వాసన

Spread the love

సరిగ్గా ఈ రోజులాగే అదొక వర్షాకాలపు రోజు. కిటికీ బయట, ఇప్పుడు ఉన్నట్లే రావి చెట్టు ఆకులు వర్షానికి తళతళలాడుతున్నాయి. ఇంతకుముందు కిటికీ పక్కన ఉండే అదే టేకు మంచం మీద, ఇప్పుడు కొంచెం వెనక్కి జరిగి, ఒక ఘాటు వాసన అమ్మాయి రణధీర్ పక్కన ముద్దుగా ఒదిగి పడుకుంది.

కిటికీ బయట, మబ్బులతో నిండిన రాత్రి ఆకాశం కింద రావి చెట్టు ఆకులు మెరిసే చెవిపోగుల్లా తళతళలాడుతున్నాయి. లోపల ఆ అమ్మాయి వణుకుతూ రణధీర్‌ను గట్టిగా పట్టుకుని ఉంది. అంతకుముందు, రోజంతా ఒక ఆంగ్ల వార్తాపత్రికలోని ప్రతి విభాగాన్ని (దాని ప్రకటనలతో సహా) చదివిన తర్వాత, సాయంత్రం సమీపిస్తుండటంతో రణధీర్ కొద్దిగా సేదతీరడానికి తన బాల్కనీలోకి వెళ్ళాడు. బహుశా పక్కనే ఉన్న తాళ్ల ఫ్యాక్టరీలో పనిచేసే ఆ అమ్మాయి, అప్పుడు వర్షం నుండి తప్పించుకోవడానికి చింత చెట్టు కింద నిలబడి ఉంది. ఆమె దృష్టిని ఆకర్షించడానికి రణధీర్ గొంతు సవరించుకుని, పైకి రమ్మని చేతితో సైగ చేశాడు.

అతను కొన్ని రోజులుగా చాలా ఒంటరిగా ఉన్నాడు. యుద్ధం కారణంగా, బొంబాయిలో అతనికి చౌకగా దొరికే క్రైస్తవ అమ్మాయిలందరినీ మహిళా సహాయక దళాలలోకి బలవంతంగా చేర్చుకున్నారు. వారిలో చాలామంది కోటలో ‘నాట్య’ పాఠశాలలను తెరిచారు. అక్కడ కేవలం బ్రిటిష్ సైనికులకు మాత్రమే ప్రవేశం ఉండేది. దాంతో రణధీర్ కుంగిపోయాడు. అతనికి ఇకపై ఆ క్రైస్తవ అమ్మాయిలు చవకగా దొరకడం లేదు. సైనికుల కంటే అతను మరింత సంస్కారవంతుడైనప్పటికీ.. ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ,  తెల్లవాడు కానందువల్ల అతన్ని కోటలోని వేశ్యాగృహాల్లోకి అనుమతించలేదు.

యుద్ధానికి ముందు అతను నాగ్పడాలోనూ, తాజ్ హోటల్ చుట్టుపక్కల ప్రాంతంలోనూ చాలా మంది క్రైస్తవ అమ్మాయిలతో పడుకున్నాడు. ఆ అమ్మాయిలు ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ, పెళ్లి కోసం వలలో వేసుకునే ఆ మూర్ఖులయిన క్రైస్తవ అబ్బాయిల కంటే, అటువంటి సంబంధాలలోని చిక్కుల గురించి తనకే బాగా తెలుసని అతనికి తెలుసు.

నిజం చెప్పాలంటే, తన పట్ల హేజల్ కొత్తగా ప్రదర్శిస్తున్న పొగరు, నిర్లక్ష్యానికి ప్రతీకారం తీర్చుకోవడానికే రణధీర్ ఆ అమ్మాయిని తన గదికి పిలిపించాడు. హేజల్ అతని అపార్ట్‌మెంట్ కింద ఉండేది. ప్రతి ఉదయం ఆమె తన యూనిఫాం ధరించి, తన సైనిక శైలి కేశాలంకరణపై అడ్డంగా తన ఖాకీ టోపీని పెట్టుకుని, బయటకు వెళ్లి, తన ముందున్న ప్రతి ఒక్కరూ నేలపై పడి, ఆమె నడవడానికి తమ శరీరాలను తివాచీలుగా పరిచి, బలిగా అర్పించాలన్నట్లుగా విర్రవీగుతూ ఫుట్‌పాత్‌పై నడిచేది.

ఆ క్రిస్టియన్ అమ్మాయిల పట్ల తనకెందుకు అంత మోజు కలుగుతుందోనని రణధీర్ ఆశ్చర్యపోయాడు. నిజమే, వాళ్ళు తమ అందాలను ప్రదర్శించడంలో చాలా నేర్పరులు. ఏమాత్రం సంకోచం లేకుండా తమ నెలసరి గురించి మాట్లాడతారు. తమ గత ప్రేమ వ్యవహారాల గురించి చెప్తారు. ఇంకా వాళ్ళకి నృత్య సంగీతం అంటే ఎంత ఇష్టమంటే, అది వినగానే వాళ్ళు దానికి అనుగుణంగా కాళ్ళు కదపడం మొదలుపెడుతారు. ఇదంతా నిజమే అయినా, ఇతర స్త్రీలు కూడా అలాగే ఉండొచ్చు.

రణధీర్ ఆ అమ్మాయిని పైకి రమ్మని సైగ చేసినప్పుడు, తాను ఆమెతో పడుకుంటానని అతను ఊహించలేదు. కానీ ఆమె అతని గదిలోకి ప్రవేశించినప్పుడు, అతను ఆమె తడిసిన బట్టలను చూశాడు. ఆమెకు నెమ్ము చేస్తుందేమోనని భయపడి, “వాటిని విప్పేయ్. నీకు జలుబు చేస్తుంది” అని అన్నాడు.

ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళలో సిగ్గుమెరుపు మెరిసింది. రణధీర్ తన తెల్ల ధోవతిని తీసి ఆమెకు ఇవ్వగా, ఆమె ఒక్క క్షణం తటపాయించి, ఆ తర్వాత తన మురికి పాత చీరను విప్పి పక్కన పెట్టి, ధోవతిని చటుక్కున ఒడిలోకి తీసుకుంది. తర్వాత తన రొమ్ముల చీలిక మధ్య ఇరుక్కుపోయి, ముడిపడి ఉన్న తన బిగుతైన బ్రాను తీయడానికి ప్రయత్నించింది.

ఆమె తన గోళ్లతో ఆ ముడిని విప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ వర్షానికి అది మరింత బిగుసుకుపోయింది. అలా చేసి విసిగిపోయి, ఆమె రణధీర్ వైపు తిరిగి మరాఠీలో, “నేనేం చేయగలను? ఇది బిగుసుకుపోయింది” అంది.

రణధీర్ ఆమె పక్కన కూర్చుని ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించాడు. కొంతసేపు విఫల ప్రయత్నం తర్వాత, అతను ఒక చేత్తో ఆమె బ్రా ఒక అంచును, మరో చేత్తో దాని రెండవ అంచును పట్టుకుని గట్టిగా లాగాడు. ఆ ముడి తెగిపోయింది. ఆమె వక్షోజాలు ముందుకు ఉబికివచ్చాయి. ఆ ఒక్క క్షణం పాటు, మెత్తగా మట్టిని పిసికి, ఆమె వక్షోజాలకు ఆకారం ఇచ్చిన నేర్పరయిన కుమ్మరిగా తనను తాను ఊహించుకున్నాడు.

ఆమె వక్షోజాలు కుమ్మరి కొత్తగా తయారుచేసిన పాత్రల వలె దృఢంగా, తాజాగా ఉన్నాయి. గోధుమ రంగు కన్నా కొంచెం ముదురుగా ఉండి, ఏ కళంకం లేకుండా ఒక విచిత్రమైన కాంతితో నిండి ఉన్నాయి‌. ఆమె చర్మం, ఒక చెరువు తన ఉపరితలం కింద నుండి నిండు కాంతిని వెదజల్లినట్లుగా, ఒక మసక కాంతి పొర ఒక అతీంద్రియ కాంతిని వెదజల్లుతున్నట్లు అనిపించింది.

ఈరోజు లాగే అదొక వర్షాకాలపు రోజు. కిటికీ బయట రావి చెట్టు ఆకులు రెపరెపలాడుతున్నాయి. ఆ అమ్మాయి రణధీర్‌ను పెనవేసుకుని నిద్రిస్తోంది. వర్షానికి తడిసిన ఆమె బట్టలు నేల మీద చిందరవందరగా ఒక కుప్పగా పడి ఉన్నాయి.​​ ఆ అమ్మాయి మురికి నగ్న శరీరం నుండి వెలువడుతున్న వేడి, చలికాలం తీవ్రంగా ఉన్నప్పుడు మురికిగా, వేడిగా ఉండే బహిరంగ స్నానఘట్టాలలో స్నానం చేసినప్పుడు తాను అనుభవించిన అనుభూతిలా రణధీర్‌కు అనిపించింది.

రాత్రంతా వాళ్లిద్దరూ ఒకటైపోయినట్లుగా ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉన్నారు. వాళ్లు బహుశా ఒక మాట కన్నా ఎక్కువ మాట్లాడుకొని ఉండరు. వారు చెప్పదలచిన భావాన్ని తమ శ్వాస, పెదవులు, చేతుల ద్వారానే వ్యక్తపరిచారు. రాత్రంతా రణధీర్ ఆమె వక్షోజాలను నిమురుతూ, ఆమె చిన్న చనుమొనలను, వాటి చుట్టూ ఉన్న నల్లని వలయాలలోని నరాలను ఉత్తేజపరిచాడు. ఆ రాత్రంతా ఆమె శరీరంలో ప్రకంపనలు ఎంత బలంగా ప్రవహించాయంటే, అప్పుడప్పుడు రణధీర్ కూడా ఆనందంతో వణికిపోయాడు.

రణధీర్‌కు అలాంటి ఇంద్రియ సుఖాల గురించి బాగా తెలుసు. అతను లెక్కలేనంత మంది అమ్మాయిల రొమ్ములను పట్టుకుని నిద్రపోయాడు. అతను ఎలాంటి అనుభవం లేని అమ్మాయిలతో పడుకున్నాడంటే, వాళ్ళు అతన్ని హత్తుకున్న తర్వాత, ఒక అపరిచితుడితో చెప్పకూడని ఇంటి విషయాలన్నిటి గురించి చెప్పుకునేవారు. అతను కేవలం అలా ఉండటం కోసం, పనులన్నీ చేసే అమ్మాయిలతో కూడా పడుకున్నాడు. కానీ ఆ అమ్మాయి, చింత చెట్టు కింద వణుకుతూ అతను తన గదిలోకి పిలుచుకున్న ఈ అమ్మాయి, చాలా భిన్నమైనది.

రాత్రంతా ఆమె శరీరం నుండి ఒకేసారి ఆకర్షణీయంగా, వికర్షణీయంగా ఉండే ఒక వింత వాసన వెలువడింది. ఆమె జుట్టు, చంకలు, వక్షోజాలు, పొట్ట..ఇలా అన్ని చోట్ల నుండి వస్తున్న ఈ అస్పష్టమైన వాసనను రణధీర్ పీల్చిన ప్రతి శ్వాసలోనూ ఆస్వాదించాడు. ఆమె నగ్న శరీరం నుండి ఆ వాసన రాకపోయి ఉంటే, ఆ వాసన తన ప్రతి కణంలోకి చొచ్చుకుపోయి, తన ప్రతి ఆలోచనను ఆక్రమించకపోయి ఉంటే, తాను ఆమెకు ఇంత దగ్గరగా ఉన్నట్లు భావించేవాడిని కాదని రాత్రంతా తనలో తాను అనుకున్నాడు.

ఆ ఒక్క రాత్రికి ఆ సువాసన రణధీర్‌ను, ఆ అమ్మాయిని ఏకం చేసింది. కేవలం స్వచ్ఛమైన ఆనందంలో మాత్రమే జీవించే ఒక జంతు ప్రపంచంలోకి ఒదిగిపోయి, వారు ఒకటయ్యారు. ఆ ప్రదేశం తాత్కాలికమైనప్పటికీ అది వారికి శాశ్వతమైనది. అది ఒక రకమైన అతీతమైన ఉల్లాసం అయినప్పటికీ, ప్రశాంతమైన నిశ్చలతను కూడా కలిగి ఉంది. ఆకాశంలో ఎంతో ఎత్తులో, కదలకుండా ఎగురుతున్న పక్షిలా వారు ఏకమయ్యారు.

ఆ అమ్మాయి శరీరం నరనరాల నుండి ఈ సువాసన వెలువడుతోంది. అతను దాన్ని గుర్తించాడు కానీ వర్ణించలేకపోయాడు. నీళ్ళు చల్లిన మట్టి నుండి వచ్చే ఆహ్లాదకరమైన సువాసనలా ఉంది అది. అందులో సుగంధ ద్రవ్యాల కృత్రిమత్వం ఏమాత్రం లేదు. అది స్వచ్ఛమైనది, నిజమైనది. అది స్త్రీ పురుషుల కథంత నిజమైనది, పురాతనమైనది.

రణధీర్‌కు చెమట వాసన అంటే అసహ్యం. స్నానం చేశాక, అతను మామూలుగా తన చంకల కింద, ఇతర చోట్ల సువాసనగల పౌడర్‌ను చల్లుకునేవాడు. ఆ వాసనను కప్పిపుచ్చడానికి మరేదైనా పదార్థాన్ని వాడేవాడు. అందుకే అతను ఆ అమ్మాయి వెంట్రుకలున్న చంకలను పదే పదే ముద్దుపెట్టుకున్నా, అతనికి ఏమాత్రం అసహ్యం కలగకపోగా, ఆశ్చర్యకరంగా అది అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆమె చెమటతో తడిసి ఉన్న సున్నితమైన చంక వెంట్రుకలు, ఒకేసారి భావోద్వేగాలను రేకెత్తించే, కానీ వర్ణించలేని ఒక సువాసనను వెదజల్లుతున్నాయి. ఆ వాసన తనకు తెలిసినట్లే అనిపించింది. అది అతనికి సుపరిచితం, అది తన మజ్జల్లోనే తెలిసిపోయింది, కానీ దాన్ని ఎవరికీ వివరించడానికి అతని దగ్గర మాటలు లేవు.

అచ్చం ఈ రోజులాగే అచ్చం ఒక వర్షాకాలపు రోజు. అతను కిటికీలోంచి చూసినప్పుడు, రావి చెట్టు ఆకులు వానకు వణుకుతూ, గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. చీకటిగా ఉన్నప్పటికీ, నక్షత్రాల కాంతిని వాన చినుకులు కొంత దొంగిలించాయేమో అన్నట్టు, ఆ రాత్రి ఒక మసక వెలుగును వెదజల్లుతోంది. రణధీర్ గదిలో ఒకే ఒక్క టేకు మంచం ఉన్నప్పుడు కూడా అచ్చం ఈ రోజులాగే అచ్చం అది ఒక వర్షాకాలపు రోజే. కానీ ఇప్పుడు ఒక మూలకు నెట్టివేసిన అలంకరణ బల్లతో పాటు ఇంకొకటి కూడా ఉంది. అచ్చం ఈ రోజులాగే అచ్చం వర్షాకాలపు రోజు లాగే, వాతావరణం కూడా అచ్చం ఇలాగే ఉంది, అదే మినుకుమినుకుమనే వర్షం, గాలిలో గోరింటాకు ఘాటైన సువాసన గుబాళిస్తోంది.

రెండో మంచం ఖాళీగా ఉంది. రణధీర్ బోర్లా పడుకుని ఉన్నాడు. వర్షానికి కంపిస్తున్న రావి చెట్టు ఆకులను చూడటానికి అతను కిటికీలోంచి బయటకు తల తిప్పాడు. అతని పక్కనే, తన నగ్నమైన చేతులతో శరీరాన్ని కప్పుకోవడానికి విఫలయత్నం చేసిన తర్వాత, తెల్లని చర్మం గల ఒక అమ్మాయి నిద్రపోయింది. ఆమె ఎర్రని పట్టు ప్యాంటు అవతలి మంచం మీద ఉంది. ఆమె ప్యాంటుకి వేసిన ముదురు ఎరుపు రంగు నాడా ముడి దాని చివరన వేలాడుతోంది. ఆమె ఇతర బట్టలు కూడా మంచం మీద చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆమె పూల కమీజ్, బ్రా, లోదుస్తులు, మేలిముసుగు-అన్నీ ఎర్రగా, ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్నాయి. ఆ బట్టలన్నిటి నుండి గోరింటాకు ఘాటైన సువాసన బలంగా వస్తోంది.

ఆమె నల్లని జుట్టులో మెరుపు రేణువులు ఉన్నాయి. ఆమె ముఖం బుగ్గలకు రాసుకున్న రంగు, మెరిసే మేకప్‌తో కప్పబడి ఉంది. అవన్నీ కలిసిపోయి ఒక రోత బూడిద రంగును ఇచ్చాయి. పాపం ఆ అమ్మాయి! ఆమె బ్రా రంగు వెలసిపోయి, ఆమె లేత వక్షోజాలను అక్కడక్కడా ఎర్రగా మరక చేసింది.

ఆమె రొమ్ములు పాల రంగులో, లేత నీలి ఛాయతో తెల్లగా ఉన్నాయి. ఆమె చంకలు దారుణంగా షేవ్ చేయబడి, బూడిద రంగు మొలకలతో ఉన్నాయి. రణధీర్ ఆ అమ్మాయిని పదే పదే చూసినప్పుడల్లా, ఆమెను ఏదో పెట్టెలోంచి ఇప్పుడే బయటకు తీసినట్లుగా వున్న ఒక పుస్తకం లేదా పింగాణీ పాత్రలా అతనికి అనిపించేది. ముద్రణ నుండి వచ్చిన పుస్తకం అట్టపై సిరా మరకలు ఎలా పడతాయో లేదా గరుకుగా వాడిన పింగాణీ వస్తువులపై గీతలు ఎలా ఏర్పడతాయో, అవే గుర్తులు ఆమె శరీరంపై అతనికి కనిపించాయి.

అంతకు ముందు, రణధీర్ ఆమె బ్రా తాడును విప్పడంతో, ఆమె వీపు మీద, రొమ్ముల కింద ఉన్న సున్నితమైన చర్మంపై ఒత్తుకొని లోతైన ముద్రలు పడ్డాయి. ఆమె నడుముపై కూడా ఆ బిగుతైన తాడు గుర్తు ఉంది. ఆమె మెడలోని బరువైన, పదునైన రత్నాలు ఆమె ఛాతీపై గీతలు పడ్డాయి. అవి చూస్తే ఆమె తన గోళ్లతో చర్మాన్ని చీల్చుకున్నట్లుగా అనిపించింది.

సరిగ్గా ఈరోజులాగే అదొక వర్షాకాలపు రోజు. రావి చెట్టు లేత ఆకులపై వర్షపు శబ్దం అచ్చం అలాగే ఉంది. రణధీర్ రాత్రంతా దాన్ని వింటూనే ఉన్నాడు. వాతావరణం అద్భుతంగా ఉంది. గాలి కూడా ఆహ్లాదకరంగా చల్లగా వీస్తోంది. కానీ గోరింటాకు సువాసన మాత్రం గాలిలో గుబాళిస్తూ ఘాటుగా ఉంది.

రణధీర్ ఆ అమ్మాయి పాలలాంటి తెల్లని వక్షోజాలను నిమరడం కొనసాగించాడు. ఆమె లేత శరీరంపై ఆనందపు అలలు పైనుంచి కిందికి ప్రవహిస్తుండగా, దాని లోతైన భాగాల నుండి సూక్ష్మమైన ప్రకంపనలు అతని వేళ్లకు తెలిశాయి. రణధీర్ తన ఛాతీని ఆమె ఛాతీకి ఆనించినప్పుడు, ఆమె ఆవేశానికి ప్రతిస్పందనగా తన శరీరంలోని ప్రతి నరం కంపించడాన్ని అతను అనుభవించాడు. కానీ ఏదో లోపించింది. తల్లి పాల కోసం ఏడ్చే పసిబిడ్డ తీవ్రంగా లాగిందాని కన్నా, ఘాటు అమ్మాయి సువాసనకు అతనికి కలిగిన ఆకర్షణ..ఆ పిలుపు మాటలను మించిన సహజసిద్ధమైనది

రణధీర్ కిటికీకి ఉన్న ఇనుప కడ్డీల గుండా చూశాడు. దగ్గరలో రావి చెట్టు ఆకులు రెపరెపలాడుతున్నాయి. అయినా అతను వాటిని దాటి దూరంగా మేఘావృతమైన ఆకాశం వైపు చూస్తున్నాడు. అక్కడ మేఘాలు వెదజల్లుతున్న ఒక వింత కాంతి అతనికి ఆ ఘటు అమ్మాయి వక్షోజాల మెరుపును గుర్తుచేసింది.

రణధీర్ పక్కన ఒక అమ్మాయి పడుకుని ఉంది. ఆమె శరీరం పాలు, వెన్నతో చేసిన పిండిలా మృదువుగా ఉంది. నిద్రపోతున్న ఆమె శరీరం నుండి వెలువడుతున్న గోరింటాకు సువాసన కొద్దికొద్దిగా తగ్గిపోతున్నట్లు అనిపించింది. ఈ విషతుల్యమైన, కడుపులో తిప్పే వాసనను రణధీర్ భరించలేకపోయాడు. అది ఆమ్ల ఛాయలతో కూడిన ఒక రకమైన పుల్లని వాసన. అది రంగు, ఉల్లాసం లేని ఒక రకమైన వాసన.

రణధీర్ తన పక్కన పడుకున్న అమ్మాయిని చూశాడు. పాడైపోయిన పాల చుక్కలు నీటిలో జారినట్లుగా, స్త్రీ సౌందర్యం అక్కడక్కడా మాత్రమే ఆమెను తాకింది. నిజానికి, రణధీర్ ఇంకా ఆ ఘటు అమ్మాయి సహజమైన సువాసన కోసం పరితపించాడు. ఆ సువాసన, రణధీర్‌ను ఎంతో సహజంగా ఉత్తేజపరిచిన గోరింటాకు వాసన కన్నా ఎంతో తేలికైనది, ఆహ్వానించదగినది. చివరిసారిగా ప్రయత్నిస్తూ, రణధీర్ తన చేతిని ఆ అమ్మాయి పాలలాంటి చర్మంపై రాశాడు. కానీ అతనికి ఏమీ అనిపించలేదు.

ఆమె ఒక గౌరవనీయమైన న్యాయమూర్తి కుమార్తె అయినా, కళాశాల నుండి పట్టభద్రురాలైనా, వందలాది మంది కళాశాల మగ సహచరులు ఆమె కోసం పిచ్చిపట్టి వేచి ఉన్నా, రణధీర్ కొత్త భార్య అతన్ని ఉత్తేజపరచలేకపోయింది. క్షీణిస్తున్న ఆ గోరింటాకు సువాసనలో, అతను ఆ ఘటు అమ్మాయి మురికి నగ్న శరీరం యొక్క వాసనను వెతకడానికి ప్రయత్నించాడు. సరిగ్గా ఈ రోజులాగే, కిటికీ బయట రావి చెట్టు ఆకులు వర్షంలో తళతళలాడుతున్నప్పుడు అతను ఆ వాసనను ఆస్వాదించాడు.

సాదత్ హసన్ మంటో

సాదత్ హసన్ మంటో (1912–1955) ఒక ప్రముఖ ఉర్దూ రచయిత, కథకుడు, నాటక రచయిత. భారత ఉపఖండంలోని సామాజిక వాస్తవాలను, మానవ స్వభావాన్ని, ద్వంద్వ ప్రవృత్తులను తన కథల్లో నిర్భయంగా చిత్రించినందుకు ఆయన ప్రసిద్ధి చెందాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన మంటో, భారత దేశ విభజన సమయంలోని అనుభవాలను, సమాజంలోని వివక్షలను, మతపరమైన ఘర్షణలను తన రచనల్లో విశ్లేషించాడు.

ఆయన రచనలు, ముఖ్యంగా "టోబా టెక్ సింగ్", "ఖోల్ దో", "ఠండా గోష్ట్" వంటి కథలు, విభజన సమయంలో భయానక పరిణామాలను, మానవత్వం యొక్క లోతైన అంశాలను వెల్లడి చేస్తాయి. మంటో రచనలు తరచూ వివాదాస్పదమైనప్పటికీ, అవి సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. సమాజంలోని నీచమైన వాస్తవాలను బహిర్గతం చేసే ఆయన శైలి, ఆయనను ఒక గొప్ప వాస్తవిక రచయితగా నిలిపింది.

మంటో బొంబాయిలో సినిమా రంగంలో కూడా కొంతకాలం పనిచేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. 1955లో, 42 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశాడు. కానీ ఇప్పటికీ ఆయన సాహిత్యం ఉర్దూ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

P. Srinivas Goud

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *