గో స

Spread the love

“అమ్మా ! సుందరమ్మా! ఒక్క పాలి తలుపుతియ్యిమీ… నాయమ్మ నాయమ్మ … కోప్మయిపోకు ….. నా నొచ్చినాను గాదా, సిటంలోన దోఁవెస్తాను గిన్నిలు. మొన్నటి రేత్తిరి సిన్నతగువయి పోనాదమ్మా. అది అలిగీసి కన్నోరింటి కెలిపోనాది. ఇల్లిక్కడ అగ్గురోదానికత్తల సిట్టివొలసే దాని కన్నోరు. యిదుగో యియ్యాల నాకొడుకెల్నాడు తేడానికి, వొచ్చేత్తాదమ్మా. గడియోసిటవోఁ సేసి వొచ్చేత్తాది.

అయినా పన్లో యెట్టుకున్న తరవాత సీటికి మాటికి నాగాలెడితే ఏయమ్మూరుకుంటాది? అయితే నామాటింతాదా నాకోడలు ! అత్త ముండ మాటకి కాతరుసేస్తాదమ్మా -సెవత్కారి ? సిన్నమాటంతే యిదలిగీసి పారిపోడఁవూ, నా కొడుకు, పెటారోడు, కాల్లొట్టు కోని తెచ్చుకోడవూ ! అలవాటయిపోనాద్దానికి, అదెందుకు మాన్తాది?

తగువేటంటన్నావా ? పది తెచ్చుకోని పాతిక కరుసెడతావంటే ఏటౌతాదమ్మ ? అదే తగువు, అల్లిద్దరికీ, కాలంమీదున్నాదిగాదా కన్నూ మిన్నూ కానకంటున్నాది. కపింత రత్తపస దిగిపోతే, అప్పుడు తెలుస్తాది పైసాయిలవ.

అది మానీసినప్పుడల్లా దనిల్లన్నీ నానే పెయ్యిడం. మరినాకు నాలుగిల్లున్నాయిగావా. యిన్ని పెయ్యిడవంతే నాకెలాగుంటాది సెప్పుమీ ? నాకు మాత్రం కాలో సెయ్యో నొచ్చిన్నాడెనా, అది సాయంజెయ్యదు సరిగదా కసిన్ని గెంజి నీల్లేనా పొయ్యిదు. అయినా, నాకొడుకేనాకు కానోడయినప్పుడు, దాన్నెందుకనాల్నే!

పోనీయమ్మా! ఆయన్ని నీకెందుకునే అమ్మా ! యిల్లుతుడిసీసినాను కసింతనడుం పట్టీసి యిలగ సేరబడిపోనాను. యిదుగో, సిటంలోన లెగిసెల్లి, అంట్లుదోఁవెస్తాను. సిన్న సబ్బు పిసరా, సింతపండూ, పడీయమ్మా. యిదేటమ్మా ? అన్నవాఁ ఊరగాయోసన కమ్మగుంది. ఇక్కడే తినీమంతావా… లేదమ్మా.. పొద్దుటేల యింత గెంజి తాగితే మల్లీ రేతిరికే, తింతే తిండం నేపోతేనేదు. నానేటి వొయిసందాన్నా అరాయించుకోగల్నా. అదుగో రోజు కొక్కపాలి కసింత టీ సుక్క బడిపోతే సాలు.. మరితిండి కాసుండదమ్మా నాకు. నామాటకేటిగానీ యిలాగిన్నొట్టుకెల్లినా నంతే, కోడిపిల్లల నాగ కలబడి పోతారు. సిన్నగుంట పాపలు, నామనఁవలు. ఆల్ల కన్నా అద్దోనం మాముసిలోడు… మణిసైతే పట్టొగీసినాడుగానీ తిండంతే పడిసచ్చిపోతాడమ్మా.

నీ కొడుకు సూడ్డా అంతన్నావా ? అయ్యో మాలచ్చిమి తల్లి! మిగిల్ని గెంజి యీది కుక్కకేనా పోస్తారుగానీ, మా కెయ్యరమ్మా, రెక్కలిరుసుకొని, దాసిందంతా కరుసెట్టి… పిప్పీ. పిసరా అమ్మీసి యిల్లు కట్టించి ఆల్ల కిచ్చీసినాం … మాఁవీదిల బడిపోనాం. పుస్తితముడి పడగానే యేరుపాట్లెట్టేసినాదమ్మా నాకోడలు. . యేటి సెయ్యిగలం.. మాకరమకి మాఁమేడుసుకోని యీది పంచల పడుంటన్నాం…. సిత్తుగ తడిసిపోతన్నా సలొట్టి సచ్చిపోతన్నా యింట్లోకి రానీదమ్మా మాకు. . . ముసిలోవల్లవఁట. . . యిల్లంతా కంపు సేసిస్తావఁట అసియ్యవంటమ్మా సుబ్బరగత్తెకి…

పోనీయమ్మా యిల్లు కోసం గాదమ్మా నాబాద. తల్లీ దండ్రిని కసింత సూడొద్దా తనకినేకపోయినా కసింత లోకానికేనా జడొద్దా? కులవోఁల్లందరూ పంచాతీ పెట్టమన్నారు గానమ్మా.. శశ! నాపుర్రాకులేయో నాను పడతానుగానీ…. ఆడినెందుకు యీదిలోనెట్టాల ? ఆడైనా మంచోడేనమ్మా.. కాపోతే కసింత మెత్తటోడైపోనాడు… ఆటాడించేస్తంది సెవఁతకారి .. అమ్మా .. మరి కసింత సర్పుగుండెయ్యి మీ . . . మూకుడు మసి వొగ్గకుంటన్నాది… మా కోడల్దాయి దోఁవడం గాదా . అందికే యిలాగున్నాయి సావాఁన్లు… ఉత్తినెసేస్తందా సేసింది సుబ్బర(వొద్దా.

నాకెందరు పిల్లలనడుగుతావా….. అమ్మా నలుగురాడ పిల్లలికి పెల్లిల్లు సేసి పంపీసినాం.. అల్లబతుకులాల్లు బతుకుతన్నారు… మాం పచ్చాగున్నాన్నాల్లొచ్చీవోరు… యిప్పుడు మూలబడిపోనాం… మాకాడేటుంద నొస్తారమ్మా . . లేనోల్లందరూ కానోల్లేగాదా .. నా కొడుకా!… నలుగురు మొగపిల్లలకి ముగ్గురు సిన్నప్పుడే సెల్లిపోనారు. కడావరోడు యీడొక్కడు మిగిల్నాడు… పోన్నే బతికున్నప్పుడు సూడకపోతేపోనీ . . . సచ్చింతరవాత బుగ్గిసేస్తాడు కదమ్మా. అదే నాయాశ .. మరేటీనేదు.

యిదుగో నాకు లంపటం మా ముసిలోడున్నాడుగాదా… నాకల్ల ముందే ఆడిదినం దీరి పోతే నాకదే సాలు.. అలగన కూడదా పెనివిఁటి గురించి… అయ్యోతల్లి! నీకు మాబాదలు తెలవుగాబట్టి అలగంతన్నావు… ముసిలోడితో నొకబాద కాదమ్మనాకు తిండి తగ్గించడు… మంచం మీంచి నెగవేడు .. సంటిపిల్లడినాగ ఆడికి తాన్నం జెయ్యించాల…పక్కంత కంపుకంపు సేసెస్తాడు. అయ్యన్నీ ఉతికేసరికి నాకు తిండి నోటి కాసెల్లదమ్మా… నిజం సెప్పుతన్నాను… నాను కసింత కల్లు మూసిస్తే ఆడికియన్నీ ఎవులు సేస్తారు సెప్పు మీ.. అందికే.. నానున్నప్పుడే ఆడి దినం దీరిపోవాల..

అమ్మా ! సావాఁన్లన్నీ సుబ్బరగ బోర్లించినాను అరుగుమీద … అయ్యోతల్లీ ! కసింత సర్పులోన నానబెట్టిత్తే నానే ఉతికిద్దునుగాదా కూకోనీ… నువ్వెందుకు బట్టల్లో సెయెట్టినావు ?

అమ్మా ! వొయిసైపోనాది – నడుంపట్టొగ్గీసినాది గానీ యిదొక పనమ్మా… యిలాంటి పన్లు యెడం సేత్తో సేసీసీ దాన్ని .. అమ్మా! గంపంత సంసారం యెత్తినాను.. కస్టంసుకం అన్నీ అనబగించినాను.

నాగురించా! ఏటి సెప్పమంతావు తల్లీ.. రావఁసెంద్రపురం నేదా.. అది దాటింతరవాత జొన్నలస వున్నాదిగాదా.. అదమ్మా మాయూరు. రెండెకరాల పల్లం, నాలుగెకరాల మెట్టా.. రొండావులు, రొండుగేదిలు, ఏరెడ్లు ఉండీయమ్మా. అమ్మా.. గొడ్డుకీ బిడ్డకీ ఒక్కలాగ సెయ్యాల, అన్నోటున్నా మాఁవేనాడూ కాలుమీద కాలేసుకోని కూకోడఁవెరగం. యింటిల్లి పాదిలీఁ ఎలా కస్టపడేవోల్ల వెరుగుదువా? మా నాయుడిప్పుడు మూలబడి పోనాడు గానీ, కమ్మెచ్చు దీసినట్టుండీవోడు.. సెయ్యెత్తు మణిసి యిలాగ సూస్తే చెవిఁసిపోయినట్టుండీ వోడమ్మా.. పొద్దుటేల నెగిసి అంబలి తాగేసి బయలెల్లినాడంతే మల్ల పొద్దేయింతరవాతే ఊర్లో నడుగెట్టీవోడు .. యిలాగ యెడం సెయ్యితోని గింజలిసిరిస్తే యిరగబండిపోయీవి.. అలాగ సత్తువసేసీవోడుబూవికి.

ఆయన్నీ ఏటయినాయా? మా కరమ్మిలాగుంటే ఏటౌతాయమ్మా.. ఏట్ల కలిసిపోనాయి… వొరసాలు పడకపోతే సెరువులెండిపోతే.. నీరొచ్చీమారగం నేపోతే ఏటి సెయ్యిగలం, బోరింగు తియ్యించమని ఎవులో సెప్పితే కసింత బంగారవమ్మీసి ఆదీ సూసినాం.. బంగారవాఁ అమ్మా.. నానూపట్టిడా… నాగరం, జెడగంటలూ అన్నీ ఉండీవమ్మా.. కడాలూ, గొలుసులూ పట్టీలు బొందులూ అన్నీ మోసినానమ్మా.. నిద్దట్లో నేనా వొంటి మీద వొస్తువు తియ్యిడఁవెరగం.. ఒక్కనాడు పూసిక పుల్లయినా పోడఁ వెఁరగం.. ఇప్పుడంతే మాయదారి కాలవొఁచ్చి పడిపోనాది.. ముక్కు పుల్ల కోసం ముక్కులు గూడా కోసుకెలిపోతన్నారు దొంగ ముండ గండలు.

అయితే… సెప్పిందాల కించు.. బోరింగు తియ్యించినాం.. సుక్క నీరుపడనేదు.. నీరు నేక పంటలు నేక మనుసులం పసువులం మలమల మాడిపోనాం.. తొలిత సచ్చి పోయిందొకావు. ఆ పొద్దు మా నాయుడు అదేడుపు గాదమ్మా.. కడుపున పుట్టిన బిడ్డలు పోయిన్నాడేనా అలగేడనేదు పైసాపరకా కూడేసి తొలిత కొన్నాదటమ్మా మా యత్తదాన్ని.. అదొచ్చింతరువాతే అన్నీ కలిసాచ్చినాయాట. అందికే దాని కాసి సూస్తే మానాయుడికి మాయత్తని సూసినట్టుంటాదనీవాడు అంతే.. మణుసొగ్గేసి పసువులన్నిట్నీ వొచ్చిన కాడికమ్మీసినాడు.. ఆటిసావు సూడలేనని….

అమ్మా పాలసుక్క నేపోతే… బియ్యపుగింజ నేపోతే ఎలగ బతుకుతాం. సంకలో పిల్ల, సేతిలో పిల్ల యిలాగెలాగుండేది బీరపాదునాటి సమసారం. అప్పుడెంత మంది పిల్లలుంతే అంత గొప్ప .. యిప్పుడేటమ్మా.. పిల్ల బూమ్మీదపడీ సరికి తల్లి బల్లెక్కిపోతాది ఆపరీసను సేసీమని..

ఒల్లుకోయమ్మా.. నవ్వుతావేటి.. ఏటీ పెంచడం కస్టవంటన్నావా? ఊరుకో అదేటిమాట.. సెట్లూ పిట్టలూ బతుకుతన్నాయిగావా… అన్నిటికీ ఆబగమంతుడే ఉన్నాడు.. అయితే నువ్వన్నదీ నిజమేననుకో… ఈ కరువు కాలంలోన గెంజినీలకే గతిలేకంటున్నాది.

ఐతమ్మా.. అప్పడు పారొచ్చినాం మాఁవీఁవూరు… తొలిత వూరత్తల పల్లం నేదా ఇప్పుడు బోడ్రోల్లు కోలనీ కడతన్నారు. అదిగక్కడుండీ వోల్లం.. ఈయూరులోన అప్పుడు పెదరాజుగారే పెద్ద కంట్రాట్టరు.. ఈ మద్దినే సచ్చిపోనాడు మారాజు తండ్రి.. అతని కాడే మా ముసిలోడు తొలిత పన్లో సేరినాడు.. తరవాత సుబ్బయ్య సావుకోరుకాడ, మారువాడీ సావు కోరు కాడ సేసినాడు. గొప్ప పేరు సంపాదించినాడమ్మా. ఎవులికాడపనిసేసినా సీతయ్య సీతయ్య అని సిటంవొగ్గీవోల్లుగారు.. అంత నమ్మకం మణిసంతే…

మా నాయిడమ్మా ఎలాగ తెచ్చీసోడో అలాగ కరుసెట్టిసేవోడమ్మా.. నాను గోల బెడితే ఓలి సిన్నమ్మీ. అన్ని సంపాదించినాం. యియ్యేలేటిమిగిల్నాయి.. ఉన్నప్పుడు తిన్నదేసుకం అనీ వొడమ్మా. ఆడికి అప్పుడికీ యిప్పుడికి తిండి పుష్టి గుండాలమ్మా.. నీసునేకపోతే ముద్దెత్తీవోడుగాడు.

కొడుకంతే యింతంత పేఁవఁగాదమ్మ. ఒళ్ళో కూకోబెట్టుకొని మాంసాలూ సేపలూ తినబెట్టీవోడు. అందికే ఆ సెటారి నాకొడుకు ఇప్పుడు తండ్రి నోట్లోన బుగ్గిపోస్తన్నాడు.

            అయితమ్మా ఇక్కడికొచ్చింతరవాతే సీట్లపేక, సారాకాయ ముట్టి మానాయిడు కసింత సెడిపోనాడమ్మా.. మొదుట్లో పల్లకున్నాను గానీ మించిపోతుంటే నిలదీసేసరికి సెయ్యెత్తడం మొదలెట్టినాడు. అప్పుట్లోనొకసారి ఆరిజెంటుపనిమీద పెదరాజుగోరు మా యింటి కాసాచ్చినారు. సీతయ్య నేడా అంతే రానేదు బాబూ అన్నాను. యెలాక్కనిపెట్టీసినాడో సారా కొట్టు కెల్తన్నాడని మర్నాడు పట్టుకున్నాడట మా నాయిడు తరవాత సెప్పినాడు.

ఒరే సీతయ్యా! నానొకమాటంతాను. జాగర్తగాయినుకో. సిన్నా సితకా పిల్లలు.. బతికి సెడిన సమసారం.. కడుపు సేతపట్టుకోని యీవూరొచ్చినందుకు ఔననిపించుకోవాలగానీ యిదేటిది? ఇక్కడందరూ తాగుబోతునాకొడుకులు.. ముండల ముటాకోర్లు.. తెచ్చి తెచ్చి యిక్కడ పెట్టినావు కాపరం… సక్కగ ఊర్లోన జాగా యిప్పిస్తాను.. పైసా పరకా కూడేసుకోని యిల్లు కట్టుకొని సుబ్బరగ బతకమని బోదసేసి నాడమ్మా అది మొదులు.. మానాయుడు సారా కొట్టు కాసెల్తె ఒట్టు.

మా నాయిడు మంచోడేకానమ్మా.. మణిసికి కసింత అనుమానం.. దాని మీద సారాతాగినప్పుడల్లా ఒల్లు తెలీనికోపం. జుట్టట్టుకోని బాదీసీవోడమ్మా.. ఇప్పుడు గదా సల్లారిపోనాడు.. ఆ కసింత అనుమానఁపూ కోపఁవూ నేకపోతే ఆడిలాటి మణిసేలేడమ్మా.. నాకూ పిల్లలికి యిలాగెలాగ సూసుకునీవోడు తెలుసునా… అయినా మొగోడికి ఆమాత్తరం కోపవుండాలినే.. ఇదుగో నా కొడుకు.. పెల్లం పెరటికాసి కర్రాట్టుకుంతే ఈడు ఈదిలోకి పరిగెడతాడు. అంతబయ్యం…

అమ్మా! మాటొచ్చిందిగాబట్టి సెప్పుతన్నాను.. నీకబద్ధం నాకు నిజిం వొయిసిన్నాడిలాగెలాగుండీదాన్నెరుగుదువా.. ముసిల్దాయికి నోరుతిన్నగరాదేటి అనుకోకుమీ.. నా ముంగల నువ్వేటి పనికొస్తావు. అదిగో అలగుండీదాన్ని.. చాత్రిబాబు నేడా.. ఈది సివార పంతులుగోరు… ఆబాబు తండ్రి వుండీవోడునే ముసీలి పండునాగుండీవోడు.. నీల్లకెల్తుంటే యిగటాలాడేవోడు. ‘ఓలి సిన్నమ్మీ.. మాకులంల పుట్టినావు గాదే.. మీ యమ్మగార్నొగ్గీసి నిన్నే కట్టుకుందును’ అని… ‘వొల్లకుండండి సిన్నదాంతోయిగటాలేటని’ గసిరీది పంతులమ్మగోరు.. సల్లని తల్లి..

ఇల్లు సుబ్బరం ఒల్లు సుబ్బరం నేకపోతే మా నాయుడు వొప్పీవోడుగాదమ్మా.. సేతుల్నిండా గాజులేసుకొని.. అమ్మోరిబొమ్మనాగ పసుపూ కుంకం యెట్టుకోకపోతే గొప్ప కోపమయిపోయీవోడు. ఇప్పుడేటి కోకలమ్మా.. మాకాలం నాడు తొమ్మిదిగజాల కోక మొగల్రేకులా కట్టీవొల్లం.. రైకలు మానాడెరగంనే, రైకన గూడదట జాకిట్టనాలట.. మా కోడలు నా మాటలకెక్కిరిస్తాది. నంగా ఆట పీరట.. నొపటొకటి పైనొకటి జాకిట్టట యెన్నేస్తేయేటినాబం ఒల్లల్లా బయిలే.. తలకి పోసుకున్నప్పుడే నా కసింత పసుప్పిసర మొకానెట్టదు. పొగడ్ర రాస్తాది పొగడ్ర. అయేటో బంకబిల్లలు దెచ్చి మొకం మీదెట్టుకుంటాది. ఏటేనంతే కలబడిపోతాది. నాయూసు నీకెందుకని, అమ్మా మీకూ మీకూ సూసిగానీ మాకివన్నీ యేలసెప్పుమీ? మీ తీరవమీది.. మా తీరవమాదీ.. అయితే దానికింతంత సోకనుకున్నావా.. పిల్లల్నిగూడా సేరనియ్యదు. నాకాడసుట్టోసన కొడతాదాట. కంపట.. అమ్మా పురపుర సబ్బుపావీఁడవేఁగాని ఏ నాడయినా సుబ్బరగతాన్నంజేస్తాదమ్మా. ….అది నాకు సెప్పుతాది.

ఆముండపాపలు నా మనవఁలు నన్ను సిటవొఁగ్గరు. ఆల్లమ్మ సూస్తే కొడతాదని.. సూడకంటొచ్చి మీద బడిపోతారు. అందులోకి మా మనవఁడైతే ‘నా పక్కలోనే పడుకుంతాడమ్మా.. అమ్మా.. నా కేటి గుడ్డా -గుడుసా.. పరుసుకోనానికీ కప్పుకోనానికీ ఎవురిస్తారు సెప్పుమీ.. ఆయమ్మ ఈయమ్మా యిస్తే దరమం నేపోతే నేదు.. ఆ రెండు గుడ్డ పాతలూ ఒకటి పరుసుకోని ఒకటి కప్పుకుంతే ఆడొచ్చి తడిపేస్తాడు. ఓరి గుంటడా.. సలొట్టి సచ్చిపోతన్నాన్రా.. ఆకిరికి నీ వుచ్చల తోటి పూర బెట్టీసి నాకు సంపేస్తావేట్రా అన్నా ఒగ్గడు. పోన్లేయమ్మా- నా పేనం ఉన్నందికే గదా పిల్లలు మామ్మామామ్మా అని దేవులాడతన్నారు. కసింతనాను కన్నుమూస్తే అల్లనెవులు సేరదీస్తారు?

ఆల్లమ్మమ్మ సంగతా అడుగుతావు.. లేకేవిఁ ఉన్నాదమ్మా.. సుబ్బరగే ఉన్నాది. మొన్న మా కోడలికి ఆపరేషనయినప్పుడు వొచ్చినాదిగాదా సూపుకి.. పదికుంచాలబియ్యమూ, కుంచిడు పప్పూ తెచ్చిచ్చింది, కూర కరుసుకని యాభైరూపాయలిచ్చింది.

బాగానే యిచ్చిందతన్నావా… ఒల్లకోయమ్మా… ఇత్తే సరేనేటి.. తరువాతేటయిందెరుగుదువా.. అత్తకి మరేదసెయ్యాలని కేజీ మాంసం దెచ్చి నా సేతే వొండించినాడు నా కొడుకు.. మొదుటాట సినిమాకి పంపినాడు అత్తని. అట్నించొచ్చి ముక్క మిగలకంట దేవుకొని తినీసినారు గానమ్మా.. ముసిల్దీ ముసిలోడు సంగతేటని ఒక్కల్లు సుమా.. కడుపున పుట్టిన కొడుకే అనకపోతే ఆల్లేలంటారు..

పోనీ నాకక్కర్నేదమ్మా.. ఆల్లయ్య మాంసవంతే పేనాలొగ్గేస్తాడని తెల్దా ఆ సచ్చినోడికి. ఆడికేనా యింతరవ్వ యెట్టరాదా.. ఆమాటడిగినానని జుట్టొట్టుకోని యీడిసేడిసి తన్నినాడమ్మా నా కొడుకు.. పేనాలు కడంటిపోయి నాలుగు రోజులు నెగవేకపోనాను. అత్త ముంగల ఆడిపరుపు పోయిందట నామాట్లకి, అలాంటి రావనాసురుడు పుట్టినాడు నాకడుపున..

పోనీ ఆల్లేటి తింతే మనకెందుకు … కలిగిన్నాడు తెస్తాను తిను లేన్నాడు కడుపుల కాల్లేట్టుకోని తొంగో అంతే మాముసిలోడొప్పడు. నా కొడుకేగాదా.. అడిగి తింతే తప్పేటి.. అంటాడు. కొడుకే సిన్నప్పుడు.. యిప్పుడాడు ఒక పెల్లానికి మొగుడు నాయనా అంతే యినిపించుకోడు..

అయితమ్మా కడుపు గోస ఎవ్వులి తోటీ సెప్పుకోను.. సెప్పుకుంతే ఏటి వొరుగుతాది.. ఆడి పరువేపోతాది.. ఆడెవుడు. పైయోడా.. కన్న కొడుక్కాడా.. నావుసురాడికేల తగలాల? అందికే నమ్మా ఓపికున్నా నేకపోయినా నీయింటా నీయింటా పనిసేసుకోని మా దినాలు దీర్సుకుంటన్నాను. పోన్నే నాదేనాడుజేసిన పాపమో.. ఈ నానబగిస్తన్నాను.. తప్పమంతే తప్పుతాది? అమ్మా! అన్ని పనులూ అయిపోనాయి.. నా నెల్దునా.. ఏటమ్మా అయి వొర్ర గారిలూ అరిటిపల్లా నాతల్లి నాతల్లి సల్లని తల్లి యియ్యాల పండగేటమ్మా.. పెల్లిరోజా.. ఏటో .. మీ లాటోల్ల కయన్నీ మాకేటి దెలుస్తాయి. ఇక్కడ తినీయాలా.. అయ్యో – తినిస్తే నా నోట్లో నేటి ఉండిపోతాది? కసింత గెంజన్నంతొరిపేసి పుంచినాను ఈ గారి ముక్కలు రెండు నంచుకిస్తే మాముసిలోడు పొంగిపోతాడు.. ఆడుతింతే నాను తిన్నట్టు కాదా.. కాకపోతే పక్కపాడుసేసెస్తాడు.. నా నున్నాను గానా ఉతకనానికి,

మిగిల్నియి పిల్లల సేతుల్లో నెడతాను ఒకొక్కటి.. మిగిలిన రెండు- నాకొడుకున్నాడు గాడా.. సెటారోడు పెల్లం ముంగల పిల్లే.. ఏనాడేనా ఆడికది కడుపు నిండా తిండెడతాదేటమ్మా.. అన్నం ముంగల కూకోనిచ్చి యెప్పుడూ తగువే- ఆడికిస్తాను. సిన్నప్పుడెప్పుడు జూసినా అమ్మాగార్లొండే అని ఏడుసుకోనుండేవోడమ్మా. ఈయంటిపల్లు రెండూ మాకోడల్దాయి సేతులో నెడతాను. ఆపరీషనయివాదిగాదా.. వొర్రతినగూడదమ్మా. నాకడుపుకెంతగావాల. ఈ యొక్కంటిపండూసాల్లే.. నీ కడుపు సల్లగ యిన్నో టెట్టినావు సాల్లేయమ్మా.. తల్లి మాలచ్చివి!

అమ్మా.. తలుపేసుకొమ్మి.. రోజులు బాగునేవు..!!

కమలకుమారి

రచయిత్రి పి. కమల కుమారి గారి స్వస్థలం విజయనగరం. 1959 సంవత్సరంలో  శ్రీ. పంతుల సూర్య నారాయణ , శ్రీమతి పంతుల శ్రీ లక్ష్మి దంపతులకు జన్మించారు.  భర్త పేరు ఎ.వి.ఆర్. దుర్గారావు. వీరికి ఇద్దరు కుమార్తెలు. తక్కువగా రాసిన చాలా విలువైన కథలు రాసిన వీరు గతంలో అధ్యాపక వృత్తిలో ఉండి ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయినిగా ఉన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *