*
“అరే… ఒట్టు, కథలు చెప్పటమంటేనే విసుగు నాకు అసలు! ఎందుకా? సరేలే, అసలేం కావాలి మీకు? నిజంగా ఎంత చికాకో తెల్సా కథ చెప్పడం; చెప్పే వాడు చెప్తూనే పోతూ వుంటాడు, ఆ చెప్పడంలోనే కూరుకు పోయి,
అందులోంచి బయటికి రాలేక; అయితే ఏంటీ? అంటారా; సరే, మళ్ళీ అడక్కూడదూ, అయితేనే ఒక కథ చెప్తా… కానీ ఇదే ఆఖరిది, సరేనా మరి?”
ఒక మనిషి తలరాత అంతా కూడా అతను ఏ సైతాను బారినా పడకుండా ఎట్లా నెగ్గుకు వచ్చాడూ అనే దాని మీదే ఆధారపడి వుంటుందని అంటుంటారు పెద్దలు. నిజం చెప్పాలంటే, యవ్వారం అంత దాకా వస్తే గిస్తే… ఈ లోకంలో అలాంటివి ఎన్నెన్నో జరుగుతుంటాయి. అవన్నీ మనకెందుకు, కానీ, సైతానేగనుక నిన్ను బురిడీ కొట్టించాలనే అనుకుందే అనుకో అది దానికి ఎంతపని? ఒట్టు, నన్ను నమ్మండి, నిలువునా కొట్టించేస్తుంది బురిడీ.
*
మా విషయానికే వస్తే, మా నాన్నకు మేం నలుగురం. నేనో వెర్రిబాగులోన్ని; నాకు
ఇంత తెలివి లేదు అప్పుడు. నాకు అప్పుటికి పదకొండేళ్ళు దాటాయా? ఊహు… లేవు… నాకు పదకొండు కూడా పడలేదు ఈ సంగతి జరిగిన నాటికి.
“ఏయ్! ఫోమా, రే ఫోమా, ముడ్డి కిందికి పెళ్ళీడొచ్చింది, కానీ నువ్వు నెల తక్కువ సంకర గాడిదలా గాలికి తిరుగుతున్నావు.” అంటూ మా నాన్న తల దులిపేస్తూ నన్ను చెడామడా తిట్టడం, అచ్చం కుక్కలాగా కాళ్ళు నాలుగేసుకుని మొరుగుతూ చెంగల్లో అని నేను పారిపోవడం… అదంతా ఇవాళే జరిగిందా అన్నంత బాగా గుర్తుంది నాకు.
మా తాత దిట్టంగా తన కాళ్ళ మీదే తన పనులన్నీ లాగిస్తూ వున్నాడు ఇంకా అప్పటికి. తలచుకున్నందుకు పరలోకంలో ఎక్కిళ్ళు వచ్చాయో ఏమో మా ముసలోడికి! ‘ప్రభువా, మా తాతకి ఎక్కిళ్ళు తగ్గించు, తండ్రీ!’
మా తాత అడపాదడపా ఏదేదో ఊహించేసుకునేవాడు. కానీ, మరి ఇట్లాంటి కథ మీకు ఎట్లా చెప్పాలబ్బా నేను?
మీలో ఎవరో ఒకడు మా తాత తాగే పొగాకు పైపును వెలిగించేందుకు చటుక్కున లేచి మా ఇంటి కుంపటిలో ఆఖరి నిప్పు తెచ్చిచ్చే వుంటారు హడావిడిగా, లేదా ఆ బీరువాలో ‘అదందుకో, ఇదందుకో’ అన్నప్పుడు లగెత్తే వుంటారు. అదంతా ఉత్తి అతి!
కానీ, ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం మీకు అస్సలు వినాలని లేకపోయినా సరే నాకు అస్సలు లెక్కే లేదు. అయితే ‘కథ చెప్పు, కథ చెప్పు’ అని ఒకటే నస పెట్టారు కాబట్టి మీరూ… వింటే వినండి!
*
ఆ ఏడాది వసంత రుతువు వచ్చీరాగానే పొగాకు బేళ్ళను బండ్లలో వేసుకుని క్రిమియాలో అమ్మేందుకు వెళ్ళాడు మా
నాన్న. ఎన్ని బండ్లు… రెండా? మూడా? అని అడిగితే నాకు గుర్తులేదు ఇప్పుడు. ఆ రోజుల్లో పొగాకు భలే రేటు పలికేది. మా మూడేళ్ళ తమ్మడిని వెంట తీసుకెళ్ళాడు నాన్న, పొగాకు డీలరుగా అప్పటినుంచే వాడికి ఆ కిటుకులు నేర్పించేందుకు.
తాత, అమ్మ, నేను, మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంటిదగ్గరే వుండిపోయాం. ఓ రోడ్డు పక్కన చిన్న జాగాలో మా తాత ఖర్బూజా విత్తులు చల్లాడు. అక్కడే పక్కన చిన్న గుడిసె వుంటుంది మాది. అక్కడే వుంటాడు తను. పంటపైన ఏ గువ్వా, ఏ కొండగాటి పిట్టా వాలకుండా కాపలాగా ఈసారి మమ్మల్నీ వెంట తీసుకెళ్ళాడు. మాకు అక్కడ సరదాగా వుందా? లేదా? అంటే వుందనీ, లేదనీ చెప్పలేను. అప్పుడప్పుడు దోసకాయలు, పుచ్చకాయలు, ఉంటముల్లంగి, తెల్ల ఉల్లిపాయలు
విపరీతంగా మా చేత తినబెట్టేది మా తాత. చెబితే నమ్మరు కానీ, ఒట్టు, అట్లాంటప్పుడు మా కడుపులంతా కాకుల కావ్ కావుల మోతలే. నిజం చెప్పాలంటే ఖర్బూజాలకి బలే బేరాలుండేవి. దారెంట అటుఇటు పోయేవాళ్ళు ఒకటో రెండో ఖర్బూజాలు ఊరికే అలా అదాటుగా చప్పరించాల్సిందే. పైగా చుట్టుపక్కల పొలాలనుంచి వచ్చే రైతులు మాకు నాటుకోళ్ళు, టర్కీ కోళ్ళు, నాటుగుడ్లు ఇచ్చి మరీ మా సరుకు కొనుక్కునేవారు. బానే నడిచేది ఆ కొట్టం అంగడి.
ఇవన్నీ కాదు కానీ, నానారకాల లోడులతో ఎడ్లబండ్లు కట్టుకుని ఓ యాభై మంది దాకా డీలర్లు రోజూ ఇటుగా వెళ్ళేవాళ్ళు. నిజంగా వాళ్ళు కదా… మనుషులంటే; బతుకును కిందికిమీదికి చూసిన వాళ్ళు. వాళ్ళు నోళ్ళు తెరిచి ఏదో ఒకటి చెప్పడం మొదలుపెడితే
చాలు చెవులకు పండగే. మా తాతకయితే వాళ్ళ కబుర్లు మాత్రం కరువులో కర్జికాయలే.
కొన్నిసార్లు ముసలోళ్ళ గుంపు వచ్చేది. వాళ్ళందరికీ మా తాత నోటికే తెలుసు. వాళ్ళు ఇక మరి కలిసారా, అంతే! అదంటారు, ఇదంటారు, అప్పుడయితే అంటారు, అసలేం జరిగిందంటే అంటారు, అట్లా కాదు ఇట్లా జరిగిందని ఇంకొకరు… మొత్తం ఇతరులు చెప్పిందంతా నిలువునా కొట్టేస్తారు; వాళ్ళ మాటలకు ఈ కొనా, ఆ కొసా వుండదు. అయితే వాళ్ళకు జరిగిన విషయాలన్నీ చాలా వివరంగా తెలుసు. కానీ, అవి అసలు జరిగాయో లేదో ఆ దేవుడికి మాత్రమే తెలుసు.
ఒక రోజు సాయంత్రం, అక్కడిదాకా ఎందుకు…ఈ రోజు సాయంత్రమే అనుకోండి, ఇట్లానే అచ్చం అప్పుడూ పొద్దుగుంకుతోంది.
పొద్దుటెండకి ఖర్బూజాలు కన్రెక్కకుండా
కాయలపైన కప్పిన ఆకులను మెల్లగా ఒక్కటొక్కటే తీసేస్తున్నాడు మడుల వెంట నడుచుకుంటూ మా తాత.
“చూడు అక్కడ, ఒరేయ్ ఒస్తాప్! బండ్లోళ్ళు వస్తున్నారు,” మా తమ్ముడితో అన్నాను.
పక్కూరి పిలకాయలు పొరపాటున తినేస్తారేమో అన్న భయంతో భారీగా పెరిగిన ఓ ఖర్బూజా పైన రహస్యంగా గాటు పెడుతూ, “అవునా?” అన్నాడు అదాటుగా తాత. ఇటే మొత్తం ఆరు ఎడ్లబండ్లు ఆ రోడ్డు వెంట ధూళిని అటే చెరుగుతూ వస్తున్నాయి. జారుడు మీసాలు తెల్లబడిన ఓ పెద్దాయన ముందు నడుస్తున్నాడు ఆ బారుకి. అతను ఉన్నట్టుండి ఆగిపోయాడు, ఎంత దూరంలో అంటే ఎలా చెప్పాలి? ఓ పది అంగల దూరం అనుకోండి, అక్కడే నిలబడిపోయాడు.
“హేయ్ మాక్సిమ్! అంతా బాగున్నారు కదా? ఈ దినం ఇక్కడ కలవాలని రాసిపెట్టాడు
ప్రభువు.”
ఆ అరుపు విని కండ్లు నులుముకున్నాడు మా తాత.
“హేయ్! అవును కదా, బాగున్నావా, దా… దా… ఎక్కడి నుంచి రావడం? ఓహో! బోల్యచ్కా వచ్చాడూ, రా… రా…! బాగున్నావారా తమ్ముడూ?… దొంగనాయాలా! ఒరే… ఒరే… అందరూ కట్టకట్టుకుని వచ్చారే, వారెవ్వా… క్రుతోత్రిశ్చంకో , హా.. హా. హా. అదిగో, పెశ్చిరిత్స్యా, … ఓ… హో.. కోవెలియాక్, స్తెత్ స్కో కూడా దండులో వున్నారే ఈ సారి… ఆహా… హ్హహ్హ! రండి రండి!”
వాళ్ళంతా ఒకళ్ళనొకరు ముద్దాడారు. రోడ్డుకు ఒక వారగా బండ్లను నిలిపి, ఎడ్లకున్న పగ్గాలు, సిక్కాలు తీసి వాటిని పచ్చికవైపు తోలారు ఆ పూట మేతకి ఆరాముగా. అంతా ఆ కొట్టం ముందు
గుండ్రంగా నిమ్మలంగా కూలబడ్డారు. చుట్టలు తీసి వెలిగించారు. వాళ్ళ మధ్య నడుస్తున్న కబుర్లు, యవ్వారాల మధ్య వాళ్ళకు నోట్లో చుట్ట వున్న ద్యాసే లేదు నాకు తెలిసి, అందులోంచి కనీసం ఒకసారైనా పొగ పీల్చారా అంటే, నాకు అనుమానమే! వాళ్ళంతా తిండి తిన్న తర్వాత, మా తాత తన అతిథులకందరికీ ఖర్బూజాలతో విందు చేసాడు. ఒక్కొక్కరు ఖర్బూజా చేతికి తీసుకుని తమతమ చాకుతో నాజూగ్గా చెక్కు తీసారు. (అవన్నీ ముసలి చేతులు. ఎంతో మెదిగిన చేతులు. బంతిలో ఎలా తినాలో మట్టసం తెలిసిన చేతులు. ఇంకా చెప్పాలంటే గొప్పింటి బంతికి కూర్చున్నా ఆ మంచీ-మట్టసం కూడా తెలిసిన చేతుల్లా అనిపించాయి అవి.) వలిచిన ఖర్బూజాని బాగా కడిగేసాక అందరూ కూడా పండులో ఒక గుచ్చు గుచ్చారు వేలితో. రంధ్రం
చేసారు. రసం జుర్రుకుని తాగారు. ఆ తర్వాత ఒప్పలు తరిగి ఒక్కొక్కటే చప్పరించారు.
“ఎందుకురా నా మనవళ్ళు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నారు?” తాత మమ్మల్ని గదమాయించాడు.
“రండిరా, పిల్ల ముండాకొడకల్లారా, వచ్చి చిందులేయండి. ఒరేయ్! ఒస్తాప్, ఏదిరా చుట్ట? తీయ్ వెలిగించు! హా! ఇప్పుడు ఈ పిలనాయాండ్లు కోస్సాక్కుల చిందులు ఇరగదీసేస్తారు చూస్కోండి! రేయ్! ఫోమా, నడుంపైన పెట్టురా నీ రెండు చేతులు! అద్దీ, కానీయ్, మొదలుపెట్టండిరా, ఎయ్యండ్రా!”
*
ఆ రోజుల్లో నేను మెరుపుతీగలా రచ్చరచ్చగా వుండేవాణ్ణి. ముసలితనం ఓ శాపం. ఇప్పుడు అట్లా కదల్లేను. ఆ చిందులు, ఆ గెంతులు కాదు కదా కనీసం నా కాళ్ళు
సాదాసీదా నడకకే బెసికిపోతాయి ఇప్పుడు.
*
తన నేస్తులతో కబుర్లాడుతూ చాలా సేపు మా చిందులు, గెంతులనూ దూరంగా కూర్చొనే చూస్తూ మురిసిపోతూ వున్నాడు మా తాత. మా తాత కాళ్ళు స్థిరంగా లేవని నేను గమనించాను. ఏదో తెలీని లోడు తనని నేలలోకి కుంగదీస్తున్నట్టు కాళ్ళు ఈడుస్తాడు.
“రేయ్! ఫోమా, దమ్ముంటే ముసలోణ్ణి రమ్మను, రాడు… చూడు!” బులిపించాడు ఒస్తాప్.
ఏమనుకుంటున్నారో మీరు, మీకు ఆయన సంగతి తెలియదు.
తమ్ముడు అన్న మాట చెవిలో పడీపడగానే మా ముసలోడు ఒంటికాలి మీద లేసాడు. ఎందుకో తెలుసా, వచ్చిన వాళ్ళ ముందు తన సత్తా ఏంటో చాటాలనే.
“పిల్ల ముండాకొడకల్లారా, ఏందిరా ఈ ఎగరడాలు? ఇట్లనేనా చిందులేసేది?” ధిటంగా నిలబడి, చేతులు గాల్లో దురుసుగా జాడించి, కాళ్ళు తాడిస్తూ బలాదూర్ లా నిలబడ్డాడు మా తాత. ఆయన అలా వేసింది కోస్సాక్కుల చిందు కాదు అని మాత్రం నేనేమీ అనడం లేదు, కానీ, ఆ వేసినప్పుడు హెట్మన్ భార్య అతనికి జతగా వుండివుంటేనా, ఈ మాత్రం కూడా వుండేది కాదనుకోండి తాత తతంగం.
మేం దూరంగా ఓ పక్కనే నిలబడి అలా చూస్తూ నిలబడిపోయాం. ఆ ముసలోడు సుడులు సుడులు తిరిగి గెంతుకుంటూ దోసకాయలు పరిచిన జాగాదాకా కాళ్ళాడించుకుంటూ గిరికీలు కొట్టాడు. అట్లా అతని చిందు సగం దాకా సాగిన తర్వాత తనకు ఇష్టమైన, తనదైన గెంతులు వేసి తన అతిథులకు చూపించాలనుకున్నాడు. అతని
కాలు ఎంత ప్రయత్నించినా ఇంచుక లేయలేదు, ఏం చేసినా అస్సలు కదలలేదు.
“ఏం పొయేగాలం వచ్చింది!” అని సనుక్కుంటూ ముందుకు, వెనక్కి తిరిగాడు. కనాకష్టంగా వేదిక మధ్యలోకి రాగలిగాడు. కానీ, కాళ్ళు కదిలితేగా?
అతను ఏం చేయాలనుకున్నాడో, అది చేయలేకపోయాడు; అదే చేయలేకే. పచ్చిమొద్దుల్లా అయిపోయి ఇంచు కూడా మసల్లేదు కాళ్ళు.
“ఆ…హా! చూడండి, ఇదే అది చేతబడి చేసిన ఆ చోటు, ఇది దాని పనే. ఇది సైతాను చేతబడి. మనుషులకీ, దీనికీ అస్సలు పడదు. ఈ నేలపైన దాని చేతివాటం చూపించింది. ఇక్కడే దాని చేయి పడింది.” రుసరుసలాడాడు.
నిజానికి ముసలోడికి తలకొట్టేసినంత పనైంది వాళ్ళ ముందు ఇలా అవ్వడం;
చిటికెలో కూడబలుక్కోవాలనుకున్నాడు, కున్నాడా?
మళ్ళీ మొదటినుంచి మొదలుపెట్టాడు చిందులు, తనవైన గెంతులు. ఈ సారి కాస్త మెల్లిగా.
ఏం కులుకు, ఏం హొయలు… చూడాలంతే! ఆ చిందు ఆట మధ్యలోకి రాగానే మళ్ళీ ఆగాయి అడుగులు. మళ్ళీ సాగలేదు. అంతా సరిగ్గా అక్కడే, అక్కడితోనే మళ్ళీ ఆగిపోయిందంతా.
“ఏయ్! సైతానుదానా! నీ పుట్టునడకే ఒక కుళ్ళిన ఖర్బూజా మీద పడినట్టుందేనేమోనే, అందుకే నీ బతుకు ఇట్లా కాలింది చెత్త దానా! ఈ వయసులో అందరి ముందూ నా పరువు తీసేసావుకదే నువ్వు, థూ!” అంటూ శాపాలు పెడుతుంటే వెనకనుంచి కొంతమంది పుసుక్కున నవ్వుకుంటున్నారు తాతని గమనిస్తూ.
చుట్టూతా కలయ చూసాడు తాత. ఖర్బూజా మడులు కనిపించలేదు, అతిథులయిన ఆ డీలర్లు కూడా కనిపించలేదు. అసలేవీ దరిదాపుల్లో అయిపు లేవు. ముందూవెనకా, ఇటుపక్కా అటుపక్కా అంతా కూడా పొరకతో ఊడ్చినట్టు సాపుగా వుంది జాడ.
“హేయ్! ఛస్!… సరే, ఇంక ఆపేస్తా నేను!” మళ్ళీ కళ్ళు నులుముకున్నాడు తాత.
చూసాడు చుట్టూ. ఆ చోటు ఏదో తనకు అస్సలు తెలియదు. ఒక పక్క ఏవో తుప్పలు. వాటి వీపు ఆకాశాన్ని ఆనుకుని వుందా అన్నట్టుగా వుంది ఏదో కంబం.
ఛస్! అది ఫాదరీగారి కూరగాయల తోటలో వుండే పావురాల కొట్టంగూడు. దానికి అటు వైపు కూడా ఇంకోటి ఏదో బూడిద రంగుది వుంది. మరింత రిక్కించి చూసాడు దాన్ని. అది జిల్లా గుమాస్తాగారి నూర్పుడు కల్లమే.
అదీ విషయం; ఆ సైతాను మా తాతను అక్కడిదాకా లాక్కుని వచ్చిందన్నమాట! అక్కడ కలయ తిరుగుతూ వుంటే ఓ బాట కనిపించింది. అప్పుడు ఆకాశంలో ఏ చందమామా లేడు. బదులుగా కారుమబ్బులకు పట్టిన బూజుగా ఏదో కదిలింది పైన.
“రేపు గాలిదుమారమే”, అని అనుకున్నాడు తాత.
అదాటుగా బాట పక్కనే వున్న ఒక సమాధిపైన కొండెక్కుతున్న ఓ దీపం గమనించాడు.
“సరే, ఇంకెప్పుడూ చేయను!” దాని ఎదురుగా నిటారుగా నిలబడి నడుంపై రెండు చేతులూ ఆనించిన తర్వాతే అటుగా తల ఎత్తాడు. ఆ దీపం ఆవిరయిపోయింది; దూరంగా వెళుతూ, లీనమవుతూ మళ్ళీ చిటపటగా మెరిసింది.
“లంకెబిందెలు!” అరిచేసాడు తాత.
“ఎంతంటే అంత పందెం, అవే బిందెలు ఇవి!” అనుకుని రెండు అరచేతులు తడుపుకునేందుకు తుపుక్కుమనబోయి చూసుకుంటే తీరా తవ్వేందుకు ఓ సలికె లేదు, ఓ పారా లేదు.
“అబ్బా, ఎంత పనయ్యింది, సరేలే, ఏమోలే, చేతులతో తవ్వితే తగిలేదానికి, దొరికేదానికి సలికెలు, పారలూ ఎందుకసలు? రామ్మా, చేతికే తగులే నా బంగారు తల్లీ! చిక్కవా, నాకు దక్కవా, సరే, ఇక్కడే వుండు, మళ్ళీ వచ్చి తవ్వుతా, నా కోసం గురుతు పెట్టుకుంటా అంతే, సరేనా, ఏం లేదు మళ్ళీ నేనే వచ్చేందుకు, మర్చిపోకుండా.”
బహుశా గాలి దుమారానికి చెదిరి పడిపోయిన ఒక పెద్ద కొమ్మని తీసుకువచ్చి మిణుకుమన్న ఆ దీపం జాగాలో, అదే చిన్నపాటి చోటుపైన పేర్చి సర్దాడు.
తెలిసిన బాటని పోల్చుకుంటూ మళ్ళీ కదిలాడు.
*
ఏపుకొచ్చిన ఆ ఓక్ తుప్ప పలచగా పెరిగి కనిపించింది; పైగా దాని కంచెను చూసే అదంతా పోల్చుకోగలిగాడు.
“అదీ, నేను చెప్పలా! మన ఫాదరీ గారిదే ఆ తోట అని?” అనుకున్నాడు తాత.
“ఇదే ఆ కంచె, ఇక్కడి నుంచి ఓ ముప్పావు మైలు నడిస్తే నేరుగా వచ్చేదే మన ఖర్బూజా మడి.”
*
తాత ఇంటికి వచ్చేసరికి బాగా రాత్రయ్యింది; పైగా దోసకాయలు కూడా తినకుండా పడుకున్నాడట.
అంతకుముందు మా తమ్ముడు ఒస్తాప్ దగ్గరికి వెళ్ళి, ‘మా… నేస్తులు… అదే… రా… ఆ డీలర్లు… వెళ్ళిపోయి చాలా రోజులయ్యిందా?’ అని అడిగేసి మట్టసంగా తనే గొంగడి పరుచుకున్నాడంట.
అప్పుడు అడిగాడంట ఒస్తాప్ : “తాతా! ఆ సైతాన్లు ఈ రోజు ఏం చేసాయి నీతో?”
“ఏం చెప్పాలరా, ఒస్తాప్, అస్సలు అడగనే అడగద్దు, అడిగితే నీ జుట్టు అంతా తెల్లబడుతుందిరా!” అని చెప్పి గొంగడిలో మరింత ముడుచుకున్నాడంట తాత.
ఆయన పెట్టిన గురకకి మా ఖర్బూజా తోట మీద వాలేందుకు వచ్చే గువ్వల గుంపు ఉలిక్కిపడి లేచి ఎటో ఎగిరిపోయాయంట.
కానీ, అట్లా ఎట్లా పండుకుంటాడబ్బా?
అనకూడదు కానీ, ఆ శాల్తీ నిద్రపోయాడా… దున్నపోతే.
ఆ ప్రభువు, పరలోక రాజ్యంలో అదే సమకూర్చనీ తాతకి.
కానీ, అతను ఏ పీకులాటలనుంచి అయినా సరే సులాగ్గా బయటేసుకుంటాడు తనని.
అయితే, కొద్దిసార్లే… తాను నేసే దారమే తన వేలు కోసేస్తుంటుంది అంతే!
*
మరుసటి రోజు తెలతెలవారుతుండగా మా తాత లేచి కోటు తొడుక్కున్నాడు, నడుముకి బెల్టు లాగి కట్టుకున్నాడు; సలికె, పార భుజాన వేసుకున్నాడు, టోపీ పెట్టుకున్నాడు. ఒక లొట్టి సారా లాగించాడు. తన కోటు అంచుతో పెదాలు తుడుచుకున్నాడు. నేరుగా ఫాదరీగారి కూరగాయల తోటవైపు కదిలాడు.
అదే రెండు మడులు దాటి అదే ఓక్ చెట్ల తోపు దాటిన తర్వాత అదే దారి కనిపించింది.
చెట్లకీ, ఊరినీ చేరేందుకు మధ్య వెలిసిన బాట అది. తనకు బాగా తెలిసినదే ఆ డొంక దారి. ఆ తోపులోంచి బయటికి వచ్చాడు. అప్పుడు ఆ చోటు అచ్చం నిన్నటిలాగే కనిపించింది. అక్కడ పావురాల కొట్టం గమనించాడు, కానీ ధాన్యం నూర్చే కల్లం దాఖలాలు మాత్రం లేవు.
“అర్రే, అయితే ఇది కాదు ఆ చోటు, కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా, ఆ నూర్పుడు కల్లం వైపు నడవాలనుకుంటా, అంతే!” అనుకుని వెనక్కి తిరిగి నాలుగడుగులేసి ఇంకో బాట తీసుకున్నాడు.
అప్పుడు కనిపించింది ఆ కల్లం. కానీ, అక్కడ పావురాల కొట్టం లేదిపుడు మరి. మళ్ళీ వెనుతిరిగాడు, పావురాల కొట్టం కనిపించింది కానీ, కల్లం పూరాగా మాయం. అతని ఖర్మకి అప్పుడే చినుకులు మొదలయ్యాయి. అయినా కల్లం వైపు పరిగెత్తాడు. అక్కడ కొట్టం, పావురాలు లేవు. మళ్ళీ అలాగే తడుస్తూ కొట్టం వైపు పరిగెత్తాడు, ఇక్కడ కల్లమే లేదే!
“నీయమ్మ, సైతానుదానా, నీకసలు పిల్లలు బాగుపడటం గిట్టదా!” అంటూ కేకలు వేసాడు. జల్లు కాస్తా కుండపోత అయ్యింది. వానకు పాడు కాకుండా తన కొత్త బూట్లు తీసి కర్చీఫులో చుట్టేసి, జీను తీసిన గుర్రంలాగా ఉదుటున గిట్టలు విదిలించాడు. తడిసి మోపడయ్యీ ఖర్బూజా కొట్టంలోకి దూరాడు, గొంగళి కప్పుకున్నాక తత్తరపడుతున్న పంటి నడుమ ఆ సైతాను గురించి శాపాలు నమిలాడు.
నా జీవితంలో అట్లాంటి బూతులు వినలేదు ఏ నోటా. నిజంగా ఇదంతాగనుక పగటి పూటేగనుక జరిగి వుంటేగనుక నాకు భలే కుశాలుగా వుండేది అని నిజాయితీగా ఒప్పుకుని తీరాలి.
*
మరుసటి రోజు నిద్ర లేచి చూద్దును కదా, మా తాత అసలేమీ జరగనట్టే, ఎరగనట్టే ఖర్బూజా మడుల వెంట మామూలుగా నడుచుకుంటూ, ఎండకు కన్రెక్కకుండా కాయలపైన ఆకులు పేర్చుకుంటూ అలాగే కనిపించాడు. రాత్రి భోజనం వేళ ముసలోడు నా తమ్ముడితో రుసరుసలాడుతూ వినిపించాడు, ‘ఈ సారి ఖర్బూజాని కాదు, నిన్ను అమ్మేసి నాటు కోడి తెచ్చుకుంటా నా కొడకా!’ అనేసి దంటునే చుట్టగా పెట్టుకుని, మూడు మెలికల పుచ్చకాయ ఒకటి మాకు ఇచ్చాడు. అది ‘టర్కీ ఖర్బూజా రా!’ అన్నాడు మాతో పైగా. నిజంగానే అది అచ్చం లుంగల పాములాగే వుంది. అలాంటి మెలికల ఖర్బూజా నేను ఈ నాటికీ చూడనే లేదు. కానీ, ఏదో దూర దేశాలనుంచే దాని విత్తనం తాత దక్కించుకున్నాడన్నది మాత్రం నిక్కమే.
ఆ సాయాంత్రం, భోజనాలు ముగిసాక…సలికె, పార తీసుకుని మలి పంటగా గుమ్మడికాయలు విత్తేందుకని నేల చదును చేయడానికి వెళ్ళాడు తాత. ఆ చేతబడి మడి దాటేందుకు బలంగా ప్రయత్నం చేసాడు, కానీ లాభం లేదు.
“శాపం తగిలిన మడి!” అనుకుని దాని నడిమధ్యకి వెళ్ళాడు; సరిగ్గా ఏ చోట అయితే నిన్నటినాడు తన కాలు తీసి కాలు వేయాలనుకున్నాడో, చిందులు వేయలేకపోయాడో, అతని అడుగులు అతుక్కుపోయాయో అక్కడికి వెళ్ళి ఆగి కసిగా దభీమని దించాడు పార. మెరుపులా అదే నేల మళ్ళీ మరోసారి తన కళ్ళ ముందు, కాళ్ళ కిందా.
ఒక పక్క పావురాల కొట్టం కనిపించింది. ఇంకో వైపు అదే నూర్పుడు కల్లం.
“హమ్మయ్యా, ఈ సారి పార తెచ్చి మంచి పని చేసాను. ఇదే దారి, అదిగో ఆ చిన్న సమాధి! అదే నేను దానిపైన పరిచిన కొమ్మ, అరే, చూడు, ఇది అదే! అవును… అది ఇదే, నేను తప్పేమీ చేయలేదు, సరాసరిగానే వచ్చాను.” పారని గాల్లోకి ఎత్తి పట్టుకుని ఖర్బూజా మడులలోకి దూరిన ఏదో జీవాన్ని తన్ని తరిమేందుకు అన్నట్టుగా నక్కినక్కి పరుగు తీసి నేరుగా సమాధి ముందు నిలుచున్నాడు.
చీకటి పడింది. సమాధిపైన ఓ బండరాయి, దానిపైన రేగిన పిచ్చిమొక్కలు.
“ఈ రాయిని ఎత్తేయాలి.” అనుకున్నాడు తాత. బండరాయి చుట్టూ తవ్వడం మొదలుపెట్టాడు.
అది బండరాయి కాదు గండశిల!
కాళ్ళను దిట్టంగా నిలిపి శిలని సమాధిపైనుంచి నేర్పుగా దొర్లించగలిగాడు.
“అబ్బా!” అని తాత డస్సేలోపే దొర్లుకుంటూ పడింది లోతట్టుకు అది.
“నువ్వు వుండాల్సింది అక్కడేనే! ఇప్పుడు మన పనులు చకచకా అయిపోతాయి చూడు!”
కాసేపు కుదుటపడ్డాడు. నశ్యం డబ్బా తీసాడు. చేతిలో కాస్త చల్లుకున్నాడు. దాదాపు ముక్కుల్లోకి పొడిని ఎక్కించుకోబోతుండగా…
“హా…ఛీ.. ట్ఛీ” సరిగ్గా అతని తలపై నుంచి ఏదో తుమ్మింది. ఆ దెబ్బకు చెట్లు జలదరించాయి. తాత ముఖం నిండా తుంపర.
“తుమ్మేటప్పుడు కనీసం అటువైపు తిరగాలన్న ఇంగితం కూడా లేదా!” కళ్ళు తుడుచుకుంటూ నిలదీసాడు తాత. చుట్టూ చూసాడు, ఎవరూ కనిపించలేదు.
అక్కడ ఎవరూ లేరు మరి, కనిపించడానికి.
“అదీ కత, సైతానుకు నశ్యం పడదనుకుంటా,” నశ్యం డబ్బాని బొడ్లో దోపుకుని పార అందుకున్నాడు మళ్ళీ.
“పిచ్చి సన్నాసిది! వాళ్ళ నాన్నగానీ, వాళ్ళ తాతగానీ చిటికెడు పొడుం కూడా పీల్చిన పాపాన పోకపోతే ఇది మాత్రం ఏం చేస్తుందిలే?” అనుకుంటూ మొదలుపెట్టాడు తవ్వడం.
నేల పెళుసుగా వుంది. పార సలీసుగా దిగింది. అప్పుడు ఖంగుమంది. తవ్విన మట్టిని సాపుచేస్తే ఒక ఆండా కనిపించింది.
“ఒసే బంగారూ, నువ్వు ఇక్కడున్నావా!” ఆండా కిందికి పారని జొనుపుతూ, కేరింతలు కొట్టాడు తాత.
“ఒసే బంగారూ, నువ్వు ఇక్కడున్నావా!” ఆండాని ముక్కుతో కుక్కుతున్నట్టు ఓ పక్షి కూత వినిపించింది. పార పడేసి చుట్టూ కలయచూసాడు తాత.
“ఒసే బంగారూ, నువ్వు ఇక్కడున్నావా!” చెట్టు చిటారు కొమ్మల నుంచి ఓ గొర్రె అరిచింది.
“ఒసే బంగారూ, నువ్వు ఇక్కడున్నావా!”
చెట్టు వెనక నక్కిన ఒక ఎలుగుబంటి గాండ్రించింది.
తాత వెన్నులో వణుకు పుట్టింది.
“ఎవ్వరూ ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేందుకు భయపడుతున్నారు ఎందుకో!” అని తనలోతానే గునిగాడు తాత.
“ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేందుకు భయపడుతున్నారు!” పక్షి కూత వినిపించింది.
“ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేందుకు భయపడుతున్నారు!” గొర్రె అరిచింది.
“ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేందుకు భయపడుతున్నారు!” ఎలుగుబంటి గాండ్రించింది.
“హా!” హడలిపోయాడు తాత.
“హా!” పక్షి కూసింది.
“హా!” గొర్రె అరిచింది.
“హా!” ఎలుగుబంటి గాండ్రించింది.
బెంబేలుపడి చూట్టూ చూసాడు తాత. ఓరి నాయనా! కటిక చీకటి! చుక్కల్లేవు, చంద్రుడు లేడు. అతని చుట్టూతా గుంతలే గుంతలు. అతని అరికాళ్ళ దగ్గర పాదు కనిపించని ఓ కొండచరియ. అతని తలపైన ఇప్పుడో అప్పుడో అమాంతం కూలి పడిపోతుందేమో అన్నట్టుగా ఒక ఎగుడుదిగుడుల గుట్ట. దాని వెనుక నుంచి ఒక వికృత ముఖం తొంగిచూసినట్టు ఊహించుకున్నాడు తాత.
“ఊ!… హూ!…” కమ్మరి నిప్పు రాజేసేందుకు వాడే తిత్తిలాగా వున్నాయి దాని ముకుపుటాలు.
ఒక్కో పుటంలో ఒక బకెట్ నీళ్ళు సలీసుగా చల్లేయవచ్చు. ఎర్రగా పొడుచుకుని వచ్చినట్టు కండ్లు, బయటకు చొచ్చుకువచ్చిన పొడవాటి దాని నాలుక వెక్కిరిస్తున్నట్టుగా వుందది.
“సైతాను వచ్చిందే, నిన్ను తీసుకునిపోయేందుకు!” ఆండా వైపు చూసి రుసరుసలాడాడు తాత.
“నిధి లేదూ పాడూ లేదు, చెత్త ముట్టె ముఖందానా!” అనేసి ఒకే ఉదుటున లగెత్తుదామనుకున్నాడు. అయితే ఒక సారి చుట్టూ చూసి ఆగిపోయాడు. అంతా మునుపటిలా మామూలుగా వుంది.
“ఛస్! ఇదంతా నన్ను తత్తరబిత్తర చేయడానికేనా? ఓసినీ… దొంగ సైతానూ!”
తిరిగి ఆండాను కదిపే పని మొదలుపెట్టాడు. అది చాలా బరువుగా వుంది. అయినా మాత్రం తప్పుతుందా? కానీ ఏం చేస్తాడు? కానీ దాన్ని అలాగే, అక్కడే వదిలేయబుద్ధయితే మాత్రం కాలేదు. ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని రెండు చేతులతో ఒక పట్టు పట్టాడు.
“కదలవే, వార్నీయమ్మా! లే, లే, ఎత్తు, లెగు, పైకెక్కు!” బయటికేసాడు ఎత్తి.
హమ్మయ్యా!
“ఇప్పుడు చిటికెడు నశ్యం పడితే, నా సామిరంగా!”
డబ్బా తీసాడు. చేతిలోకి పొడి చిలకరించేముందు, చుట్టూ కలయచూసాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు.
కానీ, అతను అలా అనుకున్నాడంతే!
అప్పుడు అతనికి ఆ చెట్టు కాండం చాలా భీకరంగా గసపెడుతూ, గాలి వదులుతూన్నట్టు వినిపించి, అనిపించింది. మెలమెల్లగా దాని చెవులూ కనిపించాయి.
ఎర్రెర్రని కళ్ళు, ఉబ్బెత్తు ముకుపుటాలు, మెలిపడిన ముక్కూ కనిపించాయి.
ఆ ముక్కు మరో చిటికెలో తుమ్మబోతోంది.
“వద్దు, తుమ్మొద్దు! నేను నశ్యం
వేసుకోనులే!” మనసులో అనుకుంటూ నశ్యం డబ్బా బొడ్లో దోపుకున్నాడు తాత.
“సైతాను మళ్ళీ నా కళ్ళల్లో చీదేస్తుందేమో!”
గబాలున ఆండా ఎత్తి సత్తువ కాళ్ళు కూడబలుక్కుని ఎంత వేగం వీలు అయితే అంత వేగంగా పరిగెత్తాడు. కానీ పరుగులో వున్న అతని కాళ్ళను వెనకనుంచి పుల్లలతో ఏదో గోకుతున్నట్టు అనిపించింది.
“ఏయ్! ఏయ్! ఏయ్!” అనే మాట తప్ప ఇంకేదీ రాలేదు తాత నోటి వెంట. అలా పరిగత్తిన వాడు ఎక్కడా ఆగకుండా నేరుగా ఫాదరీ కూరగాయల తోట దగ్గరకి వచ్చి ఊపిరి పీల్చుకున్నాడు.
*
“తాత ఎక్కడికి పోయుంటాడు?”
మూడు గంటల నుంచి అతనికి కోసం ఎదురుచూస్తూ వున్న మాకు ఏం పాలుపోలేదు. పొలం నుంచి వచ్చి చాలాసేపే
అయ్యింది అమ్మ. మాకోసం వేడివేడి కుడుములు కూడా తెచ్చింది. అయినా తాత జాడ లేదు! ఆయన రాకుండానే రాత్రి భోజనం కూడా తినేశాం. అంట్లు తోమేసిన వేడి నీళ్ళు ఎక్కడ చల్లాలరా… అని వెతికింది అమ్మ. ఎందుకంటే అక్కడంతా ఖర్బూజా విత్తులు చల్లి వుంది. అప్పుడు గమనించింది, చిమ్మ చీకట్లో ఏదో పీపా తనవైపు దొర్లుకుంటూ వస్తోందని. ఎవరో ఆకతాయి పిల్లలపనే అది అనుకుంది.
“ఉండు మీ పని చెప్తా, ఈ నీళ్ళు పోస్తే మీ తిక్క కుదురుతుంది,” అంటూ వేడి నీళ్ళు చిమ్మరించింది.
“అమ్మో!” అరిచింది ఓ బొంగురు గొంతు.
ఊహించారా? అవును, అది మా తాతే!
కానీ ఎవరికి మాత్రం అట్లా ఎట్లా తెలుస్తుంది. మేం మాత్రం అది ఏదో దొర్లుకుని వస్తున్న పీపా అనే కదా అనుకుంటాం!
తాత తెల్ల జుట్టంతా వేడి నీళ్ళలో తడిసి, ఖర్బూజా తొక్కలతో కొక్కిరిబిక్కిరిగా వుంది. చూసిన వాళ్ళెవరయినా అయ్యో పాపం అనే అనుకోవాలి; కానీ నిజం చెప్పాలి కదా, మాకు మాత్రం ఆ వేషం చూసి తెగ నవ్వు వచ్చేసింది.
“ఒసేయ్! దెయ్యం దానా! ఏం మనిషివే నువ్వు కూడా!” తన కోటు కొసతో ముఖం తుడుచుకుంటూ అమ్మని కసురుకున్నాడు తాత.
“పండగ ముందు పందిలాగున్నానని వేడి నీళ్ళ స్నానం చేయించిందిరా… మీ అమ్మ, క్రిస్మస్ కోసం. అది సరే, ఏం బిస్కట్లు తెచ్చానో చెప్పుకోండి మీకోసం, కుర్ర కుంకల్లారా! మీరంతా బంగారు చొక్కాలు తొడుక్కోబోతున్నారు తెలుసా! రండి, చూడండి.” దర్పంగా ఆండా తెరిచాడు తాత.
ఎవరయినా ఆ ఆండాలో ఏముందని
అనుకుంటాం చెప్పండి? కొంచెం ఆలోచించి మీరే చెప్పండి!
బంగారం!
కదా, అంతే కదా?
కానీ అది, అది కాదు. అది బంగారం కానే కాదు. అది మురకి, కంపు, రొచ్చు, పి… అదేంటో చెప్పేందుకు నాకు నోరు రావడం లేదు, ఉలపరమొస్తోంది, సిగ్గుగా వుంది.
తాత తుపుక్కున ఉమ్మేసాడు, అదాటుగా ఆండా వదిలేసాడు, చేతులు బాగా కడుక్కున్నాడు.
ఆ రోజు నుంచి ఎలాంటి సైతానునైనా సరే ఇక జీవితంలో చచ్చినా నమ్మకూడదని మాతో ఒట్టు వేయించుకున్నాడు.
“నమ్మరా… రా, మీరు… వొరేయ్!” అని మమ్మల్ని తరచూ నిలదీసేవాడు తాత.
ఎప్పుడయినా మా పరిస్థితులు కొంచెం అటుఇటు అయినా సరే, “పిల్లలూ రండిరా
ఇటు! మనం శిలువ ప్రార్థన చేద్దాం! ఆ… అదీ, అలా కాదు ఇలా…” అంటూ కళ్ళుమూసుకుని తన కుడి చేత్తో ఎద నుంచి నుదురుదాకా గాలిలో శిలువ గీసేవాడు, ఇదే చదివేవాడు.
“మన ప్రభువు అయిన ఏసు యొక్క విరోధి చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు; వాడో చెత్తనాకొడుకు! వాడిని అణాకానీకి కూడా నమ్మరాదు!”
మా తాత ఏ చోట అయితే కోస్సాక్కుల చిందులు వేయలేక చతకిలబడిపోయాడో ఆ చోట మా అందరి చేతా అదేపనిగా ఇంటిది, పొలానిది నానా చెత్తాచెదారం వేయించేవాడు.
*
చూసారా, ఒక సైతాను మనిషిని ఎట్లా బురిడీ కొట్టిస్తుందో!
మా చేను నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
కొద్ది కాలం తర్వాత, పక్క ఊరి కోస్సాక్కులు మా నాన్న దగ్గర మా చేను కౌలుకు తీసుకుని ఖర్బూజా పంట వేసారు.
ఎంత మంచి నేల అది, ఎంత మంచి పంటనిచ్చే చేను అది!
కానీ ఆ చెత్త కుప్ప వేసామే ఆ మడిలో మాత్రం ఏమీ పండదు. అది చేతబడికి గురయిన మడి.
ఎంత జాగ్రత్తగా, ఏం విత్తినా మొలకెత్తిన పాపాన పోలేదు. ఖర్బూజా రాదు, గుమ్మడి పూయదు, దోస కాయదు; ఇక ఆ కాసింత మడిని చేతబడి చేసి ఏం చేసుకుంటుందో ఆ సైతానుకే తెలియాలి మరి!