కాఫ్కా, ప్రేమ, ఒక షికార్లు కొట్టే బొమ్మ

Spread the love

ఫ్రాంజ్ కాఫ్కా, తను చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు బెర్లిన్ లోని స్టేగలిజ్ పార్కులో వాకింగ్ కు వెళ్ళాడు. రోజూ అలా పార్కులో వాకింగ్ చెయ్యడం ఆయనకి అలవాటు మరి! అయితే ఆరోజు పార్కులో కాఫ్కాకి ఒక చిన్నపిల్ల గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించింది. తీరా ఎందుకు ఏడుస్తోందా అని అడిగితే తను ఆడుకునే బొమ్మ పోయిందని, అది లేకపోతే తనకు అన్నం కూడా సయించదని చెప్తూనే మళ్లీ ఆరునొక్క రాగంలో ఏడుపు అందుకుంది. తనకి తన బొమ్మ కావాలని మారాం చెయ్యడం మొదలుపెట్టింది. కాఫ్కా కాసేపు ఆలోచించి, తను ఎలాగైనా ఆ బొమ్మ తీసుకొస్తానని మాటిచ్చాడు. మాటయితే ఇచ్చేసాడు కానీ ఆ బొమ్మని తిరిగి తీసుకురావడం ఎలాగో మాత్రం ఆయనకి అర్థం కాలేదు. అందుకే మరి కాసేపటికి తేరుకుని కాఫ్కా ఆ అమ్మాయికి, ఆటబొమ్మ దేశ-విదేశాలు చూడటానికి షికారుకి వెళ్ళిందనీ, కొన్నాళ్ళకి తిరిగి వస్తుందని నచ్చజెప్పి బుజ్జగించాడు. పైగా తనని ఒక పోస్టుమేన్ గా పరిచయం చేసుకుంటూ, ఆ బొమ్మ ఏమన్నా ఉత్తరం రాసిందేమో చూసి రేపు మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆ ఉత్తరం ఇస్తానని కూడా చెప్పాడు. దానితో ఆ అమ్మాయి కాస్త శాంతించింది. మర్నాడు అక్కడే కలుసుకుందామనే ఒప్పందం మీద ఇద్దరూ తమతమ ఇళ్ళకి తిరిగివెళ్ళారు.
ముందుగా అనుకున్నట్టుగానే మర్నాడు ఉదయం కాఫ్కా ఆ బొమ్మ రాసిన ఉత్తరం పట్టుకుని పార్కుకి వచ్చాడు. ఆ అమ్మాయి కూడా వచ్చింది. అయితే ఇంకా బాగా చాలా చిన్నపిల్ల అవ్వడంతో, ఆమెకు చదవడం-రాయడం రాదు. కాబట్టి కాఫ్కాయే బొమ్మ రాసిన ఉత్తరం ఆ అమ్మాయికి చదివి వినిపించాడు.
“ఇంత చిన్న విషయానికే ఎవరైనా ఏడుస్తారా? ఒకేచోట ఉండి-ఉండి నాకు విసుగొచ్చేసింది. అందుకే కాస్త లోకం చూసొద్దామని షికార్లు కొట్టడానికి బయటకి వెళ్ళాను. అలా లోకమంతా చూసి ఆ వింతలు-విశేషాలు అన్నీ నీకు వివరంగా ఉత్తరాలు రాస్తూ ఉంటాను. ఇక ఎప్పుడు నువ్వు నా గురించి ఏడవకూడదు చూడు మరి. ఏడిచావంటే నా మీద ఒట్టే!” – ఇది ఆ బొమ్మ రాసిన ఉత్తరం సారాంశం.
బొమ్మకి-అమ్మాయికి మధ్య అలా ఉత్తరాలు మొదలయ్యాయి. ఆ ఉత్తరాలు కూడా ఎంతో కుతూహలంగా ఉండేవి. ఆ సందేశ వాహకుడు మన కాఫ్కా! ఇక అక్కడ నుంచి కాఫ్కా పార్కులో ఎప్పుడు ఆ అమ్మాయి కలిసినా, ఆ బొమ్మ రాసిన ఏదో ఒక ఉత్తరం చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఉత్తరాల నిండా దేశదేశాల కబుర్లు..! కాఫ్కా అమ్మాయి పక్కన కూర్చుని ఎంతో ఓర్పుతో ఆ ఉత్తరాలన్నీ చదివి వినిపించేవాడు.
ఈ ఉత్తరాల తతంగం ఏదో ఒకట్రెండు రోజులు కాదు, సుమారు మూడు వారాలు నడిచింది. కాఫ్కా ప్రతిరోజూ ఆ బొమ్మ రాసిన ఉత్తరం తీసుకుని పార్కుకి వచ్చేవాడు. ఇక ఈ ఉత్తరాల ప్రహసనానికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకుని కాఫ్కా ఆ అమ్మాయి కోసం ఒక కొత్త బొమ్మ తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి కేరింతలు కొడుతూ కొత్త బొమ్మ తీసుకుంది, కానీ అంతలోనే ముఖం చిన్నబుచ్చుకుంది. ఆ బొమ్మకి తను పోగొట్టుకున్న బొమ్మకీ ఎక్కడా ఎలాంటి పోలికలు లేవు మరి! ఇది ముందే ఊహించిన కాఫ్కా ఆటబొమ్మ రాసిన ఆఖరి ఉత్తరం సిద్ధంగా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి బొమ్మ గురించిన ప్రశ్న లేవనెత్తకముందే ఉత్తరం తెరిచి చదవడం మొదలుపెట్టాడు – “దేశ-విదేశాలు తిరిగితిరిగి నా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు నేను ఇదివరకట్లా లేను. అందుకే నువ్వు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నావు.”
ఆటబొమ్మ చెప్పిన మాటలు అమ్మాయి మనస్ఫూర్తిగా నమ్మడమే కాదు, అంగీకరించింది కూడా. వెంటనే బొమ్మని గుండెలకి హత్తుకుని, కేరింతలు కొడుతూ ఇంటిదారి పట్టింది.
దురదృష్టవశాత్తు తరవాతి ఏడాదే కాఫ్కా టి.బి. బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. చూస్తూచూస్తూనే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయింది. ఒకరోజు అనుకోకుండా ఆ అమ్మాయికి, కాఫ్కా ఇచ్చిన బొమ్మలో ఒక ఉత్తరం కనిపించింది. అది ఆ బొమ్మ రాసిన ఆఖరి ఉత్తరం. అందులో – “ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించే ప్రతి వస్తువు, ప్రతి మనిషి నీ నుండి విడిపోవడం, దూరం అవ్వడం సహజం. అది ప్రకృతి ధర్మం. అయితే అంతమాత్రానికి ఆ ప్రేమ నిన్ను వదిలి వెళ్ళిపోయినట్టు కాదు. ఎలాగయినా చిట్టచివరికి ఆ ప్రేమ నీ దగ్గరకి తిరిగి రాకమానదు, కానీ తన రూపురేఖలు మార్చుకుని నీ ముందుకు వస్తుంది. అంతే!
అయితే వయా కాఫ్కా ఆ ఆటబొమ్మ, అమ్మాయికి రాసిన ఉత్తరాలు తర్వాత కాలంలో ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? – అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఏదేమైనా ఆటబొమ్మ చెప్పిన జీవనసూత్రం మాత్రం మరువలేనిది, మరుపురానిది…!! అంతేకాదండోయ్ నమ్మి తీరవలసినది కూడా!!

జోర్డీ సియేరా ఫాబరా

జోర్డీ సియేరా ఫాబరా స్పెయిన్ దేశానికి చెందిన ప్రముఖ రచయిత మరియు సంగీత పాత్రికేయుడు. 1947 లో బార్సిలోనాలో జన్మించిన ఆయన, ముఖ్యంగా పిల్లలు మరియు యువత కోసం అద్భుతమైన నవలలు రాసి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఫాబరా స్పానిష్ మరియు కాటలాన్ భాషలలో దాదాపు ఐదువందలకు పైగా పుస్తకాలను ప్రచురించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆయన రాసిన పుస్తకాలు 1.6 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఆయన రాసిన పుస్తకాలలో జాతీయ బహుమతి పొందిన కాఫ్కా అండ్ ది ట్రావెలింగ్ డాల్ (Kafka and the Travelling Doll), కాంపోస్ డి ఫ్రీసాస్ (Campos de fresas), మరియు ఇన్స్పెక్టర్ మస్కారెల్ (Inspector Mascarell) సిరీస్ వంటివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.

స్పెయిన్‌లో రాక్ అండ్ రోల్, పాప్ సంగీత రంగంలో ప్రముఖ జర్నలిస్ట్‌గా పని చేసిన ఫాబరా 'పాపులర్ 1', 'సూపర్ పాప్' వంటి ప్రసిద్ధ సంగీత పత్రికలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు బీటిల్స్, బాబ్ డైలన్, మైఖేల్ జాక్సన్ వంటి గొప్ప సంగీతకారుల జీవిత చరిత్రలను కూడా రాశారు.

సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ స్పెయిన్ ప్రభుత్వపు అత్యున్నత పురస్కారమైన "గోల్డ్ మెడల్ ఫర్ మెరిట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్" తో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

డా. వి.ఎల్. నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి M.A (ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్ లేషన్) (గోల్డుమెడల్), M.Phil (హిందీ) (గోల్డుమెడల్), Ph.D (హిందీ) పట్టాలు పొందిన డా|| నరసింహం శివకోటి హిందీ - తెలుగు భాషలలో పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. వీరు ఈమధ్య కాలంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా గారి రెండు పరిశోధనాత్మక గ్రంథాలను 'ప్రభాత కిరణేఁ', 'అనావరణ్' శీర్షికన తెలుగు నుండి హిందీలోకి, అలాగే, ప్రముఖ హిందీ కవి నరేష్ సక్సేనా గారి ఎంపిక చేసిన కవితలను "అంతరిక్షం  నుండి.." శీర్షికతో హిందీ నుండి తెలుగులోకి అనువదించడంతోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలు తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ' భారత్ డైనమిక్స్ లిమిటెడ్'లో డిప్యూటీ మేనేజర్ (రాజభాష)గా సేవలు అందిస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *