‘డబ్బే సర్వస్వం కాదు’ అన్న విషయం సత్యమూర్తికి తన ఎనభయ్యవ పడిలో తెలిసొచ్చింది. డబ్బుతో కొనుక్కోలేని సుఖసంతోషాలు చాలా ఉంటాయని అనుభవంలోకి వచ్చింది. కొన్ని నెలల క్రితం భార్యా వియోగంతో ఒంటరితనం భయపెడుతోంది. అతన్ని ఒంటరితనం ఇంతగా మునుపెన్నడూ బాధించలేదు. కూతురు పెళ్ళి అయ్యి అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు, కొడుకు-కోడలు అమెరికాలో సెటిల్ అయిపోయినప్పుడు కూడా తనని ఇంత శూన్యం ఆవహించలేదు. భార్య తోడుగా ఉన్నన్ని రోజులూ ప్రపంచం అంతా తనతో ఉన్నట్టు అనిపించింది.
సత్యమూర్తిది కరోల్ బాగ్ లో పెద్ద వ్యాపారం. గ్రీన్ పార్క్ కాలనీలో పెద్ద బంగ్లా. ఇంట్లో రెండు లగ్జరీ కార్లు. ఇద్దరే పిల్లలు – కొడుకు, కూతురు. కొడుకుకి పెద్ద చదువులు చెప్పించాడు. ఇంకేముంది, భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటూ అమెరికాకి ఎగిరిపోయాడు. చాలా ఏళ్ళ తర్వాత తిరిగి రావడమైతే వచ్చాడు కానీ, పెళ్ళి చేసుకుని, ఈసారి భార్యతో సహా అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడపోయాడు. ఇద్దరికీ గ్రీన్ కార్డులు కూడా వచ్చేసాయి.
కూతురు పెళ్ళి చేస్తూనే, ఇక బాధ్యతలు తీరిపోయాయని సత్యమూర్తి హాయిగా ఊపిరిపీల్చుకున్నాడు. జీవితం సజావుగా సాగిపోయింది. ఎప్పుడూ దేనికీ ఇబ్బంది పడింది లేదు. ఓపిక ఉన్నన్నాళ్ళు వ్యాపారం చూసుకున్నాడు. ఇక తనవల్ల కాదు అనిపించడంతో షాపు, సామానుతో సహా లీజుకి ఇచ్చేసాడు. నెలతిరిగేసరికల్లా బిళ్ళకుడుముల్లా పెద్దమొత్తంలో డబ్బు వచ్చి చేతిలో పడుతుంది.
ఇనప్పెట్టెలో కావలసినంత డబ్బు మూలుగుతోంది. వడ్డీ డబ్బులతోనే జీవితం హాయిగా గడిచిపోతుంది.
ఇంట్లో పనిమనిషి ఉంది. అయితే ఇదివరకటి నిజాయితీ ఎక్కడ! జనాలు బిహార్, బెంగాల్ నుండి ఢిల్లీ వచ్చి బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో పనికి కుదురుకోవడం, ఆ ఇళ్ళల్లో దొంగతనాలు చెయ్యడమే కాకుండా ఇంట్లో ముసలివాళ్ళ హత్యలు చెయ్యడం కూడా మొదలుపెట్టారు.
సత్యమూర్తి ఇంట్లో ఇంతకుముందున్న పనిమనిషి ఉత్తరప్రదేశ్ ఆమె. చాలా ఏళ్ళు వీళ్ళ ఇంట్లో పనిచేసింది. ఉన్నట్టుండి కుటుంబంతో సహా ఊరెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక వయసులో ఉన్న బెంగాలీ పిల్లని పనిలో పెట్టుకున్నారు. పని బాగానే చేసేది కానీ, ఎప్పుడూ తన ఈతి బాధలు చెప్పుకుంటూ, బీదార్పులు మొదలుపెట్టేది. జీతం కాకుండా సత్యమూర్తి భార్య ప్రతినెలా ఎంతో కొంత డబ్బు ముట్టచెబుతూనే ఉండేది. ఆ పనిమనిషి ఢిల్లీలోనే ఏదో మురికివాడలో అద్దె గుడిసెలో ఉండేది. అయ్యోపాపం అని ఔట్ హౌస్ లో నే ఒక గది కూడా ఇచ్చింది సత్యమూర్తి భార్య. మంచితనానికి రోజులెక్కడ? కుట్టకపోతే తేలును కుమ్మరిపురుగు అన్నారుట! అలాగ, సత్యమూర్తి భార్య మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఒకరోజు ఆ పనిమనిషి తన ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకుంది. అక్కడితో ఊరుకోకుండా సత్యమూర్తి ఇంట్లో ఉన్న డబ్బు-దస్కం, విలువైన సామాను మూటకట్టుకుని ఉడాయించింది.
తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పనిమనిషి, రాత్రి సత్యమూర్తి దంపతులు తినే అన్నంలో మత్తుమందు కలిపింది. అంతే ఇంకేముంది, ఇద్దరూ ఆదమరిచి నిద్రపోయారు. తెల్లవారి పదింటివరకు మెలకువ వస్తే ఒట్టు! మెలకువ వచ్చినా మంచం దిగే పరిస్థితిలో లేరు. మొత్తానికి ఎలాగో లేచి ముఖం కడుక్కుని, పనిమనిషిని ఎన్ని కేకలేసినా ఉపయోగం లేకపోయింది. ఎక్కడా పనిమనిషి జాడ లేదు. సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. సూటుకేసులన్నీ తెరిచి ఉన్నాయి. మొగుడూ-పెళ్ళాలు ఇద్దరూ ఖంగారుపడి, ఇరుగుపొరుగుని పిలిచారు. ఊళ్ళోనే ఉంటారు కాబట్టి, కూతురు-అల్లుడికి ఫోను చేసారు.
లక్షల్లో డబ్బే కాకుండా, లక్షల విలువ చేసే సామాను కూడా పోయింది. పోలీసు స్టేషనులో రిపోర్టు ఇచ్చారు. ఇంటి బయట-లోపలి సిసిటివి కెమెరాలు అన్నీ గాలించారు. ఆ ఫుటేజీలని బట్టి పనిమనిషి ఒక్కర్తే కాదనీ, ఆమెతోపాటు మరొకతను కూడా ఉన్నట్టు తెలిసింది. దోచుకున్నది అంతా రెండేసి సూటుకేసుల్లో సర్దుకుని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఉడాయించారు.
ఎంక్వయిరీలో పనిమనిషి గురించిన వివరాలు ఏం తెలియలేదు. ఆమెను పనికి కుదిర్చిన ఏజెన్సీకి కూడా ఆమె తప్పుడు వివరాలే ఇచ్చింది. బహుశా బంగ్లాదేశీ అయ్యుండొచ్చు. హిందూ పేరు పెట్టుకుని ఢిల్లీలో పని చేస్తూ ఉండొచ్చు. అందరిలాగనే సత్యమూర్తి కూడా ఆమె వివరాలు పూర్తిగా తెలుసుకోలేదు, పోలీసు వెరిఫికేషన్ కూడా చేయించలేదు. సిసిటివి ఫూటేజి తప్ప వీళ్ళ దగ్గర ఆమె ఫోటో కూడా లేదు.
పనిమనిషి వివరాలు దొరకకపోవడంతో పోలీసులు సత్యమూర్తి ఇచ్చిన రిపోర్టుని బుట్టదాఖలు చేసేసారు. కేసు మూతబడింది.
డబ్బు, సామాను పోతే పోయింది, ప్రాణాలు దక్కాయి, అదే పదివేలు అనుకున్నారు సత్యమూర్తి దంపతులు. ఈరోజుల్లో హత్య చెయ్యడం చాలా మామూలు విషయం అయిపోయింది. ముందుగా ఇంట్లోవాళ్ళని హత్య చేసి ఆ తర్వాత దోపిడీ చెయ్యడం దొంగలకి బాగా ట్రెండ్ అయిపోయింది.
ఈ సంఘటన తర్వాత సత్యమూర్తి కాస్త జాగ్రత్తపడ్డాడు. పనిమనిషి లేకుండా ఇల్లు గడవడం కష్టం. బాగా ఆలోచించి ఈసారి ఢిల్లీకి చెందిన పనిమనిషినే కుదుర్చుకున్నాడు. డాక్యుమెంట్లు అన్నీ ఒకటికి పదిసార్లు పరిశీలించి పోలీసు వెరిఫికేషన్ చేయించి మరీ పనిలో పెట్టుకున్నాడు.
బండి గాడిన పడింది అనుకుంటున్న సమయంలో భార్య సత్యమూర్తిని ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. పదమూడవ రోజు వరకూ ఇంట్లో అందరూ ఉండటంతో సందడిగానే ఉంది. అయితే మెల్లమెల్లగా సత్యమూర్తిని ఒంటరితనపు మేఘాలు కమ్ముకున్నాయి. జీవితంలో సుఖం లేకుండాపోయింది.
కూతురు తనతో వచ్చెయ్యమని బతిమలాడింది. సత్యమూర్తి ఒప్పుకోలేదు. “కాలూ చెయ్యి సాగినన్నాళ్ళు, నేను నా ఇంట్లోనే ఉంటాను. మంచానపడితే ఎలాగూ తప్పదు. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు” అన్నాడు. తండ్రి ఆత్మాభిమానం తెలుసు కాబట్టి కూతురు కూడా మరీ బలవంతపెట్టలేదు.
మనిషి ఎంత ఆత్మాభిమానం ఉన్నవాడైనా, ఎంత డబ్బున్నవాడు అయినా, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడక తప్పదు. ఒంటరితనమే సత్యమూర్తిని భయపెట్టడం మొదలుపెట్టింది. పనిమనిషి ఉదయం-సాయంత్రం వచ్చి, చకచకా పనులు చేసుకుని వెళ్ళిపోతుంది. ఇక సత్యమూర్తి రోజంతా ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. ఎంత ఉదయం-సాయంత్రం వాకింగ్ కి వెళ్ళినా, సమయం గడిస్తే ఒట్టు. ఒంటరితనం కంటే, ముసలితనం, ఎవరైనా దొంగలు తనని చంపేస్తారేమోనన్న భయమే సత్యమూర్తిని ఎక్కువ భయపెట్టేది.
ఇక మనసులో బాధ ఎవరికో ఒకరికి చెప్పుకోవాలని ఒకరోజు విషయం తన బావమరిదికి చెప్పాడు. అతడు వెంటనే, “అయ్యో బావ, ఇంతమాత్రానికి ఎందుకు అంత ఖంగారు. ముందే చెప్పి ఉండాల్సింది. ఇది అసలు పెద్ద సమస్యే కాదు. నా కొడుకు అర్పిత్, నోయెడాలో బి.బి.ఏ. చేస్తున్నాడు. మా ఇంటి నుండి కాలేజీ దూరం, అదే నీ ఇంటి నుంచి అయితే దగ్గర. వాడు కూడా ‘కాలేజీ దూరమైపోయింది. వెళ్లడం-రావడం ఇబ్బంది అవుతోంది’ అని గొడవ చేస్తున్నాడు. అర్పిత్ ని నీ ఇంట్లో ఉంచుకో. నీకూ కాస్త తోడుగా ఉంటాడు, వాడికీ కాస్త చదువుకోవడానికి టైం దొరుకుతుంది. బయట ఏమైనా చిన్న-చిన్న పనులు ఉన్నా చేసి పెడతాడు” అన్నాడు.
బావమరిది సలహా బాగానే ఉంది అనిపించింది. సత్యమూర్తి అంగీకారంతో మర్నాడే అర్పిత్ సామానుతో సహా సత్యమూర్తి ఇంటికి వచ్చేసాడు. అర్పిత్ 21-22 ఏళ్ళ కుర్రాడు. పేరుకు తగ్గ గుణగణాలేం లేవు అతగాడిలో. నెలరోజులు తిరగకుండానే అర్పిత్ ఒక ఆవారా-పోకిరీ కుర్రాడు అని సత్యమూర్తికి అర్థమైపోయింది. అర్పిత్ రోజంతా బయటనే షికార్లు కొడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తాగి కూడా వచ్చేవాడు.
సత్యమూర్తి బయటనుండి ఏమైనా సామాను తీసుకురమ్మంటే, దాంట్లో కూడా డబ్బులు కొట్టేసేవాడు. పైగా ఏవేవో సాకులు చెప్పేవాడు. డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం ఏడుపు ముఖంపెట్టి కట్టుకథలు చెప్పేవాడు.
సరే, ఎంతకాదన్నా, తోడుగా ఉన్నాడులే అని మొదట్లో సత్యమూర్తి ముందువెనక ఆలోచించకుండా అర్పిత్ అడిగిన డబ్బు ఇచ్చేస్తూ ఉండేవాడు. తనకి తోడుగా ఉన్నవాడికి సహాయం చెయ్యడం తన బాధ్యత అని భావించేవాడు. క్రమంగా అర్పిత్ డబ్బులు అడిగేది, అవసరాల కోసం కాదు, జల్సాలకోసమని సత్యమూర్తికి అర్థమయింది. మెల్లమెల్లగా అర్పిత్ కోరికలు పెరుగుతున్నాయి. డబ్బుల మాట ఎలా ఉన్నా, తను చేతులారా కుర్రాణ్ణి పాడుచేస్తున్నాను అన్న భావన సత్యమూర్తిలో మొదలయింది. చదువు కంటే తిరుగుళ్ళ మీదే అర్పిత్ ధ్యాస అంతా!
సత్యమూర్తి తన బావమరిదికి ఫోను చేసి అర్పిత్ ఆగడాలన్నీ ఏకరువు పెడుతూ – “వచ్చి, నీ కొడుకుని తీసుకెళ్తే బాగుంటుంది. వాడికి మంచి-చెడు చెప్పే హక్కు నాకు లేదు. చెప్పినా వింటాడన్న నమ్మకం కూడా లేదు. ఈ వయసులో నేను ఇంత వత్తిడి తట్టుకోలేను. డబ్బు పెద్ద ఇబ్బంది కాదు. నేను ఇస్తూనే ఉన్నాను. కానీ, వాడు నా దగ్గర ఉండి చెడిపోవడం నాకు ఇష్టం లేదు. ఎంత కాదన్నా, తల్లిదండ్రులుగా మీరే వాడికి నచ్చజెప్తే బాగుంటుంది” అన్నాడు.
బావమరిదికి, సత్యమూర్తి మాటలు రుచించలేదు. అయితే తన కొడుకు గురించి తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేకపోయాడు. మర్నాడే వచ్చి అర్పిత్ ని తీసుకెళ్ళిపోయాడు.
మళ్ళీ అదే ఒంటరితనం …. రాత్రిపూట భయంకరమైన కలలు. ఒక్క పది నిమిషాలు మాట్లాడటానికి ఇంట్లో ఎవర్ని తెచ్చిపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. పార్కులో వాకింగ్ ఫ్రెండ్స్ తో తన బాధ చెప్పుకుంటే వాళ్ళల్లో ఒకరు – “ఇందులో అంత ఆలోచించాల్సింది ఏముంది? ఒక మంచి కుక్కపిల్లని తెచ్చి పెంచుకో. దానిని మించిన తెలివైన, నమ్మకమైన జంతువు మరొకటి లేదు!” అని ఒక్క ముక్కలో తేల్చిపడేసాడు.
సత్యమూర్తి ‘సరే’ అన్నట్టు తలాడించాడు. మళ్ళీ ఇంతలోనే కుక్కపిల్ల ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూండగా ఆ మిత్రుడే తన స్నేహితుడి లాబ్రడార్ కుక్క ఈమధ్యనే పిల్లలని పెట్టిందనీ, కావాలంటే ఒక కుక్కపిల్లని ఇప్పిస్తానని మాటిచ్చాడు.
మర్నాటికల్లా సత్యమూర్తి ఇంట్లోకి ఒక చిన్న కుక్కపిల్ల వచ్చింది. ఇంత చిన్న పిల్లను తల్లి నుండి దూరం చేసాం, అది కానీ చచ్చిపోదు కదా అని సత్యమూర్తికి కాస్త భయమేసింది. సత్యమూర్తి ఇప్పటివరకూ ఎప్పుడూ కుక్కని పెంచలేదు. అయినా ఆ చిన్న కుక్కపిల్లని ప్రేమగా సాకటం మొదలుపెట్టాడు. ముందుగా గదిలో ఒక మూల ఒక వెచ్చటి బొంతలాంటిది వేసి, కుక్కపిల్లని దానిమీద పడుకోబెట్టాడు. ఒక చిన్న గిన్నెలో పాలుపోసి ఆ కుక్కపిల్ల ముందుపెట్టాడు. అయితే అది కనీసం పాలు వాసన కూడా చూడలేదు. అప్పుడు విషయం అర్థమయి, దూది పాలల్లో ముంచి, ఆ కుక్కపిల్ల నోట్లో పిండాడు. కుక్కపిల్ల మెల్లమెల్లగా చప్పరించింది. సత్యమూర్తి ముఖం వికసించింది. కళ్ళు చెమర్చాయి.
కాసిని పాలు తాగడంతో కుక్కపిల్ల ఒంట్లో కాస్త వేడి పుట్టింది. అటు-ఇటు కదలడం మొదలుపెట్టింది. ఆ చిన్ని కుక్కపిల్ల అటూ-ఇటూ వెళ్ళిపోవడం, సత్యమూర్తి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పడుకోబెట్టడం, ఈ ఆట నడుస్తూనే ఉంది. అది మాటిమాటికీ సత్యమూర్తి కాళ్లదగ్గరకి వచ్చి పాదాలు నాకుతోంది. అరకేజి కూడా లేని ఆ చిన్ని కుక్కపిల్ల శరీరం సత్యమూర్తికి ఎంతో సుఖాన్ని ఇచ్చింది. పొద్దున్న-సాయంత్రం ఎప్పుడూ ఆ కుక్కపిల్లతో ఆటలే. అసలు రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. నిరాశ-నిస్పృహలు మాయమయిపోయాయి. ఒంటరితనం ఎక్కడకి పారిపోయిందో! ఈ కుక్కపిల్లతో ఆటల్లో పడి అసలు టివి పెట్టడం కూడా మర్చిపోయాడు.
అది విదేశీ జాతి కుక్కపిల్ల. దానికి ఏమైనా ఇంగ్లేషు పేరు పెట్టొచ్చు. కానీ సత్యమూర్తి దానికి ‘చిట్టి’ అని పేరు పెట్టాడు.
సత్యమూర్తికి కుక్కపిల్లని పెంచడం ఒక కొత్త అనుభవం. దాని ఒకటి-రెండు శుభ్రం చెయ్యడం కూడా అంతే కొత్త అనుభవం మరి! కానీ సత్యమూర్తి ఈ పనులన్నీ ఎంతో సంతోషంగా చేస్తున్నాడు. వయసులో ఉన్నప్పుడు తన సొంత పిల్లలకి చేస్తున్న భావనతోనే చేస్తున్నాడు. ఎందుకో తన ఇంట్లో మూడవ సంతానం అడుగుపెట్టినట్టు అనిపించింది. మర్నాడు ‘చిట్టి’కి పాలతో పాటు పల్చటి పప్పు తేట కూడా పట్టించాడు. సందు చివర ఉన్న దుకాణం నుంచి పెడిగ్రీ తీసుకొచ్చాడు. మొత్తానికి చిట్టి బాగోగులు ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నాడు. అయితే ఇంకా మరీ చిన్నది కావడంతో వాకింగ్ కి తీసుకెళ్ళడం మాత్రం కుదరట్లేదు.
చిట్టి ఆరోజు రాత్రి కూడా మంచం మీదనే సత్యమూర్తి ని హత్తుకుని పడుకుంది.
రెండు నెలలు గడుస్తూనే చిట్టి, సత్యమూర్తితో పాటు వాకింగ్ కి బయలుదేరింది. పార్కులో అటూ-ఇటూ పరిగెట్టేది. దానితో పరుగెట్టి సత్యమూర్తికి కూడా కొత్త ఉత్తేజం వచ్చినట్టు అనిపించేది. అలా సత్యమూర్తిలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
చిట్టి చాలా తెలివైనది. ఒకటికి-రెండుకి గది బయటకి వెళ్లడం నేర్చుకుంది. అప్పుడప్పుడు గదిలోనే కానిచ్చినా, ‘కుఁయ్ కుఁయ్’ అంటూ బయటకి తీసుకెళ్ళమని సంకేతాలు ఇచ్చేది. పగటివేళ అయితే సత్యమూర్తి బయటకి తీసుకెళ్ళేవాడు. రాత్రి అయితే గదిలో కానిచ్చెయ్యమని వదిలేసేవాడు.
ఇప్పటివరకు చిట్టి, మంచం మీద సత్యమూర్తి పక్కనే పడుకుంటోంది. పెద్ది అవుతుండటంలో సత్యమూర్తి దానికోసం గదిలో ఒక మూల విడిగా పక్క ఏర్పాటు చేసాడు. సత్యమూర్తి దాన్ని, ఆ పక్కమీద పడుకోబెట్టి ‘ఇక నుండి నువ్వు ఇక్కడే పడుకోవాలి’ అని చెప్పేవాడు. అర్థమైనట్టు చిట్టి కూడా ‘కుఁయ్ కుఁయ్’ అనేది.
చిట్టిని పడుకోబెట్టి సత్యమూర్తి మంచం మీద నడుంవాల్చి, కళ్ళు మూసుకుని పడుకోవడానికి ప్రయత్నించేవాడు. ఇంతలో చిట్టి ‘కుఁయ్ కుఁయ్’ అంటూ మంచం పట్టీని తన చిన్ని చిన్న కాళ్లతో గీరుతూ ఉండేది. చూస్తే చిట్టి మంచం ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఇక తప్పదు అన్నట్టు సత్యమూర్తి దాన్ని ఎత్తుకుని మళ్ళీ పక్కలో పడుకోబెట్టుకునేవాడు.
చూస్తూచూస్తూనే ఏడాది గడిచిపోయింది. చిట్టి ఇప్పుడు మంచి అందంగా, దిట్టంగా తయారయ్యింది. దానికి సత్యమూర్తి మాటలు అన్నీ అర్థమవుతున్నాయి. అది ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అస్సలు ఇష్టపడేది కాదు. సత్యమూర్తి బయటకి వెళ్లబోతూంటే కాళ్లకి అడ్డం పడిపోయేది. ‘పద బయటకి వెళ్దాం’ అంటున్నట్టు గుమ్మంవైపు పరుగెడుతూ ఉండేది. ఒకరకంగా బయటకి తీసుకెళ్ళమని గారం చేసేది.
ఎప్పుడైనా చిట్టిని తనతో కూడా తీసుకెళ్లడం కుదరక ఇంట్లోనే ఉంచి సత్యమూర్తి ఒక్కడూ బయటకి వెళ్తే చాలాసేపు అరుస్తూ ఉండేది. సత్యమూర్తి వస్తున్న అలికిడి అవుతూనే గంతులేస్తూ ‘కుఁయ్ కుఁయ్’ అంటూ ఉండేది. సత్యమూర్తి బయట నుండి తలుపు తెరిచి లోపలకి వస్తూనే కాళ్లకి చుట్టుకుపోయేది. సత్యమూర్తి మనసు ఉప్పొంగిపోయి, దాన్ని కౌగిలించుకుని ముద్దుచేసేవాడు.
ఇంటికి ఎవరైనా కొత్త మనిషి వస్తే వాసన చూసి వాళ్ళ కాళ్లను చుట్టుకునేది. అయితే ఎవరినీ కరిచేది మాత్రం కాదు. కాళ్ళు నాకి వదిలేసేది.
కన్నకొడుకు దగ్గర లేకపోయినా, ఈ పెంపుడు కొడుకు తన ఒంటరితనాన్ని పోగొడుతున్నందుకు సత్యమూర్తి చాలా సంతోషంగా ఉన్నాడు. మెడలో పట్టీ లేకుండా బయటకి తీసుకెళ్లినా, తనని దాటి వెళ్ళేది కాదు చిట్టి. వెనకాలే నడుస్తూ ఉండేది. అతడు సైగ చేస్తేనే పరిగెట్టేది. సత్యమూర్తి బెంచి మీద కూర్చొంటే చిట్టి అటూ-ఇటూ వెళ్ళకుండా, అతని కాళ్లమధ్యలో కూర్చునేది.
చలికాలం. పనిమనిషి వంట చేసి వెళ్ళిపోయింది. సత్యమూర్తి ఇంకా స్నానం చెయ్యలేదు. టిఫిన్ చేసి ఎండకి లాన్ లో కూర్చొన్నాడు. చిట్టి అతడి కాళ్ళ దగ్గర ప్రశాంతంగా పడుకుని ఉంది.
సరిగ్గా అప్పుడే గేటు చప్పుడు అయింది. చూస్తే అర్పిత్. వెంటనే సత్యమూర్తి “అరే, అర్పిత్, చాలా రోజులకి… ఎలా ఉన్నావు?” అన్నాడు.
అర్పిత్ కూడా లోపలకి వచ్చి అటూ-ఇటూ చూస్తూ “హాయ్ మావయ్యా! బాగానే ఉన్నాను. కాలేజీ, పరీక్షలు, హడావుడి” అన్నాడు. ఇంతలో చిట్టి కూడా లేచి నిలబడింది. కొత్త మనిషిని చూస్తి మొరగుతోంది. తోక ఊపుతూ అర్పిత్ వైపు వెళ్ళబోతే, సత్యమూర్తి చెట్టిని ‘నో, నో. కూర్చో’ అన్నాడు. చిట్టి ఎగిరి, అర్పిత్ తొడలమీద కాళ్ళు వేసింది. అర్పిత్ కాస్త భయపడి ఒక్క అడుగు వెనక్కి వేసాడు.
అయితే సత్యమూర్తి, “ఏం భయం లేదు. అదంతా దాని ప్రేమ, అంతే” అన్నాడు.
“మావయ్యా, నువ్వు కుక్కని ఎప్పటి నుంచి పెంచుతున్నావు?” అడిగాడు ముఖం అదోలా పెట్టుకుని.
“ఏడాది అవుతోంది” అన్నాడు సత్యమూర్తి.
“అవునులే, నీకు మనుషుల కంటే కుక్కలు అంటేనే ఎక్కువ ఇష్టం” అన్నాడు విషం కక్కుతున్నట్టు.
అయితే సత్యమూర్తి ఆ మాటలేం పట్టించుకోకుండా, “ఇక్కడే కూర్చుందామా? లోపలకి వెళ్దామా?” అన్నాడు.”
“లోపలే కూర్చుందాం మావయ్య. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అన్నాడు.
అయితే సత్యమూర్తికి, అంత ముఖ్యమైన విషయం ఏంటో మాత్రం అర్థంకాలేదు. ఇద్దరూ లోపలకి వచ్చి కూర్చొన్నారు. చిట్టి, తన యజమాని కాళ్ళ దగ్గర నిశ్చింతగా కూర్చొంది.
లోపలకి వచ్చిన అర్పిత్, ఆ ఇంటిని మొదటిసారి చూస్తున్నట్టు పరకాయించి చూస్తూ “ఒక్కరే ఉన్నారా? అని అడిగాడు.
“అవును, పనిమనిషి వంట చేసి వెళ్ళిపోయింది” అన్నాడు.
అర్పిత్, సత్యమూర్తి ముఖంలోకి చూస్తూ, “మావయ్యా, నువ్వు ఈ మధ్య మరీ యంగ్ గా కనిపిస్తున్నావు. ఏం తింటున్నావేం?” అన్నాడు.
“ప్రత్యేకం తినేది ఏం లేదు. సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాను అంతే” అన్నాడు నవ్వేస్తూ. అయితే తన సంతోష రహస్యం చిట్టి అని సత్యమూర్తికి తెలుసు.
‘ఓహ్’ అని ఊరుకున్నాడు అర్పిత్.
“సరే ఇంతకీ విషయం ఏంటో చెప్పనేలేదు” అన్నాడు సత్యమూర్తి మామూలు ధోరణిలో.
అర్పిత్ సమస్యలో ఉన్నాడో, లేక అలా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడో కానీ. ఏడుపు ముఖం పెట్టుకుని “మావయ్య, నేను చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి” అనాడు. సత్యమూర్తి కనుబొమ్మలు ముడివేసి “ఏంటి?” అన్నట్టు చూసాడు.
“నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి” అన్నాడు అర్పిత్.
“లక్ష రూపాయలా!” అని నోరెళ్లబెట్టాడు సత్యమూర్తి.
అర్పిత్ ఏడుపు ముఖం పెట్టి “అవును మావయ్యా!” అన్నాడు.
సత్యమూర్తి తనని తాను సంభాళించుకుంటూ “ఇప్పటికిప్పుడు నీకు లక్ష రూపాయలు ఎందుకు? అయినా నేనెందుకు ఇవ్వాలి? మీ నాన్నని అడుగు” అన్నాడు. దానికి అర్పిత్ “హమ్మో ఇంకేమైనా ఉందా? చంపేస్తాడు” అన్నాడు.
“అసలు విషయం ఏంటో చెప్పు? దేనికో, ఏంటో వివరం తెలియకుండా లక్ష రూపాయలు ఎలా ఇచ్చేది? ఏమైనా తప్పుడు పనులు మొదలుపెట్టావా? ముందు వెళ్ళి మీ నాన్నకి చెప్పు. తర్వాత నా దగ్గరకి రా. మీ నాన్న చెబితే అప్పుడు ఆలోచిస్తాను” అని తేల్చి చెప్పేసాడు.
అర్పిత్ ముఖంలో రంగులు మారాయి. సత్యమూర్తి వైపు గుర్రుమని చూస్తూ, బెదిరిస్తున్నట్టు “మావయ్యా, మరీ అంత కర్కోటకుడిలా మాట్లాడకు. నీదగ్గర బోల్డంత డబ్బు ఉంది. అదంతా ఇక్కడే వదిలేసి పోవాలి. ఇప్పుడు నాకు సాయం చెయ్యకపోతే, నువ్వు పోయాక చుట్టాలు అందరూ ఈ సంపద అంతా దోచుకుని తింటారు.” అన్నాడు.
సత్యమూర్తికి చిరాకేసింది. అయినా ధైర్యం కూడగట్టుకుని, “డబ్బు ఇవ్వననట్లేదు. అసలు నీకు అంత డబ్బు ఎందుకో నాకు తెలియాలి కదా. పైగా ఈ విషయం మీ నాన్నకి కూడా తెలియకూడదు అంటున్నావు. వెయ్యి-రెండు వేలు అయితే ఫర్వాలేదు. కానీ లక్ష రూపాయలు ఎలా ఇస్తాననుకున్నావు?” అన్నాడు.
“నీ పద్ధతి ఏం బాగోలేదు మావయ్య” – ఈసారి అర్పిత్ స్వరం మారింది. బెదిరింపుల్లోకి దిగాడు.
“అంత కోపం ఎందుకు? కారణం చెబితే, ఆలోచిస్తాను” అన్నాడు సత్యమూర్తి.
“ఆ వివరాలు బయటపెట్టలేను. కానీ నేను మాత్రం పెద్ద ఆపదలో ఉన్నాను. అంతే!”
ఈరోజుల్లో కుర్రకారు ఆపదలు ఏంటో తెలియనివి కాదు – పెద్ద పెద్ద కోరికలు, మత్తుపదార్థాలు, అమ్మాయిలు. ఏవరైనా అమ్మాయికి ఖర్చుపెట్టాలేమో. లేదా ఏ అమ్మాయి అయినా బ్లాక్ మెయిల్ చేస్తూండొచ్చు. లేదా బెట్టింగులు అయ్యుండొచ్చు. చదువుకి అయితే ఒక్కసారిగా అంత డబ్బు అవసరం ఉండదు. నిజంగా చదువుకే అయితే వాళ్ళ నాన్న ఉండనే ఉన్నాడు.
“సంగతి ఏంటో చెబితే, ఏదో రకంగా సర్దుతాను.”
“సర్లే మావయ్యా! మీ వల్ల కాదు. అంతే కదా. ఇదే మీ ఆఖరి నిర్ణయం. డబ్బులు ఇవ్వరు కదా?” ఈసారి బెదిరింపుల డోసు పెంచాడు.
“ప్రస్తుతం నా దగ్గర అంత సొమ్ము లేదు” అంటూ సత్యమూర్తి దాటెయ్యడానికి ప్రయత్నించాడు.
అర్పిత్ ఒక వంకర నవ్వు నవ్వుతూ “నేనేమన్నా వెర్రివెంగళప్పనా? నేను ఇదే ఇంట్లో చాలా రోజులు ఉన్నాను. ఒక పనిమనిషి ఈ ఇంటి నుండి లక్షల్లో సొమ్ము దోచుకుని పోయింది. కానీ ఇప్పుడు ఇంట్లో లక్ష రూపాయలు లేవంటే నమ్మాలా? మీకు నెలనెలా అంతకి నాలుగు రెట్లు అద్దెలు వస్తాయి. అది కూడా లిక్విడ్ క్యాష్. మీరు డబ్బులు బ్యాంకులో పెట్టరన్న సంగతి కూడా నాకు బాగా తెలుసు” అన్నాడు.
“ఎన్నైనా చెప్పు. డబ్బులు ఇవ్వడం మాత్రం కుదరదు. నువ్వు నిజంగా ఆపదలో ఉన్నావో, లేక నా నుండి డబ్బు దోచుకుంటున్నావో ఎలా తెలుస్తుంది? ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే మోసం చేసావు. నీ మీద నమ్మకం లేదు” అన్నాడు సత్యమూర్తి.
“మావయ్యా, తప్పు చేస్తున్నావు. నీ డబ్బు అంతా ఇక్కడే ఉండిపోతుంది. నువ్వు మాత్రం ఉండవు చూసుకో” అంటూ లేచి సత్యమూర్తి వైపు ఒక అడుగు ముందుకు వేసాడు. అర్పిత్ చూపులు-చేష్టలు ఏం బాగోలేవు.
సత్యమూర్తి ఒక్క క్షణం బెదిరిపోయాడు. తనని చంపడానికి రావట్లేదు కదా అనుకుంటూ కుర్చీలో నిటారుగా కూర్చొన్నాడు.
“మీ దగ్గర బోల్డంత డబ్బుంది. నాకు కాస్త సాయం చేస్తారు అనుకున్నాను. కానీ మాటలకి లొంగేలా లేరు.” అంటూ మరొక అడుగు ముందుకు వేసాడు.
సత్యమూర్తి గుండెలు దడదడలాడాయి. ఆయాసం వస్తోంది. అర్పిత్ చూపులు క్రూరంగా ఉన్నాయి. డబ్బు కోసం అర్పిత్ ఏమైనా చేసేలా ఉన్నాడు. సత్యమూర్తికి చిన్నగా గుండెల్లో నొప్పి మొదలయింది.
“నీకేం కావాలి అర్పిత్?” సత్యమూర్తి ధైర్యం కూడగట్టుకుని వణుకుతున్న గొంతుతో అడిగాడు.
“ఏం కావాలి అని ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు లక్ష రూపాయలతో పని అవ్వదు. నోరుమూసుకుని కూర్చో. కుర్చీలో నుంచి లేచావంటే చంపేస్తాను. నాకిప్పుడు పిచ్చెక్కిపోతోంది” అంటూ అర్పిత్ మెల్లగా సత్యమూర్తి పీకనొక్కబోయాడు.
“వద్దు, వద్దు” అంటూ అరిచాడు సత్యమూర్తి. “నువ్వు కూర్చో, ఇప్పుడే వెళ్ళి నీకు లక్ష రూపాయలు తీసుకొస్తాను” అని కుర్చీలో నుంచి లేవబోయాడు. భయానికి కాళ్ళు వణుకుతున్నాయి. శరీరం మొద్దుబారిపోయింది. లేవలేకపోయాడు.
“ఇప్పుడు ఇక లాభం లేదు నా ముద్దుల మావయ్య! నువ్వు బతికుంటే నాకు శిక్ష పడుతుంది. అదే నువ్వు చచ్చిపోతే నేను లక్షాధికారిని అయిపోతాను. నీ డబ్బు అంతా నాదయిపోతుంది. ఎవరికీ అనుమానం కూడా రాదు. సిసిటివి కెమెరాల సంగతి తర్వాత చూసుకుంటాను. నిన్ను చంపి, వాటిని కూడా నాశనం చేసేస్తాను.” చూస్తూంటే అర్పిత్ ముందే ప్లాన్ వేసుకుని వచ్చినట్టు ఉన్నాడు.
సత్యమూర్తికి నోట మాట రావట్లేదు. కుర్చీలో నుంచి కూడా లేవలేకపోతున్నాడు. అర్పిత్ పొడవాటి చేతులు సత్యమూర్తి గొంతువైపు కదులుతున్నాయి. అర్పిత్ ముఖం వికృతంగా ఉంది. సత్యమూర్తి పీకపట్టుకుంటూ, “ఆఖరిసారి దేవుణ్ణి తలుచుకో. అయినా ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలడు అనుకో” అన్నాడు.
సత్యమూర్తి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అరవబోయాడు. కానీ గొంతు పెగల్లేదు.
అప్పటివరకు చిట్టి తన యజమాని కాళ్ళ దగ్గర పడుకుని గుడ్లప్పగించి అంతా చూస్తూ ఉంది. యజమాని ఏదో ఆపదలో ఉన్నాడని అర్థమయింది. తనని కౌగిలించుకొను పడుకునే, తనని అల్లారుముద్దుగా చూసుకునే తన యజమానికి ఏదో కష్టం వచ్చింది. ఎవరో మూడవ వ్యక్తి ఆపద తలపెట్టబోతున్నాడు. అంతే! చిట్టి లేచి నిలబడింది. ఒక్క క్షణం పరకాయించి చూసింది. చిట్టి తోక నిటారుగా అయింది. గుర్రుగుర్రు మంటూ ఒక్క ఎగురు ఎగిరి, అర్పిత్ గొంతు పట్టుకుంది. దాని పళ్ళు అర్పిత్ కంఠంలోకి దిగాయి. అర్పిత్ కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సత్యమూర్తి పీక వదిలి, అర్పిత్ వెల్లకిలా పడిపోయాడు. అర్పిత్ పీక మీద చిట్టి పంజా ఇంకా బిగుసుకుంటోంది.
సత్యమూర్తి ఆయాసపడుతున్నాడు. అయినా పరిస్థితి చెయ్యి దాటిపోతూండటం చూసి తేరుకుని, చిట్టిని, అర్పిత్ నుండి విడదీసాడు. సమయానికి సత్యమూర్తి అడ్డురాకపోయి ఉంటే చిట్టి, అర్పిత్ ప్రాణాలు తీసేసేది. చిట్టి ఇంకా అర్పిత్ మీదకి ఎగబడుతోంది. మొత్తానికి ఎలాగో దాన్ని బుజ్జగించి ఒక మూల కూర్చోబెట్టాడు.
అర్పిత్ నేలమీద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతడి, గొంతు రక్తమోడుతోంది. చాలా పెద్ద గాయమైంది. కాసేపు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇరుగుపొరుగుని పిలుద్దాం అనుకున్నాడు. కానీ, ఇదంతా పోలీసుల వ్యవహారం అని గుర్తొచ్చింది. ఇప్పుడు వదిలేస్తే, అర్పిత్ మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నం తలపెట్టొచ్చు. మౌనంగా ఉండటం మంచిది కాదు అనిపించింది.
వెంటనే 100 కి ఫోను చేసాడు. పొరుగింటి వారిని కూడా పిలిచి అంతా వివరంగా చెప్పాడు. అందరూ చాలా కంగారుపడ్డారు. పోలీసులు వచ్చి పరిస్థితి అంచనా వేసి, సిసిటివి ఫుటేజీ చూసి నిర్ధారించుకున్నారు.
అర్పిత్ ని హస్పటల్ లో చేర్పించారు. తర్వాత లోకల్ పోలీసు స్టేషన్ వాళ్ళు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. సీనియర్ సిటిజన్ అవ్వడంతో పోలీసులే ఇంటికి వచ్చి సత్యమూర్తి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. సిసిటివి ఫూటేజి తీసుకుని వెళ్ళిపోయారు.
అర్పిత్ తల్లిదండ్రులు వచ్చారు, కానీ, వాళ్ళు సత్యమూర్తినే దోషిగా నిలబెట్టారు. తమ కొడుకులో తప్పే కనిపించలేదు. దీనికంతటికీ కారణం సత్యమూర్తే అంటారు వాళ్ళు. అర్పిత్ కి లక్ష రూపాయలు పడేస్తే ఇంత గొడవ జరిగేదే కాదని వాళ్ళ వాదన. పోలీసులుకి రిపోర్టు చెయ్యడం వాళ్లకి మింగుడుపడట్లేదు. వాళ్లకి కబురు పంపితే కూర్చుని మాట్లాడుకునేవారు అని ఇంకొక వితండ వాదన.
సత్యమూర్తి మంచి పనే చేసాడు. అత్తవారి ఇంటితో ఉన్న ఆ కాస్త బంధం కూడా తెగిపోయింది. ఇలాంటి బంధాలు-చుట్టరికాలు లేకపోవడమే నయం అనిపించింది.
అందరూ ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దం. ఈ హడావుడిలో అసలు చిట్టి ఎక్కడ ఉందో చూడనేలేదు. తీరా చూస్తే చిట్టి దూరంగా ఒక మూల కూర్చొంది. తను ఏదో తప్పు చేసినట్టు, అందుకు యజమాని తనని దండిస్తాడు అన్నట్టు ఉన్నాయి దాని చూపులు. చిట్టి ముడుచుకుని పడుకుంది. తోక మాత్రం మెల్లగా ఊపుతోంది. తనని కొట్టొద్దు, ప్రేమించు అన్నట్టు ఉన్నాయి దాని చూపులు.
సత్యమూర్తి దానిపక్కన నేలమీదనే కూర్చుండిపోయాడు. ఒక్కసారిగా అతడికి చిట్టి మీద ప్రేమ పొంగుకొచ్చింది. మెల్లగా దాని వీపు నిమిరాడు. అయినా చిట్టి తల ఎత్తలేదు. అప్పుడు సత్యమూర్తి దాన్ని ముద్దు పెట్టుకుంటూ “శభాష్ చిట్టి, నువ్వే లేకపోతే ఇవాళ నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. నువ్వు కుక్కవి కాదు, నా కొడుకువి. ముసలితనంలో తండ్రికి ఆసరా అయ్యే నిజమైన కొడుకువి” అన్నాడు.
చిట్టి, సత్యమూర్తి ఒళ్ళోకి దూరి కుఁయ్ కుఁయ్ అంటోంది. చిట్టి మొదటిసారిగా అలాంటి శబ్దం తన తల్లిని వదిలి వచ్చినప్పుడు చేసింది. మళ్ళీ ఇప్పుడు చేస్తోంది. తల్లిని వదిలి వచ్చినప్పుటికి చిట్టి ఐదు-ఆరు రోజుల పసిగుడ్డు. తల్లి-అన్నదమ్ములని వదిలి వచ్చిన మొదటి రోజు అది. చిట్టి ఆ రోజు ప్రేమకి మొహం వాచిపోయి ఉంది.
సత్యమూర్తికి ఎందుకో తన కన్న కొడుకు ఏడుస్తున్నట్టు అనిపించింది. సత్యమూర్తి మనసు ద్రవించిపోయింది. చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు. చాలా రోజులకి అతడి కళ్ళు చెమ్మగిల్లాయి…. అయితే ఇవి ఆనందభాష్పాలు .. ఆ విషయం సత్యమూర్తికి, చిట్టికి మాత్రమే తెలుసు…!
దటీజ్ S/o సత్యమూర్తి!
***
