ఐ.యంత్ర part 1

Spread the love

ఫోన్ మోగుతోంది, రోహన్ చేతిలో అమ్మ సెల్ ఫోన్ ఉంది. అదేం పట్టించుకోకుండా గేమ్ ఆడుతున్నాడు.

తన గదిలో ఏదో పని చేసుకుంటున్న లత

“ఎవరు రోహన్?” అంటోంది.

“వన్ మినిట్ మమ్మీ!” అంటూ ఆడుతున్నాడు. విసురుగా వచ్చింది.

“అందుకే నిన్ను నా ఫోన్ తీసుకోవద్దని చెప్పాను. ముందు నాకు ఫోన్ ఇవ్వు” అంటూ లాక్కుంది.

“వాట్ మమ్మీ” అంటూ అలిగాడు.

“నీ ఆట పూర్తయ్యేంతవరకూ ఆగరు” అని టాక్ బటన్ నొక్కి “అమ్మా…!” అంది సంతోషంగా లత.

“నీకు తెలుసు కదా మన గీతిషా అబాకస్‌లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు తను నేషనల్ లెవెల్‌లో పార్టిసిపేట్ చేయటానికి సెలెక్ట్ అయింది. హైదరాబాదులో కార్యక్రమం ఉంది.. నేను గీతిషా త్రివేండ్రం నుండి రేపు బయలుదేరుతున్నాం” అంది సుధ.

“ముందు గీతిషాకి కంగ్రాట్స్. నీ పక్కన ఉందా?”

“లేదు. ఈరోజు ఆదివారం అయినా పనుల మీద స్కూలుకి వెళ్ళింది, రాగానే ఫోన్ చేయిస్తాను. సికింద్రాబాద్ స్టేషన్‌కి వస్తావా…?”

“బావని అడగాలమ్మా…! తన కారు ఇస్తాను అంటే తీసుకొస్తాను, లేదంటే క్యాబ్ బుక్ చేసుకుంటాను. తనకి స్కూల్ వాళ్ళు ఎన్ని రోజులు సెలవు ఇచ్చారు?” అడిగింది లత.

“శనివారం తిరిగి బయలుదేరుతాం. టికెట్స్ బుక్ అయ్యాయి. గురువారం గీత ప్రోగ్రాం ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు?”

“అందరూ బాగున్నారమ్మా…!” అంది లత.

“ఏం తీసుకురమ్మంటావు?”

“అలాంటివేం పెట్టుకోవద్దు, నువ్వు కూడా నీ ఉద్యోగానికి సెలవు పెట్టాలి కదా… ఇక్కడ అన్నీ దొరుకుతాయి. శ్రమ తీసుకోకు.”

“ఏదో ఒకటి చేస్తాను కానీ రోహన్ ఏం చేస్తున్నాడు…?”

“ఏం చేస్తాడు… యూట్యూబ్, టీవీ వాడికి సరిపోవడం లేదు. నా ఫోన్ తీసుకుంటాడు. లేకపోతే అత్త ఫోన్ తీసుకుంటాడు. ఇంకో పని లేదు వాడికి…”

“పిల్లలందరూ అలానే ఉన్నారు. ఒకసారి వాడికి ఇవ్వు!” అంది.

లత ఇచ్చింది

“హాయ్ అమ్మమ్మా!” అన్నాడు రోహన్.

“నేనూ గీత వస్తున్నాం. నీకేం తీసుకురమ్మంటావు.”

“హారీపోటర్ నవల తీసుకురా”

“ఎన్నో పుస్తకం?”

“బుక్ నెంబర్ త్రీ.”

“సరే అక్క ఉందా?”

“ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది.”

“అమ్మకు ఫోన్ ఇవ్వు” అంది సుధ.

“అమ్మా…! నువ్వు అడిగితే మొత్తం ఆ సిరీస్ అంతా తీసుకురమ్మంటాడు. ఇప్పుడు వాడికి హారీపోటర్ పిచ్చి పట్టింది. మా లైబ్రరీలో మొదటి పుస్తకం చదివాడు. అలాగే సినిమా చూశాడు. మొత్తం పుస్తకాలు కావాలంటున్నాడు. పరీక్షలు అయ్యాక తెప్పిస్తానంటే అలుగుతాడు.”

“పుస్తకాలు చదవడం మంచిదే లతా…! అత్తకు ఈ సంగతి చెప్పు. ఉంటాను” అని ఫోన్ కట్ చేసింది,

“నాకు ఫోన్ ఇవ్వమ్మా” అన్నాడు రోహన్.

“ఇంకోసారి ఫోన్ అడిగితే వాతలు పెడతాను. గీత చూడు అబాకస్‌లో ఫస్ట్ వచ్చింది. ఎప్పుడూ గేమ్స్ అంటావు. ఇప్పటివరకు నీకు ఒక్క బహుమతి వచ్చిందా…? కనీసం ఆటల్లో ఐనా గెలుస్తున్నావా…? మీ అక్క చూడు ఫస్ట్ క్లాస్ నుండి ఎన్ని మెడల్స్ తెచ్చుకుందో” అంది లత.

అప్పుడు చూశాడు ఓ ఇరవైకి పైగా మెడల్స్ గోడకు వేలాడుతున్నాయి.

“నాకే కాదు చిన్నక్కకి కూడా ఇప్పటివరకు ఒకటే వచ్చింది. ఇప్పుడు ప్రియాంక సెవెంత్ క్లాస్” అన్నాడు.

ప్రియాంక రోహన్ బాబాయ్ కూతురు. వారు దగ్గరలో ఉంటారు. రోహన్ కి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు. రోహన్ అక్క విదూషి. తను ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోహన్ కాస్త ఆలస్యంగా పుట్టాడు.

“ప్రియాంకకు ఒకటన్నా వచ్చింది. నీకు ఏదీ లేదు. మనం పోటీ పడాల్సింది తక్కువ వచ్చిన వారితో కాదు. అర్థమైందా?”

“ఐ విల్ గెట్ సో మెనీ… వెయిట్ అండ్ సీ. నవ్ ఐ యాం గోయింగ్ డౌన్” ఇంకో మాట కోసం చూడకుండా కిందకు వెళ్ళిపోయాడు.

అప్పుడు బయట నుండి లత అత్త జానకి వచ్చింది.

గీతి విషయం చెప్పింది.

“అది చాలా తెలివైన పిల్ల. మనది కాని ప్రాంతం. అక్కడ అంతా మలయాళం. ముందు ముందు చాలా పైకి వచ్చేలా ఉంది” అంది సంతోషంగా…

సుధా గీతిషా వచ్చారు.

ఓ గదిలో పిల్లలు ఉన్నారు. మరో గదిలో సుధా, జానకి మాట్లాడుకుంటున్నారు.

“అది వరకు రోహన్ నాకు సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాంటి బొమ్మలు కావాలని అడిగేవాడు. పెద్దవాడు అవుతున్నాడు కదా… పుస్తకాలు అడుగుతున్నాడు” అంది సుధ.

“పిల్లలకు తెలుగు నేర్పమని మీ తమ్ముడు గొడవ చేస్తుంటారక్కా!” అంది.

అంతలోనే, “రోహన్ తన అమ్మానాన్నలతో ఇంగ్లీషులో ఏదేదో మాట్లాడుతుంటాడు. అందులో కొన్ని మాటలు నాకు అర్థం కావు. అంతేకాదు విదూషి, రోహన్ చదివే పుస్తకాలు నాకు అర్థం కావంటారు మీ తమ్ముడు.”

“మనమందరం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నవాళ్ళం. వీళ్ళకి మొదటి నుండి ఇంగ్లీషే కదా… అయినా ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. గీతకి మలయాళం వచ్చు. తెలుగు, ఇంగ్లీష్ వచ్చు. హిందీ కూడా నేర్చుకుంటోంది, కాకపోతే…” అని ఆగింది సుధ.

ఏంటన్నట్లు చూసింది జానకి.

“బతకడం కోసమే త్రివేండ్రం వెళ్ళాం. మనవాళ్ళందరికీ దూరమయ్యాం. అక్కడి నుంచి మీ దగ్గరకు రావాలంటే ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం – అదీ రైలు ఆలస్యం కాకుంటే…”

“అదీ నిజమే అక్కా… ఒకప్పుడు ఉత్తరాలు లేదంటే టెలిగ్రాములు. అందరికీ ఫోన్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వచ్చాయి. దూరాలు బాగా తగ్గాయి. ఈ రోజుల్లో పిల్లల్ని అమెరికా, లండన్లు పంపిస్తున్నారు. ఏదీ మన చేతుల్లో ఉండడం లేదు” అంది జానకి.

అదే సమయంలో లత జిష్ణుతో మాట్లాడుతోంది.

“శంషాబాద్ దగ్గరలో లొకేషన్ చూపిస్తోంది బావా. ఉదయం ఎనిమిది గంటలకల్లా బయలుదేరాలి… రేపు ఒక్కరోజుకి నువ్వు కారు ఇవ్వు. రోహన్, విదు, ప్రియాంకలు కూడా వస్తామంటున్నారు.”

“వాడికి సెల్ ఫోన్ చేతిలో ఉంటే చంద్రమండలం కూడా వస్తాను అంటాడు.” ఇద్దరూ నవ్వుకున్నారు.

“మిమ్మల్ని డ్రాప్ చేసి రావడం కుదురుతుందా?”

“లేదు బావా… ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది గంటలు దాటుతుంది. ఫలితాలు కూడా అక్కడే చెబుతారంట.”

“సరే. డ్రైవర్‌కి ఫోన్ చెయ్యి. రేపు ఏడు గంటలకు రమ్మను” అన్నాడు. లత తలూపింది.

విదూషి గదిలో గీతిషా, ప్రియాంకలు ఉన్నారు. ఓ పక్కన రోహన్ హారీపోటర్ పుస్తకం చదువుకుంటున్నాడు.

“ముందుగా గీతికకి కంగ్రాట్స్” అంది విదూషి.

“అప్పుడే చెప్పకు. రేపు నేను సక్సెస్ అయితే నన్ను శ్రీలంకకు పంపిస్తారు” అంది గీతిషా.

“అడ్వాన్స్‌గా చెబుతున్నాను. నువ్వు సెలెక్ట్ అయితే మనందరిలో మొదటిసారి విదేశాలు వెళ్లేది నువ్వే అవుతావు. ఆల్ ది బెస్ట్!”

“ట్రై చేస్తాను. కాంపిటీషన్ ఎక్కువ ఉంది” అంది గీతిషా.

“అబాకస్ చాలా కష్టం అంటారు కదా!” అంది ప్రియాంక.

“ఏది కష్టం కాదు ప్రియాంకా… కాకపోతే అక్కడ చాలా క్విక్‌గా చేయాలి. దానికి ముందు మనం ఏం చేయాలన్నా దానిని ఇష్టపడాలి, ప్రేమించాలి” అంది విదూషి.

“అక్కా… నాకు లెక్కలు అంటే ఇంట్రెస్ట్ లేదు. భయం కూడా” అంది ప్రియాంక.

“నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం” అడిగింది గీత.

“హిస్టరీ. ఆ తర్వాత ఇంగ్లీష్”

“రోహన్ అందరం మాట్లాడుకుంటుంటే నువ్వు పుస్తకం చదువుతావ్ ఏంటి? గీత మనతో ఎక్కువ గంటలు ఉండదు” అంది విదూషి.

“అవును. అమ్మమ్మ నీకు పుస్తకం ప్రజెంట్ చేసింది. అది నీ దగ్గరే ఉంటుంది ఎప్పుడైనా చదువుకోవచ్చు” అంది ప్రియాంక.

“నాకు ఏదైనా స్టోరీ చెప్పండి” అన్నాడు రోహన్.

“విదూ అక్కా… త్రివేండ్రంని తిరువనంతపురం అంటారు కదా?” అడిగింది ప్రియాంక.

“అవును కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అయినా  నీకు సైన్స్ అంటే కూడా భయమా… ప్రియా! మనమందరం గాడ్ లేకపోయినా బతకగలం. సైన్స్ లేకుండా కష్టం” అంది విదూషి.

“నిజమా” అంది ప్రియాంక.

“య్యా… విమానాలూ, ఫోన్లు, రేడియోలు, సినిమాలు ఇవన్నీ కనిపెట్టడానికి కారణం సైన్స్. అది నేర్చుకుంటే మనుషుల గురించి, నేచర్ గురించి, చివరికి మనం తినే తిండి గురించి, పెట్టుకునే పూల గురించి ఒక రకంగా ప్రపంచాన్ని గురించి తెలుసుకోవచ్చు.”

రోహన్ తిరిగి పుస్తకం తెరుస్తున్నాడు.

“చివరికి పుస్తకం గురించి కూడా సైన్స్ చెప్తుంది” అంది గీత.

“నేను స్టోరీ చెప్పమంటే మీరు ఇవన్నీ చెబుతున్నారు. మీరు ముగ్గురు గార్ల్స్… మీరు పూలు పెట్టుకుంటారు. నేను పెట్టుకోను.”

“చెవుల్లో పెట్టుకోరా…” అంది ప్రియాంక.

అందరూ నవ్వుకున్నారు.

“ఇప్పుడు నేను ట్రెజర్ గురించి చెప్తాను” అంది ప్రియాంక.

“విచ్ ట్రెజర్…?”

“మెకన్నాస్ గోల్డ్ గురించి కాదు. త్రివేండ్రంలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది. అక్కడ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందంట. బట్ అక్కడ తలుపులు తెరిస్తే వాటర్ ఫ్లడ్‌లా  వస్తుందంట. అందుకని డోర్స్ తీయరు.”

“నిజమా” అన్నాడు రోహన్.

“ఆ టెంపుల్ గురించి చాలా కథలు చెబుతారు” అంది గీత.

“నువ్వు చూసావా..?” అడిగింది ప్రియ.

“లోపలకి ఎవరినీ వెళ్ళనీయరు.”

“నో ప్రాబ్లం మా హారీపోటర్ మ్యాజిక్ స్టిక్ కదిలిస్తే మినిట్స్ లో ట్రెజర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ కూడా మాయమవుతుంది” అన్నాడు రోహన్.

ముగ్గురూ నవ్వారు.

“హారీపోటర్ రియల్ క్యారెక్టర్ కాదు. అది నవల కోసం రౌలింగ్ క్రియేట్ చేసింది. మనకు కూడా హనుమాన్, భీమ్, కృష్ణలాంటి పాత్రలు ఉన్నాయి” అంది విదూషి.

“అవన్నీ రియల్ అక్కా” అంది ప్రియాంక.

“హారీపోటర్ కూడా రియల్” అన్నాడు రోహన్.

“మీ అమ్మమ్మ గాడ్ ని నమ్ముతారు కదా!” అంది విదూషి.

“అవును… వితౌట్ గాడ్ మనం పుట్టం, పెరగం.”

అప్పుడు లత వచ్చింది.

“గీతా! రేపు ఉదయం నీకు కాంపిటీషన్. ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదా? అయినా జర్నీ చేసి వచ్చావు. త్వరగా నిద్రపోవాలి. త్వరగా లేవాలి. కబుర్లు బంద్. అందరూ తినండి. గీతని వదిలేయండి. కమాన్ భోంచేయండి” అంది.

ఉదయం అందరూ వెళ్ళారు. మధ్యాహ్నం జానకికి ఫోన్ చేశారు “ఎలా చేసింది” అంది జానకి.

“క్వచ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు జారిపోయిందట. గీత దాంతో కంగారు పడింది. అందుకని కాస్త డల్ అయింది” అంది లత.

రాత్రి 7 గంటలకు ఫలితాలు వచ్చాయి. గీతకి ఓ మెమెంటో, సర్టిఫికెట్ ఇచ్చారు. గీత నిరాశ పడింది. అందరూ అభినందనలు చెబుతూ… ఇందులో నిరాశ పడనవసరం లేదు. ఇలాంటి పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. వచ్చే సంవత్సరం నీకు మంచి అవకాశం రావాలి అన్నారు.

ఆ రాత్రి పిల్లలు కూర్చున్నారు.

విదూషి మాట్లాడింది.

“ఇప్పుడు మనమంతా ఓ నిర్ణయం తీసుకుందాం. చిన్నపిల్లలు కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అది సైన్స్ విషయంలో కావచ్చు మరే రంగంలో అయినా కావచ్చు. సో… మనం కూడా కొత్తది కనుక్కోవాలి.”

“ఏ విషయంలో అక్కా” అంది ప్రియాంక.

“ఇంతకుముందు చెప్పాను. మనం ఏం చేయాలన్నా ముందు దాన్ని ప్రేమించాలి. అది మాత్రం గుర్తుంచుకుందాం. అది సైన్స్ కావచ్చు మరొకటి కావచ్చు. అలాగని చదువు విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఖాళీ సమయంలో ఆలోచిద్దాం. అంతే కానీ కాలక్షేపం కబుర్లు, పిచ్చిపిచ్చి ఆటల కోసం సమయం వృధా చేసుకోవద్దు”

గీతిషా చెప్పింది…

“మా అన్నయ్య ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. రెండుసార్లు కాంపిటీషన్లో బహుమతులు తెచ్చుకున్నాడు.”

“చెప్పాను కదా… దేశం కోసం మనం ఆటల్లో పాల్గొనవచ్చు. మంచి కథలు రాయవచ్చు. పాటలు కూడా పాడవచ్చు” అంది విదూషి.

“అయితే మన రోహన్ ఇంకో హ్యారీపోటర్ ని క్రియేట్ చేస్తాడు” అంది గీత.

“ఐ విల్ క్రియేట్” అన్నాడు రోహన్.

విదూషి కాలేజీకి వెళ్ళేసరికి స్టూడెంట్స్ గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందని అడిగింది.

“మన మృదుల సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది” అందో అమ్మాయి.

“ఎందుకు..? ఇప్పుడు ఎలా ఉంది…?”

చంద్రశేఖర అజాద్

Spread the love

One thought on “ఐ.యంత్ర part 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *