ఎండపల్లి భారతి నుంచిమరో బతుకు రచన!

Spread the love

దొంగ సారా తయారు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళను పట్టుకోడానికి, ఆ ఊరిలో కులం తక్కువోళ్ళ ఇళ్ళపై పోలీసులు రెయిడ్‌ చేయడంతో మొదలవుతుందీ నవల. పుట్టుపూర్వోత్తరాలు తెలియని మత్తు ఎన్ని జీవితాలను, ఎన్ని కుటుంబాలను ఎలా ధ్వంసం చేసిందో కళ్ళకు కట్టినట్లు చూపించడంతో ముగుస్తుంది.

సారాయి కొండప్ప చేసిన ‘సొక్కం సారా’ నుండి ఇప్పుడు ‘పతి ఒక్కడూ వండే కల్తీసారా’ దాకా, ఆ ఊరి సారా చరిత్ర మొత్తం విడమరిచి చెబుతుంది. బతుకుతెరువును నిలబెట్టుకోవడం కోసం, మనుగడ కోసం తరతరాలుగా ఆ ఊరి జనం ఎలా పోరాడుతూ వచ్చారో వివరిస్తుంది. నిలువెల్లా డార్క్ హ్యూమర్‌ నింపుకొని, మనతో చాలా క్యాజువల్‌గా ముచ్చటిస్తుంది.

1990-2000లలో, వార్తా పత్రికలు, న్యూస్ ఛానెళ్ళ నిండా కల్తీసారాపై బోలెడు వార్తా కథనాలు. అంతకుముందులా తరచూ కాకపోవచ్చు కానీ, ఇప్పటికీ అవి మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి. అప్పటి ఆ వార్తల్లో, ఇప్పటి ఈ నవలలో… అందరి బతుకుల్లో ఒకటే అసహనం. ఈ నవల చదువుతున్నప్పుడు, అడుగడుగునా, మనసు అంతరాల్లో ఎక్కడో దాగిన ఆ కథలూ, వెతలూ — చూసినవీ, విన్నవీ, చదివినవీ, తెలిసినవీ — అన్నీ ఒక రాకాసి అలలా వచ్చి, మీద పడి, ముంచెత్తిపోతుంది.

ఈ ఊరేమీ సారాకి పుట్టినిల్లు కాదు. ఇక్కడ, దాని కన్నా ముందు సేద్యం ఉంది. యాతం తొక్కి, కపిలి తొలి, గూడ యేసి నీళ్ళు ఎత్తిపోయడం మొదలుకొని, కోటా కరెంటు, ఆయిలింజిన్లు, పెట్రోల్ ఇంజిన్ల నుండి బోర్లు, మిషన్లు దాకా… ఇన్ని దశాబ్దాల్లో, వ్యవసాయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చెరువు కింద నీరుగెట్టుతనం చేసే నరసప్ప తాత, ఎంగటప్ప రూపంలో వివరిస్తుందీ నవల. అలాగే, పంటల మీద ఆధారపడిన వడ్రంగోళ్ళు, సాకలోళ్లు, మంగలోళ్ళు, దాసరోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళ గురించి కూడా ప్రస్తావిస్తుంది. అయితే, భూస్వాములు భూస్వాములుగానే ఉండిపోయారు. వాళ్ళ దగ్గర జీతానికి పనిచేసిన వీళ్ళు మాత్రం చదువులు, ఇళ్ళు, బండ్ల వరకు సంపాదించుకోగలిగారు. భూములు తప్ప. వీళ్ళ తాత ముత్తాతలు సారా తయారీలో ఉండిపోయారు మరి!

ఈ కథలో, తాగుబోతు మొగుడితో పక్క పంచుకోలేని, కలిసి బతకలేని, వాడిని వదిలించుకోలేని బతుకీడ్చే భార్యలు ఇక్కడ కోకొల్లలు. అప్పులోళ్ళ అవమానాలు, అమ్మలక్కల చురకలు వీళ్ళకి పుండు మీద కారం లాంటింది. కానీ, ఒళ్ళూ, మనసూ రెండూ పచ్చి పుండే అయితే! సమాజంలో గౌరవం ఏమో కానీ, కనీసం పుట్టింటి ఆధారమూ, ఆదరమూ కరువైన బతుకులు ఎంత భారమో కదా. సచ్చేదాకా సావే మరి!

ఒకపక్క తమ ఒంటికీ, పిల్లలకీ, ఇంట్లో వస్తువులకీ, సరుకులకీ కాపలా కాస్తూనే, మరోపక్క నాలుగు వేళ్ళూ రెండు పూటలా నోట్లోకి వెళ్ళడానికి రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల నిరాశానిస్పృహలు నవలంతా ప్రతిధ్వనిస్తుంటాయి. ఎంత పిచ్చోళ్ళో ఈ అమ్మలు. తనని తన్ని తగలేసినా పర్లేదు కానీ, ఎవరైనా ఆ తాగుబోతు మొగుడిపై చెయ్యేస్తే మాత్రం అడ్డుపడిపోతారు; సిద్దయ్య భార్య లాగా. అతడు చస్తే, ఈమె శరీరం అంగడి సొత్తవుతుందన్న భయం! ఇంత చేస్తున్నా, ఆ మొగుడికి ఈమెప్పుడూ లంజే. లంజరికం నేర్వని లంజ! అయినా, మన పిచ్చి కానీ… భారతి అన్నట్లు, సారా, కల్లు, వక్కాకు, పన్ను పరాగులు, గుట్కా, బంగాకు, బీడీలు, లంజరికం తప్పని నిర్ధారించింది ఈ సమాజమే. కానీ, “ఈటిల్లో ఏ ఒక్కటీ లేని ఊరు ఉందంటే నమ్మలేము. ప్రతీ ఊర్లోనా వీటి కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు.”

అయితే, రంకూ, బొంకూ, అప్పుల దగ్గరే ఆగిపోకుండా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మగవాళ్ళకిచ్చిన ₹500కి ఆశపడిన భర్తల వల్ల జీవితాంతం ‘గొడ్రాళ్ళు’గా మిగిలిపోయిన భార్యలూ కనబడతారు. మత్తు మాన్పించే మందుల కోసం మరిన్ని గంటలు కూలినాలి చేసే ఆడవావాళ్ళూను. అదంతా వారం/నెలనాళ్ళ ముచ్చటని వీళ్ళకెప్పుడు తెలియాలి గనుక!

మరి, మొగుళ్ళు చట్టానికి దొరక్కుండా పారిపోతే, పోలీస్ స్టేషన్‌లో గడిపిన పెళ్ళాల సంగతో? అదేంటో, ఈ చట్టాలెప్పుడూ బడుగు బలహీన వర్గాలకు ‘ప్రత్యేకంగా’ వర్తిస్తాయి. కానీ, ఆ భార్యల కోసం పోలీసుల దగ్గర లొంగిపోయే ఎల్లప్పలు నూటికో కోటికో ఉంటారు. పెళ్ళాం పిల్లల కోసం, తన ఆరోగ్యం కోసం, మళ్ళీ సారా వ్యసనాన్ని తలకెక్కించుకోనివాళ్ళు కూడా చాలా అరుదు.

వీళ్ళతో పాటే, అక్కడక్కడా గుమ్మంగా తాగే ఆడవాళ్ళూ కనబడతారు. నొప్పులకు మందు లేని రోజుల్లో — ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో ఇదే తంతు నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు — ప్రసవం తర్వాత బాలింత ఆదరమరిచి నిద్రపోవాలంటే, మూడు రాత్రుళ్ళు ఆమెకు సారానో, ఎర్రమందో(బ్రాందీ) తాగించేవాళ్ళు. పోనుపోనూ, కొంతమందికి అది అలవాటుగా మారుతుంది. అలాగే, సారా వ్యాపారం చేసే ఆడవాళ్ళూ ఉంటారు. నరిసిగొని పెళ్ళాం లాగా. సుబ్బి లాగా. కానీ, మగాడికున్న స్వార్ధం ఆడదానికి లేదంటుంది ఈరవ్వ.

కానీ ఎవరెంత చెప్పినా, ఏం చేసినా, చివరికి మత్తు వల్ల అన్యాయమైపోయేది మాత్రం ఆడదే. అప్పుడు నేను చదివిన ప్రతీ వార్తా కథనం ఇదే వాస్తవాన్ని నొక్కి వక్కాణించింది. ఈ నవల చివర్లో, సిద్దవ్వ కూడా ఇదే తేల్చి చెప్పింది. ఆమె అన్నట్లు, మత్తు తలకాయకి సంబంధించింది. అదొక రకమైన ఆకలి. “ఎవురాకలి వాళ్ళు అదుపులో పెట్టుకుంటే తప్ప మనం చేసేదేముంది.” కానీ, దీన్ని “అరికట్టాలంటే అంత సులువుగా జరిగే పనులు కావు.” ఎందుకంటే, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉంటారు. తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు. పోలీసులు తరుముతూనే ఉంటారు. కానీ, చెడేది మాత్రం ఆడదే!

ఈ “దొంగ సారా”లో, దాదాపు ప్రతీ పాత్ర ఒక ఫిలాసఫరే. కష్టాల్లోనే సుఖాలు వెతుక్కోవడం అలవాటైతే, బహుశా మనందరం కూడా ఇలాగే మాట్లాడతామేమో—సరస లాగా; ఈరవ్వ లాగా; సిద్దవ్వ లాగా; కొండతాత లాగా; చెన్నతాత లాగా. నర్సుములన్న లాగా. ఈ నవల రాసిన ఎండపల్లి భారతి లాగా. ఇంత జరుగుతున్నా, ఇదంతా మాకూ, మా ఊరికీ మామూలే అన్నట్లుగా కొనసాగుతుంది ఆమె కథనం. పాఠకులకు మాత్రం, మొదటి నుండీ చివరి వరకూ ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్!

ఇంతకు ముందు రచనల్లో లాగే, ఇందులోనూ సంస్కారపు ముసుగులో తన భాష-యాసల అస్తిత్వాలను దాచిపెట్టరు భారతి. తనను తాను కోల్పోరు. చెప్పాల్సిందంతా నిక్కచ్చిగా, పచ్చిగా చెప్పి, ఏం అర్థం చేసుకుంటాం, ఎంతవరకు అర్థం చేసుకుంటాం అన్నది మన విజ్ఞతకే వదిలేస్తారు. అందుకే, ఇదింకో బతుకు రచన అయ్యింది!

వై. కృష్ణజ్యోతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *