మైనొద్దీన్ బ్రాస్ బ్యాండ్

ఊళ్లె ఎక్కడన్నా పెండ్లైతుందంటే అక్కడ మొట్ట మొదట్ల తాషా సప్పుడు ఇనవడేటిది. ‘‘డిప్పిరి…డిప్పిరి..డిర్ర్రిడిప్పిడి’’ అనుకుంటా తాష మోగంగనే. మెల్లగా పి..ప్పీ..పీ.. అని కర్ర సవరిచ్చుకోని పాట మొదలువెట్టెటోడు మైనోద్దీన్ మామ. సన్నగా, నల్లగా అయిదున్నర అడుగులుండే మైనొద్దీన్ మా ఊరి మొదటి బ్యాండ్ మేళగాడు. మంగలిపల్లె, పెద్దంపేట ఊళ్ళల్ల పెండ్లయితే మైనొద్దీన్ బ్యాండు. సావైతే మాదిగోళ్ళ డప్పులు నడిశేటియి.

ఒక పెద్ద డ్రమ్ము, ఒక తాష, ఒక కర్ర (క్లారినెట్) ఇదే మొదటి బ్యాండు మేళం బ్యాచ్చి. మైనోద్దీన్ అచ్చిండు అంటే మొట్టమొదలు పాట “క్యా ఖూబ్ లగితే హో” తోని మొదలు వెట్టెటోడు. అదయ్యాక ఇంకో రెండు ఇందీ పాటల్ నడుస్తయ్. అంటే ఆ మూడు నాలుగు పాటలే మళ్ళ మళ్ళ నడిశేటియి. నారాయణ సావుకారి దుక్నం కాన్నుంచి కుడి బాజు సందులకెళ్ళి పోయ్యి కరంటు సీనన్న ఇంటికాడ, గౌతం బడి ఎదురుగ్గ ఉండేది మైనోద్దీన్ మామ ఇల్లు. ఒక యాపచెట్టు, దానిమీద ఎగిరే ఆకుపచ్చజెండా, ఆకుపచ్చటి తలుపుల ఇల్లు.

కరంటు సీనన్న ఇంట్లనే పిండి గిర్ని ఉండేటిది. గిర్నిల పిండి పట్టిచ్చుకరానువోతే. ఆ యాపచెట్టు కింద తెల్లంగీ, ఆకుపచ్చ లుంగీ కట్టుకోని, కర్రవట్టుకోని కొత్తపాటలు నేర్సుకుంట కనవడెటోడు మైనొద్దీన్. ఎప్పుడన్న ఒకసారి తాష రిపేర్ చేసుకుంట కూసునేటోడు. సీనన్నోళ్ళ ఇంటికాడ పిండి కోసం పట్టుకపోయిన బియ్యమో, గోదుమలో ఇచ్చి, ఆళ్ళు పిండివట్టెదాక మైనొద్దీన్ మామ ఇంటిదిక్కు పొయొస్తుండే. “ఏం అల్లుడా, ఏం జేస్తుండ్రా మీ బాపు” అని నవ్వుకుంట పల్కరిచ్చి మల్ల ఆయినె పనిల ఆయినె ఉండెటోడు. ఆయినె కర్ర వాయించుకుంట ఉంటే పక్కపొంటి ఉన్న తాషమీద కట్టెతోని ఒక్క దెబ్బ కొట్టాలని ఉంటుండె గానీ, ఆయినె కోపానికత్తడని ఎప్పుడు ముట్టకపోతుండే.

ఎక్కడన్న పెండ్లి అయితున్నదంటే ఉరికి పోయ్యి మైనొద్దీన్ ఎప్పుడు కర్ర సవరిచ్చుకోని. పి..ప్పీ..పీ.. అంటడా అని చూశెటోళ్ళం మా పోరలందరం. అట్లట్ల కొన్నెండ్లకు మైనొద్దీన్ దగ్గర కొందరు ఊళ్ళె పోరలు జమైండ్లు. మాదిగ వాడనుంచి ఓ నలుగురు. ఊళ్ళె నాన్ సింగరేణి బీసీ ఇండ్లల్లనుంచి ఇంకొందరు మైనొద్దీన్ దగ్గర షరీఖ్ అయి బ్యాండు గొట్టుడు నేర్సుకున్నరు.

వాళ్ళందరికీ మైనొద్దీన్ గురువు. పెండ్లిల్ల సీజన్ అచ్చెటాళ్ళకు కొత్త సీన్మ పాటలు ఇనుడు, అవ్విట్ని ప్రాక్టీస్ చేసుడు మొదలైంది. ఆళ్ళు నేర్సుకుంట ‘‘డిరిడి.. డిరిడిప్, డిడ్డిరి డిడ్డిరి డిరిడిప్..’’ అని మొదలు వెట్టంగనే ఆ సప్పుడు మా వాడదాక ఇనిపిచ్చేటిది. మొదట్ల కొద్దిరోజులు రంజాన్ అస్తే ఆళ్ళ బిడ్డ షమీమ, టిఫిన్ డబ్బల సేమ్య వట్టుకస్తుండే, అట్లనే ఇటు ఎల్లరెడ్డి పటేల్ ఇంటిదిక్కు ఉన్న గఫార్ మామ ఇంటినుంచి ఆళ్ళ బిడ్డ సాహ్జిదక్కనో, జహీరో ఇంకో డబ్బ తెస్తుండ్రి. ఎందుకో తెల్వదు గానీ, నేను పదో తర్గతికి వచ్చేనాటికి ఈ రాకలు ఆగిపోయినయ్. అయితే గఫ్ఫార్ మామోళ్ళు తుర్కోళ్ళు అయితే, మైనొద్దీన్ మామోళ్ళు దూదేకులోళ్ళు.

ఒక్కొక్కలు షరీఖ్ అయితుంటే బ్యండ్‌లకు కొత్త కొత్త పీకలు, డప్పులు డ్రమ్ములు అచ్చి చేరినయ్. మైనొద్దీన్ మామ ఎప్పుడూ వాయించే ‘‘క్యా ఖూబ్ లగ్తే హో’’ అనే పాట కాకుండా “యమా రంజు మీద ఉంది పుంజూ.. టిట్టిరిటీ” ‘‘బంగారి కోడి పెట్ట అచ్చెనండీ.., గువ్వా గోరింకతో…’’ అసోంటి తెలుగు పాటలు ఇనవడుడు మొదలైంది. మామ ఇంటిముందు ‘మైనొద్దీన్ బ్రాస్ బ్యాండ్’ అనే బోర్డ్ కూడా అచ్చింది. మెల్లమెల్లగా సంపాదన వెరిగింది. ఇళ్ళు కొంచం పెద్దగనే కట్టిచ్చుకున్నడు. ఆయినె దగ్గర చేరిన పోరలంతా అన్న, బాపు అనే పిల్శేటోళ్ళు. సహజంగానే దప్పుకొట్టే అల్వాటున్న మాదిగవాడ పొలగాండ్లు కూడా మైనొద్దీన్ దగ్గర షరీఖైండ్లు. ఒక్కొక్కడూ అద్బుతమైన కళాకారుడేగానీ. ఆళ్ళని పట్టిచ్చుకున్నదెవ్వడు?

అట్ల మైనొద్దీన్ దగ్గర చేరినోళ్ళల్ల సాకలోళ్ళఎంకటేశం కూడా ఉంటుండే. సాకలి ఆశాలు నడిపికొడుకు ఎంకటేష్ తాష కొడుతుండు అంటే, పెండ్లి బారాత్‌ల ఎగిరెటోనికి కాళ్ళు నొయ్యాలే తప్ప కొట్టుడు ఆగకపోయేది. ఆశాలు పెద్దబాపుది బాయిపనే అయినా పెద్దకొడుకు శంకరన్న కొద్దిగా సదువుకొని గౌతమి బడిల టీచర్ పని చేస్తుండే. రెండో కొడుకు ఎంకటేశం, తర్వాత సమ్మయ్య, సతీషు చిన్నోళ్ళిద్దరూ. ఒకలు STD బూత్ నడిపితే, ఇంకొకలు ఆటో నడుపుతుండే. అయితే ఈ కథ జరిగేటప్పటికి ఆళ్ళు చిన్నపోరలే. మెళ్ళమెల్లగా మైనొద్దీన్ బ్రాస్ బ్యాండ్‌ల ముఖ్యమైన శిశ్యుడైండు సాకలోళ్ల ఎంకటేషన్న. ఎట్ల విద్య పట్టువడ్డదో గానీ, అప్పటిదాకా విమల్ గుట్క నవులుకుంట ఆడీడ తిరిగే రాజేశం ఒక్కసారి మంగళిపల్లెల స్టార్ అయ్యిండు. మైనొద్దీన్ మామకు దగ్గరి దగ్గరి సుట్టరికపు తుర్కపోరలకన్నా, మాదిగవాడ పోరలకన్నా, వెంకటేశం ఆ బ్యాచ్చిల మంచి షాన్‌తేలిండు. ఒక్క మంగలిపల్లెల్నే కాకుంటా పెద్దంపేట, సింగిరెడ్డిపల్లె, చందనాపూర్ దాకా పోయొస్తుండ్రి.

*** *** ***

అయ్యాల మా ఔసులోళ్ళ ముర్లిమామ చిన్న చెల్లె సునీత పెండ్లి. మా ఎదురున ఇల్లే కావట్కి ఇంటిముంగట పందిరేశిండ్లు, మొత్తం కలర్ కలర్ కాయిదాలతోని, జాలార్లతోని మస్త్ చమ్‌కాయిస్తుంది మా ఇంటిముంగట. అయితే మాకు ఇవ్వన్ని ఏడ కండ్లగాన్తయ్. బ్యాండోళ్ళు ఎప్పుడస్తరా అని సూస్తున్నం. ముందుగాల ఎంకటేషన్ననే అచ్చిండు. ‘‘డిప్ప్..డిప్పిరీ..డిప్పిరి, డిప్పిరి’’ అని సప్పుడు గాంగనే బయిటికి ఉరికచ్చిన. అప్పటిదాకా ఇద్దరుముగ్గురే ఉండే మైనొద్దీన్ బ్యాండ్‌ల కొత్త కొత్త పీకలు, డప్పులు కనవడ్డయ్. తాషకొట్టేటోళ్ళు ఇద్దరు, పెద్ద డ్రమ్ములోళ్ళు ఇద్దరు. ఇంకో నలుగురైదుగురు కనవడ్డరు. ఇగ మా సంబురం మొదలైంది. అయితే ఈసారి మాత్రం మైనొద్దీన్ మామ రాలేదు. కర్రవాయించెటోళ్ళు వేరేటోళ్ళు ఇద్దరు కనవడ్డరు. కూరాళ్ళు వట్టుడు, పాలపొర్క ఏసుడు, ఎదురుకోళ్ళకు పొయ్యి పెండ్లిపిలగాన్ని తీస్కచ్చుడు… ఇట్ల బ్యాండోళ్ళు ఎటువోతే అటే తిరిగినం. ఎంకటేషన్న “అరే తమ్మీ, బ్యాండు గొడ్తావ్రా” అని నవ్వుకుంట యమజోర్ మీద తాషకొడుతుంటే నేను కూడా పెద్దగైనంక మైనొద్దీన్ బ్రాస్ బ్యాండ్‌ల షరీకై ఇట్లనే బ్యాండు కొట్టాలే అనుకున్న. అయితే ఈ ఎంకటేషన్నన్న లెక్క కాకుంటా మైనొద్దీన్ మామ లెక్క నేను గూడ కర్రవట్టుకొని ముంగట నడువాలే అనుకున్న, అట్ల నడుస్తున్నట్టు ఊహించుకున్న. ‘‘అబ్బర బిడ్డ అసల్ నేను కర్రవాయిస్తుంటే మా నాన ఎంత సంబురంగా చూస్తడో’’. అంతే కాదు అచ్చేనెల కిట్టక్క పెండ్లికి మా ఇంటిగ్గూడ అత్తరు కదా. అప్పుడు నానతోని చెప్పిచ్చి నేనే బ్యాండు గొడ్త.

అట్ల పెండ్లి అయ్యెదాక ఆళ్లతోనే తిర్గినం. పెడ్లి అయినంక శింతశెట్టుకింద జేరిండ్లు బ్యాండోళ్ళందరు. పెండ్లిపిల్ల, పిలగాడు లోపట తయారైతుండ్లు. బారాత్ మొదలుగానీకి ఇంకొద్దిగ టైముంది. అప్పుడు పరాష్కాలాడుకుంట ‘‘ఇట్ల గొట్టురా..అంటే అట్లగాదు ఇదిగొట్టు’’ అనుకుంట, చాలెంజిలిసురుకుంటా… కొత్త కొత్త ష్టయిల్లల్ల తాషకొడుతూ. పెండ్లికచ్చిన సుట్టపోళ్ళ ఆడివిల్లలముంగట ఫోజులు గొడుతుండ్లు ఎంకటేషన్నోళ్ళు. ఇగ ఆ సప్పుడుకు వశంగాక ఇంట్లకెళ్లి బయటికచ్చిన కిట్టక్క “అన్నా! ఏం లొల్లే జరంత ఆగరాదుండ్లి, మీ లొల్లి పాడుగాను, మనసునవట్టకుంట ఏందిది.” అని గద్రాయించింది.

నోట్లె గుట్క తుప్పన ఊంచి “అరేయ్, మా శెల్లె కోపానికత్తుంది ఆగుండ్లిరా.’’ అని మల్ల అక్కదిక్కు తిరిగి. ‘‘నేను బ్యాండు గొట్టకుంటనే అత్తగారింటికి పోతావానే పొల్ల, నీ పెండ్లికి ఇంకా లొల్లి జేస్తం. అప్పుడేమంటవో నేంజూడనా.” అని నవ్విండు. అక్క కొద్దిగ శిగ్గువడుకుంట, నవ్వుకుంట ఇంట్లకు వొయి బ్యాండోళ్లందరికీ శాయే జేస్కచ్చి పోశింది. శాయే దాక్కుంట ‘‘నీ పెండ్లికి గీ శాయేగాదు నాలుగు సారపొట్లాలు దెప్పియ్యే శెల్లె’’ అని పరష్కమాడిండు.

ఇగ ఆరోజు బారాత్ టైంకి పిల్లనప్పజెప్పెటప్పుడు అచ్చిండు మైనొద్దీన్ మామ. ఇది స్పెషల్ అప్పియరెన్స్ అన్నట్టు. దగ్గరోళ్ళు, పెద్దమనుషుల ఇండ్లల్ల పెండ్లి అయితే బారాత్ మొదటి పాట మైనొద్దీన్ వాయించుడు ఒక స్పెషల్ గౌరవం లెక్క. అందరూ పిల్లనప్పజెప్పుకుంట ఏడుస్తాంటే… “నవ్వమ్మా..బంగారు పువ్వమ్మా’’ అని పుట్టింటి పట్టుశీర సీన్మల పాట వాయించి. ఓ యాబైరూపాల్ ఎంకటేషన్న జేబుల వెట్టి ఎల్లిపోయిండు. బ్యాండు గట్టిగ గొట్టేదానికి సారదెచ్చుకొమ్మని ఆ పైసలన్నట్టు.

అప్పుడు మొట్టమొదాలు నేను క్యాషియ (కీ బోర్డ్) జూశిన. దానిమీద అన్ని పాటలు శేత్తోనే అస్తున్నై. ఓ కర్ర లేదు, పీకె లేదు. ఒకాయినె ఏ పాట కావాల్నంటే ఆపాట వాయిస్తున్నడు ఆ క్యాశియ మీదనే. మైనొద్దీన్ మామ కర్రవాయించుడు ఎందుకు బందువెట్టిండో అప్పుడర్థమైంది నాకు. పక్కపొంటి ఉన్న కర్రలోళ్ళు వాయించకుంట ఆ క్యాశియనే మనాదివడ్డట్టు ఎందుకు చూస్తున్నరో అప్పుడు అర్థంకాలేదు. అట్లట్ల ఇగ బారాత్ అయిపోయింది. మధ్యల వేరే పిలగానికి తాష అప్పజెప్పి ‘‘ముక్కాల ముక్కాబుల’’ డ్యాన్స్ చేశిండు ఎంకటేషన్న. అప్పుడైతే కొత్తగ మొన్న టీవిల జూశ్న ప్రబ్‌దేవ్ లెక్కనే అనిపిచ్చిండు. ‘‘బ్యాండుతో పాటు డ్యాన్సుగూడ నేర్వాలే ఎంకటేషన్న దగ్గర’’ అనుకున్న.

ఇగ రోజు బడికచ్చుకుంట, పోవుకుంట కిట్టక్క పెండ్లికి ఎట్ల డ్యాన్స్ చెయ్యాలే, ఎంకటేషన్న దగ్గర తాష తీస్కోని ఎట్ల వాయించాలే అని ఆలొశిచ్చుకుంటా ఉండేటోన్ని.

ఓనాడు, బడికివొయ్యి అచ్చుకుంటా లెవనియ్యబాయి (11-A mine) కాడ ఆటో దిగి, ఊళ్ళెకు పోతాంటే. శింగరేణి బాయిలకు ఉష్కెదోలేదిక్కు ఉండే వాటర్ సంపుకాడ మంది జమైకనవడ్దరు. ఇంకొందరు పర్శాన్ పర్శాన్ ఉరుకుతున్నరు. ఏమైందో ఏమో అనుకుంట ఇంటిబాట వట్టిన. నడిమిట్ల జమాలొటల్ కాడికి పోయేటాళ్లకు మా గొల్లోళ్ళ సది ఎదురైండు. “ఏమైందాట బైటికి అచ్చిండా?” అని అడిగిండు.

‘‘ఎవలు? ఎండ్లకెల్లి బయిటికి అచ్చుడు?’’ అని అడుగవోతుంటే. ‘‘నాకొడుకో, ఆ దేవుని గుల్లె మన్నువొయ్యరో’’ అని వొర్రుకుంట ఉరుకుతున్న సాకలోళ్ళ పెద్దమ్మ కనవడ్డది.

‘‘గా సాకలోళ్ళ ఎంకటేశం లేడా… ఆనే ఇయ్యాల పొద్దుగాల సంపుల ఈతకు వొయ్యి అండ్ల మునిగి పొయుండాట. అందరూ సూడవోతుండ్లు.’’ అన్నడు… ఆ మాట ఇనంగనే ఎందుకో భయమైనట్టు అనిపిచ్చింది. ‘‘నా కొడుకో, ఆ దేవుని గుళ్ళె మన్నువొయ్యరో’’ అనుకుంటా ఉరుకుతున్న పెద్దమ్మ ఏడుపు ఎందుకో అప్పుడు అర్థమైంది. సదీ, నేను ఇద్దరం అటుదిక్కు ఉరికినం. అప్పటికే అక్కడ మైనొద్దీన్ మామ ఆగమాగం తిరుక్కుంట కనవడ్డడు, ఆ పెద్దమ్మని పట్టుకోని ఏడ్సుకుంట మైనొద్దీన్ మామ భార్యా, ఆళ్ళ బిడ్డ షమీమ కనవడ్డరు. శింగరేణి పంపుడ్రైవర్లకు చెప్పి మోటర్లు బందువెట్టిచ్చి, చిన్న మోటర్లతోని నీళ్లన్ని గుంజేశిండ్లు. మొత్తం నీల్లు బయిటికి గుంజేశినంక లోపట ఔట్ ఫ్లో పైపులల్ల తల్కాయ ఇరుక్కోని కనవడ్డడు ఎంకటేషన్న. ‘‘అబ్బర బిడ్డో, నా కొడుకో, నా అయ్యో’’ అని రొమ్ములు గుద్దుకుంట ఒర్లుకుంట కిందవడి ఏడ్శిండు ఆశాలు పెద్దబాపు. అట్లనే నిలవడి కండ్లల్ల నీళ్లతోని అటేసూసుకుంట నిలవడ్డడు మైనొద్దీన్ మామ. అప్పటికే అక్కడికి అచ్చిన పోలీసోళ్ళు అందర్నీ దూరం గెదిమి, శవాన్ని బయటికి తీసే పనిల వడ్డరు.

అట్లనే, కండల్ల నీళ్లతోని, స్కూలు బ్యాగు మోసుకుంటా ఇంటికచ్చిన, ఎవలు జెప్పిండ్లో ఏమో, ఇంటికాడ కిట్టక్క ఏడ్సుకుంట కనవడ్డది.

ఆ తర్వాత నెలరోజులకి కిట్టక్క పెండ్లైంది. బ్యాండోళ్లచ్చిండ్లు, కొత్త కొత్త పాటలు వాయించిండ్లు. కనీ ఆళ్ళ దగ్గరికి పోలేదు. అటుదిక్కు కూడా సూడలేదు. పిల్లనప్పజెప్పెటప్పుడు ఎప్పట్లెక్కనే మైనొద్దీన్ మామ వచ్చి “నవ్వమ్మా బంగారు పువ్వమ్మ” వాయించి పోయిండు. అక్క వోతుంటే వచ్చిన ఏడుపు… ఎంకటేషన్న లేకపోవటం వల్ల వచ్చిన ఏడుపూ కలగల్శి ఏడ్శిన. అందరూ బారాత్ తోని బస్సుదాక పోతే నేను మాత్రం ఇంట్లనే యాపశెట్టుకింద కూసోని ఏడ్శిన. ఆతర్వాత ఇగ ఏ పెండ్లిల మైనొద్దీన్ కర్ర వాయించంగ సూళ్ళేదు నేను. పార్టి మాట్లాడుడు, పైసల లెక్కలు చూసుడు తప్ప, బ్యాండు కొట్టే పని పోరలకే అప్పజెప్పిండాట. అట్లా మైనొద్దీన్ కర్ర వదిలిండు, నేనూ నా బ్యాండుకొట్టాలన్న ఖాయిష్ ఇడ్షిపెట్టిన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *