దురాక్రమణ
భూగోళమంత నోరు తెరుచుకుని
బుసకొడుతున్నది
దానికి
పగలూ రాత్రులను
గుటకలు గుటకలుగా తాగుతున్నా
తీరని దాహార్తి
తల్లి పాలు తాగిన మమతల ఆనవాళ్లను
ఎప్పుడో చెరిపేసుకున్న పెదాలపైన
దేహాలను చెరుకు గడలుగా నలిపి నలిపి చెమటనూ నెత్తురునూపిండుకొని
పీల్చి పిప్పిచేసే కర్కష కోరల పిశాచి
ఉన్మాదం ఉక్కు పాదాల కింద
చితికి ముక్కలవుతున్న స్వేచ్చ
నోరు విచ్చుకొని
నెత్తురు కక్కుతున్న బతుకు మొగ్గలు
జీనోసైడ్ మృగం అరాచకంగా సంచరిస్తున్నది
జీవితాలు విరిగి
నేలకొరుగుతున్న నగరాలవుతున్నాయి
గిరాగిరా తిరుగుతున్న భూగోళం చుట్టూ
ఆకలి తీరని కాలసర్పం
తప్పించుకో లేని విషవలయంలో
నెత్తురు కారుతూ భూమి
రక్త దాహాల దాడికి తిరుగ పడుతూ
రక్త పుటేరులై ఎగిసిపడుతూ
జనం నెత్తురు
బిగిసిన పిడికిళ్లులో
జెండాలా ఎగురుతున్న స్వేచ్చ!
దేశం ఏదైనా ,కాలం ఏదైనా
స్వేచ్చ మానవజాతి ఏకైక చిరకాల స్వప్నం
భళ్ళున పగిలిపోతూ …
మళ్లీ మొలకలేస్తూ…