బతుకుకథ -17

Spread the love

మేం ముగ్గురం స్నేహితులం. చింత రాములు, ఇరప రాములు, నేను. ఒక తోటోళ్లం. ఊహ తెలిశాక బుగ్గవాగులో ఎక్కువగా ఈతలు కొట్టినవాళ్ళం మేం. 

చింత రాములు వాళ్ళ నాన్న లక్షింనర్సు. పేరేపల్లి చెరువు నీళ్లు తూము తెరిచి కాలవలకు వదిలేవాడు. ఎప్పుడు చూసినా గసికె కర్ర చేతుల ఉండేది. ఆయన  గేట్ కారేపల్లి దొరవారి దగ్గర కొన్నాళ్ళు జీతమున్నడట. అందుకని ఊళ్ళ ఆయనకు కొంచెం వేరే తీరుగ గౌరం(ట్రీట్మెంట్) ఉండేది. 

కుంజ రామయ్య కొట్టం బడిల కోటయ్య సార్ అ ఆలు దిద్దబెట్టినప్పుడు, నాతోపాటు మొదలుపెట్టినోల్లలో ఈ ఇద్దరు రాముళ్లు ఉన్నరు. మట్టిపలక, రాతి బలపం అప్పట్ల గవర్నమెంటోళ్లే ఇచ్చేటోళ్లు. అవి ఇచ్చినరోజు ఒక్క సంతోషం కాదు. ఆ కోయగూడెంలో రెండవ తరగతి వరకు మొదలైన ఆ బడిలో మాలోంటోళ్లకు ఆ పలకాబలపం ఉత్తగానే ఇయ్యడం సంబురమే. తేనె కళ్ళ చింతరాములు కళ్ళల్లో వెలుగును నేనప్పుడు చూసే ఉంటాను. రైలు పట్టాల దగ్గర్నుంచి తెచ్చిన ఇనప ముక్కను వైరుకు వేలాడదీసి స్కూలు బెల్లుగా కట్టింది మేమిద్దరమే. కోటయ్య సార్ నన్ను బెల్లు కొట్టమనేవాడు. కొన్నాళ్ళకు చింత రాములు ”యాకూబు.. బెల్లు కొట్టేటి పని నాకు ఇవ్వవా.” అని ఇష్టంగా అడిగితే, ఆ పనిని తనకి అప్పగించడం – కలిసినప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తుచేసేటోడు అపురూపంగా.

ఆ రెండు క్లాసులు అక్కడ చదివి నేను కారేపల్లి చిన్నబడిల చేరిన. చింత రాములు, ఇరప రాములు ఇగ ముందుకు రాలేక పోయిన్రు. రైతుల దగ్గర ఏడాది జీతాలు కుదిరిన్రు. గొడ్లు కాసుకరావడం, గడ్డికొయ్యడం, ఇంట్ల పనులు… పెండ తియ్యడం లాంటి పనులు. అప్పట్ల సంవత్సరానికి పుట్టెడు ధాన్యంల జీతాలు కుదిరేటోళ్లు. అరక జీతగాళ్లయితే ఇంక ఎక్కువ. అట్లా ఆ తర్వాత మా నాయిన ఎవుసాయం మొదలెట్టినంక మా దగ్గర కూడా రెండుమూడేళ్ళు ఈ ఇద్దరు జీతం కుదిరిన్రు. నా సోపతిగాండ్లు నాకు తోడయిన్రు.

మా నాన్న ఆయన ఒక్క నిమిషం రికామీగ ఉండడు. ఇంట్ల ఎవర్ని ఉండనీయడు. పొద్దుగాల లేచిందగ్గర్నుంచి పండుకునేదాక కూచొనిచ్చేటోడు కాడు. పొద్దున్నే లేపడం, మాకు కుండలు చేతికివ్వడం బుగ్గనీళ్లు తెచ్చి గాబులు, కుడితి గాబులు నింపడం చేయించేటోడు. చింత రాములు కొంచెం పొడుగోటోడు.వాడికి కావిడి. అటొక బుంగ. ఇటొక బుంగ. అన్ని గాబులు నిండినంక అప్పటికే పొయ్యిమీద మేకపాలు,చాపత్త, బెల్లంతో మసిలి మసిలి తయారైన టీ ని, పెద్ద ఇత్తడి గ్లాసుల్ల పోసిస్తే అది గబగబా తాగి గడ్డి కోసకరావడానికి పొలాల్లోకో, చేన్లలోకో కొడవళ్లు పట్టుకుని పోయేటోళ్లం. పొలాల దుగాలమీద గడ్డి తమాసిగా ఉండేది. మోపుకడితే మట్టసంగ మోపు కుదిరేది. చేన్లల్ల గడ్డి ఒక్క తీరుగ ఉండేడిది కాదు. గునుగు, పిల్లిపిసరలాంటి గడ్డి. జొన్నచేన్ల మధ్య, కందిచేన్లమధ్య పెరిగే గడ్డి. 

మేం ముగ్గురం వెళితే మూడు మోపులు దిట్టంగా వచ్చేయి. చింత రాములు గబగబా కోసేటోడు. కొంచెం ఎక్కువనే కోసేటోడు. కోసుడు పని అయినంక మోపులు కట్టడం. మూడుకట్ల మోపు, రెండు కట్ల మోపు. చింత రాములు ఎప్పుడూ మూడు కట్ల మోపు వేసేటోడు. ఆ మోపు మోయాలంటే తన బలం సరిపోయేది. మేమిద్దరం మాత్రం రెండు కట్ల మోపులే. మోపు ఎత్తడం కూడా కష్టమే.ఇంటిదాక మోయడం కష్టమే. నా మోపుకు గడ్డి తక్కువపడితే నా మోపుకు సరిపడ గడ్డి ఇచ్చి మోపుకట్టి తలకు ఎత్తేవాడు. తన మూడుకట్ల మోపు తనే దుగానికి కాలు తన్నిపట్టి ఒక్క ఉదుటున తలకు ఎత్తుకునేవాడు.

*

ఆదివారాలు, సెలవు రోజుల్ల నేను గొడ్లు కాయడానికి వెళ్ళేవాడ్ని. ఆ ఇద్దరు అరకలకు పోయేటోళ్లు. అరకలు ఇప్పినంక సద్ది తిని అరక గొడ్లని మేపడానికి నా దగ్గరికి తోలకొచ్చేటోళ్ళు. వస్తూ వస్తూ జొన్న ఊసకంకులు చేలల్లనుంచి తెంపకోచ్చేటోడు. ఒకళ్ళం గొడ్ల దగ్గర ఉండటం, ఇద్దరు చింతచెట్టు బెరళ్లు తేవడం, నిప్పు చేయడం, ఊసకంకులు కాల్చి, తువ్వాలలో కొట్టి కడుపునిండ ఊసలు తినడం… ఇదీ వరస. అంతేనా.. చింత రాములు ఇరప రాములు తీరొక్క కాయల్ని రుచిచూపించిన దోస్తులు. గుబ్బకాయలు, తునిక్కాయలు, పుల్సేరి పండ్లు, ఊడుగు పండ్లు, గిన్నె పండ్లు, పరిక్కాయలు, మేడి పండ్లు..

మాకు భూములు లేవు అప్పుడు ఇరవై కుంటల పొలంతప్ప. అదికూడా పేరేపల్లి చెరువుకింద ఉండేది. మా వూరినుంచి ఐదారు కిలోమీటర్ల దూరం. ఎండాకాలంల పెంట తోలేటప్పటి నుంచి పన్లు షురూ. పెంట పారల్తో మడులల్ల చెదరడం, ఒరాలు చెక్కడం, వానలు పడ్డంక నారు పోయడం, ఆ తరవాత నాట్లు -ఇట్లా పనులు ఉండేటివి. ఆడికి ఎక్కువగా నేనూ చింత రాములు పోయేటోళ్ళం. వచ్చేపోయే దారుల్లో పురేడు పిట్టలు, కంజులు, పుల్లకోళ్ళు కొట్టడం, మడుగుల్ల చేపలు పునకడంలాంటివి చేసేటోళ్ళం.

ఆ తర్వాత చందనారాయణ పొలం, విఠల్ బాబు చేను, సాలె వెంకటేశ్వర్లు పొలం కౌలుకు తీసుకుని ఎవుసాయం చేసేటోడు మా అబ్బా. సిమాంట అరక నేర్చుకునుడు సాయిబు దగ్గరైతేనే మంచిది, అన్ని నేర్పుతడు – నాగళ్ళు,గొర్లు, బురద గొర్రు ఇట్లా అన్నిటికి ఏట పెట్టడం, కాడి కట్టడం, మేడి పట్టడం, రకరకాల తాళ్ళ ముడులు వేయడం – ఇయన్నీ తమాషిగా నేర్పుతడని జీతం ఉండటానికి అడగ్గానే ఒప్పుకునేటోల్లు. అట్లా నా ఇద్దరు దోస్తులు ఎవుసాయవిద్య నేర్చుకున్నరు తొల్త. 

రాత్రి సందకావిలికి జొన్నచేల దగ్గరికి మమ్మల్ని పంపేటోడు పందులు వచ్చి పంట పాడుచేస్తాయని. మంచెమీద, లేదా మంచె కింద పండుకోవాలే .నెగడు వేసుకోవాలె. అప్పుడప్పుడు మా సింగరేణి టూరింగ్ టాకీస్ సిన్మకి పోవాలనుకునేటోళ్ళం. పావలా ఉంటే నేలటికెట్. ఎక్కువగా పౌరాణిక సిన్మలు,జానపద సిన్మలు ఆడేటివి. సందకావిలికి పోయినోళ్ళం ఆ రాత్రిల అటు దొబ్బుడే. రాత్రి కటికచీకట్ల ఒకరివెనుక ఒకరం ఆ కాలిబాటల్ల నడుచుకుంట సెకండ్ షో చూసి, వచ్చి పడుకునేటోల్లం. ఆకాశం వొంక చూస్తె పొద్దుగాలపూట కనిపించే గొరెకొయ్యలు పొడిచేవి.

అపుడపుడు 14 కి.మీ రైలు పట్టాల వెంట ఇల్లందు (బొగ్గుట్ట)నడిచెల్లి జగదంబ టాకీస్, సీతారామ టాకీసుల్లో సిన్మలు చూసి వచ్చేటోళ్ళం. మళ్ళీ పొద్దుగాల ఎవరికీ ఏంచెప్పకుండా అంతా గప్ చుప్.

ఆ చిన్నప్పటి నా సాహసాల్లో ఆ ఇద్దరు నా హీరోలు.

చదువుతూ నేను ఊర్లు మారాను. వాళ్ళక్కడే ఉండిపోయారు జీతాలు అక్కడక్కడా చేసుకుంట. జీవితాలు ఎంత ప్రయత్నించినా మారకుండా మొరాయించాయి. ఇరప రాములు మేకలు మేపుకుంటూ ఇప్పటికీ ఉన్నడు. ఆదివారం సంతలో  డబ్బులు అవసరమైనప్పుడు ఒక మేకను అమ్ముతూ, పిల్లలు పెట్టే మేకల్ని కాపాడుకుంటూ ఊరు చుట్టూ ఉన్న వాగు ఒడ్డు మీదో, కంప పెరిగిన చోటుల్లోనో ఒక గొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతూ, అలిసిపోతూ, సాయంత్రమైతే ఆ శ్రమను మర్చిపోవడానికి కొంచెం సారబొట్టు తాగి ఎప్పట్లాగే కలిసినప్పుడు “నువ్వొచ్చినవ్ గద, ఇయ్యాల రెండు బొట్లు పోయించరాదోయ్” అని చేయి చాస్తడు నా ప్రియమైన దోస్త్ ఇరప రాములు.

*

చింత రాములు మధ్యలో బుగ్గవాగుకు ఇసుక కోసమో, మట్టికోసమో వచ్చే ట్రాక్టర్ డ్రైవర్ తో స్నేహం చేసి డ్రైవింగ్ నేర్చుకుండు. కొన్నాళ్ళకు తనే రైతుల ట్రాక్టర్లకు డ్రైవరయ్యిండు. పగలూ రాత్రి చేన్లు దున్నడం, డబ్బులు వసూలు చేయడం. అలసటని మర్చిపోవడానికి మందు తాగడం. అలా మొదలైన తాగుడు వ్యసనంగా మారి మధ్యమధ్యలో కలిసినప్పుడు చిక్కిపోతున్న తనని చూసి ” రాములూ – ఏందిరా బక్కగయితున్నావ్ ” అంటే, 

“ఎహె – నేనెక్కడ బక్కగయితున్న.” అనేటోడు. వీలయినప్పుడు చిన్ననాటి ముచ్చట్లు తలుసుకుని మురిసిపోయేటోళ్లం. “ఒకసారి హైదరాబాదు రారా” అంటే, “ఈసారి నువ్వొచ్చినప్పుడు తప్పక వస్తా” అనేటోడు.

అతను రాలేదు. కానీ కొన్నాళ్ళక్రితం కబురొచ్చింది నా చిన్నప్పటి యార్, దోస్త్, స్నేహితుడు చింత రాములు ఇక లేడని.

లేడా?

అతను ఇక ఎప్పటికీ రాడా?.రాలేడు.

ఆ ఊరు ఉంది, ఆ వాగు ఉంది

ఏళ్ళు గడిచినా జారిపోయిన ఆ బాల్యపు

జ్ఞాపకాల తడి ఉంది.

మేకల్లో మేకలా మిగిలిన ఇరప రాములున్నాడు.

చింత రాములు – ఇక ఎప్పటికీ లేడు జ్ఞాపకాల్లో తప్ప.

Kavi Yakoob

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *