బీరుట్ నగరంలో
వదిలేయబడ్డ ఆ థియేటర్లో
నాకో సీటుంది
నాటకం స్క్రిప్ట్ బాగా లేదని కాదు!
ఇంకేదైనా కారణంగా
నా చివరి అంకాన్ని
అనుకున్నట్టుగా గుర్తుంచుకుంటానో
మర్చిపోతానో!
అంతా కోలాహలం
యుద్దపు రోజుల వలే!
ఆశలు కోల్పోయిన ప్రేక్షకుల ఆత్మకథ లాగా
ఒక గందరగోళం!
నటులంతా
నాటకం స్క్రిప్ట్ లను చింపేస్తూ
మాలో రచయితను వెదుకుతున్నారు
పాత్రలు మరిచిపోయిన మేము
ప్రేక్షకుల సీట్లలో కూర్చున్నాము!
నేను నా తోటి కళాకారునితో అన్నాను
"నువ్వు రచయితవా?
"కాదు "
"కాకుంటే
నీ ఆయుధాన్ని తీయకు!"
అతనడిగాడు,"రచయిత నువ్వేనా?"
"కాదు "
ఇద్దరం
మా భయం ఒడిలో కూర్చుని ఉన్నాం!
నేనన్నాను
"ప్రమాదాన్ని తప్పించుకోవటానికి
తటస్థ హీరోలా ఉండు!"
అతను సాలోచనగా,
"రెండో సన్నివేశంలో
ఏ హీరో గొప్ప మరణం పొందేది లేదు!
నేను మిగతా భాగం కోసం ఎదురు చూస్తాను"
అన్నాడు
అప్పుడు నేనొక అంకాన్ని పునరాలోచించాను
"నా సోదరులకు యుద్ధం
చేసిన విధ్వంస గాయాలకు
మరమత్తు మందు రాస్తాను"
నేను మరోసారి అతన్నడిగాను
" రచయిత నువ్వేనా?"అని
అతను బదులిచ్చాడు
"నేనూ,నువ్వూ ఇద్దరమూ
ముసుగేసుకున్న రచయితలం!
ముసుగేసుకున్న సాక్షులం!"
నేనన్నాను
నాటకంతో నాకే సంబంధం లేదు
నేను కేవలం ప్రేక్షకుణ్ణి!
అతడు నా మాటలను
ధృడంగా ముక్కలు చేసాడు
"ప్రమాదం పులిలా పొంచి ఉన్న తలుపు దగ్గర
ఎవడూ ప్రేక్షకుడిగా ఉండడు!
ఏ తటస్థ కథానాయకుడూ ఉండడు!
ఈ చివరి అంకంలో
నీ పాత్ర నువ్వు తప్పక పోషించాలి! "
నేను ప్రారంభాన్ని కోల్పోయాను!
ఇంతకీ
ఈ నాటకానికి మొదలేమిటి?!
మూలం : (I Have A Seat In The Abandoned Theater)
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
