అయ్యా! మీ ట్యాంకు నిండిపోయింది … కాస్త చూసుకోండి!!

Spread the love

జుగల్ పాల్, మహాత్మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చరల్ ఎం.ఎస్.సి., పిహెచ్. డి. పట్టాలు పొందాడు. ఎన్నో ఏళ్ల నిరుద్యోగం తర్వాత, క్రితం నెలలోనే జుగల్ కి మహంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రయాగరాజ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డు సూపరువైజరుగా ఉద్యోగం వచ్చింది.

అదే విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఒక విద్యార్థి సహాయంతో దగ్గర్లోనే ఒక బిల్డింగులో మూడవ అంతస్తులో ఇల్లు అద్దెకి దొరికింది. ఇల్లంటే – ఒక గది, కిచెన్, లెట్రిన్-బాత్రూమ్. ప్రస్తుతానికి జుగల్ కి అంతకు మించి అవసరం కూడా లేదు.

జుగల్ కి తన ఈ గది అంటే చాలా ఇష్టం. ఆఫీసుకు చక్కగా నడిచే వెళ్ళి రావచ్చు. బయట కాస్త ఖాళీ స్థలం కూడా ఉండటంతో, తన ఊరిని తలపిస్తుంది. విశాలమైన ఆకాశం, దూరదూరాల వరకు కనిపించే దృశ్యాలు …. ఇదంతా చూసే జుగల్ కి ఈ గది బాగా నచ్చింది.

అయితే ఆ దృశ్యాలే ఇప్పుడు జుగల్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి. సంగతి ఏమిటంటే ఎదురింటి డాబా మీద ప్రతిరోజూ ఉదయం పూట నీళ్ళ ట్యాంకు నిండి, నీళ్ళు వృథాగా కారిపోతూ ఉంటాయి. ఇదంతా చూసి జుగల్ జీర్ణించుకోలేకపోయేవాడు. అన్ని నీళ్ళు వృథాగా పోవడం అతడికి మింగుడుపడేది కాదు.

జుగల్ బుందేలుఖండ్ లో ఒక మారుమూల, అదీ మరీ కరువు ప్రాంతం నుంచి వచ్చాడు. అక్కడ ఒక్కొక్క నీటి చుక్క వెనక ఎన్ని గంటల కష్టం, అదృష్టం దాగి ఉంటాయో జుగల్ కి బాగా తెలుసు. అతడి ఇంటి చుట్టుపక్కల నది కానీ, చిన్న కాలవ కానీ లేకపోవడంతో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేది. వర్షమే ఆధారం, అది కూడా ఎప్పుడో అదృష్టం తలుపు తడితేనే! అందుకే జుగల్ కి ప్రతీ నీటిబొట్టు ఒక అదృష్టం, ఒక ఫ్యాంటసీ!  అతడు ఆ ఫ్యాటసీలోనే చిక్కుకుని ఉండిపోయాడు.

ఇక్కడ అతడు ఉంటున్న ఇంటికి కూడా మునిసిపాలిటీ కుళాయి నీళ్ళే ఆధారం, అవి కూడా ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. దైవాధీనం ఆటో సర్వీస్ లాగ అన్నమాట! ఒక్కొక్కసారి కుళాయి వచ్చినా, నీళ్ళు, పైన ట్యాంకులోకి ఎక్కే అంత ఫోర్సు ఉండదు. కింద మోటరు ఉంది, పైన ట్యాంకు ఉంది, అయినా ఇంటి యజమానురాలు మాత్రం ఒక్క అరగంటే మోటరు వేస్తుంది. దానితో ట్యాంకు ఎంత నిండితే, అంత నిండినట్టు. అంతే!

పైగా, ‘ఆలికి అన్నం పెట్టడం, ఊరికి ఉపకారమా?’ అన్నట్టు, మిగతా ఇంటి యజమానుల్లాగ మోటరు బిల్లు అద్దెకి ఉన్నవాళ్ల దగ్గర తీసుకోకుండా, వాళ్ల మీద జాలి చూపిస్తున్నట్టు ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. నీళ్ళు ఉచితంగా ఇస్తున్నట్టు అడిగిన వాళ్లకీ, అడనివాళ్లకీ అందరికీ చెబుతూ తిరుగుతుంది.

ఇలా ప్రతిరోజూ ఎదురింటి ట్యాంకు నుండి లెక్కలేనంత మంచినీరు వృథాగా పోవడం జుగల్ చూడలేకపోతున్నాడు. అసలు ఒక మనిషి ఇంత నీరు ఎలా వృథా చెయ్యగలుగుతున్నాడా అని, అదంతా చూస్తూ కూడా ఇరుగుపొరుగు నోరుమెదపకుండా నిమ్మకు నీరెత్తనట్టు ఎలా ఉన్నారా అని జుగల్ కి గొప్ప అనుమానం. ఎలాగైనా ఇదంతా ఆపాలనుకున్నాడు. కానీ, తను ఈ ప్రాంతానికి కొత్త. వచ్చి కనీసం నెల రోజులు కూడా కాలేదు కదా, ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు.

ఎదురింటి యజమాని బోరింగ్ వేస్తాడు. ఇంచుమించు ప్రతిరోజూ కార్లు, మోటారు సైకిళ్ళు కడుగుతూనే ఉంటాడు. ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డంతా నీళ్ళు చిమ్ముతాడు. అదే రోడ్డు మీద నిలబెట్టి జీమూత వాహనుడి అంత ఉండే తన కుక్కకి షాంపూ చేయిస్తాడు. ఆ నీరంతా పోయి రోడ్డు మీద గుంటల్లో నిలబడిపోయేది. ఆ పెద్దమనిషి విద్యాశాఖలో సీనియర్ క్లర్క్. అతడు డబ్బు కూడా నీళ్లల్లా ఖర్చుపెడతాడని వినికిడి.

జుగల్ కి ఆ ఎదురింటి యజమాని చేస్తున్న పనులన్నీ చూసి విసుగెత్తింది. లోపల లోపలే తిట్టుకునేవాడు. కారు కడగడం, రోడ్డంతా నీళ్ళు నింపెయ్యడం వరకు అయితే ఫర్వాలేదు. కానీ అలా గంటలు గంటలు ట్యాంకులో నుండి నీళ్ళు కారిపోవడం మాత్రం అతడికి ఒక పీడకలలా అనిపించేది. ఆ నీళ్ళన్నీ, పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్ లో పడుతూ ఉండేవి. అలా కారుతున్న నీళ్లని చూసి జుగల్ తనలో తానే గొణుక్కుంటూ ఉండేవాడు. ఒక్కసారిగా తన ఊర్లో నీటి ఎద్దడి గుర్తొచ్చేది. నీటి కోసం తనవాళ్ళు పడే తిప్పలు గుర్తొచ్చేవి. దాహంతో గడిపిన పగళ్ళు, రాత్రులు కూడా కలల్లోకి వచ్చి బాధపెట్టేవి. అలాంటి దాహంతో నిండిన ఎన్నో దృశ్యాలు తనని ముళ్ళులా పొడుస్తున్నట్టు అనిపించేది. అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు కూడా తన గొంతు ఎండిపోతోంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. బురదలో కొట్టుమిట్టాడుతున్న చేపలా ఉండేది జుగల్ పరిస్థితి.

అలా వృథాగా పోతున్న నీళ్ళని చూస్తూ జుగల్ తన పనుల మీద ధ్యాస పెట్టలేకపోయేవాడు. చపాతీ మాడిపోయేది. కూర అడుగంటేసేది. పప్పులో ఉప్పు వెయ్యడం మర్చిపోయేవాడు. కుక్కరు పెడుతూ మూతకి రబ్బరు పెట్టడం మర్చిపోయేవాడు. నడుస్తూ నడుస్తూ గోడకి గుద్దుకునేవాడు. స్నానం చేసి వచ్చినా, చెవుల్లో సబ్బు నురగ అలాగే ఉండిపోయేది.

ఎలాగైనా ఎదురింటికి వెళ్ళి, ఆ యజమానితో, అయ్యా, నీళ్ళు కారిపోతున్నాయి, చాలా నీరు వృథాగా పోతోంది, దయచేసి మోటరు స్విచ్చి ఆపెయ్యమని చెప్పాలి అనుకునేవాడు. అయితే మొహమాటం అడ్డొచ్చి, అడుగు ముందుకు పడేది కాదు. ఈ విషయం ఆ ఇంటి యజమానికి ఎలా చెప్పాలో మాత్రం అర్థమయ్యేది కాదు. నోట్లో నుంచి మాట పెగిలితే ఒట్టు!

ఇక అగలేక ఒకరోజు జుగల్, ఎదురింటి కాలింగ్ బెల్లు కొడతాడు. కాసేపటికి విద్యాశాఖ సీనియర్ క్లర్కు బయటకి వస్తాడు. జుగల్ నమస్తే చెప్పి‘అయ్యా, మీ ట్యాంకు నిండిపోయింది. చాలాసేపటి నుండి నీళ్ళు కారిపోతున్నాయి. దయచేసి మోటరు కట్టెయ్యండి’ అన్నాడు. ఆ సీనియర్ క్లర్కు పేరు శ్రీ టి.పి.శుక్లా, ఇంటి ముందు ఉన్న నేమ్ బోర్డు మీద పేరు మెరుస్తూ కనిపిస్తోంది. టి.పి.శుక్లా లోపల ఎవర్నో పిలిచి, “పింకీ, మోటరు స్విచ్ ఆఫ్ చెయ్యి, ట్యాంకు నిండిపోయింది” అని, జుగల్ వైపు తిరిగి, నీళ్ళు కారిపోతున్నాయి, అయితే ఏంటి? – అన్నట్టు ఒక నిర్లక్ష్యమైన చూపు చూసి “ఇంతకీ నువ్వెవరు?” అని అడిగాడు.

టి.పి. శుక్లా నిర్లక్ష్యమైన గొంతు వింటూనే జుగల్ గొంతులో తడి ఆరిపోయింది. తడబడుతూనే – “అదీ …. నా పేరు జుగల్, నేను ఎదురింట్లో మూడవ అంతస్థులో అద్దెకి దిగాను. పక్కనే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫీల్డు సూపరువైజరుగా జాయినయ్యాను.” అంటూ వెళ్ళిపోతాడు.

జుగల్ అక్కడి నుండి వెళ్ళిపోయినా, చాలాసేపటి వరకు టి.పి. శుక్లా చూపులు అతడి వీపుకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. జుగల్ చేసిన ఈ పనికి టి.పి.శుక్లా అవాక్కయ్యాడు. అసలు ఇలా ముక్కుమొఖం తెలియని మనిషి, అది కూడా, చిల్లు కాణీ విలువ చెయ్యని ఒక అద్దెకుండే వాడికి ఇంత ధైర్యమా? అసలు వాడి కులం ఏంటో, మతం ఏంటో? అలాంటిది, వాడికి ఇంత సాహసమా? సరే, సరే, నేను కుక్కని వాకింగుకి తీసుకెళ్లాలి అని తనలో తానే గొణుక్కుంటాడు టి.పి.శుక్లా.

ఆ రోజుకు మోటరు కట్టేసారు. కానీ, ఇది రోజూ ఉండే తంతు. మర్నాడు మళ్ళీ షరా మామూలే. మర్నాడు … ఆ మర్నాడు … అవతలి మర్నాడు … ఇది నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఇదంతా చూసి జుగల్ కి అసలు ఏం చెయ్యాలో అర్థమవ్వట్లేదు. జుగల్ తనలో తానే గొణుక్కుంటూ తన ఇంటి డాబా మీద తిరుగుతూ ఉంటాడు. తనని తాను అదుపు చేసుకుంటూ ఉంటాడు.

జుగల్ ఒకరోజు గోడకి తగిలించి ఉన్న క్యాలెండరు మీద నోట్ చేసి పెడతాడు – ఆరోజు నీళ్ళు ఒక గంట, పదమూడు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పాటు వృథాగా పోయాయి. మర్నాటి లెక్క నలభై ఐదు నిమిషాల దగ్గర ఆగుతుంది. ఆ మర్నాడు ఇది సుమారు గంట నలభై ఐదు నిమిషాలు, మరుసటి రోజు ఒక గంట ముప్పై నాలుగు నిమిషాలు!

జుగల్ ఉదయం పూట రొటీన్ మొత్తం దెబ్బతింది. అతడి ధ్యాస మొత్త నీళ్ళు ఎంతసేపు వృథాగా పోతున్నాయి అన్న దాని మీదే ఉండేది. తన రోజువారీ పనులు చేసుకుంటూనే, నీళ్ళు కారిపోవడం ఎప్పుడు ఆగిందో కూడా చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి, తను ఆఫీసుకు వెళ్లే వేళ మించిపోతున్నా, నీళ్ళు కారడం మాత్రం ఆగేది కాదు. అలాంటప్పుడు అప్పటివరకు నోటు చేసుకున్న సమయానికి మరొక పది నిమిషాలు జోడించి, క్యాలెండరు మీద రాసిపెట్టేవాడు.

ఒక వారం గడిచాక, ఆ రాసిపెట్టిన గంటలు, నిమిషాలు, సెకండ్లతో సహా జోడించి చూసాడు. వారంలో తొమ్మిది గంటల, పదమూడు నిమిషాలపాటు నీరు వృథాగా పోయిందన్నమాట! ఇది ఒఠ్ఠి ఉదయం పూట సంగతి. ఒక్కొక్కసారి, మోటరు మధ్యాహ్నం, సాయంత్రం తను ఆఫీసు నుండి తిరిగి వచ్చేలోపు కూడా నడుస్తూ ఉంటుంది కదా!

జుగల్ అలా నీరు వృథాగా పోయే సమయానికి యావరేజ్ లెక్కగడతాడు. రోజుకు సగటున ఒక గంట పంతొమ్మిది నిమిషాలు నీళ్ళు వృథాగా పోతున్నట్టు లెక్క తేలుతుంది. ఇన్ని నీళ్ళా? ఇన్ని నీళ్ళా! టి.పి.శుక్లా ఇక్కడ ఒక రోజు వృథా చేసే నీటితో అక్కడ తన ఊరు ఊరంతా సంతోషంగా గడిపేయొచ్చు.

జుగల్ అసలు వేరే లోకంలో ఉన్నట్టు ఉన్నాడు. ఇంటి తలుపులు మూసి, కిందకి దిగి, మరొకసారి టి.పి.శుక్లా ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. ఎదురుగా టి.పి.శుక్లా. వెంటనే ఆయనకి క్రితం వారం జుగల్ చేసిన నిర్వాకం గుర్తొచ్చి, “ఏంటి?” అని ఒక్కసారి హూంకరిస్తాడు. ఆ హుంకారంలో తరతరాల ఆభిజాత్యంతోపాటు విద్యాశాఖ, సీనియర్ క్లర్కు వాసన కూడా గుప్పుమంటుంది.

జుగల్ తనలోతానే లెక్కలేసుకుంటున్నాడు. టి.పి.శుక్లా హుంకారం పట్టించుకోకుండా “అయ్యా, చాలాసేపటి నుండి నీళ్ళు వృథాగా పోతున్నాయి. చాలా నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు ఇలా వృథా చెయ్యడం మంచిది కాదు. ఈ వారంలో మీ ట్యాంకు నుండి రోజుకు సగటున గంటం పావు పాటు నీళ్ళు పోతూనే ఉన్నాయి. చూడండి, ఒకపక్క శాస్త్రవేత్తలు ఇతర గ్రహాల మీద నీటి జాడలు వెతుకుతూంటే, మనం ఇలా నీటిని వృథా చేస్తున్నాం. ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించండి. ప్లీజ్, ఇవాళ-రేపు ఎన్నో పరికరాలు కూడా వచ్చాయి. ఒక్క అలారం పెట్టిస్తే సరిపోతుంది. అర్థం చేసుకోండి” అన్నాడు.

టి.పి.శుక్లా కి ఎందుకో జుగల్ మరీ చొరవ తీసుకుంటున్నట్టు అనిపించి చిర్రెత్తుకొచ్చింది. ఇక ఉండబట్టలేక తిట్లదండకం మొదలుపెట్టాడు, నీయమ్మ దొంగ నా కొడకా … మోటరు నాది, కరెంటు బిల్లు కట్టేది నేను, ట్యాంకు నా ఇంటి  మీద ఉంది, నీళ్ళు గంట కాకపోతే, రోజంతా పోతూ ఉంటాయి. మధ్యలో నీకేం వచ్చిందిరా నొప్పి బోసు డీ? నువ్వు ఎవడివి బే అసలు మధ్యలో నాకు నీతులు చెప్పడానికి? మొత్తం ప్రపంచం బాధ్యత అంతా తలకెత్తుకున్నావా? ఎదురింట్లో అద్దెకు ఉంటే, అక్కడే ఉండు. మా బాగోగులు మేం చూసుకోగలం. మళ్లీ ఇంకొక్కసారి కనిపించావు అంటే చెప్పు తెగేలా కొడతాను. చూసుకో! పల్లెటూరు నుండి వచ్చి, పట్నం గాలి తగిలేసరికి కొమ్ములొచ్చినట్టునాయి!

వెంటనే జుగల్ ఈ లోకంలోకి వచ్చాడు. జుగల్ కాళ్ళు వణుకుతున్నాయి. మెల్లగా ఒళ్ళంతా వణుకుతోంది. ఏమయిందో ఏమో కానీ, అతనిలో దాగున్న యుగయుగాల దాహం మేల్కున్నట్టు అయింది. గొంతు మంట! “అయ్యా, ఇంత చిన్న విషయానికి ఎందుకు అన్ని తిట్లు? నేనేమైనా తప్పు చేస్తే క్షమించండి. కానీ, దయచేసి నీళ్ళు మాత్రం వృథా చెయ్యకండి” అని చెప్పాలనుకున్నాడు.

కానీ, నోరు పెగల్లేదు. గొంతు పూడుకుపోయింది. జుగల్ మౌనంగా వెనుతిరుగుతాడు. ఇంతలో వెనక నుండి హూంకరిస్తున్న టి.పి.శుక్లా గొంతు వినిపిస్తుంది – “మళ్ళీ ఇంకొక్కసారి నా గేటు ముందు కనిపించావంటే, కుక్కని వదులుతాను జాగ్రత్త!” అంటూ “ఒక్క క్షణం ఆగి, ఇవాళ రోజంతా మోటరు వేసే ఉంచుతాను, ఏం చేస్తావురా లం … కొడక! ఏం పీక్కుంటావో పీక్కో!” అన్నాడు.

కన్నీళ్ళు నిండిన కళ్లతో, ముక్కలైన మనసుతో జుగల్ అతి కష్టం మీద మెట్లెక్కి తన గదికి చేరుకుంటాడు. తీరా చూస్తే ఎదురుగా ట్యాంకు నుండి నీళ్ళు కారుతూనే కనిపిస్తాయి. పెద్దపెట్టున వచ్చిన ఏడుపు, ఆ ఏడుపు వల్ల వచ్చిన కన్నీరు నాలుగు వైపులా ప్రవహిస్తుంది.

కొద్ది నిమిషాల క్రితం తిన్న తిట్లు, ఎదురైన అవమానం, ఈ కన్నీళ్లల్లో కరిగిపోతాయి. అతడి కళ్ళు ఇప్పుడు మరింత స్పష్టంగా, మరింత లోతుగా పరిసరాలను చూడగలుగుతాయి. ఎదురింటి డాబా మీద ప్రవహిస్తున్న నీటి ప్రతిబింబం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అతని స్వచ్ఛమైన, లోతైన, పాపాలు కడిగేసిన కళ్లల్లో ఒక కృతనిశ్చయం చోటుచేసుకుంది. అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదురుగా ఒక పోలీసు స్టేషన్ ఉంది. యూనివర్సిటీకి వెళ్ళే ముందు జుగల్ ఆ పోలీసు స్టేషనులో అడుగుపెట్టాడు.

పోలీసు స్టేషన్ ఇంఛార్జ్ జుగల్ చెప్పింది అంతా విని, గట్టిగా నవ్వేస్తూ “భోసు డీ కె సూపరువైజరుగా, నీలాంటి వాళ్ళు పట్టుకొచ్చే ఇలాంటి కేసులన్నీ చూస్తూ కూర్చొంటే అసలు నేరస్తులని మీ అమ్మ పట్టుకుంటుందా లేకపోతే మీ అయ్య పట్టుకుంటాడా? చెప్పు బే! నీ పేరేంటి అన్నావ్? హా, జుగల్ పాల్! అవునా? ఈ పాల్ అన్నది చాలా కులాల్లో కనిపిస్తుంది. ఇంతకీ నీదే కులం రా? ఏదో నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకున్నావు అని ఎగిరెగిరి పడకు. నువ్వు వచ్చిన పని చూసుకుని, మూసుకుని పో. లేదంటే నీ ఊరు పో. ఇది నీ ఊరు కాదు. ప్రయాగరాజ్. వెర్రివెర్రి వేషాలు వెయ్యకు. తెలుసుకదా ఈ లాఠీ పవర్! ఒక్కసారి దిగింది అనుకో… చూసుకో … ఊహించుకో .. పచ్చడి అయిపోద్ది.”

పోలీసు స్టేషను నుండి బయల్దేరి ఆఫీసుకైతే వెళ్ళాడు. కానీ, జుగల్ మనసు మనసులో లేదు. పొద్దున్న జరిగిన సంగతులే మనసులో తిరుగుతున్నాయి. రోజంతా ఏమరపాటుగానే ఉన్నాడు. రిజస్టరులో ఉసిరికాయని చింతకాయ అని, గోధుమలని వరి అని, తప్పులు-తడకలు రాస్తూ ఉన్నాడు. సహోద్యోగులు ఏమయింది సోదరా అని ఆటపట్టిస్తున్నారు. ఒక్కొక్కసారి తనకు తానే వెళ్ళి ఏ చెట్టుకో గుద్దుకుంటున్నాడు. పడుతున్నాడు. లేస్తున్నాడు. ఫీల్డులో తిరుగుతున్నాడు. అతని కాళ్లకింద నలిగిపోతున్న ఎన్నో మొక్కలు అతనికేసి ఆశ్చర్యంగా చూస్తున్నాయి. రోజంతా అతడికి ఏం తోచలేదు. కనీసం కన్నీళ్ళు కూడా రావట్లేదు.

సాయంత్రం గదికి తిరిగి వస్తూనే ఏదో జ్ఞానోదయం అయినట్టు అనిపించింది.  శుక్లా ఏమైతే నాకెందుకు? గంగలో దూకనీ. వాడు ఎలా పోతే నాకెందుకు? వాడి నీళ్ళు, వాడి ఇష్టం. వాడు చెప్పింది కూడా నిజమే. నేనేమైనా ఈ లోకం బాధ్యత మొత్తం తలకెత్తుకున్నానా? అసలు ఇవాల్టి నుండి అటు కన్నెత్తి కూడా చూడను.

గదికి చేరుకునేసరికి, ఇంకా ట్యాంకులో నుండి నీళ్ళు పోతూనే ఉన్నాయి. అంటే నిజంగానే టి.పి.శుక్లా రోజంతా మోటరు వేసే ఉంచడంటావా? జుగల్ నోటి నుంచి ఆశ్చర్యంతో కూడిన ఒక తిట్టు దూసుకొచ్చింది. వాడి చావు వాణ్ణి చావనీ! మళ్ళీ ఇంతలోనే ఒక చిన్న స్వరం… వాడు ఛస్తే చచ్చాడు, కానీ మొత్తం ప్రపంచాన్ని ఎందుకు చంపుతున్నట్టు నీళ్ళు వృథా చేసి?

అసలు ఇవన్నీ తన కంట పడొద్దు అని, జుగల్ కిటికీలు లోపల నుండి మూసేసాడు. బట్టలు మార్చుకున్నాడు. బెండకాయ వేపుడు చేస్తున్నాడు. చపాతీ చేస్తున్నాడు. తింటునాడు. లైటు ఆపి, నిద్రపోతున్నాడు.

ఇప్పుడు గది మొత్తం చీకటి. ఆ చీకట్లో కూడా రోజంతా జరిగిన సంఘటనలు అన్నీ జుగల్ కళ్ళ ముందు సినిమా రీళ్ళల్లా తిరుగుతున్నాయి. టి.పి.శుక్లా మాటలు ముల్లులా గుచ్చుకుంటున్నాయి. అతడి తిట్లు ఒకేసారి కళ్లల్లో, చెవుల్లో కూడా దిగబడుతున్నాయి. వీటి పక్కనే పైనుండి కిందకి వృథాగా కారుతున్న నీటి చప్పుడు …. ఆ దృశ్యం. నీళ్ళు ముందుగా ట్యాంకు నుంచి కింద డాబా మీద పడుతున్నాయి. ఆ చప్పుడు చాలా చిన్నగా ఉంది. అటుపై బిల్డింగు  మీద నుండి పక్కన ఉన్న ప్లాటులోకి.. ఆ చప్పుడు మరీ కర్ణకఠోరంగా ఉంది. జీవనదాయిని జలకళ కానీ, గలగలా ప్రవహించే ఆ నీటి సవ్వడులు కానీ ఎక్కడా కనిపించట్లేదు, వినిపించట్లేదు.

చాలాసేపు ఆ బయటి ప్రపంచం జుగల్ మనసులో ఎగసి పడుతూనే ఉంది. అతణ్ణి కలవరపెడుతూనే ఉంది. అసలు నిద్ర ఎప్పుడు పడుతోందో కూడా అతడికి తెలియట్లేదు. మంచి నిద్రలో ఉండగా కల … రోజూలాగే ఎదురింటి ట్యాంకు నుండి ధారగా వృథాగా పోతున్న నీళ్ళు …. ఆ నీటి కింద కూర్చుని స్నానం చేస్తున్న జుగల్ …! చూస్తూచూస్తూనే అక్కడ పెద్ద గుంట … ఆ గుంట నిండా నీళ్ళు. స్నానం చేసి పైకి లేస్తున్న జుగల్ కాలు జారి ఆ గుంటలో పడిపోయాడు… మునిగిపోతున్నాడు.

అలా మునుగుతూ-తేలుతూ ఉన్న జుగల్ కల చెదిరిపోయింది. చూస్తే అతడు తన గదిలోనే, తన పరుపు మీదనే మునుగుతూ తేలుతూ ఉన్నాడు. రోజూ కంటే ఇవాళ చాలా ఆలస్యంగా మెలకువ వచ్చింది. బయటకి వచ్చి చూస్తే రోజూలాగే ట్యాంకు నిండిపోయి నీళ్ళు కారిపోతున్నాయి. అది చూసి జుగల్ కి కాస్త బాధ, బోల్డంత కోపం వచ్చేసాయి. క్రితం రోజు కలిగిన జ్ఞానోదయం ఎటుపోయిందో గుర్తు లేదు.

మొబైల్ తీసి, వృథాగా పోతున్న ఆ నీటిని వీడియో తీస్తాడు. ఎక్కడా టి.పి.శుక్లా పేరెత్తకుండా, ఎదురింటి పేరు చెప్పి చిన్న కామెంట్ తో ఫేస్ బుక్ లో ఆ వీడియో పోస్టు చేసేస్తాడు. అలాగే, టి.పి.శుక్లా పేరు చెప్పకుండానే, క్రితం వారం అతడితో జరిగిన గొడవ, పోలీసు స్టేషనులో జరిగిన ఉదంతం అంతా ఫేస్ బుక్ లో పోస్టు చేసేస్తాడు.

ఆ తర్వాత మెల్లగా పాలు తీసుకురావడానికి కిందకి దిగుతాడు. ఇంతలో అటుగా ఒక పాత సామాన్ల వాడు బండి మీద పనికిరాని సామాను వేసుకుని పోతూ కనిపిస్తాడు. వాడి దగ్గర ఒక చిన్న ప్లాస్టిక్ డ్రమ్ము కూడా ఉండటం జుగల్ కంటపడింది. జుగల్ ఒక యాభై రూపాయలు ఇచ్చి ఆ ప్లాస్టిక్ డ్రమ్ము కొని, టి.పి.శుక్లా ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లాటులో పెరిగిన పిచ్చి మొక్కల మధ్య దాచిపెట్టి వచ్చేస్తాడు.

పాలు తీసుకుని మళ్ళీ తన గదికి వచ్చేసి రోజువారీ పనుల్లో మునిగిపోయాడు.  ఎంత వద్దు అనుకున్నా, నీళ్ళు కారుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. అయినా పట్టించుకోకుండా, ఇవాళ కాస్త త్వరగా యూనివర్సిటీకి వెళ్ళాలని జుగల్ ఆలోచన.

జుగల్ పెట్టిన ఫేస్ బుక్ పోస్టుకి బోల్డన్ని కామెంట్లు! చాలామటుకు కామెంట్లు జుగల్ పక్షాన వచ్చినా, సమస్యకి సమాధానం మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదు. కొంతమంది అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా తన పని తనని చూసుకోమని ఉపదేశాలు కూడా ఇచ్చారు. చాలా మంది – “లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయి, కానీ మనం ఒంటరిగా ఏం చెయ్యగలం …. కాస్త అటూ-ఇటూగా అన్నీ ఇలాంటి కామెంట్లే! 

జుగల్ కి వ్యతిరేకంగా కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఒకడు “బయటి వాళ్లతో ఇదే ఇబ్బంది. ఏదో తలదాచుకోవడానికి కాస్త చోటిస్తే, నెత్తికెక్కి కూర్చొంటారు” అని రాసాడు. మరొకరు అయితే, “నీటి పొదుపు పేరు చెప్పి నువ్వు వేరే వాళ్ళ ఇళ్ళల్లోకి తొంగి చూడటం, ఎంతవరకు సబబు? ఇది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కాదా?” అని కూడా రాసుకొచ్చారు. ఒక కామెంట్ జుగల్ పక్షాన రాసినా, అది చదివి జుగల్ దిమ్మ తిరిగిపోయింది – “ఆ ఎదురింటివాళ్ళు కచ్చితంగా ముసల్మానులే అయ్యుంటారు. వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు” అని రాసుకొచ్చాడు.

ఇవన్నీ చదివి జుగల్ కి విసుగొచ్చింది. ఒక్క క్షణం, అసలు ఆ పోస్టు డిలీట్ చేసేద్దామా అనిపించింది, కానీ ఇంతలోనే, సరే ఉండనివ్వు అని అలాగే వదిలేసి తన పనిలో మునిగిపోయాడు.

సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వచ్చేసరికి సందు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. మెల్లగా ఖాళీ ప్లాటు సరిహద్దు గోడ దూకి ఆ ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకెళ్ళి, నీళ్ళు టి.పి.శుక్లా ఇంటి డాబా మీద నుండి ఈ ప్లాటులో పడే చోట పెట్టి మళ్ళీ గోడ దూకి వచ్చేస్తాడు. ఏమీ ఎరగనట్టు తన ఇంట్లోకి వచ్చి తలుపేసుకుంటాడు.

బట్టలు మార్చుకుని కాస్త టీ పెట్టుకుందాం అనుకుంటూ ఉండగా ఊళ్ళో ఉండే అన్నయ్య దగ్గర నుంచి ఫోను. ఆయన జుగల్ పెట్టిన ఫేస్ బుక్ పోస్టు చూసి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు. “పట్నంలో ఉద్యోగం వచ్చి, నాలుగు రాళ్లు సంపాదించేసరికి నీకు కొవ్వెక్కినట్టుంది. ఊరు కాని ఊరు వెళ్ళి, అక్కడి వాళ్లతోనే గొడవలు పెట్టుకుంటే ఎలా? ముందు ఆ పోస్టు డిలీట్ చెయ్యి” అంటాడు.  తర్వాత జుగల్ వాళ్ళ అమ్మ కూడా పాపం ఏడుస్తూనే లోకం తీరు చెప్పుకొస్తుంది. అన్నయ్య చెప్పినట్టు వినమని తన మీద ఒట్టు వేయించుకుంటుంది. ఇంతలో అన్నగారు ఫోను లాక్కొని, ‘ముందు ఆ పోస్టు డిలీట్ చెయ్యి, తర్వాత మాట్లాడదాం’ అని ఫోను పెట్టేస్తాడు.

జుగల్ బరువెక్కిన మనసుతో ఆ పోస్టు డిలీట్ చేసి టీ పెట్టుకుంటాడు. అసలు మధ్యాహ్నమే ఆ పోస్టు డిలీట్ చేసేసి ఉండాల్సింది అనీ, అసలు పోస్టు పెట్టకుండానే ఉండాల్సింది అనీ, రకరకాల ఆలోచనలు అతణ్ణి ముసురుకుంటూ ఉన్నాయి. పశ్చాత్తాపంతో పాటు ఇంకా చాలా విషయాలు అతణ్ణి చుట్టుముడుతున్నాయి. ఇల్లు-ఊరు-ప్రపంచం. అమ్మ వేసిన ఒట్టు, అన్నగారి బెంగ. ఎవరూ నోరెత్తి చెప్పకపోయినా, తను చదువుకుని ఇవాళ ఇలా తన కాళ్ళ మీద నిలబడటానికి తన కుటుంబం చేసిన త్యాగాలు జుగల్ కి తెలియనివి కాదు.

అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు అని జుగల్ కి తనమీద తనకే కోపం వస్తుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే, ఊళ్ళో నా వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనల్లోనే జుగల్ తనకి తెలియకుండానే తన ఊరిలోకి ప్రవేశిస్తాడు – అక్కడ తాగునీటికి బాగా కటకటగా ఉంటుంది. జుగల్ కి తను చేస్తున్నది కరెక్టే అనిపిస్తుంది. ఇది తనవాళ్లందరి తరఫున చేస్తున్న యుద్ధం అని అతడి నమ్మకం. మళ్ళీ ఒక్క నిమిషంలోనే తను చేస్తున్న ఈ యుద్ధం ఎంత వృథా ప్రయాసనో తెలిసొస్తుంది. ఇన్నాళ్ళు చేసిన యుద్ధంలో సాధించినది ఏం లేదు – చివాట్లు, బూతులు, అవమానం తప్ప. ‘రేపటి నుండి టి.పి.శుక్లా ట్యాంకులో నుంచి నీళ్ళు కారడం ఆగిపోయినంత మాత్రాన తన ఊరికి నీళ్ళొచ్చేస్తాయా?’ అని మళ్ళీ తనని తానే ప్రశ్నించుకుంటాడు.

ఈ ప్రశ్నకి జవాబుగా ఎన్నో నిరాశలు… జుగల్ తనని తానే ప్రశ్నించుకుంటాడు. ఎన్నో జవాబు లేని ప్రశ్నలు. యుద్ధాలు అన్నీ వ్యక్తిగతమేనా! సామాజిక సమస్యలు అన్నీ వ్యక్తిగత లెక్కలతోనే ముడిపడి ఉన్నాయా? జుగల్ పర్సనల్-పొలిటికల్, న్యాయం-అన్యాయాల మధ్య ఉన్న ఆ కీకారణ్యంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. ఈ సమస్యలని ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్వచించి, చేతులు దులుపుకుంటారు.

ఈ సమస్యలు అన్నిటికీ సమాధానం – నిద్ర. జుగల్ నిద్రలో వేరే ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఆ కలల ప్రపంచంలో జుగల్ కి తెలిసొస్తుంది – కొన్ని యుద్ధాలు, పగలు-రాత్రి, నిద్ర-మెలకువల నుండి బయటపడి కలలు-యదార్థాల లోకంలోకి చేరుకుంటాయి. అక్కడ జుగల్ వంటి సాదాసీదా మనిషి తన యదార్థ ప్రపంచంలో నుండి బయటపడి ఆ కలల లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఇది అతడు లోపల చేసే యుద్ధం. ఈ యుద్ధంలో గెలుపు-ఓటములకు పెద్ద తేడా ఏం ఉండదు.

మళ్ళీ తెల్లవారింది. జుగల్ తలుపు తెరుచుకుని బయటకి వస్తాడు. ఇంకా తెల్లవారి, సూర్యోదయం కూడా కాకుండానే టి.పి.శుక్లా తిట్ల దండకం, ఇంకా నిద్రపోతున్న వాళ్లని కొక్కొరొక్కో అని నిద్రలేపుతున్నట్టుంది. మామూలుగా అయితే రోజూ జుగల్ లేచి కళ్ళు నులుముకుంటూ బయటకి వచ్చేవేళకి వీథివీథి అంతా మేల్కుంటుంది.

కానీ ఇవాళ సంగతి వేరు. జుగల్ ఫేస్ బుక్ పోస్టు డెలీట్ చేసేలోపలే అది టి.పి.శుక్లా కి చేరిపోయింది. జుగల్ తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసు స్టేషన్ వరకు వెళ్ళాడని తెలిసి టి.పి.శుక్లా మండిపడ్డాడు. దీనికి తోడు పొద్దున్న పొద్దున్నే ఖాళీ డ్రమ్ములో పడ్డ నీటి చప్పుడు టి.పి. శుక్లాని ఉలిక్కిపడేలా చేసింది. ఇది జుగల్ నిర్వాకమే అనడంలో శుక్లాకి ఎలాంటి అనుమానం లేదు.

రోజురోజూ టి.పి.శుక్లా ఇంటి ట్యాంకు నిండిపోయి, నీళ్ళు ధారగా వృథాగా పోవడం ఆ వీథిలో అందరికీ తెలిసిన విషయమే. అయితే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? నీళ్లలాగా డబ్బులు కూడా ధారాళంగా ఖర్చుపెట్టే ఆసామీ టి.పి.శుక్లా … ఉర్ఫ్ విద్యాశాఖ సీనియర్ క్లర్కుతో గొడవపడే ధైర్యం ఎవడికి ఉంది? వాళ్లల్లో వాళ్ళు టి.పి.శుక్లాని ఎన్ని తిట్టుకున్నా, ఆయన కనిపిస్తే మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని మాట్లాడతారు.

ఈ విషయం టి.పి.శుక్లాకి కూడా తెలుసు. అందుకే తనని ఎవడూ ఏం చెయ్యలేడనే ధైర్యంతోనే పొద్దున్నపొద్దున్నే జుగల్ ని తిడుతూ బూతుల పురాణం మొదలుపెట్టాడు. అసలు టి.పి.శుక్లా ఇలాంటి బండబూతులు మాట్లాడటం ఇప్పటివరకు జుగల్ సహా ఆ ఇరుగుపొరుగు వాళ్ళు ఎవ్వరూ వినలేదు. జుగల్ కి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. కాసేపు భరించి, శుక్లా తిట్లు ఆపకపోవడంతో జుగల్ కూడా తిట్లకి జవాబు తిట్లతో ఇవ్వడం మొదలుపెట్టాడు.

జుగల్ నోట్లోంచి ఒక్క తిట్టు వస్తూనే శుక్లా కల్లు తాగిన కోతిలా శివాలెత్తిపోయాడు. వెంటనే లోపలకెళ్ళి ఒక హాకీ స్టిక్ తీసుకుని జుగల్ ఇంటి గేటు ముందు ప్రత్యక్షమయ్యాడు. నీయమ్మ, నీయక్క, బయటకి రారా అని ఊగిపోతున్నాడు. కిందకి వెళ్ళి మాత్రం ఏం చెయ్యాలో తూచక జుగల్, పోలీసులకి 100 కి ఫోను చేస్తాడు. అయితే క్రితం రోజు పోలీసు స్టేషనులో ఎదురైన చేదు అనుభవం మర్చిపోయాడు పాపం!

ఈ హడావుడికి జుగల్ ఇంటి యజమాని బయటకి వస్తే శుక్లా, అతగాణ్ణి కూడా కులం పేరు  పెట్టి తిట్టడం మొదలుపెట్టాడు. ఏదో లక్కపిడతంత ఇల్లు కట్టినంత మాత్రాన, కాలనీ మొత్తం చేపల మార్కెట్ చేసేస్తావా అని గద్దించాడు. జుగల్ ఇంటి యజమాని, ముందు కాస్త తిరగబడి, తర్వాత మెత్తబడి, ఆఖరికి టి.పి.శుక్లాకి లొంగిపోయాడు. అంతే టి.పి.శుక్లా ఇంటి యజమానికి వేలు చూపిస్తూ “రమ్మను … ఆ …. నా కొడుకుని … అంబేడ్కర్ వారసుణ్ణి  బయటకి రమ్మను. ఇవాళ వాడి రక్తం కళ్ళజూస్తాను” అంటూ చిందులు తొక్కాడు. ఇంటి యజమాని మొత్తానికి ఎలాగో శుక్లాని శాంతింపజేసి వెనక్కి పంపి, మేడమెట్లు ఎక్కి పైకొచ్చి, గాయపడ్డ తోడేలులా జుగల్ మీద విరుచుకుపడ్డాడు – “అయితే పోయి ఆ పనికిమాలిన వెధవ టి.పి.శుక్లాని కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు, లేదంటే వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యి. నాకు నువ్వు వద్దు, నీ అద్దె వద్దు, ఈ గొడవలూ వద్దు. నీది ఏముంది, ఇవాళ కాకపోతే, రేపు ఇల్లు ఖాళీ చేసి పోతావు, నేను ఇక్కడే, ఈ ఇంట్లోనే, ఈ కాలనీలోనే ఉండాలి. నాకెందుకు వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా?”

ఇంతలో పోలీసులు రానే వచ్చారు. ఇక జుగల్ కి కిందకి రాక తప్పలేదు. పోలీసులు జరిగినది అంతా విని, లోకల్ పోలీసు స్టేషనుకి ఫోను చేసారు. ‘నిన్న పోలీసు స్టేషనుకి వెళ్ళావా?’ అని జుగల్ ని అడిగిన తర్వాత వాళ్లకి కథ మొత్తం అర్థమయింది.

ఇంతలో టి.పి.శుక్లా, సీనియర్ క్లర్క్, విద్యాశాఖ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు – “వీడు మా ప్రాణాలు తోడేస్తున్నాడు. పొద్దస్తమానం వేరే వాళ్ళ ఇళ్ళల్లోకి తొంగిచూస్తూ ఉంటాడు. మాలాంటి పరువు గల కుటుంబాలు ఎలా బతకాలో చెప్పండి. మా కాలనీ వాళ్ళు కూడా ముందువెనక చూసుకోకుండా నాలుగు డబ్బులుకి కక్కుర్తి పడి ఎవడికి పడితే వాడికి ఇళ్ళు అద్దెలకి ఇచ్చేస్తున్నారు. వీడు నా ఇంటి ఫోటో ఫేస్ బుక్ లో పోస్టు చేసి, నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. నా పరువు మంటగలుపుతున్నాడు. రెండు రోజుల క్రితం నా ఇంటి ముందుకు వచ్చి నన్ను నానా యాగీ చేసిపోయాడు. మర్యాద గల కుటుంబాలు ఉండే కాలనీ ఇది. ఎలా తలెత్తుకుని బతకాలి చెప్పండి?”

కొంతమంది టిపి.శుక్లాకి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. పోలీసువాళ్లు తమదైన పద్ధతిలో సమాధానం చెప్పారు. జుగల్  లెంపకాయలుతో పాటు మళ్ళీ అవే …అవే … ఎన్నోరోజులుగా తింటున్నవే తిన్నాడు – తిట్లు! నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసేస్తానని, ఆలోపు కాలనీలో ఎవరి ఇంటి వైపు, మరీ ముఖ్యంగా టి.పి.శుక్లా ఇంటివైపు కన్నెత్తి కూడా చూడననీ రాయించి సంతకం పెట్టించుకున్నారు. పోలీసు వ్యాను దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది.

వీథివీథంతా జుగల్ వైపు విచిత్రంగా చూస్తోంది. కానీ, అసలు కథ మొదలయిన ఆ నీళ్ళ ట్యాంకు వైపు మాత్రం ఎవరూ కన్నెత్తి కూడా చూడట్లేదు. ట్యాంకులో నుండి నీళ్ళు ఇప్పుడు కూడా అలాగే కారుతూనే ఉన్నాయి. నీళ్ళు అలా వృథా కావల్సిందే, జుగల్, చుట్టుపక్కల మరొక టి.పి.శుక్లా లేని ఇల్లు అద్దెకు వెతుక్కోవాల్సిందే!

టి.పి.శుక్లా వంటి పెద్దమనిషి అహం శాంతించినందుకు కాలనీ వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. జుగల్ మీద కేసు-గీసు అయ్యి అతనికి మరీ పెద్దగా ఏం నష్టం జరగనందుకు, అతడు కాలనీ వదిలి వెళ్తున్నందుకూ కూడా కాలనీ వాళ్ళు సంతోషించారు. ఎంతకాదన్నా, బయటి మనిషి, పైగా గిరిజనుడు …. ఏ నక్సలైటు అయినా కావచ్చు… ఎవడికి తెలుసు? ఇవాళ టి.పి.శుక్లాకి ఎదురు తిరిగాడు, రేపు ఏం చేస్తాడో… ఎవడికి తెలుసు?

మరొక వైపు జుగల్ తనలోకంలో మునిగిపోయాడు. మనసు విప్పి కాసేపు  మాట్లాడుదాం అంటే జుగల్ కి ఇక్కడ,  ప్రయాగరాజ్ లో, మరీ మఖ్యంగా ఈ ప్రాంతంలో స్నేహితులు ఎవరూ లేరు. నలుగురైదుగురు స్టూడెంట్స్ తో పరిచయం ఉంది కానీ, వాళ్ళే వేరే వాళ్ళ గదుల్లో అద్దెకి ఉంటున్నారు. అయితే, వాళ్లల్లో ఒకరిద్దరు, వేరే గది దొరికే వరకు సామాను తమ గదిలో పెట్టుకోమని మాత్రం చెప్పారు.

జుగల్ కి ఇదే ఊళ్ళో ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. అయితే అతగాడు ఉండేది ఊరికి ఆ చివర! అతడు జుగల్ కి తనదైన రీతిలో చివాట్లు పెడుతూనే తన దగ్గరకి వచ్చెయ్యమన్నాడు. ఇప్పుడు చూడు ఎంత గొడవ జరిగిందో అని మందలించాడు. ఇక్కడి నుండి నీకు యూనివర్సిటీ దూరమే. ఒక గంట ప్రయాణం. టైం పోతుంది నిజమే, కానీ, టైం మిగిల్చి మాత్రం నువ్వు చేసేది ఏముందని? నాతో ఉంటే కాస్త తిన్నగా అయినా ఉంటావు. ఇలాంటి లేనిపోని తలకాయనొప్పులు తెచ్చిపెట్టుకోవు. ఇదేం నీ ఊరు కాదు. ఇక్కడ గంగ-యమున …. రెండు పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఏ నీటి కోసమైతే ఇన్ని కష్టాలు కొనితెచ్చుకున్నావో, ఇన్ని తిట్లు తిన్నావో ఆ నీళ్ళు ఇక్కడ కుంటలు, కాల్వల్లో ప్రవహించి నాలుగురోజుల్లో గంగాజలం అయిపోతాయి.

జుగల్, ఆరోగ్యం బాగోలేక ఈరోజు ఆఫీసుకు రాలేకపోతున్నట్టు తన పై అధికారికి మెసేజ్ చేసేసాడు. రోజంతా దిగులుగా కూర్చొనే ఉన్నాడు. తనతో తానే యుద్ధం చేస్తున్నట్టుంది అతడి పరిస్థితి. భయం-సాహసాల మధ్య జరిగిన యుద్ధంలో తనలోతానే కూరుకుపోతున్న చీకటి రోజు అది. చీకట్లో మిణుగురులను వెతికే రాత్రి ఇది…

మర్నాడు తన సామాను అంతా సర్ది ఒక స్నేహితుడికి ఇచ్చి పంపించేసాడు. తర్వాత మెల్లగా టి.పి.శుక్లా ఇంటికి బయల్దేరాడు. జుగల్ ని చూస్తూనే శుక్లా మండిపడబోయాడు. కానీ ఇంతలో జుగల్ – “అయ్యా, కోప్పడొద్దు. నేను కేవలం క్షమించమని అడగడానికి వచ్చాను. మీరు పెద్దవాళ్ళు. నా ఈ చిన్న ప్రయత్నంలో మీరు గెలిచి తీరవలసిందే, ఈ విషయం నాకు ముందే తెలుసు. శుక్లా సార్, అయినా నీళ్ళు మాత్రం ఓడిపోవడానికి వీలు లేదు.” 

“ఇన్నాళ్ళు నేను మీ పొరుగింట్లో ఉన్నాను. అందుకే వెళ్తూవెళ్తూ మీకు నా తరఫున ఒక చిరు కానుక – అలారం! నామీద దయ ఉంచి దీన్ని తీసుకోండి. నేను గది ఖాళీ చేసేసాను. ఇక నా నుండి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తెలిసోతెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించండి.” చెప్పాలి అనుకున్న నాలుగు మాటలూ గబగబా చెప్పేసి జుగల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ దారిపట్టాడు.

టి.పి.శుక్లా ఒక్క క్షణం కొయ్యబారిపోయాడు. మరుక్షణం ఈలోకంలోకి వచ్ఛి, అలారం నేలకేసి కొట్టి  మళ్ళీ తిట్లు మొదలుపెట్టాడు. దొంగ నా కొడుకు పోతూపోతూ కూడా నా చెంప ఛెళ్ళుమనిపించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. శుక్లా అక్కడి నుండే తిట్లు మొదలుపెట్టాడు. తిట్లు వినిపిస్తున్నా, జుగల్ వెనక్కి తిరిగి చూడడు, అతడికి కనీసం జవాబు చెప్పాలన్న ఆలోచన కూడా లేదు.

శుక్లాకి ఇంతకు ముందు, అంటే ఆఖరిసారిగా తనకి ఎప్పుడు ఇంత పెద్ద అవమానం జరిగిందో గుర్తు కూడా లేదు. శుక్లాకి పిచ్చెక్కిపోతోంది. రక్తం మరిగిపోతోంది. పిచ్చెక్కిన వాడిలా జుగల్ ని వెంబడించబోయాడు. మళ్ళీ అంతలోనే వెనక్కి వచ్చి కారు స్టార్ట్ చేసాడు. 

ఇది జరిగినది.

మొత్తం అంతా మీ కళ్ళముందే ఉంది. ఓ పాఠకులారా! తర్వాత ఏం జరిగిందో ఊహించగలరా?

నిండిపోయిన ట్యాంకు నుండి ప్రవహిస్తున్న నీళ్ళలా జుగల్ విచారంగా ఒంటరిగా తలదించుకుని ముందుకు సాగిపోవలసిందే! టి.పి.శుక్లా, సీనియర్ క్లర్క్, విద్యా శాఖ ఎప్పుడు తన కోటిన్నర విలువ చేసే కారుతో వచ్చి తనని లేపేసి అదే వేగంతో ముందుకు వెళ్ళిపోతాడో జుగల్ కి తెలిసే అవకాశం కూడా లేదు. 

కావాలి అనుకుంటే క్లైమాక్స్ మార్చుకోండి.

ఆఁ ఆఁ…. మీరు కావాలి అనుకుంటేనే సుమా!

మనోజ్ కుమార్ పాండే

ప్రముఖ హిందీ రచయిత శ్రీ మనోజ్ కుమార్ పాండే 7 అక్టోబరు, 1977 న అలహాబాదులోని సిసవాఁ గ్రామంలో జన్మించారు. చాలా కాలం లక్నో, వార్దాల్లో ఉన్న తర్వాత 2020 లో అలహాబాదు తిరిగి వచ్చారు. శ్రీ పాండే ఇప్పటి వరకు 5 కథా సంకలనాలు, 1 కవిత సంకలనం ప్రచురించారు. వీరి కథలను నాటక రూపంగా ప్రదర్శించటమే కాకుండా, సినిమాలుగా కూడా తీసారు. వీరి కథలు పలు భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి.

రచనా వ్యాసాంగానికి గాను వీరు అందుకున్న అవార్డులు, సన్మానాల్లో ‘స్వయంప్రకాశ్ స్మృతి సమ్మాన్’ (2021), ‘వనమాలీ యువా కథా సమ్మాన్’ (2019), ‘రామ్ అద్వానీ పురస్కారం’ (2018), ‘రవీంద్ర కాలియా స్మృతి కథా సమ్మాన్’ (2017), ‘స్పందన్ కృతి సమ్మాన్’ (2015), ‘భారతీయ్ భాష పరిషత్తు వారి యువ పురస్కారం’ (2011), ‘విజయ్ వర్మ స్మృతి సమ్మాన్’ (2010), ‘ప్రబోధ్ మజుందార్ స్మృతి సమ్మాన్’ (2006) చెప్పుకోదగ్గవి.

శ్రీ మనోజ్ కుమార్ పాండే ప్రస్తుతం లోకభారతీ ప్రకాశన్ లో సంపాదకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మొబైల్ : 08275409685

ఈ-మెయిల్ : chanduksaath@gmail.com

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *