ఇతర భాషా సాహిత్యాన్ని చదవడం అంటే మన పరిమితులను విస్తృత పరుచుకోవడం, మన ప్రపంచాన్ని పెంచుకోవడం. మనల్ని మనం అభివృద్ది పరుచుకోవడం. అందుకే అనువాద సాహిత్యం చదవాలి. ఇతర భాషా సంస్కృతులను, జీవన సూత్రాలను, ప్రాంతాల వైవిధ్యాలను తెలుసుకుంటున్న కొద్దీ మానవ సమాజాన్ని ఏకసూత్రంలో బంధిస్తూ, వైవిధ్యంలోని సమానత్వాన్ని అర్థం చేసుకుంటూ మానవ సౌభాతృత్వానికి పునాదులు వేసుకోవడం సాధ్యమవుతుంది. దీనికి అనువాద సాహిత్యం ఎంతో సహాయపడుతుంది.
అనువాద రచన మరో ప్రాంతపు రచయితలను, మనది కాని కొత్త ప్రాంతాలను మనకు పరిచయం చేస్తుంది. దీని కోసం అనువాదకులు తమని తాము అండర్ ప్లే చేసుకుంటూ రచయిత మనసులోకి ప్రవేశించి అతను చెప్పినవి, చెప్పాలనుకుంటున్నవి, చెప్పకుండా పాఠకులకు వదిలేసిన విషయాలను అదే శైలిలో మరో భాషలోకి తర్జుమా చేసి తటస్థంగా ఉండిపోవడం అలవర్చుకోవాలి. ఏ విషయం గురించైనా మరొకరితో చర్చించేటప్పుడు మన అభిప్రాయాలు వచ్చేయడం సహజం. కాని అనువాదకుడు ఒక రకమైన తటస్థ స్థితిలో ఉండిపోయి రచయితను, పాఠకులను పరస్పరం పరిచయం చేయాలి. చాలా సందర్భాలలో వారిద్దరూ దగ్గరై అనువాదకుని ఉనికే మర్చిపోతారు. అలా వాళ్ళు తనను ఎంత మర్చిపోతే అనువాదకుడు అంత గొప్పగా పని చేసినట్లు. అంటే రచయిత తన ముద్రను పాఠకులు గుర్తించేలా రచన చేసి విజయం సాధిస్తే, అనువాదకుల విజయం వాళ్ళు ఎక్కడా ఆ రచనలో కనిపించకుండా ఉండడంలోనే ఉంటుంది. తాను ఎటువంటి స్వేచ్చ తీసుకోకుండా రచయిత అభిప్రాయాలను స్వేచ్చగా మరో ప్రపంచంలోకి వదలడం అనువాదకుల పని. అక్కడ ఉంటూనే తాను కనిపించకుండా ఉండిపోవాలి. గొప్ప నటులు తమను కాక, నటించే పాత్ర మాత్రమే కనపడేలా ఎలా తమను తాము మలచుకుంటారో, అనువాదకులు తాము కాకుండా రచయిత మాత్రమే పాఠకులకు కనపడేలా తమను తాము మలచుకోవాలి.
అనువాదం ఇంత కష్టం కబట్టే అనువాద రచన పాఠకులను మెప్పించడం కష్టం. గొప్ప రచన అంటూ కష్టపడి చదవడం వేరు. మంచి రచన అంటూ ఇష్టపడి చదవడం వేరు. ఈ ‘అక్రమ తుపాకులు’ మంచి కథా సంకలనంగా ఇష్టపడి చదివే పాఠకులను సొంతం చేసుకునే రచన. దీనికి అనువాదకుడు శ్రీనివాస్ తెప్పలను అభినందించాలి.
ఈ సంకలనం కోసం అనువాదకుడు తమిళ సాహిత్యంలోంచి తనకు నచ్చిన కథలను ఎంచుకుని అనువాదం చేసారు. అన్నిటిలోనూ కొంత డార్క్ ఎలిమెంట్ ఉంది. వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే మానవనైజం పట్ల గొప్ప విశ్లేషణ ఉంది. కథారచన పట్ల అనువాదకుని అవగాహన ఈ కథలను సేకరించడంలో ఉపయోగపడిందన్నది నిజం. ప్రతి కథ కూడా జీవితపు లోతుల నుండి పుట్టిందే. అది ఈ సంకలనానికి ఓ పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఏదో ఓ కథను అనువాదం చేయడం కాకుండా ఒకే విధమైన మూడ్‌లో నడిచే కథలను తన టేస్ట్‌కు తగ్గట్టుగా ఎంచుకున్నాడు శ్రీనివాస్. అది ఈ సంకలనాన్ని పాఠకులకు దగ్గర చేసే మరో అంశం. కథా సంకలనమే అయినా కథలను ఓ కంటిన్యుటీలో ఉన్నట్లు వాటిని పేర్చడం జరిగింది. అంటే ఈ సంకలనం వెనుక కథలను ఎన్నుకోవడం, ఓ క్రమంలో వాటిని పెట్టడంలో కూడా శ్రీనివాస్ శ్రద్ద వహించాడన్నది అర్థం అవుతుంది.
ఇది పదిహేను తమిళ కథల తెలుగు అనువాదం.
మనిషి మనసులో ప్రేమ, మానవ సంబంధాలలోని దగ్గరితనాన్ని ఎంతో లోతుగా చర్చించే కథ ‘కేశం’. ప్రేమ మనసుల్లో జనియించడానికి, దాన్ని వ్యక్తీకరించడానికి మనిషి జీవన అనుభవం తోడవుతుంది. అనుభవరాహిత్యం ప్రేమను అనుభవంగా మాత్రమే చూస్తే, జీవితానుభవం ప్రేమను జీవన మార్గంగా మారుస్తుంది. ఆ తేడాను అర్థం చేసుకోగలవారికి ఎంతో దగ్గరయ్యే కథ నరన్ రచించిన ‘కేశం’.
జయమోహన్ ‘కామ్రేడ్’ టాల్‌స్టాయి ‘ది మాస్టర్ అండ్ మాన్’ కథను గుర్తుకు తెస్తుంది. విభిన్నమైన ఆదర్శాలను నమ్మి జీవించేవాళ్ళందరూ ఎక్కడో ఓ చోట తమ జీవనమార్గంలో కామ్రేడ్స్‌గానే మిగిలిపోతారు. చంపేవాడు, చచ్చేవాడు ఇద్దరూ ఏదో ఓ దశలో సోదరులే. దారులు వేరైనా ప్రయాణం ఒకే దిశకు అన్న విషయాన్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది జయమోహన్ ‘కామ్రేడ్’ కథ.
యజమానికి ఓ జంతువుకు ఉన్న సంబంధం, వారి చర్యలలోకి చొచ్చుకు వచ్చే ప్రేమ, కర్తవ్యం చర్చించే కథ ‘ఒక ఆకాశ శకలం’ ప్రేమ కూడా ఒక కర్తవ్యమే, దాన్ని దాటుకుని ముందుకు నడిపించే కర్తవ్యాలే మన జీవితాలకు అర్థాన్నిస్తాయి. కాని దీన్ని ఓ జంతువు, మనిషి మధ్య పెనవేసుకున్న బంధం ద్వారా వ్యక్తీకరించిన లక్ష్మీ శరవణన్ కథలోని బ్లూమౌంటైన్‌ను ప్రేమించకుండా ఉండలేం, అశోక్‌లోని బలహీనతకు అతన్ని అభిమానించకుండా ఉండడం కష్టం అవుతుంది.
దిలీప్ కుమార్ ‘ఒక ఎలుక జీవితం’ కథ ద్వారా మన జీవితాలలోని డొల్లతనాన్ని చూపించిన విధానం బావుంది. కథ ముగింపు మనకే వదిలేసినా దేవుడు ఎలుక నడుమ సంభాషణ మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది.
పంచతంత్ర కథనశైలిలో సాగుతుంది విజయరావణన్ ‘భోధిసత్వ’ కథ. ‘ప్రాణత్యాగం’ జీవితంలో ఉన్నతమైన ఆదర్శం కాదని అదో ఆత్మవంచన అనే చర్చతో కథ మొదలయి, మనిషి త్యాగం, క్రోధం, మౌనంలోని ఇతర అర్థాలను చర్చిస్తుంది ఈ కథ. మనిషి మనసులోకి చొచ్చుకు వెళుతూ మానవ ఆత్మలోని రహస్యాలను శోధిస్తుంది.
నరన్ కథ ‘నీలం రంగు’ చిత్రకారుడు మైకెలేంజిలో కళాహృదయాన్ని, అతనిలోని పర్వర్షన్‌ని, మానవ అనుభూతులను, అనుభవాలను, కళతో, రంగులతో జోడించే అతని ఆలోచనా ధోరణిని, దానికి నిశబ్దంగా బలయిన సాధారణ వ్యక్తుల జీవితాలను చూపిస్తుంది. మానవ అనుభూతులకు అమరత్వాన్ని ప్రసాదించే కళాకారుడు అవే అనుభూతులు తన చుట్టూ ఉన్నవారి జీవితాలలో దూరం అవడానికి పాత్రగా మారిపోవడం మనిషి జీవన ప్రమాణాలలోని ద్వంద్వాన్ని వ్యక్తీకరిస్తుంది. ఇదే విరోధాబాస ఎందరో గొప్ప కళాకారుల జీవితాలలో మనకు కనిపించే సత్యం. దీన్ని నరన్ కథ వివరించే తీరు బావుంటుంది.
ప్రేమించినవ్యక్తి తనను స్వీకరించకపోయినా నిజమైన ప్రేమ మాసిపోదు. కాని ఆ వ్యక్తి జీవితంలో ప్రేమకే దూరమయ్యాడని, ప్రేమరాహిత్యంతో తల్లడిల్లుతున్నాడని తెలిసిన తరువాత గుండె పగిలి ఏడ్చే ఓ స్త్రీ హృదయాన్ని తమిళ్ సెల్వన్ ‘ఎండపట్టున వెళ్ళి’ అన్న కథలో చూస్తాం. ప్రేమను అంగీకరించలేదని ఆసిడ్ దాడులకు, ప్రతీకారాలకు పాల్పడే నేటి తరానికి ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే కథ ఇది.
ఇళయరాజా, జయకాంతన్‌ల ఆలోచనా వైరుధ్యాలను వివరించే కథ ‘ఇద్దరు కళాకారులు.’ వారి పేర్లను ఇక్కడ రచయిత ప్రస్తావించకపోయినా వారెవరో తెలుసుకుని ఈ కథ చదివితే వచ్చే సష్టత గొప్ప చర్చకు తెరతీయగలదు.
కంటిచూపు క్రమంగా కోల్పోతున్న ఓ చిత్రకారుడు ప్రపంచాన్ని కొత్త రంగులతో చూడడం నేర్చుకుంటూ కళాకారుడిగా ఎదిగిన వైనాన్ని వివరించే కథ విజయరావణన్ ‘మాట్లాడే టీ కప్పులు.’ గదిలో బంధించిన పిల్లిలోని బలాన్ని వివరించే కథ అశోక మిత్రన్ ‘పిల్లి’. జీవిక కోసం ఓ గ్రామానికి తుపాకులను పరిచయం చేస్తే, వాటి వల్ల ప్రజలకు పని భారం తగ్గుతుందని, సుఖం పెరుగుతుందని ఆశ పడితే భయం పెరిగి కౄరత్వం పెరిగి జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఇది గమనించి అపరాధభావంతో జీవించే వ్యక్తిని ‘అక్రమ తుపాకులు’ కథలో జి. మురుగన్ పరిచయం చేస్తారు. ధారవి మురికివాడలో పేదవాడికి తిండి తినడమే కాదు, మలవిసర్జన కూడా ఓ పరీక్షే అని వివరించిన కథ ‘నొప్పి వెంటాడే వేళలు.’ ఈ విషయాన్ని బలమైన కథావస్తువుగా మార్చిన ఎస్.రాజేంద్రన్‌ను అభినందించాలి. మనిషికి నిజమైన తోడు తన మాటను వినే వ్యక్తిలోనే దొరుకుతుంది. వినడం అన్నది బంధానికి, మానసిక ప్రశాంతతకు ఎంత అవసరమో వివరించే కథ నరన్ రాసిన ‘మగువ చెవి.’
జీవితంలో చెడ్డ తల్లులు ఉండరనే ఓ అపోహను దూరం చేస్తుంది ఎమ్.వి. వెంకట్రామ్ ‘పిచ్చి మారాజు’. బంధాలు అనుబంధాలలోని క్రూరత్వాన్ని, స్వార్ధాన్ని, నిజాయితీగా వ్యక్తీకరిస్తుంది ఈ కథ. తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలనే బలమైన కోరికతో తనలోని అంతర్గత శక్తిని వెలికి తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వ్యక్తి కథ సెంథిల్ జగన్నాధన్ రాసిన ‘అనాహత నాదం’.
పదకొండు తమిళ రచయితల పదిహేను కథలను ఎన్నుకుని అనువదించి తెలుగువారికి అందించారు శ్రీనివాస్. ఎక్కడా ఏ కథలోనూ అనువాదకుడు కనిపించక కేవలం ఆ పాత్రలు, వారి సృష్టికర్తలే కనిపించడం ఈ సంకలనం ప్రత్యేకత. తమిళ రచయితలను తెలుగు పాఠకులకు పరిచయం చేయడానికి తనను తాను తటస్థంగా ఉంచుకోగలిగిన శ్రీనివాస్ ఏ గుర్తింపు ప్రలోభాలకు లొంగక ఇలాగే తమిళ సాహిత్యపు ఆత్మను తెలుగుకు సంపూర్ణంగా అందించిగల పెద్దమనసును ఇక ముందూ ప్రకటిస్తాడని, తాను ఎక్కడా కనపడని అనువాదాలను మనకు అందించి తెలుగు పాఠకులను తమిళ రచయితలకు ఇలా నిస్వార్ధంగా దగ్గర చేస్తూనే ఉంటాడని ఆశిద్దాం. తెలుగులో ఇలాంటి స్థాయి అనువాద రచనలు తగ్గిపోతున్న క్రమంలో ఈ ‘అక్రమ తుపాకులు’ సాహితీ పిపాసులకు ఓ పెద్ద ఊరట.
***
