మనం వంతెనపై నడుస్తున్నాం

Spread the love

1. కరువు 

******************

ఈ సంవత్సరం రాయిలాంటిది!
ఈ శరత్కాలం
మాకు ఏమీ వాగ్దానం చెయ్యలేదు..
కరువు ఏ కదలిక లేకుండా ఉంది

మేమిప్పుడు
ఏ వాన జల్లు వార్తను మోసుకొచ్చేవారి కోసం
ఎదురు చూడడం లేదు!

కింద
గుండె పగుళ్ల నేల
పైన
బంగారం రంగులో భగభగ మండే ఆకాశం...

ఇక,
నా శరీరమే నా ఆలయం కానివ్వు!

నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే
నా ఆత్మ రొట్టెను నువ్వు తాకాలి!

నువ్వు సరే అంటే నాకు సరిహద్దుల్లేవ్
ఒక్క గోధుమ గింజతో
నా పొలాన్ని విశాలం చేస్తాను!
ఒక పిట్టకూతతో
ఈ శూన్యాన్ని విస్తారం చేస్తాను
ఇక నా దేహమే నా దేశమవనివ్వు!

కరువు
కరుకు కండ్లతో నదిని తీక్షణంగా చూస్తున్నది
ఖర్జూరపు చెట్లమీదా కన్నేస్తున్నది
కానీ...
నా లోపలి లోతైన బావిని
అది కనిపెట్టలేదు!

నీతో నాకు ఏ పరిమితులూ లేవు
నిజానికి
శరత్కాల ఆకాశమే నిజమైనది!

ఒక్కసారైనా
నిన్ను నువ్వు స్త్రీలా ఊహించుకుంటేనే
నేను చూస్తున్న సత్యం నీకు కనిపిస్తుంది
నా శరీరమే నా యజమాని!

కరువు మాత్రం అలాగే ఉంది
ఆలోచన ఎండిపోయినప్పుడల్లా
నీళ్ళకోసం
భజన బృందాలు పెరుగుతాయి

నాకు ప్రవచనాలతో పనేముంది?
గొప్ప కలలుకనే వారి మేఘాల మీదికి
దేవదూతలు అతిథులుగా వస్తారు.
నీ మాటల సారాంశమంతా
నాలోనే ఉన్నప్పుడు
నీ పుస్తకాలతో పనేముంది?
నా శరీరం నాలోనే వికసిస్తోంది!

ఇప్పుడు
ఏడేళ్ల కరువు తన వికృత రూపానికి
వీడ్కోలు పలుకుతోంది
నగరంలో శాంతి ఒప్పందం జరగాలి
ఆ పాత బాబిలోనియన్ పుస్తకాల మీద
మొలిచిన గడ్డిని మేయడానికి ఓ మేక కావాలి

అసలైన ఆకాశం కావాలంటే
నా చీకటిని
నా రక్తాన్ని
నీ ఆత్మీయ ద్రాక్షారసంతో రసంతో నింపు

నాతో కలిసి
నా దేహంలోనే నివసించు!


మూలం : జఫాఫ్ (drought)
- - - మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్


**

2. మనం వంతెనపై నడుస్తున్నాం..

నాలాగే నువ్వు కూడా
రెక్కలల్లాడే ఈ పిట్ట ప్రయాణంలో
బాధను మోస్తున్నావు!
మధ్యాహ్నం మసకబారుతున్న వేళ
ఇదంతా జరుగుతోంది..
అక్కడ నువ్వంటున్నావు:
"ఓ అపరిచిత మిత్రమా!
నన్ను నది దగ్గరికి తీసుకెళ్ళు,
నీ తీరాల వెంబడి నా ప్రయాణం
చాలా సుదీర్ఘమైనది!
అందుకే
నన్ను నది దగ్గరకు తీసుకెళ్లు "

వంతెనపైన
జీవితం గురించి
బాటసారులను ఏమంటున్నారో
నువ్వు వింటున్నావు:

"ఇదిగాక నాకు వేరే పని ఉంది.."
"ఓడలో ఓ సీటు నా కోసం వేచి ఉంది.."
"జీవితంలో నాకూ ఒక వాటా ఉంది.."

కానీ నేనో..!
శివారు ప్రాంతాలకు వెళ్ళే
మెట్రోను అందుకోవాలి..
నా సొంత జ్ఞాపకాలకు నేను ఆలస్యమయ్యాను,
ఆ శాక్సోఫోన్
సంగీత సమయం కూడా మించిపోతోంది..
నా చేతిలో
ఈ రాత్రి చాలా కొంచెమే మిగిలుంది!


ఏదో రహస్య వీధి కోసం ఆరాటం పడే..
మనలోని నిగూఢమైన ఆవేదనను నువ్వు వింటున్నావు..
నా జీవితం అక్కడే ఉంది,
ఒకప్పుడు వలస సమూహాలు నిర్మించి,
వదిలి వెళ్ళిపోయిన జీవితం అది!

కానీ ఇక్కడ,
నా జీవితం
నా రొట్టె ముక్కంత మాత్రమే ఉంది,
నడుస్తున్న కాలం
వేధిస్తున్న నా విధి గురించి,
అందమైన
అయోమయ భవిష్యత్తు గురించి
మిగిలిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.

ప్రతిధ్వనికి బదులు ప్రతిధ్వనిలా..
ఈ మాటలు అన్నది ఎవరు?
నేనా లేక ఆ అపరిచితురాలా?
ఎవరూ ఎవరి దగ్గరికీ తిరిగి వెళ్ళలేరు..
ఆ అనంత కాలం
మన వయసును ముడిసరుకుగా వాడుకుని,
తన చేతి పనులతో
తనను తాను నిర్మించుకుంటోంది.

ప్రేమ అదృశ్యమవ్వడమే
ప్రేమకు ఒక రూపమవనివ్వు..
ప్రేమ గుణం తెలిసినవాడు
ఎలా ప్రేమిస్తాడోనని నేను ఆశ్చర్యపోతుంటాను!

బహుశా మనలోని ప్రేమ
మన నిరీక్షణతో అలసిపోయి,
మంచాన పడొచ్చు!
"మన రేపటి కోసం
సరిపడా సమయం ఉందని"
అది చెప్పదు.

మరో పది నిమిషాలు!
ఈ వంతెనపై నడవడానికి అది చాలు!

కాసేపట్లో మనం మారిపోవచ్చు..
మనమధ్యే ఉన్న ఆ మూడవ వ్యక్తిని
అదే...
ఆ 'మృత్యువు' ముఖాన్ని
మనం మర్చిపోవచ్చు.

ఎన్నోసార్లు దగా చేసిన
ఈ ఆకాశం కింద ఉన్న
మన ఇంటి దారిని మర్చిపోవచ్చు.

ఓ అపరిచిత నేస్తమా !
నన్ను ఆ నది దగ్గరికి తీసుకెళ్ళు..
కాసేపట్లో మనం మారిపోవచ్చు,
బహుశా ఏదో అసంభవమేదో జరగొచ్చు!
రచనలో లాగే..
అన్ని మలుపులు
వాటి సమయాన్ని బట్టి జరుగుతాయి!
కవితలోని శూన్యాన్ని నింపడానికి
వెన్నెలలా ఏదో ఒకటి వస్తుంది.

నన్ను పూర్తిగా వదిలేయకు..
అలాగని పూర్తిగా తీసుకోకు..
నన్ను సరైన స్థలంలో,
సరైన కాలంలో ఉంచు,
నువ్వే నా మార్గం,
నువ్వే నా దిక్సూచివి!

ఇది నిజమైన దేశం
రూపకం కాదు..
నీ చేతులు నా చుట్టూ ఉన్నాయి..
అది పవిత్ర గ్రంథం పక్కనైనా కావచ్చు
ఇక్కడైనా కావచ్చు!

మనలో ఎవరన్నారు? :
ఒకవేళ కవిత్వమే గెలిస్తే,
ఆ భాష భూమిని శూన్యం నుండి రక్షిస్తుందని!

మనలో ఎవరన్నారు? :
ఈ సుదీర్ఘ ప్రయాణంలో
నేను మర్చిపోతానని
నా హృదయం చేసే
ఎన్నితప్పులనైనా నేను క్షమిస్తానని?

**

మూలం: నమషీ అలా అల్-జిస్ర్ (we Walk on the Bridge)
- మహమూద్ దర్వీష్

స్వేచ్ఛానువాదం: రహీమొద్దీన్
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *