టీచర్ 1965 Part -2

Spread the love

శరత్ రాజా ఇంటి దగ్గరికి వచ్చాడు.

ఇద్దరూ మైదానంలోకి వచ్చారు. దిబ్బ మీదున్న చింత చెట్ల దగ్గరకు చేరుకున్నారు.

“ఏంటి రాజా! నువ్వు చింత చెట్టు ఎక్కి ఎన్ని రోజులయింది” అన్నాడు శరత్.

రాజా మాట్లాడలేదు.

“నాకు తెలిసి నీకు ఇష్టమైనది మన మైదానం. ఆటలు, చింత చెట్లు. ఇవన్నీ మరిచిపోతున్నావు.”

“ఈ మధ్య నేను ట్యూషన్‌లో చేరాను శరత్. నాకు ఉచితంగా మాస్టారు చదువు చెబుతున్నారు. నేను మీ అందరిలా డబ్బులు ఇచ్చి చదువుకోలేను కదా!”

“చదువు చెబితే మిగతావన్నీ మానేస్తావా?”

“నేను ఏదీ మానలేదు శరత్. మా మాస్టారు ఆటలు ఆడిస్తున్నారు. పాటలు పాడిస్తున్నారు. నీకు తెలుసా? మా మాస్టారు నాకు సైకిల్ నేర్పిస్తున్నారు. కొత్త సైకిల్. రెండుసార్లు కింద పడేశాను. నా కాలికి దెబ్బ తగిలింది. మాస్టారు స్వయంగా టించర్ రాసి కట్టు కట్టారు. నేను మన ఫ్రెండ్స్‌ని సైకిల్ నేర్పమని అడగలేను కదా!”

“నీకు మాత్రమే సైకిల్ నేర్పిస్తున్నారా? పిల్లలందరికీ నేర్పుతున్నారా?”

అందరినీ నేర్చుకోమని చెబుతుంటారు.”

“ఆడపిల్లలని కూడానా?”

“ఆడపిల్లలు సైకిల్ తొక్కకూడదా శరత్?”

“సైకిల్ మగవాళ్ళ కోసం తయారు చేస్తారు.”

“ఆడపిల్లల కోసం కూడా సైకిల్స్ వున్నాయంట!”

“అది సరే, అక్కడ పిల్లలందరూ ఫీజులు ఇచ్చి మీ మాస్టారి దగ్గర చదువుకుంటున్నారు. నీ మీద ఆయనకు ఎందుకంత ఇంట్రెస్ట్!”

రాజా కొద్దిసేపు మాట్లాడలేదు.

“మాట్లాడు.”

“నాకు నాన్న లేరు కదా! అందుకనుకుంటాను.”

శరత్ ముఖంలో కాస్త బాధ కనిపించింది.

“మా మాస్టారికి కూడా నాన్న లేరు. ఆయన్ని చంపేశారంట.”

“ఎందుకు?”

“అందరికీ అన్నీ వుండాలి. అన్నం, చదువు, బట్టలు, ఇల్లు అని ఆయన యుద్ధం చేశారంట.”

శరత్ తలూపి అన్నాడు…

“చదువు బాగా చెబుతున్నారా?”

“చదువు మాత్రమే చెప్పరు. కథలు చెబుతారు. బతుకు గురించి చెబుతారు. నాకు మాస్టారిని చూస్తుంటే దేవుడిలా కనిపిస్తారు శరత్” అన్నాడు.

“అలా వుంటారా టీచర్స్. మనవాళ్ళంతా బెత్తాలూ, తొడపాశాలతోనేగా పాఠాలు చెప్పేది. సర్లే, అప్పుడప్పుడూ మాతో కూడా ఆటలు ఆడు” అని వెళ్ళిపోయాడు.


కుటుంబరావు మాస్టారు క్లాసులో పిల్లలకు చెప్పారు.

“రేపు మీకు ట్యూషన్ లేదు.”

“ఎందుకని మాస్టారు?”

“నేను మా అమ్మని తీసుకువస్తున్నాను. అంతేకాదు, ఇకనుండి మీకు దగ్గర్లోనే వుంటాను. ఈ వీధి మొదట్లో ఓ ఇల్లు వుంది. అది అద్దెకు తీసుకున్నాను. మళ్ళీ ఎల్లుండి నుండి మన క్లాసులు మామూలుగానే జరుగుతాయి. అలాగే మీకు పరీక్షలు వస్తున్నాయి. అందరూ పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టండి. ఇప్పటికే మన పోర్షన్లు పూర్తి అయ్యాయి. రివిజన్ చేయండి. ఇంకా తెలియని విషయాలుంటే నన్ను అడగండి” అన్నారు.

రాజా అమ్మకు ఈ విషయం చెప్పాడు.

“మీ మాస్టారు వాళ్ళు సామాన్లు తెచ్చుకుంటారు. అవన్నీ సర్దుకోవాలి” అంటుంటే,

“నేను వెళ్ళి సర్దిపెడతాను అమ్మా!”

“వినరా! రెండు రోజులు యిబ్బంది పడతారు. పాల దగ్గర్నుండి అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకని మన ఇంటి దగ్గరనుండి ఈ రెండు రోజులూ భోజనం పంపిద్దాం.”

“మాస్టారు ఏమంటారో?”

“ఏమీ అనరు. నిన్ను తీసుకువెళ్ళి ఎన్నిసార్లు భోజనం పెట్టించలేదు మీ మాస్టారు” అంది రాజా అమ్మ.

మాస్టారు వచ్చారు. వాళ్ళ అమ్మను రాజాకి పరిచయం చేశారాయన.

“రాజా… రాజశేఖర్. నీకు చెప్పాను కదమ్మా వీళ్ళ కుటుంబం గురించి.”

ఆమె రాజా చేతులు అందుకుని దగ్గరకు తీసుకుంది. కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అంది.

“ఒకే రకం పక్షులన్నీ ఒక గూటికి చేరతాయంటారు రాజా! మీ ఇద్దరూ ఇలా కలవటం నాకు సంతోషంగా వుంది” అని కళ్ళు ఒత్తుకుంది.

“రాజా! మీ అమ్మగారి చేతివంట గొప్పగా వుందయ్యా… మా అమ్మ కూడా బాగా చేస్తుంది. ఇంతకుముందు తిని వుంటే, మీ అమ్మగారి దగ్గరకు వచ్చి రోజూ భోజనం చేసేవాడిని.”

“ఇప్పుడయినా ఫర్వాలేదు మాస్టారూ! రోజూ మా ఇంటికి రండి” అన్నాడు.

చిన్నగా భుజం మీద తట్టారాయన.


వేసవి సెలవులు.

ఈసారి పిల్లలు అందరూ ‘మేం ఏ ఊరూ వెళ్ళం. ఇక్కడే వుంటాం’ అన్నారు. పెద్దవాళ్ళు బలవంతం చేయలేదు.

“చదువంటే కేవలం పాఠ్య పుస్తకాలే కాదు. ప్రకృతిలోకి వెళ్ళటం. మనం ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటాం. కానీ మన పక్కనే వున్న మనుషుల్ని చూడం. మనకు దగ్గర్లోనే పొలాలు వున్నాయి. పంటలు పండిస్తున్నారు. అలాగే పంట కాలువలు వున్నాయి. గుడులున్నాయి. అవన్నీ చూడాలి. అందుకని మన ప్రయాణం మొదలుపెడదాం” అన్నారు.

వెన్నెల రాత్రుల్లో మైదానంలో పిల్లలందరూ ఆడుకున్నారు. పాటలు పాడారు. అందరూ భయం లేకుండా మాట్లాడుతున్నారు. రకరకాల కథల పుస్తకాలు తెప్పించారు. వారు కథలు చెప్పటం మొదలుపెట్టారు. ఆ వేసవికాలం వారి జీవితాల్లో మరిచిపోని మధుర జ్ఞాపకంగా మిగిలింది.


తిరిగి బడులు తెరిచారు.

అందరికీ వచ్చిన మార్కుల గురించి మాస్టారు చెప్పమన్నారు. కొందరు సిగ్గుపడుతున్నారు.

“ఇందులో ఎవరూ సిగ్గుపడవలసిన అవసరం లేదు. కొంతమందికి తక్కువ మార్కులు వచ్చాయి. అది చెప్పటానికి బిడియం అవసరం లేదు. మనం ఇంకా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు రాజాని అడుగుతున్నాను. నీకు లెక్కల్లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి?”

రాజా లేచి నిలబడి తలదించుకున్నాడు.

“ఎందుకు తలదించుకుంటున్నావు?”

“నాకు లెక్కలంటే భయం మాస్టారూ!”

“లెక్కలంటేనే భయమా? ఇంకేమన్నానా?”

అందరూ రాజాని చూస్తున్నారు.

“మీరందరూ వినండి. మీలో కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం. సైన్స్ అంటే భయం. ఇంకొందరికి దెయ్యాలంటే భయం. వానంటే, ఉరుములంటే, పిడుగులంటే భయం. అసలు ఈ భయమే మనుషులకు పెద్ద అడ్డంకి. ఎవరయినా, దేనికయినా ఎందుకు భయపడాలి?” అని అందరినీ చూశారాయన.

ఎవరూ మాట్లాడలేదు.

“ట్యూషన్‌కి వచ్చిన మొదటిరోజుల్లో మీరు చాలా విషయాలకు భయపడ్డారు. ఇప్పుడు అలాంటిది లేదుగా.”

“నాకు పాములంటే భయం మాస్టారూ” అంది చారులత.

“అప్పుడే పుట్టిన పిల్లలకి పాములంటే భయం వుంటుందా?”

“ఏమో మాస్టారూ!”

“వుండదు. ఎందుకంటే పాము గురించి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. మనందరం పెద్దవాళ్ళం అవుతున్నకొద్దీ కొత్త విషయాలు తెలుస్తాయి. మనుషులందరూ రకరకాలుగా మాట్లాడుతుంటారు. అవి మన మెదడులోకి చేరిపోతాయి. పాము కాటు వేస్తుందని మనకు తెలుసు. కొంతమంది కుక్క పిల్లలని పెంచుకుంటారు. వాటి వల్ల ప్రమాదం లేదని వారికి అర్థం అయింది కాబట్టి. అవునా?”

అందరూ తలలూపారు.

“అందుచేత మనం ఎవరన్నా ఏదన్నా చెబితే గుడ్డిగా నమ్మకూడదు. అది మంచయినా, చెడు అయినా. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలి. లెక్కలంటే ఎవరయినా ఎందుకు భయపడాలి. అసలు లెక్కలు లేనిదే మనకు రోజు గడుస్తుందా? అవే లెక్కలతో అద్భుతాలు సాధించిన వారున్నారు. ముందు మీరు ప్రేమించటం నేర్చుకోండి. మనసుల్లోకి మనం ఈ పని చేయలేం అనుకోవద్దు. అలా అనుకున్న మరుక్షణం మీ ఫెయిల్యూర్ మొదలవుతుంది. నేను ఏదయినా సాధించగలను అనే నమ్మకం, ధైర్యం కావాలి. సరేనా?”

అందరూ తలలూపారు.


మరో సంవత్సరం గడిచిపోయింది.

ఈలోగా చిన్న మార్పులు జరిగాయి. మాస్టారి పేరు మారుమోగిపోయింది. ట్యూషన్‌లో పిల్లలు పెరిగారు. స్వరాజ్యం మామ్మగారి చోటు చాలటం లేదు. అక్కడకు దగ్గర్లో ఓ రైస్ మిల్ వుంది. ఆ ఆవరణ చాలా పెద్దది. పిల్లల్లో ఒకరిద్దరు నాన్నలు వారితో మాట్లాడారు. వారు తమ ఆవరణను చదువులు చెప్పటానికి అంగీకరించారు. ఎలాంటి అద్దె అవసరం లేదు అన్నారు. అందులో వారి పిల్లలు కూడా వున్నారు.

అప్పుడే పిల్లలు వడ్లు బియ్యంగా ఎలా మారుతాయో చూశారు. రాజా వాళ్ళు ఏడవ తరగతికి వచ్చారు.

ఆరోజు మాస్టారు రాజాతో చెప్పారు.

“మీకు టీచరమ్మ వస్తున్నారు.”

రాజాకి అర్థం కాలేదు.

“నేను పెళ్ళి చేసుకోబోతున్నాను. ఆ అమ్మాయి పేరు సుగుణ. తను హిందీ పండిట్. ఇకనుంచి మీకు హిందీ నేర్పుతారు.”

“మీరు హిందీ కూడా నేర్పుతున్నారు కదా మాస్టారూ?”

“నేర్పుతున్నాను గానీ సుగుణా టీచర్ నాకంటే ఎక్కువ చదివారు. అన్ని పరీక్షలూ పాసయ్యారు. అంటే మరింత అథెంటిక్‌గా చెబుతారు” అన్నారాయన.

“పెళ్ళి ఎప్పుడు మాస్టారూ?”

“రెండు వారాల్లో వుంటుంది. మన ట్యూషన్‌కి అయిదు రోజులు సెలవులుంటాయి. నువ్వు కూడా నాతో పెళ్ళికి వస్తున్నావు. వాళ్ళు రాజమండ్రిలో వుంటారు.”

“నేనా!” అన్నాడు ఆశ్చర్యంగా.

“ఫ్రెండ్‌వి అయినా, స్టూడెంటువి అయినా, బంధువు అయినా నువ్వే రాజా. మనం కలిసి వెళ్దాం” అన్నారాయన.

రాజాకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి.

“సంతోషంలో కూడా కన్నీళ్ళు వస్తాయి” అని భుజం తట్టారాయన.


రాజా, అమ్మ, ప్రతిభలు కూర్చున్నారు.

“నిన్ను పెళ్ళికి రమ్మని పిలవటం బాగుంది. మాస్టారికి నువ్వంటే ఎంతో అభిమానం అని ముందునుండి తెలుస్తూనే వుంది. కానీ…” అని ఆగిపోయింది.

“ఏంటమ్మా! నన్ను వెళ్ళవద్దు అంటావా?”

“నాలుగయిదు రోజులు అక్కడ వుండాలి. అది ఎలా కుదురుతుంది. దగ్గర అయితే ఆ రోజు వెళ్ళి వచ్చేవాడివి.”

“అసలు సమస్య వేరేది వుంది” అంది ప్రతిభ.

“ఏంటక్కా?” అన్నాడు రాజా.

“రాజా…!” అని వినిపించింది. పరుగున వెళ్ళాడు, కుటుంబరావు మాస్టారు బయట కనిపించారు.

“లోపలకు రండి మాస్టారూ” అన్నాడు.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు. అప్పటిదాకా కూర్చున్న రాజా అమ్మ, ప్రతిభ లేచి నిలబడ్డారు.

“ఎందుకమ్మా లేచారు. కూర్చోండి” అన్నారాయన.

“ఫర్వాలేదు బాబూ” అంది అమ్మ.

“నాకు పెళ్ళి కుదిరిందండి. మా అమ్మ మీకు చెప్పమని పంపించారు.”

“ఇప్పుడే రాజా చెబుతున్నాడు.”

“అవును. తనని నాతో తీసుకువెళ్తాను. రాజాకి బట్టలు లేవని నాకు తెలుసు. నేను కూడా తీసుకోవాలి. రాజాకు మూడు జతల బట్టలు తీసుకుంటాను. రాజమండ్రిలో తనకి ఎలాంటి సమస్య వుండదు. మీరు కాదనకండి” అన్నారాయన.

“ఇప్పటికే మీకు రుణపడిపోయాం బాబూ! రూపాయి తీసుకోకుండా చదువు చెబుతున్నారు. పెళ్ళి అంటే ఖర్చులుంటాయి. వాడికి బట్టలు అంటే…” అని ఆగిపోయింది.

“నాకు బ్రదర్స్‌ గాని, సిస్టర్స్ గాని వుంటే తీసుకోనా అమ్మా. రాజా నా తమ్ముడు లాంటివాడు. అలాంటి ఆలోచనలు వద్దు. ఇప్పుడు మేం బట్టల షాపుకి వెళ్తున్నాం. పెళ్ళి అయ్యాక నా భార్యతో వచ్చి కలుసుకుంటాను” అన్నారాయన.

“మంచిది బాబూ!” అంది ఏమీ మాట్లాడలేక.

ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు.

“ఏంటి ప్రతిభా! ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు” అందామె.

“నాకూ తెలియటం లేదమ్మా! నేను బట్టల విషయమే మాట్లాడాలనుకున్నాను. ఓసారి నాన్న ఏం చేశారో తెలుసా! నాకూ, రాజాకి ఐస్ ఫ్రూట్ తినాలనిపించింది. ఆ బండతను వచ్చాడు. అప్పుడు మన ఇంటి దగ్గర మస్తాన్ గారి అబ్బాయి సలీం ఇంకో నలుగురు పిల్లలు వున్నారు. అందరికీ నాన్న ఐస్ ఫ్రూట్ ఇప్పించారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది.”

“మీ నాన్న అలానే చేసేవారు ప్రతిభా! పార్టీలో పని చేసే కట్టయ్య అని వుండేవారు. చాలా బీదవాళ్ళు. మీకు బట్టలు తీసుకునేటప్పుడు వారి పిల్లలకూ తీసుకునేవారు. కొంతమంది అంతే. ఇప్పుడు మాస్టారిలో మీ నాన్న లాంటివారు కనిపిస్తున్నారు” అంది అమ్మ.

అసలు ఆశ్చర్యం ఇంకోటి వుంది.

రాజా ఇంటికి వస్తూ అమ్మకు చీర, ప్రతిభకు ఓ డ్రెస్ తీసుకువచ్చాడు.

“ఇదేంటి రాజా! మాకు ఎందుకు?” అంది అమ్మ.

“మాస్టారు తీసుకున్నారు.”

“వద్దని చెప్పకపోయావా?”

“ఎందుకు మాస్టారూ అన్నాను. నువ్వు టీచర్ చెప్పింది వినాలి. ఎదురు చెప్పకూడదు అన్నారు.”


మాస్టారి పెళ్ళి నిరాడంబరంగా జరిగింది.

ఇద్దరూ దండలు మార్చుకున్నారు. తర్వాత పెళ్ళి జరిపించిన పెద్దాయన ఇద్దరితో ప్రమాణం చేయించారు. రెండు పత్రాలు మీద సంతకాలు చేయించుకున్నారు.

“కష్టంలోనూ, సుఖంలోనూ ఒకరికి ఇంకొకరు తోడుగా నీడగా వుంటాం. మా జీవితం మేం చూసుకుంటూ, సమాజం కోసం మాకు చేతనైనంత మేరకు సహాయ సహకారాలు అందిస్తాం.”

ఇదీ ప్రతిజ్ఞలో భాగం.

తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. అవన్నీ అయ్యాక మాస్టారు సుగుణా టీచర్‌ని రాజాకి పరిచయం చేశారు.

“రాజశేఖర్… రాజా అని అందరూ పిలుస్తారు. ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతున్నాడు. నా హృదయానికి దగ్గరగా వచ్చినవాడు. ఓ రకంగా చెప్పాలంటే మా నాన్న, వీళ్ళ నాన్న కూడా సమాజం కోసం ప్రాణాలు ఇచ్చినవారే.”

అప్పుడు సుగుణా టీచర్ రాజా కళ్ళల్లోకి చూసింది. పెదవులు కదిలీ కదలకుండా నవ్వాడు రాజా.

“ఇకనుండి నేను కూడా మీ టీచర్నే” అందామె.

“సుగుణకి సంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేసుకోవాలని వుందేమో. మా అమ్మ మాత్రం మీ నాన్నగారు వుంటే ఇలానే చేయించేవారు అంది. అందుకు ఒప్పుకున్నారు” అన్నారు మాస్టారు.

“పెళ్ళి ఎలా చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు రాజా. ఎవరి విషయంలో అయినా కలిసి సంతోషంగా బతుకుతున్నారా లేదా అనేది ముఖ్యం. మా ఇంట్లో వారికి ఆ పద్ధతిలో పెళ్ళి చేయాలని వుండవచ్చు. నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు” అంది సుగుణా టీచర్.

తర్వాత ఇంకో వ్యక్తిని పరిచయం చేశారు మాస్టారు. అతను భువన్. సుగుణ గారి తమ్ముడు. రాజా కంటే ఏడెనిమిది సంవత్సరాలు పెద్దవాడు.

“భువన్‌తో మాట్లాడాను. ముందు ముందు అద్భుతాలు చేస్తాడని నాకు అనిపించింది రాజా. చాలా మంచి ఆలోచనలు వున్నాయి. అయితే టీచర్ అవుతాడని నేను చెప్పలేను.”

“ఇంట్లో అందరం ఆ వృత్తినే ఎందుకు తీసుకోవాలి బావగారూ… నాకు చాలా ప్రణాళికలు వున్నాయి. అందులో ఒకటి మిలటరీలో చేరటం” అన్నాడు భువన్.

రాజా ఆశ్చర్యపోయాడు.

“అవును బావగారూ! ఈ దేశాన్ని మార్చాలంటే ముందు దేశాన్ని కాపాడుకోవాలి. ఇంకా రాజా గురించి చెప్పండి.”

“నా దగ్గరకు రాకముందు రాజాలో చాలా భయాలున్నాయి. ముఖ్యంగా లెక్కలు, ఇంగ్లీష్ అంటే భయం. ఇప్పుడు మా ట్యూషన్‌లో అన్ని సబ్జెక్ట్స్‌లో రాజా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్.”

“ఓ నైస్” అన్నాడు భువన్.

“అదో కోణం. ఆటల విషయంలో, పాటల విషయంలో కూడా అతని వేగం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఇంకా చాలా చేయాలనుకుంటాడు. అవకాశాలు చాలా తక్కువ. చూద్దాం.”

“మరో టీచర్‌ని తయారు చేస్తున్నారా బావా?”

“రేపు ఎవరేం అవుతారో మనం ఎలా చెప్పగలం భువన్. నేను కూడా టీచర్‌ని అవుతానని అనుకున్నానా! ఇందులోకి వచ్చాక మాత్రం అనిపించింది, మనం చేయలేని పనులన్నీ మన విద్యార్థులు చేస్తారని. ఒకటి మాత్రం చెప్పగలను. నేను బతికున్నంత కాలం టీచర్‌గానే వుంటాను.”

మాస్టారి మాటలు రాజా మనసులో ముద్రించుకుపోయాయి.

“నీకు మంచి జరగాలి రాజా! అవకాశాలు అందరికీ రావు. మనం సృష్టించుకోవాలి. మీ మాస్టారితో పాటు నేను కూడా నీ నుండి చాలా ఆశిస్తున్నాను” అన్నాడు భువన్.


కుటుంబరావు మాస్టారు సుగుణ గారిని కాపురానికి తీసుకువచ్చారు. ఓ రోజు రాజా వాళ్ళమ్మ ముగ్గురినీ భోజనానికి పిలిచింది.

ఆరు నెలలు గడిచిపోయాయి.

ఆరోజు రాజాని మాస్టారు రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్ళారు. అక్కడ బల్లల మీద కూర్చున్నారు. కొంచెంసేపు మౌనంగా వున్నారు.

“నేను హైదరాబాద్ వెళ్తున్నాను రాజా” అన్నారు మెల్లగా.

“ఎందుకు మాస్టారూ?”

“అక్కడ ఓ పెద్ద స్కూల్ వుంది. వారికి టీచర్స్ కావాలంట. నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు.”

రాజా ముఖం మాడిపోయింది.

“అక్కడ సెలెక్ట్ అవుతానని గ్యారెంటీ లేదులే” అన్నారాయన.

“మీరు కాకుండా ఎవరు అవుతారు మాస్టారూ!”

“నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే బాధగా వుంది రాజా. ఇది నా మొదటి పాఠశాల. నేను తొలి ఉపాధ్యాయుడిగా ఇక్కడ అడుగులు వేశాను. ఇప్పుడు పెళ్ళి అయింది. రేపు పిల్లలు పుడతారు. అమ్మ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ ట్యూషన్ మీద వచ్చే ఆదాయం చాలటం లేదు. అలాగే మిల్లు వారికి కూడా ఇబ్బందిగా వుంది. వారికి ఆర్డర్స్ వచ్చాయి. బయట ధాన్యం నిల్వ చేస్తున్నారు. ఎప్పుడూ లోడింగ్, అన్ లోడింగ్, వచ్చే లారీలు, కూలీల అరుపులు. ఇదివరకటి ప్రశాంతత లేదు” అని ఆగారు.

రాజాకు అది తెలుసు.

“మనం ఇంకెక్కడన్నా స్థలం చూసుకోవాలి. అది ఉచితంగా ఇవ్వరు. చాలా అద్దెలు అడుగుతున్నారు. మనం తీసుకునే ఫీజులు తక్కువ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అక్కడయితే టీచర్ గారికి ఉద్యోగం వస్తుంది. లేదంటే కొంతమందికి ట్యూషన్ చెప్పుకోవచ్చు. నాలుగయిదు సంవత్సరాలు బాగా కష్టపడాలి రాజా!”

“అవును మాస్టారూ!”

“అయినా మనం అనుకున్నవి జరగవులే. హైదరాబాద్ అంటే చాలా పోటీ వుంటుంది. నాకంటే ఎక్కువ డిగ్రీలున్నవారు వస్తారు. ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది రాజా. నేను ఓ ప్రయత్నం చేస్తున్నాను. అంతే” అన్నారు.

రాజా ఇంటికి వచ్చాడు. అమ్మకూ, అక్కకూ ఈ విషయం చెప్పాలనిపించలేదు. అతని మనసులో మాస్టారికి ఈ ఉద్యోగం రాకుండా వుంటే బాగుండుననిపించింది. పడుకున్నాడు గానీ నిద్ర పట్టలేదు. ఎప్పటికో కళ్ళు మూతలు పడ్డాయి.

అప్పుడు అమ్మ వచ్చి తట్టి లేపింది.

“నువ్వు ఇలా అనుకోవటం తప్పు కదా. మాస్టారికి ఉద్యోగం రాకూడదా! ఆయన సంగతి నీకు తెలుసు. ఫీజులు కూడా ఇచ్చినప్పుడు తీసుకుంటారు. బలవంతం చేయరు. నీకోసం మాస్టారు బాధలు పడాలా? ఇది సరయింది కాదు” అంది అమ్మ.

“అది కాదమ్మా!” అని ఏదో చెప్పబోయాడు.

“మొన్న మీ బాబాయి వచ్చాడు. నీ గురించి అడిగాడు. వాడి చదువు ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు. మహా అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు. తర్వాత ఏ కిరాణా దుకాణంలోనో పనికి పెట్టాలన్నాను. రేపు మీ మాస్టారి పిల్లలకి కూడా అలాంటి పరిస్థితి రావాలా?”

“వద్దు వద్దు” అని అరిచాడు.

“ఏంటిరా! నిద్రలో కలవరిస్తున్నావు” అంది ప్రతిభ.

అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు.

“ఏం లేదక్కా!” అన్నాడు.

“నువ్వు రెండు రోజుల నుంచి దిగులుగా వుంటున్నావు ఎవరేమన్నా అన్నారా?”

“లేదక్కా!”

“సరే నిద్రపో” అంది ప్రతిభ.

రెండు రోజులపాటు మాస్టారి కోసం ఎదురు చూశాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మూడో రోజు మాస్టారు వచ్చారు. ముందుగా రాజా దగ్గరకు వచ్చి మైదానంలోకి తీసుకువెళ్ళారు.

“రాజా! నేను సెలెక్ట్ అయ్యాను” అన్నారు ఆనందంగా.

ఒక్కసారిగా కృంగిపోయాడు రాజా.

ఆయన మాట్లాడుతున్నారు.

“నేను ముందే చెప్పాను కదా చాలా పోటీ వుంటుందని. ఎంతోమంది వచ్చారు. నన్ను సెవెన్త్ క్లాసుకి వెళ్ళి పాఠం చెప్పమన్నారు. ఇంగ్లీష్, లెక్కలు. నేను పాఠం చెప్పటం మొదలుపెట్టాను. ఇప్పటివరకు నాకు అనుభవం వుంది. నా ఎదురుగా వున్నది మీ అందరూ అనిపించింది. పిన్ డ్రాప్ సైలెన్స్. నన్ను బయట నుండి గమనిస్తున్నారు. క్లాస్ ఎప్పుడు పూర్తి అయిందో తెలియదు. పిల్లలు చప్పట్లు కొట్టారు. రాజా… వారి ముఖాల్లో ఆనందం చూసినప్పుడు మీ అందరూ గుర్తొచ్చారు” అని ఆగారు.

“మాట్లాడవే!”

“మీరు చెప్పేది వింటున్నాను మాస్టారూ”

“వెంటనే అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. వెంటనే జాయిన్ అవమన్నారు. దగ్గర్లో ఇల్లు కూడా వారు చూపించారు.”

“అంటే మీరు వెళ్ళిపోతారా మాస్టారూ?”

“తప్పదు కదా! రెండు రోజుల్లో వెళ్ళిపోతాం.”

రాజా అక్కడ నుండి పరుగులు తీసుకుంటూ వెళ్తుంటే మాస్టారు విస్తుపోయారు. అటే చూస్తున్నారు. అప్పుడాయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

రాజా ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా దుఃఖం బద్దలయింది. భోరున ఏడుస్తున్నాడు. కంగారుగా అమ్మ వచ్చింది.

“ఏమైంది రాజా… ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది?”

ఇంతలో ప్రతిభ వచ్చింది.

“ఏమైంది తమ్ముడూ” అంటోంది.

ఏడుపు ఆగటం లేదు.

“ఏం జరిగిందో చెప్పకుండా ఏడిస్తే మాకు ఎలా తెలుస్తుంది?”

“మాస్టారు వెళ్ళిపోతున్నారు.”

“ఎక్కడికి?”

“హైదరాబాద్‌కి. ఆయనకి టీచర్‌గా అక్కడ ఉద్యోగం వచ్చింది.”

ప్రతిభా, అమ్మా ఒకరి ముఖం ఇంకొకరు చూసుకున్నారు. రాజా వెక్కిళ్ళు వినిపిస్తూనే వున్నాయి.


ఆరోజు రాత్రి కుటుంబరావు మాస్టారు రాజా ఇంటికి వచ్చారు. దానికి ముందు స్వరాజ్యం మామ్మగారిని, ఆ వీధిలో వున్న పిల్లల తల్లితండ్రులను కలుసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పారు. పిల్లలకు, అమ్మానాన్నలకు కూడా మాస్టారు వెళ్ళటం బాధగానే వుంది. ఆయన మొదటి రోజు వచ్చి మామ్మగారితో మాట్లాడిన దృశ్యం వారి మనసులో వుంది.

మామ్మగారి పాదాలకు నమస్కరించారు. అంతకుముందు సుగుణా టీచర్‌ని కూడా తీసుకువచ్చి వారికి పరిచయం చేశాడు.

“మీరు వున్నంతకాలం పిల్లల గురించి మేం ఆలోచించవలసిన అవసరం రాలేదు. వాళ్ళు కూడా ట్యూషన్‌కి వెళ్ళం అని ఏ రోజూ అనలేదు. ఓ మాస్టారు ఎలా వుండాలి అనేది మిమ్మల్ని చూశాక మాకూ తెలిసింది. ముందు ముందు మీరు చాలా ఎత్తులకు ఎదగాలి” అన్నారు.

రాజా ఇంకా దిగులుగా వుండటం చూశారు మాస్టారు. దగ్గరకు పిలిచి తల మీద చేతులు వేసి నిమిరారు.

“నిన్నటి నుండి వీడు ఏడుస్తూనే వున్నాడు బాబూ… ఎంత సముదాయించినా ఆగటం లేదు” అంది అమ్మ.

“రాజా! నువ్వు గుర్తుంచుకో. మనుషులందరూ ఎప్పుడూ కలిసి వుండటం కుదరదు. అది స్నేహితులు కావచ్చు. అమ్మా, నాన్నలు అక్కా, తమ్ముళ్ళు ఎవరయినా సరే ఏదొక రోజు విడిపోవాల్సిందే. నీకే కాదు నాకూ మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా వుంది. కానీ తప్పదు.”

రాజా కళ్ళు తుడుచుకున్నాడు.

“మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. ఈసారి నిన్ను చూసేటప్పుడు వీడు నా రాజా… నేను కూడా తయారు చేసుకున్న నా విద్యార్థి అనుకోవాలి” అన్నాడు.

పిల్లలందరూ బస్‌స్టాండ్‌కి వెళ్ళారు. బస్సు కదులుతున్నప్పుడు ఒక్కసారిగా పిల్లలందరూ భోరున ఏడ్చేశారు. ఆ దృశ్యం చూస్తున్న కొంతమందికి ఆశ్చర్యం కలిగింది. ఇంకొంతమందికి నవ్వు వచ్చింది. ఎవరో అడుగుతున్నారు.

“ఎందుకు పిల్లలు ఏడుస్తున్నారు?”

“వాళ్ళ మాస్టారంట. ఈ ఊరి నుండి వెళ్ళిపోతున్నారు. అందుకు!”

“పంతులు గారు వెళ్తుంటే ఏడుస్తున్నారా? అతని పేరేంటి?”

“ఏమో తెలియదు.”


రాజా ఇంటిదగ్గర ఉండటం లేదు. ఎక్కువగా మైదానంలో వుంటున్నాడు. చింత చెట్ల దగ్గర వుంటున్నాడు. మిగతా పిల్లలు కొత్త ట్యూషన్లలో చేరిపోయారు. అమ్మ రాజాని గమనిస్తోంది. గట్టిగా మాట్లాడితే ఏడ్చేస్తున్నాడు.

చీకట్లు కమ్ముకుంటున్నాయి. పిల్లలందరూ వెళ్ళిపోయారు ఆటలు ముగించుకుని. దిబ్బ మీద ఒంటరిగా కూర్చున్నాడు రాజా. మోకాళ్ళ మధ్యన తల ఆనించి ఆలోచిస్తున్నాడు.

“మాస్టారు ఏం చేస్తున్నారో” అనుకున్నాడు.

తనకు మాస్టారిని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్తే ఎలా వుంటుంది అనిపించింది. అందుకు డబ్బులు కావాలి. రైలులో దొంగతనంగా వెళ్తే పట్టుకోరా. అప్పుడు జైలులో పెట్టరా అనుకున్నాడు.

“ఒక్కడివే ఏం చేస్తున్నావు రాజా!” అని వినిపించింది.

ఉలిక్కిపడి చూస్తే ప్రతిభ అక్క.

“అసలేంటిరా. నాన్న చనిపోయాడు. అప్పుడు నువ్వింకా చిన్నపిల్లవాడివి. చావు అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు కాస్త పెద్దవాళ్ళం అయ్యాం కదా. ఇంకా నాన్నను తలచుకుని ఏడుస్తూ కూర్చుంటామా? బాధ వుంటుంది. మీ మాస్టారికి లేదా? తను సంతోషంగా మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళలేదు. నీకు చెప్పారు కదా. వాళ్ళ నాన్నను చిన్నతనంలో చూసిందే తక్కువ అని.”

అక్కకేసి చూస్తున్నాడు.

“మాస్టారి మీద ప్రేమ, గౌరవం అంటే ఏడుస్తూ కూర్చోవటం కాదు. అది రెండు రోజులు వుంటుంది. తర్వాత ఎవరి పనులు వారు చూసుకోవాలి. అమ్మ నీ గురించి చాలా బాధపడుతోంది. నీకు ఇంకో విషయం తెలుసా? అమ్మకు మనిద్దరం తప్ప ఎవరూ లేరు. మనల్ని చూసుకుని బతుకుతోంది. నువ్విలా తయారవటం బాగుందా? ఇది మీ మాస్టారికి తెలిస్తే ఏమనుకుంటారు. రాజా ఇంత బలహీనుడా! నేను లేకుండా బతకలేడా? ఎంతగా జాలిపడాలి అనుకోరూ… బాధపడింది చాలు. వెళ్దాం పద. రేపటినుండి నువ్వు పాత రాజావి కావాలి” అని చేతులు అందుకుంది.

ఇద్దరూ ఆ మైదానంలో అడుగులు వేస్తున్నారు.


బడిలో శరత్ కలిశాడు.

“మీ మాస్టారు వెళ్ళిపోయారంట కదా” అన్నాడు.

“అవును శరత్” అన్నాడు రాజా.

“నాకు సంతోషంగా వుందిరా. అతను వచ్చిన దగ్గర్నుంచి నువ్వు మాకు దూరం అయ్యావు. శని వదిలిపోయింది” అన్నాడు.

“అలా అనకు శరత్. నాకు మాస్టారు శని కాదు. దేవుడిలా వచ్చారు. నన్ను అందరూ దురదృష్టవంతుడు అంటారు. మా నాన్న బతికి వుంటే ఇంకోరకంగా వుండేది. మీ అందరిలా వుండేవాడిని. ఇప్పుడు మాస్టారు కూడా వెళ్ళిపోయారు. అవును, నేను దురదృష్టవంతుడ్నే.”

“సారీ రా! నిన్ను బాధ పెట్టటానికి అనలేదు. ఇంకో విషయం తెలుసా? నేను ఏ విషయంలో అయినా నీతో పోటీ పడాలనుకుంటాను. మన మైదానంలో ఫ్రెండ్స్ వున్నారు. వాళ్ళు ఎవరూ ఏ ఆటలోనూ నన్ను గెలవలేరు. నీతో పోటీ పడుతుంటే మజా వస్తుంది. ఒక్కోసారి నేను గెలిస్తే ఇంకోసారి నువ్వు గెలుస్తావు. కాకపోతే…” అన్నాడు శరత్.

“ఏంటో చెప్పు?”

“నువ్వు పాటలు బాగా పాడతావు. అందులోనూ చింత చెట్ల మీద నువ్వు కూర్చుంటే ఆటోమేటిక్‌గా నీ నుండి పాటలు వస్తాయి. నాకు అప్పుడు పిట్టలు గుర్తు వస్తాయి. కోకిల గుర్తు వస్తుంది.”

“నువ్వు కూడా పాటలు పాడొచ్చు శరత్!”

“ఎవరయినా పాడవచ్చు. కానీ నాకు భయం!”

“ఎందుకురా భయం. మా మాస్టారు మనం దేనికీ భయపడకూడదు అని చెప్పారు. అందుకు ఓ కథ చెప్పారు.”

“నాకూ చెప్పు రాజా” అన్నాడు ఆసక్తిగా శరత్.

“ఓ పెద్ద మర్రిచెట్టు వుండేదంట. అక్కడికి ఒంటరిగా పగటిపూట వెళ్ళడానికి ఊర్లో జనం భయపడేవారంట. ఇంక రాత్రులు అయితే ఎవరూ ఆ చుట్టుపక్కలకు వెళ్ళేవారు కాదంట.”

“అయితే!”

“మా మాస్టారు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలనుకున్నారు. దెయ్యాలు, భూతాలు ఆ చెట్టు మీద వుంటాయని, అటు వెళ్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారని రకరకాల కథలు చెప్పుకునేవారు. నాకు దెయ్యాలు వుంటే చూడాలని వుంది. అందుకని ఎవరికీ చెప్పకుండా వెళ్ళాలనుకున్నాను…”

“ఎవరికీ చెప్పకపోవటం ఎందుకు?”

“అప్పుడు మాస్టారిది మన వయసు. ఇది చెబితే వెళ్ళనీయరు కదా!”

“సరే తర్వాత జరిగింది చెప్పు.”

“చీకటి పడింది. అప్పుడు మాస్టారు వెళ్ళారు. చెట్టుకేసి చూస్తుంటే ఆయనకు భయం మొదలయింది. విన్న కథలు గుర్తు వస్తున్నాయి. గాలి మొదలైంది. కొమ్మలు కదులుతున్నాయి. కీచురాళ్ళ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆగిపోతున్నాయంట.”

శరత్ ముఖంలో కాస్త భయం కనిపించింది.

“అలా కొంతసేపు నిలబడి చెట్టుకేసి చూస్తుండిపోయారు. తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆ చెట్టు ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళారు. కొంతదూరం వెళ్ళి ఆగి వెనక్కి చూశారు. అయిదు నిమిషాల తర్వాత తిరిగి ఆ చెట్టు ముందు నుండి నడిచి వచ్చారు. అప్పుడు అనుకున్నారంట. మన భయమే దెయ్యాలు, భూతాలు అని. అందుకని మనం దేనికీ భయపడకూడదు అని చెప్పేవారు” ముగించాడు రాజా.

శరత్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత…

“భయం అంటే దెయ్యాలూ, భూతాలూ కాదు రాజా. ఆయన ఒక్క అనుభవంతో దేనికీ భయపడకూడదు అని చెప్పటం ఈజీనే. నాకు ఇంకో అనుమానం కూడా వుంది.”

“ఏంటి శరత్ అది?”

“ఆయన కూడా నీలానే పుస్తకాలు ఎక్కువ చదువుతారేమో. మనం దెయ్యాలున్నాయి అనే కథలు చదివితే వున్నాయి అనిపిస్తుంది. లేవు అనే పుస్తకాలు చదివితే లేవు అనుకుంటాం. అది కొద్దిసేపే. మీ మాస్టారు ఆ దెయ్యాల మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళకుండానే ఈ కథ కల్పించి చెప్పారని నా అనుమానం.”

“అలా ఎందుకు చెప్తారు శరత్.”

“దేవుడు వున్నాడు అనేవారు కూడా స్వయంగా అన్నీ చూసినట్లు చెబుతారు. అవన్నీ కథలు.”

“అంటే దెయ్యాలు, దేవుళ్ళు లేరంటావా?”

“తెలియదు. ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఒకటి వుంది. అదే భయం!”

రాజా శరత్ నే చూస్తున్నాడు.

“భయపడకూడదు అని అందరూ చెబుతారు. అది సులభం. కానీ ప్రతి మనిషిలో భయం వుంటుంది. కొన్ని విషయాలకు, కొంతకాలం భయం వుండకపోవచ్చు. రేపు మీ మాస్టారే దెయ్యాలు వున్నాయని చెప్పవచ్చు. ఏదయినా భయం లేని మనుషులుంటారని నేను నమ్మను.” అన్నాడు.

“శరత్! నీకు చాలా విషయాలు తెలుసు. నువ్వు పుస్తకాలు బాగానే చదువుతున్నావు!”

“ఇంకా లేదురా! అయినా ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలనుకుంటున్నాను.”

“అయినా పాట పాడటానికి భయం ఎందుకు?”

“నేను బాగా పాడలేనని. విన్నవారు నవ్వుకుంటారని. అది నాకు సిగ్గుగా వుంటుంది. బెరుకుగా వుంటుంది రాజా. భయంలో ఇవన్నీ వుంటాయి. నువ్వు అలా కాదు కదా! హాయిగా అప్పటికప్పుడు పిలిచి పాట పాడమంటే పాడేస్తావు. అందుకే నీకు ఆరో తరగతి నుండి చాలా బహుమతులు వచ్చాయి. సర్లే. ఇవన్నీ ఎప్పుడూ వుండేవే. ‘వాలీబాల్’ ఆడుకుందాం రా” అన్నాడు.

రాజా తలదించుకున్నాడు.

“ఏమైందిరా?”

“నేను ప్రయత్నం చేశాను శరత్. ఈ కోర్ట్ నుండి ఆ కోర్ట్‌కి బాల్‌ని సర్వీస్ చేయటం నావల్ల కావటం లేదు. నెట్ అవతలకి బాల్ వెళ్ళటం లేదు. అలాగే బాల్‌ని వ్రేళ్ళ మీద నుంచి లిఫ్ట్ చేయాలి. అది కూడా చేతకావటం లేదు” అన్నాడు రాజా.

“మొదట్లో అలానే వుంటుంది. ఆ కిటుకు తెలిస్తే ఈజీగానే వుంటుంది.”

“లేదు శరత్. నా వ్రేళ్ళలో శక్తి లేదు. బాగా నొప్పి పుడుతుంటాయి ఆడిన రోజు. అందుకని నేను వాలీబాల్‌కి దూరంగా వుంటున్నాను.”

“అంటే నీకు వాలీబాల్ అంటే భయం. మీ మాస్టారు వుంటే నీలో ఆ భయం పోగొట్టేవారేమో. సరే. నేను వెళ్ళి కొంచెంసేపు ఆడుకుంటాను” అని వెళ్ళాడు.

శరత్ వాలీబాల్‌ని అందుకున్నప్పుడు అనిపించింది…

“రాజా గాడి వ్రేళ్ళల్లో బలం లేదు. వాడికి మంచి తిండి లేదు. అదే వుంటే మాలాగా బలంగా తయారయ్యేవాడు.”


రాజా ఇంటికి వస్తున్నాడు. అప్పుడు మస్తాన్ ఎదురయ్యాడు. క్యా రాజా సాబ్ కైసా హై?”

“బాగున్నాను మస్తాన్ గారూ! సలీం ఎలా వున్నాడు?”

“బాగున్నాడు బేటా. వాడికి జర తెలుగు పాఠాలు చెప్పు.”

“నేను టీచర్ని కాదుగా!”

“టీచరే చెప్పాలా! ముందుగాల మంచి తెలుగు మాట్లాడటం నేర్పించు. నువ్వు భీ సలీం దగ్గర హిందీ, ఉర్దూ నేర్చుకో. సదువుకునేది రాయటానికే కాదు. మాట్టాడటం వస్తే చాలు.”

“మీరు పాడే హిందీ పాటలు నాకు ఇష్టం మస్తాన్ గారూ”

“సయీ!” అన్నాడు మస్తాన్.

రాజా తలూపాడు.

“హిందీ మే బహుత్ అచ్ఛా గానా హై రాజా సాబ్. ఆప్ బి సికావ్. సలీం రఫీ భాయ్‌లా పాటలు పాడాలే. మాకీ ముంతాజ్ భేటి వుంది. ముంతాజ్ లతాజీ లా పాడాలి. నా మర్జీ అది. ఉప్పర్ భగవాన్ హై… దేముడి దయ” అన్నాడు.

“నేను వెళ్తానండి” అన్నాడు రాజా.

“ఏక్ మినిట్ టైరో”అని…
“ఆదివారం మా సలీంతో ఘోష్ పంపిస్తాను. మంచి మాంసం. అమ్మకి చెప్పు.”

“అమ్మ దగ్గర డబ్బులు లేవు మస్తాన్ గారూ…”

“అరె క్యా భేటా… నిన్ను, మాజీని పైసల్ నేను అడిగానా. నువ్వు చూడు బక్కగా వున్నావు. ఘోష్ తినాలే. గప్పుడు కదా బలం వస్తాది.”

“అమ్మ ఊరికే తీసుకోదు మస్తాన్ గారూ!”

“ఐసా” అని ఆలోచించాడు.

“ఓ పని చేద్దాం రాజా సాబ్. అమ్మ దగ్గర ఎప్పుడు పైసలుంటే అప్పుడు ఇస్తుంది. ఒక్క రూపాయి. పావలా వున్నప్పుడు పావలా. దస్ పైసే వున్నప్పుడు దస్ పైసే. నేను మాజీతో మాట్లాడతాను” అని మస్తాన్ వెళ్ళిపోయాడు.


కాలం పరుగులు తీసింది.

చీకట్లో మైదానం మధ్యలో ఒంటరిగా కూర్చున్నాడు రాజా. చల్లటి గాలి వీస్తోంది. పిల్లలందరూ సంబరాల్లో వున్నారు. ఉదయం శరత్ దగ్గర నుండి చారులత, ఇతర పిల్లలు అందరూ ఆశ్చర్యంగా చూశారు నోటీస్ బోర్డ్‌లో రాజా నెంబర్ కనిపించలేదు.

అతను ఏడవ తరగతి ఫెయిల్ అయ్యాడు!

“నువ్వు ఫెయిల్ అవ్వటం ఏమిట్రా?” అన్నాడు శరత్. రాజాకి దుఃఖం రాలేదు. మనసంతా శూన్యం అయిపోయింది.

మాస్టారి మాటలు గుర్తు వస్తున్నాయి. “మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. ఈసారి నిన్ను చూసేటప్పుడు వీడు నా రాజా… నేను కూడా తయారు చేసుకున్న నా విద్యార్థి అనుకోవాలి.”

మాస్టారు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వారి గురించిన సమాచారం లేదు. ఈ విషయం తెలిస్తే మాస్టారు ఏమనుకుంటారు? వీడు నా రాజానేనా? ఎందుకిలా జరిగింది. ఇందులో నా తప్పు వుందా? అసలు ఇది ఎప్పుడయినా అనుకున్నానా? రాజా ఫెయిల్ కావటం ఏమిటి?

సమయం గడుస్తోంది.

“ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా?” అని వినిపించింది. అప్పుడు చేతిలో లాంతరుతో అక్క కనిపించింది. తలదించుకున్నాడు. పక్కన కూర్చుంది.

“నీకు మీ మాస్టారు వెళ్ళిపోయారని బాధగా వుందని తెలుసు. కానీ మీ మాస్టారు నీ మీద ఇంత ప్రభావం చూపిస్తారని తెలియదు రాజా. ఆయన వున్నప్పుడు అన్నింటిలో నువ్వు ఫస్ట్ వచ్చావు. మాస్టారు చెప్పిన పాఠాలు మర్చిపోయావా? అసలు ఏం జరిగింది. ఎందులో ఫెయిల్ అయ్యాననుకుంటున్నావు?”

“లెక్కలంటే భయం అక్కా!” అన్నాడు.

“అవన్నీ మాస్టారు పోగొట్టారు. అయినా భయాలు ఎందుకు తిరిగి వచ్చాయి రాజా. అయినా ఇప్పుడేమైంది. ఇంకో సంవత్సరం చదువుతావు. ఈసారి పాసవుతావు. అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. ఒకటే గుర్తుపెట్టుకో. అమ్మ వుంది. నువ్వు ఎక్కడున్నావో అని అల్లాడిపోతోంది. నాకు తెలుసు ఈ మైదానం దాటి ఎక్కడికీ వెళ్ళలేవని.

అక్కకేసి చూశాడు.

“ఇంతకుముందు చెప్పాను. మీ మాస్టారి పాఠాలు మెట్ల ముందు కూర్చుని వింటున్నప్పుడు ఏకలవ్యుడిలా గురువుని తలుచుకుని చదువుకో అని. ఇప్పుడేం జరిగింది. మీ మాస్టారు మన ఊరు నుండి వెళ్ళారు. అక్కడ కొంతమంది పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఏదో ఒకరోజు నిన్ను కలుస్తారు. అప్పుడు నిన్ను చూసి గర్వపడాలి కదా!”

మాట్లాడలేకపోయాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత…

“ఎలా గర్వపడతారక్కా! నేను ఫెయిల్ అయిన స్టూడెంట్‌ని.”

“అందరూ ఏదొక సమయంలో ఫెయిల్ అయినవారే. మనుషులకు ఎప్పుడూ విజయాలే రావు. ఫెయిల్యూర్స్ వుంటాయి. వుండాలి. మామూలు మనుషులు కూడా ఓ మనిషి దూరం అయినంత మాత్రాన ఇంతగా కృంగిపోరు. ఇంకా ముందు చాలా జీవితం వుంది. చాలా అపజయాలు వుంటాయి. అందుకు సిద్ధంగా వుంటే ఇంటికి రా. లేదంటే నీ ఇష్టం. ఎక్కడికన్నా వెళ్ళు. ఏదయినా చేసుకో. అమ్మా నేను ఒక్కసారే ఏడుస్తాం. నేను వెళ్తున్నా” అని లేచి విసురుగా బయలుదేరింది.

“అక్కా అక్కా!” అంటూ పరుగులు తీసుకుంటూ వచ్చాడు రాజా.

ప్రతిభ ఆగింది.

“నన్ను క్షమించు అక్కా! ఈరోజు నుంచి నేను ఎలాంటి అపజయం వచ్చినా కృంగిపోను. నేను రేపు ఏమీ కాకపోవచ్చు. మా మాస్టారు అనుకున్నట్లు గొప్పవాడిని కాకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు మాస్టారు నన్ను కలవటమో, నేను తనని కలవటమో జరుగుతుంది. అప్పుడు నేను ఎలా వున్నా నన్ను రాజాగానే మా మాస్టారు చూస్తారు. అదే ప్రేమను పంచుతారు. నన్ను అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది” అన్నాడు గాద్గదికంగా.

అప్పుడు తమ్ముడు చేతిని అందుకుంది.

గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్న అమ్మ రాజాని చూడగానే దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళవెంట టపటపమంటూ నీళ్ళు కారాయి.

“మీ ముందు ఏడిస్తే చిన్నపిల్లలు కంగారు పడతారని కళ్ళల్లో దాచుకుంటాను. ఈ అమ్మనీ, అక్కనీ వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళవద్దు రాజా…” అంటోంది.

రాజా అమ్మను కరుచుకున్నాడు.

ప్రతిభ ఉద్వేగంతో చూస్తోంది.

చంద్రశేఖర అజాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *