జెడ్ అనే చిన్న గ్రామంలో మాకు పోస్టింగ్ వచ్చింది. ఒక ఆర్మీ ఆఫీసర్ జీవితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పొద్దున్నే డ్రిల్, రైడింగ్ స్కూల్, డిన్నర్ కల్నల్ తో లేదా యూదుల రెస్టారెంట్లో, సాయంత్రం పేకాట.
సహజంగా ఈ దేశంలో నలుగురు కలిసి, ఎదైనా పార్టి చేసుకోడానికి వసతి గృహాలు ఉంటాయి. కానీ జెడ్ లో వసతి గృహాలు లేవు. కనీసం పెళ్ళి చేసుకోవాలి అనుకోవడానికి అయినా ఒక్క అమ్మయి లేదు. కాబట్టి మేమందరం ఒకరిని ఒకరం మా గదుల్లోనే కలుసుకునేవాళ్ళం. కానీ ఎవ్వరి గదిలో అయినా యూనిఫాం తప్ప ఇంకేమీ కనిపించేవి కాదు. మాలో ఒక్కరు మాత్రమే రెజిమెంట్ కి చెందినవాడు కాదు. అతని వయస్సు ముప్పై అయిదేళ్ళు. దాంతో మేమతన్ని ముసలోడిలా చూసేవాళ్ళం. కానీ అతనికి జూనియర్లతో మెలగడంలో మంచి అనుభవం ఉంది. మాడిపోయిన మొహము, ఎప్పుడూ కఠినంగా ఉండే నడవడిక, పదునైన నాలుక వల్ల అతను జూనియర్ల మీద సులువుగా పెత్తనం చెలాయిస్తాడు. ఎప్పుడూ ఎదో ఒక రహస్యాన్ని దాస్తున్నట్టు అనిపిస్తాడు. అతన్ని చూడడానికి రష్యన్లా అనిపించినా అతని పేరు మాత్రం విదేశీ పేరు. రష్యాలో అశ్వదళంలో హుస్సార్ అనే రెజిమెంట్లో నైపుణ్యం కలిగిన సైనికులు ఉంటారు. అతను ఈ హుస్సార్ రెజిమెంట్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటిది ఎందుకని ఇలా తొందరగా రిటైర్ అయ్యి, ఏ వసతులు లేని ఈ ఊర్లో ఎందుకుంటున్నాడో ఎవ్వరికి అర్ధంకాలేదు. అతని ఖర్చులకి సరిపడా సంపాదనలేక ఈ ఊర్లో అతను పేదరికంతో ఇబ్బంది పడుతున్నాడు. ఎప్పుడూ నడిచే వెళ్తాడు. ఒక వెలిసిపోయిన, చీకిపోయిన నల్ల కోటు వేసుకుంటాడు. కానీ మా ఆఫీసర్లని స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతను ఆ మాసిపోయిన బట్టల్లోనే, రిటైర్డ్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ వండిన ఒక రెండు మూడు వంటలతో, ఛాంపైన్ నీళ్లలా పొంగుతుండగా ఆఫీసర్లకు విందు ఏర్పాటు చేస్తాడు. అతనికి ఆదాయం ఎలా వస్తుందో, ఎంత వస్తుందో ఎవ్వరికి తెలీదు. నిజానికి ఎవ్వరూ అడగాలనుకోలేదు. అతని దగ్గర కొన్ని మిలిటరీ పుస్తకాలు, నవలలు ఉన్నాయి. వాటిని అడిగినవాళ్ళకి ఇవ్వడం అతనికి ఇష్టం. తిరిగి తెచ్చివ్వమని కూడా చెప్పడు. అలాగే అతను తీసుకున్న పుస్తకాలని తిరిగి ఇవ్వడు.
అతనికున్న ఒకేఒక హాబీ పిస్టల్ షూటింగ్. అతని గది గోడలన్నీ బుల్లెట్ చిల్లులతో, చూడడానికి తేనే తుట్టులా ఉంటుంది. సరిగ్గా ఫర్నిచర్ కూడా లేని ఆ గదిలో, అతని పిస్టళ్లు మాత్రం ఖరీదైనవి వున్నాయి. పిస్టల్ కాల్చడంలో అతని నైపుణ్యం అసాధారణమైనది. ఒకవేళ ఎవరి టోపీ మీదైనా ఆపిల్ పెట్టి అది అతను కాల్చాలనుకుంటే, ఆ టోపీ కింద తల పెట్టడానికి మాలో ఒక్కళ్ళు కూడా సంకోచించరు. మేమిద్దరం మాట్లాడుకుంటే అది చాలా సార్లు వాదనతో ముగిసేది. అతన్ని నేను సిల్వియో(అడవి మనిషి అని అర్ధం) అని పిలుస్తాను కానీ అతనెప్పుడూ ఆ పేరుకి పలకడు. “నువ్వెప్పుడైనా పోరాడావా?” అని అడిగినప్పుడు అతను కేవలం “అవును” అనేవాడు తప్ప, ఎక్కడ ఎప్పుడూ అనే విషయాలు చెప్పేవాడు కాదు. దీన్నిబట్టి అతనికి ఈ విషయాలు మాట్లాడడం ఇష్టంలేదని స్పష్టంగా తెలిసేది. ఎదో చేదు జ్ఞాపకం అతన్ని వేధిస్తుందని అర్ధం చేసుకున్నాం. మాలో ఒక్కళ్ళకి కూడా అతను పిరికివాడిలా అనిపించడు. కొంతమంది ఇలా ఉంటారు వారిని చూస్తేనే ఆకారన్ని బట్టే ఉన్న అనుమనాలన్ని తేలిపోతాయి.
ఒక ఊహించని సంఘటన మమల్ని ఆశ్చర్యపరిచింది. ఒక మధ్యాహ్నం పదిమంది ఆఫీసర్లు సిల్వియోతో భోజనం చేశారు. ఎప్పటిలాగే వారు ఎక్కువగా మద్యం తాగారు. తరువాత వారు సిల్వియోను “పేకాట ఆడమని” కోరారు. కానీ ఆయన తాను చాలా అరుదుగా ఆడతానని చెప్పి చాలా సేపు నిరాకరించాడు. కానీ ఆఫీసర్ల బలవంతం మేరకు చివరికి అంగీకరించి పేకలు తీసుకురమ్మని ఆదేశించాడు.యాభై బంగారు నాణేలు టేబుల్‌పై పెట్టి, అందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆట మొదలైంది. ఆట ఆడుతున్నప్పుడు సిల్వియో ఎప్పుడూ మాటాడడు, ఏ వాదన చేయడు, వివరణ ఇవ్వడు. ప్రత్యర్థి తప్పు చేస్తే, ఒక్క మాటా చెప్పకుండా ఆ తప్పును గమనించి రాసేసేవాడు. ఆయన అలవాటు అందరికీ తెలుసు కాబట్టి, మేమంతా ఎప్పుడూ అలాగే వదిలేసేవాళ్ళం. కానీ ఆరోజు మాతో లేటుగా ఆడదానికి వచ్చిన ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆడేటప్పుడు అతను పరధ్యానంలో ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా స్కోర్ రాసాడు. సిల్వియో తనదైన రీతిలో చాక్ పీస్ తీసుకుని ఆ స్కోర్ ని సరి చేశాడు ఎప్పటిలాగే. కానీ ఆఫీసర్, సిల్వియో తప్పు చేసాడనుకుని వాదన మొదలుపెట్టాడు. ఏం మాట్లాడినా, ఎంత చెప్పినా సిల్వియో మౌనంగానే ఉన్నాడు. ఆఫీసర్ కి కోపం ఎక్కువైపోయి డస్టర్తో స్కోర్ ని తుడిచేసి, ఆయన అనుకున్నదే రాసాడు. సిల్వియో మళ్ళీ చాక్ పీస్ తీసుకుని దానిని సరిచేసాడు. ముందే వైన్ తాగిన మత్తులో ఉన్న ఆఫీసర్ ని ఈ ఆట, సిల్వియో పద్ధతి, చుట్టూ ఆఫీసర్లు నవ్వడం వేడెక్కించాయి. ఇదంతా అవమానంగా భావించిన అతను, చెలరేగి ఇత్తడి కొవ్వొత్తుల స్టాండ్ తీసుకుని సిల్వియో మీదకి విసిరాడు. సిల్వియో దాని నుండి తృటిలో తప్పించుకున్నాడు. ఇదంతా కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. మా అందరికి ఏం జరిగిందో అర్ధంకాలేదు మేము షాక్ లో ఉన్నాము.
సిల్వియో లేచి విపరీతమైన కోపంతో, నిప్పు రవ్వల్లా లాంటి కళ్ళతో ” “సార్! మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి. ఇక్కడ నువ్వు చేసిన దానికి రక్షించమని దేవుడికి దండం పెట్టుకోండి” అన్నాడు.
ఆ మాటలు విన్న ఆ ఆఫీసర్ తెల్లబోయాడు. మొఖంలో నెత్తుటి చుక్కలేదు. శవంలా నించున్నాడు. ఇది ఇక్కడితో ఆపకపోతే జరిగే పర్యవసానాలు మాకు తెలుసు. దాంతో ఆఫీసర్ తేరుకుని ఇక్కడితో ఆపేసి, బయటికి వెళ్తూ జరిగిన నష్టానికి పరిహారంగా ఏదైనా చెయ్యడానికి అతను సిద్ధమని చెప్పాడు.
ఆట మళ్ళీ మొదలైంది. కానీ సిల్వియో బాగా కలతగా ముభావంగా ఉండడం చూసి, మేము ఆడలేక ఒకళ్ళ తరువాత ఒకళ్ళం ఆట వదిలి ఎవరి క్వార్టర్లకి వాళ్ళు వెళ్ళాం. మరుసటిరోజు పొద్దున్న రైడింగ్ స్కూల్లో ఆ యువ ఆఫీసర్ని చూసి ఇతనింకా బతికేవున్నాడే అని మాలో మేము గొణిగాము. కొద్దిసేపటి తరువాత ఆఫీసర్నే నేరుగా ఈ ప్రశ్న అడిగితే అతను ” ఇంత వరకు సిల్వియో నుండి ఎలాంటి కబురు లేదు” అని చెప్పాడు. మేము ఆశ్చర్యపోయాము. వెంటనే మేము సిల్వియో ఇంటికి వెళ్లాము. అతను ఆవరణలో నిలబడి, గేటుకు అతికించిన ఒక ఏస్ పేక ముక్క మీద, బుల్లెట్లను వరుసగా కాలుస్తూ ఉన్నాడు. మమల్ని అతను ఎప్పటిలానే సాదరంగా ఆహ్వానించాడు. నిన్న సాయంత్రం జరిగిన విషయం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
మూడు రోజులు గడిచింది ఈ యువ ఆఫీసర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు ” అదేంటి సిల్వియో గొడవపడడా? ఇది సాధ్యమా?” అని మాలో మేము చాలా చర్చించుకున్నాం. సిల్వియో గొడవపడలేదు. తనని అవమానించినా అవేమి మనసులో పెట్టుకోకుండా సినిమాల్లో చూపించినట్టు ఆఫీసర్ క్షమాపణలు అంగీకరించి, అతనితో సఖ్యతగా ఉన్నాడు. కానీ ఇది మా అందరి దృష్టిలో అతని స్థాయిని దిగజార్చింది. మా అందరి ఉడుకు రక్తాలలో మేము నమ్మేది ఒకటే. మనిషికున్న గుణాలు, స్వభావాలన్నిటిలో ధైర్యమే గొప్పది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే, ధైర్యాన్ని వదులుకుంటే వాళ్ళని పిరికివాళ్ళలా చూస్తాము. మా కంటికి సిల్వియో ఆ సమయంలో పిరికివాడిలా అనిపించాడు. కొన్ని రోజులకి అంతా సద్దుమణిగింది. అందరు జరిగింది మర్చిపోయారు సిల్వియో మళ్ళీ ఆఫీసర్ల మీద పట్టు సాధించాడు. కానీ నేను మాత్రం ఇంకా అతనితో ఇంతకుముందులా స్నేహంగా ఉండలేకపోయాను.
సహజంగానే రొమాంటిక్ స్వభావం కలిగిన నాకు సిల్వియో ఒక రహస్యహీరోలా కనిపిస్తాడు. మిగతా వాళ్లందరికీ అతనలా కనిపించకపోవచ్చు. కానీ నేను అతన్ని బాగా ఆరాధించేవాడిని. సిల్వియోకి కూడా నేనంటే ఇష్టం. మిగతా అందరితో ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ నాతో మాత్రమే సాధారణంగా మాట్లాడతాడు, చాలా విషయాల్లో మాకు ఏకాభిప్రాయాలు ఉంటాయి కూడా. కానీ ఈ సంఘటన తరువాత అతను నాకు హీరోల కనిపించట్లేదు. మా మధ్య సంబంధం దెబ్బ తిన్నది. నాకు అతని మీద గౌరవంపోయింది. నేను అతన్ని చూడడానికి కూడా సిగ్గుపడ్డాను. సిల్వియో చాలా తెలివైనవాడు. ఏదైనా త్వరగా అర్ధం చేసుకోగలడు. నా ప్రవర్తనలో మార్పుని, దాని వెనుక కారణాన్ని అతను గుర్తించాడు. దాని గురించి నాకు వివరణ ఇవ్వాలని సిల్వియో రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ నేను ఆసక్తి చూపించకపోయేసరికి వదిలేసాడు. అప్పటినుండి నేను అతన్ని కేవలం నా స్నేహితుల సమక్షంలో మాత్రమే కలిసాను. మా మధ్య సీక్రెట్ సంభాషణలు ముగిసాయి.
ఎప్పుడూ బిజీగా ఉండే రాజధానికి వాళ్ళు, వేరే ఊర్లో, ముఖ్యంగా గ్రామాలలో పనిచేసే వాళ్ళ భావోద్వేగాలను అసలు ఊహించలేరు. ఉదాహరణకి పోస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూడడం. ప్రతీ మంగళ, శుక్రవారాలలో రెజిమెంటల్ కార్యాలయం అధికారులతో కిటకిటలాడుతుంది. కొంతమంది డబ్బుకోసం, కొంతమంది ఉత్తరాలు, వార్తల కోసం ఎదురుచూస్తుంటారు. బహుశా ఉత్తరాలను అక్కడికక్కడే తెరిచి, వార్తలను పరస్పరం పంచుకునేవారు. అలా ఆ కార్యాలయం మొత్తం ఉత్సాహభరితంగా మారిపోయేది.
సిల్వియో ఉత్తరాలు కూడా మా రెజిమెంటుకే వస్తాయి. వాటిని తీసుకోడానికి అతనే స్వయంగా వస్తాడు. ఒకరోజు ఒక ఉత్తరాన్ని సిల్వియోకి ఇవ్వగానే , అతను చాలా అసహనంగా ఆ ఉత్తరాన్ని చింపి తరువాత ఆతృతగా అందులోని విషయాన్ని చదివాడు. అతని కళ్ళు మెరిసాయి. మిగతా ఆఫీసర్లు ఎవరికీ వచ్చిన ఉత్తరాలలో వాళ్ళు బిజీగా ఉండడంతో ఇదెవ్వరు గమనించలేదు.
సిల్వియో నా వైపు తిరిగి ” జెంటిల్‌మన్, పరిస్థితుల దృష్ట్యా నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. నేను ఇవాళ రాత్రికే బయలుదేరుతున్నాను. ఇవాళ ఆఖరిగా నాతో డిన్నర్కి నువ్వు వస్తావని అనుకుంటాను, నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. తప్పకుండా రావాలి” అని చెప్పి ఆగమేఘాల మీద వెళ్ళిపోయాడు. సిల్వియో ఇంట్లో కలవడానికి నిర్ణయించుకున్నాము.
సిల్వియో అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకి అక్కడి వెళ్లాను. దాదాపు మొత్తం రెజిమెంట్ అక్కడే ఉన్నారు. సిల్వియో వస్తువులన్నీ సర్దేసి ఉన్నాయి. తూట్లు పడిన గోడలు తప్పా అన్ని సర్దేసాడు. మేము టేబుల్ దగ్గర కూర్చున్నాము. సిల్వియో చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఆ ఉత్సాహం అక్కడి వాతావరణమంతా నిండింది. ఎక్కడ చూసినా షాంపేన్ లేదా వైన్ సీసాల కార్క్‌లు ఎగిరిపోతున్నాయి. ఈ రోజు బయలుదేరుతున్న మన స్నేహితుడికి అంతా మంచి జరగాలని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనమంతా కోరుకుందాం అని అంటుండగా ఒక పక్క సీసాలు మత్తెక్కించే శబ్దంతో ఉప్పొంగగా, గ్లాసులు నిరంతరం నురుగుతూ పోయాయి. మేము విందు ముగించి టేబుల్ నుండి లేచేసరికి చాలా ఆలస్యమైంది. తమ తమ టోపీల కోసం వెతుకుతుండగా సిల్వియో అందరికీ వీడ్కోలు చెప్పాడు. నేను బయలుదేరబోతున్నప్పుడు నా చెయ్యి పట్టుకుని, చిన్నగా “నేను నీతో మాట్లాడాలి” అన్నాడు. నేను వెనకాల ఉండిపోయాను. వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారు, నేనూ సిల్వియో మాత్రమే మిగిలిపోయాము.
ఎదురెదురుగా కూర్చుని సిగరెట్ పైప్ వెలిగించాము. సిల్వియో చూడడానికి చాలా ఆందోళనకరంగా ఉన్నాడు. ముందున్న ఉత్సాహం అతని కళ్ళలో కనపడలేదు. ముఖమంతా పాలిపోయి, మెరుస్తున్న కళ్ళతో, అతని నోటి నుండి దట్టమైన పొగ వదులుతూ చూడడానికి దయ్యంలా ఉన్నాడు. చాలా నిమిషాల వరకు ఉన్న నిశ్శబ్దాన్ని తరిమేస్తూ సిల్వియో మాట్లాడాడు:
మనం మళ్ళీ కలవలేకపోవచ్చు. చివరి వీడ్కోలు చెప్పేలోపు నేనూ నీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేనూ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను అస్సలు పట్టించుకోనని నీకు తెలుసు. కానీ నీ దృష్టిలో నేనూ చెడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నాను, దాన్ని అలానే వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు” అని ఆపి ఖాళీ అయిన సిగరెట్ పైప్లో సిగరెట్ నింపుతున్నాడు. నేనూ మౌనంగా కిందికి చూస్తూ కూర్చున్నాను.
ఆరోజు మద్యం మత్తులో ఉన్న పిచ్చివాడి మీద నేను ప్రతీకారం తేర్చుకోలేదని నీకు విచిత్రంగా అనిపించింది,” అని అతను కొనసాగించాడు.
“అయితే, ఆయుధాలను ఎంచుకునే హక్కు నాకు ఉన్నందున, అతని ప్రాణం కొంతవరకు నా చేతుల్లోనే ఉందని నువ్వు అంగీకరించాలి. ఇది నా సహనాన్ని, ఉదారతకు ఒక ఉదాహరణ. నిన్ను నమ్మించాలని కాకపోయినా చెబుతున్నాను : నా మీద చిన్న గీత కూడా పడకుండా, నా ప్రాణానికి ఎలాంటి ఆపద లేకుండా అతన్ని చీల్చి చెండాడగలను. కానీ అలా చేస్తే నేను అతన్ని క్షమించలేను కదా.నేను అతన్ని వదిలేసింది కేవలం క్షమించి, జాలీ, దయతో మాత్రమే”
ఇది విన్న నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సిల్వియో వైపు ఆశ్చర్యంగా చూసాను. సిల్వియో తిరిగి కొనసాగించాడు:
“నాకు నా జీవితాన్ని ప్రమాదాల్లో పడేసే హక్కు లేదు. ఆరేళ్ళ క్రితం నా మొఖం మీద చాచి ఒకరు కొట్టారు. ఆ శత్రువు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు”
నాకు ఆతృతగా ఎక్కువైంది ” మీరు అతనితో గొడవపడలేదా మరి? పరిస్థితుల ప్రభావం వల్ల అతని నుండి దూరంగా వచ్చేయాల్సి వచ్చిందా?”
“నేను అతనితో గొడవపడ్డాను. దానికి నాకొచ్చిన జ్ఞాపిక ఇదిగో” అని సిల్వియో లేచి ఒక కార్డ్‌బోర్డ్ పెట్టె నుండి బంగారు టాసెల్ల్, బంగారు బ్రెయిడ్ ఉన్న ఎర్రటి టోపీని తీసుకుని చూపించాడు.” నా వైఖరి నీకు తెలుసు కదా! ఎక్కడున్నా సరే, ఏ పని చేసిన అందులో మొదటి వ్యక్తిగా ర్యాంక్ తెచ్చుకోవడం నాకు అలవాటు అయిపొయింది. నా చిన్నప్పటినుండి ఇదే ధ్యేయంగా ర్యాంక్ సాధించడాన్ని ఇష్టపడుతుంటాను. ఇక ఆర్మీలో అందరికన్నా పెద్ద తాగుబోతుని. తాగడాన్ని, తాగి మత్తులో తూగడాన్ని గర్వంగా చెప్పుకునేవాడిని. ఎంతలా తాగుతానంటే, డేవిడ్ ఆఫ్ తన కవితల్లో రాస్తూ పొగిడే బోర్టాఫ్ (రష్యన్ ఆర్మీ ఆఫీసర్) కూడా తాగుడు విషయంలో నా ముందు దిగదుడుపే. ఈ విషయం మీద మాలో మాకు రెజిమెంట్లో రోజు చిన్నపాటి యుద్ధాలే జరిగేవి. అన్ని గొడవల్లో నేను ఉంటాను, లేదా నేనే గొడవ మొదలుపెట్టే వాడిని. నాతో ఉన్న కామ్రేడ్స్ నన్ను ఆరాధించేవాళ్ళు కానీ రెజిమెంట్లో తరచూ మారే కమాండర్లు నన్ను ఎదో ఎప్పటికి వదిలించుకోలేని దయ్యాన్ని చూసినట్టు చూసేవాళ్ళు.
నాకున్న పేరుని నేను శాంతంగా, చెప్పాలంటే బాగా అల్లరిగా వ్యవహరిస్తూ ఆనందిస్తున్న రోజులవి. అప్పుడొక యువకుడు మా రెజిమెంట్లో చేరాడు. అతను బాగా సంపన్నుడు, పెద్ద పేరు గల కుటుంబం నుండి వచ్చాడు. అతని పేరు చెప్పను కానీ నా జీవితంలో అలంటి వ్యక్తిని ఎప్పుడు కలవలేదు. చాలా తెలివైనవాడు! చాలా చాలా అదృష్టవంతుడు!! యువకుడు, తెలివి, అందంతో పాటు దేనికైనా తెగించే ధైర్యం, ఎంత తిన్నా తరగని ఆస్థి. ఇంకా అతని రాక మా అందరిలో ఒక మార్పు తెచ్చింది. అప్పటిదాకా నన్ను గొప్పగా చూసేవాళ్ళు, తర్వాత మెల్లగా ఆ స్థానం నేను కోల్పోయాను. నాకున్న పేరు విని అతను నాతో స్నేహం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ నేనతన్ని తిరస్కరించాను. కనీసం కొంచెం కూడా బాధ, పశ్చాతాపం, అవమానంగా అనుకోకుండా అతను నా నుండి దూరంగా ఉన్నాడు.
నేను అతన్ని ద్వేషించడం మొదలుపెట్టాను. రెజిమెంట్లో అతని విజయాలు, సమాజంలో-మహిళల్లో అతని గురించి గొప్పగా మాట్లాడడం నాకు చిరాకు తెప్పించాయి. అతనితో గొడవపెట్టుకోడానికి ప్రయత్నించాను. నేను వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడితే అతను నాకు అలానే బదులిచ్చాడు. కానీ అతని మాటలు పదునుగా నాకన్నా తెలివిగా ఉన్నాయి. దానితో అతను జోక్ చేసినట్టు నవ్వేవాడు. నేను కోపంతో రగిలిపోయేవాడిని.
“ఇవన్నీ పోగయ్యి, చివరాఖరికి ప్రొప్రయిటర్ ఇంట్లో పెద్ద గొడవైయ్యింది. అతన్ని అక్కడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇష్టపడడం, ముఖ్యంగా ఇన్నిరోజులు నాతో చాలా స్నేహంగా ఉండే ఆ ప్రొప్రయిటర్ ఇంటి ఆడపిల్ల- ఆమె కూడా అతన్ని బాగా ఆరాధించడం మొదలుపెట్టింది. దానితో నాకు కోపం ఎక్కువై అతని చెవిలో కించపరుస్తూ కొన్ని మాటలు అన్నాను. అది విని అతను నన్ను చాచి చెంప మీద కొట్టాడు. వెంటనే ఇద్దరం మా ఒరలో ఉన్న కత్తులని తీసాము, అది చూసి ఆమె కళ్ళు తిరిగిపడిపోయింది. అక్కడున్నవారంతా మమల్ని గొడవపడకుండా విడగొట్టారు. కానీ ఆరోజే మేము తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాము.
సుమారుగా తెల్లవారుజాము అయింది. మేము కలవాలన్న ప్రదేశానికి ముగ్గురిని తోడుగా తీసుకుని వెళ్ళాను. అతనికోసం అసహనంగా ఎదురుచూస్తున్నాను. వసంతకాలపు సూర్యుడు ఉదయించాడు. వాతావరణంలో వేడి పెరుగుతుంది. అప్పుడు దూరం నుండి అతను కాలి నడకన రావడం కనిపించింది. అతనితో పాటు కేవలం ఒకేఒక వ్యక్తి మాత్రమే వస్తున్నాడు. మేము అతన్ని కలవడానికి ముందుకు వచ్చాము. అతను చేతిలో రెజిమెంట్ క్యాప్లో బ్లాక్ చెర్రీస్ పట్టుకుని మా ముందు నిలబడ్డాడు.
మా తోడు వచ్చిన వ్యక్తులు దూరాలని కొలుస్తూ ఒక పన్నెండు ప్రదేశాలు నిర్ణయించారు. ముందుగా ఫైరింగ్ చెయ్యాల్సింది నేనే. కానీ అప్పుడు నాకున్న విపరీత ఉద్రేకంలో, నా చెయ్యి అదుపు తప్పచ్చు. అందుకని మొదట షూటింగ్ అతన్ని చేయమని చెప్పాను. కానీ అతను నిరాకరించాడు. కాబట్టి ఎవరు ముందు కాల్చాలో చిట్టీలు వెయ్యాలని నిర్ణయించుకున్నాం.
చిట్టీ అతను మొదలు ఫైరింగ్ చెయ్యాలన్నట్టుగా పడింది. అదృష్టవంతుడు! అతను వెంటనే బులెట్ తీసుకుని నా క్యాప్ గుండా ఫైరింగ్ చేసాడు.
ఇప్పుడు నా వంతు. చివిరికి అతని ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. ఎక్కడన్నా భయపడుతున్న ఛాయలు కనిపిస్తాయేమో అని అతని వైపు ఆతృతగా చూసాను. కానీ అతను నా పిస్టల్ కి సూటిగా నించుని, తన క్యాప్ నుండి చెర్రీలు తిని, గింజెలు చుట్టూ ఉన్న రాళ్ల మీదకి ఉమ్మేస్తున్నాడు. అందులో కొన్ని నాకు దగ్గర కూడా పడ్డాయి. అతని ఈ ప్రవర్తన నాకింకా ఉద్రేకాన్ని తెప్పించింది. అతని ప్రాణం మీద అతనికి ఏమాత్రం ఆశ, విలువ లేనప్పుడు దాన్ని దూరం చేస్తే నాకేమొస్తుంది? ఏం ప్రయోజనం అనిపించింది. ఈ ఆలోచన రాగానే నేను పిస్టల్ ని కిందికి దించాను.
నువ్వు చావుకు సిద్ధంగా ఉన్నట్టు లేవు. నువ్వు పండ్లు తింటున్నావు, మధ్యలో అడ్డుపడడం నాకు ఇష్టంలేదు. అని అన్నాను
కనీసం ఈ విషయంలో నువ్వు అడ్డుపడట్లేదు. నీకు కాల్చాలి అనిపిస్తే కాల్చు, లేదంటే వదిలేయ్. నిర్ణయం నీది. ఏ క్షణమైనా మీ సేవకు నేను సిద్ధంగా ఉంటాను.” అన్నాడు
నేను తిరిగి అందరితో నాకు ఆరోజు కాల్చాలని లేదని చెప్పాను. అలా మా ద్వంద్వ యుద్ధం ముగిసింది. తరువాత నేను రాజీనామా చేసి, ఇక్కడికి వచ్చాను. అప్పటి నుండి ఒక్కరోజు కూడా ప్రతీకారం ఎలా తీసుకోవాలో అని ఆలోచించని క్షణం లేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
సిల్వియో జేబు నుండి ఒక ఉత్తరం తీసి నా చేతికి ఇచ్చి నన్ను చదవమన్నాడు. ఆ ఉత్తరం ఎవరో మాస్కో నుండి అతనికి రాసారు. అందులో ఎవరో ఒక వ్యక్తి, అందమైన అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని రాసి ఉంది.
” ఆ వ్యక్తి ఎవరై ఉంటారో ఊహించు ” అన్నాడు సిల్వియో. నేను మాస్కోకి బయలుదేరుతున్నాను. చూద్దాం అతను ఇంకా అలాగే నిర్లక్ష్యంగా ఉన్నాడేమో. ఎన్ని వసంతాలు, శీతాకాలాలు చస్తూ బతుకుతున్నావు నాకే తెలుసు. రాత్రి డిన్నర్ సమయానికల్లా ఎదో ఒక పనిలో బిజీగా ఉన్నా, స్టారొస్తా (రష్యన్ గ్రామ పెద్ద) ని కలిసి మాట్లాడి, చుట్టూ తిరిగి కొత్త బిల్డింగ్ పనులన్నీ ఎక్కడిదాకా వచ్చాయని చూసి కాలక్షేపం చేశా. కానీ సాయంత్రం అవ్వగానే ఎదో కోల్పోయినట్టు బాధగా అనిపించింది. అవి నా పుస్తకాలు. స్టోర్రూంలో, షోకేసులు నిండా, కప్బోర్డులలో ఉన్న నా పుస్తకాలని నా మనసుకి తెలుసు. మా ఇంటి ఓనర్ కురిలోవ్నా, ఆమెకు తెలిసిన కథలన్నీ నాకు చెప్పేది. పేద మహిళా రైతుల పాటలు నన్ను విషాదంలో ముంచెత్తాయి. అతను ఇప్పుడు ఇంతకుముందులా చావుకు ముందు చెర్రీ తినే వ్యక్తిలా ఉండి ఉండడు. ఈ మాటలు అంటూనే సిల్వియో క్యాప్ నెల మీద విసిరికొట్టి, బోనులో ఉన్న పులిలా అటు ఇటు తిరుగుతున్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. ఎదో వింతైన భావాలూ నన్ను చుట్టుముట్టాయి.
సేవకుడు లోపలి వచ్చి గుర్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు. సిల్వియో నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తరువాత జట్కాలో రెండు ట్రంక్ పెట్టెలు పెట్టాడు. ఒక దాంట్లో పిస్తోళ్లు, ఇంకో దాంట్లో అతని వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. అతను జట్కా ఎక్కాడు, రెండో సారి నాకు వీడ్కోలు చెప్పాడు. గుర్రాలు పరుగులందుకున్నాయి.
చాప్టర్ – 2
చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కుటుంబ పరిస్థితుల వల్ల నేను ఒక చిన్న ఎన్ గ్రామంలో స్థిరపడ్డాను. వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, పూర్వం ఉన్న ఆనందమైన రోజులను గుర్తు చేసుకుంటూ లోలోపల ఆవేదనపడ్డాను. ఉత్సాహం కోసం చెర్రీ బ్రాండీ తాగి చూశాను, కానీ అది నాకు తలనొప్పినే తెచ్చింది. ఇక్కడ నేనో విషయం ఒప్పుకోవాలి. నాకెప్పుడూ నేను తాగుబోతుని ఐతానేమో అని భయం ఉండేది. ఎందుకంటే అలంటి తాగుబోతుల్ని మా జిల్లాలో చాలా మందిని చూసాను, వాళ్ళ జీవితాలను కూడా.
నాకు ఇరుగుపొరుగు కూడా ఇద్దరు లేదా ముగ్గురు విషాదమైన వ్యక్తులు తప్ప ఎవరూ లేరు. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా, వాళ్ళ సంభాషణలన్నీ నిట్టూర్పులు, వెక్కిరింతలతో ఉండేవి. వీళ్ళతో మాట్లాడేకన్నా ఒంటరిగా ఉండడం మంచిదనుకున్నాను. అందుకని రాత్రులు నిద్రకి వీలైనంత తొందరగా , పొద్దున్న భోజనానికి వీలైనంత ఆలస్యంగా వెళ్ళేవాడిని. అలా సాయంత్రాలు తగ్గించి, ఉదయాలు పొగిడించాలని ప్రణాళిక వేసుకున్నాను. ఇది మంచింది అనిపించింది.
నా ఇంటికి నాలుగు మైళ్ళ దూరంలో సమాంత రాజు బి కి చెందిన పెద్ద ఎస్టేట్ ఉంది. కానీ అక్కడ దాన్ని చూసుకోవడానికి సూపర్వైజర్ ఒక్కడే ఉండేవాడు. రాణి ఎప్పుడో ఒకరిసారి కానీ రాదు. పెళ్ళైన తరువాత నుండి ఆమె కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చి, ఒక నెల ఉండి వెళ్ళింది. ఏదేమైనప్పటికీ, నేను రాజీనామా చేసిన రెండు సంవత్సరాల తరువాత, రాణి అతని భర్తతో కలిసి ఉండడానికి ఎండాకాలం మాత్రం ఎస్టేటుకి వస్తుందని విన్నాను. వాళ్ళు జూన్ మొదటి వారంలో వచ్చారు.
ధనవంతులు వచ్చి వెళ్లడం ఊరి వారికీ ఒక చిన్న విశేషం లాంటిది. వాళ్ళు రావడానికి రెండు నెలల ముందు, వచ్చి వెళ్లిన మూడు సంవత్సరాల తరువాత కూడా వాళ్ళ గురించే విషయాలు చర్చించుకుంటారు ఇరుగుపొరుగు, భూస్వాములు. ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాల్సిందే, అందమైన రాణి నా పొరుగున రావడం నన్ను బాగా ఉత్సాహానికి గురి చేసింది. ఆమెను చూడడంకోసం అసహనంతో ఎదురుచూశాను. వాళ్ళు వచ్చిన తరువాత మొదటి ఆదివారం, వాళ్ళను కలిసి నన్ను నేను పరిచయం చేసుకోడానికి బయలుదేరాను.
భవంతిలో సేవకుడు నన్ను స్టడీ రూంలో కూర్చోబెట్టి రాజుకి నేనొచ్చిన విషయం చెప్పడానికి వెళ్ళాడు. ఆ విశాలమైన స్టడీ రూమ్, విలాసవంతమైన ఫర్నీచర్తో నిండిపోయింది. గోడలకు అనుకుని పుస్తకాల అలమారా, వాటి నిండా పొందిగ్గా అమర్చిన పుస్తకాలు వాటి చుట్టూ ఇత్తడితో చేసిన శిల్పాలు. మార్బల్ మీద చేసిన ఒక పెద్ద అద్దం. కింద నేల మీద పరిచిన పచ్చని వస్త్రం, దాని మీద రగ్గులు, కార్పెట్లు.
చిన్న మూల లాంటి ఇంట్లో పేదరికంతో ఉండే నాకు, ఈ విలాసవంతమైన భవనం ఆశ్చర్యాన్ని, భయాన్ని ఇచ్చింది. చెప్పలేని ఒక బెరుకుతో రాజు రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను, గ్రామాల నుండి అభ్యర్ధనకై ముఖ్యమంత్రి కోసం పని మీద వచ్చే వాడిలా నిరీక్షిస్తూ. నా ఆలోచనల్ని తోసేస్తూ తలుపులు తెరుచుకున్నాయి. ఒక ముప్పై రెండు ఏళ్ళ వయసున్న, చూపులని కట్టి పడేసే రాజు లోపలి వచ్చాడు. నన్ను చూడగానే నేరుగా, స్నేహపూర్వకంగా దగ్గరకు వచ్చాడు. నేను తడుముకుని, నన్ను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టగానే, అతను నన్ను ఆపేసాడు.
మేము కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాము. రాజు మాటతీరు, నిరాడంబరత నాలో బెరుకుని తగ్గించాయి. కొద్దిగా అక్కడి వాతావరణానికి ఇమిడి మాటల్లో మునిగిపోయినప్పుడు, రాణి వచ్చింది. ఇంతకూ ముందుకన్నా ఇంకా ఎక్కువ బెరుకు మొదలైంది. ఆమె చాలా అందంగా ఉంది. రాజు నన్ను ఆమెకు పరిచయం చేసాడు. నాలో కంగారుని కనపడకుండా, శాంతంగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ అది ఇంకా వింతగా కనిపిస్తుంది. అయితే వాళ్లిద్దరూ నేను తేరుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. ఈ లోపు వాళ్లిదరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, నన్ను మధ్య మధ్యలో పలకరిస్తూ పొరుగింటి వాడిలా మంచి ఆతిధ్యం ఇచ్చారు.
నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఆ రూంలో పుస్తకాలు, ఫోటోలు చూస్తున్నాను. నేనేమంత గొప్ప జడ్జి కాకపోయినా, అక్కడున్న ఫోటోలలో స్విట్జర్లాండ్లో రాజు దిగిన ఫోటో ఒకటి నన్ను ఆకర్షించింది. అయితే అందులో ఆశ్చర్యమైన విషయం ఎంతటి ఆ ఫొటోలో రెండు బుల్లెట్లు, ఒకదాని పైన ఒకటి ప్రణాళికగా కాల్చిన గుర్తులు ఉన్నాయి.
“అద్భుతంగా కాల్చారు” అన్నాను రాజు వైపు తిరిగి ఆ ఫోటో చూపిస్తూ.
“అవును, ఎప్పటికి గుర్తుండిపోయే కాల్పు అది, అన్నట్టు నువ్వు కూడా పిస్టల్ కాల్చడంలో నేర్పరా?” అని అడిగాడు రాజు.
చివరికి నాకు ఆసక్తి కలిగిన ఒక విషయం గురించి చర్చ మొదలైందని నాకు ఆనందంతో “పర్వాలేదు, ముప్పై అడుగుల దూరంలో ఉంటే ఏ గురిని నేను వదలను.” అన్నాను.
“నిజమా?” అని ఆశ్చర్యంతో రాణి ఆసక్తిగా నన్ను చూసింది, చూపు మరల్చి రాజు వైపు చూస్తూ ” ప్రియా, ముప్పై అడుగుల దూరంలో ఉండే గురిని నువ్వు కాల్చగలవా?” అని అడిగింది.
“ఒకరోజు కచ్చితంగా కాలుస్తా. నేను పర్వాలేదు బాగానే కాలుస్తాను. కానీ ఇప్పుడు దాదాపు నాలుగేళ్లు అయింది నేను పిస్టల్ చేతిలో పట్టుకుని.”
“ఓహ్! అలా అయితే మీరు ఇరవై అడుగుల దూరంలో ఉండే గురినే సరిగ్గా కాల్చలేరని నేను పందెం కడతాను. పిస్టల్ కాల్చాలంటే ప్రతి రోజు సాధన చెయ్యాలి. ఇది మా సొంత అనుభవంతో చెబుతున్నాను. మా రెజిమెంట్లో నన్ను ఒక గొప్ప షూటర్ గా చెప్పుకుంటారు. ఒకసారి దాదాపు నెలరోజులు పిస్టల్ పట్టలేదు. తర్వాత కాల్చడానికి ప్రయత్నించినపుడు నా పరిస్థితి ఏమైంది తెల్సా? కనీసం ఇరవై అడుగుల దూరంలో ఉన్న బాటిల్ని కాల్చలేకపోయాను. అప్పుడు నన్ను మా శిక్షణ అధికారి వద్దకి పంపారు. ఆయన “నీ చెయ్యి షూటింగ్ కి సహకరించట్లేదు. అందుకే ఎప్పటికీ సాధనని వదిలేయద్దు. ప్రతిరోజూ సాధన చెయ్యాలి, లేదంటే మనం నైపుణ్యాన్ని కోల్పోతాము. నేనైతే ప్రతిరోజు కనీసం రాత్రి భోజనానికి ముందు మూడు సార్లు పిస్టల్ షూట్ సాధన చేస్తాను. ఎంతలా అంటే, ఏదైనా వోడ్కాతో ఎలా ప్రారంభిస్తామో అంత సహజంగా సాధన ఉండాలి అని చెప్పాడు.”
నేను చెప్పిన మాటలు విని రాజు రాణి ముగ్ధులయ్యారు.
“నీకు శిక్షణ ఇచ్చే అధికారి ఎలాంటి షూటర్? ” అని అడిగాడు రాజు.
” ఎలాంటి అధికారి అంటే, ఇప్పుడు ఇక్కడ గోడ మీద ఒక ఈగ వాలిందనుకోండి, మీరు రాణి గారు నవ్వుతూ చూస్తారు. కానీ నా అధికారి కౌస్కా, పిస్టల్ ! ఏది అని అరుస్తాడు. కౌస్కా లోడ్ అయినా పిస్టల్ అతనికి అందిస్తాడు. తర్వాత గోడ మీద ఒక చీలిక, అందులో చచ్చిన ఈగ కురుకుపోయుంటుంది.”
“అద్భుతం!, అతని పేరేంటి?” అనడిగాడు రాజు.
“అతని పేరు సిల్వియో”
“సిల్వియో!!” అరిచాడు రాజు తన కుర్చీ నుండి లేచి నించుని. “నీకు సిల్వియో తెలుసా ?”
“నాకెందుకు తెలియదు. మేము సహచరులం. మా మెస్లో అతన్ని సొంత అన్నలాగా చూసుకుంటాం. ఇప్పటికి అయిదేళ్లయింది అతన్ని కలిసి, అతని గురించి కబురు విని. మీకు కూడా సిల్వియో తెలుసా రాజు గారు?”
“నాకు అతను చాలా బాగా తెలుసు. నేకతనెప్పుడు తన జీవితంలో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటన చెప్పలేదా?”
“మీరు అడిగింది సిల్వియోని ఒకరోజు విందులో ఒక దుర్మార్గుడు కొట్టిన చెంప దెబ్బ గురించేనా?”
“నీకు ఆ దుర్మార్గుడి పేరు చెప్పలేదా మరి?” అని మొఖంలో ఒక రకమైన నవ్వుతో అడిగాడు రాజు.
“లేదు రాజుగారు చెప్పలేదు. క్షమించండి.” ఎవరైఉండచ్చు అని ఊహిస్తూ “క్షమించండి, నేను ఇలా అడిగా అని ఏమనుకోకండి…ఒకవేళ మీరేనా సిల్వియోని కొట్టింది?”
“అవును అది నేనే” రాజు చాలా గట్టిగా అసహనంగా చెప్పాడు. రాణి వైపు తిరిగి నీకు గుర్తులేదా అని అడిగాడు” “ఓ దేవుడా! దాని గురించి అసలు మాట్లాడకు. నాకు భయమేస్తుంది” అంది రాణి. “లేదు రాణి. నన్ను చెప్పనివ్వు. అతని సిల్వియోని మనల్ని ఎలా అవమానించాడో తెలుస్తుంది” అంటూ రాజు నావైపు కుర్చీ జరిపాడు.
నేను తరువాత జరిగిన కథని ఆసక్తిగా వింటున్నాను.
” అయిదేళ్ల క్రితం” అంటూ మొదలు పెట్టాడు రాజు “నాకు పెళ్లయింది. నేను,రాణి హనీమూన్ కోసం ఈ గ్రామానికి వచ్చాము. ఈ ఇల్లు నా సంతోషమైన క్షణాలు, జ్ఞాపకాలకు అలాగే ఒక బాధాకరమైన సంఘటనకి సాక్ష్యం.”
“ఒక రోజు మధ్యాహ్నం, మేమిద్దరం గుర్రపు స్వారీకి వెళ్ళాము. నా భార్య గుర్రం అదుపు తప్పింది. దానితో ఆమె భయపడి, గుర్రం నుండి దిగి, కళ్లెం నాకందించి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఆమెకన్నా ముందే గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకోసం ఎవరో వ్యక్తి స్టడీ రూంలో ఎదురుచూస్తున్నాడని, పేరు వివరాలు చెప్పలేదు కానీ వ్యాపారం గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పాడు. నేను స్టడీ రూంలోకి వెళ్లి చూస్తే అక్కడ చీకటిలో ఒక వ్యక్తి, అతని దుమ్ముపట్టిన, షేవింగ్ లేని ముఖాన్ని చూసాను. అతను అక్కడున్న చిమ్నీ దగ్గర నించున్నాడు . నేను అతని దగ్గరికి వెళ్తూ అతని మొఖాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
“నీకు నేను గుర్తులేనా రాజా?” అన్నాడు భీకరమైన గొంతుతో.
“సిల్వియో!” అని అన్నాను నేను గట్టిగా. నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.
“అవును. నువ్వు నాకు బాకీ ఉన్నావు. ఆ బాకీ తీర్చుకుందామని వచ్చాను” అన్నాడు. జేబులో నుండి పిస్టల్ తీసి నాకు గురి పెడుతూ ” సిద్దమేనా మరి” అని అడిగాడు.
“నేను దూరాన్ని లెక్కించగా ఒక ఇరవై అడుగులుంది. వెంటనే నా భార్య వచ్చేలోపు నన్ను కాల్చేయ్ అని చెప్పాను.
“అతను తటపటాయించాడు. కాల్చడానికి వెలుగు కావాలని అడిగాడు. కాండిల్ తెప్పించి, లోపల నుండి తలుపు గడి పెట్టాను. ఎవ్వరు రావడానికి వీలులేదని సేవకులకు ఆఙ్ఞాపించాను. తిరిగి సిల్వియోని కాల్చమని అన్నాను. అతను పిస్టల్ తీసి గురి పెట్టాడు.
“నేను ఇలా చెయ్యలేను. ఒక నిరాయుధమైన మనిషి మీద గురి పెట్టి గొప్ప చెప్పుకోలేను. కాబట్టి మళ్ళీ మొదటి నుండి ప్రారంభిద్దాం. మనలో ఎవరు మొదటిగా కాలుస్తారో నిర్ణయించుకుందాం.” అన్నాడు.
“నాకు తల తిరిగింది. నేను మొదట్లో వారించినా సిల్వియో వినట్లేదు. ఇక లాభం లేదని నేను ఇంకో పిస్టల్ తీస్కుని, రెండు చిటీలలో మా పేర్లు రాసి ఇచ్చాను. మొదటిసారి లాగే అతను వాటిని తన టోపిలో పెట్టాడు. మళ్ళీ అదృష్టం నాకే తగిలింది.
“రాజు, నువ్వు చాలా అదృష్టవంతుడివి.” అన్నాడు సిల్వియో ఒక విచిత్రమైన నవ్వుతో.
“ఎలా రెచ్చగొట్టాడో ఏమో తెలియదు కానీ నేను ఉద్రిక్తంగా పిస్టల్ తీసి గురి పెట్టి కాల్చాను. ఇందాక ఫొటోలో చూసిన ఆ కాల్పుల గుర్తులు వాటివే.” అంటూ రాజు ఆ ఫోటో చుపిస్తున్నప్పుడు అతని మొఖం ఎర్రగా కమిలింది, రాణి తన హ్యాండ్ కర్చీఫ్ కన్నా తెల్లగా పాలిపోయింది. “దేవుడిదయవల్ల సిల్వియో తప్పించుకున్నాడు, కానీ అతను ఆవేశంగా పిస్టల్ తీసి నా మీద గురి పెట్టాడు.”
అకస్మాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. మాషా గట్టిగ అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు అడ్డుగా నించుంది. ఆమె రావడంతో నాకు ధైర్యం వచ్చినట్టైంది. “ప్రియా! ఇది చూస్తుంటే మేము తమాషా చేస్తున్నాం అనిపించట్లేదా? ఎందుకు అంత కంగారుపడుతున్నావు. ఇదంతా ఉత్తి సరదాకే. నువ్వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగిరా, నీకు ఇతన్ని పరిచయం చేస్తాను. ఇతను నా సహచరుడు.” అన్నాడు రాజు.
మాషాకి నమ్మకం కలగలేదు. సిల్వియో వైపు తిరిగి “నిజం చెప్పండి, నా భర్త చెప్పిందంతా నిజమేనా, ఇది సరదాకోసమేనా?” అని అడిగింది.
“అతనెప్పుడూ ఇలా సరదాగా ఉంటాడు రాణి” అన్నాడు సిల్వియో “ఒకసారి ఇలాగే సరదా కోసం నా ముఖం మీద చాచి పెట్టి కొట్టాడు. సరదా కోసం ఒకసారి అతని బుల్లెట్ నా టోపిలోకి దించాడు. సరదా కోసమే ఇప్పుడే నా వైపు కాల్చాడు కానీ అది గురి తప్పింది. నాకు ఈ సరదాలకేం తక్కువ లేదు అని వ్యంగ్యంగా అంటూ పిస్టల్ ఆమె కళ్లెదుట గురి పెట్టాడు.
మాషా అతని కాళ్ళ మీద పది ప్రాధేయపడింది.
“లే మాషా” అని సిగ్గుతో చచ్చిపోతూ అరిచాను. “సార్! మీరు చెప్పండి ఒక ఆడదాని కళ్లెదుట ఆమె బాధపడుతుండగా మీరు కలుస్తారా?” అని అడిగాను.
సిల్వియో “లేదు. నేను అలా చెయ్యను. నాకిప్పుడు సంతృప్తిగా ఉంది. నేను నీలో కోపాన్ని చూసాను, నా మీద దాడి చేసేలా ఉసిగొల్పగలిగాను. జీవితాంతం ఈ సంఘటన నీకు గుతుంటుంది. అది చాలు నాకు. ఇంక నేను వెళ్ళిపోతాను అన్నాడు.
అతను బయలుదేరుతూ ఆగి నా గురి తగిలిన ఫోటోని చూస్తూ, వెళ్ళిపోయాడు.
నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది. సేవకులు భయంతో సిల్వియో ని చూడసాగారు. నేను తేరుకుని కిందికి వెళ్ళేలోపు సిల్వియో వెళ్ళిపోయాడు.
రాజు మౌనంగా ఉన్నాడు. ఇప్పటికి నేను ఈ కథ ముగింపు వినగలిగాను. మళ్ళీ నీ హీరోగా భావించే సిల్వియోని నేనెక్కడా చూడలేదు. కానీ అతను అలెగ్జాండర్ ఇప్సిలాంతి తిరుగుబాటు సమయంలో సిల్వియో తిరుగుబాటుదారుల ఒక దళానికి నాయకత్వం వహించి, యుద్ధంలో మరణించాడు అని.
——
