చివరి నాటకం

Spread the love

“నేను చారుప్రియను” అందామె.

“నువ్వా? మీరా? ఎక్కడున్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు శరత్.

“మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నాకు సమయం ఇవ్వగలరా?”

“అలా అడుగుతున్నారేంటి ప్రియా” అన్నాడు.

“మీకు అంత సమయం వుండదు కదా… మీకు టైమ్ ఈజ్ మనీ అని నాకు తెలుసు. అందుకని అడుగుతున్నాను”.

“ఎప్పుడు కలుసుకుందాం? ఎక్కడ?”

“మనం విశాఖ సముద్ర తీరంలో కలుసుకుందాం. ఎదురుగా సముద్రం వుంటుంది. ఎక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని మాట ఇస్తున్నాను” అంది చారుప్రియ.

“మీరు అలా మాట్లాడటం నాకు బాగుండలేదు. మనం సాయంకాలం కలుస్తున్నాం” అన్నాడు శరత్.

*   *   *

శరత్ గతంలోకి జారిపోయాడు.

అతను రంగస్థలం మీద వున్నాడు.

“ప్రపంచమొక నాటకరంగం. మనందరం అందులోని పాత్రధారులం. ఎవరి పాత్రను వారు పోషించాక తెర వెనకకు వెళ్ళిపోతాం. తెరతీయటం, తెరమూయటం మధ్య వుండేదే జీవితం” నవ్వుతూ అన్నాడు శరత్.

“అవునవును షేక్స్ పియర్ నుండి ఎందరో రచయితలు, నటులు చెప్పింది ఇదే. ఇప్పుడు మనం ఓ కొత్త నాటకాన్ని ప్రదర్శించబోతున్నాం. ఇది ప్రయోగాత్మక నాటకం. ఈ నాటకం చూసిన ప్రేక్షకులు ఆలోచనల్లోకి వెళ్లాలి. తమ జీవితాన్ని విశ్లేషించుకోవాలి. మన నాటకం చూసిన ఒక్కరయినా ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిందని అంటే మన ప్రయత్నం ఫలించినట్లు మనం తృప్తి పడతాం” అన్నాడు దర్శకుడు అరవింద్.

“అరవింద్ గారూ… ఇది పరిషత్తు పోటీలకు ప్రదర్శిస్తున్నామా?” ఓ నటుడు అడిగాడు.

“మన గమ్యం పరిషత్తులు కాదు. ప్రేక్షకులు” అన్నాడు అరవింద్.

“మనం నగరాల్లో ప్రదర్శిస్తామా? పల్లెల్లోనా?” అతనే అన్నాడు.

“ఎందుకు అడుగుతున్నారు?”

“మీరూ నేనూ మాట్లాడేది ప్రేక్షకుల గురించే. అందరూ ఒకటి కాదు. మనం సామాన్య ప్రేక్షకుల కోసం నాటకం ఆడాలంటే వారి అభిరుచులను దృష్టిలో వుంచుకోవాలి. ప్రయోగాలు చేయటం అంటే ఎక్కువ ప్రదర్శనలకు నోచుకోదు. అయినా పరిషత్తుల్లో పాల్గోంటేనే కదా బహుమతులు వచ్చేది. మనందరి గురించి పదిమంది మాట్లాడుకునేది. రాష్ట్రమంతా తిరిగి వందలాది ప్రదర్శనలు యిచ్చేది” అన్నాడతను.

“నాటకం అంటేనే ప్రయోగం. ప్రపంచంలో ఏ నాటకమైనా చూడండి అది ప్రయోగంగానే జనం ముందుకు వచ్చింది. నాటకం పరమ ప్రయోజనం జనంలో మార్పు తీసుకురావటం. అంతే గాని ప్రజలు ఇవే కోరుకుంటున్నారు అని మనం అనుకుంటే కొత్త ఆలోచనలు రావు సూర్యం” అన్నాడు అరవింద్.

“ఇందులో కథానాయకుడు ఎవరు?” అన్నాడు సూర్యం.

“కథానాయకుడు అనకు సూర్యం. ముఖ్యపాత్రధారి అందాం. ఈ నాటకంలో వున్న ప్రతి పాత్రకూ అస్తిత్వం వుంటుంది. నిడివి విషయంలో కొంత తేడా వుంటుంది. ఓ యంత్రంలో చిన్న బోల్ట్ ఊడిపోయినా అది పని చేయదు. ఈ నాటకంలోనూ అంతే. అన్ని క్లానిఫిక్ట్స్ వున్నాయి. ఏ పాత్రలేకపోయినా ఈ నాటకం అసంపూర్ణం” అన్నాడు అరవింద్.

“ఆ ముఖ్య పాత్రను, లేదా నిడివి ఎక్కువ వున్న పాత్రను ఎవరు పోషిస్తున్నారు?”

“మన శరత్” అన్నాడు అరవింద్.

“అయిదు సంవత్సరాల నుండి నేను మన బృందంలో పని చేస్తున్నాను. మీరు అవునన్నా కాదన్నా ప్రోటగానిస్ట్ గా శరత్ మాత్రమే వుంటున్నాడు!”

“సూర్యం… నువ్వు అలా అనటం బాగుండలేదు. నేను చిన్న పాత్రల నుండి ముఖ్యమైన పాత్రలు అన్నీ నటించాను. చివరికి యాంటగానిస్ట్ గా కూడా. అయినా నువ్వు ఈ ముఖ్యపాత్రను పోషిస్తానంటే నాకు అభ్యంతరం లేదు” అన్నాడు శరత్.

“మీరు ఆగండి శరత్” అని, “సూర్యానికే కాదు మిగతా అందరికీ నేను చెబుతున్నాను. ఈ నాటకాన్ని రచించింది నేను. దర్శకత్వం చేయాల్సింది నేను. అలాగే నటీనటుల్ని ఎన్నుకునేది నేను. ఏ పాత్రకు ఎవరు బాగుంటారు. వారి ఫిజిక్ ఏమిటి. ఇతరత్రా ఆ పాత్రకు వుండాల్సిన క్లాస్ జౌట్ లుక్ వుందా లాంటి అనేక అంశాల్ని నేను పరిగణనలోనికి తీసుకుంటాను. ఇక్కడ ఎవరి మీదా ప్రత్యేక అభిమానాలు అంటూ వుండవు. అసలు ఇలాంటి చర్చలు నాకు ఇష్టం వుండదు. నేను కూడా నటుడ్నే. కానీ ఎప్పుడూ నేను నటించలేదు. నా దృష్టి రచన మీదే. దర్శకత్వం మీదే. నా భావాలను జనంలోకి తీసుకుపోవటం మీదే” అంటున్నాడు అరవింద్.

“మీరు నటించలేదు కాబట్టే నటీనటుల ఆశలు, ఉద్వేగాలు మీకు తెలియవు అరవింద్ గారూ… ఎప్పుడూ చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ కూర్చొంటే వయసు మీద పడుతుంది. తర్వాత మీరు అన్నట్లు అన్ని పాత్రలూ పోషించటానికి మన ఫిజిక్ లు, ఇతర అంశాలు సహకరించవు” అన్నాడు సూర్యం.

ఒక్కసారిగా నిశ్శబ్దం.

“అంటే నాటకం కెరీర్ లో భాగం అంటారు!”

“నాటకమే కాదు జీవితం అంతే!”

అరవింద్ అందర్నీ చూస్తున్నాడు. వారి ముఖాల్లో భావాలను చదువుతున్నాడు. శరత్ కాస్త ఇబ్బందిగా కదులుతున్నాడు.

“గుడ్. ఇలాంటి చర్చ ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని తెలుసు. ఇంత త్వరగా రావటం నేను ఊహించలేదు. ఇది విమర్శ కోసం చెప్పటం లేదు. మీ సమాజంలో నేను నటుడిగా కనిపించాలి. ఎంత చిన్న పాత్రైనా చాలు అని మీలో కొందరు నా చుట్టూ తిరిగిన విషయం గుర్తు చేస్తున్నాను. అలా అని వారు పైకి రావాలని కోరుకుంటాను తప్ప అలానే మిగలాలని కాదు. అసలు నాటక సమాజాలు చీలిపోవటానికి కారణం ఇదే. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మీలో ఎవరైనా మీకు ఇచ్చే పాత్రలు నచ్చకపోయినా, కంటెంట్ నచ్చక పోయినా మీరు బలవంతంగా మన సమాజంతో వుండనవసరం లేదు. నేను కొత్త వారిని తయారు చేసుకుంటాను” అన్నాడు అరవింద్.

“అప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది” అన్నాడు సూర్యం. చిన్నగా నవ్వి అన్నాడు అరవింద్…. “మీకు కూడా అదే సమస్య వస్తుంది. జీవితం అలానే వుంటుంది.”

ఆ సమాజం నుండి ముగ్గురు సూర్యంతో వెళ్ళిపోయారు.

అరవింద్ ప్రయోగాత్మక నాటికను ప్రదర్శించారు.

*   *   *

“నేను మీ అభిమానిని శరత్ గారూ” అంది ఫోన్ లో ఆమె.

“సంతోషం. మీరు…” అని ఆగాడు.

“నేను నాటకాల్ని అభిమానిస్తాను” అంది అంతలోనే.

“ఇంకా సంతోషం… మీరు…”

“నన్ను చారుప్రియ అంటారు…. మీరు బెంగాలీనా అంటారు. కాదు. మీ పేరు శరత్ కదా. తెలుగులో చాలా మంది అలాంటి పేర్లు పెట్టుకున్నారు. మీరు రచయిత అయితే బాగుండేదని అనుకున్నారా?”

“లేదండి. అందుకు మా అరవింద్ వున్నారు. అరవిందుడు కూడా బెంగాలీనే కదా!”

“మీతో తీరిగ్గా మాట్లాడాలని వుంది. మీకు వీలయితే విశాఖ బీచ్ దగ్గర కలుసుకుందాం” అంది చారుప్రియ.

ఇద్దరూ కలిశారు. అప్పుడు సత్యజిత్ రే చారులత సినిమా గురించి మాట్లాడుకున్నారు. అరవింద్ నాటకం గురించి చారుప్రియ వివరంగా మాట్లాడింది. ఇది చాలా సున్నితమైన సబ్జెక్ట్. అందులో మీ పాత్రను గొప్పగా తీర్చిదిద్దారు. మీరు ఆ పాత్రను అద్భుతంగా పోషించారు అంది.

అలాగే తెలుగులో వచ్చిన గొప్ప నాటకాల్లో కొన్ని పాత్రలు పోషించారు. అంత వైవిధ్యాన్ని మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు అని అడిగింది. అప్పుడు శరత్ కాస్త సిగ్గుపడ్డాడు. తర్వాత…

“ఇంతకు ముందు అనేక మంది ఆ పాత్రలను పోషించారు. వారిని గమనించాను. నా కంటూ అనుకరణ లేకుండా ఓ స్టయిల్ ని సృష్టించుకున్నాను. అందుకు దర్శకుల సహకారం వుంది. అలాగే అనేక మంది వ్యక్తుల్ని గమనిస్తుంటాను” అన్నాడు శరత్.

“అసలు మీకు ఎలా ఈ ఆలోచన కలిగింది. ఎందుకు నటులు కావాలనుకున్నారు? నటన నా రక్తంలోనే వుందని చెప్పకండి” అంది చారు.

శరత్ కి నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు అంది చారు.

“అవన్నీ నేను ఆలోచించలేదు. ఎందుకో నటుడ్ని కావాలనిపించింది. అందుకు ప్రయత్నాలు చేశాను. అలా అలా ఈ రంగంలోకి వచ్చాను.”

“మీరు సినిమాల్లో నటిస్తారా?” అంది.

ఆశ్చర్యంగా చూశాడు.

“అది కూడా నటనే కదా! ఇంకా ఎక్కువ మందికి దగ్గరవుతారు కదా!” అంది చారుప్రియ.

“భవిష్యత్తు సంగతి తెలియదు. ఇప్పటికి నాటకరంగానికి పరిమితం అయ్యాను.”

“మీరు ఈ రంగానికే పరిమితం అవుతారా? ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం లాంటివి జీవిక కోసం చేస్తారా?”

“మాకు భూమి వుంది. నేను మా అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకుని. అందుకని ఉద్యోగం చేయాలని లేదు. ఇంత ఆనందం దొరకటం మిగతా వాటిలో వుండదు కదా! సినిమాల్లో అయినా అక్కడ మన ఛాయిస్ వుండదు. ఇమేజ్ లో ఇరుక్కుపోతాం” అన్నాడు శరత్.

“మీరు పోషించాలనుకున్న పాత్రలు ఏమిటి?”

“అవి క్రియేట్ చేయాలి. ఇది నేను మాత్రమే చేయాలి అనే భావం నాకు లేదు. నాలోని నటుడు ఇంకా తృప్తి పడలేదు. అలాంటి పాత్రల కోసం రచయితలను వేడుకుంటాను. ఈ రంగాన్ని ఇప్పట్లో వదలను” దృఢంగా అన్నాడు శరత్.

“అందుకే మీరంటే నాకు ఇష్టం” అంది చారుప్రియ.

శరత్ ఆలోచనలు ఫోన్ రావటంతో తెగిపోయాయి.

*   *   *

రామకృష్ణ బీచ్ దగ్గర చారుప్రియ వుంది. ఆమె గతకాలపు ఆలోచనల్లో వుంది. మొదటి సమావేశం తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది. తను నాటకాలు ఎక్కుడ వేస్తూంటే అక్కడకు వెళ్లింది. ప్రదర్శన జరిగాక చారు ప్రియ విశ్లేషిస్తూ మాట్లాడేది. ఇంకొంత పరిణతి అవసరం అనేది. ఏది ఏమైనా నాటకరంగంలో కొన్ని కదలికలకు స్టేజ్ పరిమితి వుంటుంది. సంభాషణలు పలకటంలోనూ అంతే. చివరి ప్రేక్షకుడికి కూడా వినిపించాలి. సినిమా అయితే వేరు కదా అనేది.

తన సహనటీనటులు గురించి మాట్లాడుకునేవారు. ఓ రాజు శరత్ అన్నాడు. “మన మీద గుసగుసలు మొదలయ్యాయి.”

అప్పుడు చారుప్రియ నవ్వింది.

“స్టేజ్ మీద విభిన్న పాత్రలు పోషించే నటులు, నిజ జీవితంలో మామూలు మనుషుల్లానే వుంటారనుకుంటాను” అంది.

“నటులే కాదు రచయితలు, రాజకీయ నాయకులు, అభ్యుదయ వాదులు కూడా అలానే వుంటారు. అందరం మనుషులం కదా!”

“నాకు నాటకరంగం మీద ప్రేమని చెప్పండి.”

“అది వారికి తెలుసు. మీరు నన్ను చూడటానికి వస్తున్నారు. ఇంకెందరో నటులున్నారు. నాటక ప్రదర్శనలున్నాయి.”

“అంటే మీ మీద ప్రేమ అంటారా.”

“అబ్బే… నేను అనలేదు” కంగారుగా అన్నాడు శరత్.

“అవును. మీ మీద నాకు ప్రేమ కూడా వుంది.”

కొద్ది సేపు మాట్లాడలేకపోయాడు. తర్వాత థాంక్స్” అన్నాడు.

“ఎందుకు? ప్రేమ కలిగినందుకా… అది చెప్పినందుకా?”

“నాకు కూడా మీరంటే ప్రేమ కలిగింది. నన్ను అభిమానిస్తున్నారో నా నటననో తెలియక సైలెంట్ గా వున్నాను. మనం కలిసి ప్రయాణం చేద్దామా?” అడిగాడు శరత్.

“ప్రేమ కలిగితే ప్రయాణం చేయాలా?”

మళ్లీ కంగారుపడ్డాడు.

“అలాంటిదేం లేదు… ఇంకో మాట అడగనా?”

తలూపింది చారుప్రియ. “మీకు కూడా నటించాలని వుందా?”

“లేదు శరత్ గారూ… నాకు ముందు ముందు మంచి నాటికలు, నాటకాలు తయారు చేయించాలని వుంది.”

“మనం పెళ్లి చేసుకుందాం – మీకు ఇష్టమైతే.”

కాసేపు శరత్ కళ్లల్లోకి చూసి అతని చేతిని అందుకుంది. రెండు పక్కలా అభ్యంతరాలు లేవు. పెళ్లి జరిగింది. మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.

“చారూ… నాకు ఇప్పుడు నాటకాలు ఆనందం కలిగించటం లేదు. రేపు మనకు పిల్లలు పుడతారు. నాకు వ్యాపారం చేయాలనుంది.”

“ఎందుకని ఆనందం కలిగించటం లేదు?” ఆశ్చర్యంగా అడిగింది.

“నాటకరంగం ఇదివరకటిలా లేదు. మేం నటిస్తున్నప్పుడు స్పాంటేనియస్ గా చప్పట్లు కొడుతుంటారు. తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. పత్రికల్లో ఏదో మూల చిన్న వార్త వస్తుంది.”

“అంతేనా?” అంది చారుప్రియ.

“ఇప్పుడు పరిషత్తులు కూడా తగ్గాయి. అనేక సమాజాలు వున్నాయి. కొత్తగా రాస్తున్న వారు ఎలాంటి వాటికి బహుమతులు వస్తాయో అలాంటివి రాస్తున్నారు. ఇక్కడ నాటకరంగానికి ప్రయోగాలు, కళాత్మకత అవసరం లేదని అరవింద్ కూడా మరాఠి, ఇతర భాషలకు వెళ్లిపోయారు. ఇది వరకటిలా నటనను వృత్తిగా తీసుకునే అవకాశాలు లేవు. క్రమశిక్షణ పోయింది.. సినిమాలను అనుకరిస్తున్నారు. ఆ రంగంలోకి వెళ్ళటానికి ఇది ఓ మార్గం అనుకుంటున్నారు. మనకు ఆర్టిస్టులు దొరకటం కష్టంగా వుంది. ముందు ముందు అనేక మార్పులు వస్తాయి” అన్నాడు శరత్.

“మీరు పిల్లల కోసమే మారాలనుకుంటే నాకు పిల్లల్ని కనాలని లేదు” అంది చారుప్రియ. ద్రిగ్భాంతితో చూస్తున్నాడు.

“సమాజంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు రంగస్థలం అవసరం మరింత వుంది. ఈ సమాజాన్ని మార్చేయగలం అని చెప్పను. నూతిలో గొంతుకలా అయినా మనం పలకాలి.” అంది చారుప్రియ.

“నువ్వు వాస్తవికంగా ఆలోచించటం లేదు చారూ!”

“శరత్… నువ్వు పోషించవలసిన పాత్రలు వున్నాయి. మనకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. అవసరం అనుకుంటే నేను జాబ్ చేస్తాను. పరిస్థితులు ఎప్పుడూ ఇలా వుండవు. మారతాయి.”

ఆ సంభాషణ జరిగాక సన్నటి గీత ఏర్పడింది. పర్యవసానంగా చివరిసారి కలుసుకున్నారు.

“మనం విడిపోదాం శరత్” అంది.

“ఇంత కఠినమైన నిర్ణయమా? జీవితం కంటే నాటకం, రంగస్థలం గొప్పదా? కావాలంటే మనం సమాజాన్ని కొనసాగిద్దాం. అందుకు ఫండ్స్ ఇద్దాం. కొత్త వారిని తయారు చేద్దువు గాని.”

“అప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తాయి శరత్.”

అతను మాట్లాడలేదు.

“నిన్ను ఓ మంచి నటుడిగా చూడాలనుకున్నాను మంచి వ్యాపారవేత్తగా కాదు. ఇది అర్థం లేని ఆశయంగా కనిపించవచ్చు. అవును. నాకు ప్రజలంటే ప్రాణం. ఒకటి గుర్తుంచుకో… ఎన్ని మార్పులు వచ్చినా రంగస్థలం నిలబడుతుంది.”

*   *   *

ఖరీదయిన కారు వచ్చి ఆగింది. శరత్ పార్క్ చేసి నడిచి వస్తున్నాడు. సముద్రం కేసి చూస్తున్న చారుప్రియ అది గమనించలేదు. అతను వెనకాల నిలబడి అడిగాడు.

“నేను మీ పక్కన కూర్చోవచ్చా?” అప్పుడు చూసింది.

“ఫ్లీజ్” అంది. కాస్త దూరంగా కూర్చున్నాడు. రెండు దశాబ్దాలు గడిచిపోయాయి.

“ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు చారుప్రియా” అన్నాడు. ఆమె మాట్లాడలేదు.

“ఇంత మౌనంగా ఎలా వుండగలిగావు. నీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాకు నీ గురించి చిన్న వివరం కూడా దొరకలేదు.”

“అదంతా పెద్ద కథ శరత్.”

“చెబితే నేను వింటాను” అన్నాడు.

“వద్దు. నేను మిమ్మల్ని ఒకటి అడగటానికి వచ్చాను.”

“చెప్పండి చారుప్రియా.”

“మీరు ఓ నాటకం వేయాలి!”

“నేనా… ఇన్ని సంవత్సరాల తర్వాత! నేను నటనను మరిచిపోయాను. అయినా ఈ శరీరం మారిపోయింది. నాకు ఇప్పుడు డైలాగులు గుర్తుండవు. చాలా యిబ్బందులున్నాయి. ఇప్పటి ప్రపంచం వేరు కదా!”

“మన మొదటి పరిచయంలో నా రక్తంలో నటన వుంది అనకండి అన్నాను. గుర్తుందా?”

“నేను ఏదీ మరిచిపోలేదు చారూ” అన్నాడు.

“ఇప్పుడు నేను అంటున్నాను. మీ రక్తంలో నటన వుంది. నా కోసం చివరిసారి నటించండి. ఇందులో నేను కూడా నటిస్తాను.”

అప్పుడు ఆశ్చర్యంగా చూశాడు.

“మనకు ఇప్పుడు స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు?”

“అరవింద్ తో నేను మాట్లాడాను. వారు నా కోసం ఓ నాటకం తయారుచేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఓ తెలుగు నాటకాన్ని వారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంతకు మించి జీవితంలో నేను ఇంకేమీ మిమ్మల్ని అడగను. అంగీకరిస్తారా?”

శరత్ సముద్రం కేసి చూస్తున్నాడు.

*   *   *

తెరతొలిగింది.

నాటకం కొనసాగుతోంది. రకరకాల సెట్టింగ్స్. సముద్ర తీరం, రంగస్థలం-ఓ నటుడు-అతన్ని అభిమానించిన ఓ అభిమాని. ఇద్దరు కలవటం-పెళ్లి-విడిపోవటం-అతను పెద్ద బిజినెస్ మాగ్నెట్ కావటం-తర్వాత ఆమె కలవటం.

“ప్రియా… నువ్వెందుకు తిరిగి పెళ్లి చేసుకోలేదు?”

అడుగుతున్నాడు అతను. ఆ ప్రదర్శనకు శరత్ భార్య, పిల్లలు వచ్చారు. అతని దగ్గర పని చేస్తున్న వారు వచ్చారు.

“మరోసారి గాయపడటం ఇష్టం లేక” అంది ఆమె.

“చివరికోరిక అన్నావు. ఎందుకు?”

“స్నేహితుడా! జీవితం మన చేతుల్లో వుండదని నాకు తెలుసు. ఓ డాక్టర్ కావాలనుకుంటాం. అందుకు కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ప్రజలకు సేవ చేయాలనుకుంటాం. మధ్యలో ఆ వృత్తిని వదిలి వెళ్ళటం అంటే… అదెంత?”

“ఆ నిర్ణయం వెనుక ఎంత పెయిన్ వుంటుందో తెలుసా?” అంటున్నాడతను.

“నటన కూడా అంతే నేస్తం. ఓ నటుడు తయారు కావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నటన వ్యక్తిగతం కాదు. అది సామాజికం. మీరు మరోదారి చూసుకున్నారు. ఇందులో మీకు ఆనందం లభించిందో లేదో నాకు తెలియదు. నేను మీ దగ్గర నుండి వెళ్లిపోయాక కొన్ని సంవత్సరాలు తేరుకోలేకపోయాను. అప్పుడు నేను నటిని కావాలనుకున్నాను. రహస్యంగా అది సాధన చేస్తూ వచ్చాను. నటిస్తూ చనిపోవాలనుకున్నాను. మీరు చెప్పిన అంశాలు నాకు గుర్తున్నాయి మిత్రమా… అవన్నీ అనుభవించాను. నాకు నిరాశ కలిగినప్పుడు ప్రజలు గుర్తొచ్చారు. వారి అభిరుచులు, సమస్యలు గుర్తు వచ్చాయి. రంగస్థలం మీద కంటే జీవితంలో నటించేవారు గుర్తొచ్చారు. అందుకే ప్రపంచమొక నాటకరంగం అన్నారు. తిరిగి ఇప్పుడు జీవితం నుండి రంగస్థలం మీద నటించ గలగాలి. బతుక్కి రంగస్థలానికి మధ్య వున్న గీతలు చెరిపివేయాలని. ఇది కేవలం నటనకు మాత్రమే కాదు. కళలకు కాదు. జీవితంలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది. సెలవు మిత్రమా!”

చారుప్రియ రంగస్థలం మీద కూలిపోతోంది.

తెరపడింది.

*   *   *

చారుప్రియ పటానికి దండవేసి వుంది.

శరత్-అరవింద్-నటీనటులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

– సమాప్తం –

చంద్రశేఖర అజాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *