కాలానికో కల్పిత కథ

Spread the love

“అన్నసంతర్పణ చేయండి”

“కోశాగారం తెరచి పేదలందరికీ ధనాన్ని దానం చేయండి”

“రాజ ఉద్యోగులు, సేవకులు, పరిచారకులు అందరికీ  కోశాగారం నుండి తలా ఒక వజ్రాన్ని బహూకరించండి”

“ఉద్యమ కారుల తో చేస్తున్న యుద్ధం ఆపేసి శాంతి నెలకొనేలా చూడండి”

కొన్ని సంవత్సరాలుగా రాజ్యాన్ని అలుముకున్న దుఃఖం పటాపంచలు అయింది. ఆరోజు మహారాజ దంపతుల నిరీక్షణ ఫలించిఒక అందమైన ఆడ శిశువు జన్మించింది. రాజ్యం లో ప్రజల ఆనందానికి అంతే లేదు. ప్రజలంతా రోజువారీ కార్యక్రమాలు వదిలేసి సంబరాలు చేసుకోవడం లో మునిగిపోయారు. అప్పుడే పుట్టిన పసిపాప దర్శనం కోసం ప్రజలంతా గుంపులు గుంపులు గా రాజప్రాసాదం దగ్గరకు చేరుతున్నారు. వెన్నెల కాంతిని పూర్వపక్షం చేసే రాజకుమారి  శైశవ సౌందర్యాన్ని ఒక్క సారైనా చూసి తరించాలని ప్రజలంతా తహ తహ లాడుతున్నారు.

రాజ పురోహితులు వేద మంత్రాలు చదువుతుండగా, ఆస్థాన జ్యోతిష్కులు పాప పుట్టినప్పుడు వున్న గ్రహ స్థితిగతులను లెక్కవేసి జాతక చక్రం నిర్మించడం లో మునిగిపోయారు.

 “రాజకుమారి  అద్భుతమైన ముహూర్తం లో ఈ భూమి మీదకు వచ్చింది. ఆమె జనన సమయం లో గ్రహాలూ, నక్షత్రాలు అన్నీ శుభ స్థానాలలో ఆసీనులై వున్నాయి కనుక యువరాణి కట్టుకున్నవాడికీ, కన్న వారికీ గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకుని వస్తుంది.”

జ్యోతిష్కులు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ చెపుతున్నారు. రాజ దంపతుల ఆనందానికి అవధులు లేవు.

 రాజకుమారి “సుజాషా ” అని నామకరణం చేసారు. సుజాషా అంటే యశస్సు తోనూ, కీర్తితోనూ దీవించబడినది అని అర్ధం అట.

కానీ గ్రహాల స్థితిగతులను దీర్ఘంగా అధ్యయనం చేస్తున్న జ్యోతిష్కుల నుదుట చెమటలు పట్టినయ్. ఒక సందేహ రేఖ వాళ్ళ కళ్ళలో తారాడింది. పెదవుల తడి ఆరిపోయింది. వాళ్ళ ఆందోళన వెంటనే రాజుగారికి చేరే వేశారు.

“ఏమైంది?” అని ఆతురత తో అడిగారు రాజు గారు

ఒక దీర్ఘ నిశ్శబ్దం తరువాత ఆస్థాన జ్యోతిష్కుడు బలవంతంగా గొంతు పెగల్చుకుని “మహా రాజా! ఇదొక అసాధారణమైన జాతకం. నేనెప్పుడూ చూడనూ లేదు, చెప్పనూ లేదు. గ్రహాల, నక్షత్రాల కలయిక చాలా వింతగా వున్నది. ఆరో ఇంట కలసిన గ్రహ నక్షత్రాల సమ్మేళనం వలన, ఆరింట ఉండవలసిన ప్రేమ ను అభౌతికత, ఆధ్యాత్మికత అనే అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. నా నమ్మకమే నిజమైతే యువరాణి, యుక్త వయసు వచ్చాక, ఈ ఐహిక బంధాలు వదిలేసి సన్యసిస్తారేమో ప్రభూ!”  అన్నాడు.

“ప్రపంచాన్ని త్యజించడమా?” మహారాణి గొంతులోనుండి ఆశ్యర్యంతో కూడిన చిన్న కేక వెలువడింది. ఆస్థాన జ్యోతిష్కుడు చెప్పినది వింటున్న వారి మొహాలన్నీ నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయాయి.

“అలాంటి స్థితే వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది.”  అంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయిన రాజు మెల్లగా

“ఆమె మామూలు యువతి  కాదు. రాజకుమారి. వయసొచ్చాక మరొక యువరాజును పెళ్ళాడి ఆ రాజ్యానికో వారసుడ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె ఒక్క వారసుడికి మాత్రమే తల్లి కాదు రాజ్యం మొత్తాన్ని తల్లిలా చూసుకోవాలి. యువరాణిగా వైభవోపేతమైన జీవితం గడపాలి. భవిష్యత్ మహారాణి ఎలా ఈ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మికత వైపు వెళుతుంది?” సాలోచనగా అన్నారు.

“మీరన్నది ఒప్పుకుంటాను మహారాజా! కానీ ఇదొక అసాధారణ జాతకం. ఏమి చేయాలో అర్ధం కావడం లేదు”

“సరే! రానున్న ముప్పును తప్పించడానికి ఏదో  ఒక పరిష్కారం ఆలోచించండి” అని మహారాజు ఆజ్ఞాపించారు.

.”కాస్త సహనంగా వుండండి మహారాజా! శాస్త్రాలు మధించి ఏదో ఒక పరిష్కార మార్గం కనుగొంటాను” అన్నారు ఆస్థాన జ్యోతిష్కుడు.

కొద్దీ క్షణాల పాటు ఆగిపోయిన సంబరాలు అన్నీ మళ్ళీ మొదలయిపోయాయి

 రాజ ప్రాసాదం లో సంబరాలు ఉధృతంగా సాగుతుండగానే, అశ్వశాలలో,ఆ రాజ్యం మొత్తం లో అద్భుతమైనది, అందమైనది గా పేర్గాంచిన, మహా రాజులవారికి ప్రీతిపాత్రమైన మల్లిక అనే అశ్వం ఒక ఆరోగ్యవంతమైన, అందమైన గుర్రపుపిల్ల కి జన్మను ఇచ్చింది. అప్పుడే పుట్టిన గుర్రపుపిల్ల గోధుమ రంగులో వుండి, నుదుటన త్రిభుజాకారం లో తెల్లటి మచ్చను కలిగివుంది. దాని డెక్కలు తెల్లగా వున్నాయి. ప్రధాన అశ్వ సంరక్షకుడు వనమాలి ఆనందానికి అవధులు లేవు. అశ్వాలు అంటే మహా ప్రీతీ కలిగిన మహారాజుల వారు ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారు. ఈ గుర్రపుపిల్ల ను చూసి ఆనంద పడతారు. అందం లో,రాజసం లో ఈ పిల్ల తల్లిని ఏదో ఒకనాడు మించిపోతుంది.  ఇంత అందమైన గుర్రపుపిల్ల కి ఎంత అందమైన పేరు ఉండాలి. రాజు గారు తప్పిస్తే దానికి నప్పే అందమైన పేరు ఎవరు మాత్రం పెట్టగలరు?

వనమాలి ఒక్క క్షణం పాటు ఆలోచనలో పడ్డాడు. మామూలుసమయం లో అయితే అతడు  వెంటనే వెళ్లి రాజుగారికి శుభ వార్త చెప్పి అశ్వ శాల కి వచ్చి దానికో పేరు పెట్టమని  చెప్పేవాడే! కానీ ఈ నాడు రాజప్రాసాదమంతా యువరాణి ఉదయించినదని సంబరాల్లో మునిగి పోయి ఉంటే ఎలావెళ్లి రాజుగారిని అశ్వశాలకు రమ్మని అడుగగలడు?

వనమాలి చూస్తూ ఉండగానే గుర్రపుపిల్ల లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తూ, కాళ్ళు మడతపడి పడిపోయింది. దాని లేత కాళ్ళు శరీరాన్ని మోసేంతగా బలంగా తయారవలేదు ఇంకా. వనమాలి   మధ్యలో కలుగజేసుకోకుండా దానంతట అది లేచి నిలబడేంతవరకు వేచి చూసాడు. రెండు మూడు ప్రయత్నాల తరువాత అది గట్టిగా నిలబడింది. మల్లిక కూడా తన బిడ్డ చేస్తున్న ప్రయత్నాలు చూస్తూనే వుంది. ఒక్కసారి అది నిలబడ్డాక మల్లిక తన వెనుక కాళ్ళు కాస్త వెడల్పు చేసింది. మల్లిక అలా వెడల్పు చేయగానే పిల్ల తల్లి చన్నుల దగ్గరకు దారి తెలిసినట్టు గబగబా వెళ్లి చన్ను కుడవసాగింది.

అలాంటి దృశ్యాలను రోజూ చూస్తూనే వున్నా, వనమాలి ఆ రోజు మాత్రం చాలా ఉద్వేగ పడ్డాడు. ఒక జననం లో ఉన్న అద్భుతమేదో అతడి అనుభవం లోకి వచ్చినట్టు అయింది. హృదయం నిండా నిండుకుని ఉన్న కృతజ్నతను మాటల్లోనూ, చేతల్లోనూ చూపించే శక్తి లేక ఆ సృష్టి కర్త కి చేతులు జోడించి నమస్కరించాడు.

ఆ చిన్న గుర్రపుపిల్ల నడుమును ఆప్యాయంగా నిమురుతూ

 “ఇవాళ్టి నుండీ నీ పేరు సరిత. నువ్వు పెరిగి పెద్దయి మీ అమ్మకంటే గొప్పగా తయారవుతావు. నాకు తెలుసు ఎందుకంటే, నువ్వు యువరాణీ వారు పుట్టిన పవిత్రమైన రోజున పుట్టావు.”

ఇలా మాట్లాడుతూ కొంతసేపు సరిత తో గడిపి మల్లిక కి ఆహారం తీసుకురావడానికి వెళ్ళాడు.

సుజాషా శుక్ల పక్ష చంద్రుడిలా దిన దిన ప్రవర్ధమానం అవుతున్నది.  మిరుమిట్లు గొలిపే ఆమె అందం తో రాజప్రాసాద కాంతి, వైభవం ద్విగుణీకృతం అయ్యాయి. రాజకుమారి పుట్టి రాజప్రాసాదానికే కాదు రాజ్యమంతటికీ,ఒక శోభను తీసుకుని వచ్చింది.

ఎప్పుడూ నీరసంగా కనిపించే ఉద్యానవనాలు సైతం ఇప్పుడు నూతన కాంతులతో పరిమళాలు వెదజల్లుతున్నాయి. జింకపిల్లల్లు చెంగు, చెంగు న నలుమూలలా గెంతుతున్నాయి. పక్షులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాటలు పాడుతున్నాయి.

చిన్న యువరాణి పూలతో మాట్లాడుతూ, నెమళ్లకు తినిపిస్తూ, పక్షులతో గొంతు కలుపుతూ ఆటలు ఆడుతుంది. మందార పువ్వుల మాటున దాగి బంతులతోనూ, చేమంతులతోనూ దోబూచులాడుతోంది. అన్నిటి కంటే ఉద్యానవనం లో వున్న చెరువు వేల వేలు గా వికసించిన కలువపువ్వులను చూడటం అంటే ఆమెకు ఇష్టం. ఆ చెరువులోనే  యువరాణి ఈత కొట్టడం నేర్చుకుంది.

ఒక ప్రకాశవంతమైన ఉదయం పూట

యువరాణి సరస్సులో కొంతసేపు జలకాలాడి, చేతిలో ఒక కలువ పువ్వును పట్టుకుని  చెలికత్తెలు వెంటరాగా  ఉద్యానవనం లో తిరుగాడుతుండగా, హఠాత్తుగా ఒక చిన్న గుర్రం ఆమె వైపు దూసుకుని వచ్చింది. దాన్ని చూస్తూనే “కొత్త గుర్రం” అంటూ యువరాణి ఆశ్చర్యం నిండిన కళ్ళతో దానివంకే చూస్తూ

“ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు” అన్నది

“నిజంగా మీరు చూడలేదా? యువరాణీ! మన అశ్వశాలలో దీన్ని మించిన అందమైన గుర్రం మరొకటి లేదు. దానిపేరు సరిత” అన్నారు చెలికత్తెలు.

 ఈలోగా వనమాలి పరుగెత్తుకుంటూ వచ్చి “సరిత వొట్టి అల్లరి పిల్ల. దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. యువరాణీ మీకేమీ కాలేదు కదా!” అన్నాడు.

“మన అశ్వశాలలో వున్న గుర్రాలు అన్నింటిలోకి  ఇదే అందమైనది, బలమైనది అని వీళ్లంతా చెపుతున్నారు. దీని వయసెంత?’ అని అడిగారు యువరాణీ వారు.

“మీరు పుట్టిన రోజునే ఈ సరిత కూడా పుట్టిందమ్మా!” అన్నాడు వనమాలి.

“అవునా?నిజమా?” అసలే అందమైన యువరాణి మొహం మరింత ఉత్సాహం తో వెలిగిపోయింది. “అయితే ఈ గుర్రం మీద స్వారీ చేయవలసిందే! స్వారీ చేయడం మీరు నేర్పాలి” అన్నది యువరాణి

“మీరు ఇంకా చిన్నవాళ్ళమ్మా! గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి.  కొద్దీ కాలం పోతే మహారాజా వారు మీకు అన్నీ నేర్పిస్తారు” అన్నాడు వనమాలి.

“లేదు. నేను ఇప్పుడే నేర్చుకుంటాను” అన్నది యువరాణి అసహనంగా నేలను కాళ్లతో  తన్నుతూ హఠం చేస్తున్నట్టుగా!

“మహా రాజా వారు ఒప్పుకోరమ్మా!” అన్నాడు వనమాలి సాధ్యమైనంత ఆమెను నిరుత్సాహపరుస్తూ.

“అయితే మనం మహారాజా వారికి చెప్పొద్దు” అన్నారు ఒకింత కొంటెతనం కళ్ళలో కదలాడుతుండగా!

వనమాలీ,యువరాణీ అలా మాట్లాడుకుంటూ ఉండగా సరిత గంతులు వేసుకుంటూ వచ్చి, యువరాణి పక్కన తల దించుకుని నిలబడింది.

ఆ మరునాడు నుండీ మొదలయిన గుర్రపు స్వారీ పాఠాలు త్వరలోనే యువరాణీ వారికి ఒక పిచ్చిలా మారాయి. సితార ఒక్క సారికూడా అవిధేయంగా ప్రవర్తించలేదు యువరాణీ తో. వాళ్ళిద్దరి మధ్యా వున్న లేత సంబంధం చూసి వనమాలి ఆశ్చర్య పోయేవాడు. అలా నాలుగేళ్లు గడిచాయి

ఈ నాలుగేళ్ల లో సరిత  పూర్తి స్థాయి గుర్రం లా మారిపోయింది. యువరాణి సుజాష కూడా బాల్యాన్ని వీడి యవ్వనవనం లోకి ప్రవేశించారు

ఆ రోజులలో ఒక అనూహ్యమైన సంఘటన ఒకటి జరిగింది

ఆ రోజు సరిత  యువరాణి ని తన మీద ఎక్కించుకుని పరుగు తీస్తోంది. రాజధాని సరిహద్దులు దాటి చాలా ముందుకు వచ్చారు. ఎదురుగా

 సరిహద్దులను మూసివేస్తూ ఒక పెద్ద కొండ. పరుగులు తీస్తున్న సరిత ఎదురుగా వున్న కొండను చూసి ఆగిపోయింది.కానీ వెనుతిరగడం ఇష్టం లేని యువరాణి సరిత డొక్కలో బలంగా తన్నింది ముందుకు సాగమని. సరిత యువరాణి ఆజ్ఞను కాదనకుండా ఎదురుగావున్న ఎత్తైన కొండను ఎక్కసాగింది. తన దృష్టి నంతా కొండ పైభాగం వైపు ఉంచి సరిత ముందుకు సాగుతోంది. హఠాత్తుగా, సరిత  వెనుక కాళ్ళ గిట్టలకింద రాయి ఒకటి జారి నడక నిలకడ తప్పింది. వెంటనే అతిప్రయత్నం మీద గిట్టలను భూమిలోకి బలంగా వత్తిపట్టి నిలబడటానికి ప్రయత్నం చేసింది.

హఠాత్తుగా యువరాణికి 

“యువరాణి దయచేసి కిందకు దిగుదాము.నా కాళ్ళు తడబడుతున్నాయి, ఏ క్షణం లో అయినా నేను కిందపడిపోతాను” స్పష్టంగా, వినిపించిందో గొంతు. అక్కడ మానవమాత్రులు ఎవరూ లేరు. కేవలం తను, సరిత మాత్రమే. మరి ఆ గొంతు కచ్చితంగా సరితదే ! ఒక జంతువు మాట్లాడటాన్ని వినడం అదే మొదటి సారి యువరాణికి.

 “నువ్వు నిజంగా మానవుల భాషలో మాట్లాడుతున్నావా?” ఆశ్చర్యంగా అడిగింది యువరాణి సరితని.

“అవును. కానీ మీరు మాత్రమే నా మాటలు వినగలుగుతారు, అర్ధం చేసుకోగలుగుతారు.” అన్నది సరిత.

ఆ మాటలు విన్నాక యువరాణి కూడా కిందకు దిగాలి అనుకుంది. మెల్లగా సరిత కొండ కిందకు దిగసాగింది. దాదాపు ఎనభయ్ అడుగులు కొండ పైకి ఎక్కింది సరిత.

“ఈ ప్రపంచం మొత్తం మీద నువ్వే అద్భుతమైన గుర్రానివి. సరితా!” అన్నది యువరాణి ఆశ్చర్యం తో కూడిన ప్రశంస తో సరిత  మెడను ఆప్యాయంగా నిమురుతూ.

సరిత “మీరు మాత్రం మా అందమైన,అద్భుతమైన యువరాణి కాదూ”! అన్నది సరిత  బదులిస్తూ. ఈ సంఘటన తరువాత సరిత కీ యువరాణి కీ నడుమ బంధం మరింత పెరిగింది. యువరాణి  ఎక్కడ ఉంటే సరిత కూడా అక్కడే ఉండేది. యువరాణి సాహిత్యం చదువుతుంటే సరిత పక్కనే ఉండేది. యువరాణి యుద్ధ విద్యలు నేర్చుకుంటుంటే కూడా సరిత  అక్కడే ఉండేది. వాళ్ళిద్దరి మధ్యా వున్న అనుబంధాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. ఒక మూగజీవికి,ఒక యువరాణి కి నడుమ ఉన్న బంధం దైవిక సంబంధం అని అనుకునేవారు

**************

ఒకరోజు రాత్రి పూట యువరాణి పడకగది నుండి అరుపులు, కేకలు వినపడ్డాయి. రాజసేవకులు, భటులు అందరూ యువరాణి గది వైపు పరుగెత్తారు. యువరాణి మంచం మీద కూర్చుని కళ్ళ నిండా నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది. ఏమయిందో ఎవరికీ అర్ధం కాలేదు.

ఏమైందని అడిగితే

” ఒక మనిషి తన దగ్గర ఉన్న ముసలి ఎద్దును కనికరం, జాలి లేకుండా కొడుతూ, ఇంటి బయటకు నెట్టేశాడని ఇప్పుడా ఎద్దు రాజభవనం ముందు వున్నదని, దాన్ని తిరిగి దాని ఇంటికి చేర్చాలని “చెప్పింది.

ముసలి ఎద్దు ఏమిటి? ఒక మనిషి దానిని హింసించడం ఏమిటి యువరాణి ఏదో  పీడకల కనివుంటుందని యువరాణి చెలికత్తెలు అన్నారు. కానీ యువరాణి “ఆ మనిషిని తాను  స్వయంగా చూశానని” బలంగా చెప్పడం తో, సేవకులు రాజభవనం గేట్లు తెరచి ఆ ముసలి ఎద్దు ఎక్కడ వున్నదో వెతకడం మొదలుపెట్టారు. దక్షిణం గేటు దగ్గర ముసలి ఎద్దు నిలబడివుంది యువరాణి  చెప్పినట్టుగానే! వెంటనే ఆ ఎద్దు యజమానిని కూడా పట్టుకున్నారు. ఆ ఎద్దు ఇంటికి తిరిగి వెళ్ళింది అని తెలిశాకనే, యువరాణి నిద్రకు ఉపక్రమించింది.

రోజులు గడుస్తున్న కొద్దీ అలాంటి సంఘటనలు ఎక్కువసాగాయి. యువరాణి మాటలమీద నమ్మకం కుదరడం తో రాజ పరివారం ఆమె కోరికలు తీర్చడానికి సర్వదా సిద్ధంగా వుండేవాళ్లు. యువరాణి కోరికలు ఒక్కొక్కసారి చాలా వింతగా ఉండేవి. ఒకసారి జంతు ప్రదర్శన శాల  నుండి ఒక ముసలి సింహాన్ని అడవిలోకి వదిలివేయాలని కోరింది. పక్షులను పట్టుకుని అమ్ముకోవడం, కోతులను ఆడించడం లాంటి వృత్తులు రాజ్యం నుండి అదృశ్యం అయ్యాయి. కూతురు కోరికలను కాదనలేక రాజ్యపాలన  లో చాలా మార్పులు చేశారు. జంతు బలులు నిషేధించారు. ప్రజలందరూ మాంసాహారం మానివేసి శాకాహారులు గా మారిపోయారు.   

యువరాణి కి పదహారేళ్ళ వయసు వచ్చినరోజున రాజ్యమంతా ఒక పెద్ద ఉత్సవం చేశారు. యథావిధి గా రాజప్రాసాదం నుండి పేదవారికి కానుకలు అందాయి. సర్వమత ప్రార్ధనలు జరిగాయి. వేదాశీర్వచనాల అక్షింతలు కురిశాయి. దానధర్మాల  కార్యక్రమాల తంతు ముగిశాక యువరాణి పట్టువస్త్రాలలో, ఆకుపచ్చరంగు వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించి, అపురూపమైన సౌందర్య కాంతి ఎల్లెడలా ప్రసరిస్తూ ఉండగా అశ్వశాల కి వెళ్లి సరిత కి ఇష్టమైన ఆహారాన్ని తన చేతులతో అందించింది.

“ఈ దుస్తులలో, ఈ ఆభరణాలలో నేను ఎలా ఉన్నానో చెప్పు సరితా?” అని అడిగింది యువరాణి తన వంక తానే  తేరిపారా చూసుకుంటూ.

“నాకు సంబంధించినంత వరకూ ఈ ప్రపంచం లో అత్యంత అందమైన అమ్మాయివి నువ్వే! ఏ దుస్తులు ధరిస్తే మాత్రమేమిటి?” అన్నది సరిత

“అమ్మ నీలి రంగు దుస్తులు ధరించమన్నది. నాకేమో తెలుపంటే ఇష్టం కదా! అమ్మ మాట కాదనలేక ఇవి వేసుకున్నాను. ఈ రంగు నాకు సరిపోయిందా?” మళ్ళీ అడిగింది యువరాణి.

“ఈ దుస్తులు కూడా బావున్నాయి యువరాణి. మీకు పదేళ్ల వయసున్నప్పుడు ఒక నీలం రంగు పరికిణీ ధరించి తోటలోకి వచ్చి మీరు పచ్చటి పచ్చిక మీద పరుగులు తీసున్నప్పుడు అచ్చు శీతాకోక చిలుక లా వున్నారు. నా కళ్ళ  ముందు ఆ దృశ్యం ఇంకా తాజాగానే వున్నది యువరాణీ!” అని సరిత  తల  కాస్త కిందకు వంచి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని

,”ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ నా చూపు కాస్త మందగించింది. ఒక రంగును చూసి మరొక రంగు అని భ్రమపడుతున్నాను” అన్నది సరిత

“ఎందుకలా?”  యువరాణి అడిగింది సరిత  వంక ప్రేమగా చూస్తూ  

“అదే సృష్టి వైచిత్రం యువరాణీ! మానవులకు వయసు వచ్చి చుట్టూ వున్న లోకం అంతా అందంగా అద్భుతంగా కనిపించే సమయానికి జంతు లోకం లో యవ్వనం క్షీణించడం మొదలు పెడుతుంది. ఇప్పటికే నా చూపు, ఘ్రాణ శక్తీ సన్నగిల్లాయి. ఇంకా ఎంతో  కాలం నేను పరుగెత్తలేను కూడా! ఆ వయసు వచ్చేవరకు జంతువులు  సహజ మరణం పొందకపోతే అవి యజమానులు చేతిలో వధించబడటం ఖాయం”

ఆ మాట వింటూనే యువరాణి కంపిత స్వరం తో “అలాంటి స్థితి నీకెప్పటికీ రానివ్వను సరితా!” అన్నది.

“కానీ, అదే నిజమైన విషాద వాస్తవం యువరాణీ!” అన్నది తాత్వికంగా సరిత

సరిత మాటలకు యువరాణి హృదయం దుఃఖం తో నిండిపోయింది. అంతఃపురానికి వెళ్లిన తరువాత వనమాలిని పిలిపించి సరిత ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. యువరాణి మాటలు విని చిన్న చిరునవ్వుతో సరిత  యువరాణికి ఎంత ప్రియమైనదో తనకు తెలుసు కనుక సరిత  విషయం లో ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనీ, ఇకముందు మరింత జాగ్రత్తగా వుంటాను అనీ వనమాలి చెప్పాడు.

ఆ తరువాత ఎప్పుడూ యువరాణి సరిత వీపుమీదకు ఎక్కి స్వారీ చేయలేదు. దూర, దూర ప్రయాణాలకు సరితను వినియోగించలేదు. అన్నిటికీ మించి సరితను అశ్వశాల నుండి విడదీసి, రాజధాని సరిహద్దులలో ఉన్న  పచ్చ పచ్చటి పచ్చిక మైదానం లోకి పంపించారు. అక్కడ సరిత తనకు ఇష్టమైన ఆహరం తీసుకునే ఏర్పాట్లు  చేశారు. యువరాణి తరచూ సరిత  దగ్గరకు వెళ్లి, చూసి వస్తూ ఉండేది.

కాలం అలా ఎవరి ప్రమేయమూ లేకుండా గడిచిపోతున్నది.

“ఇవాళ మీరెందుకో అసహనంగా ఉన్నారు యువరాణీ!” అన్నది సరిత  ఒకరోజు సాయంత్రం తనను కలవడానికి వచ్చిన యువరాణితో.   

అప్పటికే కళ్ళకు మసకలు కమ్మి మసక మసక గా కనిపిస్తున్నా ఆరోజు యువరాణి ప్రత్యేకమైన దుస్తులు ధరించి, మరింత ప్రత్యేకంగా అందంగా కనిపించడాన్ని వూహించగలిగింది.

” సరితా! నీకో విషయం  తెలుసా! ఈ రోజు నేనొకరిని కలిసాను. అమ్మతో కలిసి గుడికి వెళ్ళాను నేను. మధ్యలో తోట లో చంపక పువ్వులు

 కోసుకోవడం కోసం నాకు కొంచెం ఆలస్యమయింది. అమ్మ ముందుకు వెళ్ళిపోయింది. అమ్మను కలవాలని గబగబా వెళుతూవుండగా ఒకతనిని ముఖాముఖీ ఎదురుపడ్డాడు. అతడు పక్క రాజ్య రాజకుమారుడు సుజయ్.”

ఒక్క క్షణం ఆగి గుండెలనిండా గాలి పీల్చుకుని మళ్ళీ యువరాణి చెప్పసాగింది.

“అతడు ఈరోజు ఉదయమే మన రాజప్రాసాదానికి వచ్చాడట. అతడితో నా వివాహానికి సంప్రదింపులు జరుగుతున్నాయట. అందుకే నన్ను చూడటానికి ఈ రోజు వచ్చాడట.” అని పదినిముషాల పాటు మౌనంగా ఉండిపోయింది. ఆ తరువాత గొంతు పెగల్చుకుని మెల్లగా తనకు తానే  చెప్పుకుంటున్నట్టు

 ” అతడు చాలా అందంగా వున్నాడు. చాలా దయార్ద్ర హృదయుడు అని కూడా అమ్మ ద్వారా విన్నాను. ఇవాళ నాన్నగారు “వేట లో అతడి నైపుణ్యం ” చూడాలని అన్నారట. అంత అందమైన వాడు అలా జంతువులను ఎలా క్రూరంగా వేటాడగలుగుతాడు? ఒకవేళ నేను కనుక అతడిని పెళ్లాడవలసి వస్తే వేటాడటం మానేయమని చెపుతాను. వేటను వదిలిస్తేనే మన పెళ్లి జరుగుతుంది అని చెప్తాను” అన్నది.

సరిత యువరాణి వంక మౌనంగా చూస్తూ ఉండిపోయింది.

“అవునూ మహారాజా వారు ఈ సంబంధాన్ని ఎలా తీసుకుని వచ్చారు. యువరాజు మీ అంచనాలకు, అభిరుచులకు తగినట్టే వున్నాడా?’ అని అడిగింది ముందుగా తేరుకున్న సరిత

“ఏమో! ఏం చెప్పాలో తెలియడం లేదు. అతడి రూపం ఆహ్లాదకరంగా వుంది. మధురంగా మాట్లాడుతున్నాడు. కానీ లోపల ఏమున్నదో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? ఒక సారి చూడగానే ఎవరి వ్యక్తిత్వమైనా ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? నువ్వు చెప్పు. కానీ నా తల్లి తండ్రులు మాత్రం ఆ యువరాజుకు ఇచ్చి పెళ్లి చేసేట్టే వున్నారు. రెండు రాజ్యాల ప్రజలు కూడా ఈ వివాహాన్ని ఆమోదిస్తారు అనుకుంటాను. ఎందుకంటే ఈ పెళ్లి ద్వారా రెండు రాజ్యాలు కలిసిపోతే అన్ని విధాలా బలంగా తయారవుతుంది కదా!” అన్నది యువరాణి

“కానీ మీ హృదయం ఏమి చెపుతున్నదో  అది ముఖ్యం కదా!”  అన్నది సరిత

“ఒక యువరాణికి హృదయం ఉండటాన్ని రాజ్యం ఒప్పుకుంటుందా? ఒక యువరాణి పుట్టీ పుట్టగానే ఆ రాజ్యపు ఆస్తి అయిపోతుంది. అందుకే ఆమె పుట్టుకే రాజ్యానికి ఒక వేడుక అవుతుంది. పెరిగి,పెద్దయి, యుద్ధ విద్యలు నేర్చుకుని, పాఠశాల కు వెళ్లి చదువుకుని ఇలా ప్రతి సందర్భం లోనూ ఆమె రాజ్య గౌరవాన్ని ఇనుమడింప చేయాలి. కచ్చితంగా ఏ యువరాణి అయినా ప్రజలు ఇచ్చే ప్రేమకు, అనురాగానికి బదులుగా ఏదో  ఒకటి త్యాగం చేయవలసిందే! అది మనసు లాంటి గొప్ప విషయమైనా సరే!” అన్నది యువరాణి నిర్వేదంగా

“యువరాణి అంతరంగంలో సంతోషంగా ఉన్నట్టు లేరు. మీ మనసు లో ఇంకా ఎవరైనా వున్నారా?యువరాణీ” అనునయంగా అడిగింది సరిత

“లేదు. లేదు అలాంటిది ఏమీ లేదు. సుజయ్ యువరాజు నిజంగా మంచివాడు. కానీ నా హృదయం లోనే ఒక సందేహం సుడులు తిరుగుతున్నది. నిజమైన రాజు జంతువులను వేటాడుతాడా?’

ఆ తరువాత ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకోలేదు. మెల్లగా ఎప్పటికో యువరాణి రాజప్రాసాదం లోకి వెళ్ళిపోయింది

యువరాణి, సుజాషా, యువరాజు సుజయ్ ల వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది. రెండు రాజ్యాలలోనూ సంబరాలు మిన్నంటినాయి. యువరాణిని అత్తవారింటి కి పంపుతున్నప్పుడు ఒక్క మహారాజు మాత్రమే కాదు, రాజ్యం లోని చెట్టూ,చేమా, పుట్ట, గుట్ట సమస్త ప్రాకృతక శక్తులూ కన్నీళ్లు కార్చాయి.

అత్తవారింటికి వెళ్ళడానికి ముందు రోజు యువరాణి సరిత  దగ్గర చాలా సేపు గడిపింది.

“ఇక నీ గురించి నువ్వే జాగ్రత్త తీసుకోవాలి సరితా!” ఆ మాటలు చెపుతున్నప్పుడు యువరాణి గొంతు దుఃఖం తో పూడుకుని పోయింది. చెంగుమని తాను కొన్ని వందల సార్లు ఎగిరి కూర్చున్న సరిత నడుమును ప్రేమగా నిమురుతూ, “ఎక్కువ ఒత్తిడి పడకు.” అని చెప్పి వెళ్ళిపోయింది. అత్తారింటికి పంపించేటప్పుడు సాంప్రదాయకంగా, బహుమతులుగా  పంపించే, ఏనుగులు, గుర్రాలు, లాంటివి ఏవీ తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు. అది సంప్రదాయం, రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పినా ఆమె ససేమిరా అన్నది. 

కొన్నాళ్ళకు యువరాణి కాస్తా మాతృమూర్తి అయింది. ఒక బాబు, ఒక పాప కలిగారు.  ఆమెకు సంబంధించి రాజప్రాసాదానికి చేరే ఏ వార్తను అయినా సరిత  ఆసక్తి గా వినేది చెవులను కష్టపెట్టి మరీ!   వనమాలి ఎంత శ్రద్ధ తీసుకున్నా సరిత  ఆరోగ్యం రోజు రోజు కీ క్షీణించసాగింది.  

******************************

రాకుమారి  పుట్టింటికి వచ్చిందని ఆమె కొన్నాళ్ళు ఇక్కడే వుండబోతున్నదని  తెలిసిన సరిత లేని ఓపిక తెచ్చుకుని రాజోద్యానవనానికి బయలుదేరింది.  సరిత  రావడాన్ని చూసిన రాకుమారి ఇతర అతిధులకు వీడ్కోలు చెప్పి సరిత వైపు పరుగు తీసింది.  అలా ఇతర అతిధులకు వీడ్కోలు చెప్పి తనను చూడగానే తన వంక పరుగెత్తుకుంటూ వస్తున్న రాకుమారిని చూడగానే సరిత  హృదయం ఆనందం తో ఉప్పొంగింది. తనూ  వడివడిగా అడుగులువేస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది తన కళ్ళను తానే  నమ్మలేనట్టుగా!

ఇలా తెల్లగా పాలిపోయి దిగులు చూపులతో ఎదురుగా వున్న ఈ మనిషి తన రాకుమారా? సరిత  కళ్ళు చికిలించుకుని మరీ చూసింది. ఆమె నడకలో రాజసం వున్నా, మొహం లో ఆ మొరటుదనమేమిటి? రాకుమారి తన కళ్ళలోని తేజస్సును కోల్పోయింది. సరిత హృదయం చెప్పలేని భయం తో నిండి పోయింది. తన ప్రియమైన సరిత  ఎదురుగా కనిపించగానే రాకుమారి పరుగున వచ్చి కౌగలించుకుని వెన్ను నిమురుతూ

“ఎలా వున్నావు?సరితా! నేను బాగా గుర్తుకు వచ్చానా?’ అన్నది

సరిత  ఏమీ మాట్లాడలేకపోయింది. హృదయం దుఃఖం తో నిండిపోయింది

” అంతా సజావుగా ఉన్నదా? యువరాణీ! మీ కొత్త జీవిత ఎలా వుంది?” అని అడిగింది ఎలాగో గొంతు పెగల్చుకుని.

“నేను వుంటున్నది ఒక వింత దేశం.” రాకుమారి చెప్పడం మొదలు పెట్టింది. “వాళ్ళ దేశం లో అద్భుతమైన ఉద్యానవనాలు వున్నాయి. పరిమళాలు వెదజల్లే పూల మొక్కలను పెంచుతారు. కానీ వాళ్లకు పరిమళాన్ని ఆస్వాదించడం, రుచి చూడటం తెలియదు. బహుళ వర్ణ పూల మొక్కలు మైళ్ళ పొడవునా విస్తరించి వున్నా వాటి సౌందర్యానికి ఎవరూ మూర్ఛనలు పోరు. పైగా వాటిని తెంపి, పెట్టెలలో కుక్కు ఇతరదేశాల ఎగుమతి చేస్తారు. వాళ్ళెవరికీ నక్షత్ర కాంతులతో విరాజిల్లే ఆకాశాన్ని విప్పారిన కళ్ళతో చూసే అలవాటు లేదు. మంచు తో తడిసిన పచ్చటి పచ్చిక మీద నగ్న పాదాలతో నడవడం లో వున్న  ఆనందం తెలియదు. వేసవి లో తొలకరి వాన భూమిని ముద్దాడినప్పుడు వ్యాపించే మట్టి సువాసనను వాళ్లెప్పుడూ ఆఘ్రాణించి వుండరు. కనీసం వెన్నెల రాత్రులలో నదీ ప్రవాహపు చప్పుడును  కూడా ఎప్పుడు వినివుండరు.”

రాకుమారిని మధ్యలోనే ఆపుతూ “నాకు అర్ధం అయింది. యువరాణీ! మీరింకా వివరించవలసిన పని లేదు” అన్నది సరిత

ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.

హఠాత్తుగా “ఈ తోట చివర వున్న చెరువు ను చూడాలని వుంది. అందులోని కలువ పువ్వులను చూసి ఎన్నాళ్ళు అయిందో!” అన్నది రాకుమారి. ఇద్దరూ సరస్సు వైపు నడిచారు. రాకుమారి ఉద్వేగం తో నడుస్తుంటే సరిత  మౌనంగా అనుసరించింది. సరస్సు లో ఎప్పటిలాగే కలువపూలు చాలా తాజాగా వున్నాయి.

“ఈ చెరువు  మీరు తవ్వించిందే కదా!” సరిత రాకుమారి కి గుర్తు చేసి “మీ అత్తవారింట్లో కూడా ఇలాంటి తటాకాన్ని  ఒకదానిని తవ్వించవచ్చు కదా. కావలసినన్ని కలువపూలు”అన్నది సరిత

“లేదు. అక్కడ  కవికసించిన కలువ పూలు  చూసే సమయం ఎవరికీ వున్నది? నేనక్కడ చేయగలిగిందల్లా రెండు రోజులకు ఒకేసారి సూర్యాస్తమయాన్ని చూడటమే!” అన్నది రాకుమారి

“బుల్లి రాకుమారుడు, రాకుమారి మీతో ఎందుకు రాలేదు. మేమంతా వాళ్ళను చూడాలని ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా?” అన్నది సరిత

“ఓహ్! వాళ్ళా? వాళ్ళక్కడ బావున్నారు. ఎంతయినా రాజ్యం ఆస్తులు కదా వాళ్ళు.” అన్నది రాకుమారి

“మనం అలా ఇంతకుముందు వెళ్ళినట్టే  అడవిలోకి వెళదాము”   అన్నది రాకుమారి.

ఒకరితో మరొకరు మాట్లాడకుండా మౌనంగా తోటను దాటి రాజ్య సరిహద్దులు దాటి అడవి వైపు నడవ సాగారు. ఎదురుగా కనిపిస్తున్న విశాలమైన  అరణ్యాన్ని విప్పారిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది రాకుమారి సమయం ఎంత గడిచిందో గమనించకుండా! “

చివరకు నిశ్శబ్దాన్ని సరిత  ఛేదించి”రాకుమారీ! చాలా సమయం అయింది. మనమిక తిరిగి వెళ్ళాలి. అక్కడ రాజప్రాసాదం లో అందరూ మీ కోసం ఎదురు చూస్తూ వుంటారు” అన్నది.

కానీ, రాకుమారి అదేమీ విననట్టు మౌనంగా కూర్చుంది. ఆమె ఒక మత్తు లో మైమరపులో ఉన్నట్టుంది కదలిక లేకుండా. మెల్లగా అదృశ్యం అవుతున్న సూర్యకాంతి లో అడవి మార్మికంగా కనిపిస్తున్నది. సంవత్సరాలుగా పొరలు పొరలుగా పేరుకుపోయిన, చిరాకు పుట్టించే నిశ్శబ్దం చివరకు అస్తమయ సూర్య కాంతి రంగును పొందినట్టుంది. కిలకిలలాడే పక్షుల గుంపులు అడవిలోకి వెళ్లి, ఆ ఎరుపు రంగులో అదృశ్యం అవుతున్నాయి. వాతావరణం అంతా ఒక వింత నిశ్శబ్దం లో చుట్ట చుట్టినట్టుంది.

  “నా అస్తిత్వం అంతా క్రమక్రమంగా క్షీణించే పోయే దశలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. నాలోంచి నేను పూర్తిగా వెల్లిపోయేలోగానే, ఈ మార్మికమైన భూమిలోకి తప్పించుకుని పోవాలని వున్నది” అన్నది రాకుమారి ఒక స్థిర నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు నిశ్శబ్దంగా వున్న అడవి వైపు చూపిస్తూ. “నువ్వు నాతో వస్తావా సరితా? ఇక్కడే కదా మనం ఉండవలసింది.” అన్నది

సరిత ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దం మెల్లగా గాఢం అవుతున్నది

సరితా మెల్లగా తన రెండు ముందు కాళ్ళూ వంచి కిందకు కాస్త వంగింది. రాకుమారి ఎగిరి సరిత నడుం మీద కూర్చుంది. సరిత అని పిలిపించుకునే ఆ ఆడ గుర్రం రాకుమారితో సహా లేచి నిలబడింది. మెల్లగా అడవిలోకి నడక సాగించింది. సరిత  శరీరం ఎలాంటి బలహీనతా ఆ క్షణం లో లేదు. అడవిలోతుల్లోకి వెళుతున్నకొద్దీ వాళ్లిద్దరూ నిశ్శబ్దంగా మారిపోయారు. సూర్యుడు అస్తమించాడు.

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *