ఒక నామవాచక వాక్యం

Spread the love

ఎక్కడా క్రియా పదం లేని 
ఒక నామవాచక వాక్యం

నామవాచక వాక్యం,
రాత్రి పక్కలోంచి సముద్రానికి  పూసిన  సుగంధం
ఉప్పదో పుల్లనిదో!

మీ అపరిచిత కిటికీల దగ్గర
గాయపడ్డ నా ఆనందం లాంటి సూర్యాస్తమయం
ఫీనిక్స్ లా పుట్టుకొచ్చే నా ఆకుపచ్చ పుష్పం

అవసరాల అంచునలు దాటి
నా హృదయం రెండు ద్వారాల నడుమ సంకోచంగా తచ్చాడుతోంది
ప్రవేశం ఒక పరిహాసం,
నిష్క్రమణ ఒక చిక్కుముడి!

తీర్పు దినపు దారిలో
క్రిక్కిరిసిన జనాల మధ్యలో
నా మార్గ దర్శి -
నా నీడ ఎక్కడ?

నగరపు గోడమీద
చెస్ట్‌నట్ , నలుపుల రెండు దట్టమైనరంగుల
పురాతన రాయిలా నేను
నా సందర్శకుల వైపు
చొచ్చుకు వచ్చిన గరుకు నీడలా!

వర్తమానం కోసం
పాద రక్షలు లేని నా అడుగు
వెనక్కో ముందుకో ఎటు నడవాలో!
విశాల ఆత్మ గౌరవ గమ్యానికి చేర్చే మెట్ల దారికి
రెండో దారేది?
అసలు దారికి దారేది?

వర్తమానాన్ని వెతుక్కుంటూ
కాలిబాట మీద ఎక్కడున్నాం మనం?

పూర్తి వాక్యాలు కాని మన మాటలు
ఎగిసిపడే సముద్ర తీరంలో ఏరుకోలేని నీటి నురగ
అక్షరాల  చుక్కలుగా రాలిపోతున్న మాటాలన్నీ
వర్తమానం కోసం మనం వేస్తున్న అడుగులు
*

మూలం : (A Noun Sentence)
- మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *