మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె Part 3

సోడాల నరెందర్గాడు – మంగలోల్ల కేషుగాడు

 దోస్తుగాళ్ళు అనగానే ఠక్కున ఒకడో ఇద్దరో తల్కాయల మెసుల్తరు. ఇప్పుదైతే సూఫీగాని దోస్తులెవర్రా? అంటే,  నన్నుజూశే సగానికి సగం మంది ఫష్టు ఫష్టు అరునాంక్ గాడనో, శేషుగాడనో, ఇంకా పర్సనల్గా దగ్గరోళ్లైతే సాయిగాడనో, నీలేష్, సిద్దూ ఇట్ల ఇంకో నాలుగైదు పేర్లు చెప్తరు. కనీ అప్పట్ల అంటే చానారోజులకింద జాఫర్జమాన్ల ముచ్చటైతే… పొన్నం నరేందర్ గాడుండేటోడు. సోడాల నరెందర్గాడు,  మంగలోల్ల కేషుగాడు గట్టి దోస్తులు.

   పొన్నం నరేందర్ గాడెవడంటే… మా నానచెప్పే గుడిశెబల్లెకు పల్కవట్కోని అచ్చి నా పక్కకు కూసున్న బక్కపోరడు. అక్కన్నుంచి నేను సర్కార్ బడికి వోతే రెండేండ్లు వేరే ఊరికి పోయినా మళ్ళీ వచ్చి మూడోతర్గతిల నాపక్కకే కూసున్న బైరిరాజయ్య మన్వడు. ఇకా బండగుర్తు ఏందంటే… నన్ను నవోదయ పరిక్ష రాయిమని అన్నప్పుడు ఇంట్లకెల్లి దెంకపోతే అయిదు రూపాలిచ్చి లెవనియ్య బాయి క్రాసింగ్ కాడ ఆటో ఎక్కిచ్చినోడు. మా ఇంట్లోల్లు ఏడుస్తుంటే సూడలేక “నేనే గోదార్ఖనికి ఆటో ఎక్కిచ్చిన” అని చెప్పి మా అయ్యతోని ఈపు శింతపండు చేపిచ్చుకున్నోడు. నాకు ఉన్న యాదిల ఆడు ఎనుకా ముందూ ఉన్న కాస్ దోస్తు. అట్లా నాతోనే ఎనిమోదో తర్గతిదాకా సదివి, తర్వాత బైరిరాజయ్య సోడాలబండి చేతికందుకున్నోడు. 

  క్యాంచి తొక్కే నాకు సీటెక్కి కిందవడకుంట ఎట్లతొక్కాల్నో నేర్పిచ్చిండు ఆడే. అయినా రోజుకు మూడుసార్లు కిందవడ్తుంటి. మానాన్న అదే బళ్ళె టీచర్ పని చేస్తుండె. ఆయినె ఎవనెవ్వన్ని కొట్టిండో ఆ పెద్ద తర్గతి అన్నలందరికీ నేనే టార్గెట్, నేను ఎక్కడెక్కడ కిందవడ్డనో, ఏడ గడ్డెక్కలేక సైకిల్ దొబ్బుకుంట నడ్శిన్నో మా నానముంగట కావాల్ననే నవ్వుకుంట, పేర్లవెట్టుకుంట ఇజ్జత్ తీశేటోళ్ళు. ఆ టీజింగ్‌కు కిరిం లేశి అక్కన్నే “సైకిల్ ఇంట్ల వారేశి రేపట్నుంచి నడ్సుకుంట రా” అని తిడ్తుండే మా నాన. ఎందుకు తిడ్తుండో, ఠక్కున అచ్చి ఎందుకు కొట్టేదో అర్థం కాకపోతుండే.)

   ఓనాడు ఏడుస్తాంటే. “అరేయ్, నువ్వు *క్యాంచి తొక్కుతానవని ఆళ్ళు ఎక్కిరిత్తాండ్లు, పా నీకు బొంగు దొక్కుడు నేరిస్తా అని తీస్కపోయి. అటు పెద్దం పేట వెల్డింగ్ షాపు కాన్నుంచి, మా పాత సర్కార్ బడి, ముర్తూజా అన్నోళ్ళ సైకిల్ షాపు, ఎల్లారెడ్డి పటేలు ఇల్లు మీదికెంచి జమాలొటల్ దాక సైకిల్ పట్టుకోని నాకు బొంగు దొక్కుడు నేర్పిచ్చిండు. 

  కొత్తగ సైకిల్ నేర్సుకున్న సంబురంల వోనాడు పొద్దుగాల్నే ఇద్దరం కల్శి బొగ్గు ఏరుకునేదానికి బాయిమీదికి చెరో సైకిలేస్కోని పోయినం. బొగ్గేరుతాంటే “అరేయ్ నప్పతట్లోడా! అది శేల్‌బొగ్గుపెళ్ళరా అది  సరీంగ మండది. ఇగో ఇట్ల బాగ కర్రెగ ఉండి అల్కగ ఉంటే మంచి బొగ్గు” అని చెప్పుకుంట ఆని బత్త నింపుకోని అటెంక నా బత్తగూడ రింపిండు. తేప తేపకు ఎనుకకు మల్లిసూత్తాంటే అడిగిన. “అటుదిక్కేమున్నదిరా? అంటే. వాచ్మెంగాడత్తే మన బద్దల్ బాశింగాలే, సైకిల్ గుంజుకపోయి మేనింజర్ రూముకాడ వారేత్తడు.” అనంగనే నా పానం సల్లవడ్డది. నీయవ్వ ఊకెనన్న అత్తిగదరా ఈనితోని, ఎట్లరా నారాయన..భగవంత. సైకిలు పోయిందా మా నాన నా తోల్దీస్తడు” అనుకుంటా టక్కటకా బొగ్గు బత్త ఎత్తి సైకిల్ ఎక్కిచ్చినం. ఇగ నా తిప్పల్ సూడాలే. ఆ బరువు ఆసక సైకిలోదిక్కు నేనోదిక్కు. బాయి గోడ దాటేవారకు మూడుసార్ల బొగ్గుబత్త కిందవడితే, నాలుగుసార్ల నేను పడ్డ. పెయ్యంత బొగ్గు మశి అంటింది. ఆనికి నా తిప్పల అర్థమైంది. జల్దిజల్దిన గోదౌతల వాని సైకిల్ పెట్టి మళ్ళచ్చిండు. నాకు ఆసర వట్టి గోడ దాటిచ్చుకుంట ఒక్కటే నవ్వుడు నవ్వుతాండు. “నీయవ్వ, అసల్కే భయానికి ఉచ్చవడెటట్టుంటే ఈని నవ్వుడుకు నాకు కిరాకి లేశి. నీ బక్క గ్**ద్దల **ల్లి. ఎందుకు నవ్వుతానవ్ బడిమే” అని రేశానికచ్చిన.

   నవ్వుకుంటనే “అదిగాదురా, ఇంటికి పోయెటాళ్ళకు ఎన్నిసార్లవడ్తవో అని నవ్వత్తాంది.” అనుకుంట ఇంక నవ్వవట్టిండు. నాకు పానమంత పిసపిసైంది. నాలుగు ఇయ్యరమయ్యర ఈడ్శిగుద్దిన బక్కబాడ్కావు ఈపుల… అయినా ఇంక నవ్వుకుంటనే ఇంటిదాక అచ్చిండు. అప్పటికే ఓసారి పూరెళ్ళ కైలసం ఇంటికాడ ఓసారి, బొందిలోల్ల పతాపుసింగు తాత ఇంటికాడ వోసారి సైకిల్ కిందవడ్డది.

     అట్ల… మూడేండ్లు నాతోనే ఉన్నడు, తిరిగిండు. ఓనాడు బడి బంజేశిండు. ఆల్ల బాపు సరింగ పని చెయ్యక ఎటో దెంకపోతే అమ్మ ఇటుకబట్టీలల్ల కూలికి పోతే ఈడు తాత సోడాలబండి పట్టుకోని మంగలి పల్లె, పెద్దంపేట తిర్గెటోడు. నేను బడినుంచి సైకిలేస్కోని అత్తాంటే నాకు సైకిల్ నేర్పిచ్చిన నరిగాడు మాత్రం సోడాల బండి దొబ్బుకపోవుకుంట కనవడెటోడు. బల్లె ప్రార్థన చేశేటప్పుడు ప్రతిగ్న చెప్పుమంటే నాకంటే గట్టిగ చెప్పి అందరి కండ్లల్ల వడ్డోడు, ఇంగ్లీష్ పీరెడ్ల మీనింగులు అప్పజెప్పి నాకంటే తక్కువ దెబ్బలు తిన్నోడు. లెక్కమీద లెక్క దబ్బదబ్బ చేశే నరేందర్ గాడు అట్లా సోడాలనరెందర్ గాడైండు. 

    అట్లట్ల ఇంటర్కచ్చినం, మెల్లగ గోదార్ఖని కాలేజీకి, అక్కడ సదువు శాతగాక ఐద్రవాద్ల ఎల్ & టీ కంపిన్ల పొక్లైన్ మెకానికి పనికీ అచ్చిన. వాడుగూడ హైద్రవాద్ పనామ గోడౌన్ల బీర్లు మోశే పనికి, తర్వాత విజయవాడల ఇంకేదో పనికి పోయిండని తెల్శేటిది.

   వోనాడు నేను ఒంగోలు చీమకుర్తి క్వారీలల్ల పొక్లైన్ సర్వీస్ ఇంజినీర్గా తిరుగుతున్నప్పుడు ఫోన్ జేశిండు. “అరే బామ్మర్ది, యాదికచ్చినవ్ రా. విజయవాడలనే ఉంటాన అచ్చినప్పుడు కలువు” అన్నడు. కానీ ఎన్నడు కుదురలే.

   అట్ల వో సంవత్సరానికి ఊళ్లెనే కళ్సినం. బక్కోడు ఇంకా బక్కగై, పెరిగిన జుట్టుతోని, నోట్లె గుట్క నవులుకుంట కనవడ్డడు. ఎల్లారెడ్డి పటేలింట్ల డిశ్శిరవ్వి పెట్టిన బ్రండి షాపుకాడ మా కన్నూరి రమేష్ గాడు కనవడితే మాట్లాడి. ఓ బీరుగుద్ది బయిటికత్తే ఏదో చీపు లిక్కర్ కొనుక్కుంట కనవడ్డడు. నాదోస్త్ నరిగాడు, లెక్కమీద లెక్క జేశి క్లాసుల హీరోలెక్క ఉండే నరెందర్ గాడు. పది దాటని సదువుకే దేశం తిరిగి పని చేసి బతకనేర్శిన పొన్నం నరెందర్… బొక్కలు తేలినట్టు పెయ్యంత గుంజుకపోయ్యి, కండ్లు కంతల్ల వడి. “ఏమ్రా బామ్మర్ది, ఎప్పుడస్తివి” అని పల్కరిచ్చిండు. గట్టిగ కావలిచ్చుకోని ముద్దువెట్టుకున్నడు. “ఉండుబే! నేనేమన్న పోరినా.” అంటే శిన్నప్పటినుంచి నువ్వేగాదురా నా ల**వు” అన్ని మల్ల గట్టిగ నవ్విండు.

     ఇద్దరం కల్శి ఇంకో రెండు బీర్లు తీస్కోని, కూలిపోయిన గఫార్ మామోళ్ళ ఇంటిగోడల్ల కూసున్నం. “మంచిగ సంపాదిచ్చుకో, మంగల్సార్ సచ్చిపోకుంటే మంచిగుండురా. నేనంటే ఇట్ల హాబిట్సులల్ల వడి ఆగమైన. నువ్వన్న మంచిగుండు.” అని నవ్వుకుంటనే తాగిండు. అప్పటికే ఊళ్ళే సగం ఇండ్లు ఖాళీ అయినయ్. ఆనాడు ఇద్దరం చాన సేపే మాట్లాడుకున్నంక. “ఊరంత నాశనం అయినట్టేరా, సోడాలమ్ముడు బందైనట్టే. ఊరంత తమ్సప్‌లేనాయే, బీర్కీశెలేనాయే.” అని నాదిక్కు సూడకుంట సీద ఆళ్ళింట్లకు వొయ్యిండు. అదే సూపు మళ్ళ వాన్ని సూడలేకపోయిన.

    తర్వత వో ఎనిమిదేండ్లకు పురాగ ఖాళీ అయిన ఊళ్లె ఒక్కడే ఆ ఇంట్ల ఉరివెట్టుకొని సచ్చిపోయిండట. ఎవలో వాసనచ్చి చూసేదాక ఆని సావు గూడ తెల్వలేదట. వాడు జరిగిపోయిన నెల తర్వాత ఎవరో చెప్తే తెలిసింది ఈ సంగతి …

         ఇప్పటికీ ఎప్పుడన్నా గోలిసోడ కనవడితే నరెందర్ గాడు యాదికొస్తడు. “సోడల ఏస్తే తియ్యగుండే శాక్రిన్, డైరెష్ట్ నోట్లేసుకుంటే శేదుంటదిరా” అని ఆడు చెప్పిన మాటే యాదికొస్తది. ఊరూ, 11-A బొగ్గు బాయీ యాదికొస్తయ్. వాడు తాడుకు వేళ్ళాడినట్టు తల్కాయల బొమ్మ కనవడ్తది.  ఆడు పుక్కట్ల తాపిచ్చిన సోడనీళ్ళు కండ్లల్ల కదిలినట్టు అనిపిస్తది.   

      Happy friendship Day రా !  సోడలోడా   😢

క్యాంచి: అడ్దతొక్కుడు.

శేల్ బొగ్గుపెళ్ళ: సరిగ్గా మండని నాసిరకం బొగ్గు.

సరీంగ : సరిగ్గా

One thought on “మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె Part 3

  1. నీ ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ లో మునిగి తేలుతున్నాను, బ్రదర్! గుండెలు పిండినట్లుగానూ, నరాలు మెలి తిప్పినట్లుగానూ ఉన్నాయి. అయ్యో, ఎందుకింత దుఃఖం మనుషులకి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *