ప్రముఖ జర్మన్ రచయిత కాఫ్కా ‘మెటమార్ఫాసిస్’ నవలలో ‘గ్రెగర్ సంసా’ అనే
యువకుడు ఒక కంపెనీ తరఫున ట్రావెలింగ్ సేల్స్ మాన్‌గా పనిచేస్తుంటాడు. తెల్లవారుజామున నాలుగింటికి రైలు అందుకుని రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పని చూసుకుని తిరిగి రైలు పట్టుకుని రాత్రికి ఇంటికి చేరడం. రోజూ ఇదేపని. అతనిమీద ఆధారపడిన తండ్రి, తల్లి, సోదరి కోసం అతను ఆ పని చేయక తప్పేది కాదు. తెల్లవారుజామున లేచి పరిగెట్టడం, గంటల తరబడి ప్రయాణం చేయడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేవాడు. ఇష్టం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు అదేపని చేసిచేసి చివరకు ఒక తెల్లవారుజామున లేచేటప్పటికి గ్రెగర్ సంసా మంచంలో ‘బొద్దింక’గా మారిపోయి ఉంటాడు. యాంత్రికమైన ఉద్యోగ జీవితాన్ని కాఫ్కా అలా సింబాలిక్‌గా చెబుతాడు. ‘మెటమార్ఫాసిస్‌కు ఒకరకంగా కొనసాగింపే మమతా కాలియా ‘పరుగు’. ఇప్పటి ‘సాఫ్ట్‌వేర్’ లాగానే ఇరవయ్యో శతాబ్దపు ఆఖరి దశకాన్ని కుదిపేసిన ఒక మహా ప్రభంజనం ఉంది. ఆ మహా ప్రభంజనమే ఎమ్.బి.ఎ. అనే మూడు అక్షరాలు. ఆ మూడు అక్షరాల పదం లక్షలాది మంది యువకుల జీవితాల్ని వాళ్ళ ఆలోచనాధోరణుల్ని ఎలా మార్చివేసిందన్నదే ‘పరుగు’ ఇతివృత్తం. తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చడం కోసం ఇష్టం లేకుండా ఎమ్.బి.ఎ. చేసి ఆ మహాకాల యంత్రంలో చిక్కుకుపోయిన మరో ‘గ్రెగర్ సంసా’నే ఇందులోని కథానాయకుడు పవన్. అలహాబాద్‌లో తల్లిదండ్రులతో పాటు గడిపిన ప్రశాంత జీవితం నుంచీ అహ్మదాబాద్ పోటీ ప్రపంచంలో పవన్ చేసిన అస్థిత్వ పోరాటమే ‘పరుగు’ కథ. ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’’ సూత్రాన్ని నరనరాల్లో జీర్ణించుకున్న వ్యాపార సంస్కృతిలో ఈ ఎమ్.బి.ఎ. యువకుల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో మమతా కాలియా గారి మాటల్లో చూద్దాం – ‘‘పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేసే ఈ కుర్రాళ్ళంతా ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు అలుపులేకుండా శ్రమిస్తూనే ఉంటారు. నిలదొక్కుకోడానికి నానా తిప్పలు పడుతుంటారు. వీళ్ళకసలు తిండి, నిద్ర అన్న గొడవే ఉండదు. కంప్యూటర్ స్క్రీనుకి గుడ్లప్పగించి భోజనం అయిందనిపిస్తారు. కంపెనీ టార్గెట్లు ఎలా చేరుకోవాలో వ్యూహాలు రచిస్తూ ఉంటారు. కంపెనీ టార్గెట్లు అందనంత ఎత్తులో ఉంటాయి. కొద్దిమంది మాత్రమే వాటిని అందుకోగలుగుతారు.’’ లక్షలాది మంది యువకుల జీవితం, జీవిత విధానం ఇదే. పెద్దపెద్ద కంపెనీలకు, వాళ్ళు ఇచ్చే జీతభత్యాలకు జీవితాన్ని తాకట్టుపెట్టుకుని కంపెనీల టార్గెట్లు వత్తిడిలో
నలిగిపోయే ఎంతోమంది యువకుల ఆక్రందనే ‘పరుగు’. ఎల్‌పిజి కంపెనీలో పనిచేసే పవన్, షూ పాలిష్ కంపెనీలో పనిచేసే శరత్, పేస్టుల కంపెనీలో పనిచేసే రోజువిందర్, అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే అభిషేక్ – అందరూ నిర్దాక్షిణ్యమైన ఆ మహాకాల యంత్రపు కోరల్లో చిక్కుకున్నవారే. ఆ కాలయంత్రంలో ఒక్కసారి చిక్కుకుంటే ఇంక ఇల్లూ వాకిలీ ఉండదు. భార్యాపిల్లలూ, తల్లిదండ్రులూ ఉండరు. చివరికి తమకు తామే ఉండరు. ఒక్క ఉద్యోగ బాధ్యతే ఉంటుంది. ఆ మహాకాల యంత్రం వాళ్ళలోని చురుకుతనాన్ని, జిజ్ఞాసను, జీవితాసక్తిని పీల్చిపీల్చి పిప్పిచేసి చివరికి ఆ పనికిరాని పిప్పిని బైటకు గిరవాటువేస్తుంది. ఒక్కసారి వెనక్కుతిరిగి చూసుకుంటే అక్కడ వారికంటూ ఏమీ మిగిలి ఉండదు. ఒక భయంకరమైన మహాశూన్యం తప్ప. యాంత్రిక జీవితం తప్ప. ‘‘జీవితంలో ఎప్పుడూ ముందుకే వెళ్ళాలి. వెనక్కి తిరిగి చూడొద్దు’’ అని ఉగ్గుపాలతో తల్లి నేర్పించిన అస్థిత్వ పోరాటంలోకి దిగిన పవన్ ‘‘ఎక్కడో అహ్మదాబాద్‌లో బదులు ఇక్కడికి దగ్గర్లోనే ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా’’ అని తల్లితండ్రులు అడిగినప్పుడు ‘‘నాకు సిటీ ముఖ్యం కాదు. నా కెరీర్ ముఖ్యం. నాకు కావాల్సింది సంస్కృతి కాదు, వ్యాపార సంస్కృతి. కంజ్యూమర్ కల్చర్ ముఖ్యం’’ అని అందుకే చెప్పగలుగుతాడు. పవన్ దృష్టిలో పెళ్ళి కూడా ఒక ‘డీల్’. తనకు ఇష్టమైన స్టెల్లాను వచ్చే నెలలో పెళ్ళి చేసుకుంటానని పవన్ చెప్పినపుడు ఇంత త్వరగా’ నా అని తల్లి రేఖ అడుగుతుంది. అప్పుడు పవన్ ‘‘మాకు చాలా పనులున్నాయమ్మా. పెళ్ళి కోసం నాలుగు రోజులు మించి కేటాయించలేం’’ అంటాడు. తనకు ఎంతో ఇష్టమైన స్వామీజీ కూడా ఈ ‘డీల్’కు అంగీకారం తెలిపారు అన్నప్పుడు రేఖ ‘‘డీల్ ఏంటి డీల్? పెళ్ళి అంటే ఏదో వ్యాపారం అనుకుంటున్నావు’’ అంటుంది. అప్పుడు పవన్ ‘‘నాకైతే రెండిటిలో పెద్దగా తేడా ఏం కనిపించడం లేదు’’ అంటాడు. స్టెల్లాతో వివాహం అయిన వెంటనే పవన్ మూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో కంపెనీలో చేరడం తండ్రి రాజేష్‌కి మింగుడుపడదు. ఆ విషయం అడిగినపుడు ‘‘నాకు నా కెరీర్, స్వేచ్ఛ ముఖ్యం. వాటిని ఎప్పటికీ వదులుకోలేను’’ అంటాడు పవన్. ‘‘నిజం చెప్పాలంటే నెల తిరిగే సరికల్లా ఎక్కడ జీతం వస్తే అదే మన చోటు నాన్నగారూ. అంతకుమించి ఆలోచించడానికి ఇంకేం లేదు’’ అని స్పష్టం చేస్తాడు కూడా. పవన్ మాటలకు అతనిలో వచ్చిన విపరీతమైన మార్పుకి తల్లి రేఖ ఆశ్చర్యపోతుంది. రేఖ ఆ మాటే అన్నప్పుడు పవన్ ఎదురుదాడికి దిగుతాడు. ‘‘మీ స్కూలు గుమస్తా కొడుకు కూడా ఎమ్‌బిఎ ఎంట్రెన్స్ పాసయ్యాడని ఎంత సాధించావు నన్ను. అప్పుడు నాకెంత బాధగా ఉండి ఉంటుందో, నాలో నేను ఎంత కుమిలిపోయి ఉంటానో ఒక్కసారి ఊహించు. మీరు నన్ను తీసుకెళ్ళి నడి సముద్రంలో విసిరేశారు. ఈదడం తప్ప నాకు వేరేదారి లేదు. మీ కలలు నా ప్రాణానికి వచ్చాయి’’ అని ఏకంగా తల్లిపై ఎదురుదాడికి దిగుతాడు. పవన్ మాటల్లోని ఆవేదనని, నిజాన్ని గుర్తించిన రేఖ మౌనంగా ఉండిపోతుంది. కవులు, రచయితలు, దార్శనికులు అంటారు. దానికి ‘పరుగు’ ఒక చక్కటి నిదర్శనం.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతరం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని వారి భవిష్యత్ చిత్రపటాన్ని బహుముఖాలుగా ఆవిష్కరిస్తుంది ‘పరుగు’. పక్షులూ, పర్యాటకులే కాదు కన్నపిల్లలు కూడా వలసపోతారని మమతా కాలియా అంటారు. ‘‘పిల్లలు కొత్తకొత్త దేశాలకి ఎగిరిపోతారు. తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌లలో నిలబడి చెయ్యి ఊపుతూ కొడుకు కనిపిస్తున్నంత సేపూ చూస్తూ ఉండిపోతారు’’ అన్నది ఇవాళ లక్షలాది మంది తల్లిదండ్రుల విషయంలో అక్షర సత్యం. అట్లా ఎగిరిపోయిన వలసపక్షుల్లో సోనీసాహెబ్ కొడుకు ఒకడు. సోనీసాహెబ్ ఉదంతం ఎన్‌ఆర్‌ఐ పిల్లల తల్లిదండ్రుల మానసిక క్షోభకు పరాకాష్ట. సోనీసాహెబ్ చనిపోయినప్పుడు ఆయన ఎన్‌ఆర్‌ఐ కొడుకు అంత్యక్రియలకు వెంటనే రాలేనని తండ్రి దేహాన్ని మార్చురీలో ఉంచమని అంటాడు. ‘‘అన్ని రోజులు శవాన్ని ఎలా ఉంచటం’’ అంటే ‘‘ఇక్కడ నెలల తరబడి శవాలు మార్చురీలోనే ఉంటాయి. కొడుకులకి వీలున్నప్పుడే అంతిమ సంస్కారాలు కానిస్తారు’’ అంటాడు. ఎవర్నయినా ఆపద్ధర్మకొడుకుగా భావించి తండ్రి అంత్యక్రియలు జరిపించమని తల్లితో చెబుతాడు. వ్యాపార ప్రకటనల నైతిక నిబద్ధతపై కూడా ‘పరుగు’ చర్చకు పెడుతుంది. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు ప్రకటనలను చేయడం, పచ్చి అబద్ధాలను వాస్తవాలుగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని అభిషేక్ భార్య రాజుల్ మధనపడుతున్నప్పుడు ‘‘వ్యాపార ఆర్థికశాస్త్రంలో నీతినియమాలు చొప్పించి నువ్వు అనవసరంగా తికమకపడుతున్నావు. నేను ఇప్పటికి మానేజిమెంటు, మార్కెటింగ్‌కి సంబంధించి సుమారు ఐదువందల పుస్తకాలు చదివాను. ఏ ఒక్క పుస్తకంలో కూడా ‘నైతిక విలువలు’ అన్న అధ్యాయం లేదు’’ అని స్పష్టం చేస్తాడు పవన్. మమతా కాలియా ‘పరుగు’ ఇప్పటి అవసరం. ఎందుకు పరుగు పెడుతున్నారో, దేనిని పణంగా పెట్టి దేనికోసం పరుగు పెడుతున్నారో ఆ పరుగు పందెంలో గెలిచి ఓడారా, ఓడి గెలిచారా అన్నది ఎవళ్ళకి వాళ్ళు వేసుకోవలసిన ప్రశ్న. ఇది పవన్ ఒక్కడి పరుగు కాదు. పవన్ లాంటి కోట్లాదిమంది యువకుల పరుగు. కోట్లాదిమంది తల్లిదండ్రుల పరుగు. ఈ పరుగు అనంతం. ‘‘పిల్లలకు సౌకర్యవంతమైన జీవితం ఇచ్చి తల్లిదండ్రులు ఎప్పుడేమవుతుందా అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఒంటరి పక్షులు అయిపోయారు.’’ ‘‘ఈ రోజుల్లో వైరల్ ఫీవరులాగా ఈ ఫారెన్ వైరస్ దేశమంతా వ్యాపిస్తోంది.’’ ‘‘అసలు మనకి మన పిల్లల గురించి ఏం తెలుసు? ఎంత తెలుసు? వాళ్ళ ఆలోచనలు, లక్ష్యాలు, ఇబ్బందులు` వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటారు.’’ లాంటి ఆణిముత్యాలు, అక్షర సత్యాలు ‘పరుగు’ అంతటా కనిపిస్తూ రచయిత్రి ప్రతిభకు, మానసిక పరిణతికి అద్దం పడుతుంటాయి.
‘పరుగు’ తెలుగు అనువాదం చక్కగా సరళంగా సాఫీగా అచ్చ తెలుగులో చదువుతున్నంత సహజంగా ఉన్నందుకు నరసింహం శివకోటిగారిని ప్రత్యేకంగా అభినందించక తప్పదు. ఎలాంటి అచ్చుతప్పులు లేకుండా ఉండడం మరో మంచి విశేషం.

