‘పిచ్చోడి డైరీ’ Part 1

Spread the love

Part 1

అక్టోబరు 3.

*

ఈ రోజు ఓ వింత జరిగింది. నేను నిద్ర లేచేసరికి బాగా పొద్దు ఎక్కింది. తుడిచిన బూట్లు తీసుకుని మవురా వచ్చినప్పుడు, ‘ఎంత ఆలస్యం అయ్యిందివాళ’ అని అడిగాను. ‘పది దాటింద’ని చెప్పగానే చకచకా బట్టలేసుకుని రెడీ అయిపోయాను. నిజం చెప్పాలంటే నాకసలు ఇవాళ ఆఫీసుకు పోవాలనే లేదు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ హెడ్ అదోలా పురుగును చూసినట్టు చూస్తాడని నాకు ముందే తెలుసుగా! గత కొద్దికాలంగా నాపై చిర్రుబుర్రులాడటం అలవాటుగా మారింది వాడికి.

“చూడు మిత్రమా, నీ బుర్రలో ఏదో తేడా కొడుతోంది. నువ్వు తరచూ ఏదో పూనకం వచ్చినవాడిలా హడావిడి చేస్తావు, దస్తావేజుల గురించి రాసేటప్పుడు ఆ దెయ్యాలకు కూడా అర్థంకానీ ఏదో పైశాచీ భాషలో గీకేస్తావు. ఫైలు పేరు కూడా తప్పుల తడకలు, ఒక తేదీ వుండదు, దాని ముఖాన కనీసం నెంబరు కూడా రాసి వుండదు.”

పొడుగు కాళ్ళ వెధవ! వాడికి నేనంటే ఖచ్చితంగా పడదు. ఎందుకంటే నా సీటు డైరెక్టర్ గారి చాంబర్ లోనే వుంది కదా! పైగా నేను సారుగారివారి పెన్నులు వాడతానని కుళ్ళు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను ఆ అకౌంటెంట్ గాడి ముఖం చూడకూడదు అనుకుని వుంటే అసలు నేను ఆఫీసుకే పోయి వుండకూడదు. ఆ పిసినారి వెధవ నుంచి కొంత సాలరీ అడ్వాన్సు పిండుకుని వుండాల్సింది. 

మా అకౌంటెంట్ ఒక చెత్త నాయాలు! మన జీతం నుంచి అడ్వాన్సు అడిగినా వాడి బాబు సొమ్మేదో పోయినట్టు, ఆకాశాలు బద్దలైనట్టు నానా యాగీ చేస్తాడు. నువ్వు ఎంత అడుక్కుని గీ పెట్టినా, మొత్తం దివాలా తీసానని ప్రాధేయపడినా ఈ దెయ్యమోడు ఒక్క ఇంచు కూడా తొనకడు… బెనకడు…. ఇంట్లో వంటపని చేసేవాడు కూడా ఇతగాడి వ్యవహారం తట్టుకోలేక వీడి గూబ గుయ్యిమనిపిస్తుంటాడని అందరికీ తెలుసు. ఎవరయినా మా డిపార్టుమెంటులో పనిచేసి ఏం బావుకున్నారో నాకయితే తెలియదు. అక్కడ లక్షలేమీ పొంగిపొర్లడం లేదు. కానీ, ఆర్థిక, న్యాయ శాఖల తతంగం వేరేలా వుంటుంది. అక్కడ ఓ దద్దమ్మ ఒక మూలకు కూలబడి రాస్తూ, రాస్తూనే వుంటాడు. వాడి దగుల్బాజీ కోటు, అంతే దరిద్రమైన వాడి ముఖం, ఆ పక్కనే వుండే ఓ చెత్త మగ్. చూడగానే ఆ మగ్ లో ఉమ్మేసినట్టే వాడి ముఖం మీద ఉమ్మేయాలనీ అనిపిస్తుంది. కానీ వాడు ఊర్లో అద్దెకు వుండే ఇల్లు ఎంత దర్జాగా వుంటుందో తెల్సా. మనం గిల్టు పోర్సలీను కప్పును గిఫ్ట్ గా ఇచ్చినా కూడా తీసుకునేందుకు అతగాడు నీలుగుతాడు. పైగా, “అది మీ ఫ్యామిలీ డాక్టరుకు ఇవ్వండి,” అనేస్తాడు. రెండు నశ్యం రంగు మేలిమి గుర్రాలో, ఒక గుర్రపు బగ్గీనో, లేదా బీవర్ ఎలుక ఊలుతో చేపిన ఫర్ కోటో కానుకగా ఇస్తేనే అతని కళ్ళు చల్లబడతాయనుకుంటా. అప్పటికీ కూడా గంభీరంగా, నెమ్మదిగా, “దయచేసి మీ పేనాకత్తి కొంచెం ఇస్తారా, నా పాళీ చెక్కుకుని ఇచ్చేస్తాను,” అంటాడు.

అదలావుంచితే, తన దగ్గరకు దావా వేసేందుకు వచ్చిన ఎలాంటి వ్యక్తినయినా తూట్లుతూట్లు కుళ్ళబొడిచి వాడు పూరా దివాళా తీసేదాక పిండుకోగల ఘనుడు. మా ఆఫీసులో అలాకాదు. ఏం జరిగానా అంతా ఒక పద్ధతిగా, పెద్దమనిషి తరహాలో జరుగుతుంటుందనుకోండి. ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీరు ఎక్కడా చూడని శుభ్రత, దర్పం మా కార్యాలయంలో కనిపిస్తుంది. ఫర్నిచరు అంతా దేవదారు కలపవే. పైగా అందరినీ అందరూ ‘సార్’ అనే పిలుస్తారు. నిజం చెప్పాలంటే ఈ మాత్రం మర్యాదా, మట్టసం వుండబట్టే నేను ఇంత దాకా నా రాజీనామా వాళ్ళ ముఖాన కొట్టలేదు. చిన్నగా జల్లు పడుతోందని నా పాత వేషం వేసుకుని, గొడుకు తీసాను. వీధుల్లో ఎక్కడా జనం లేరు, అక్కడక్కడా ఆడవాళ్ళు జల్లు పడకుండా తమ గౌన్లను నెత్తిన కప్పుకుని పోతున్నారు. ఒకటీ అరాగా ఏ జట్కా వాడో, లేదా ఓ దుకాణాదారుడో గొడుగులతో కనిపిస్తున్నారు. ఇక డబ్బున్నోళ్ళంటారా, అక్కడక్కడా ఎవరో ఓ అధికారి కనిపిస్తున్నాడు. అట్లాంటి ఓ వ్యక్తిని వీధి దాటుతూ చూసి ఆగి, నాతో నేనే ఇలా అనుకున్నాను: “మిత్రమా! నువ్వు ఈ రోజు ఆఫీసుకు పోవడం లేదు. నీకు ఎదురుగా నడుస్తోందే ఆ మహిళ వెంటే వెళ్తున్నావు. ఎలాగంటే, మన అధికారులు తమకు ఎదురుపడిన ప్రతీ పావడా వెంట ఎలాగయితే పడతారో, అచ్చం అలాగే అన్నమాట.”

అలా నా ఆలోచనలు రైలు బోగీలలా కదులుతూ వుండగా, నేను దాటబోతున్న ఓ దుకాణం ముందు ఓ పెద్దింటి బగ్గీ వచ్చి ఆగింది. నేను చటుక్కున గుర్తు పట్టాను. అది మా డైరెక్టరువారి గారి బగ్గీ. ‘అతనికి ఇక్కడేం పని,’ అనుకుని, ‘వాళ్ళ అమ్మాయి కాబోలు, అయివుంటుంది,’ అని తమాయించుకున్నాను.

గోడ పక్కన నక్కి దాక్కున్నాను. నేను అనుకున్నట్టే, ఆ అమ్మాయి బగ్గీలోంచి ఒక గువ్వలా వాలింది. అబ్బా ఎంత దర్పంగా అటూఇటూ తల తిప్పింది. ఎంత బాగా తన కనుబొమ్మలు ముడివేసి కళ్ళ నుంచి మెరుపులు కురిపించిందీ. ఓరి దేవుడా! నిండా పడిపోయా, కుప్పకూలిపోయా. ఇంతకీ ఏం కొంప మునిగిందని ఈ వానలో బయటికి వచ్చి వుంటుంది? ఆడవాళ్ళకు ఎంతసేపూ వాళ్ళ సొగసు తప్ప మరేదీ పట్టదంటారు. నన్ను గుర్తు పట్టనేలేదు. నేను ముడుచుకుపోయాను. నేను కప్పుకున్న వేషం ఎప్పటిదో, చాలాచాలా డొక్కుది, పైగా కంపుకొడుతోంది. పైగా ఇట్లాంటి వేషంతో ఆమె కంట పడనేకూడదు. ఇప్పుడు అంతా పెద్ద కాలర్ రెయిన్ కోట్లు మాత్రమే వేసుకుంటున్నారు. నాది చిన్న డబల్ కాలరు, పైగా నాసిరకం మెటీరియల్ ది. ఆమె కుక్కపిల్లల దుకాణంలోకి వెళ్ళలేదు. బయటే వుండిపోయింది. నాకు ఆ కుక్క పిల్ల తెలుసు, దాని పేరు “మెగ్గీ.”

నేను అక్కడ ఒక నిమిషం అలా నిలబడిపోయాను. అప్పుడే విన్నాను ఒక గొంతు.

“ఎలా వున్నావు మెగ్గీ!”

ఎవరిదయి వుంటుంది ఆ గొంతు? చుట్టూ కలయచూసాను. దూరంగా ఇద్దరు మహిళలు గొడుగుకింద హడావిడిగా కదులుతున్నారు. అందులో ఒక ముసలావిడ, ఇంకొకరు అమ్మాయి. నిజానికి వాళ్ళు నన్ను దాటుకుని ఎప్పుడో వెళ్ళిపోయారు. మరి ఈ గొంతు ఎక్కడినుంచి వినిపించి వుంటుంది? మళ్ళీ వినిపించింది అదే గొంతు, “సిగ్గు లేదా, మెగ్గీ.”  

ఏంటిది? ఒక కుక్కని మెగ్గీ వాసన చూడటం గమనించాను. ఆ కుక్క ఆ ఇద్దరు ఆడవాళ్ళ వెంట వెళ్ళిపోయింది.

‘ఛీ… ఛీ…  ఏంటీ చెత్త’ అనుకున్నాను.

“నేనేమీ మందుకొట్టి లేను.”

“లేదు, ఫిడెల్, నీదే తప్పు,” దూరం నుంచి మెగ్గీ అనడం నేను విన్నాను.

“నేను, బౌ…బౌ…ఔ… నేను … బౌ…ఔ! ఔ! – బాగా లేను.”

ఎంత అద్భుతమైన కుక్క అది! నిజం చెప్పాలంటే, కుక్క అలా మనుషుల భాష మాట్లాడటం విని ఆశ్చర్యానికి గురయ్యాను. ఏమాటకామాటే చెప్పాలి; నిజానికి ఇదేం ముక్కున వేలేసుకునేంత వింత ఏమీ కాదు. ఇలాంటివి లోకంలో ఇదివరకే చాలా జరిగాయి. ఇంగ్లాండ్ లో ఒక చేప నీటి నుంచి తల బయటికి పెట్టి అద్భుతమైన భాషలో ఒకటి రెండు ముక్కలు మాట్లాడేసిందంట. మూడు సంవత్సరాలు ఆ మాటలకు అర్థం  చెప్పేందుకు పండితులు తల పట్టుకుని కూర్చున్నారంట. అయినా ఇప్పటికీ ఒక్క ముక్కా విడమర్చలేకపోయారంట. మరోచోట రెండు ఆవులు ఒక దుకాణంలోకి వెళ్ళి ఒక గ్లాసుడు టీ ఇమ్మని అడిగాయాని ఓ దినపత్రికలో వార్త కూడా అచ్చయ్యింది. అదలా వుంచితే, మెగ్గీ ఆ తర్వాత అన్న మాటలు మాత్రం మరీ విడ్డూరం.

“ఫిడెల్, నేను నీకో ఉత్తరం రాసాను. బహుశా పోల్కన్ నీకు ఆ ఉత్తరం అందచేయలేదనుకుంటా,’’ అంది మెగ్గీ.

కుక్కలు ఇలా గతంలో ఉత్తరాలు కూడా రాసాయని తెలిస్తే నేను నా ఒక నెల జీతం వదిలేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఇది నన్ను తత్తరపాటుకు గురిచేసింది. గత కొద్ది కాలంగా నేను ఇతరులకు వినిపించని సంగతులు విన్నాను, కనిపించని విషయాలు చూసాను.

‘అసలు ఈ సంగతేమిటో నిగ్గు తేల్చాలని,’ ఆ కుక్క వెంట పోదామనుకున్నాను నేను.

‘వెళ్తాను.’

అలా అనుకున్నవెంటనే నా గొడుగు తీసుకుని ఆ ఇద్దరు మహిళల వెనకే నడిచాను. ముందు వాళ్ళు బీన్ వీధిలోకి వెళ్ళారు, తర్వాత సిటిజన్ వీధి దాటారు, ఆ తర్వాత కార్పెంటర్ వీధి దాటి నేరుగా కుకూ వంతెన ఎదురుగా వున్న పెద్ద ఇంటి ముందు ఆగారు. ఆ ఇల్లు నాకు తెలిసిందే. అది స్వెర్కాఫ్ ది. వాడు చెత్త నాయాలు! ఆ ఇంట్లో ఎట్లాంటి ఎట్లాంటి వాళ్ళుంటారో తెలుసా? ఎంత మంది వంటవాళ్ళు, ఎంత మంది మూటలు మోసే కూలీలు, నాలాంటి ఉద్యోగులు కూడా అక్కడ డబ్బాలలో కుక్కేసి పెట్టిన చేపల్లా వుంటారు. ఆ ఇంట్లో నాకో మిత్రుడు కూడా వున్నాడు. వాడు కార్నెట్ బాగా వాయిస్తాడు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఐదో అంతస్తు చేరుకున్నారు.

‘భలే! ఫ్లాట్ నంబరు నోట్ చేసుకుంటాను, తర్వాతర్వాత విషయం కూలంకషంగా తెలుసుకునేందుకు నాకే పనికి వస్తుంది.’

*

అక్టోబరు 4.

ఈ రోజు బుధ వారం. ఎప్పటిలాగే నేను ఆఫీసులో వున్నాను. పని వుండి కాస్త ముందే వచ్చాను, కూర్చున్నాను, పెన్నులన్నీ తుడుచుకున్నాను. మా డైరెక్టరు వారు గారు చాలా తెలివైన వాడనుకుంటాను. అతని గది నిండా పుస్తకాల అరలే. నేను కొన్ని పుస్తకాల పేర్లు చదువుతుంటాను. అవి మేధావులవి. నాలాంటి శాల్తీలకు ఒక పట్టాన అర్థం అయ్యేవి కావవి. అవన్నీ ఫ్రెంచిలో, లేదా జర్మను భాషలో వున్నాయి.  నేను అతని ముఖం చూసినప్పుడల్లా, ఆ కళ్ళలో ఎంత దర్పం తొణకిసలాడుతుందో అని అనిపిస్తుంటుంది. ఒక్కటంటే ఒక్కమాట కూడా అతిగా, ఎక్కువగా, మీరి అతని నోటి నుంచి రానే రాదు. దస్తావేజులు తిరిగి ఇచ్చేటప్పుడు కూడా, “బయట వాతావరణం ఎలా వుంది?” అని వాకబు చేస్తాడు. అతను మన తాలూకు మనిషి కాదు. అతను ఒక నిజమైన వేత్త. నేనంటే అతనికి ఒక ప్రత్యేకమైన అభిమానం అనే విషయం గమనించాను.  ఇప్పుడు అతని కూతురికి కూడా… అర్రే… ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాను. ఇక ఇక్కడితో ఆ విషయం ఆపేస్తాను. నేను నార్తన్ బీ చదివాను. ఫ్రెంచి వాళ్ళు ఎంత మూర్ఖులు. వాళ్ళందరినీ ఒక పట్టు పట్టాలనుకుంటున్నాను. ఒక్కొక్కరినీ చితక్కొట్టాలని వుంది నాకయితే. అదే పత్రికలో కుర్స్క్ భూస్వామి ఇచ్చిన మహా విందు గురించి ఒక వ్యాసం కూడా చదివాను. ఎంతో బాగుంది. కానీ, ఏమాటకామాటే, కుర్స్క్ భూస్వాములు ఎంత చక్కగా రాస్తారో కదా! అప్పటికే పన్నెండున్నర అయ్యిందని గమనించాను. అయినా మా డైరెక్టరు తన బెడ్ రూం నుంచి బయటకే రాలేదు. అయితే ఒకటిన్నరకి ఏం జరిగిందో రాయాలంటే ఏ పెన్ను తరమూ కాదు. తలుపు తెరుచుకుంది. మా డైరెక్టరు వారు గారే వచ్చారని నా కుర్చీలోంచి అమాంతం ఎగిరిలేచి దస్తావేజులు పట్టుకుని వెళ్దును కదా, ఎదురుగా – ఆమె – అవును, తనే… గదిలోకి వచ్చేసింది. వామ్మో! ఎంత అందంగా వుంది ఆ డ్రస్సులో. ఆమె దుస్తులు హంస రెక్కల కన్నా తేలికయిన తెలుపులో మిలమిలమన్నాయి. ఎంత అద్భుతం, మహాద్భుతం. సూర్యోదయం. కాదు … స్వయానా సూర్యుడే!

“మా నాన్నగారు ఇంకా రాలేదా?” నాకు అభివాదం చేసి అడిగింది.

వాహ్! ఏం గొంతు! అడవికోయిల గొంతు అది. కాదు, కోయిలే.

“దొరసాని గారు, నాకు దయచేసి ఉరి వేయకండి, అంతగా కావాలనుకుంటే, అదే జరగాలని అనుకుంటే మీ అప్సరస హస్తాలతో నా ప్రాణాలు తీసేసుకోండి.” అని అరవాలనుకున్నాను. కానీ అలా అనలేదు. అలా ఎందుకు అనలేకపోయానో ఆ దేవుడికే తెలియాలి.

“లేదండి, తమరి తండ్రి గారు ఇంకా రాలేదండి.” అని మాత్రమే అనగలిగాను.

ఆమె నా వంక చూసింది, పుస్తకాల వంక తేరిపార చూసింది. తర్వాత తన రుమాలు జారవిడుచుకుంది. వెంటనే నేను గెంతి దాన్ని నేలమీద పడకుండా అందుకుందామనుకున్నాను. కింద చాలా నున్నగా వుండటంతో జారి కిందపడి ముక్కు పచ్చడయ్యింది. అయితే రుమాలును పట్టేసుకున్నాను. ‘ఓహోహో! ఏం రుమాలు! ఎంత మెత్తన, ఎంత సుకుమారం.’ జనరల్ స్థాయి పరిమళం వస్తోంది దాన్నుంచి. నాకు ధన్యవాదాలు చెప్పింది. ఎంత లలితంగా నవ్విందంటే ఆమె పంచదార పెదాలు దాదాపు కరిగిపోయేంతగా. గది అంతా ఆ పరిమళం అల్లుకుంది. అలా… అలా… ఒక గంట అక్కడ వేలాడిన తర్వాత,  ఒక నౌకరు వచ్చి, “ఇవానోవిచ్ గారూ మీరు ఇక ఇంటికి పోవచ్చు, డైరెక్టరుగారు బయటికి వెళిపోయారంట!” అన్నాడు. నాకు ఈ బంట్రోతులంటే పరమ చికాకు. తలుపుల దగ్గర వేళాడుతూ అటుఇటు వచ్చిపోయే నాబోటివాళ్ళకి కేవలం తల ఆడిస్తూ వుంటారు. కొద్ది సార్లు అయితే మరీ అతి కొడతారు. ఇలాంటి వెధవే ఒక సారి ఏం చేసాడో తెలుసా, కనీసం కుర్చీ నుంచి కూడా లేయకుండా తన నశ్యం డబ్బా నాకు అందివ్వబోయాడు.

‘పల్లెటూరి మొరటు సంత నాయాలా, నువ్వొక అధికారివనీ, పైగా నీది రాచ పుట్టుక అని నువ్వయినా తెలుసుకోపనిలేదా?’

అయితే… ఈ సారి, ఎందుకయినా మంచిదని నా టోపీ, ఓవరు కోటు నేనే తీసేసుకున్నాను. ఈ నౌకర్లు, చాకీర్లు మనకు ఈ శాదానం చేస్తారని అనుకోలేం కదా! ఇంటికి వెళ్ళాను. కాసేపు కునుకు తీసాను. నా నోట్సులో ఏదో కవిత రాసుకున్నాను:

“నిను చూసి గంట గడిచింది,

అదే ఏడాదిగా తోచింది;

నా ఉనికినే నేను అసహ్యించుకుంటే,

ఇక బతకడం ఎలా, ప్రియసఖీ?”

బహుశా ఇది పుష్కిన్ కవిత అనుకుంటాను. సాయంత్రానికల్లా మళ్ళీ నా కోటు వేసుకుని హడావిడిగా మా డైరెక్టరువారు గారి ఇంటివైపు నడిచాను. అక్కడే చాలా సేపు వేచి వున్నాను, కూతురు గారు ఏమయినా బయటికి వచ్చి బగ్గీ ఎక్కుతారేమో అని. ఒకే ఒక్కసారి చూద్దామనుకున్నాను తనని, కానీ రాలేదే!

*

నవంబరు 6.

మా పెద్ద గుమాస్తా అప్పటికే శివాలెత్తి వున్నాడు. నేను ఇవాళ ఆఫీసుకు రాగానే, నన్ను తన గదికి పిలిపించుకుని, ఈ కింది విధంగా మొదలుపెట్టాడు:

“ఇటు చూడు, నాన్నా, నీ బుర్రలో ఇంకా ఏమేమి వింత విచిత్ర ఆలోచనలున్నాయో ఒకసారి చెప్పు?”

“హ! వింతా? అలాంటవేమీ లేవే, అస్సలు,” బదులిచ్చాను.

“అయితే తమకే మంచిది. వయసా, నలభై దాటింది. ఇప్పటికే వచ్చి వుండాలి బుద్ధి. అసలు ఏమనుకుంటున్నావు నాయనా నీ గురించి? ఆ! నీ కంత్రీ వేషాలు నాకు తెలియదునుకుంటున్నావా? డైరెక్టరు అయ్యగారి కూతురు మీదే కన్నేస్తావా? ముఖం చూసుకున్నావా ఎప్పుడయినా? చూస్కో… నువ్వేంటో తెలుసుకో. చిల్లిగవ్వ నువ్వు, అర్థం అయ్యిందా? పైసాకు పనికిరావు, పైగా నేను నీ నెత్తిన ఒక్క పైసా కూడా పెట్టను, దండగ. పోయి అద్దంలో నీ ముఖం చూస్కో. నీ చెత్త దరిద్రానికి ఇట్లాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయిరా తండ్రీ!”

వీడిని దెయ్యం ఎత్తుకుపోను! ఎందుకంటారా, వీడి ముఖం చూడండి, అచ్చం జబ్బు చేసినపుడు మనం మందు తీసుకుంటామే అట్లాంటి సీసాలాగుంటుంది అది. వాడి నెత్తి మీద గుబురు పొదలాంటి వంకీల జుట్టు, ఒక్కోసారి ఆ పొదని సరాసరి పైకి దువ్వుతాడు, ఇంకోసారి ఇష్టానుసారంగా పాయలుపాయలుగా కిందికి పాకనిస్తాడు. తాను ఏమయినా చెయ్యగలను అనుకుంటుంటాడు పైగా. నాకు బాగా తెలుసు, నామీద అతనికి ఎందుకు ఇంత కోపమో! కుళ్ళు. బహుశా నేను అందరితోనూ అందుకునే ‘భలే’, ‘శభాష్’ లే కారణం అయివుండవచ్చు కూడా. అయితే నాకేంటి? నేను ఎందుకు పట్టించుకోవాలి! ఒక కౌన్సిలర్! అంతే అతను. అయితే మాత్రం ఏంటట! అతని చేతికి గడియారం, దాని చెయిను బంగారందే, అయితే మాత్రం ఏంటి? సరే, అతను ముప్పై రూబుల్స్ పెట్టి బూట్లు కొంటాడు, అయితే ఏంటీ అంటాను! నేను మాత్రం ఏమయినా సాదాసీదా దర్జీ కొడుకునా? లేక దారినపోయే దానయ్యనా? రాచ పుట్టుక నాది. నాకేం తక్కువ. నాకు నలభై రెండు, అంతే. ప్రతి సిసలైన మగవాడూ ఏం సాధించాలనుకున్నా మొదలు పెట్టేది అసలు ఇప్పుడే. మిత్రమా! కొంచెం ఆగు, నాకూ ప్రమోషన్ రావచ్చు, లేదా వస్తుంది, లేదా దేవుని దయవల్ల అంతకు మించే కావచ్చు రావచ్చు. అసలు నువ్వు తూచ్ అయిపోవచ్చు నా ముందు, ఏమో ఎవరికి తెలుసు. నీకన్నా తోపులే లేరనుకుంటున్నావా ఏంటి? ఆ! నేను గనక ఒక మాంచి కోటు కొనుక్కుని, నీ లాంటి టై వేసుకున్నానే అనుకో, నువ్వు నా ముందు కనిపించవు, గ్రహణం పట్టినట్టు చీకట్లోకి వెళిపోతావు.

కానీ, నా దగ్గర డబ్బులు లేవు, అదే ఇంత దుస్థితికి మూలం. ఇదంతా నాలో నేనే అనేసుకున్నాను.  

*

నవంబరు 8.

నేను నాటకం చూడటానికి వెళ్ళాను. “ది రష్యన్ హౌస్-ఫూల్” ఆ నాటకం పేరు. నేను పగలబడి నవ్వాను. ఇంకో మ్యూజికల్ కామిడీ కూడా నడిచింది. అందులో న్యాయవాదుల మీద భలే జోకులు పేల్చారు. డైలాగులు బాహాటంగా వున్నాయి. అసలు ఆ నాటకాన్ని సెన్సార్ వాళ్ళు దాన్ని ఎట్లా పాస్ చేసారో నాకర్థం కాలేదు. నాటకంలో ఇంకో చోట వ్యాపారులను మోసగాళ్ళు అంటారు. వాళ్ళ సంతానం చాలా అనైతికంగా బతుకుతారనీ, పాలకుల పట్ల చాలా అమర్యాదకరంగా ప్రవర్తిస్తారని అంటారు. అందులోనే విమర్శకులను దుయ్యబట్టారు. వాళ్ళ పని అంతా తప్పులు పట్టడమేనట. అందుకే రచయితలు ప్రజలనుంచి రక్షణ దేబిరిస్తారంట. మన ఆధునిక నాటక రచయితలు చాలా విచిత్రమైన విషయాలు రాస్తారు. నాకు నాటకాలంటేనే చాలా ఇష్టం. పొరపాటున నా జేబులో ఒకే ఒక్క కోపెక్కు వుందనుకోండి, నేను నాటకాలకు వెళ్ళిపోతాను. నా సహోద్యోగుల్లో చాలా మంది  చదువుసంధ్యలేని దద్దమ్మలు. ఎవరైనా ఉచితంగా టిక్కెట్లు ఇస్తే తప్ప నాటకాల గడప కూడా తొక్కరు. ఒక నటుడు చాలా ఆధ్యాత్మికంగా పాడాడు. నేను కూడా అనుకున్నాను … కానీ మౌనం పాటించాను!

*

నవంబరు 9.

నేను ఆఫీసుకు వెళ్ళే సరికి దాదాపు ఎనిమిది కొట్టింది. మా పెద్ద గుమాస్తా నా రాకను పట్టించుకోనట్టే నటించాడు. నేను కూడా అతను లేడన్నట్టే నటించాను. దస్తావేజులను చదివి సరిచూసుకున్నాను. దాదాపు నాలుగు గంటలకు వెళ్ళిపోయాను. నేను డైరెక్టరు వారు గారి ఇంటిమీదుగా వెళ్ళాను. కానీ, ఎవరూ కనిపించరే? భోజనం చేసిన తర్వాత నావల్లకాక కాసేపు కునుకు తీసాను.

*

నవంబరు 11.

ఈ రోజు డైరెక్టరువారు గారి గదిలో కూర్చున్నాను. అతనికోసం, ఆమెకోసం – అంటే దొరసాని, అంటే డైరెక్టరువారు గారి కూతురు గారి కోసం 23 పెన్నులు తుడిచి పెట్టాను. ఆమె కోసం మరో నాలుగు పెన్నులు సిద్ధం చేసాను. తన టేబుల్ మీద ఎన్ని పెన్నులుంటే అంత ఇష్టం మా డైరెక్టరువారు గారికి. అతని బుర్రే బుర్ర. ఎప్పుడూ మౌనముద్రలో వుండిపోతాడు. నాకు తెలిసి ఎలాంటి సూక్ష్మం కూడా అతని కంటి నుంచి తప్పించుకోలేదు అస్సలు. నిజానికి, అతను మామూలుగా ఏమి ఆలోచిస్తుంటాడో కదా అని తెలుసుకోవాలని వుంటుంది నాకు. నిజంగా అతని బుర్రలో ఏం నడుస్తుంటుందో కదా? ఈ వ్యక్తి జీవితంలోని కూలంకశం తెలుసుకునేందుకు అతనికి మరింత సన్నిహితుడిగా మారాలని ఉంది నాకయితే. అతని ప్రవర్తనలోని చాకచక్యాన్ని, మప్పిదాన్ని, జాణతనాన్ని, అతని సహచర బృందంలో చేసే కార్యకలాపాలను చాలా దగ్గర నుంచి  గమనించాలని నా కోరిక. చాలా సార్లు నేరుగా మా సారుగారు వారినే అడగాలని అనుకున్నాను. ఎందుకో కుదర్లేదు అంతే! అలా అనుకున్న ప్రతిసారీ నా నోటి నుంచి మాట పెగిలితే కదా? మహా అయితే నా నోటి నుంచి వచ్చేది వాతావరణ నివేదిక, అంతే! అతని ప్రత్యేక గదిలోకి వెళ్ళి అందులో ఏముందో చూడాలని నా కుతూహలం. అది తరచూ తెరిచే వుంటుంది. దాని వెనుక ఇంకో చిన్న గది వుంటుంది. ఎంత అద్భుతంగా, చక్కగా తీర్చినట్టు వుంటుందో అది. ఎక్కడ చూసినా అద్దాలు, అత్యంత ఖరీదయిన చైనా పింగాణీ సామాన్లు చక్కగా అమర్చి వుంటాయి. దీంతో పాటు మా దొరసాని, అదే మా డైరెక్టరువారు గారి కూతురు గారు ఎక్కడ వుంటుందో కూడా చూడాలని భలే కోరిక నాకు. అసలు ఆమె తన రాజదండం పట్టుకుని ఎక్కడి నుంచి ఎక్కడిదాకా తిరుగుతుంటుందో చూడాలనిపిస్తుంటుంది. ఇంకా తన అలంకరణ సామాగ్రి వుంచుకునే అల్మెరాలో ఏయే సెంటు సీసాలుంటాయో, మిగతా బాక్సుల్లో ఏమేం వుంటాయో, పీల్చేందుకే సగం బిక్కచచ్చిపోయే ఏయే పూల నుంచి ఎలాంటెలాంటి మధురమైన పరిమళాలు గుప్పుమంటుంటాయో పీల్చాలని వుంటుంది. ఇంకా ఏ దేవ కన్యలో వేసుకునే ఆమె బట్టలు ఎట్లా పరిచి వుంటాయే చూడాలని నాకు కోరిక. కానీ – ష్! నిశ్శబ్దం. ఈ రోజు నా బుర్రలో వచ్చిన ఒక దైవికమైన ఆలోచన నన్ను ఎంతగానో ప్రేరేపించిందని చెప్పాలి. నెవస్కా దగ్గర నేను విన్న కుక్కల పిచ్చాపాటీ నాకు గుర్తుకువచ్చింది.

“చాలా మంచిది, ఇప్పుడు నాకు దారి స్పష్టంగా కనిపిస్తోంది.’’

‘ఆ రెండు కుక్కల మధ్య సాగిన సంభాషణని మరింత నిశితంగా పరిశీలించాలి. అందులో చాలా మతలబులు వుండే అవకాశం వుంది,’ అనుకున్నాను. నేను ఇదివరకే మెగ్గీని ఒకసారి పిలిపించి, “విను, మెగ్గీ! ఇప్పుడు మనం ఇద్దరమే వున్నాం ఇక్కడ. మనల్ని ఎవరైనా చూస్తారని నీకు అభ్యంతరం వుంటే తలుపులు కూడా వేసేస్తాను, అదీ నువ్వు కావాలంటేనే. ఇప్పుడు చెప్పు, మీ దొరసాని గారి గురించి నీకు ఏమి తెలుసో. తెలిసినదంతా చెప్పాలి. నేను నువ్వు చెప్పినట్టు ఇంకెవ్వరికీ చెప్పనని మాట ఇస్తున్నాను.”

కానీ, ఆ నంగనాచి కుక్క అసలేమీ విననట్టే తోక ఊపి, తల, ఒళ్ళు విదిలించుకుని ఏమీ ఎరగనట్టు మెల్లిగా తలుపు సందులోంచి వెళ్ళిపోయింది. మనుషులకన్నా కుక్కలకు తెలివి కొంచెం ఎక్కువే అని నా పాత అభిప్రాయం. వాటికి మాటలు కూడా వచ్చనేది కూడా నా అభిప్రాయమే. అయితే, ఒకరకమైన మంకు పట్టు వల్లే అవి మూగ పోజుకొడతాయని నేను బలంగా అనుకుంటున్నాను. కుక్కలు భలే వేగులు. వాటి చూపులనుంచి ఏదీ తప్పించుకోనే లేదు. ఇప్పుడు నేను ఏంచేస్తానంటే, రేపు ఒక సారి స్వెర్కాఫ్ ఇంటికి పోయి, ఫిడెల్ వుందేమో అడుగుతాను. నా అదృష్టం బాగుండి అది వుందనుకోండి, ఆరు నూరయినా సరే, మెగ్గీ దానికి రాసిని ఉత్తరాలన్నీ కావాలని పట్టుపడతాను.

*

నవంబరు 12

ఇవాళ, మధ్యాహ్నం రెండు గంటలకు చచ్చీచెడయినా సరే ఫిడెల్ దగ్గరికి వెళ్ళి నిలదీయాలనుకుని బయలు దేరాను. సిటిజన్ వీధిలో కాలుపెట్టీ పెట్టగానే ముక్కుపుటాలు దద్దరిల్లిపోతాయి. ఆ వీధంతా భరించలేని  అదోరకమైన కుళ్ళిన క్యాబేజీ వాసన. ఆ వీధే కాదు, అక్కడి ప్రతి ఇంటి నుంచీ అదే కంపు. ముక్కులు మూసుకుని ఎంత త్వరగా వీలయతే అంత త్వరగా వెళ్ళిపోవాల్సిందే. పైపెచ్చు అక్కడి కంసాలి, కమ్మరి దుకాణాల నుంచి విపరీతంగా వచ్చే పొగ, రేగే నుసి దాటుకుని పోవడం మన తరం కాదు. నేను తీరా ఆరో అంతస్తుకు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే మొటిమల ముఖం వేసుకుని ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆ ముసాలావిడ పక్కన వున్నది ఈ అమ్మాయే అని పోల్చుకున్నాను.

నన్ను చూసి కాస్త సిగ్గుపడి, “ఏం కావాలి మీకు?” అని అడిగింది.

“మీ కుక్కతో కొంచెం మాట్లాడాలి.”

ఆ అమ్మాయి చాలా సాదాసీదా అమ్మాయే అనిపించింది నాకు. పరిగెత్తుకుంటూ కుక్క వచ్చి గట్టిగా మొరిగింది. నేను దాన్ని పట్టేసుకోవాలనుకున్నాను. కానీ, ఆ అసహ్యకరమైన కుక్క తన పళ్ళతో నా ముక్కు దాదాపు కొరికేయబోయింది. అయితే ఒక గది మూలన కుక్క పడుకునే బుట్ట కనిపించింది. అదే కదా నాకు కావాల్సింది. వెంటనే వెళ్ళి బుట్టలో చకచకా వెతికాను. ఒక కాగితాల కట్ట కనిపించింది. ఆ నంగనాచి దొంగ కుక్క నా వ్యవహారం గమనించింది. ముందు నా పిక్క పట్టుకుని కొరికింది. నా దొంగతనాన్ని పసిగట్టింది. కూనిరాగాలు తీస్తూ జింకపిల్ల లాగా నాపైకి దూకింది. 

“తప్పు, అలా చేయకూడదు, బంగారూ, వస్తా!” అనేసి టపటపా వచ్చేసాను.

నేను పిచ్చివాడినని అనుకుని వుంటుంది ఆ అమ్మాయి బహుశా. ఏమో కానీ, అది పిచ్చ భయపడిందని మాత్రం చెప్పగలను. ఇంటికి రాగానే, పని మొదలుపెడదామనుకున్నాను. పగటి వెలుతురులోనే ఆ ఉత్తరాలన్నీ చదవాలని అనుకున్నాను. ఎందుకంటే, క్యాండిల్ వెలుతురులో నాకు కనిపించి చావదు. సరిగ్గా అప్పుడే మా దిక్కుమాలిన మవురాకి ఇల్లు తుడవాలన్న ఆలోచన వచ్చి చచ్చింది. ఈ ఫిన్ లాండ్ మందబుద్ధి మహిళలకి అవసరం లేకున్నా సరే శుభ్రంగా వుండాలంటారు. చేసేదేమీ లేక నేను బయటికి నడకకు వెళ్ళి ఇంతవరకు ఏం జరిగిందని ఆలోచించడం మొదలు పెట్టాను. వాస్తవాలు, ఆలోచనలు వాటి వెనుక వున్న ఉద్దేశ్యాలు ఇప్పటికి కదా నాకు పట్టుబడింది. ఈ ఉత్తరాలే ఇక అన్నింటికి జవాబులు చెప్తాయి. కుక్కలు చాలా నేర్పయినవి. వాటికి  రాజకీయాలు ఖుల్లంఖుల్లా తెలుసు.ఈ ఉత్తరాల్లో నాకేం కావాలో అదంతా దొరుకుతుంది. మరీ ముఖ్యంగా మా డైరెక్టరువారు గారి గురించి, వారి బంధుగణం గురించీ.  ఈ జాబుల ద్వారానే ఆమె గురించి కూడా తెలుసుకుంటాను. ఎవరు? – ష్!  గప్ చుప్! 

సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు మంచిగా పడకేసాను.

*

నవంబరు 13.

ఇప్పుడు చూద్దాం! ఉత్తరం చూడటానికి బాగానే వుంది కానీ, అక్షరాలే కుక్కరాతల్లా వున్నాయి.

ప్రియమైన ఫిడెల్!

ఇంత సాదాసీదా పేరు నాకు అస్సలు వంటబట్డడం లేదు, పెట్టేందుకు ఇంకే పేరూ దొరకనట్టు ఏంటా పేరు? ఫిడెల్! ఎంత నాసిరకంగా వుంది, ఎంత నేలబారుగా వుంది. సరే, దాని బాగోగుల గురించి చర్చించడం ఇప్పుడు కరెక్ట్ కాదు. మనం ఇట్లా ఉత్తరాల ద్వారా కలుసుకోవడం నాకు భలేగా అనిపించింది.

(ఉత్తరం చక్కగా వుంది. అక్షరదోషాలు కానీ, వ్యాకరణ దోషాలు కానీ లేనేలేవు. మా హెడ్డు గుమాస్తా కూడా ఇంత చక్కగా రాసి చావడు. పైగా తానో విశ్వవిద్యాలయం తయారీ అని కోతలు కోస్తాడు. సరే, మనకెందుకు అదంతా. ముందుకు పోదాం.)

“ఈ లోకంలో మన ఆలోచనలనీ, ఉద్వేగాలనీ, మనపైన పడే బలమైన ముద్రలనీ ఇతరులతో పంచుకోవడం అనే తతంగం ఉంది చూడండి, అది అత్యంత ఉల్లాసభరితమైనది అని నా గట్టి ఆలోచన.”

(హ్మ్! ఇది జర్మన్ నుంచి అనువాదమైన ఒక పుస్తకంలోని ఆలోచన. ఆ పుస్తకం పేరు నాకు గుర్తు లేదు.) “నిజానికి, నేను మా గడప దాటి ఎన్నడూ ఈ లోకం చూసింది లేదు. కానీ, నేను నా అనుభవం నుంచే మాట్లాడతాను. అయితేనేం, నా జీవితం సాఫీగా, సంతోషంగా సాగడం లేదూ? మా అమ్మగారు నన్ను తెగ ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్న ఆమెని సోఫీ అనే పిలుస్తాడు.

(హేయ్! హేయ్! మనం గప్ చుప్ గా వుండటం మంచిది!)

“వాళ్ళ నాన్న కూడా అప్పుడప్పుడు నన్ను గోము చేస్తాడు. నేను పాలు కలిపిన టీ, కాఫీ తాగుతాను. అవును, ఒట్టు, నన్ను నమ్మండి. వంటగదిలో పోల్కన్ నమిలి పారేసిన పెద్ద ఎముకలు నాకు అస్సలు నచ్చవు. మూలగ పీల్చకుండా వుండే నాటుకోడి ఎముకలంటేనే నాకు నోరూరుతుంది. అవి ఎంత బాగుంటాయో, పైగా కొంచెం కట్టు చారులోకి తింటే. కానీ అందులో ఆకులు గట్రా ఏమీ వుండకపోతేనే సుమా! బ్రెడ్డును వుండలు చేసి కుక్కల నోట్లో కుక్కే అలవాటు వుందే అదో చెత్త అలవాటు. ఎవరో భోజనానికి కూర్చుని నిన్ను పిలిచి మరీ బ్రెడ్డుని తమ మురికి చేతులతో పిసికి వుండ చేసి నోట్లో తురుముతారు. మన మంచి అలవాట్ల వల్ల ఈ ఆగాయిత్యాన్ని నిలువరించలేమనుకోండి. నిజం చెప్తున్నాను కదా, కక్కాలేక, మింగాలేక దాన్ని అమాంతం తోసేస్తాం. భరించాలి, తప్పదు, ఏం చేస్తాం.  

(ఓరి దేవుడా! ఏమిటిది? ఇంత చెత్త! దానికి ఉత్తరంలో రాసేందుకు ఇంకేం తోచలేదా? రెండో పేజీలోనయినా ఏమయినా ఆసక్తికరమైన సంగతులు వున్నాయేమో చూడాలి!)

“ఇక్కడ ఏమేం జరుగుతూ వుందో నీకు పూసగుచ్చినట్టు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఇంట్లో అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి గురించి నీకు ఇదివరకే చెప్పాను. మన సోఫీ అమ్మగారు అతడినే ‘పాపా’ అని పిలిచేది. అతనో విచిత్ర వ్యక్తి.”

(హేయ్! ఇది మనం ఎదురుచూస్తున్న సిసలైన మతలబు. అవును, నాకు తెలుసు. వాటికి రాజకీయ నాయకులకు వుండే చురుకైన చూపు వుంటుంది అన్ని విషయాలపైనా. ‘పాపా’ గురించి అది ఏం చెబుతుందో విందామా!)

“… వింతైన మనిషి. మమూలుగా అయితే ఎప్పుడూ మౌనంగా వుంటాడు. ఎప్పుడో కానీ నోరు తెరవడు. అయితే ఓ వారం క్రితం మాత్రం ఒకే మాట మంత్రంలా పదేపదే తనలోతనే అనుకుంటూ వుండినాడు. ‘తేవాలా? వద్దా?’ ఒక చేతిలో ఒక కాగితం పట్టుకుని ఇంకో చేత్తో ఏదో అందుకోబోతున్నట్టు చాచి అదే మాట పదేపదే పలవరించాడు. ‘అసలు తేవాలా? వద్దా?’ నా వైపు తిరిగి నన్నూ అడిగాడు, ‘చెప్పు మెగ్గీ! నువ్వేమంటావు?’ నాకు అతను చెప్పే ఒక్క ముక్కా అర్థం కాలేదు. బూట్లు వాసన చూసి వెళ్ళి పోయాను. 

ఒక వారం తర్వాత వెలిగిపోతున్న ముఖంతో ఇంటికి వచ్చాడు. ఆ రోజు పొద్దున యూనిఫాంలో వున్న అధికారులు కొందరు ‘పాపా’ని అభినందిచడానికి ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి భోజనం వేళ అతను అంత హుషారుగా వుండటం నేను ఎప్పుడూ చూడలేదు.”

(ఓ! అతను చాలా దూకుడుగా వున్నాడే. నేను ఆ చూపులు నా కళ్ళతో చదువుకున్నాను.)

“మిత్రమా! క్షమించు, ఇక్కడితో ముగిస్తాను, అదీ, ఇదీ, అవీ, ఇవీ. రేపు తప్పకుండా జాబు రాయడం అయిపోతుంది, నమ్ము.”

. . . . . .

“హేయ్… వచ్చేసా, గుడ్ మార్నింగ్, సదా నీ సేవలో.

‘’ఇవాళ మా ఇంటామె.. అదే… సోఫీ… ఏం చేసిందంటే…”

(ష్‌! చూద్దాం… విందాం… వాళ్ళింటామె… అదే… ఆ సోఫీ గురించి ఏం చెబుతుందో…)

“… అసలు అట్లాఇట్లా లేదు ఆమె కత… చిందులేయడానికి పోయింది. అందుకే కదా నాకు ఈ కాస్త సమయం దొరికింది, ఇదంతా మీ కోసం రాయడానికి. ఆమెకి చిందులేయడం చాలా ఇష్టం. అయితే ఆ ముస్తాబు ఆమెకి బలే చికాకు. అయినా, నాకు తెలియక అడుగుతాను, మన్నించాలి నా ప్రియా, అసలు అలా చిందులేయడంలో ఏం మజా వుంది? అలా ఆడీ, ఆడీ తెలవారు జామున ఏ ఆరింటికో ఇల్లు చేరుకుంటుంది. అప్పుడు ఆ వేషం చూస్తేనే తెలిసిపోతుంది రాత్రి కనీసం ఒక్క ముద్ద కూడా మెక్కలేదని. ఏమాటకామాట, నేను అస్సలు తట్టుకోలేను అదంతా. నాకయితే చారులో కముజు ముక్క లేకపోతేనో లేదా వేయించిన నాటుకోడి రెక్క లేకపోతేనో, తిక్క రేగిపోతుందనుకోండి. కనీసం చారు జారుగా గంజిలా వుంటే కూడా నాకు తిక్కరేగదు, కానీ, ఈ క్యారెట్లు, ముల్లంగి, దుంపలు వేసేసి నా ముందు పెడితే మాత్రం చచ్చేంత నీరుకారిపోతాను.”

అబ్బా ఏం రాత? ఏం శైలి? ఎవరైనా చూడంగానే ఇదసలు మన మానవమాత్రులు ఎవరూ రాయలేరు అని అనుకోవాల్సిందే. మొదట్లో అంతా పగిలిపోయే పాండిత్యం… అలా అలా చివరికి వచ్చేకల్లా కోరపళ్ళు బయటపడతాయి. నేను ఇంకో జాబు చదువుతాను, అది కాస్త పెద్దది, కానీ దాని ముఖం మీద ఏ తేదీ లేదు మరి.

 “హే, ప్రియా!  ఈ సారి వసంత రుతువు ఎంత బాగా తలుపుతట్టిందో! మరేదో ఆశించి ఇలా తట్టిందా ఏమిటి? అని నా గుండె కొట్టుమిట్టాడుతోంది. నా చెవుల్లో ఏదో మారుమోగుతూనే వుండింది, అదే నన్ను బహుశా అడపాదడపా నా మునికాళ్ళపై నిలబెట్టింది. ఆ భంగిమ నిమిషాలపాటు సాగేది. బహుశా తలుపు నా వైపుకు పరిచయమైన శబ్దం ఏదో తీసుకుని నా దాకా మోసుకుని వస్తుందని. నా అభిమానులు నాకూ చాలామందే వున్నారు, ఈ విషయం నీకు చెప్పడానికి నాకెందుకు బెరుకు. పాపం వాళ్ళు నాకు సైట్ కొట్టుకుంటారనే నేను తరచుగా కిటికీ దర్శనం ఏర్పాటు చేస్తాను. హా! వాటిలో ఎలాంటి ఎలాంటి పిచ్చి మొహాలుంటాయో తెలుసా? ముందు, ఒక కంగాళీ ఇంటి కుక్క, దాని ముఖం మీదే చెత్త అని రాసి వున్నట్టుంటుంది. చాలదన్నట్టు, లగెత్తుకుని ఊపుకుంటూ ఊరి మీద డాబుగా పడిపోతుంది. అసలు లోకంలోని కండ్లన్నీ దాన్ని చూడ్డానికే అన్నట్టు వుంటుంది నడుస్తున్నప్పుడు దాని వాలకం. దాన్ని అస్సలు పట్టించుకోను నేను. దాని వైపు పొరపాటున చూస్తున్నట్టు కూడా కనిపించకుండా మ్యానేజ్ చేస్తాను నేను.

“ఇంకో నంగి బుల్ డాగ్ ఒకటి నేరుగా నా కిటికీ ముందే డ్యూటీ వేసుకుంటుంది. అదిగనుక దాని వెనక కాళ్ళ మీద నిలబడితే సరిగ్గా మా యజమానురాలి నాన్నగారి కన్నా ఒక తలంత ఎక్కువ నిటారుగా వుంటుంది. పైగా ఆయనే ఆజానుబావుడు. కానీ, అది అలా నిలబడలేదనుకోండి, ఎందుకంటే, బుల్ డాగ్ ది భారీకాయం కదా! పైగా ఈ తేడా శాల్తీ చూడ్డానికే రౌడీలాగుంటుంది. నేను దాన్ని చూసి చిన్నగా మొరుగుతాను. కానీ, అది భలే అన్ జాన్ కొడుతుంటుంది. కనీసం నుదరు కూడా ముడివేయదు నను చూసి. అది చాలదన్నట్టు దాని నాలుక బయటకిపెట్టి, చెవులు పైకి జాడించి రిక్కించి నా కిటికీ వైపు అదోలా చూస్తుంటుంది – ఆ మొరటు గాడిద! కానీ, నా మిత్రమా, నీకు తెలుసునా, ఇట్లాంటి బులిపించడాలను నా మనసు ఎప్పుడో దాటేసిందనీ, అధిగమించిందనీ, ఆ ముక్క రుజువు చేసేందుకు మిగిలిన ఏకైక సజీవ సాక్ష్యం నేనే అని? అయ్యో రామా! పోనీ, మా పక్కింట్లో గోడమీంచి ఓరగా చూసే ఆ కుక్కని చూసావా? అదీ, మర్యాదస్తుల పదహారణాల లక్షణాలు పునికిపుచ్చుకున్నకుక్క. దాని పేరే ఓ నిధి. దాని ముక్కు చూసావా, ఎంత బాగుంటుందో?

(ఓరి దేవుడా ఎంత చెత్తరా ఇది! ఎవర్రా ఇట్లా ఒక తెల్ల కాగితాన్ని ఇంత తలాతోకా లేని సంగతులతో నింపేది? అసలు మనుషులేనా వీళ్ళు? అంటుంటే గుర్తొచ్చింది, నాకు అర్జంటుగా మనుషులు కావాలి. దొబ్బిన నా బుర్ర మళ్ళీ మామూలుగా మారేందుకు కాస్త తిండి పెట్టే మనుషులు కావాలి. అప్పుడు కానీ ఈ లొల్లాయి నాకు అస్సలు ఎక్కేటట్టు లేదు. పేజీ తిప్పి చూద్దామా, ఏమో తిప్పేస్తాను, కనీసం అందులో రాసిన ముక్కలయినా మనసుకు ఊరటగా ఉండొచ్చేమో!)

 “సోఫీ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో కుట్టుకుంటూ వుంది. నేను కిటికీలోంచి బయటికి తొంగి చూసి అటుగా వెళ్తున్న వ్యక్తిని చూసి ‘అవ్వా’ అనుకున్నాను. అంతలోనే ఒక తింగరోడు వచ్చి ఇంటికి ఎవరో అతిథి వచ్చారని, అతని పేరు శ్రీయుత టెప్లాఫ్ అని దురుసుగా చెప్పి పోయాడు. “

“రమ్మను,” అంది సోఫీ; అలా అంటూనే నన్ను వాటేసేసుకుంది.

‘మెగ్గీ, ఏయ్! మెగ్గీ,  ఇంటికి ఎవరొస్తాన్నారో తెలుసా?’

నల్లగా వుంటాడు చూడ్డానికి; కానీ రాజుల కుటుంబం. ఎంత మంచి కళ్ళో! నిప్పు రాజేసే బొగ్గులా, అద్భుతంగా వుంటాడనుకో!

“సోఫీ తన గదిలోకి హడావిడిగా వెళ్ళిపోయింది. నిమిషం తర్వాత నల్లటి బుగ్గమీసాలతో ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడు. నేరుగా అద్దం వున్న మూలకు వెళిపోయాడు. జుట్టు చూసుకుని సర్దుకున్నాడు, గదినంతా కలయ చూసాడు. నాకెందుకులే అనుకుని నా చోట నేను కూలబడ్డాను. 

“సోఫీ వచ్చి సాదరంగా, స్నేహంగా సైగ చేసింది.’’

నేను గమనించినా, అస్సలు చూడనట్టే నటించాను, పైగా నా కిటికీ వైపు తిరిగి చూస్తున్నట్టు వుండిపోయాను. కానీ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అని నా తలని ఓ కోణంలో తిప్పి వుంచాను. ఓరి నాయానా! ఎంత సొల్లురా నాయానా, ఎంత చెత్తరా బాబు, వాళ్ళిద్దరూ గుసగుసా మాట్లాడుకుంది? – ఆ పిల్ల చేసిన డ్యాన్సేంటి, ఆ వేసుకున్న వేషం ఏంటి? ఇంకా… వాడు… ఆ.. అదే ఆ పోలిగాడు… వాడూ, వాడి బిల్డప్… కొక్కిరాయిలాగా వదులు చొక్కా చూపించుకుంటూ… కులికి… దాదాపు పడిపోబోయాడు తెలుసా? ఇంకోతి, పక్కాకోతి, పైగా దాని కళ్ళు నీలి అంట… అవి పక్కా పచ్చగా వుంటేనూ, వగైరా… వగైరా.

“నిజంగా, ప్రియా, నాకు ఏమీ పాలుపోలేదు, నిజ్జంగా ఆ టెప్లాఫ్ లో ఆమె ఏం చూసి ఇంతలా మురిసిపోతుందో, ఏం వుందని అంతలా ముక్కలుచెక్కలవుతుందో!”

(నాకు ఇక్కడేదో తేడా అనిపిస్తోంది. కానీ వాడేమీ ఈమెకి మందు పెట్టాడని మాత్రం నాకు అనిపించడం లేదు. చూడాలి మరి.) ‘పాపా’ రాసుకునే గదిలో కూర్చునేంత దాకా వచ్చిందంటే వ్యవహారం ఆ అధికారి

ఇంటాయనని ముందు పటాయించి వుంటాడు, ఇక తర్వాత ఆమెలాగూ పడిపోయే వుంటుంది. అని నాకు అనిపిస్తోంది. నువ్వు చూడాలి ఆ శాల్తీని! మమూలు తాబేలుగాడు. (అధికారి అంటే ఏమిటి ఆమె ఉద్దేశ్యం?)

అతనికి చక్కని పేరుంది. ఎప్పుడూ అక్కడే కూర్చుని పెన్నులు సిద్ధం చేస్తుంటాడు. అతని జుత్తు చింపిరి నిమ్మగడ్డి పొదలా వుంటుంది. ‘పాపా’ ఇంకే నౌకరు లేడన్నట్టు ఇతనికే ఆ పని అప్పజెప్తాడు.

(ఈ తింగరిది నన్నే అంటోందని నాకు అర్థం అయ్యింది. కానీ, నా జుత్తు జోలికి ఎందుకు రావడం. పైగా నిమ్మగడ్డి, పొద, చింపిరి… ఇన్నిన్ని అవాకులు అవసరమా దానికి?)

అతణ్ణి చూసిందంటే చాలు సోఫీ నవ్వు ఆపుకోలేదు. చెత్త కుక్క. నోరు తెరిస్తే అబద్ధాలే. అది నాలుకనా, పొరకనా? అసలు నాకేమీ తెలియదనుకుంటోంది. కేవలం కడుపుమంట ఇదంతా. పైగా ఇందులో కుట్రకోణం కూడా ఉంది. అవును, ఆ పెద్ద గుమాస్తాగాడి కుట్ర ఇదంతా. వాడికి నేనంటే అస్సలు పడదు. నా మీదే పన్నాడు ఈ పన్నాగం. సందు దొరికితే చాలు నన్ను దెబ్బ కొట్టాలనుకుంటాడు. ఇంకో ఉత్తరం చదివితే తప్ప, ఈ యవ్వారం నాకు పూర్తిగా పట్టుబడదనుకుంటా.
‘’ప్రియాతిప్రియమైన నా ఫిడేల్, నీకు ఉత్తరం రాసి చాలా కాలమయినందుకు నన్ను నీవు క్షమిస్తావనే అనుకుంటాను. ఇందుకు కారణం, నేను కలలో తేలిపోతూ వుండడమే. నిజం చెప్పాలంటే, ఎవరో కవి అన్నట్టు, ప్రేమ మరు జన్మ. అదీ కాక, ఈ ఇంట్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కుర్ర చాంబర్లీన్ ఎప్పుడూ ఇక్కడే వుంటోంది. ఇక సోఫీ వాడిపైన చొంగ కార్చుకుంటూనే వుంది. ఇంక ‘పాపా’ సంతోషంగా వున్నాడు. గ్రెగర్ అంటే విన్నాను, పెళ్ళి రేపోమాపో అంట. గ్రెగర్ తెలుసుగా? ఇల్లు ఊడ్చే పనివాడు. వాడెప్పుడూ వాడితోనే గొణుక్కుంటూ వుంటాడు. పాపా తన కూతురిని ఆరునూరయినా ఓ జనరల్ కో, కల్నల్ కో, చాంబర్లీన్ కో ఇచ్చి పెళ్ళి చేయడం ఖాయం. దేవుడా! ఈ పాడు ఇంక చదవలేను. మాట మాట్లాడితే చాంబర్లీన్, లేదంటే జనరల్. నాకు ఉన్నపళంగా జనరల్ అయిపోవాలని అనిపిస్తోంది. ఛ…ఛీ! ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి అనుకుంటున్నారా? ససేమిరా! నేను అస్సలు జనరల్ ఎందుకు కావాలనుకుంటున్నానంటే, నా చుట్టూ ఓ అరడజను మంది ఏం చేయాలో తోచక, బెంబేలెత్తిపోయి, హడావిడిగా, ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు, పన్నాగాలు రచించడంలో తలమునకలై వుండాలి. అదన్నమాట! అలాంటి కొలువులోనేను, అంటే నేనే, వాళ్ళిద్దరూ ఓ పనికిరాని సంత! అని గద్దించాలి. ఛీ! ఛీ! కంపరం. తలచుకుంటేనే ఉలపరం. ఈ కుక్క ఉత్తరాన్ని వెయ్యి ముక్కులుగా చించిపారేస్తేనేగానీ నాకు శాంతి లేదు.

*

డిసెంబరు 3

పెళ్ళి గిళ్ళీ అంతా హుళక్కే! అయ్యే కతే కాదు. కేవలం అదో వదంతి. ఒక వేళ వరుడు చాంబర్లీనే అయితే… మటుకు ఏమిటి ఒరిగి వుండేది? హేమీ లేదు. ఉత్తి దర్పం, పటాటోపం. ఎవరికి అక్కరకురాని వేషం అంతే. ఆ చాంబర్లీన్ కార్యాలయం ఏమైనా మూడో కన్ను దిద్దుతుందా నుదిటిపైన? లేదే! లేకుంటే, వాడి ముక్కుకేమయినా బంగారు తాపడం చేస్తారా? ఆ ముక్కూ నా ముక్కులాంటిదే, లేదా ఏ కోన్ కిస్కాగాడి ముక్కులాంటిదంతే! వాడేమయినా ఆ ముక్కుతో తింటాడా? పోనీ దగ్గుతాడా? లేదే! మహా అయితే వాసన చూస్తాడు, లేదా చీదుతాడంతే. కదా? కానీ, నేను ఈ యవ్వారం అంతు చూడాల్సిందే! ఎప్పటి నుంచి నడుస్తున్నాయి ఈ యవ్వారాలన్నీ! ఈ తేడాబేడాలన్నీ? నేను కేవలం తూచ్ కౌన్సిలర్ నేనా? బహుశా, చూడ్డానికి నేను టుమ్రీ కౌన్సిలర్ గా కనిపిస్తే మాత్రం నేను కూడా ఓ కౌంటునో, ఏ జనరల్ నోనే కదా? బహుశా నేను ఇదమిద్దంగా ఫలానా అనే తతంగం నాకే పూరాగా తెలియదనుకుంటా?

లోకంలో ఎన్ని కతలు లేవు చెప్పండి? రాత్రికి రాత్రే పేద రాజయిపోవడం, లేదా ఒక సామాన్యుడు వీరుడు అయిపోవడం, లేదా ఒక దద్దమ్మ అందలమెక్కడం. చాలా చూసాం ఇలాంటివి. ఇవేవీ కొత్తవేం కాదు. సరే, ఒక వేళ నేను ఉన్నట్టుండి సకల భుజకీర్తులతో, ఆడంబరాలతో, అట్టహాసాలతో ఒక సేనాధిపతిగా తనకే ఎదురుపడితే అప్పుడు ఏ పాట ఎత్తుకుంటుందో నా ప్రియ సఖి. వాళ్ళ ‘పాపా’, అంటే అదేనండి, మా డైరెక్టరు వారు గారు, వారయితే అప్పుడు ఏం చిందేస్తాడో మరి? అతను ఎంత గుంభనంగా వుందామని తపించినా ఇట్టే బయటపడిపోతాదు. దాచుకోలేడు. నాకయితే దొరికిపోతాడు. అతని వేషాలన్నీ టపీమని పట్టేస్తాను. ఎవరికయినా కరచనాలనం చేయాలనుకోండి, మరీ రెండు వేళ్ళు చాపుతాడు అసీయంగా. అదంతా అటే పోనివ్వండి. మన సంగతి మాట్లాడుకుందాం. నేను ఈ క్షణం, అంటే తక్షణం, ఏ దేశ అధ్యక్షుడినో, కనీసం సేనాధిపతినో కానక్కరలేదా? వుంది. కానీ, నేనింకా, టుమ్రీ కౌన్సిలర్ గానే కాళ్ళీడుస్తున్నానో, వేలాడుతున్నానో నాకు తక్షణం తెలియాల్సివుంది. ఎందుకిలా? ఆ! ఎందుకు అలా కాదు? ఆ! తెలియాలి. ఇప్పుడే!

*

పిచ్చివాడి డైరీ – పార్ట్ 2 కోసం ఉదయిని తదుపరి సంచికకోసం వేచి చూడండి.

నికొలాయ్ గొగోల్
అనంత్ చింతలపల్లి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *