ఇది మలయాళం సినిమా కాదు కదా.గల్ఫ్ దేశాల ఆకాశ హర్మ్యాలను తమ చెమటతో నెత్తుటితో నిలబెట్టి.. బుర్జ్ ఖలీఫాను మెరిపించిన తెలంగాణా యువకుల పల్లెల ఇంటింటి గోస కదా..
మస్కట్ , దుబాయ్ , బేరన్, కువైట్ దేశాల పేర్లు కాదు..ఐదు దశాబ్దాలుగా ఇక్కడి పల్లెల్లో కన్నవాళ్ళ కలలు…చాట ముంగట వెట్టుకొని బీడీలు చుడుతున్న పడుచుల ఆశలు.ఇది అచ్చంగా మా నిజామాబాద్ , కరీంనగర్ జిల్లాల వ్యధ. ఇప్పటికి ఒక సినిమాగా ముందుకొచ్చింది.
గొర్లే కాసిండో, మేకలే మేపిండో ఆ ఎడారి జీవితం నుండి రెండ్రోజుల్లో బయటపడుతాను అని వచ్చేముందు గుండెపోటుతో అక్కడే ప్రాణాలు కోల్పోయిన మా పుట్టి బాపు కథ.దేశం కాని దేశంలో ఎన్ని బాధలు పడ్డారో , కనుగుడ్ల నీళ్ళు బయటకు రాకుండా ఎంత దుఖం మోసారో, పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా ఆ దేశాల్లో కొవ్వొత్తులోలే కాలిపోతున్న మా నడిపి బావ కథ, మా బుజ్జి బావ కథ..మా కల్లెడ బావల కథ..జీవితమంతా గల్ఫ్ కు పోయి అంతో ఇంతో కూడబెట్టి రోగాల బారినపడి చనిపోయిన మా మస్కట్ సాయిలు తాత కథ, మా శంకర్ బావ కథ.కంపెనీ వీసా అని చెప్పి డబ్బులు తీసుకున్న ఏజెంట్ మోసం చేస్తే పారిపోయి వచ్చిన మా ఒడ్డెన్న కథ.మొన్నటికి మొన్న కొడుకు పుట్టగానే సౌదికి వెళ్ళి లేబర్ పని చేస్తూ ఇసుకలో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన మా బావుసాయి పేట తమ్ముడి కథ..
.అక్కడి పదివేలు ఇక్కడి నల్పై ఏలట అని ఆశ్చర్యపోయే అవ్వలు, అక్కడ వాళ్ళకు పగలైతే మనకు రాతిరట అని తాతలు డెబ్బైలలోనే చెప్పుకొనే వాళ్ళు.
నిజామాబాద్ లోని ఏ పల్లెకైనా వెళ్ళండి.కులమతాలకతీతంగా ఏ ఇంటి తలుపు కొట్టి అడిగినా గల్ఫ్ తోటి అనుబంధాలు చెప్తారు.
సగం కట్టిన మిద్దెలపై ఆరేసిన లావుపాటి దుబాయ్ రగ్గులు , సూట్కేస్ విప్పగానే వచ్చే లవంగ వాసనలు, దాల్చిన చెక్క సువాసనతో ఉండే టైగర్ బామ్, అయస్కాంతాల దండ కడియాలు , రంగు రంగుల పూల లుంగీలు , ప్రక్కన సైడ్ చెయిన్ తో ఉండే నైసు వాచీలు , ఎన్నెళ్ళైనా చిరగని పాలిస్టర్ తాన్ బట్ట.తెల్లటి బూట్లు…
ఎన్ని వస్తువులు ఎన్ని జ్ఞాపకాలు.ఇన్ని వస్తువుల వెనుక ఎంత వేదన , ఎన్ని కన్నీళ్లో….ప్రతీ శుక్రవారం మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ కు వచ్చే తమ వాళ్ళ రెండు మాటల కోసం ఎక్కడెక్కడి పల్లెలనుండో వచ్చే జనంతో ఇల్లు అరుగులు నిండిపోయేవి.కొందరికి మధ్యాహ్నానికి కాల్ కలిస్తే , కొందరు రాత్రిదాకా ఫోన్ కోసం పడిగాపులు కాసేవాళ్లు.మా బాల్యమంతా బంధువుల్లో చుట్టాలలో ఎప్పుడూ ఎవరో ఒకరు గల్ఫ్ కు వెళ్ళేవాళ్ళు…దుబాయ్ , మస్కట్ , విజా , ప్లేన్, ఏజెంట్లు ఇదే పదజాలంతో పెరిగాము.ఈ సినిమా రిలేట్ చేసుకున్నంతగా నేను వేరే ఏ సినిమానూ ఇంతగా రిలేట్ చేసుకోలేదు..
The Goat life.. సినిమా కాదు.నిజ జీవిత చిత్రణ..ఇంతగా హాంట్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు…పృథ్వీరాజ్ , బ్లెస్సీ టీం మీకు వేవేల నమస్సులు..
( పీఎస్ : దుబాయ్ , మస్కట్ సౌదీ లలో మరణించిన కార్మికుల అచేతన శరీరాలను స్వస్థలాలకు చేర్చడం లో మా నాన్నగారి కృషి మాటల్లో చెప్పలేను.2009 లో మా నాన్న ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ దళిత రత్న ‘ అవార్డ్ తో సత్కరించింది)