మాకు గుర్తు చేయనవసరం లేదు :
మా గుండెల్లోనే ఉన్నది కర్మైల్ కొండ
మా కనురెప్పలపైన గలీలీ పచ్చిక!
"ఒకవేళ ఆమె ఒడిలోకి
ఒక నదిలా పరుగెత్తగల్గి ఉంటే..." అనకండి,
అలా అనకండి:
మేమూ, మా దేశమూ
ఒకే దేహపు రక్త మాంసాలం.
జూన్ కు ముందు
అప్పుడే రెక్కలు విప్పిన పావురాలం కాదు గనుక
బానిసత్వంలో మా ప్రేమ మొక్కలా వాడిపోలేదు
సోదరీ,
ఈ ఇరవై ఏండ్లు
మా పని అందంగా కవిత్వం రాయడం కాదు
అలుపెరుగక పోరాడడం
నీ కళ్ళమీదుగా
కిందికి వాలుతున్న చిక్కటి నీడ
దేవుని దెయ్యానిది!
అతడు
మన తలల చుట్టూ నిప్పుల సూర్యుణ్ణి
తలపాగాలా చుట్టడానికి
జూన్ నెలలో పుట్టిన వాడు*
అతని రంగు అమరుల రక్తం అంటిన రంగు
అతనికిష్టమైన రుచి నెత్తుటి ప్రార్థన రుచి!
అతడు దేహాలను ఎంత బాగా చంపగలడో
అంత బాగా ఆత్మలను తిరిగి బతికించగలడు!
నీ కంటికి
ఇది ఇప్పుడే మొదలవుతున్న రాత్రి కావచ్చు
నా అంతర్నేత్రానికిది
అంతమవుతున్న సుదీర్ఘ రాత్రి
కరువు కాలం నుంచి తిరిగొచ్చే దారిలో
ఇప్పుడిక్కడ మేం కలిసే ఉన్నాం.
ఇంకా
నైటింగేల్ స్వరాన్ని
ఆక్రమణదారుని ముఖమ్మీద
మెరిసేకత్తిగా మలిచేదేమిటో
మేం తెలుసుకున్నాం
శ్మశాన నిశ్శబ్దాన్ని
జీవన వనాల పండుగలా
విరబూయించేదేమిటో మేం తెలుసుకున్నాం!
నువ్వు నీ కవితా గానం చేస్తుంటే
బాల్కనీలు గోడల్ని నేలమట్టం చేయడంనేను చూసాను.
నగరపు కూడలి పర్వత పాదాల దాకా
విస్తరిస్తున్నది.
మేము విన్నది సంగీతం కాదు.
మేము చూసింది పదాల రంగు కాదు.
ఆ గదిలో పదిలక్షల వీరులున్నారు
ఈ నేల
అమర వీరుల దేహాలను తనలో కలుపుకుంది
ఈ నేల
జీవనాధార గోధుమ గింజల్ని
ఆశల నక్షత్రాలను వాగ్దానం చేస్తుంది
ఈ మట్టికి మొక్కు! !
ఈ భూగర్భం నుంచి పుట్టే
ఖనిజ లవణ జలాలం మనం
ఈ నేల నెత్తుటి గాయాలం మనం
కానీ,
ఆఖరి నెత్తుటి బొట్టును కూడా
ఆయుధంగా మలిచి పోరాడే గాయాలం
సోదరీ!
నా గొంతు నిండా కన్నీళ్లు
నా కళ్ళనిండా అగ్ని జ్వాలలు
ఇప్పుడు నేను స్వతంత్రుడిని
ఇక నేను
సుల్తాన్ గేటు ముందు నిరసిస్తూ నిలబడను
ప్రభాత ద్వారం దగ్గర
ప్రాణాలర్పించిన వాళ్ళూ
అర్పించబోయేవాళ్ళూ
అందరూ నన్ను హత్తుకొన్నారు,
నన్నో ఆయుధం చేశారు!
ఓ నా భరించలేని గాయమా!
ఎవడో ఎత్తుకెళ్ళడానికి
నా దేశం సూటుకేసు కాదు
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
