హాటకం

Spread the love

దక్షిణ భారతదేశపు చిరపుంజి అని ‘ఆగుంబె‘ను అంటారని ఇంటర్నెట్లో చదివాను, అందుకే ఆ ఊరిని ఎంచుకున్నాను. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రదేశంలో ఎప్పుడూ వాన పడుతూ, నేలంతా తడిసిపోయి, ఆకులన్నీ చినుకులను జారవిడుస్తూ, ఆకాశం నీలి బూడిదరంగు మేఘాలతో కమ్ముకొని, అపుడపుడూ పిడుగులు పడుతోన్న ధ్వని చెవుల్లో వినిపిస్తూ ఉండాలన్నది నా గట్టి కోరిక.

ఎవరూ అంత తేలిగ్గా కనిపెట్టలేని ఒక నిర్జన ప్రదేశంలో నేను చచ్చి పడుంటాను. వర్షపు ధారలు నా ఒంటి మీద కురుస్తూ ఉంటాయి. నీటిమడుగులు నా ఒంటిని తాకుతూ వెళ్తాయి. అప్పుడప్పుడు మెరిసే మెరుపులకు నా ఒళ్ళు మెరుస్తూ ఉంటుంది. మరుసటి రోజో, ఆ తర్వాతో ఇంకెప్పుడో, ఎవరో నా శవాన్ని చూస్తారు. నా శవం చుట్టూ దారి మళ్ళుతూ వెళుతోన్న చిన్న చిన్న నీటి మడుగులవల్ల, మట్టి చెత్త కల్సిన సన్నని ఇసుక, చారలు చారలుగా నేల మీద పరుచుకుని ఉంటుంది. నా ఒళ్ళంతా రాలి చిన్న చిన్న ఆకులు, బురదతో నిండిపోయి ఉంటుంది. నత్త గుల్లలు నామీద ఎక్కి మృదువైన వాటి లేత కొమ్ములను కదిలిస్తూ పాకుతూ ఉంటాయి.

ఈ ఊహ నాలో చాలా కాలంగా ఉండిపోయింది. నిజానికి దాదాపు పదేళ్ళుగా నా పగటి కలలన్నీ రకరకాలైన ఆత్మహత్యలు చేసుకోవడం గురించే నిండిపోయున్నాయి.

– ఏ ఊరోకూడా తెలియని ఉత్తర భారతంలోని చిన్న టౌన్‍లో పాత లాడ్జిలో, పెచ్చులూడిన గోడలు, మురికి కొట్టుకుపోయిన పరుపు, ప్లాస్టిక్ నీటి జగ్గు, అగరువత్తులు వెలిగించి నల్లటి రంధ్రాలు పడిన టేబుల్ ఉన్న చిన్న గదిలో!

లేదంటే – లడాక్లో అలలు అలలుగా కమ్మేసి నిశ్శబ్దానికి జడ రూపంగా ఒకదానిమీదొకటి పేర్చబడి గడ్డకట్టుకు పోయి ఉన్న కొండల కోనల దారుల్లో, ప్రాచీనమైన బౌద్ధ విహారం పక్కనే చిన్న గాజు కిటీకీలున్న ఒక పాత ఇంటి చూరుకిందున్న అరుగుమీద, నీరెండ వెలుగు వాకిట్లో పడుతుండగా, మంచుగాలికి చెవులు నిక్కబొడుచుకునే వేళలో!

ఇలా రకరకాలుగా ఊహించుకునే వాడిని.

నా మరణం అనేది ఎవరూ పెద్దగా పట్టించుకునే విషయం కాదు. నా చావు వల్ల నేను ఇతరులకు ఇవ్వగలిగిన దుఃఖం అంటూ ఏమీ లేదు. నా శవాన్ని వాళ్ళు చూసినప్పుడు కలిగే ఆశ్చర్యాన్ని మాత్రమే నేను ఇంకొకళ్ళకు ఇవ్వగలిగింది.

ఆ క్షణాలను చాలా స్పష్టంగా తీర్చిదిద్దుకుంటూ నా కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా వూహించుకునేవాణ్ణి. ఆ క్షణాల్లో సంతృప్తిగా చనిపోయేవాణ్ణి. మనసు కరిగి కన్నీటి పర్యంతమైపోయేవాణ్ణి. ఏడుస్తూ అలా సుదీర్ఘకాలంపాటు కూర్చుండిపోయేవాణ్ణి. అలానే నిద్రపోయేవాడిని కూడా. లేచినప్పుడు మటుకు ఆ బాధ అదే రీతిలో అదే చోట అలానే నన్నంతా ఆవరించి ఉండేది.

అది ఒక పెద్ద నల్ల బండరాయిలాటి జడ పదార్ధం. దాన్ని నేను ఏమీ చెయ్యలేను. అయితే డాక్టర్లు మాత్రం అది రాయి కాదు తేలిపోయే పొగ మాత్రమే అని చెప్పారు. “ముందుగా మీరు దాన్నుండి బయటకు రావాలని గట్టిగా సంకల్పించుకోవాలి. మీరు లోపల్నించీ గడియ పెట్టేసుకున్నారంటే బయట్నుంచి ఎవ్వరు తెరవలేరు”

“ఇప్పుడు నేనేంచెయ్యాలి” అని అడిగాను.

“ముందుగా మీరు ఊహించుకుంటున్న దుఃఖం, వాస్తవం కాదని అర్థం చేసుకోండి. అదే విషయాన్ని నమ్మండి. మీరు అన్నిటినీ పెద్దవి చేసుకుంటున్నారు. అన్నిటినీ చీకటి కిందే చూస్తున్నారు. అసలు సమస్య మీ దృష్టిలో ఉంది”

అయితే డాక్టర్ మాణిక్యవేల్ మాత్రం నా రోగ నిర్ధారణ ఇంకోలా చేశారు. “సమస్య సైకలాజికల్ కాదనుకుంటాను. న్యూరో ప్రాబ్లమ్ అనిపిస్తుంది. ఆక్చువల్ గా రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఒకటి మరో దాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. విడివిడిగా చూడడం సరైన పద్ధతి కాదు. అసలు మీ సమస్యకు మూలం మీ నరాలలోనే ఉంది. ఎప్పుడూ మీలోపల మీకు ఒక నెర్వస్ బ్రేక్ డౌన్ జరిగిన ఫీలింగే ఉంటుంది ”

నా చేతులు ఎప్పుడూ మంచుగడ్డల్లా చల్లగా ఉంటాయి. చాలా చాలా చల్లగా, చచ్చిపోయిన చేపల శవాల్లా! ఈ విషయం కాలేజీలో నా స్నేహితులు నాకెన్నోసార్లు చెప్పారు. నాకు షేక్‍హ్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను “భయపడకండి, నేను డ్రాకులాను కాను. మనిషినే” అని వాళ్ళకు చెప్తూ ఉంటాను. నా ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి ఓ ఇరవై ముప్ఫయి హాస్యాస్పదమైన సంగతులు నా దగ్గర తయారుగా ఉన్నాయి. చెప్పాలంటే నా బండి మొత్తం, వాటి మీద ఆధారపడే నడుస్తూ ఉంటుంది.

నేను చిన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడుతుంటాను. చూడ్డానికి ఎప్పుడు అదురుతూ ఉండే సన్నటి ఫిలమెంట్ లాగా ఉంటాను. నేను ఎవరి కళ్ళల్లోనూ కళ్ళు కలిపి మాట్లాడలేను. ఎవర్నీ కూడా ఎదిరించో, వాళ్ళ మాటలను అతిక్రమించో నా వాదనను వినిపించలేను. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే తప్ప నేనెవ్వరికీ ఏ విషయమూ చెప్పను. నిజానికి మనుషులు అవతలి వాళ్ళ మాటలు వినడానికి ఎప్పుడూ ఇష్టపడరు. నేను ఎండాకాలం కూడా చక్కగా దుప్పటి కప్పుకునే నిద్రపోతాను. వేడినీళ్ళతోనే స్నానం చేస్తాను.

నా నరాలెందుకిలా ఉన్నాయి అని డాక్టర్ని అడిగాను. “చిన్నతనంలో ఏర్పడిన సమస్య అయ్యుండొచ్చు. లేదంటే పుట్టుకతోనే అలా ఉండి ఉండొచ్చు. దానిని అంత సులువుగా కనుక్కోలేము. ఇప్పుడు దాని గురించి తెలుసుకుని చేసేది ఏమీ లేదు. నేను మందులు ఇస్తాను రెగ్యులర్గా కొన్నాళ్ళు తీసుకోండి చూద్దాం”

సైప్రక్సా అని ఒక మాత్ర. అది వేసుకోగానే అలజడి తగ్గిపోతుంది. ఒక ప్రశాంతమైన స్థితి కలుగుతుంది. మనుషులెవ్వరూ కనపడని పొడవైన దారిలో నేను నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఒంటరిగా – బైక్ లోనో కార్ లోనో కాదు. తేలుకుంటూ వెళ్తాను. అలా వెళ్ళి దిగంతంలో మాయమైపోతాను.

నాలుగైదు గంటలసేపు గాఢమైన నిద్ర. మళ్ళీ తర్వాత నిద్ర లేస్తే మనసు మరింత భారంగా ఉంటుంది. ఒళ్ళు నీరసంగా, అణువణువు ఇబ్బంది పడుతున్నట్టు ఉంటుంది. పెదవులు ఎండిపోయి కళ్ళు మండుతూ, ఎన్నో రోజులు నిద్రలేని వాడిలా నీరసంతో సొమ్మసిల్లిపోయి ఉంటాను.

అలా ఎన్నెన్నో మాత్రలు. చివరిగా తీసుకున్న మాత్ర సోలియన్. ఈ మాత్ర ఎనిమిది నెలలు తీసుకున్నాను. అది కూడా నన్ను అలాంటి ఒక ఒంటరి దారిలోనే నడిపించి తీసుకెళ్ళి నిద్రపుచ్చేది. ఆ తర్వాత మరొక డాక్టర్ ‘అది Schizophreniaకు వేసుకునే మాత్ర’ అని అన్నారు. వెంటనే ఆపేశాను.

ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను, దీన్ని జబ్బని ఎందుకు అనుకోవాలి? అందరూ పగటి కలలు కంటున్నారు. నేను ఆడవాళ్ళ గురించో, ధనవంతుడిగా అవ్వడం గురించో పగటి కలలు కనడం లేదు. చావు గురించి కలగంటున్నాను! అంతే కదా? ఇలా ఉంటే నష్టం ఏంటి?

అయితే మెల్లమెల్లగా కలల తీవ్రత ఎక్కువయింది. నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అవి నన్ను వెన్నాడడం మొదలైంది. నా మాటలు, నవ్వులు అన్నీ ఒకే విషయం గురించి. నేను వార్తా పత్రికల్లో ఆత్మహత్యలు గురించి మాత్రమే చదివాను. ఇంటర్నెట్‍లో ఆత్మహత్యా ప్రయత్నాల గురించి మాత్రమే వెతికాను.

నిన్న సాయంత్రం ఉన్నట్టుండి అనిపించింది – ఇంక కలలుకన్నది చాలు అని. కొన్నాళ్ళుగా కలలతోనే జీవించి విసుగొచ్చేసింది. ఆ కలలను నేను పరీక్షించి చూడబోయేది లేదు కాబట్టి అవి అర్ధరహితమైనవి అనిపించింది. అన్ని కలలనూ అపనమ్మకంతోను, చులకన భావంతోనూ చూడసాగాను.

“ఎలాంటి చులకన భావం అక్కర్లేదు, నిజంగా నేను తలచుకుంటే వెంటనే బయలుదేరగలను. అమలుపరచగలను” అని నాకు నేనే సంజాయిషీ ఇచ్చుకున్నాను. “ప్రయత్నించి చూడు” అని ఎవరో నాలో నాకు సవాలు విసిరారు. “నేను పిరికి వాడిని కాను” అని వాడికి సమాధానం ఇచ్చాను. “సరే చూద్దాం” అన్నాడు. “నేనేంటో నిరూపిస్తాను చూడు” అని అన్నాను. వాడు దానికి సమాధానం చెప్పలేదు. “నాకు దేని గురించీ భయం లేదు” అని మళ్ళీ వాడికి చెప్పాను.

ఎక్కడికి వెళ్ళాలా అని ఇంటర్నెట్లో వెతికాను. నేను చివరిగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఊహించుకున్న ఊ‌‌‌‌ళ్ళో ఎడతెరపిలేకుండా వర్షం పడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడూ వర్షం పడే ఊరికోసం వెతికాను. ఆగుంబెను కనుక్కున్నాను. ఒక క్షణమైనా ఆలస్యం చేయకుండా సంచి సర్దుకున్నాను. గదికి తాళం వేసి కుమారస్వామికి తాళం చెవి ఇచ్చి బయలుదేరేసాను. ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎవరికీ ఏ సందేశం రాసి పెట్టలేదు

అర్ధరాత్రి బెంగుళూరు చేరుకుని, అక్కడినుండి బస్సు ఎక్కి ఆగుంబె చేరుకునేసరికి పొద్దున ఎనిమిది అయ్యింది. బెంగుళూరు కంటే కూడా ఆగుంబె, మంగళూరు నుండి చాలా దగ్గర. ఈ విషయం నాకు తెలియదు. దగ్గర దార్లో రాకుండా అనవసరంగా చుట్టూరా తిరిగి వచ్చాను. ఆగుంబె చిన్న ఊరు అని చదివాను. అయితే ఇంత చిన్న ఊరు అని ఊహించలేదు. బస్టాండ్లో నేను వచ్చిన ఒక బస్సు మాత్రమే నిల్చునుంది. బస్సు మీద పడుతున్న వర్షపు హోరు బస్సు ఆగిపోయాక బిగ్గరగా వినిపిస్తోంది.

బస్సు దిగిన వాళ్ళు ఇద్దరే. ఇద్దరి చేతుల్లోనూ గొడుగులు ఉన్నాయి. బస్సు దిగుతూ దిగుతూ గొడుగు విప్పే, జాగర్త తెలిసిన వాళ్ళలా ఉన్నారు. నేను నా సంచి నుండి రెయిన్‍కోటు తీసి వేసుకున్నాను, కోటు హుడ్డుని తల మీదకి సర్దుకుని వర్షంలో బస్సు దిగాను.

వర్షపు నీళ్ళు అంత తేటగా పారుతాయి అని నాకు తెలియదు. అక్కడి ఇళ్ళ పైకప్పు చూరులనుండీ పెద్దపెద్ద గాజు తాళ్ళలా నీటి ధారలు కిందకు జారుతున్నాయి. నేలమీద పారుతున్న నీరు చల్లగా ఉంది. నా ఒళ్ళు చలికి జివ్వుమంటూ వొణికింది. నైలాన్ రెయిన్‍కోటు మీద వాన చినుకులు పడిన చప్పుళ్ళు నా ఒళ్ళంతా వినబడుతున్నాయి.

కనుచూపుమేరలో కనిపించిన టీ కొట్టువైపుకు నడిచాను. బాయిలర్ నుండి వచ్చే నీటి ఆవిరి చినుకు ధారల మధ్య మెలికలు తిరుగుతూ పైకి ఎగబాకుతూ ఉండటం ఓ చిత్రమైన దృశ్యంలా ఉంది.

“టీయా?” అని అడిగాడు.

“తమిళా?” అని అడిగాను.

అర్థం అవుతుంది అన్నట్టు చెప్పాడు.

టీ పరవాలేదు, కొంచం నిలవుంచిన పాలు. అయితే ఆ వేడి నాకు హాయినిచ్చింది.

“ఇక్కడ హోటల్ ఉందా?” అని అడిగాను.

“భోజనానికా?”

“కాదు ఉండటానికి”

“లాడ్జ్ ఇదే… ఒందే లాడ్జ్, అల్లిదే” అంటూ అక్కడనుండే లాడ్జీకేసి చూపించాడు. రోడ్డు పక్కనే తలుపులున్న రెండంతస్తులు కట్టడం. పాచిబట్టిన గోడలు వర్షంలో తడిసి నల్లగా ఉన్నాయి. బాల్కనీలో నిల్చుని ఒకడు బీడీ కాలుస్తున్నాడు.

నేను లాడ్జీ వైపుకు నడిచాను. వర్షంలో ఇద్దరు తలవంచుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళారు. వర్షంలో బాగా తడిసిన ఒక పెద్ద నల్ల ఆవు మెల్లగా బస్టాండ్ వైపుకు వెళుతోంది. ఉన్నట్టుండి మేఘాల్లో మెరుపులు, నీటి ధారల్లో మినుమినుక్కుమంటూ వెలుగు-నీడల విన్యాసం. పిడుగు శబ్దం అతి సమీపంలో వినిపించింది.

నేను నాగప్ప లాడ్జిని చేరుకున్నాను. అక్కడ ఒక టేబుల్ మాత్రమే ఉంది. ఆ టేబుల్ మీద రెండుసార్లు తట్టగానే ఒక ముసలాయన చేతిలో టీ గ్లాస్‍తో వచ్చాడు. “యారు” అని అడిగాడు.

“రూమ్” అన్నాను.

ఉందని కానీ, లేదని కానీ ఏమీ చెప్పలేదు. డ్రాయర్ తెరచి ఒక పెద్ద లెడ్జర్ బయటికి తీసి పెన్ను పెట్టున్న పేజీని తెరచి నా ముందు ఉంచాడు. అందులో నేను పేరు, చిరునామా రాశాను.

ఆయన టీ తాగుతూ “ఫోన్ నెంబర్ బేకు” అని అన్నాడు.

రాసిచ్చాను.

“రూమ్ ఎక్కడ?” ఇంగ్లీషులో అడిగాను.

“కన్నడా గొత్తిల్లా?”

“తెలియదు”

“యావు భాషె?”

“తమిళ్”

“పొద్దున పదింటివరకు హాట్‍వాటర్… ఇక్కడి కొచ్చి చెప్తే బకెట్టులో తెచ్చిస్తాను. చిన్నోడు రూముకు టీ, కాఫీ తీసుకొస్తాడు. ఒక టీకి ఐదురూపాయిలు ఎక్స్ట్రా”

ఈ ఊళ్ళో తమిళులు కూడా ఉన్నారు అని చెప్పాడు. దగ్గర్లోనే ఒక పరిశోధనా కేంద్రం ఉంది అని, అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళలో తమిళులే ఎక్కువమంది అనీ సమాచారం ఇచ్చాడు.

నన్ను ఒక చిన్న పిల్లాడు పైకి తీసుకుని వెళ్ళాడు. “టీ పట్టుకురానా సార్”

“ఇప్పుడే తాగాను”

“రెయిన్‍కోట్ రూమ్ బయటే తీసేయండి సార్… ఒకసారి రూమ్ తడై పోతే ఇక్కడంత తొందరగా ఏదీ ఆరదు”

చెప్పులు బయట వదిలేసాను. గది ఒక మోస్తరుగా ఉన్నా బానే ఉంది. పరుపు దుప్పట్లు ఒకందుకు తెల్లగానే ఉన్నాయి. బాత్రూం గార కట్టిపోయి ఉన్నప్పటికీ శుభ్రంగా ఉంది. గోడల్లో నీళ్ళు కారి రకరకాల మరకలు. గోడకు అంటించబడిన ప్లాస్టిక్ పోస్టర్ సగం ఊడిపోయి ఉంది. గోడంతా నీటిలో నాని నెమ్మెక్కిపోయి ఉంది. గది మూలల్లో గోడలు పాచిపట్టేసి ఉంది.

నేను సంచి పెట్టేసి పిల్లాడికి ఐదు రూపాయలు ఇచ్చాను. మంచం మీద పడుకున్నాను. బస్సు ప్రయాణం చాలా అలసటనిచ్చింది. రాత్రంతా రంగులరాట్నంలో తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు కూడా పడుకుని ఉంటే మంచం తిరుగుతూ ఉన్నట్టే ఉంది.

కళ్ళు మూసుకోగానే వర్షపు చప్పుడు. ఆ చప్పుడు నన్ను పూర్తిగా ఆక్రమించేస్తుంది: ఒక జలపాతం కింద పడుకుని ఉన్నట్టు. కళ్ళు తెరిచి చూశాను. గదిలో సన్నటి పొగ వ్యాపించి ఉంది. పొగా! అనుకుంటూ లేచి కూర్చున్నాను. టేబుల్ మీద, దుప్పటి మీదంతా తెల్లటి పొగ చూరుకుని ఉంది.

పొగ కాదు, సన్నటి నీటి చుక్కలు. ఆ పరచుకున్న నీటి చుక్కల మీద వేలితో రాశాను. ఇంగ్లీషులో Go అని. తర్వాత నా పేరులోని తొలి అక్షరం R. దాన్నే చూస్తూ ఉన్నాను. గాలి విసురు ఒక్కసారి లోపలికి రాగానే అంటించున్న పోస్టర్ రెపరెపలాడింది. తలెత్తి చూసాను. దానిలో ఉన్నది ఏమిటి అని ముందుగా అర్థం కాలేదు. కాసేపు దానికేసి చూసిన తర్వాత దాంట్లో ఒక పెద్ద పాము బొమ్మ ఉంది.

లోహపు బూడిద రంగు. వందలాది గవ్వలను పేర్చి పెట్టి చేసినట్టు ఉంది దాని ఒళ్ళు. ఓ పెద్ద చేప ఒళ్ళులా అనిపించింది. మెడకింద తెల్లటి శంఖపు రంగు. చూడ్డానికి దాని తల చిన్న కుక్కపిల్లలా ఉంది. కళ్ళు రెండు గాజు పూసల్లా ఉన్నాయి. దాని నోటినుండి బయటకు సాగిన ఎర్రటి పొడవైన నాలుక.

నేను లేచి పళ్ళు తోముకున్నాను. ముఖం కడుక్కుని బయటకు వచ్చాను. మళ్ళీ ఆ పాము ఫోటోను చూశాను. రెయిన్‍కోటు చేతబట్టుకుని కిందకు వచ్చి ముసలాయన్ను “దగ్గర్లో తినడానికి ఏమున్నాయి?” అని అడిగాను.

“అదిగో అక్కడ, ఆ పెంకుల బిల్డింగ్. బ్రాహ్మణ హోటల్. కొంకణి బ్రామ్మలది… పొద్దున ఇడ్లీలు దోశలు. మధ్యాహ్నం అన్నం. రాత్రికి వేడి జావా దొరుకుతుంది”

వర్షంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ ఊరి గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను వచ్చి గంట సేపు అయింది. ఇప్పటిదాకా వాన తగ్గలేదు. తగ్గడం పెరగడం లేకుండా ఒకే శ్రుతిలో వర్షం పడుతూనే ఉంది. హోరులో ఏ మాత్రం మార్పు లేదు. ఒకటేమని ఉరుములూ మెరుపులూ. ఇలా కూడా వర్షం పడుతుందని నాకు తెలీదు.

కళ్ళు జిగేలుమనేటట్టు రోడ్డు మీద చెమ్మ ఒక్కసారి మెరిసి ఆరిపోయింది. తలకు పైన ఒక పెద్ద పేలుడు శబ్దంతో పిడుగు! గాలి కూడా అదిరిపడింది. ఆ పెంకుటింటిని చేరుకున్నాను. షెనాయ్ మెస్ అని రాయబడిన నేమ్ బోర్డ్ చూరుకు వేలాడుతూ గాల్లో ఊగుతోంది. రెండు టీవీఎస్-50 బళ్ళు నిల్చుని ఉన్నాయి. రెయిన్‍కోట్లు తగిలించడానికి బయటే వెదురు కొక్కాలున్నాయి. కోట్ తీసి అక్కడ తగిలించి లోపలికి వెళ్ళాను.

లోపల నలుగురు ఐదుగురు టిఫిన్లు చేస్తూ ఉన్నారు. పెద్ద పళ్ళతో నవ్వుతున్న ముఖంతో ఉన్న కొంకణీ బ్రాహ్మణుడు “రండి, తమిళా?” అని అడిగాడు.

“అవును”

“ఇడ్లీలు, దోశలు, పప్పు వడలు ఉన్నాయి”

“దోశ కావాలి” అంటూ కూర్చున్నాను.

ఆయన టీ తీసుకొచ్చి పెట్టారు.

“దోశ…”

“దోశయితే వెయ్యాలి”

నేను టీ కప్పుకేసి చూశాను. ఎదురుగా కూర్చున్న వ్యక్తి “ఏ ఊరు” అని అడిగారు.

“నాగర్కోయిల్”

“ఇక్కడింతే. ముందు టీ తాగుతారు”

“ఓహ్” అని టీ తీసుకున్నాను.

“టూరిస్టా?” అని అడిగారు.

“అవును” అన్నాను.

“ఇక్కడకి టూరిస్ట్లు పెద్దగా రారు. ఇప్పుడిప్పుడు ఇంటర్నెట్ వచ్చాక ఎప్పుడైనా ఇద్దరు ఈ ఊరి గురించి తెలుసుకుని వస్తున్నారు… వచ్చిన ఒక్కరోజూ ఎలాగోలా గడిపేసి పారిపోతారు…”

“వర్షాన్ని చూడడానికే కదా వస్తున్నారు?”

“వర్షాన్ని కాసేపు చూడొచ్చు… వర్షంలోనే ఉండాలంటే చాలా కష్టం” అని నిట్టూర్చి “సినిమాలో మాత్రమే వర్షం బాగుంటుంది” అని అన్నారు.

“మీరేం చేస్తారు?”

“ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో ల్యాబ్ అసిస్టెంట్‍గా ఉన్నాను. నా పేరు జాన్ సుందర్”

“ఏమి రీసెర్చ్?”

“తెలియదా? ఆ విషయం నెట్లో చూడలేదా? ఈ ఆగుంబే అటవీ ప్రాంతం కోబ్రా శాంక్చురీ… రీసెర్చ్ సెంటర్ ఇక్కడే ఉంది”

“త్రాచుపాము కదా?” అని అడిగాను.

“అవును, రాచనాగు అనీ అంటారు. మీ ప్రాంతంలోకూడా ఉంటాయి. అప్పర్ కోదైయారు, అటువైపు కళక్కాడు, మండందుఱై…”

“రాచనాగు… మంచి పేరు!” అన్నాను. “నా చిన్నప్పుడు టీవీలో రాజనాగం అని ఒక సినిమా వచ్చింది. పాత సినిమా… పాత యాక్టరు శ్రీకాంత్ నటించినది” అని పొడిగించాను.

“అవును 74లో వచ్చిన సినిమా… అరవంలో పాడు చేసేశారు. కన్నడలో అది పెద్ద క్లాసిక్. టి.ఆర్.సుబ్బారావ్ పేరు విన్నారా?”

“లేదు”

“ఇక్కడ కన్నడంలో పెద్ద రచయిత. ఆయన రాసిన మూడు కథలను కలిపి నాగరహావు అని ఒక సినిమా తీశారు. పుట్టన్న కణగాల్ డైరెక్ట్ చేశారు. విష్ణువర్ధన్ హీరో”

“నాగరహావు అంటే?”

“త్రాచుపాము అనే అర్థం”

“మీరిక్కడ ల్యాబ్ లో ఏం చేస్తుంటారు?”

“త్రాచు పాము విషం చాలా చాలా కాస్ట్లీ మెడిసిన్. త్రాచు పాములను పెంచి, వాటి విష సంచులను ఒత్తి విషాన్ని తీసి ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాము. ఇప్పుడు ఒక గ్రాము పద్దెనిమిది వేలు దాకా పలుకుతుంది. ఒక తడవకు 10 గ్రాములు దాకా తీస్తుంటాం. దాదాపుగా ఒకటిన్నర లక్ష!”

“విషం కదా? మందంటున్నారు?”

“విషాలే మందులు, మందులే విషాలు” అంటూ లేచారు.

షెనాయ్ నాకు కుట్టాకు విస్తరి వేసి ఇడ్లీ వడ్డించగానే “నేను దోశ కదా అడిగాను” అని అన్నాను.

“ఇడ్లీ అడగలేదా?”

“లేదు”

“ఓహ్… అయితే ఆగండి”

“లేదు… పరవాలేదు. ఇడ్లీ తింటాను”

ఇడ్లీలు వేడిగా ఉన్నాయి. అయితే బియ్యపు రవ్వతో చేసినట్టు ఉంది. తీయగా ఉన్న సాంబార్లో ఇడ్లీ కరిగిపోయింది.

తిన్నాక మరో టీ తాగి బయటకొచ్చాను. కోటు వేసుకోగానే అడవిలోకి వెళ్ళొచ్చు అనిపించింది.

తారు రోడ్డునుండి పక్కకు చీలిన మట్టి రోడ్డులో నడిచాను. రెండు పక్కలా అడవి, చినుకుల శరాలతో యుద్ధం చేస్తున్నట్టు హోరు. మట్టిరోడ్డు చిన్న నీటి కాలువలా మారిపోయింది. నీళ్ళు స్పటికంలా తెల్లగా ప్రవహిస్తున్నాయి. వేల ఏళ్ళుగా వాన కురిసి కరగడానికి మట్టి లేకుండా పోయినట్టుంది.

ఆ దారిలో అప్పుడప్పుడూ జీపులు వెళ్తుంటాయి అన్నదానికి ఆనవాళ్ళు కనిపించాయి. రాలిన ఆకులు కుళ్ళి కాలు పెట్టగానే నుజ్జునుజ్జయ్యి జారుతున్నాయి. పచ్చదనం దట్టంగా కప్పేసిన చీకటి లోపలకి వర్షం జారుతూనే ఉంది.

వర్షానికి వాసన అంటూ ఒకటి ఉంటుందని అప్పుడే తెలుసుకున్నాను. అది నీటినాచు యొక్క వాసన. చెట్ల మీద, రాళ్ళమీద అంతా నాచు పట్టేసి ఉంది.

ఇక్కడ త్రాచుపాములు ఉన్నాయా? ఉండొచ్చు. త్రాచుపాముల గురించి నాకు తెలిసిన వివరాలను గుర్తు చేసుకున్నాను. త్రాచు పాము విషం ఏనుగునైనా చంపేయగలదు. 18 అడుగుల పొడవు పెరుగుతుంది. దాదాపు నాలుగడుగుల ఎత్తుకు పడగ ఎత్తగలదు. అది ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుంది. పాములు ఎక్కువగా ఉన్నచోటే త్రాచుపాము నివాసం ఉంటుంది. ఈ వర్షపు అడవిలో నేను దాని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆకులు పేరుకు పోయిన చెత్తలో, నేలకు ఒరిగి ఉన్న చెట్ల మొదళ్ళ దగ్గర, రాతిబండ్ల సందుల్లో ఎక్కడో అది ఉండే ఉంటుంది. నన్ను చూస్తూ ఉందేమో! ఆ ఆలోచన రాగానే దాని చూపు నన్ను ప్రతి నిమిషం తాకుతూన్నట్టనిపిస్తోంది. అడవంతా త్రాచుపాము చూపుతో నిండిపోయి నన్ను కప్పేసింది.

వర్షంలో తడిసి తడిసి నునుపుదేరి నిగనిగా మెరుస్తున్న ఒక పెద్ద నల్లరాతిబండ కనిపించింది. దానిమీద కెళ్ళి కూర్చున్నాను. నల్లత్రాచు కరిచి చనిపోవాలి. అవును, అదే మంచి మార్గం. గదిలో నా సంచిలో నిద్ర మాత్రలు ఉన్నాయి. ఆత్మహత్యకు అదే ఉత్తమమైన మార్గం అని చదివాను. అలా కళ్ళు మూసుకుని నిద్రపోతూ నిద్రలోనే చావు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా చచ్చిపోవచ్చు.

త్రాచుపాము కరిస్తే ఎలా ఉంటుంది? సెల్ఫోన్ తీసుకుని వెతికాను. సిగ్నల్ సరిగ్గా అందటంలేదు. అలా చక్రం తిరుగుతూ ఒక పేజీ ఓపెన్ అయ్యింది. త్రాచు పాము విషం నరాలను అటాక్ చేస్తుంది. నరాల మధ్య కనెక్షన్ తెగిపోయి, నరాలకూ కండరాలకూ సంబంధం లేకుండా అయిపోతుంది. ఊపిరి ఆడదు. మూర్చ వస్తుంది. నోట్లోనుంచీ నురగ వస్తుంది. చూపు మందగించి, జ్ఞాపకాలు మందగించి స్పృహ కోల్పోతాము.

స్పృహ కోల్పోతూన్నప్పుడు చిత్ర విచిత్రమైన భ్రమలు కలుగుతుంటాయి. కలల సుడిగుండాలు – కంటికి ఇంపయినవి, భయానకమైనవి, క్రూరమైనవి, తుళ్ళింతపెట్టేవి. మెదడంతా కిందపడి పగుళ్ళు వచ్చిన గాజు బంతిలా అర్థం లేని సుళ్ళు తిరిగే కలతల నదిలా మారిపోతుంది.

ఇప్పుడు ఇక్కడకి త్రాచుపాము రావాలని – ఎంతగా కోరుకున్నానో చెప్పలేను. ప్రార్థన కూడా చేశాను. త్రాచుపాము నా కళ్ళ ముందు పైకి పడగెత్తింది. నాలుగడుగుల ఎత్తులో. అరటి పిలక మట్టి నుండి పైకి ఎగసినట్టు, చిత్రమైన పుట్టగొడుగులా దాని పడగ! మెడలోని పొలుసులు కదులుతున్నాయి. తీక్షణమైన కళ్ళు నన్నే చూస్తున్నాయి. నాలుక బయటకు పెట్టింది. నేను కదలకుండా దాన్నే చూస్తున్నాను.

కొరడాతో కొట్టినట్టు ఒక కాటు. అంతే. నేను చేయి వెనక్కి లాక్కున్నాను. అలా పడిపోయాను. నాలో కట్టుకున్న గోడలన్నీ కూలిపోతున్నాయి. అంతరాంతరమంతా సమస్త వర్ణాలు కలబోసిన అపురూప చిత్రాలతో దృశ్యమానమౌతోంది. కాంతి వంతమైన రంగులన్నీ కరిగి నీరౌతున్నాయి. ఆలోచనలు రంగులు రంగులుగా విడిపోయి మారిపోతున్నాయి. ఊహలన్నీ రంగుల కింద మారి సంభ్రమానికి గురి చేస్తున్నాయి. ఒకదాని తర్వాత మరోటి క్రమంగా అదృశ్యమై పోతున్నాయి.

నేను వర్షం కురుస్తున్న అడవిలో పోగైన ఆకుల పరుపు మీద పడి ఉన్నాను. పైన ఆకాశంలో ఉరుములు, మెరుపులు. వర్షపు నీరు నా చుట్టూ కాలువలుగా ప్రవహిస్తోంది. వర్షపు చినుకులకు చెదిరిపోతోన్న మట్టి నా మీదకు చిమ్ముతోంది. నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. మూర్ఛ వచ్చినట్టై నా కండరాలు సడలి పోయాయి. ఒళ్ళంతా మెల్లగా మొద్దుబారిపోయింది.

అదిగో అక్కడ నా శరీరం పడి ఉంది – వర్షపు నీటిలో ఎర్రబడి, కొంచం ఉబ్బిపోయి ఒక పెద్ద చెట్టు కాండంలా. అటుగా వెళ్తున్న జీపులోనుండి ఎవరో నన్ను చూస్తున్నారు. కన్నడభాషలో మాట్లాడుకుంటూ నా వైపుకు నడిచి వస్తున్నారు. నాకేసి చూపిస్తూ ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి నిల్చున్నారు.

నా ముఖం ఉబ్బి నీలిరంగులోకి మారిపోయింది. పెదవులు నేరేడు పళ్ళు తిన్నట్టు ఎర్రబారి వున్నాయి. రెండు పళ్ళు పెదవుల్ని లోతుగా కొరికేసిన గాట్లు. అటొకటి ఇటొకటిగా పడి ఉన్న నా చేతులను దగ్గర చేసి పట్టుకున్నారు. ఉరితాడుకు వేలాడినవాడిలా నా పాదాలు నీలుక్కుని ఉన్నాయి.

నేను ఏడవడం మొదలు పెట్టాను. నా ఒళ్ళంతా ఏడుపుతో నిండిపోయింది. ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నిట్టూర్చాను. లేచినప్పుడు చాలా అలసటగా అనిపించింది. నా ఒళ్ళు చాలా భారమైపోయినట్టు ఉంది. మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచాను. ఇంక ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు, నేరుగా రూముకు వెళ్ళి పడుకోవాలి.

నా కాలు ఏదో ఒక వేరును తొక్కింది. అది ఎండి పడిన కొమ్మకూడా అయుండచ్చు. దాని మరో కొస పైకి లేచింది. నేను భయపడి తిరిగి చూసినప్పుడు గబగబా ఒక ఉదుటున ఏదో ఒకటి ఆకుల్లో కదులుతూ పొదల్లోకి వెళ్ళడం చూశాను – వర్షపు నీరు చిన్న కాలువగా మారి ప్రవహిస్తున్నట్టు. అయితే అది వర్షపు నీరు మాత్రం కాదు.

నా మోకాలి వెనుకభాగంలో నొప్పి మొదలైంది. వంగి చూశాను. జీన్స్ మీద ముల్లు ఏమీ గుచ్చుకుని లేదు. ఆ చెట్టు కొమ్మ ఎక్కడ? నా మనసు తుళ్ళిపడింది. అదేనా? అదేనా? నేను జీన్స్ పాంట్‍ను మెల్లగా పైకి చుట్టి లాక్కుని చూశాను. నా పిక్క పైభాగంలో రెండు చిన్న గాట్లు. ఒకే మాదిరిగా ఉన్నాయి , ఎర్రటి రక్తపు గుర్తులు.

నా ఒళ్ళు ‌వణుకుతూ ఉంది. అక్కడినుండి రోడ్డు వైపుకి పరుగు తియ్యాలి, గట్టిగా కేకేసి ఎవరినైనా సాయానికి పిలవాలి అనిపించింది. మరుక్షణం చిన్న నవ్వు. నేను ఇక్కడికి వచ్చింది ఇందుకేగా? ఇది కావాలనే కదా ప్రార్థించాను?

పాంటుని కిందకు సర్దుకుని మెల్లగా పైకి లాగి నడిచెళ్ళి ఆ బండకు ఆనుకుని కూర్చున్నాను. నాలోపల ఏం జరుగుతోంది? ఏమీ లేదు. నరాలకు ఏమవుతోంది? ముళ్ళు విడిపోతున్నాయా? బలహీనపడుతున్నాయా? ఊపిరాడటంలేదా? గుండె కొట్టుకుంటోందే! ఊపిరి వేగం పెరిగింది అంతే.

వర్షం పడుతూనే ఉంది. నా మీద, చెట్లమీద. అయితే శబ్దం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాసేపటికి శబ్దం ఆగిపోయింది. అడవి ఉన్నట్టుండి ఊదా రంగులోకి మారింది. నీళ్ళల్లో కారిన డీజిల్ ఊదా, నీలి, ఎరుపు రంగులు కలగలిసి మెరిసినట్టు ఆకులు కదులుతున్నాయి.

నా కుడి కాలును ఎవరో పట్టి గట్టిగా లాగినట్టు అనిపించింది. నోరు ఒకవైపుకు ఈడ్చుకుపోయి చొంగ కారుతోంది. నన్ను నేను తదేకంగా చూసుకుంటున్నాను.
కళ్ళ ముందు ఏ వస్తువూ వర్ణమూ లేని చిత్రాలు తిరుగాడుతున్నాయి – నిశ్శబ్దంగా ఒక అద్దంమీద అవి నీడల్లా కదులుతున్నట్టు. అద్దంమీద నీటిని పోస్తూ ఆ దృశ్యాలను అటూ ఇటూ అల్లల్లాడిస్తున్నారెవరో!

లీలగా ఒక వాసన. నల్లుల్ని నలిపినట్టు, లేదా జుట్టు కాలినట్టు. మరోసారి నా కుడికాలు ఈడ్చుకుంటూ కొట్టుకలాడుతోంది. నా చేయి కూడా ఈడ్చుకుంటూ వంకరబోయింది. నా ముక్కు పుటాల్లో గాఢమైన ఘాటు. మంట పుట్టించే గంధకం వాసన.

ఎనిమిదేళ్ళ తర్వాతే మళ్ళీ ఆగుంబెకు రావడం నాకు కుదిరింది. రావాలన్న ఆశ ప్రతి సంవత్సరమూ ఎదుగుతూనే వచ్చింది. ప్రతి ఏడూ నాలుగైదు సార్లయినా ప్లాన్ చేసుకుని ఏదో అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రధానమైన కారణం నా ఉద్యోగం. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసేవాళ్ళు తమ సొంత ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేరు.

ఆగుంబె మారిపోయింది. ఆ కొంకణీ బ్రాహ్మణుడి మెస్సు లేదు. పెంకులు విరిగిపోయిన ఆ ఇంటి తలుపులు తాళం వేసి ఉంది. కొత్తగా మరో పెద్ద లాడ్జ్. ముఖద్వారంలో సిమెంట్ బుద్ధ విగ్రహం. దానికి ఆనుకునే పెద్ద రెస్టారెంట్. ఎనిమిదేళ్ళ క్రితం అక్కడే రూమ్ తీసుకున్నాను.

రోడ్డంతా వర్షపు నీరు. యధావిధిగా ఉరుములు, మెరుపులు. నేను షూ వేసుకుని ఉన్నాను. రెయిన్‍కోటు మీద పడుతున్న చినుకుల చప్పుడును ఆస్వాదిస్తూ నడిచాను. ఆ మట్టి రోడ్డు అలానే ఉంది. మట్టిరోడ్డులోకి తిరిగాను. అ నల్లబండరాయిని చూశాను. అదీ మారలేదు. ఆ నాచు కూడా అలానే ఉందే అనుకున్నాను.

అక్కడే నిల్చుని ఆ పరిసరాలను చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు కురిసిన వర్షం ఎడతెరిపి లేకుండా అలా కురుస్తూనే ఉందా? నాలో నేనే నవ్వుకున్నాను. ఎనిమిదేళ్ళ క్రితం ఇలాంటి విచిత్రమైన ఊహలే నాకు వచ్చేవి. ఆ ఊహలను పట్టుకుని ఎంతెంత దూరం వెళ్ళేవాడిని! బయటకు చెప్తే పిచ్చివాడు అనేస్తారు. రకరకాల అర్థం లేని పిచ్చి ఊహలు.

అప్పుడు నేనొక చిన్న ఉద్యోగంలో ఉండేవాడిని – ఓడిపోయిన వాడిగా, ఒంటరిగా! ఈరోజు నా వృత్తిలో చాలా పై స్థాయిలో ఉన్నాను. నా భార్య పిల్లలు ఊళ్ళో ఉన్నారు.

నా చేతుల్లో అప్పటి చల్లదనం లేదు. నా ఒంటిలో ఆ వణుకు లేదు. ఆ పాత దేహం నుంచి భూమిని చీల్చుకుని వచ్చిన కొత్త మొక్కలాగా మరో కొత్త దేహానికి వచ్చేశాను. ఆ పాత రోజులను తలుచుకున్నప్పుడు కూడా అతను వేరే ఎవరో అనే నా అంతరాత్మ నమ్మబలుకుతుంది.

ఆరోజు ఇక్కడ పడున్న నన్ను ఆనకట్ట నుండి వెను తిరుగుతున్న ఉద్యోగులు చూశారు. వెంటనే ఇక్కడి నుంచి రీసెర్చ్ కేంద్రానికి తీసుకెళ్ళారు. అక్కడ మూడు రోజులు ఉన్నాను. అక్కడినుండి బెంగళూరు హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. 15 రోజుల్లో ప్రాణాలు కుదురుకుని లేచి కూర్చున్నాను.

నా ఒళ్ళంతా బక్క చిక్కి నలుపెక్కి పోయింది. పెదవుల మీద కనురెప్పల మీద తోలు కాలిపోయినట్టు పొక్కులు కట్టి మెల్లగా ఉడిపోయింది. అయితే ఆ తర్వాత నా ఒళ్ళు వేగం పుంజుకుంది. బరువు పెరిగాను. చర్మానికి నిగ్గు వచ్చింది. నరాల సమస్య పూర్తిగా నయం అయింది. అది వరకు నా ఒంటిలో నిత్యం కొలువుండే నీరసం ఎక్కడకి పోయిందో మరి. మనసులో కొత్త ఉత్సాహం నిండిపోయింది.

మొట్టమొదటగా నాలో కలిగిన అనుభూతి – ఆకలి ఒక్కటే. ఎప్పుడు చూసినా తిండి గురించే ఆలోచిస్తూ ఉన్నాను. పిచ్చి పట్టిన వాడిలా తిన్నాను. తిన్న కొద్దీ రుచి మరింతగా పెరుగుతూ వచ్చింది. అన్నీ రుచిగానే ఉన్నాయి. ఎప్పుడూ అందుబాటులో స్వీట్లు ఉంచుకునేవాడ్ని. అర్ధరాత్రి లేచి తినేవాణ్ణి. కలలో కూడా తింటూనే ఉండేవాడిని.

ఆ రుచి జీవితంలో మిగతా వాటి మీదకు కూడా మళ్ళింది. రంగులు నన్ను పిచ్చెక్కించాయి. రకరకాల రంగుల బట్టలు కొన్నాను. వాటిని వేసుకుని ఆనందించాను. రాత్రనకా పగలనకా పాటలు విన్నాను. ఇల్లంతా సుగంధ ద్రవ్యాలు, అగరవత్తులు సాంబ్రాణులతో నింపేశాను. ప్రతిరోజు ఆటలు ఆడాను, ఈత కొట్టాను, బైక్ నడిపాను.

ఇంటిలో ఒక గదిలో పడి ఉండలేకపోయాను. బైక్ మీద లడాక్ వరకు వెళ్ళి వచ్చాను. కొండలు ఎక్కాను. వర్కల తీరాన స్పీడ్ బోట్లో సముద్రయానం చేశాను. కులుమనాలీలో పారాషూట్లో ఎగిరాను. గుట్టలుగుట్టలుగా పుస్తకాలు చదివాను – కథలు, నవలలు. సినిమాలు చూశాను. కన్నడం నేర్చుకున్నాను. సుబ్బారావు రాసిన అన్ని నవలలూ చదివేశాను.

అంతా చేసికూడా ఇంకా చాలా సమయం మిగిలుండేది. నా వృత్తిలో ఎన్నో విజయాలు సాధించాను. విదేశాలకు వెళ్ళాను. ఇల్లు కొన్నాను, కార్లు కొన్నాను. పెళ్ళి చేసుకున్నాను. నా భార్య నన్ను ‘హైపరాక్టివ్’ అంటుంది. “చాలా టైమ్ వేస్ట్ అయిపోయింది” అంటుంటాను.

ఆ రోజు రిసర్చ్ కేంద్రంలో సుందర్ చెప్పారు, త్రాచు పాము నన్ను అతి స్వల్పంగానే కాటు వేసింది అని. “అది ఎప్పుడు పూర్తిగా కాటు వేయదు. కాటు వేస్తున్న ప్రాణి యొక్క బరువునిబట్టి ఎంత విషం పంపించాలి అన్న అంచనాకు వస్తుంది. అది కూడా అరసెకనులో! కంటితో చూసి నిర్ణయిస్తుందా లేక భూమి యొక్క వైబ్రేషన్ బట్టి నిర్ణయిస్తుందా అన్నది చెప్పలేము. మీకు అది ఐదు మిల్లీగ్రాములు కూడా ఇవ్వలేదు…”

“విషమే కదా?”

“అంత తక్కువ మోతాదులో ఇస్తే మీకు అది విషం కాదు అమృతం. నరాల సమస్యలకు విషాన్నే ఔషధంగా వాడుతారు… అల్లోపతి హోమియోపతి అన్నిట్లోనూ” అన్నారు సుందర్.

నేను ఆయన్నే చూస్తూ ఉన్నాను. నా కళ్ళ ముందు అతని ఆకారం నీటి మీద గీసిన బొమ్మలా కదలాడింది.

ఆయన నా గదిలో ఒక త్రాచుపాము ఫోటోను గోడకు తగిలించారు. అది బంగారు రంగు పొలుసులతో నిగనిగలాడుతోంది. తెరచుకున్న దాని నోటి నుండి నాలుక గాల్లో నిలిచి ఉంది. వంపులు తిరిగిన పదునైన కోరలు. అది ఏదో ఒక సందేశాన్ని చెప్తున్నట్టు ఉంది.

ఒకరోజు చిన్న పిప్పెట్ పట్టుకుని వచ్చి నాకు చూపించి “ఇదే త్రాచుపాము విషం” అని చెప్పారు. అది బంగారం రంగులో ఉంది.

“మామూలు బంగారు రంగు కాదు. బంగారంలో పలు రకాలుంటాయి అని ప్రాచీన గ్రంధాలలో వివరించబడి ఉంది. హాటకము, తామరసము, శాతకుంభము, జాంబూనదము, జాతరూపము, మనోహరము, ఉజ్వలము. హాటకమే అసలు సిసలైన బంగారం. దానికి పెద్ద మెరుపు ఉండదు. ఇలాగే మసగ్గా పసుపుపచ్చ రంగులో ఉంటుంది. తామరసము ఎర్రగా రాగి కలిపితే వచ్చేది. శాతకుంభము ఇత్తడి కలిసినది. జాతరూపము మనం నగలకు వాడే బంగారం – రాగి కలిపి మెరుగు పెట్టిస్తారు.”

నేను ఆ పిప్పెట్‍లోని రంగునే చూస్తూ ఉన్నాను. మసక పసుపుపచ్చ రంగు బంగారం… హాటకం. గాజు పిప్పెట్‍ని పైకెత్తి వెలుతురుకు అడ్డంగా పట్టుకుని చూసినప్పుడు మరిగి కారుతోన్న బంగారపు చుక్కలా వెలిగిపోతోంది.

“ఒక గ్రామ్ బంగారం ఇప్పుడు మూడువేలు. ఒక గ్రాం వెనం 18 వేలు. ఆరు రెట్లు… విషం అన్నది ఆరింతల విలువ చేసే అరుదైన ద్రవరూపంలో ఉన్న బంగారం. మీకు దాన్ని ఆరింతలు తగ్గించి బంగారంలా చేసి ఇచ్చింది ఆ త్రాచుపాము” అంటూ నా భుజాలు పట్టుకుని “Pray to Him! Thank Him!” అన్నారు.

ఆ బండరాయి మీద కూర్చున్నాను. (ఆ పాము) అక్కడే ఎక్కడో ఉంటుంది. త్రాచుపాము ఇరవై ఏళ్ళకాలం జీవిస్తుంది. దానికి శత్రువులే ఉండరు. అదెక్కడికీ పోదు. ఇక్కడే ఎక్కడో ఉంది – నన్ను చూస్తూ!

కాటు వేయడానికి ముందు ఆ క్షణంలో, క్షణంకంటే తక్కువ సమయంలో, అది నాకోసం విషాన్ని బంగారంగా మార్చింది. నేను అక్కడ కూర్చుని దాని బంగారు దేహాన్ని మనసులో తీర్చిదిద్దుకుంటూ ఉన్నాను. కరిగి ప్రవహిస్తున్న సెలయేరులా అది నా పైకి ఎగబాకుతున్నట్టు ఊహించుకున్నాను.

***

March 28, 2020

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

అవినేని భాస్కర్
ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో తమిళనాడులోని పళ్ళిపట్టు మండలంలో 1979లో జన్మించిన అవినేని భాస్కర్ మాతృభాష తెలుగే. అయితే తెలుగు బళ్ళు ఆ ఊళ్ళో అందుబాటులో లేకపోవడంతో ఆరవ మాధ్యమంలో చదువు సాగించారు. సాహిత్యాభిరుచి ఉన్న ఇంట పెరగడం వలన ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యానికి దగ్గరయే వీలు కలిగింది. తల్లిదండ్రుల దగ్గర తెలుగులో ఓనమాలు దిద్దినా, తెలుగు పుస్తక పఠనం మొదలైంది మాత్రం ఇరవైరెండో ఏట ఇంటర్నెట్ లో తెలుగు బ్లాగర్ల పరిచయంతోనే.
అన్నమయ్య కీర్తనల్లోని జాను తెలుగుకి ఆకర్షితుడై అతని కీర్తనలను విస్తారంగా పఠించి విస్తృతంగా అధ్యయనం చేసి, యాభైకి పైగా కీర్తనలకు తనకు తోచిన రీతిలో వివరణలు రాసి బ్లాగులోనూ, సారంగ వెబ్ పత్రికలోనూ ప్రచురించారు. ఉద్యోగరీత్యా ఎలక్ట్రానిక్స్ చిప్ డిజైనర్ గ బెంగుళూరులో స్థిరపడ్డారు.  ఇటీవల వీరు తమిళం నుంచి తెలుగులోకి  అనువదించిన జయమోహన్  కథల పుస్తకం  'నెమ్మినీలం', నవల 'అధోలోకం' బహుళ పాఠక ఆదరణ పొందాయి.

Spread the love

3 thoughts on “హాటకం

  1. చాలా చక్కటి కథ. మరణించాలన్న వ్యక్తిని మరణ మంచులు దాక తీసుకువెళ్లి తిరిగి మంచి జీవితాన్ని జీవిత మాధుర్యాన్ని చూపించింది. విషపు నాగు లో కూడా విభిన్నకోణాన్ని చూపిన రచయితకు ధన్యవాదాలు

  2. అవినేని భాస్కర్ గారి జయమోహన్ కథలకు అనువాదాలు చదవడం మొదలుపెట్టాక ఆంగ్లంలో దొరుకుతున్న అతని కథల సంపుటి కొనటం మానేసాను.

  3. జయమోహన్ గారి కథ, మీ అనువాదం రెండూ బాగున్నాయి. కథ నడిచిన శైలి, అందులోని పాము గురించిన వర్ణనలు చాలా బాగున్నాయి. అనువాదాన్ని మించి, తెలుగు కథ చదివినట్టు అనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *