టు ఆమె వాదనని పట్టించుకోదు. పైగా ఆమెనే కాదు ఎవరినీ ఆతోటలోపలికి వెళ్లకుండా ఫెన్సింగ్ వేయాలని ఆదేశిస్తుంది. దాంతో సుప్రీం కోర్టు మెట్లెక్కుతుంది. ఆ క్రమంలో ఆమె తరపున కేసు వాదిస్తున్నలాయర్ జైదీతో దగ్గరితనం ఏర్పడుతుంది. ఆమెకన్నా పదేళ్ల చిన్నవాడైనా అతనితో సాన్నిహిత్యం పెరుగుతుంది.

ఒకనాడు నీల్లు లేక ఎండిపోతున్న నిమ్మచెట్లు, రాలిపోతున్న కాయలని చూసి మనసాగక, కలవరపడుతూ తోటకి నీళ్లు పెట్టడానికి ఆ కంచెని దాటుతుంది. వాడిపోతున్న ఒక్కొక్క నిమ్మచెట్టు ఆమె గుండెలని మెలిపెడుతున్నటుగా, ఆమె జీవితంలోని ఒక్కొక్కరోజూ దుఃఖంతో నిండిపోతున్నట్టుగా అనిపిస్తుంది సల్మాకి.
సుప్రీం కోర్టులోనూ ఇజ్రాయెల్ ప్రభుత్వం తన వాదనలతో వాదనలతో నిలబడుతుంది. కేసు అంతర్జాతీయ పత్రికలకి ఎక్కుతుంది. అయితే ఆమెని జైదీ భార్యగా, వాళ్లిద్దరిమధ్యా సంబంధం ఉన్నట్టుగా వచ్చిన వార్తలు మానసికంగా కుంగదీస్తాయి. అయితే తన ఇంటిలోంచి ఇదంతా గమనిస్తున్న రక్షణమంత్రి భార్య మీరాకి సల్మా బాధ అర్థమవుతుంది. ఆమెని కలిసి ఓదారుస్తుంది. ఆ తోటని కాపాడలేవా? అని భర్తను నిలదీస్తుంది. కానీ తన రక్షణకోసం పాటుపడే సైనికాధికారులనే సమర్థించి ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటాడతను. “ఈ సమస్యకు పరిష్కారం లేదా?” అని ఆమె అడిగిన ప్రశ్నకు 3000 ఏళ్లుగా దీనికి సమాధానం దొరకలేదు. అని అతను చెప్పే సమాధానం. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య పారే రక్తపుటేరులని మళ్లీ ఒకసారి కళ్లముందుంచుతుంది.

సుప్రీమ్ కోర్ట్‌లో జెనీవా ఒప్పందంలోని అంశాలని గుర్తు చేస్తూ, సాధారణ పౌరులని, వారి ఆస్తులని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందంటూ జైదీ చేసిన వాదనని కోర్టు తిరస్కరిస్తుంది. ఇది దేశ సమగ్రతకూ, రక్షణకూ సంబంధించిన విషయమని అతని వాదనలని తోసి పుచ్చుతుంది. అంతర్జతీయ పత్రికలకెక్కినా… పాలస్తీనా గొడవనే పట్టించుకోని దేశాలు ఆ కొన్ని నిమ్మచెట్లగురించి ఏం పట్టించుకుంటాయి? ఒక్క చెట్టుకూడా లేకుండా నరికేస్తారు, సల్మా ఆస్తి, ఆమెకి భూమితో ఉన్న అనుబంధం సర్వనాశనం అయిపోతుంది. శిథిలమవుతున్న పాలస్తీనాకి నమూనాగా మిగిలిన ఆ తోటలోలోంచి సల్మా వెళ్లిపోతుంది. అట్లా సినిమా ముగుస్తుంది.

అయితే ఇది కేవలం సినిమా కాదు… ఇది నిజంగా జరిగిన సంఘటన, లెమన్ ట్రీ ఫార్మ్‌ని సమూలంగా నిరూలించిన వార్తని చూసి ఈ కథ రాసుకున్నాడు. దర్శకుడు ఎరాన్ రిక్లిస్. 2008లో వచ్చిన ఈ సినిమాని ఇజ్రాయేల్ తిరస్కరించినా. పశ్చిమదేశాలలో మాత్రం మంచి ఆదరణ పొందింది. బెర్లిన్ ఫిలిం ఫెస్ట్‌లో అవార్డ్, ఆసియా ఫసిఫిక్ స్క్రీన్ సహా ఎన్నో అవార్డులని అందుకుంది. ఉత్తమ నటి, ఉత్తమ ఆర్ట్ డిరెక్ష, ఉత్తమ ఎడిటింగ్, సంగీతం ఇలా ఈ సినిమాని స్పెషల్ ఆర్ట్ పీస్‌గా నిలబెట్టాయి. సల్మాగా నటించిన హెయాం అబ్బాస్‌కి ప్రశంసలు దక్కాయి. సిన్మాని చూస్తున్నంత సేపూ సినిమాటోగ్రఫీ, ఫ్రేమ్‌సెన్స్‌ని మెచ్చుకోకుండా ఉండలేం. లెమన్ ట్రీ ఫార్మ్ సెట్టింగ్ అంటే నమ్మలేం. నిరంతరం ఆక్షలతో, ఎన్నో నిబంధనల మధ్య శరణార్థి శిభరాలలో, నిజమైన కోర్టుల్లో ఈ షూటింగ్ చేసారంటే ఆశ్చర్యపోకుండా ఉందలేం. అన్నిటికన్నా ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండానే ఏవరికైనా అర్థమయ్యేలా నటించిన నటీనటుల ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం. సినిమా అమేజాన్‌లో ఉన్నా మనదేశంలో చూడలేం. యూట్యూబ్‌లో ఒక వెర్షన్ అందుబాటులో ఉంది.

ఈ సినిమా దర్శకుడు ఎరాన్ రిక్లిస్ 1973 ఇజ్రాయెల్-అరబ్ యుద్ధంలో సైనికుడిగా పనిచేశాడు. ఆ తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా నిర్మాతగా, దర్శకుడిగా మారాడు. ఇజ్రాయేల్, పాలస్తీనాల మధ్య శాంతిని కోరుకుంటూ రెండు దేశాల నటులనీ తన సినిమాల్లోకి తీసుకున్నాడు. లెమంట్రీ సినిమాతో పాటు డాన్సింగ్ అరబ్స్, సిరియన్ బ్రైడ్ (ఈ సినిమాకి గానూ స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ ఫ్రిదా పింటోని హీరోయిన్‌గా తీసుకున్నాడు) , త్రీ మదర్స్, షెల్టర్ లాంటి మరికొన్ని సినిమాలకి నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించాడు. దాదాపుగా ప్రతీసినిమా మనలోని ఎమోషన్స్‌ని తాకుతూనే అంతర్జాతీయ నేరాలూ, వివక్షల మీద, దేశాల యుద్ద రాజకీయాలమీదా ప్రశ్నలని లేవనెత్తుతూనే ఉంటాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *