ఒకప్పుడు అతనొక హిజ్రాగా ఉండేవాడు

Spread the love

ఎక్కడి నుంచో ఒక పిలుపేదో  ప్రతిధ్వనించింది.
అతనొక రాగాన్ని శృతి కలిపాడు.
ఎంత అమాయకమైన మొఖంతో ఉండేవాడని ?
మరి ఎందుకు అతన్ని హిజ్రా అనేవారు ఈ జనం ??
``
అతను పాపం శారీరకంగా బాగా అలిసిపోయినట్లు బలహీనంగా ఉండేవాడు.
అయినా ...కళ్ళల్లో ఎంత కాంతి ఉండేదనుకున్నారు ?
పనేమీ చేసేవాడు కాదు..నిత్యం అనారోగ్యంతో ఉండేవాడు. అందుకేనేమో బహుశా ఈ లోకానికి కోసుల కొద్దీ ఎడమైపోయాడు.
~~~~
అతనేం చేసేవాడంటే.. కొంగుతో ఛాతీని కప్పేసుకునే వాడు.
కానీ మగధీరుడిలా హుందాగా నడిచేవాడు.
ఆడా-మగా లింగాల మధ్యస్థంగా ..పుట్టిన వారికి
ఒక ఉదాహరణగా ఉండేవాడు.
~~~~
కానీ కోరికల పరుగు పందెంలో అతను ఒంటరిగా ఎటో తప్పిపోయాడు.
కుంకుమ పువ్వు.. ఆకుపచ్చ రంగుతో ఉంటుందన్న విషయం అతనికి మాత్రమే తెలుసు
~~~~~
అతను గుడికి ఎలా వచ్చేవాడు అనుకున్నారు ?
అల్లాహ్ పేరు తీసుకుంటూ వచ్చేవాడు !
ప్రతీ రోజూ అగర బత్తులు వెలిగిస్తూ.. చద్దర్లు కూడా అల్లాహ్ కి సమర్పించేవాడు.
~~~~~
ఇది చూడండి..ఒక పక్క చీనబ్ ఉంది.. మరో పక్క మద్యమూ ఉంది.
గాఢాంధకారం ఉంది..వెను వెంటే వెలుతురూ ఉంది.
అచ్ఛం అలాగ
ఎవరికైనా తల్లి లేదా తండ్రిగా... ఎవరో
ఒకరిగా మాత్రమే కావాలనేది అతని ప్రగాఢ మైన స్వఫ్నం !
~~~~
ఎంత విషాదమో ఇది చూడండి ! శుక్రవారవు సాయంత్రాల్లో..కేవలం ఒక పూట భోజనం కోసం అతనెప్పుడూ..రైళ్లలో వేలాడుతూ..వేలాడుతూ వెళ్ళేవాడు.
ఒక చోటు నుండి .,మరొక చోటుకు అలా నీరసంగా దిక్కు లేకుండా తిరుగుతూనే ఉండేవాడు పాపం !
~~~`
కనిపించే మనుషుల మొఖాల్లో మానవత్వం కోసం వెతుకుతూ ఉండేవాడు.
ఏమీ దొరికేది కాదు కానీ..హద్దుల్లో ఉండమనే హెచ్చరికలు మాత్రం వచ్చేవి.
అతని మీద అనేకమైన నిందలు పడేవి !
ఎందుకంటే..అతను పురుషులతో పడుకునే వాడు.
ఆడవాళ్ళతో కలిసి రోదించేవాడు మరి !
~~~~~
అతను...రెండు చేతులతో చప్పట్లు కొడుతూ.. గొణుగుతూఉండే..వెన్నెల రాత్రుళ్ళల్లో అమ్ముడుపోయే ఒక విలువైన సాధనం ! అతను..కేవలం ఒక పాత్రధారి మాత్రమే !
~~~~
ఎరుపు , పసుపు,నీలం రంగు చీరలను వేసుకున్నప్పుడల్లా ..
అతను..స్త్రీ పురుషులిద్దరి గర్వాన్ని భంగ పరుస్తాడు.
~~~~`
రాముడు లేడు.. రెహమాన్ కూడా లేడు.
హిందువు కాదు.
ముసల్మానూ కాదు.
ఒక నాలుగు పైసలు చేతిలో పెట్టుకుని.. నన్ను బాబూ అని బిక్షం అడిగే అందరి లాంటి ఒక సాధారణ మైన మనిషి !
~~~~
అతని అరచేతుల్లో నిండి పోయిన దురదృష్ట రేఖలు..అతను బనారస్ పాన్ తినే ఆనందాన్ని కూడా వెనక్కి తీసుకు వచ్చాయి..
కానీ ఇప్పుడవి కనుచూపు దూరాన కూడా లేవు !
****
అతన్ని తిరస్కరించడం కూడా ఎంతటి పాపమంటే..
ఋషులకంటే హిజ్రా శాపమే భయంకరంగా ఉంటుంది మరి.
~~~~
ఈమధ్య కాలంలో అతను బాజారులో కూడా కనిపిస్తున్నట్లు విన్నాను మరి.
ఆకలితో .. అతని నఘ్న దేహపు గౌరవం ఎప్పుడూ అమ్ముడుపోవడం చూసాను !
~~~~~
ఆ దేహం ఎంత నొప్పిని దాచిపెడుతుందో ఎవరికి తెలుసు చెప్పండి ?
చల్లని వణికించే రాత్రుళ్ళల్లో అతను వీధుల్లో నగ్నంగా నే నిదురిస్తుండొచ్చు !
~~~~~
తన గర్భం పండినట్లు వచ్చే కలలు అతనికి నిద్రా భంగం కలిగిస్తుండొచ్చు కూడా !
పసి పిల్లల కిల కిలా రావాలు వింటూ ఉంటే..తన బాల్యపు అమ్మా .,నాన్నా అనే పిలుపులు యాదికి వస్తుండొచ్చు బహుశా !
******
ఒక పక్క.,అతగాడి బతుకు సందూకు పెట్టె నుంచి..మృత్యువు బయటకు తొంగి చూస్తుంటుంది.
మరోపక్క కడుపు నింపుకోవాలి అతను ఈ నీచ పురుషుల ఛీత్కారాల ఉమ్ములతో !
~~~~
ఆ హిజ్రా ఎంత అపఖ్యాతిని అనుభవించాడో...ఈ లోకానికి ఎంతటి అపరిచితుడిగా ఉన్నాడో ..ఎంతటి దుఃఖంలో..ఆందోళనలో ఉన్నాడో..అతను దేవుడా..సైతానా..కిరాతకుడా అయ్యో ఎవరికీ తెలియదు !
కానీ..అతను బతికున్న మనిషే! కానీ జీవశ్చవంగానే ఉన్నాడు ..
అవును..అతను ఒకప్పుడు హిజ్రాగా ఉన్నాడు !
గీతాంజలి

Dr. Bharati : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. రచనలు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). ''బచ్ఛేదాని' (కథా సంకలనం). 'పహెచాన్' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం ' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

దర్శన్ఓజా

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *