చేతుల్లోకి పులిపిల్ల చెంగున ఎగిరి దూకింది. మాసిన ఎర్రని షాల్ ను దగ్గరకి లాగి గట్టిగా కప్పుకుంటున్నా. లీలగా వినపడుతున్న గంటల శబ్దాలు. దూరంగా మంచు తెరల మధ్య బౌద్ధ స్తూపం. చల్లటి గాలి. తేలికగా ఎగిరిపోతున్నా గాలిలోకి. చిన్నకళ్ళు చికిలిస్తూ నా వైపే చూస్తున్న ఎవరిదో నవ్వుతున్న ముఖం.
లోపలనుంచి సన్నటి వణుకుతో మెలుకువ వచ్చింది.
రెండో సారి ఈ కల రావడం.
మన్హటన్ లో ఇరవై ఆరవ అంతస్తులో ఉన్న చిన్న స్టూడియో అపార్ట్మెంట్ అది. ఆరు నెలల ప్రాజెక్ట్ కోసం రేపు ఇండియాకి బయలుదేరాలి.
“ఎన్నిరోజులని ఇట్లుంటావు? ఈసారన్నా పెళ్లి చేసుకోని రా! లేకపోతే సన్యాసం తీసుకో!” అని జోక్ చేసిన ప్రాజెక్ట్ మేనేజర్ గుర్తొచ్చాడు.
***
రోషి, నేను హైదరాబాద్ ఆ రూమ్‌కి వచ్చేటప్పటికే అతడు అదే అపార్ట్‌మెంట్‌లో నా ఎదురు రూమ్ లో ఉండేవాడు. నన్ను చూడగానే అతడి చిన్న కన్నుల్లో వెలుగు. “వచ్చావా మొత్తానికి?” అన్నాడు. అతడు నాతో మాట్లాడిన మొదటి మాటలు అవే. నేను సరిగానే విన్నానా అనే అనుమానం మొదట్లో ఉండేది. అతడు ఊరికే నన్ను గమనించడం, నా వైపు చిరునవ్వుతో చూడటం చాలా ఇబ్బందిగా అనిపించేది.
రోషిని కలవడం యాదృచ్ఛికంగా జరిగిందా లేక అతనే నన్ను ఇక్కడికి రప్పించాడా? మొదట్లో రెండు మూడు సార్లు ఈ ప్రశ్న వెంటాడేది. అతన్ని నేను ‘రో’ అని పిలవడం మొదలు పెట్టిన తర్వాత ఆ ఆలోచన ఆగిపోయింది. నేను ఈ ప్రాజెక్ట్‌పై రాకపోయి ఉంటే అతడిని కలిసేవాడిని కాదేమో!
రో అంటే నాకు మొదట్లో కలిగిన భయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అతడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కానీ అతడు నా చుట్టూ ఉన్నట్లు, అతడి కళ్ళు నన్నే వెంబడిస్తున్నట్లు అనిపించేది. అతడితో ఉండటం కష్టంగా అనిపించి, వచ్చిన వారం రోజుల్లోనే ఇంకొక రూమ్ వెతకడం మొదలుపెట్టాను. అతడికి అర్థమయ్యిందో లేక కావాలనే అలా చేసాడో, కొన్ని రోజులు నాకు కనబడటం మానేశాడు. కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టే అనిపించింది.
నాకు పెద్ద సిటీస్ అంటే ఇష్టం. మనుషులు చేసే హడావిడి, వాహనాల శబ్దాలు ఇవన్నీ బాగా నచ్చుతాయి. అందుకే నాకు సిటి వదిలి వెళ్లాలి అనిపించదు. న్యూయార్క్ లో కూడా మన్హటన్‌లో ఉండటం అలవాటయ్యాక, వేరే ఎక్కడికీ మారాలని ఆసక్తి కలగలేదు. న్యూయార్క్ తరువాత నాకు నచ్చిన ప్రదేశం హైదరాబాద్.
శుక్రవారం సాయంత్రం, కొద్దిగా చీకటి పడుతోంది. నా రూమ్‌కి ఉన్న చిన్న బాల్కనీలో కూర్చున్నా. అప్పుడు వచ్చాడు రో. అతను ఎదురుపడి వారం దాటిందనుకుంటా. తలుపు చిన్నగా తట్టి లోపలకి వచ్చాడు. నా ముందున్న మందు వైపు చూసాడు. అతడిని కూర్చోమని చెప్పాలనుకున్నా, కానీ చెప్పకుండానే కూర్చున్నాడు.
“నేను మీకు తెలుసా?”
“తెలియదు. మీరు ఇక్కడికి వస్తారని ఎదురుచూస్తున్నాను. మిమ్మల్ని కలవాలని మాత్రం తెలుసు.”
అతనితో సంభాషణ కొనసాగించడం కష్టంగా అనిపించింది. అతనికి మందు ఆఫర్ చేయడం మాట అటుంచి, అతని ముందు మందు తాగడానికి కూడా సంకోచించాను. అతను ఉండటం నన్నెందుకు ఇబ్బంది పెడుతుందో అర్థం కాలేదు.
“మీరేమి చేస్తుంటారు?”
“ఏమీ చేయను.”
“మీరు ఎక్కడినుంచి వచ్చారు?”
ఆ ప్రశ్నకి అతడు సమాధానం చెప్పలేదు. బాల్కనీ నుండి బయటకు చూస్తూ ఉండిపోయాడు.
అతడు నెమ్మదిగా నన్ను తనవైపు లాగుతున్నట్టు అనిపించింది.
“నేను నాస్తికుడిని. అంతకు మించి సైన్స్ ని మాత్రమే నమ్ముతాను.” అతడు ఏమీ అడక్కుండానే ఆ మాటలు మాట్లాడటం నన్ను నేను బయటవేసుకోవడంలా అనిపించింది.
అతడు ప్రశాంతంగా నా వైపు చూసి, “మంచిదే”అన్నాడు.
“నాకు ఆధ్యాత్మిక విషయాలపై, మూఢనమ్మకాలపై నాకు కొంచెం కూడా నమ్మకం లేదు.”
“అది మంచి విషయమే కదా!”
నేను ఎలా మాట్లాడినా, అతడు నాతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు అనిపించింది.
“రో, మీరు ఏదో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్టున్నారు.”
“అవును, వచ్చే వారం గయకు వెళ్లాలి.”
“గయ” అని చెప్పగానే చిన్నపాటి ఉలికిపాటు నాలో.
“నాతో గయకు వస్తావా?”
“రో, మీతో నా పరిచయమే తక్కువ. అయినా, నన్ను గయకు రమ్మని పిలవడానికి కారణమేంటి?”
“అనంతు, నువ్వు కొద్దిగా ఆలస్యంగా నన్ను కలిశావు. నేనిక్కడ నీ కోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వు నాతో గయకు రావాలి.”
“ఎందుకు?”
“ఎందుకో నాకు కూడా తెలియదు. బహుశా అది నా బాధ్యతేమో!”
“నేను రాకపోతే మీరేం చేస్తారు?” నా గొంతులో అసహనం, చిరాకు అన్నీ కలిసి ఉన్నాయన్నట్లనిపించింది.
అతడు ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో చీకట్లోకి చూస్తున్నాడు. అతడి ముఖం అంత ప్రశాంతంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
“అది తథాగతుని మార్గం” అంటూ అతను వెళ్లిపోయాడు.
**
నా లోపల అలజడి. నా జీవితంలో “గయ” ప్రస్తావన రావడం ఇది మొదటిసారి కాదు. అమ్మ చాలా చిన్నప్పుడే, తాత ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆయన గయకు వెళ్తే అదే తన చివరి రోజు అవుతుందని అమ్మతో చెప్పేవారట.
నెమ్మదిగా చీకటి నన్ను చుట్టేసింది. మందు తాగడం మర్చిపోయాను. నగరపు దీపాలు ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఎంతసేపు బెడ్‌పైన అటు ఇటు దొర్లానో తెలియదు. ఈ రో ఎవరు, నా కోసం ఎదురు చూడటం, గయ, తథాగతుడు ఏంటి ఇదంతా. సరిగ్గా రెండు నెలల క్రితం పరిచయమైన రో నాలో సృష్టిస్తున్న అలజడి అనంతంగా విస్తరిస్తున్నట్లనిపించింది. నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ లేనంత అశాంతి.
లేచి వెళ్లి రో రూం తలుపు తట్టాను. తలుపు ఊరకే దగ్గరకు వేసినట్లుంది. తలుపు తీసుకొని లోపలికి వెళ్లాను. రో చాపపై పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతని ముఖంలో అదే ప్రశాంతత. ఆ గదంతా నిశ్శబ్దం. సన్నని శాండిల్ ఉడ్ పరిమళం. గదిలో పెద్దగా వస్తువులేమీ లేవు. చిన్న బుద్ధుని బొమ్మ, ముందు వెలుగుతున్న ఓ చిన్న ప్రమిద. అక్కడ వెతకడానికి ఏమీలేదు. బుద్ధం శరణం గచ్చామి ఎవరో చెపుతున్నట్లు అనిపించింది . తరుముతున్నట్లు ఆ గదినుండి బయటికి వచ్చా .
ఉదయం లేవగానే ఒక నిర్ణయం తీసుకున్నా.
వెళ్లి రో కి నాతో రెండు వారాలు కలిసి ఉంటేనే వస్తానని చెప్పాను. నన్ను దగ్గరగా చూస్తే తథాగతుని మార్గం లాంటి ఆలోచనలు మానుకుంటాడని అనుకున్నా.
**
పద్మ, అంత అందగత్తేమి కాదు కాని ఆమెతో ఉండే కంఫర్ట్ అందరితో రాదు. అప్పుడప్పుడు అవసరానికి రూమ్ కి పిలుస్తుంటా కొద్దిగా రేట్ ఎక్కువైనా. ఆమెది హై క్లాస్ మెయిన్టెనెన్స్. ప్రతి నిమిషాన్ని ఒడుపుగా డబ్బుల్లోకి ఎలా మార్చాలో ఆమెకు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో అనిపించేది. మగవాళ్లంటే చిన్నచూపు ఉన్నా, కొంచెం పొగరుగా ఉన్నా ఆమె నాకు నచ్చేది. వచ్చిన పని కానిచ్చి వెళ్లిపోవడం తప్ప కనీసం పేరు కూడా అడగదు.
ఆరోజు సాయంత్రం పద్మ ని రూమ్ కి రమ్మన్నా. పద్మ వచ్చే సమయానికి నేను బయట ఉండి రో ని రిసీవ్ చేసుకోమని చెప్పా. నాకు తెలుసు దీనికి పద్మ ఎక్కువ ఛార్జ్ చేస్తుందని. రెండుగంటలు బయటే తిరిగి వచ్చా. గుమ్మంలో పద్మ చెప్పులు కనపడ్డాయి. పద్మ బయట చెప్పులు విడవడం ఎప్పుడు చూడలేదు. వింతగా అనిపించింది. వంటింట్లో రో తో కలిసి పద్మ వంట చేస్తుంది. వారిద్దరూ ఎన్నో రోజులు తరువాత కలిసిన స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నారు.
నన్ను చూడగానే, నీకు ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదేం అంది పద్మ. కనీసం నా పేరు తెలుసుకోవడానికి కూడా ఇంటరెస్ట్ చూపించని ఆమె ఇంతకు ముందు చూసిన పద్మలా అనిపించలేదు. ఆమెలో ఏదో మార్పు. ఒక్క రెండు గంటల్లో రో ఈమెని ఇంతలా మార్చాడా!?
ముగ్గురం కల్సి భోజనం చేసాం. పద్మ ఆ రాత్రికి నాతో గడపదు అని అర్ధం అయింది. రాత్రి పన్నెండు దాకా ఉండి వెళుతూ పద్మ అంది, “ఇలాంటి అవకాశాలు అందరికీ రావు. ఆయన వెంట వెళ్ళు” అని.
ఇన్ని రోజులుగా నేను తెలుసుకోలేనిదేదో ఆమె ఈ కాసేపట్లో తెలుసుకుందా?
పద్మకి నేను పంపిన డబ్బులు వెనక్కి పంపింది ఆన్లైన్ లో. నేను అతడి మాయనుంచి బయటపడటానికి ఆఖరి అస్త్రం పద్మ అనుకున్నా. అతడు నిబ్బరంగా అన్నిటినీ తీసుకొని నన్ను ఇంకా గట్టిగా హత్తుకుంటున్నట్లుగా ఉంది.
అతన్ని కాదనలేని పక్కకు తోయలేని బలమైన బలహీనత ఆక్రమించుకొని నిస్సహాయుడిని అయినట్లు ఉంది .రో నాపై చూపుతున్న దయ ఇంకా పెరిగి పెద్దదై నన్ను భయపెడుతుంది.
నేను పెట్టిన షరతుకి రెండురోజులు మిగిలి ఉండగానే “నువ్వే గెలిచావు. ఇక వెళ్దాం గయకు” అన్నా.
“అనంతూ! ఇక్కడ గెలుపు, ఓటమీ ఏమీ లేవు. ఉన్నది ప్రయాణం మాత్రమే” అన్నాడు.
ఎంత వెతికినా అతని ముఖంలో నాకు ఎలాంటి భావనలు కనిపించలేదు.
**
అతను కోరుకున్నట్లు ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో బయలుదేరాం.
రో ని మొదటిసారి పరిశీలనగా చూసా. బహుశా అతడు ఇరవైల్లో ఉంటాడేమో. గుండు వల్ల అతని పెద్ద చెవులు కొద్దిగా ముందుకు వంగి వింటున్నట్లుగా ఉన్నాయి. మెడలో జపమాల. పైన కప్పుకున్న కొద్దిగా మసకబారిన బర్గున్డి రంగు షాల్. నేనెప్పుడూ బుద్ధుని గురించి ప్రత్యేకంగా తెలుసుకుంది లేదు. మా అమ్మ మా తాత గురించి చెప్పిన మాటలు మాత్రం గయను గుర్తు చేస్తుంటాయి.
ముప్పై ఆరుగంటలు ప్రయాణం. కొత్తగా ఉంది. జనరల్ బోగీ, మాన్హటన్ రోడ్ లో కిక్కిరిసిన జనాల మధ్య నడుస్తూ ఒకరినొకరు తోసుకుంటూ రెడ్ లైట్ ల మధ్య రోడ్ మీద పరుగుతీసే మనుషులును గుర్తుచేస్తుంది. ఇక్కడ మనుషులు తోసుకొంటూ వచ్చి ఒకరినొకరు ఆనుకొని కూర్చుంటున్నారు. వాళ్లకి ఒకళ్ళనొక్కళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్న స్పృహ కూడా లేదు. హాయిగా అరుచుకుంటున్నారు. పెద్దపెద్దగా మాట్లాడుకుంటున్నారు. . ప్రపంచంలో జరిగే విషయాలు మొత్తం వారి గుప్పిట్లో ఉన్నట్లు. ప్రపంచం ఎలా నడవాలో వారికే తెలిసినట్లు మాట్లాడుకుంటున్నారు. కొందరు రో కి నమస్కారం పెడుతున్నారు. మరికొందరు చూసి చూడనట్లు ముఖం పక్కకి తిప్పుకుంటున్నారు. కిటికీ వైపు కూర్చున్న నేను వీరికి బయట ఉన్న విశాల ప్రపంచాన్ని వారధిలా ఉన్నట్లు అనిపించింది. రో ఎక్కేవారిని, దిగేవారిని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు అనిపించింది. చీకటి పడింది, ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. చిన్న కుదుపుతో మెలుకువ వచ్చింది. ఎక్కడో అడవిలో చిన్న స్టేషన్ లో సిగ్నల్ పడక ఆగినట్లుంది. రో ఏదో ధ్యానంలో ఉన్నట్లు కదలకుండా కూర్చొని ఉన్నాడు. ఎవరో ఇద్దరు మనుషులు ఎక్కడపడితే అక్కడ నిద్రపోతున్న మనుషులను దాటుకుంటు వచ్చి నా కాళ్ల దగ్గర ఉన్న కొంచెం ఖాళీలో సర్దుకొని కూర్చున్నారు. ఒకతని చేతుల్లో చిన్న బుట్ట లాంటిది ఉంది. ట్రైన్ బయలు దేరింది. నిద్రపట్టక చీకట్లోకి చూస్తు కూర్చున్నా. బుట్టమూత కొంచెం పక్కకి జరిగింది. చిన్న పులికూన ఆ ఖాళీలోంచి నా కళ్లలో కళ్ళు పెట్టి చూసినట్లు అనిపించింది.
**
ఒక్కసారిగా ఏవో పెద్ద శబ్దాలు. కేకలు. నా తల దేనినో గుద్దుకోవడం తెలుస్తుంది. కళ్లు తెరిచేసరికి బెడ్ పైన ఉన్నాను, రో కప్పుకొనే బర్గుంన్డి షాల్ నా మీద కప్పి ఉంది. అక్కడంతా హడావుడిగా ఉంది. తలంతా తిరుగుతున్నట్లు అనిపించింది.
రో గుర్తొచ్చాడు. లోపలంతా దుఃఖంతో పూడుకుపోయినట్లు అనిపించింది. చుట్టూ చూసా. అందరూ రకల రకాల దెబ్బలతో, బాధలతో హాస్పిటల్ బెడ్స్ పైన. కొందరు నొప్పితో ముడుచుకొని పడుకొని ఉన్నారు. కొందరి చుట్టూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. మరికొందరు దేవుడి తలుచుకొని బతికినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. రో ఎక్కడా కనబడలేదు. ఒక మూలగా బెడ్ పైన నాతో పాటు ప్రయాణించిన ప్రయాణికుడు. అతని దగ్గరికి నడిచా. అతడు నిద్రపోతున్నట్లు గా ఉన్నాడు. అతడే పులిపిల్లతో పాటు ఎక్కింది. అతన్ని తట్టి లేపాలని చూసా. అతని ఒళ్ళు చల్లగా తాకింది.
నేను తెచ్చుకున్న వస్తువులు, బట్టలు ఏమీ లేవు. ఖాళీగా బయటకు నడిచా. బయట బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు. ఏమీ లేని నాదగ్గర ఏదైనా ఇవ్వమని ప్రాధేయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళను దాటుకొని ముందుకు నడిచా పట్టాలు పట్టుకొని ఆక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్లా. అక్కడ పడిపోయిన బోగీలు. ముందుకు సాగలేక అడ్డంగా తిరిగి తలకిందులైన రైలు బోగీలు. నేను ఎక్కిన బోగీని వెతుక్కుంటా వెళ్ళా. ఎక్కడా రో జాడ లేదు. దూరంగా చెట్లల్లో పులిపిల్ల ఉంచిన బుట్ట కనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి బుట్టను తెరిచాను. ఆ చిన్న పులికూన నా చేతుల్లోకి ఎక్కింది. దానిని ఎత్తుకున్న చేతుల్లో నుండి పాకిన శాంతి. రో కప్పిన షాల్ దగ్గరిగా లాక్కున్నా.
లీలగా ఇదంతా ముందే తెలిసినట్లు, ఇంకా ముందు జరగబోతున్నది ఏదో అర్ధమవుతున్నట్లు గాలిలో ఎగిరిపోతున్నట్లు తేలికపాటి అడుగులు.

Srisudha Modugu
పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన శ్రీసుధ మోదుగు 'రెక్కల పిల్ల, 'డిస్టోపియ' వంటి కథా సంకలనాలతోపాటు 'అమోహం', 'విహారి', 'గొంగళి పురుగుల సామ్రాజ్యం' మొదలైన కవితా సంకలనాలు తెచ్చారు.. వీరి 'అమోహం' కవితా సంకలనానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డ్, (2017), 'అంతర్హిత' నవలకి శ్రీ జొన్నలగడ్డ రాంభొట్ల సరోజినమ్మ స్మారక పురస్కారం వచ్చాయి.




Katha narration baagumdi
Ultimate thing of life good ending