సోలో ట్రిప్‌

Spread the love

తలుపు మెల్లగా మూసుకుంది.

చిన్న శబ్దం కూడా ఇంటిని నిద్రలేపకూడదనుకున్నట్టుగా.

రాత్రి తన చీకటిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటోంది. వీధిదీపాలు ఆరిపోవాలా, ఇంకా వెలగాలా అన్న సందిగ్ధంలో నిలిచిపోయాయి. వెలుతురు ఇంకా రాలేదు. తెల్లవారుజాము గాలి నేత్ర ముఖాన్ని తాకింది. ఆ చల్లదనంలో ఒక ఖాళీ ఉంది. ఎవరూ తాకలేని, ఎవరూ నింపలేని ఖాళీ.

రాత్రి కేక్ కట్ చేసినప్పుడు ఇల్లు నవ్వులతో నిండిపోయింది. అందరూ వెళ్లిపోయాక ఒక్కసారిగా ఆ ఇల్లు పెద్దదైపోయింది. గోడలు గుసగుసలాడుతున్నట్టనిపించింది.

అందుకే ఈ ప్రయాణం.

ఎప్పటినుంచో వాయిదా పడుతున్న ఒక సంభాషణ కోసం.

మ్యాప్‌లో ఒక చిన్న చుక్కలా కనిపించే వల్పరై వైపు… ఈ ప్రయాణం.

విమానం ఆకాశంలోకి ఎగిరింది.

కింద నగరం చిన్నదైపోయింది.

సమస్యలూ బహుశా ఇలాగే ఉంటాయేమో.

వాటి మధ్య నిలబడి చూస్తే పర్వతాల్లా కనిపిస్తాయి. కొంచెం దూరం వెళ్తే… చేతిలో పట్టేంత చిన్నవైపోతాయి.

కోయంబత్తూరు నుంచి వల్పరైకి బయలుదేరిన బస్సు అన్నామలై అడవుల్లోకి జారుకుంది.

కొండలు మొదట దూరంగా కనిపించాయి. తర్వాత కిటికీ పక్కనే వచ్చి నిలబడ్డాయి.

ఒకదాని తరువాత ఒకటి హెయిర్‌పిన్ మలుపులు.

దాటిన ప్రతి మలుపూ దృశ్యాన్ని పూర్తిగా చెరిపేస్తోంది. కొద్దిసేపటి క్రితం కనిపించిన లోయ ఇప్పుడు మాయమైంది. ఇంతలో కొత్త లోయ తెరుచుకుంటోంది. జీవితం కూడా ఇలాగే కదా; ఒక మలుపు తిరిగాక పాత దారి కనిపించదు.

అడవి మరింత దట్టమైంది.

తేయాకు తోటలు మొదలయ్యాయి.

పచ్చని అలలు కొండల మీద పరుచుకున్నాయి. గాలి తాకగానే అవి సముద్రంలా అలికిడి చేశాయి. దూరంగా మంచు నెమ్మదిగా దిగివస్తోంది. కొండల్ని ఒక్కొక్కటిగా తనలో కలుపుకుంటూ.

పక్కన కూర్చున్న పెద్దావిడ తమిళంలో అడిగింది.

“ఎక్కడికి?”

“వల్పరై.”

“ఒంటరిగానా?”

 స్త్రీ ఒంటరిగా ప్రయాణించడాన్ని ఆశ్చర్యంగా చూసే సమాజపు సందేహం ఆమె కళ్లలో.

స్టాప్ రాగానే దిగిపోయింది.

క్షణాల్లో పచ్చదనంలో కలిసిపోయింది.

ఆమె నడవాలనుకున్న దారి నిజంగా ఆమెదేనా అన్న ప్రశ్న మాత్రం నేత్రతో పాటు ముందుకు వచ్చింది.

వల్పరై చేరేసరికి మేఘాలు నేలను తాకుతున్నాయి.

వర్షం మొదట చినుకుల్లా వచ్చింది. తర్వాత కొండంతా తనదేనన్నట్టు కురిసింది.

తడిసిన బట్టలు మార్చుకుని, వేడి అన్నం తిన్నాక శరీరం హాయిగా మారింది. కిటికీ బయట మంచు తోటల మీద తెల్లని దుప్పటిలా మేఘాలు.

మౌనం కూడా, ఇలాంటి రంగులోనే ఉంటుంది కాబోలు.

మరుసటి రోజు అతిరాపల్లి.

నేరుగా బస్సు లేదు.

మలక్కపారా చెక్‌పోస్ట్ దగ్గర దిగేసరికి కేరళ బస్సు ఐదు నిమిషాల ముందే వెళ్లిపోయింది.

తర్వాత బస్సు ఒంటిగంటకు.

ఖాళీ రోడ్డు.

రెండు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన చిన్న చెక్‌పోస్ట్.

పొగమంచు.

దూరంగా అడవి.

ఎదురుచూడడం తప్ప చేయడానికి ఏమీ లేదు.

అప్పుడే ఒక కుటుంబం కనిపించింది.

భార్య, భర్త, అయిదేళ్ల కొడుకు.

“రండి,” అని పిలిచింది ఆ మహిళ.

టిఫిన్ తింటూ మాటలు మొదలయ్యాయి.

“నాకూ ఒంటరిగా తిరగాలని ఉంటుంది,” అంది ఆమె చిరునవ్వుతో. “కానీ పాపను వదిలి వెళ్లలేను.”

భర్త తమిళంలో ఏదో అడిగాడు.

“మీరు ఒంటరిగానే వచ్చారా అని అడుగుతున్నారు.”

నేత్ర తలూపింది.

“నా బస్సు వెళ్లిపోయింది. టాక్సీ చూసుకుంటున్నాను.”

భర్త మళ్లీ మాట్లాడాడు.

ఈసారి కొంచెం గట్టిగా.

ఆమె అనువదించింది.

“మిమ్మల్ని ఒంటరిగా పంపడానికి ఆయనకు ధైర్యం రావడం లేదు. మేమే దింపేస్తామని అంటున్నారు.”

నేత్ర మౌనంగా ఉంది.

కొద్దిసేపటికే టాక్సీ వచ్చింది.

నేత్ర మొబైల్‌ చూస్తోంది..

ఇంతలో…. “ఆమె మీతో రాదు. వెళ్లిపోండి.”

నేత్రా ఆశ్చర్య పోయింది ఆమె తరఫున తీసుకున్న నిర్ణయానికి.

పది నిమిషాల క్రితమే చూసిన మనిషి.

తన తరఫున నిర్ణయం కూడా తీసేసుకున్నాడు.

నేత్ర వేళ్లు తెలియకుండానే బిగుసుకున్నాయి.

“వద్దు,” అంది ప్రశాంతంగా.

“నేనే వెళ్తాను.”

వెనక్కి చూడకుండా టాక్సీలో కూర్చుంది.

కొండలు నెమ్మదిగా దిగిపోయాయి.

గాలి మారింది.

తేయాకు తోటల స్థానంలో వర్షారణ్యాలు మొదలయ్యాయి.

తేమతో నిండిన నేల వాసన.

తడిసిన ఆకులు.

వేళ్లను నేలలోకి చాచి నిలబడిన మహా వృక్షాలు.

వాటిని చూస్తే… అడవిలో ఏ చెట్టూ ఇంకో చెట్టు నీడలో బతకాలని పుట్టలేదనిపించింది.

అతిరాపల్లి జలపాతం.

నీరు, కొండ అంచు నుంచి ఒక్కసారిగా కిందికి దూకుతోంది.

పడిపోవడమే తన గమ్యం అని తెలిసినా, ఒక్క క్షణం వెనక్కి తగ్గడం లేదు.

ఎందుకంటే అది పడిపోవడం కాదు.

ప్రవహించడం.

తుంపర్లు ముఖాన్ని తాకాయి.

అప్పుడే ఆ మహిళ మాటలు మళ్లీ గుర్తొచ్చాయి.

“కారు నడపడం వచ్చు… కానీ ఆయన ఉన్నప్పుడు ఇవ్వరు.”

ఓవర్‌ ప్రొటెక్టివ్‌కి ఎప్పుడూ అందమైన పేర్లే ఉంటాయి.

ప్రేమ.

శ్రద్ధ.

జాగ్రత్త.

తన భయాలను తాను ఎదుర్కోలేనప్పుడు, ప్రేమ ముసుగులో కనిపించే బంధనాలకు అలవాటుపడిపోతారనిపించింది.

ఒకరోజు కారు తాళం అడగడం మానేస్తారు.

తర్వాత బయటకు వెళ్లాలనుకోవడమూ మానేస్తారు.

చివరికి తమకు ఎప్పుడో రెక్కలున్నాయని కూడా మరిచిపోతారు.

జలపాతం మాత్రం ఎవరినీ అడగదు.

బండరాళ్లు అడ్డొచ్చినా, తన దారిని తానే చెక్కుకుంటుంది.

అంతలో ఒక చిన్నారి పరుగెత్తుతూ కింద పడిపోయింది.

నేత్ర ఉలిక్కిపడింది.

కానీ, దూరంగా ఉన్న తండ్రి ఉలిక్కిపడలేదు.

అయ్యో అంటూ అరవలేదు.

వేలితో దారి మాత్రమే చూపించాడు.

పాప లేచింది.

ఇసుక దులుపుకుంది.

మళ్లీ నడిచింది.

తండ్రి ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు.

ఆ దృశ్యం జలపాతం కంటే పెద్దగా అనిపించింది.

ప్రేమ అంటే ఎప్పుడూ చేతులు పట్టుకుని నడిపించడం కాదు.

కొన్నిసార్లు… పడిపోయినా వాళ్లే లేస్తారనే నమ్మకంతో వెనక నిలబడటం.

సాయంత్రానికి జలపాతం మీద కమ్ముకున్న మబ్బులు మళ్లీ లోయలోకి జారిపోతున్నాయి.

నీరు మాత్రం అదే వేగంతో కిందికి దూకుతోంది.

ఎవరి అనుమతీ అడగకుండా.

ఎవరి భయానికీ ఆగకుండా.

తన దారిని తానే సృష్టించుకుంటూ.

నేత్ర చాలాసేపు అలాగే నిలబడి చూసింది.

ముఖంపై పడుతున్న తుంపర్లు నెమ్మదిగా ఆరిపోతున్నాయి.

లోపల ఎన్నాళ్లుగానో గట్టిగా పట్టుకున్న ఒక భయం కూడా.

ఆమెకు ఒక్కసారిగా అర్థమైంది.

స్వేచ్ఛ అంటే ఎప్పుడూ ఒంటరిగా ఉండటం కాదు.

తన జీవితంలో వచ్చే ప్రతి మలుపునీ, ప్రతి జలపాతాన్నీ, ప్రతి అగాధాన్ని తన నిర్ణయంతో దాటడం.

జలపాతం ఎప్పుడూ పడిపోతూనే ఉంటుంది.

కానీ ఎవరూ దాన్ని పతనం అనరు.

ఎందుకంటే అది ఆగదు.

ప్రవహిస్తూనే ఉంటుంది.

***

స్వేచ్చ జ్యోతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *