ఎస్టేట్ తగాదా

Spread the love

            ఆ ఎండాకాలం ఉదయం వేళ “రాజేరు” అనబడే దత్తిరాజేరు గ్రామంలో మాజీ ప్రెసిడెంట్ చంద్రంరాజు సెల్ఫోన్ మ్రోగింది. మ్రోగడం అంటే మ్రోగడం కాదు. అందులోంచి ‘ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే’ అనే పాట వస్తోంది. అది విన్న ఆయన భార్య లక్ష్మీదేవి చిరాగ్గా మొహం పెట్టి ‘మీ పూజా బావుంది, ఈ పాటా బావుంది, ముందా దరిద్రాన్ని మార్పించండి’ అంటుంటే పూజ గదిలోంచి బొట్టు పెట్టుకుని, తొందరగా బయటికొస్తూ ‘ఆ సతీష్ గాడు ఈ పాట పెట్టేసినట్టున్నాడు, మార్పించేస్తాను. నీ కంటే చిరాగ్గా ఉంది నాకు. ఫోన్ మోగినప్పుడల్లా జనం నవ్వుతున్నారు. మీ వయసేంటి, మీ హోదా ఏంటి, ఈ పాటేంటి’ అని అంటూ ఫోన్ ఎత్తాడు చంద్రం. అవతలనుంచి “మావయ్యా నేను వర్మని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు?’ అన్నాడు. ఎక్కడుంటాను! ఇంట్లో ఉంటాను, ఇప్పుడే స్నానం అయింది, టిఫిన్ తిని చేలోకెళ్ళాలి’ అన్నాడు చంద్రం. “అవతల కొంపలంటుకుంటుంటే చేనూ, తోట అంటారేంటి మావయ్యా, మీరుండండి, మీతో మాట్లాడే పనుంది, నేను ఇప్పుడే విజయనగరంలో బయల్దేరాను’ అని హడావిడిగా అన్నాడు వర్మ. ‘ఏంటో ఆ పని?’ అని అడిగాడు చంద్రం రాజు, తాపీగా. వర్మ హడావిడి తెలుసు గనుక.

            కొట్టాం పిన్నమ్మ పేచీ పెట్టేస్తున్నారట. అమెరికా నుంచి చిన్నబాబు ఫోను, తెల్లవారు జామున నాలుగయింది. అప్పుడే నిద్ర పడుతుంది. ఫోన్ ఎవరా అని చూస్తే అమెరికా నుండి చిన్నబాబు, ఇంకేం చేస్తాం. లేచాను, ఫోన్ లో చినబాబు “ఎలాగయినా వాళ్ళ అమ్మయ్యకి నచ్చజెప్పి తగువు సెటిల్ చేయమని చెప్పాడు.” ‘తగువేటుందిరా సెటిల్ చేయడానికి’ అన్నాడు చంద్రం. మీరలాగే అంటారు, ఆవిడ పట్టుదల సంగతి తెలిసి కూడా మీరిలా మాట్లాడటం సబబు కాదు. ఈ వేళ మనం కూర్చుని సెటిల్ చేయకపోతే మళ్ళీ చినబాబు రాత్రికి ఫోన్ చేసి నా ప్రాణాలు తీసేస్తాడు. అనగానే ‘సర్లే, నువ్వురా. కూర్చుని మాట్లాడుకుందాం. ఈలోగా ఓసారి చేలోకెళ్ళి వచ్చేస్తాను.’ అన్నాడు చంద్రంరాజు. ‘సరే అయితే కలుద్దాం’ అని ఫోన్ పెట్టేశాడు గంటాడ వర్మ. 

            రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తిందామని కూర్చునీసరికి, వడ్డిస్తూ చంద్రంరాజు భార్య లక్ష్మీదేవి ‘మళ్ళీ సూరి గాణ్ణి పనిలోనుంచి తీసీమనేనా తగువు?’  అని వెటకారంగా అడిగింది. చంద్రం రాజు చిరాగ్గా తల ఊపుతూ ‘మూన్నెల్లకోసారి ఆవిడకి ఇకారమొస్తాది. పనిపాట లేకపోతే సరి’ అని గబగబా టిఫిన్ తినేసి లేచాడు. ‘ఏదో ఒక తగువు లేకపోతే ఊసుపోవడం ఎలాగా?’ అని నవ్వుతూ అంది లక్ష్మి. చంద్రంరాజు బయటికొచ్చి, తన బుల్లెట్ స్టార్ట్ చేసి చేలోకి బయల్దేరాడు.

                 *                    *                  *

            ‘అయ్యగారూ అయ్యగారూ’ అని ఒక పాత పెంకుటింటి ముందు నిలబడి పిలుస్తున్నాడు ఆది. ‘ఏరా ఆదీ ఇంకా బతికే ఉన్నావా?’ అని ఇంట్లోంచి బయటికొస్తూ అడిగింది సరస్వతమ్మ. ఆవిడకి దగ్గరదగ్గర ఎనభై ఏళ్ళ వయసుంటుంది. చామనఛాయ తీక్షణమైన కళ్ళు, ప్రపంచమంతటినీ అనుమానంతో చూసే చూపు, తల చాలా వరకు నెరిసి పోయింది. ఆవిడడిగిన ప్రశ్నకి ఆదికి అద్దుమాలిన కోపం వచ్చింది. అయినా తమాయించుకుంటూ ‘చావడానికూడా తీరుబడి లేక బతికి సస్తన్నానండి’ అన్నాడు కొంచెం విసురుగానే. ‘మరి ఇంటి ముందునుంచి ఎళ్ళిపోడమే గాని, ఇటేపు తొంగి చూడవు, డబ్బులవసరమైతే మాత్రం ముందు మాలోగిలే గుర్తుకొస్తాది. ఇంతకీ పొద్దున్నే ఇలా దయచేసేవేంటి?’ అంది. ‘చంద్రంరాజు గారు కబురంపారండీ, తమరింటికి పది గంటలకల్లా గంటాడ నుంచి వర్మరాజు గారు వస్తారట. చంద్రంరాజు గారు కూడా వస్తారట. తమరికి కబురు చెప్పమని చెప్పారు.’ అన్నాడు ఆది. ‘గంటాడు వర్మ వస్తున్నాడా? ఇప్పుడా’ అంది. ‘ఆవిడేదో పని చెప్పేలా ఉందని పసిగట్టి ‘మరెళ్ళొస్తానండి’ అన్నాడు ఆది. ‘ఉండరా, కబురు చెప్పేసి పారిపోతే ఎలాగరా, నువ్వెళ్ళి ఉన్నఫళంగా సూరి గాణ్ణి పిలుచుకురా, అన్నట్టు వచ్చేటప్పుడు ఆడి దగ్గరున్న మంచి కోడిపుంజుని తెమ్మను, అర్జెంటు, నిట్రాటలా అలా నిలబడిపోయావేంటి, బయల్దేరు’ అంది ధాటీగా. ‘అదికాదండి, పెద వీదీ నాయుడు గారు కబురెట్టారండి, ఆరికి గడ్డం గీయాలట’ అని నసుగుతూ అన్నాడు ఆది. ఆడికి వెళ్ళాలని లేదు, ‘ఇప్పుడు సైకిల్ తొక్కుకుని సూరి గాడి దగ్గరికెళ్ళి కబురు చెప్పాలా? పైగా కోణ్ణి కోసే పని ,మనకే తగులుతది’ అనుకుంటూ బుర్ర గోక్కున్నాడు. ‘ఎళ్దువు గానిలే, తొందరగా ఆణ్ణి తీసుకురా, ఎంతసేపు, మీ ఇంటికెళ్ళేటప్పుడు పాత ఆవకాయ ఇస్తాను పట్టుకెళ్దువు గాని’ అంది.  ఆదిగాడికి తప్పలేదు. ఈసురోమంటూ ఇంటి బయటికొచ్చి తన సైకిల్ తీసాడు.

                 *                    *                  *

             ‘ఏట్రా ఆదీ, వర్మరాజు గారొస్తారా? ఉన్నఫళంగా రావాలా? మంచి కోడిని తేవాలా? విజినారం ఎళ్ళాలనుకున్నాను. ఇంకా నయ్యం ఎళ్లిపోన్నుకాదు. ఆయమ్మొచ్చి గొంతు కోసిసును.’ అని, కోళ్ళ గూట్లో నుంచి ఒక కోడిని తీసి, పురికొసతో దాని కాళ్ళు కట్టేసి, పట్టుకుని ‘పదా’ అన్నాడు సూరి.  ఇద్దరు బయల్దేరారు.

                 *                    *                  *

            చంద్రంరాజు, సరస్వతమ్మ ఇంటిబయట బుల్లెట్ ఆపి, బుల్లెట్ అద్దంలో తల దువ్వుకుని, పండు మీసాలు సర్దుకుని లోగిట్లోకొచ్చాడు. గుమ్మం దగ్గర తల కొంచెం వంచి లోపలికి వెళ్ళేసరికి ‘బహుకాల దర్శనం’ అని పలకరింపులు వినిపించి అటు వైపు చూశాడు. అక్కడ పచ్చటి రంగుతో ఎనభై ఏళ్ల వయసు, చెవులకు దుద్దులు, పంచే బంగారు గుండీలు ఉన్న లాల్చీతో, నుదుటిన ఎర్రటి తిలకం దాల్చిన ఉప్పలపాటి పెదబాబు కనిపించాడు. ‘ఏంటి బావగారూ ఎప్పుడు దిగారు? ఎలా వచ్చారు? కబురు లేదు కాకరకాయ లేదు’ అని పలకరించాడు చంద్రంరాజు. ‘కబురు పెడితే కనబడకుండా పోదామనా’ అన్నాడు పెదబాబు. ‘ఎంత మాటన్నారు బావా, తమరు కబురు పెడితే ఎప్పుడైనా మొహం చాటేసానా’ అన్నాడు నిష్టూరంగా చంద్రంరాజు. ‘సరదాగా అన్నానులేవోయ్ ఉడుక్కోకు’ అన్నాడు ఉప్పలపాటి పెదబాబు. చంద్రంరాజు వచ్చి కూర్చున్నాడు. లోపల్నుంచి లచ్చి అనే పనిపిల్ల మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. పుచ్చుకుంటూ పెదబాబుకేసి చూసాడు. పొద్దున్నే గంట్యాడ వర్మకి ఫోన్ చేసాను. అతగాడు ఈ దఫా మా షికారుగంజి మామిడితోట తీసుకుంటానని చెప్పాడు. చెప్పాడే గాని, పెద్ద శ్రద్ద పెట్టే మనిషి కాడు. మరోసారి కలిసి ఖాయం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అడిగితే, ఇక్కడికొస్తున్నట్టుగా చెప్పాడు. మరెందుకు ఒకసారి కలిసినట్టుంటుంది. మన సరస్వతిని, మీ అందరిని చూసినట్లు ఉంటుందని గర్భాం నుంచి ఉన్నఫళంగా బయల్దేరి వచ్చేశాను.’ అని చెప్పాడు పెదబాబు. ‘పోనీలెండి, ఇలాగైనా తమరి దర్శనం అయింది’ అన్నాడు చంద్రంరాజు. ‘అంతేలే, మేము రావడమే గాని తమరు ఊరు కదలరు కదా!’ నిష్టూరంగా అన్నాడు పెదబాబు. ‘ఎక్కడ బావగారు, ఏవో పనులు’ అన్నాడు చంద్రం.

            ఇంతలో ఇంటిముందు హ్యూండాయ్ i20 కారు ఆగింది. అందులోంచి గంట్యాడ వర్మ అని పిలవబడే తిరుమలరాజు నారాయణవర్మ దిగాడు. పొట్టిగా ఉండే పొడువువాటం మనిషి. హడావిడి అతని లక్షణం. సందడి అతని స్వభావం. అతనితో పాటు, డ్రైవింగ్ సీటులోంచి మొహం ముటముటలాడించుకుంటూ రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా జీన్స్, టీ షర్ట్ లో ఉన్న ఇరవై ఏళ్ళ కుర్రాడు చికాకుగా దిగాడు. ‘ఎంతసేపు పడుద్ది’ అని అసహనంగా అడిగాడు ఆ కుర్రాడు వర్మని. ఇంకా కాలు కింద పెట్టలేదు, ఎంతసేపో ఎలా తెలుస్తదిరా అల్లుడూ, కొంచెం ఓపిక ఉండాలిరా, ముందు లోపలికి పదా, పరిస్థితి చూద్దాం’ అన్నాడు వర్మ. గత్యంతరం లేని ఆ కుర్రాడు, వర్మ వెనకాలే లోపలికి వెళ్ళాడు.

            ఇంతలో లోపల్నుంచి సరస్వతమ్మ పనిమనిషి లచ్చితో, ఉల్లిగారెలు, చట్నీ తీసుకొచ్చి, పెట్టి ఇస్తూ ‘రండి బాబు చాన్నాళ్ళకి? ఈ బాబెవరు? అని అడిగింది. ‘ఇతగాడు మా లలితప్ప రెండో కొడుకు, రఘు కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. భుజం బెణికి నొప్పిచేయడం వల్ల కారు డ్రైవ్ చేయలేక ఈణ్ణి తోడు తీసుకొచ్చాను’ అన్నాడు వర్మ. ‘కూర్చోమ్మ బాబు. అమ్మ బావుందా’ అని పలకరించి, ‘లక్ష్మీ మరో ప్లేట్ తీసుకురా’ అంది. ‘అబ్బే నాకు టిఫినదీ వద్దు, ఇంటి దగ్గర చేసే బయల్దేరాను, నువ్వు తీసుకోరా’ అని ప్లేట్ తీసి మేనల్లుడు చేతిలో పెట్టాడు. టిఫిన్ చూశాక ఆ కుర్రాడు కొంచెం శాంతించి, గారెల అంతు చూడటం మొదలెట్టాడు. వర్మ, ఉప్పలపాటి పెదబాబుతో కబుర్లలోకి దిగాడు. ‘మావయ్య తమరిని ఎండలో శ్రమ పెట్టినట్టున్నాను. నేనే వద్దును కదా గర్భాం. ఏంటంత అర్జెంటూ’ అన్నాడు.  ‘అర్జెంటే, తోట మొత్తం పింది కట్టేసుంది. నువ్వోమారు చూసి, ఓ మాట అనేసుకుంటే నాకు నిశ్చింత. నాకు తోట పైకివ్వడం ఇష్టం లేదు, నాలుగు రూపాయలు నువ్వు తిన్నా, పైయోడివి కావు. యథార్థం చెబుతున్నాను. క్రిందటి సంవత్సరం వెయ్యి బుట్ట అయింది. ఆ వెధవకి సరుకు అమ్ముకోవడం చేతకాక నష్టం వచ్చిందని టాంటాం చేసి నా తోటకి బేరం రానియకుండా చెడగొడుతున్నాడు.’ అన్నాడు. వర్మ నిశ్శబ్దంగా చూస్తూ మనసులో ‘ఈయనకి తల పండినా తర్కం పోలేదు, వెయ్యి బుట్టయితే, ఆడే మళ్ళీ తీసుకుందును. తోట ముదిరిపోయింది. హుద్ హుద్ తుఫాను తర్వాత చెట్లు చచ్చిపోయాయి. ఎవరికి తెలియని భాగోతం’ అనుకుంటూ, ‘మావయ్యా, మీకు తెలీని విషయాలు కావు. ధరలు పూర్వంలా లేవు. మార్కెట్లు బాగోలేవు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఏదో మరో పని తెలియక ఈ పని చేయడం తప్ప, గిట్టుబాటు లేదు. మీ తోట నేను డబ్బులకి తీసుకోను. బుట్ట కడదాం, నా నెంబర్ ఏసి పంపుదాం. లెక్కలు చూసుకున్నాక మిగిలితే నాలుగు రూపాయలు నాకివ్వండి. అంతా మీ ఆధ్వర్యంలోనే జరిపించండి’ అన్నాడు వర్మ.              ‘ఈ గంట్యాడోడు తక్కువోడు కాదు అందుకే పైకొచ్చాడు’ అని మనసులోనే అనుకుని ‘మీ ఇష్టం వర్మ, నీకు ఎలా బోధపడితే అలా చెయ్యి, నా తోట నీ చేతిలో పెడుతున్నాను’ అన్నాడు పెదబాబు. ‘చేతిలో పెట్టేసి వదిలేయొద్దు, మీరు పక్కనుండి నడిపించాలి’ అన్నాడు చంద్రం. తప్పకుండాను, మనకింకేం పనుందోయ్ చంద్రం’ అన్నాడు పెదబాబు. అందరూ కాఫీలు మజ్జిగలు పుచ్చుకున్నాక ‘పిన్నమ్మా’ అని పిలిచాడు వర్మ. ‘బాబూ’ అంటూ వచ్చి నిలబడింది సరస్వతమ్మ.

            ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తూ ‘పిన్నమ్మ ఇంకేంటి కబుర్లు?’ అన్నాడు వర్మ.  ‘ఏముంటాయ్ బాబు, చినబాబెల్లి అమెరికాలో కూర్చున్నాడు. పెద్దోడున్నాడంటే అమాయకం సొద. ఊర్లుపట్టుకు తిరుగుతాడు. పాప ఉందంటే దాని పిల్లలు, పెళ్ళిళ్ళు… హైదరాబాద్ నుంచి రావాలంటే దానికీ కష్టమే. బుద్దిపుట్టినప్పుడు ఫోన్ చేస్తాది. తోటా దోడ్డీ అన్నీ నేనే చూసుకోవాలి. తోట కాపు సరియైనోడు కాదు. మంచి తోటకాపుని చూడండి బాబూ, సూరి గాణ్ణి మాన్పించేద్దాం అని నిర్ణయించాను’ అంది. వర్మ ‘ఏం.. సూరి గాడితో ఏం పేచీ ఉంది?’ అని అడిగాడు. ‘పేచీ అని మెల్లిగా అంటావేంటి బాబు. మా చెడ్డ కవుకులు పెట్టేస్తున్నాడు. తోటకి మంచి బేరం రానివ్వడం లేదు. ఆడికి నచ్చినోణ్ణి తీసుకొస్తున్నాడు. బస్తాడు జీడి పిక్కలైతే మూడు కుంచాలు కూడా మనకివ్వలేదు. కుంకుడుకాయలు అమ్మేసుకుంటున్నాడు. చింతచెట్లు నాకు చెప్పకుండా దులిపించేసి, చింతకాయలు అమ్మిసుకుంటున్నాడు. నేను కబురు పెట్టిన ఖాతరు చేయడు. నెలకోసారి కూడా కనిపించడు. వద్దురా అంటే ఈణ్ణి చినబాబే పెట్టాడు. పైగా జీతం పెంచమంటున్నాడు.  ఇచ్చే రెండువేలే దండగా’ అంది. ‘అయితే ఇప్పుడేంచేద్దామంటారు’ అన్నాడు వర్మ. ‘చేసేదేముంది మాన్పించేయడమే’ అని, ఇంతలో ‘అమ్మా’ అని లోపల్నుంచి లచ్చి పిలవడంతో లోపలికెళ్ళింది. వర్మ, చంద్రంరాజుకేసి చూసి ‘ఏవంటారు మావయ్యా’ అన్నాడు. ‘అనడానికేముంది, ఆవిడన్నీ ఊహించుకుని మాట్లాడుతుంటారు. ఆవిడన్నదానికి ఊ కొడితే మనం మంచి, లేకపోతే చెడ్డా, ఆలకిస్తే పని దండుగా’ అన్నాడు చంద్రం.   ‘ఆ.. ఆ.. ఆ సంగతి నాకు తెలుసు’ అని తలూపుతూ అన్నాడు వర్మ.

          ఇంతలో ఖాళీగా ఉన్న ఉప్పలపాటి పెదబాబు, వర్మ మేనల్లుడిని కదిపాడు. ‘ఏం పేరోయ్ నీది’ అని అడిగాడు. ‘ఆనంద గజపతిరాజు’ అన్నాడా కుర్రాడు. ‘జొన్నవలస పూసపాటివారు’ అన్నాడు వర్మ. ‘ఎరుగుదునోయ్, వీళ్ళమ్మ పెళ్ళికి, మగపెళ్ళి వారి తరుపున వచ్చాను. అట్నుంచి కూడా చుట్టరికాలున్నాయి కదా’ అన్నాడు. అసహనంగా వాచ్ చూసుకుంటున్న కుర్రాడితో ‘ఇవ్వాళ కాలేజి లేదా’ అని అడిగాడు పెదబాబు. కుర్రాడు చెప్పేలోగా వర్మ అందుకుని ‘వీడు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, ఆ సినిమా ఉదయం ఏడున్నర ఆటకి రెడీ అయ్యి వెళ్లిపోబోతుంటే బతిమాలి బలవంతంగా ఇటు తీసుకొచ్చాను. 1000 రూపాయలు పెట్టి ఫాన్స్ షో కి టికెట్ కొన్నాడట’ అన్నాడు. ‘పవన్ కళ్యాణా? అతనెవరు’ అన్నాడు పెదబాబు. ఆనంద గజపతిరాజు ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాడు. ‘పవర్ స్టార్ ని తెలీదన్నవాళ్ళని అతను అదే మొదటిసారి చూడటం. ‘ముసలాయన మతుండే మాట్లాడుతున్నాడా?’ అని అనుకున్నాడు. అప్పుడు చంద్రం రాజుగారు కలగజేసుకుని ‘చిరంజీవి తమ్ముడండి బావా’ అన్నాడు. ‘ఓహో.. అలాగా. చిరంజీవి ఎందుకు తెలిదు, తెలుసు. ఆ మాటకొస్తే అతగాడి తండ్రి నాకు బాగా పరిచయం. కొణిదెల వెంకట్రావు అని బహుయోగ్యుడు.                     ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. మా స్నేహితుడు గుంటూరు చౌదరి గారింట్లో నాలుగైదు సార్లు కలిసాను. అప్పుడే చెప్పాడు వాళ్ళబ్బాయి వరప్రసాద్ చిరంజీవి అనే పేరుతో సినిమాల్లోకొచ్చాడని. అతని సినిమాలు కూడా నేను చూడలేదు. ఏదో ఎప్పుడైనా టీవిల్లో పాటలొస్తున్నపుడు పిల్లలు చెప్తే చూడటం తప్పా. అయితే వెంకట్రావు మిగిలిన పిల్లలు కూడా సినిమాల్లోకి వచ్చారన్నమాట’ అన్నాడు. ‘రావడమేంటి బాగా నిలదొక్కుకున్నారు. చిరంజీవి పెద్ద తమ్ముడు ఒక మోస్తరుగా కుదురుకున్నాడు. రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ కి యూత్ లో బాగా క్రేజ్ ఉంది. ఇదిగో ఇలాంటి కుర్రాళ్ళు చొక్కాలు చింపేసుకుంటారు. వయసులో ఉన్నప్పుడు నువ్వు కూడా కృష్ణ ఫ్యాన్ కదా’ అన్నాడు చంద్రంరాజు. ‘అవును మీరు నాగేశ్వర్రావు ఫ్యాన్ కదా. రిలీజ్ కి విజయనగరం వచ్చేసేవారు కదా’ అన్నాడు వర్మ.

            ఇదంతా వింటున్న ఆనంద గజపతికి చాలా చిరాగ్గా ఉంది. ‘ఈ ముసలాయన మరీ మార్స్ నుంచి వచ్చినట్టున్నాడు. నాలుగు టిక్కెట్లకి ఐదువేలయింది. పవర్ స్టార్ తెలీదు, సినిమా తెలీదు, రాజకీయం తెలీదు. లివింగ్ లెజెండ్ లా ఉన్నాడు. ఈ పాటికి షో అయిపోయుంటది. ఈ మావయ్యకి అడ్డంగా దొరికిపోయాను. నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. వర్మ మావయ్య దగ్గర కష్టం. అర్థరాత్రి అవసరమంటే కారు, డబ్బులు ఏదైనా మ్యానేజ్ చేసేస్తాడు. ఈ మ్యాటర్ ఎప్పుడవుద్దో, ఎప్పుడు వెనక్కెళ్తామో, ఛా.. మూడంతా దొబ్బింది. హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది’ అని మనసులో చికాకు పడుతున్నాడు. ఇంతలో లోపలినుంచి సరస్వతమ్మ వచ్చింది. వస్తూనే ‘అయితే చినబాబో, పాపో నీకు ఫోన్ చేసి నాదగ్గరికి నిన్ను పంపారన్నమాట. అందుకని సూరి గాడి తరుపున వకాలత పుచ్చుకుని వచ్చావన్నమాట’ అంది. చంద్రంరాజు నవ్వాడు. వర్మ కొంచెం తడబడి, తమాయించుకుని ‘మీ ఇంటికి నేను రావడానికి నాకొకరు చెప్పాలా పిన్నమ్మా. నాలుగు తోటలూ చూసుకునెళ్దామనొచ్చాను. ఎళ్ళిపోమంటారా’ అన్నాడు. ‘రావడమే నీ ఇష్టం, బెల్లం ఆవకాయ పట్టుకెళుదువు గాని, పూతరేకులు చుట్టలు చుట్టించాను. మీ బావాజీకి ఇష్టం పట్టుకెళుదువు గాని’ గెదరు నేను వండను కదా, చంద్రంరాజు గారింటికి పంపించి, లక్ష్మిదేవితో వండిస్తున్నాను. భోం చేసి, కాసేపు పడుకుని లేచి, నాలుగయ్యేసరికి బయల్దేరుదురుగాని. పెదబాబు అన్నయ్య కూడా వచ్చారు కదా’ అంది. 

            వింటున్న ఆనంద గజపతిరాజు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీనంగా వర్మకేసి చూశాడు. వర్మ కూడా ‘ఇప్పుడిలాంటివేం వద్దు పిన్నమ్మా; భోజనానికి విజయనగరం వచ్చేస్తానని చెప్పాను లలితప్ప  వంట చేసేస్తారు’ అన్నాడు. ‘మరేం ఫర్వాలేదు. లలితకి నేను నేను ఫోన్ చేసి చెప్తాను’ అంది. చంద్రం కలగజేసుకుని ‘రెండు మెతుకులు  తినేసి వెళ్ళిపోవోయ్, ఏం కొంపమునిగిపోయింది. పోనీ నువ్వు ఫస్ట్ షోకి వెళ్దుగానీలేవోయ్’ అన్నాడు.

            సినిమా కోసం కాదు’ అన్నాడు ఆనంద గజపతిరాజు మొహం ముడుచుకుని. వర్మ ఇంక తప్పదన్నట్లుగా లేచి, పెరట్లోకి వెళ్ళాడు. వెనకాలే సరస్వతమ్మ కదిలింది. సూరిగాడు లేత పనసకాయలు కోసి గోనెలోకెక్కిస్తున్నాడు. ‘పనసకాయలు బాగా దిగేయ్’ అన్నాడు వర్మ. అందుకే మీకోసమే మూటకట్టిస్తున్నాను, పణుకులమాను తొలిబుట్ట ముదిరింది. పట్టుకెళ్దూగాని, అరటిగెలా కోయించాను. ఇక్కడ మాకెవరున్నారు తినేవాళ్ళు’ అంది.

            ఇప్పుడదంతా ఎందుకు పిన్నమ్మా. అన్నీ అక్కడ ఉన్నాయి గదా’ అన్నాడు వర్మ మొహమాటంగా. ‘నీకు లేవని కాదు; ఏదో నా సంతోషం’ అంది. అని సూరిగాడితో ‘జాగ్రత్తగా వర్మ బాబు కారు డిక్కిలో సర్దు..’ అని ఆర్డర్ వేసింది. వాడు కిక్కురుమనకుండా అన్నీ తీసుకుని వెళ్ళి కారు డిక్కిలో సర్దేశాడు.

             సూరిగాడు నువ్వున్నావని ఏం మాట్లాడలేదు. లేకపోతే తిరిగి సమాధానం చెప్తున్నాడు’ అని ఫిర్యాదు చేసింది. అప్పుడు గంట్యాడ వర్మ ‘పిన్నమ్మా మీకు తెలియడం లేదు, కాలం మారిపోయింది. రోజులు మునుపులా లేవు. అమ్మా, బాబూ అని చెప్పి చేయించుకోవాలి. మనుషులు దొరకడం లేదు. కోడిని తినేవాడు పోతే గొర్రెని తినేవాడొస్తాడు. కొంచెం ఓపిక పట్టండి. మాన్పించేయడం నిమిషం పని. మరొకడు దొరకడం కష్టం. ఆలోచించండి.’ అని నచ్చజెప్పాడు వర్మ.  సరస్వతమ్మ అంతెత్తున ఎగిరింది. ‘నువ్వు చినబాబులాగా మాట్లాడుతున్నావ్. ఆడే నీకు మప్పి పంపాడని నాకు నమ్మకం.      ఈ సూరిగాడి సంగతి నీకు తెలీదు. ఆడికిచ్చే డబ్బులకి దమ్మిడి పనిచేయడం లేదు. ఏమైనా సరే, ఆణ్ణి పనిలోంచి తీసేయాలి’ అంది. ‘అలాగే తీసేద్దాం. కొంచెం ఓపిక పట్టండి. ఎండాకాలం అవ్వనివ్వండి ఆ తర్వాత వర్షాలు పడతాయి. దుక్కులు దున్నించేశాకా సరియైనోణ్ణి చూసి, సూరి గాణ్ణి మానిపించేద్దాం.’ అనినెమ్మదిగా చెప్పాడు. ఆవిడ ఒక్క క్షణం ఆలోచించింది. ‘నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నాకు నువ్వు ఒకటి చినబాబు ఒకటీ కాదు, మరి ఖచ్చితంగా దుక్కులయ్యాక మాన్పించేయాలి.’ అంది. ‘అంతే కాకుండా నాముందు ఆడికింత గడ్డి పెట్టి చెప్పవలసిన నాలుగూ చెప్పాలి. జీడిపిక్కలు చింతపండు గురించి నిలదీసి అడుగు.’ అంది. ‘ఇప్పుడే చెప్తాను. మీముందే చెప్తాను.’ అన్నాడు. ‘ఇక్కడా..! కుర్చీలు లేవు, నిలబడే ఉన్నావు. ఒరేయ్ ఆదీ ఆ కుర్చీలు తీసుకురా, ఈ మామిడిచెట్టుకింద వెయ్యి’ అంది. ఆది గాడు, సూరిగాడు కుర్చీలు వేసారు. ‘ఒరేయ్ ఆదీ, చంద్రంరాజు గారిని ఓసారి ఇలా రమ్మను’ అని కుర్చీలో కూర్చున్నాడు వర్మ. ‘రేయ్ సూరి జీడిపిక్కలు ఇవ్వడం లేదటా, కబురంపితే రావటా, చింతకాయలు అమ్మేసుకుంటున్నావంటా. నువ్వేదైనా ఓ మాట అయ్యగారికి చెప్పి చేయడం పద్దతి కదరా.’ అన్నాడు. ఇంతలో చంద్రంరాజు వచ్చి కూర్చున్నాడు.  సూరి ‘బాబు తమ పాదాల దగ్గర బతికే వాళ్ళం, చింతచెట్టు కాసి మూడు సంవత్సరాలైంది. కుంకుడుచెట్టు చెదలెక్కిపోయి ఉంది. జీడి చెట్లు పూత మాడిపోయి కుంచెడు పిక్కలు కూడా అవ్వడం లేదు. మీరు రండి. వచ్చి చూడండి. ఒక్క కాయగాదు, ఒక పిక్కకాదు, ఒక కంప నేను తీసేనని ఋజువు పెట్టండి. తమరు ఏ శిక్షేసినా పడతాను. రోజూ ఈ తగువేటండి నాకు, అమ్మగారికి అంతా అనుమానం’ అన్నాడు సూరి కోపంగా. ‘అనుమానమా, నాది అనుమానమా. అసలు నాకు చెప్పకుండా నిన్నెవ్వడు కదపమన్నాడురా. చింతకాయ అవనీ, కుంకుడుకాయ అవనీ, ఆకు కదిలితే నాకు కబురందాలి. అప్పుడు నేను చెప్తాను ఏటి చెయ్యాలో, నాతోట మీద నీ బోడి పెత్తనం ఏంట్రా? అంతా అమెరికావోడు చేస్తన్నాడు. ఫుల్ గా నీకు కొమ్ములిచ్చిశాడు. నువ్వు పేట్రేగి పోతున్నావు’ అంది సరస్వతమ్మ. ‘ఆగండి, మీరాగండి, వర్మ అడుగుతున్నాడు కదా.’ అన్నాడు చంద్రంరాజు. అనగానే ఆవిడ ఆవేశం తగ్గింది. వర్మ ‘ఒరేయ్ సూరి జాగ్రత్తగా విను, నెలకి రెండుసార్లు అయ్యగారు ఎప్పుడు కబురుపెడితే అప్పుడు ఇంటికిరా.. బద్దకించకు. చింతచెట్టు, జీడిచెట్టు, కుంకుడుచెట్టు, కాపుకు బేరం తీసుకురా, ఆ డబ్బులు అమ్మగారికిచ్చేయ్.’ అనగానే ‘ఎక్కడండీ అన్నీ కలిపి ఐదువందలకడిగినోడు లేడు’ అన్నాడు సూరి. ‘మధ్యలో మాట్లాడకు, చెప్పింది చెయ్’ అని వర్మ కసురుకున్నాడు. ‘జీతం సంగతి నేను చినబాబుతో మాట్లాడుతాను. తోట బాగా చూసుకో. దుక్కులయ్యాకా మాట్లాడుకుందాం. ఆవిడేదో అన్నారని, నువ్వు మానేస్తానని అనడం, మేమందరం రావడం. నలుగురులోనూ నీకు మాకు అప్రతిష్ట. అంచేత శుభ్రంగా పనిచేస్కో. ఆరు కాయలు ఆరికిచ్చి, నాలుగు కాయలు నువ్వు తిను అది న్యాయం’ అన్నాడు. ‘అలాగడ్డి పెట్టు’ అని తృప్తి పడింది సరస్వతమ్మ. ఇంతలో లోపలినుంచి ‘అయ్యగారూ’ అని పనిమనిషి లచ్చి పిలిచింది. సరస్వతమ్మ లోపలికెళ్ళింది.

            సూరి ఆవిడ వెళ్ళగానే వర్మతో మొర పెట్టుకున్నాడు. ‘సూడండి బాబు తమరికి తెలీనిదేముంది. ఆ నాలుగు రూపాయల జీతంతో బతకగలమా, ఏదో రాలినకాయ, పండు కూడా ఒట్టుకొచ్చేయమంటే మేమైపోవాలా. ఈసారి నాకు ప్రాణం సాలొచ్చిందండి. రోజూ ఈ గోల నేను పడలేను. ఉంచితే ఉంచండి, తీసేస్తే తీసేయండి’ అన్నాడు సూరి. ‘ఒరేయ్ ఇక్కడ మానేస్తే మరోచోట మరో తగువు రాదట్రా పిచ్చోడా, తంతుందని పాలిచ్చే గొడ్డుని పారేస్తారేట్రా?, ప్రతిచోటా ఏదో ఒక పెంట ఉంటది. పెద్దావిడ…, చాదస్తం, కొంచెం ఓర్పు ఉండాలిరా’ అన్నాడు చంద్రం. ‘సూరీ నీ బాధ నాకు బోధపడింది. ఆవిడన్నదానికల్లా తలూపు, తర్వాత సంగతి తర్వాత. ఏదైనా సమస్యుంటే చంద్రంరాజు గారితో సలహా చెయ్, నీకు జీతం ఐదువందలు పెంచమని చినబాబుకి చెప్తాను. ఇవాల్టితో ఐపోద్దేట్రా’ అన్నాడు వర్మ.  అని జేబులోంచి వందరూపాయలు తీసి సూరి గాడికిచ్చాడు వర్మ. ‘నారింజ చెట్టు బాగా కాసినట్టుంది’ అన్నాడు. అప్పుడే లోపల్నుంచి వచ్చిన సరస్వతి, నారింజకాయలు పరువైనవి చూసి చంద్రంరాజు గారికి యాభై, పెదబాబు అన్నయ్యకి పాతిక, వర్మ బాబుకి యాబై సర్ది పెట్రా సూరీ, పెట్టేసి పారిపోకు, వెళ్ళేటప్పుడు కోడికూరిస్తాను. గౌరికి పట్టుకెలుదువు గాని’ అని, ‘వర్మ బాబు చెప్పినట్టు ఒళ్ళు దగ్గరపెట్టుకుని మసులుకో’ అంది సరస్వతమ్మ. సూరి గాడు తలూపి పనిలో పడ్డాడు.

            భోజనాలయ్యాయి. ఉప్పలపాటి పెదబాబు నడుము వాల్చాడు. ఆనంద గజపతిరాజు తొందరపెట్టడం మొదలు పెట్టాడు. చంద్రంరాజు తనింటికి తాను వెళ్ళిపోయాడు. వర్మ ఆది గాడితో కాసేపు ఒళ్ళు పట్టించుకుని ఆడికో వంద రూపాయలిచ్చి ‘వెళ్ళొస్తాను’ అని చెప్పి కారెక్కి బయల్దేరారు. సూరిగాడు, ఆదిగాడు ఇళ్ళకు మళ్ళారు.

*                    *                  *

            రాజేరు రోడ్ నుంచి కోమటిపల్లి రోడ్ మీదుగా విజయనగరం వెళ్తున్నప్పుడు అడిగాడు ఆనంద గజపతి ‘మావయ్యా నాకొకటి బోధపడలేదు, అసలు గొడవేంటి? నువ్వొచ్చి ఏం చేశావ్? అంతా కలిసి పదెకరాల మామిడితోటట కదా, అందులో చింతకాయలు, కుంకుడుకాయలు, జీడిపిక్కలు అన్నీ కలిపి వెయ్యి రూపాయలు కూడా రావు. నా ఒకరోజు సినిమా ఖర్చంత కాదు.         నీ ఒకరోజు మందు ఖర్చంతా కాదు. దీనికోసం అమెరికా నుంచి ఫోన్లు, ఆ ముసలమ్మ ఆరాటం   bull shit.’ అన్నాడు. వర్మ నవ్వాడు. ‘నువ్వు చదువుకున్నోడివిరా, నీకర్థం కాదు. నువ్వు చెప్పింది నిజమే, మనకి చేసిన మర్యాద మన కారు డిక్కీలో ఆవిడ పెట్టిన సరుకులు ఇవన్నీ డబ్బులు లెక్కేస్తే, సూరి గాడి నెల జీతం కన్నా చాలా ఎక్కువ, కాని, ముసలోళ్ళు అనేవాళ్ళు వేరురా, ఆళ్ళ లెక్కలు వేరు, వాళ్ళ ఆపేక్ష వేరు. అభిమానం, మూర్ఖత్వం, జాలి, కోపం, అన్ని కలగలిపిన ఒక పదార్థంలా తయారౌతారు ఆ వయసుకి. ఆవిడకి ఆ యాతన లేకపోతే ఎప్పుడో పైకెళ్ళిపోయుండేది. మనిషన్నాక యాతనుండాలి. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆవిడకి పెత్తనం కావాలి. ఆవిడనుకున్నట్లు మనం జరపాలి. అప్పుడప్పుడు శృతి మించితే మనం కలగజేసుకోవాలి. ముందుకు నడిపించాలి. పల్లెటూళ్ళలో పెరిగితే గాని, తిరిగితే గాని ఇది అర్థం కాదు’ అన్నాడు. ఆనంద గజపతిరాజు తల పంకించాడు. కారు విజయనగరం రోడ్డు మీద శరవేగంతో పోతుంది.

*                    *                  *

            ఇది జరిగి సుమారు నాలుగు సంవత్సరాలవుతుంది. సరస్వతమ్మ రెండు నెలలకొకసారి ఖర్చుకి వెనకాడకుండా సూరిగాణ్ణి ఉద్యోగంలోంచి తీసేయమని డిమాండ్ చేస్తూనే ఉంది. పెద్దలందరు మీటింగ్ పెడుతూనే ఉన్నారు. సూరిగాడు అక్కడే, అలాగే, అదే లెక్కల్లో పనిచేసుకుంటూ ఉన్నాడు. చంద్రంరాజు ముసిముసి నవ్వులతో, ఈ భోగట్టా చుట్టాలందరితో పంచుకుంటూ ఉన్నాడు.

చైతన్య పిన్నమరాజు

Spread the love

One thought on “ఎస్టేట్ తగాదా

  1. పాత్రల్లో సహజత్వం, కథ అంతా పచ్చటి పందిరిలా కనిపించడం , గుక్క తిప్పుకోనివ్వని కథనం…వావ్…చాలా రోజుల తర్వాత అచ్చ తెలుగు కథ చదివాను. ఆలోచనలో పడ్డాను.మా పెద్దవాళ్లు చాలా మంది నా ముందు నిలబడ్డారు. తమ కథ అన్నట్లు గుర్తు చేస్తున్నారు. ఓ పాత్రను పట్టుకోవటం , దాన్ని ఒడుపుగా కథలోకి తీసుకురావటం, అందుకు తగ్గ పాత్రలను చుట్టూ చిత్రీకరించటం, అనుభవం ఉన్న రచయితలు మాత్రమే ఫీట్ ఇది. దాన్ని చైతన్య గారు అలవోకగా చేసేసారు. ముఖ్యంగా ఓ ప్రాంతపు జీవనచిత్రణ .. సంస్కృతి కథకు ప్రాణం పోసాయి. కథాంతం జీవితంలోని ఇంకో కోణాన్ని, మనని వదిలివెళ్లిపోతున్న చాలా పాత్రలను, పల్లె జీవన సొగుసుని మన ముందు పరిచింది. ఈ కథని ఇలా మాత్రమే వ్రాయాలి అనిపించింది. అతి మామూలు కథాంశాన్ని అద్బుతమైన కథగా మలచడం ఎలాగో తెలుసుకుందుకు ఔత్సాహికులు ఈ కథను చదవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *