వెన్నెల సాక్ష్యం

Spread the love

స్పీడుగా పోతున్న రైలులో నడవటం… దాని తూగుకి తగ్గట్టు మనల్ని మనం బాలెన్స్ చేసుకుంటూ, పడవలో నడుస్తున్నట్టు. ఈ లైట్లు కట్టేసిన బోగీలో, సీట్ల మధ్య దారిలో నడుస్తుంటే, కంటికి నిద్ర లాంటి హాయి ఉంది. బెర్తుల మీద అందరూ ఇదే హాయిలో ఊగుతున్నారు… రైలు అందరినీ జోకొడుతుంది… వెన్నెల ఆరేసిన పొలాల మధ్య నుంచి… ఇనప చక్రాల మీద నల్లగా దొర్లుకుంటూ పోతున్న ఈ ఇనప పెట్టెల్లో… ఒత్తిగిలి నిద్రపోతూ, పెట్టెలతోపాటు ఊగుతూ, కలల్లో జోగుతూ… ఒకేసారి ఎంత కలల లగేజీ…!

సైడ్ అప్పర్ బెర్త్ మీంచి దిగుతున్న ఎవరో ఆడ మనిషి నా దారికి అడ్డమొస్తే ఆగాను. ఆమె ఇటు తిరిగే సరికి… మసక లైటు వెలుగులో ఆమె ముఖం కనపడి… ఆమె ఎవరో గుర్తొచ్చింది.

నీలిమ! 

ఆమె కూడా నా ముఖం లోకే చూస్తుంది… అప్పటికే ఆమెని గుర్తుపట్టిన నా ముఖం లోకి. రాత్రి పరిపాలిస్తున్న బయళ్ల మధ్య నుంచి అంటీముట్టకుండా పోతున్న ఈ రైలులో… ఒకర్నొకరు చూసుకుంటూ ఇద్దరం.

‘‘బావున్నావా!’’ అంది.

తలాడించాను. “నువ్వు?”.

ఈ రెండు మాటలూ మేం పదేళ్ళ తర్వాత ఇలా రైల్లో ఒకరికొకరు ఎదురుపడటం లోని ఆశ్చర్యాన్ని పట్టించుకోనట్టే నటిస్తున్నా, మా ముఖాలకి మాత్రం ఆ దాపరికం లేదు, అవి ఆనందంతో విప్పారుతున్నాయి.

“ఎక్కడికి వెళ్తున్నావ్?” అంది.

గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాను. 

ఎక్కడికి వెళ్తున్నానో, అసలెక్కడ రైలెక్కానో కూడా గుర్తు లేదు.  

“సరేలే, ఇప్పుడు ఎక్కడికీ పోకు, పైన కూర్చో వస్తాను,” అంది. 

ఆ మాటని ఆదేశం లాగా పాటించాను– నా ప్రయాణం సంగతీ, గమ్యం సంగతీ కూడా అప్పటికప్పుడు మర్చిపోయి…

కడ్డీ పట్టుకుని ఆమె బెర్త్ పైకి ఎక్కాను. ఆమె తల పెట్టుకున్న వైపు కాకుండా రెండో వైపుకి ఆనుకుని కూర్చున్నాను. ఒంగి ఆమె వెళ్ళిన వైపు చూశాను.

ఐల్ మధ్య నడిచి వెళ్తున్న ఆమె నీడని చూస్తుంటే, నా మనసులో- విశ్వాన్నంతట్నీ నొక్కి పెద్దముద్దలా చేసి మళ్ళీ అందు లోంచి చిన్న  చిన్న ముద్దల్ని పీకి ఉండల్లా చుట్టి గ్రహాలు చేసి గోళీలాట ఆడుతున్న ఎవరో చంటి దేవుడి కేళిలో ఉన్నాం కదా మనమంతా అనిపించింది. 

ఇప్పుడే కనపడిన ముఖం మీద అప్పుడే బెంగ… ఆమె వెనక్కి ఎప్పుడొస్తుందా అని తొంగి తొంగి చూస్తూ… అసలు మళ్ళీ రాదేమో, ఇదో మోసపు కలేమో, అట్నించటే ఏదో ఒక స్టేషన్లో దిగిపోతుందేమో అని కూడా భయపడుతూ…. నా ఆలోచన నాతో రకరకాల ఆటాలాడింది… ఆ మలుపులో ఆమె నీడ మళ్ళీ కనపడే దాకా.… 

ఆమె చీర కొంగుకి చేయి తుడుచుకుంటూ వచ్చి కింద నిలబడింది. 

వెంటనే పైకి ఎక్కే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే నవ్వుతూ నిలబడింది. ఆ చాక్లెట్ రంగు చామనచాయ ముఖంలో వెలిగే నవ్వు… కళ్ళ మూలల్లో కొత్త మడతల వల్ల ఇంకా కాంతి పెరిగిన నవ్వు…

చేయి అందించబోతే, నా చేతి మీద చేత్తో కొట్టి పక్కకి నెట్టేసి, “మరీ అంత ముసలిదాన్ని అయిపోలేదులే,” అంటూ పైకి ఎక్కి నా ముందు కూర్చుంది, బాచీమటమేసుకుని.

అలా ఇద్దరం ఎదురు బొదురు కూచుంటే, ఈ సైడ్ అప్పర్ బెర్త్ పెళ్ళి పల్లకీ లాగ ఊగుతుంటే…. 

ఎప్పుడో ఇలాగే ఒకే మంచం మీద దగ్గరగా చూసిన ఆ ముఖం… అవే చిన్న కళ్లు… నవ్వితే ముందుకు పొడుచుకొచ్చే చిన్న చుబుకం… ఒకప్పుడు నా పెదాల ఎడతెగని ముద్దుల ముద్రలు అందుకున్న బుగ్గల్లో… ఉండల్లాంటి పొంగు…

ఏదో చెప్పబోతున్న నవ్వుతో నా మొహం లోకి చూస్తుంది… 

“ఏంటి?” అన్నాను. 

‘‘లేతగా ఉండేది నీ మొహం. ఇప్పుడు మీసంతో యాసగా ఉంది,’’ అంది. 

చేయి చాచి మీసం అంచుల్ని ముట్టుకుంది. 

ఆమెని ఇందాక ఐల్ లో చూడగానే మొదట వచ్చిన ఆలోచన చెప్పాను: “గుర్తుందా ఒకసారి నిన్ను ఎత్తుకోబోయి మొయ్యలేక కింద పడేశాను. ఇప్పుడు సులువుగా ఎత్తుకోగలను.”  

“అబ్బో బడాయి” అన్నట్టు పెదం విరిచి నవ్వింది. 

“ఇప్పుడేముంది బరువు చిక్కిపోయాను,” అంది తన సన్నని చేతుల వంక తనే చూసుకుంది. 

ఆ చేతులకి అవే ఎర్ర మట్టి గాజులు… ఆత్రం మీద పట్టుకోబోతే విరిగే ఎర్ర మట్టి గాజుల్లోని అందం… విరిగిన గాజు ముక్కలు నేల మీద పడి, ఆమె నవ్వంత మృదువుగా జ్ఞాపకంలో ఘల్లుమని… విరిగిన గాజు అంచులపై జారే కాంతి నునుపు… అరచేతిలో ఉబికిన రక్త బిందువుని చప్పరించే ఆమె పెళుసు కోపంలో.… కళ్ళ అందం…

ఇంతలో ట్రైన్ ఏదో బ్రిడ్జీ ఎక్కినట్టు… రేకుల గుల్ల చప్పుడు. ఏ నది మీంచి పోతున్నామో తెలీదు గానీ, ఆమె ముందు ఇలా కూర్చుంటే, ఇప్పుడు ఈ బ్రిడ్జి కింద నది కాదు అంతరిక్షం ఉందీ అంటే నమ్మేసే లాగ ఉన్నాను.

“ఈ బ్రిడ్జీ తర్వాత ఏ ఊరు వస్తుందో తెలుసా,” అంది.

“నువ్వు దిగాల్సిన ఊరా,” అన్నాను… గొంతు కింద దిగులుతో. 

“కాదు, మనిద్దరికీ తెలిసిన ఊరు,” అంది. 

“మనిద్దరం కలిసి, _____ మీంచి వెళ్తున్నామా!” అన్నాను, ఆ ఊరి పేరు పట్టి పట్టి పలుకుతూ.

అవునన్నట్టు నవ్వింది. వెంటనే కొత్త ఆలోచన వచ్చినట్టు నా వైపుకి వంగి నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, “దిగేద్దామా,” అంది, దాగుడుమూతలాటల్లో చంటిపిల్లల గూడుపుఠాణీ లాంటి ఉత్సాహంతో.

ఇలాంటి పిచ్చి తెగింపుల వయసుని నిద్ర లేపే స్పర్శ ఇప్పుడు నా చేతుల మీద… 

ఇదే స్పర్శతో… ఎన్నెన్ని చేయించావ్… ఏమేమి నేర్పించావ్… నీ లతలు చుట్టుకున్న చేత్తో నన్ను ఆడతనాల అరణ్యం లోకి లాక్కునిపోయి… ఆ పచ్చటి నీడల, బాటలు లేని దారుల్లోకి మంత్రమేసి నడిపించి… ముళ్ల తీపి సలుపుల మధ్య నుంచి నేను నీ మాయలో నడుస్తూ నడుస్తూ… తెల్లటి వెన్నెల బయలు లోకి విడుదలైతే… అక్కడ… ఊడల మర్రి తొర్రలో… బంగారు గిన్నెలో… వెన్న… ఊపిరి వేడికి కరిగేంత మెత్తగా… తల వెనక్కి వాల్చి వొళ్ళు విరుచుకుంటున్న నువ్వేమో… నా వన దేవత.

* * *

చలి వెన్నెట్లో వణుకుతున్న రైల్వే స్టేషన్‌. 

ఒక్క కుక్క మటుకు ఫ్లాట్‌ఫాం మీద… తన చల్లటి నీడని నిద్రలేపి తనతో పాటు ఈడ్చుకుంటూ మా వెనకాల నడిచి… స్టేషన్ గేటు దాకా వచ్చి మెట్ల మీద తోకూపుతూ ఆగిపోయింది, వెళ్ళి రండి అన్నట్టు. 

నిద్రపోతున్న రిక్షాల పక్క నుంచి నడిచాం, నిద్రపోతున్న ఊళ్ళోకి. 

యవ్వనం మసిలిన వీధుల్లో ఇప్పుడు ఆమె పక్కన నడుస్తుంటే… బావుంది.

“ఎక్కడికి వెళ్తాం. ఇంకా మనకి తెలిసినవాళ్లు ఎవరూ లేరు కదా ఇక్కడ,” అన్నాను. 

“మనుషులెవరూ లేరు. కానీ మనకి తెలిసిన వైనాలుంటాయి, మనం వదిలి వచ్చేసిన ప్రశ్నలుంటాయి, వెతుక్కుంటే ఈ వీధుల్లో…” 

గడియార స్తంభం మీద టైము మూడున్నర… గడియారస్తంభం పైన ఒక పూర్తి చందమామ… 

షట్టర్లు మూసిన షాపులు, ఖాళీ పళ్ళ బళ్ళు, గాలికి అంచులు ఊగే పోస్టర్లు, స్ట్రీట్ లైటుని కమ్మేసి వెలుగుతున్న రావి ఆకులు… ఇదంతా గడిచిన కాలం లోంచి కల ఆపద్ధర్మంగా ఏరి తెచ్చిన ముక్కలతో కట్టిన సెట్టింగు లాగ… మేం నడుస్తున్న కొద్దీ మా కోసమే ఈ వీధి ముందుకి పరుచుకుంటున్నట్టు, ఈ వీధి లోంచి పక్కకు గెంతి చూస్తే అసలక్కడ ఒక ఊరే ఉండదన్నట్టు. కానీ నమ్మకపోతే కరిగిపోయే స్వర్గం కాబట్టి నమ్మి నడుస్తున్నాం. చేతులు ముడేసుకుని, అరచేతుల చెమట్ల ఆవిరి పంచుకుంటూ.

కాసేపటికి మా పాత స్కూలు దగ్గర ఉన్నాం. అక్కడే మేమిద్దరం చదువుకున్నాం. కానీ “కలిసి” చదువుకో లేదు. నీలిమ పదోతరగతి పాసై వెళ్ళిపోయిన పదేళ్ళకి ఈ స్కూల్లో నేను ఆరో తరగతిలో చేరాను.

మాసిపోయిన పాత బిల్డింగు. పక్కన ఖాళీ గ్రౌండులో గాలీ దుమ్మూ ఆటాడుతున్నాయి. వెనక వైపు తెరిచి ఉన్న గేటు లోంచి లోపలికి వెళ్ళాం.

వరండాల్లో తివాచీలా వెన్నెల.

కిటికీల దగ్గర ఆగి లోపలికి తొంగి చూశాం– గోడలకి తెగిన రంగు కాయితం రిబ్బన్లు, చెక్క బల్లలు, ఖాళీ బోర్డు మీద సుద్దపొడి జాడలు… 

“ఎవరో డస్టర్‌తో చెరిపేసినట్టే చెరిగిపోయింది కదా చిన్నతనం!” అంది. 

“నువ్వూ నేనూ కలిసి చదువుకునుంటే ఎంత బావుండేదో అనిపిస్తుంది,” అన్నాను. 

“మనం ఒకే క్లాసై ఉంటే నిన్ను నా జట్టులో కలుపుకునేదాన్ని,” అంది.

వరండా పొడుక్కీ సగం వెన్నెలా సగం నీడా. ఆమె వెన్నెట్లో కాలు పెట్టి మళ్ళీ నీడ లోకి లాక్కుంటుంది, అదో ఆట లాగ.

“ఏం చలాకీతనం నీది. ప్రాణం కంటే ముఖ్యమైందేదో ఉంటుంది నీ ఒంట్లో!” 

ఈ మాట పైకి అనకపోయినా అన్నట్టే నా వైపు చూసి నవ్వింది. 

నేను నడుం మీద చేతులేసి దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాను. 

ఆ రుచిలో, నన్ను మెరుపులా కమ్మిన పాత సువాసనలో… ఆ పాత ముద్దులన్నీ సీతాకోకల్లా రెక్కలు రెపరెపలాడిస్తూ వచ్చి ఒకేసారి మీద వాలినట్టు… తల నిండా కరెంట్!

పదేళ్ళ క్రితం ఇదే ఊళ్ళో పదో తరగతి ఐన వేసవి సెలవుల్లో ఆమెని మొదటిసారి చూశాను.

అప్పుడు నాకు టైఫాయిడ్… జ్వరంతో గవర్నమెంటాసుపత్రిలో. నాకు తెలిసిన ప్రపంచమంతా చిన్నగా కుదించుకుపోయి నా ఉనికి మొత్తం నీటి మీద నూనె డాగులా రంగు రంగుల్లోకి చెదిరిపోతుంటే… ఆ అయోమయం లోకి  విడుదలైంది ఆమె ముఖం, నీటి మీద చందమామలా, నర్సు టోపీ కింద.

జ్వరం బాగా పెరిగిపోయిన మాలోకంలో ఉన్నానేమో, ఆమె థెర్మామీటర్‌తో నా దగ్గరకు వచ్చి వంగినప్పుడు ఆమె మెడ లోంచి నా కళ్ళ ముందు వేలాడుతున్న ఏసు ప్రభువు లాకెట్ లాక్కున్నాను. ఆమె ఎందుకు ఊరుకుందో ఊరుకుంది.

కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం మెరుగై ఇంటికి వచ్చాకా, నిక్కరు జేబులో దొరికింది ఆమె లాకెట్. అది ఎవరిదో గుర్తు తెచ్చుకోవటానికి కూడా టైమ్ పట్టింది. తిరిగి ఇచ్చేద్దామని ధైర్యం తెచ్చుకుని హాస్పిటల్‌కి వెళ్తే ఆమె అక్కడ లేదు. ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. 

తలుపు తెరిచిన ఆమె— సిమెంట్ రంగు మీద తెల్లటి పువ్వులున్న చీరలో, తలార బెట్టుకోవడానికి జుట్టుకి చుట్టుకున్న నీలం టవలుతో, నవ్వుతూ లోపలికి రమ్మంది, నా లాకెట్ వల్లే అంత త్వరగా కోలుకున్నావంది, టీ ఇచ్చి పంపించింది. 

అప్పటి ఆ పిరికితనంలో ఏమేం బెరుకు సాకులతో ఆమె దగ్గరకి మళ్ళీ మళ్ళీ వెళ్ళగలిగానో. అప్పుడు ఆ చిన్నతనంలో ఎంతో అతికినట్టు అనిపించిన ఆ సాకులన్నీ తర్వాత తల్చుకుంటే నవ్వొచ్చేవి. ఆమెకీ  నవ్వొచ్చేదేమో. ఐనా రానిచ్చేది. నన్ను  నా బిడియం లోంచి బైటికి లాగి స్నేహం చేసుకుని… మొదట్లో కొన్ని రోజులపాటు టీ ఇచ్చి మాట్లాడి పంపించేయటంతో మొదలైందల్లా, వాకిట్లో మొక్కలకి ఆమెతో కలిసి మట్టి తవ్వీ, తడి చీరని ఇద్దరం చెరో వైపూ పట్టుకుని పిండీ, ఆమె స్నానం చేస్తుంటే నేను పొయ్యి మీద కూర తిప్పీ, అలా ఎలాగో మొత్తానికి చాలా త్వరత్వరగా మొదటి ముద్దు వైపూ, కావలింత వైపూ, అప్పటికింకా నిద్ర లేచాకా చెడ్డీ మీద మరకలేంటో అర్థం కాని వయస్సులో ఉన్న నాకు అన్ని రహస్యాలూ విప్పి చూపెట్టిన… ఆ పాత నవారు మంచం వైపూ….

“ఊ…. ఇంక చాలు వదులు,” అని తోసేసింది, ముద్దు లోంచి బైటికి, ఇప్పుడు, స్కూలు వరండాలో. 

“మీసం లేనప్పుడే బావుంది, ఇప్పుడు మీసం గుచ్చుకుంటుంది,” అంది– పెదవి పైన నొప్పెడుతున్నట్టు రుద్దుకుంటూ నవ్వుతుంది. 

ఎప్పుడొచ్చామో తెలీకుండా మళ్ళీ ఊరి వీధుల్లోకి వచ్చి నడుస్తున్నాం. ఊళ్ళోని గుడుల్లోనూ, చర్చిల్లోనూ, మసీదుల్లోనూ అన్నిచోట్లా నిద్రా దేవతే వెలిసినట్టుంది. జంక్షన్లో రాజకీయ నాయకుల విగ్రహాలు నిద్రపోతున్నాయి. బస్టాండ్‌లో బస్సులు నిద్రపోతున్నాయి. వీధుల్లో గాలికి లేచే దుమ్ము ఆవలించి మళ్ళీ పడుకుంటుంది. ఊరు ఊరంతా పండు వెన్నెలకి సొమ్మసిల్లినట్టుంది. 

దారిలో ఆమె పని చేసే హాస్పిటల్ కనపడింది. హాస్పిటల్ వరండాలో ఉన్న  లైటు వెలుగు హాస్పిటల్ మెట్ల మీద నుంచి మేం నిలబడిన వైపుకి పాకుతూ మధ్యలో ఎక్కడో వెన్నెట్లో కలిసిపోయింది. 

“లోపలికి వెళ్దామా?” అన్నాను.

“ఎందుకు, అక్కడంతా రోగం రొష్టూ!” అంది.

నా అడుగులు హాస్పిటల్ గోడని చుట్టి తిరిగి దాని వెనక ఉండే వీధుల వైపు వెళ్తున్నాయి. ఆమె భుజం మీద చేయి వేసి ఆపింది. 

“ఎందుకటు?”

“నీ ఇంటికి.”

“అక్కడేముంది.”

“నాకు వెళ్ళాలని ఉంది, నీతో కలిసి.”

ఆ ఇరుకిరుకు పేట వీధుల్లోకి ఇద్దరం నడిచాం.  

ఆమె ఇల్లు… పాడు పెట్టి ఉంది. గోడలకి పెచ్చులు ఊడి ఇటుకలు కన్పిస్తున్నాయి, తలుపులు ఊడిపోయిన కిటికీల మీదకి పొదలు పాకాయి. ఒకప్పుడు ఏ గుమ్మం ముందు నిలబడితే నా ఊపిరి నాకే వినపడేదో, ఆ గుమ్మం ముందు మళ్ళీ…. 

తలుపుకి ఇసక అడ్డంగా ఉండి బలంగా లోపలికి తోయాల్సి వచ్చింది.  

“ఎందుకూ లోపలికి?” అంటుంది వెనక నుంచి. 

లోపల అడుగుపెట్టగానే ఒక పెంకు నేల మీద పడి పగిలింది. నేల మీద అప్పటికే చాలా పెంకులు పగిలి ఉన్నాయి. పైన ఆ పెంకులు ఊడిన కన్నాల్లోంచి వెన్నెల కాంతి స్తంభాల్లాగ కిందకి దిగుతుంది. 

కలియతిరిగి చూట్టానికి ఇదేం పెద్ద ఇల్లు కాదు. మూడే గదులు. హాల్లో గోడ మీద ఒకప్పుడు ఆమె భర్త ఫొటో ఉండే చోటు దగ్గర నా చూపు కాసేపు ఆగింది. అక్కడ మేకు అలాగే ఉంది. ఆ మేకుకి ఫొటో లేకపోయినా ఉన్నట్టే అనిపించింది. ఆ ఫొటోలో ఉండే మీసాల మనిషి మీద జెలసీ ఉండేది, అప్పటికే ఆ మనిషి చచ్చిపోయినా గానీ. ఆమె ఎప్పుడూ అతని గురించి ప్రేమగా మాట్లాడటం వల్లనేమో.

పక్క గది వైపు వెళ్ళాను. ఒకప్పుడు ఆ గది గుమ్మానికి వేలాడే పూసలతో, ప్లాస్టిక్ చిలకల బొమ్మలతో ఒక తెర ఉండేది. అది ఇప్పుడు లేకపోయినా జ్ఞాపకంలో నా చేత్తో దాన్ని తోసుకు వెళ్తున్నట్టే ఉంది. నా వెనక తనూ లోపలికి వచ్చింది. బిగబట్టిన నిశ్శబ్దం తన లోనూ.

గది లోపల కిటికీ లోంచి నేల మీదకి వెన్నెల… కిటికీ ఊచల మీదున్న పొదల నీడలు నేల మీద ఊగుతున్నాయి… గది లోకి అడుగుపెట్టగానే నేను ఏ మూలకైతే చూశానో, ఆ మూల, చిత్రంగా, ఇంకా అక్కడే, ఒక మంచం!

నవారు లేదు గానీ, నలు పలకలుగా మంచం పట్టె మాత్రం అలాగే మిగిలి ఉంది. ఆమె వైపు చూశాను. ఆమె ముఖం మీద నవ్వులాంటి నీడ. మంచం పట్టె మీద కూర్చున్నాను. తనూ వచ్చి పక్కన కూర్చుంది. ఆమె భుజం మీద చేయి వేసి ఈ గదిని చుట్టూ చూస్తుంటే నాకు జ్ఞాపకంతో తల తిరుగుతుంది. కొలతల ప్రకారం ఇది చిన్న గదే గానీ…, నా మనసులో మాత్రం ఇది ఎన్నో మలుపులూ, గుహలూ, లోయలూ, జలపాతాలతో పెద్ద అడవి! 

“ఎందుకు మంచం ఇక్కడే వదిలేశావ్?” 

“తీసుకెళ్ళబుద్ధి కాలేదు.”

“అసలు ఎందుకంత సడెన్‌గా ఊరొదిలి వెళ్ళిపోయావ్?”

“వెళ్ళిపోవాల్సి వచ్చింది.”

“పిచ్చెత్తినట్టు వెతుక్కున్నాను తెలుసా నీ కోసం. అప్పుడనే కాదు, ఆ తర్వాత కూడా. ఈ ఊర్నించి మేం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్‌ని కలవటానికన్న సాకుతో వచ్చి ఈ ఇంటి చుట్టూ తిరిగేవాడ్ని. అప్పటికే ఈ ఇంట్లో వేరే వాళ్ళున్నారు, అడిగితే ఏం తెలీదన్నారు. హాస్పిటల్‌ దగ్గర కూడా అడిగాను. నువ్వు ఉద్యోగం మానేశావన్నారు. నీ దెబ్బకి ఆ ఏడాది నా చదువు”

“ఒక రోజు మీ వాళ్ళు ఇంటి మీదకి గొడవకొచ్చారు.”

నా మాటలు ఆగిపోయాయి.

ఆమె చెప్పింది– “పెద్ద గొడవే అయ్యింది. నువ్వు ఈ ఇంటికి వచ్చి వెళ్తున్నావని ఎవరో చెప్పారట. మీ నాన్నతోపాటు నలుగురైదుగురు మగాళ్ళు వచ్చారు. నన్ను ఇంట్లోంచి బైటికి లాగి కొట్టారు, రక్తం వచ్చేట్టు. నా సామానంతా బైట పడేశారు. ఇంకెలా ఈ ఊళ్ళో ఉండగలను, ఇంకెలా ఉద్యోగం చేయగలను.”

నాకు నోట మాట రాలేదు. ఇంకోపక్క గతంలో నా ఇంట్లో కనపడిన కొన్ని ప్రవర్తనలూ, వినపడిన కొన్ని మాటలూ అన్నీ గుర్తొచ్చి, ఇప్పుడు ఆమె చెప్తున్న కారణాన్నే మూలంగా నిలబెడుతున్నాయి. 

ఆమె నా వైపు చూసి, నన్ను ఏమార్చటానికన్నట్టు, “నీకు ఈ గది చాలా మంచి జ్ఞాపకం కదూ,” అంటూంది.

మా వాళ్ళు ఆమెను కొట్టడాన్ని ఊహించుకుంటే నా కళ్ళల్లోకి నీరొచ్చింది. 

ఆమె నా భుజం మీద చేయేసింది. “నీకు ఇదేం తెలిసుండదని అనుకున్నానులే. ఐనా మనం ఇటు వస్తే ఈ మాటొస్తుందని తెలుసు. అందుకే రాబుద్ధేయ లేదు.”

కాసేపు ఏం మాట్లాడాలో తెలీలేదు. చివరికి–

“నేను నిన్ను చాలా ప్రేమించాను,” అన్నాను. 

ఆ మాట క్షమాపణ అడిగినట్టే వినపడింది. 

ఆమె పైకి లేచి నిలబడింది. “పద పోదాం” అంది. 

ఇద్దరం బైటికి వస్తున్నాం. కానీ నేను ఇంటి బైటికి వచ్చేసరికి ఆమె నా వెనకాల లేదనిపించింది. వెనక్కి తిరిగితే– తలుపు మూసుకుపోయింది! తెరవబోతే, తలుపు దగ్గర ఇసక బలంగా అడ్డం పడతా ఉంది. తలుపు సందు లోంచి తల దూర్పి లోపలికి చూస్తే– పైన పెంకులు ఊడిన కన్నాల్లోంచి ఇప్పుడు ఇసక కుప్పలు కుప్పలుగా రాలుతోంది. ఇసక అడ్డంపడి తలుపు ఎంత నెట్టినా లోపలికి పోవటం లేదు. ఆమె పేరు పెట్టి పిలుస్తున్నాను. తలుపు తోస్తున్నాను. చొరబడలేని మౌనం లాగ తలుపు వెనక పేరుకుపోతున్న ఇసక బలం. లోపల అసలు మనిషే ఎవ్వరూ లేరేమో అన్నంత పెద్ద నిశ్శబ్దానికి… ఆమె ఇక కనపడదేమో అన్న కంగారుతో… మెలకువ వచ్చింది. 

* * *

నిద్ర తెర పైకి లేచిపోగానే చుట్టూ కనిపించిన వాస్తవం లోకి మనసు వెంటనే కుదురుకోలేక… ఎటూ కదల్లేక… అలా కాసేపు పై బెర్త్ వైపు చూస్తూ ఉండిపోయాను. రైలు డగ డగ మని ఒకే రిథమ్‌లో చప్పుడు చేస్తూ చాలా స్పీడుగా పోతా ఉంది. కాసేపటికి మెల్లగా లేచి కూర్చున్నాను. అప్పర్ బెర్త్ మీద నా మనవడు ఇంకా మెలకువ గానే ఉన్నాడు. వాడి ముఖం మీద స్మార్ట్ ఫోన్ వెలుగు. నేను లేచి కూర్చోవటం తెలిసి కిందకి చూశాడు, “ఏం తాతా!” అంటున్నాడు. 

చిటికెన వేలు లేపి చూపించాను.

“వస్తున్నా ఉండు,” అని సాయానికి దిగబోయాడు. 

అక్కర్లేదని వాడ్ని ఆపి నేనే లేచి బయల్దేరాను. 

ఇంకోకప్పుడైతే రమ్మనే వాడినే. కానీ ఇప్పుడు ఇందాకటి కల లోని యవ్వనం ఇంకా ఒళ్ళంతా నిండి ఉన్నట్టు భ్రమ. అదే జోరుతో నడవబోయాను కూడా. కానీ కొన్ని అడుగులు వేయగానే శరీరం అసలు వయసుని గుర్తుకు తెచ్చింది. బెర్తుల్ని చేత్తో సాయం పట్టుకుంటూ నడిచాను.

లైట్లు కట్టేసిన ఈ బోగీలో, సీట్ల మధ్యనున్న దారిలో నడుస్తుంటే, పడవలో నడుస్తున్నట్టు…

ఒక్క క్షణం మళ్ళీ ఆమె నా దారికి అడ్డంగా వస్తుందేమో అని… ఆశ…

తొలి ప్రేమ… నీలిమ… 

ఆమె జ్ఞాపకమంతా మాసిపోయిందీ వెలిసిపోయిందీ అనుకున్నాను గానీ లోపల మెదడు పొరల్లో ఎక్కడో అంతే స్పష్టంగా ఉందన్నమాట, అదను కోసం ఎదురు చూస్తూ….

ఆమె హఠాత్తుగా ఎందుకు ఊరి నుంచి ఉద్యోగం కూడా మానేసి వెళ్ళిపోయిందో ఎవరూ నాకు చెప్పలేదు. ఎవర్నీ అడిగే ధైర్యం నాకు లేదు. కానీ ఎందుకో… ఒక అనుమానం…. ఇప్పుడు కలలో ఆమే చెప్పిన నిజం లాంటిది…. 

ఇప్పుడు కూడా, నా మనసులోని పశ్చాత్తాపం అంతా, “నేను నిన్ను చాలా ప్రేమించాను నీలిమా,” అన్న మాట లాగే వినపడుతుంది ఎందుకో…. 

బోగీ చివరి దాకా నడిస్తే… సింక్‌ పైన అద్దంలో నా ముసలి ముఖం నన్ను ఆపింది… కలలో ఆమె పెదవికి గుచ్చుకున్న నా పదును మీసం యవ్వనం గుర్తొచ్చింది… ఆమెని ఎప్పుడూ కలవని, ఎక్కడ్నించి ఊడిపడిందో తెలియని, ఈ రెండో కలయిక లోని అందం… ఆమె వచ్చినంత దగ్గరగా జీవితంలో ఇంకే మనిషీ ఎప్పుడూ రాదని ముందే తెలిస్తే… అప్పుడే ఇంకాస్త గట్టిగా వెతికేవాడ్నేమో… ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అసలు ఉంటుందా… అలా ఆలోచించ బుద్ధి కాలేదు, ఆమె రూపం ముసలిగా ఊహకి అంద లేదు. 

కాళ్ళ కింద రైలు చేసే చప్పుడు మారింది… ఏదో బ్రిడ్జీ ఎక్కినట్టు… రేకుల గుల్ల చప్పుడు… 

“ఈ బ్రిడ్జీ తర్వాత ఏ ఊరు వస్తుందో తెలుసా”… నీలిమ… 

తలుపు దగ్గరకు వెళ్ళాను. 

తలుపు చాలా బరువుగా తెరుచుకుంది. 

చలికి ఒళ్ళంతా వణికింది. 

బ్రిడ్జీ దాటి, వెన్నెట్లో మెరిసే ఏరు దాటి, పొలాలు దాటి, కొబ్బరి తోటలు దాటాకా… 

పసుపు బోర్డు మీద నల్లటి అక్షరాలతో… 

అదే స్టేషన్… 

కాసేపటి క్రితం ఇద్దరం కలిసి దిగిన స్టేషన్…

స్టేషన్ అవతల, వెన్నెట్లో, గడియార స్తంభం, టైము మూడున్నర.

మెహెర్‌
మెహర్ - 2007 నుంచి రాస్తున్నాడు. 2019లో ‘చేదుపూలు’ కథా సంపుటి, ‘ఫ్రాంజ్‌ కాఫ్కా మెటమార్ఫసిస్‌, ఇంకొన్ని కథలు’ అనువాదం; 2023లో ‘పడిమునకలు’ వ్యాస సంపుటి; 2024లో ‘ఇద్దరూ కలవక ముందు’ నవల వచ్చాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *