ఒక సైనికుని తెల్ల లిల్లీల కలలు

Spread the love

ఊగే తెల్ల జెండాల లిల్లీలను, 
చల్లగాలుల ఆలివ్ కొమ్మను
వికసించే సాయంకాలాల 
ఆమె హృదయ గీతాలను
అతడు కలగంటున్నాడు

కొమ్మల్లో పక్షి,
కమ్మని వాసనల
నిమ్మ పూల కలల మూటను
నా ముందు విప్పాడు

అతడు కలలకు మేధో వర్ణం అద్దడు
వస్తువులను
ఎలా చూస్తాడో
అలాగే అర్థం చేసుకుంటాడు


అతనికి మాతృభూమి అంటే
అమ్మ చేతి కాఫీ తాగడం
రాత్రవుతుండగా తిరిగి రావడం

నేలంటే ఏమిటో అంతగా తెలియదంటాడు
కవులు కవితల్లో చెప్పినట్లుగా
అతని రక్త మాంసాలకు అంటుకోని అనుభూతి

అతని కళ్లకు నేల
ఉద్వేగ రహిత ఒక కిరాణా కొట్టు 
ఒక వీధి
రోజువారీ దినపత్రిక

అతన్నడిగాను
నేలను నువ్వు ప్రేమిస్తున్నావా?

"నా ప్రేమ ఒక పిక్నిక్
ఒక గ్లాసు వైన్
ఒక లవ్ ఎఫైర్ " అన్నాడు

నేల కోసం మరణిస్తావా? అంటే
లేదంటాడు
మట్టితో అతని అనుబంధం అంతా
ఒక కథ,
ఒక ఆవేశపూరిత ప్రసంగం
అంతకు మించి ఏమీ లేదంటాడు !

వాళ్ళు
అతనికి నేలను ప్రేమించడం నేర్పారు
అయితే
అతని హృదయపు పేజీలో అచ్చుకాలేని
ప్రేమపాఠం అది

నేల వేర్లు
దాని కొమ్మలు,
దాని పచ్చిక వాసన
తనకెప్పుడూ తెలియదంటాడు

మరి మాతృభూమి పట్ల నీ ప్రేమ ఎంత?
అది సూర్యుడిలా,
కోరికల గోళంలా 
నీ లోపలి ఆకాశంలో మండిందా? అంటే

అతను నా వైపు తెల్ల కాగితంలా చూస్తూ
నేలను నా తుపాకీ గొట్టం ద్వారా ప్రేమిస్తున్నానన్నాడు!

ఆ ప్రేమ -
గతం చెత్తకుప్పలోంచి
ఏరుకున్న విందుల నుంచి,

వెలికితీసిన
వయస్సు తెలయని
వాస్తవంచెప్పలేని
చెవిటి మూగ విగ్రహం నుంచి పుట్టినది!


అతను ఇంటి నుండి బయలుదేరే క్షణం
తన తల్లి ఎలా తల్లడిల్లిందో చెప్పాడు

సైన్యం అతన్ని ముందుకి నడిపించినప్పుడు
నిశ్శబ్దం మింగిన ఆమె వేదనా స్వరం
అతని శరీరంలో ఒక కొత్త ఆశకు జన్మనిచ్చిందట!
ఆ ఆశే యుద్ధ మంత్రిత్వ శాఖ గుండా
పావురాల గుంపులా ఎగురుతుందట!

తన అలసటను సిగరెట్‌లా వెలిగించాడు
రక్తపు చిత్తడి నుండి పారిపోతున్నట్లుగా...

అతని కలల్లో-

తెల్లటి లిల్లీలు
ఆలివ్ కొమ్మ,
నిమ్మ చెట్టులోంచి
ఉదయాన్ని ఆలింగనం చేసుకునే పక్షి!
...
ఇంకా ఇక్కడ ఏమి చూశారని అడిగాను

"నేనేమి చేశానో
అదే చూశాను
మృతుల రక్తంతో ఎరుపెక్కిన
ముళ్ల పెట్టెను చూశాను

నేను
వాళ్ళను ఇసుకలో కాల్చాను
వాళ్ల ఛాతీలో... కడుపులో...
తూటాలు దించాను" అన్నాడు

ఎంతమందిని చంపావంటే

"లెక్క అంతు చిక్కదు
దక్కింది ఒక్క పతకం మాత్రమే" అన్నాడు

బాధను
గొంతులోనే  అదిమి పెడుతూ-
చనిపోయిన వారిలో ఒకరి గురించి
చెప్పమని అడిగాను.

అతను తన సీటులో
ఒక పశ్చాత్తాప హృదయంలా కదిలాడు

మడతపెట్టిన వార్తాపత్రికతో ఫిడేలు చేస్తూ
విరిగిపడుతున్న పాటలా అన్నాడు :

"నేను చంపిన ఒక వ్యక్తి
రాళ్లపై గుడారంలా కూలిపోయి,
పగిలిపోయిన గ్రహాలను
రాలిపడ్డ నక్షత్రంలా ఆలింగనం చేసుకున్నాడు

అతని ఎత్తైన నుదుటిపై రక్తం కిరీటమైంది
అతని ఛాతీ గుర్తింపు లేని ఖాళీ పతకంలా ఉంది

అతను
ఒక రైతు కావచ్చు
ఒక కార్మికుడు కావచ్చు
ఒక వీధి వ్యాపారిలా కూడా కనిపించాడు
కానీ అతను
శిక్షణ పొందిన పోరాట యోధుడయితే కాదు!"
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *