కల్కి కాదు కల్తీ!

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం షోలే అనే సినిమా విడుదలైనప్పుడు కలకత్తా యూనివర్సిటీలో చదివే ఒక అమ్మాయి ఏమందంటే, ‘It is a fantastic nonsense’అని. నిజమే.ఆ సినిమా ఫాంటాస్టిక్ గా ఉంటుంది,మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. షాకు కలిగిస్తుంది.కానీ అది ఒక కల్పిత కథ. అలా ఎప్పుడూ జరగదు,జరగలేదు.ప్రేక్షకుల్ని రంజింపచేయడానికి రమేశ్ సిప్పి అనే దర్శకుడు చాలా తెలివిగా ప్లాన్ చేసిన సినిమా. అయితే ఆ అమ్మాయి దాన్ని fantastic nonsense అన్నంతమాత్రాన అది హిట్ కాకుండా పోయిందా?అది చాలా పెద్ద హిట్టు. ఇప్పటికీ దాన్ని భారతీయ సినిమాల్లో ఒక గొప్ప సినిమాగా చెప్పుకుంటాము. అలాగే కల్కి కూడా ఫాంటాస్టిక్ గా ఉండే ఒక నాన్సెన్స్ లాగా ఉందని నేను అనుకుంటున్నాను.


కథ చెప్పే విధానంలో దర్శకుడు విఫలమయ్యాడని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్యూటర్ గ్రాఫిక్సే ప్రధానంగా ఒక వీడియో గేమ్ లాగా ఆ సినిమాను తీశారు. ఈ తరానికి ద్రోణాచార్యుడు ఎవరో,అశ్వత్థామ ఎవరో ,కర్ణుడు ఎవరో సరిగ్గా తెలియదు కనుక దాన్ని బేస్ చేసుకుని,దానితో కనక్ట్ చేసుకుంటూ, భవిష్యత్తులోకి వెళ్ళి,తర్వాత ఏం జరుగుతుంది?ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి?ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?అసలు శ్రీ మహా విష్ణువు పదవ అవతారమైన కల్కి పుడితే ఏమవుతుంది?అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి?అని ఊహించి,మనల్ని థ్రిల్ చేయడానికి, ఒక హిట్ సినిమా చేయడానికి చేసిన ప్రయత్నం.అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. జనం చూడొచ్చు,చప్పట్లు కొట్టొచ్చు. ‘తెలుగులో ఇలాంటి అద్భుతం రాలేదు’అని చెప్పొచ్చు.కానీ అలా చెప్పినంత మాత్రాన అది గొప్ప సినిమాగా మారిపోదు. ప్రత్యేకించి కల్కి మీద నా ఫిర్యాదు ఏమిటంటే అందులో ‘క్రియేటివ్ బ్యూటీ’లోపించింది,లేదా చాలా తక్కువగా ఉంది. ఆ సినిమా పాత్రలతో మనం కనక్ట్ అయ్యి,ఆ కాలంకి వెళ్ళిపోగలగాలి.అలా తీసుకువెళ్లే కళాత్మకత లేదు.ప్రేక్షకుడు సినిమాతో కనక్ట్ అవ్వాలి.కానీ అది ఈ సినిమాలో జరగలేదు. మనం దూరంగా కూర్చుని తెర మీద జరుగుతున్న అద్భుతాన్ని చూస్తూ ఉంటాము ,షాక్ తింటూ ఉంటాము,సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటాము. ఇది ఎలా ప్లాన్ చేశారంటే ముందు ఒక భూకంపం వచ్చిందనుకోండి.తర్వాత తుఫాన్ వస్తుంది.తర్వాత ఉప్పెన వస్తుంది.తర్వాత అగ్ని పర్వతాలు బద్ధలైపోతాయి.అంటే ఇది ఒక ‘roller c౦aster ride’లా ఉంటుంది.దాని వల్ల మనం దిగ్భ్రాంతికి లోనై, ఆ షాక్ నుండి తేరుకునేలోపే సినిమా అయిపోతుంది. ఈ సినిమా స్కీమ్ అది. ఇది స్పెక్టాక్యులర్ గా ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకుడు,పెద్దగా చదువుకోనివాడు,లేదా సెమీ లిటరేట్స్ సాధారణంగానే ఈ సినిమాను చూసి చప్పట్లు కొడతారు,ఈలలు వేస్తారు.
అయితే కల్కి తో సమస్య ఏమిటంటే చాలామంది చదువుకున్నవారు,బాగా తెలివైన వారని మనం అనుకుంటున్నవారు, సినిమా గురించి బాగా తెలిసిన వారు, ‘కల్కి’అద్భుతమని,మాస్టర్ పీస్ అని అంటున్నారు. అది ట్రాజెడి. ఈ సినిమాకు ఇన్స్పిరేషన్ అనేక హాలీవుడ్ సినిమాలు. ముఖ్యంగా డ్యూన్, బ్లాక్ పాంథర్, బ్లేడ్ రన్నర్,మ్యాడ్ మాక్స్ ,హారీ పోటర్ సిరీస్ ,ఇలాంటి అనేక సినిమాలను మిక్స్ చేసి ఒక తెలుగు వెర్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గాని వాడటంలో అతితెలివి ఉపయోగించడం వల్ల సినిమా జనాలకు దూరమైందని నేను అనుకుంటున్నాను.
పురాతన కాశీ నగరం ఒక్కటే మిగిలి ఉంది అన్న అంశంతో సినిమా మొదలవుతుంది.ఆ నగరంలో నది ఎండిపోయి ఉంటుంది. అది కరువు ప్రాంతం. గుక్కెడు నీళ్ళు కూడా ఎవరికి దొరకవు. అక్కడ ఒక వృద్ధురాలు ఒక ఆకుపచ్చని తమలపాకుతో పాన్ చేస్తూ ఉన్నట్టు మనకు చూపిస్తారు.ఆ నగర ప్రాంత జీవన విధానం అలా ఎందుకు ఉందో,దానికి కారణాలు ఏంటో దర్శకుడు చెప్పడు. ఎందుకంటే దర్శకుడికి అంత సమయం లేదు.ఒక ఆరువేల సంవత్సరాల కథను మూడు గంటల్లోనే కుదించి చెప్పాలి.అది నిజంగానే చాలా పెద్ద ఫీట్. అయిత నాగ్ అశ్విన్ కు ఉన్న ట్రాక్ రికార్డ్ వల్ల,అతని మీద ఉన్న గొప్ప అంచనాల వల్ల,అతనంటే ఉన్న గౌరవం వల్ల,ఈ సినిమా నుండి అందరూ ఒక అద్భుతాన్నే ఆశించారు.ఉదాహరణకు నాగ్ అశ్విన్ మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చాలా మంచి సినిమా.ఒక ఫిలాసాఫికల్ అంశంతో తీసిన సినిమా. ఈ సినిమాలో ఆ దర్శకుడు,నటులతో పాటు ప్రేక్షకుడు కూడా మానససరోవరానికి వెళ్తాడు. ఆ సినిమాతో మనం కూడా ఎమోషనల్ గా కనక్ట్ అవుతాము. ముగింపు కూడా చాలా గొప్పగా ఉంటుంది. రెండో సినిమా ‘మహానటి’ తీసినప్పుడు,’కీర్తి సురేశ్’ సావిత్రిగా చేస్తున్నప్పుడు,అందరూ అది అయ్యే పని కాదన్నారు. కానీ ఆయన ఆ సినిమాను ఎంత బాగా తీశాడో మనందరికి తెలుసు. ముఖ్యంగా ఒక సన్నివేశంలో సావిత్రి జీవితంలో ‘poetic justice’గా చెప్పే క్రమంలో ఒక పెద్ద భవంతిలో సావిత్రి ఒక్కర్తే విస్కీ బాటిల్ పట్టుకుని మిగిలిపోయినప్పుడు ,ఆ భవనం అంతా తగలబడిపోతూ ఉంటుంది.సావిత్రి మొత్తం జీవితాన్ని ఆ సింబాలిక్ షాట్ లో ఆయన అద్భుతంగా చూపించగలిగారు. అయితే అంత బ్రిలియన్స్ ఉన్న క్రియేటివ్ ఆర్టిస్ట్ అయిన నాగ్ అశ్విన్ ‘కల్కి’సినిమాకు వచ్చేసరికి పూర్తిగా భారీ బడ్జెట్ స్థాయి సినిమాకు తగ్గట్టు వసూళ్ళు ఉండాలనే తాపత్రయంతో పాటు ఈ సినిమాకు చెందిన దర్శక,నిర్మాతలు కొంత అభద్రతకు లోనైనట్టు నాకు అనిపించింది. ఎలా అంటే ఈ సినిమాలో ఎంతోమంది గొప్ప నటులు ఉన్నారు, వీరితో పాటు రామ్ గోపాల్ వర్మ,రాజమౌళి,విజయ్ దేవరకొండ లాంటి వారు కూడా అతిథి పాత్రల్లో ఉన్నారు. ముఖ్యంగా రాజమౌళితో ఉన్న సన్నివేశంలో ప్రభాస్ ‘ఈయనతో పెట్టుకుంటే మళ్ళీ ఐదేళ్ళు దూల తీరిపోతుంది ’లాంటి డైలాగులు చాలా చవకబారు హ్యూమర్ గా మారిపోయాయి.ప్రభాస్ చేసిన ఈ హాస్యం పండకపోగా కొన్ని చోట్ల బ్యాక్ ఫైర్ అయ్యింది కూడా. అలా సినిమా టెంపో పెరగాల్సిన చోట,అలాగే ఉండిపోయి,ప్రేక్షకులను తనతో పాటు ముందుకు తీసుకువెళ్ళలేకపోయింది. ఆ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
చాలామంది ఫస్ట్ హాఫ్ చాలా పేలవంగా ఉందని,సెకండ్ హాఫ్ దుమ్ము లేచిపోయిందని అన్నారు. నేను అలా అనుకోవడం లేదు. ఈ సినిమాను ‘ఓవరాల్ ‘గానే చూడాలి. కథ గట్టిగా నడిపించే ప్రయత్నం చేశాడు కానీ అయితే జనాల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి,లాక్కుపోదామనే తాపత్రయంలో,తొందరపాటులో సినిమా బాగా రాలేదు. చివరికి ఫలితం ఫ్లాప్ అనే నేను అనుకుంటున్నాను.
ఈ సినిమా ఒక మానసిక ఆనందాన్ని గాని,గొప్ప ఫీలింగ్ ను గాని ప్రేక్షకుడికి ఇవ్వలేదనే అనుకుంటున్నాను. ఒట్టి పేలుళ్లు,యుద్ధాలు,ఒక రెండు మూడు వందల ఇన్ స్ట్రూమెంట్స్ తో వరసపెట్టి మ్యూజిక్ తో అదరకొడుతూ ఉండటం.అంటే మనం కాప్టివ్ ఆడియన్స్ . మనం ఒక ఏసీ థియేటర్ లో,తలుపులు మూసి ఉంటే,ఎక్కడికి వెళ్లలేము కనుక మన మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఇది ఈ సినిమా సాధించిన విజయం.
తెలుగు సినిమాకు నష్టమే జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి పూర్ ఐడియా ఉన్న సినిమానే ఇమిటేట్ చేస్తూ సినిమాలు తీస్తారు. అసలు దీనికే సెకండ్ పార్ట్ తీస్తామని చెప్పి ఉన్నారు. మరి ఇంకెంత విధ్వంసం జరుగుతుందోనని ఆందోళన పడుతున్నాను. ఇప్పుడేదో మనం 2024 లో కంప్యూటర్ గ్రాఫిక్స్,ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము గాని,ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం టెన్ కమాండ్ మెంట్స్ వచ్చినప్పుడు అందులో రెడ్ సీ చీలే సీన్ ఉంటుంది. మోజేస్ ఆ చీలిన రెడ్ సీ నుండి వెళ్తూ ఉంటే,ఆయన వెనుక జనాలు ….ఆ అద్భుతమైన సన్నివేశం చాలామందికి గుర్తుండే ఉంటుంది. హాలీవుడ్ వాళ్ళు ఆ సముద్రం చీలే సన్నివేశాన్ని ఒక గదిలో తీశారు. ఒక గదిలో వాటర్ ను డివైడ్ చేసి,ఆ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ప్రపంచ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సీను అది. ఆ కాలంలోనే అంత అద్భుతంగా తీసినప్పుడు ఇప్పుడు ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడూ కూడా ఈ కల్కి లో యుద్ధ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ కూడా సాధారణంగా ఉండటం జరిగింది. అవి గొప్ప విజువల్స్ కాదు.సినిమాకు బోలెడంత నష్టం జరిగింది. ఒక గొప్ప సినిమా చూశామన్న ఫీల్ ప్రేక్షకుడికి లేకుండా పోయింది. తెలుగులో ఇలా భారీ బడ్జెట్ తో వచ్చిన మొదటి సినిమా రాజమౌళి ‘బాహుబలి’ చూస్తే ,అది కూడా పెద్ద సినిమా,అందులో కూడా ప్రభాసే హీరో.కానీ అందులో చాలా క్రియేటివ్ బ్యూటీ ఉంటుంది. సౌందర్యం,మంచి సంగీతం ఉంది. ఏ నటులను చూసినా ఆహ్లాదం కలుగుతుంది.ఆ ఫీలింగ్ ఈ సినిమాలో లేదు. అలాగే ‘RRR’ లో కూడా కొమరం భీమ్ ను,సీతారామరాజుని కలపడం బాగుండకపోయినా,సినిమా తీసే విధానం,దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, చాలా ఆర్టిస్టిక్ గా,బ్యూటీఫుల్ గా,ఇన్స్పైరింగ్ గా ఉంది.
సినిమా విజువల్ మీడియం…. ఆర్ట్ దానికి ప్రాణం.అలాంటి ఆర్ట్ పీక మీద కాలు వేసి తొక్కి చంపి ,ఒక కృత్రిమమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ ను చూపించి,వాళ్ళెమి సాధించాలనుకున్నారో నాకైతే అంతుబట్టలేదు. సరే,లాభాలు రావాలనుకున్నారు,అవి ఎలాగూ వస్తాయి. ఎలాగూ ఓటిటీ కూడా ఉంది,ఆ మార్గంలో కూడా వస్తాయి.కానీ ‘Making of a big movie’ దగ్గర చాలా గొప్ప పొరపాటు జరిగింది ‘కల్కి’ విషయంలో. ఎలా అంటే ఒక పాత సినిమాలో ‘ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి’ అనే పద్యాన్ని ఎన్ టి యార్ ఎంతో గొప్పగా పెర్ఫార్మ్ చేసినప్పుడు,ఆ పద్యం అర్ధం తెలియకపోయినా ప్రేక్షకులు ఈలలు వేశారు ఆనాడు. ఎందుకంటే అదొక అద్భుతమైన ఎమోషన్ ను పలికిస్తుంది కనుక. ఎన్ టి యార్ ఆహార్యం, సౌందర్యం ,అభినయం వల్ల అది సాధ్యమైంది. ‘కల్కి’లో అలా మన హృదయాన్ని పట్టుకునేది,మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేది ఏమి కనిపించలేదు. అన్ని రకాల ఆయుధాలతో కొట్టుకోవడం, చావకబారు టెక్నిక్స్(మాములుగా నల్లగా ఉండే తుపాకులు ఇక్కడ తెల్లగా ఉంటాయి) తప్పితే నాకేమి గొప్ప క్రియేటివ్ జీనియస్ కనిపించలేదు.అది ఒక బ్లాక్ బస్టర్ కావొచ్చు,దానికి రెండు వేల కోట్లు రావొచ్చు. అది తెలుగు సినిమా బతకడానికి మంచిదే. కానీ క్రియేటివ్ గా చూసినప్పుడు దీనిలో ఆ సౌందర్యం పూర్తిగా లోపించింది. అదొక కళాత్మకమైన వ్యవహారం కాదన్నదే నా ఫిర్యాదు.


సంగీత పరంగా చూస్తే,సంతోష్ నారాయణ్ నిజంగా తమిళ్ లో చాలా పెద్ద సంగీత దర్శకుడు. కానీ ఈ సినిమాలో యుద్ధాలు, వందల ఇన్ స్ట్రూ మెంట్స్ ప్లే చేయడం ,ఇటువంటి అంశాల వల్ల ఇది సంగీతంలా కంటే లౌడ్ బ్లాస్ట్ లానే ఉంటుంది. స్టన్నింగ్ గా ఉంటుంది కానీ మ్యూజిక్ అనే ఆత్మ మాత్రం దీనిలో లోపించింది. డైలాగ్స్ కూడా అంత పవర్ఫుల్ గా కానీ,మనల్ని ఆకట్టుకునే విధంగా కానీ లేవు.కొంత డబ్బింగ్ లోపం కూడా కనిపిస్తుంది. భైరవ లాంటి గొప్ప వీరుడు అశ్వత్థామ లాంటి గొప్ప పాత్రతో తలపడే యోధుడు ఇంటి అద్దె కట్టకుండా ఉండటం అన్నే సన్నివేశం ద్వారా చవకబారు హాస్యం పండించే ప్రయత్నం చేయడం ద్వారా ఏం సాధించాలనుకున్నారో అర్ధం కాలేదు. అలాగే దీపికా పదుకునే సినిమా మొత్తం ఒక గర్భవతిగా ఉంటుంది.ఆవిడ గొప్ప నటి.కానీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యం లేదనిపించింది. దిశా పటాని,శోభన లాంటి వారి బాగున్నారు కానీ వాళ్ళతో కలిసి ఇంకో కాలంలోకి మనం వెళ్లగగలిగే ఎమోషనల్ ఫీల్ ఇవ్వలేని సినిమా ఇది. ప్రధాన లోపం ఏమనిపించింది అంటే ప్రభాస్ ఒక కిరాయి గుండా పాత్రగా ప్రవేశిస్తాడు.అలాంటి పాత్ర అశ్వత్థామ లాంటి పాత్రతో పొరాడి గొప్ప యోధుడిగా, చివరికి కర్ణుడు అని రివిల్ చేసినా,దానికి తగ్గ జస్టీఫికేషన్ దర్శకుడు ఎక్కడా ఇవ్వడు.ప్రభాస్, అమితాబ్ బచ్చన్,దీపికా వీరందరూ బావున్నారు,ఇది మనం ఎప్పుడూ అనుకునేదే.కానీ కథ పాత్రలను నడిపించాలి,కానీ పాత్రలే కథను నడిపించడమే ఇందులో ఉన్న ట్రాజెడీ, ఒక బ్లాక్ మార్క్.

One thought on “కల్కి కాదు కల్తీ!

  1. Prabhas — he is not actor – donot know action — by amitab Bachan
    It is true
    Allu. Arjun is pan American Best actor award
    Prabhas is famous — just joke —money // money
    Kalagura gampa… navarthna Korma…kalthi story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *