ఈ లోకపు లెక్కల కన్నా
పరలోక గ్రంథాలతోనే వాళ్ళకు పరిచయం ఎక్కువ
అయినా...
మరణం తర్వాత ఏముంటుందని
ఇక వాళ్ళడుగరు
ఇప్పుడు వాళ్ళను ఆక్రమించిన ప్రశ్న వేరు:
మరణానికి ముందు మనమేం చేయాలి?
వాళ్ళంటారు-
జీవితానికి దగ్గరగా జీవిద్దాం
దురాక్రమణ వ్యాపార దేవుళ్ళు
ఎడారిలో బతుకులను విభజిస్తున్నట్లుగా బతకలేం
మేం పురాతన ధూళి పక్కన జీవిస్తాం
మా జీవితాలు
చరిత్రకారుని రాత్రులపై మోయలేని బరువు :
"నేనెంత తుడిచి పెట్టినా
అదృశ్యం నుండి వాళ్లు తిరిగి ఊపిరి పోసుకుంటారు"
మా జీవితాలు చిత్రకారుని కుంచెపై గీయలేని బరువు :
"వాళ్లను గీస్తూ గీస్తూ వాళ్ళ జీవితాల పొగమంచులో నేనూ కలిసిపోతాను"
మా జీవితాలు ఆర్మీ జనరల్ మనసుపై
అసహనమంత బరువు :
"చచ్చినవారి ఆత్మలు
నెత్తురోడుతూ
ఎలా ఇంకా నన్ను చుట్టుముడుతాయి? "
వాళ్ళంటారు-
మాకు నచ్చినట్లు మా జీవితాలను శ్వాసిస్తాం
మరణించినా పునరుజ్జీవించేలా
ఇప్పుడు మాకో బతుకు ముక్క కావాలి
వాళ్ళు యధాలాపంగా
తాత్వికుని వాక్యాలు పలుకుతారు :
"మరణం మమల్ని ఏం చేయలేదు
మేము ఉన్నామంటే
అదిక్కడ లేదు
మరణం మమ్మల్ని ఏం చేయలేదు
అదున్న చోట మేము లేము"
ఆ తర్వాత -
వాళ్ళు కలలకు కాళ్ళూ చేతులూ గీసారు
కాళ్ళపై నిలబడే నిద్రపోతున్నారు!
మూలం:(And They Don't Ask...)
- - - - - - - - మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం
ఇక వాళ్లు అడుగరు
