వెలుగులో నువ్వు
నీలానివో ఆకుపచ్చవో
పొగ రంగువో
తెలియకపోయినా
చీకటిలో
అవిశ్రాంతంగా అశాంతంగా
నీ ఘోషే
నీ ఉనికి
నిర్దయగా క్రూరంగా
క్రోధంలో స్త్రీలాగ
నీ ఘర్జనలూ గొణుగుళ్లే
తీరతీరాల ప్రతిధ్వనులు
అనాదిగా కొనసాగుతూ
అలవాటుపరుస్తున్న వరదవి
నీమీద నమ్మకం
తీరాలకు చేరుస్తుందో
నీలోనే చేర్చుకుంటుందో
ఎన్ని కలుపుతుందో
ఎన్నింటిని విడదీస్తుందో
ఎన్ని బడబాగ్నుల్ని దాచుకుంటుందో
నీ అద్దంలోనే చూసుకోవాలని
ఒకరినొకరు తరుముకుంటూ
అనంతంగా
సూర్యుడూ చంద్రుడూ
నీలో మునిగితేలే
చంద్రుని చేరాలన్న ఆత్రం
నీ గాఢతలా
అందరికీ ఎక్కువే
ఉదయించే బంగరు సూర్యున్ని
పట్టించుకోక
వంకరటింకర హొయలతో
మరులుకొలపటం
నీకే సాధ్యం
ఎంత ఆనందమో అది
నీకూనూ
మాకూనూ

