అద్దేపల్లి రామమోహనరావు చేసిన విశేష కృషి యిది.తెలుగు కవిత్వ విమర్శకు తనదైన చేర్పు.తన మరణానంతరం వెలుగు చూస్తున్నదీ పుస్తకం. ఈ పుస్తకంలో 17 వ్యాసాలలో ఆధునిక కవిత్వం మీద వచ్చిన విమర్శను కూలంకషంగా చర్చించాడు అద్దేపల్లి.
మామూలుగా కట్టమంచి రామలింగారెడ్డి గారి కవితత్వ విచారంతో తెలుగు విమర్శను ప్రారంభిస్తారు. అయితే అద్దేపల్లి వారు కట్టమంచికి ముందు కందుకూరి, గురజాడ, గిడుగు లాంటి మహనీయులు తమ సృజనాత్మక రచనల్లో వ్యక్తీకరించిన విమర్శ మీద ఆలోచనలను క్రోడీకరించి వివరించాడు.ఆ తర్వాత భావకవిత్వం మీద విమర్శల తో మొదలుపెట్టి యిటీవలి దాకా తెలుగు కవిత్వం మీద వచ్చిన విమర్శా పరంపరను వ్యక్తులవారీ వివరించాడు. భావకవిత్వం మీద అది వెలువడు తున్నప్పుడు విమర్శకులు మాట్లాడింది లేదు. అయితే అక్కిరాజు ఉమాకాంత విద్యాధరులు భావకవిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దాని దశ ముగిసిన తర్వాత సోమసుందర్ లాంటి వారు విపులంగా రాశారు. అద్దేపల్లి వారు యీ పుస్తకంలో విశ్వనాథ, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, శ్రీ శ్రీ లాంటి వారి అభిప్రాయాలను భావకవిత్వ విమర్శ స్వభావాన్నీ,ప్రభావాన్నీ పేర్కొన్నారు.ఒక విధంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన వ్యాసాల్లో, ముందు మాటల్లో అభిప్రాయాలు వెల్లడించారు.భావకవిత్వం మీద విమర్శకుడిగా కొంతలో కొంత కృష్ణ శాస్త్రి నే చెప్పవచ్చు అంటాడు అద్దేపల్లి.అభ్యుదయ కవిత్వ విమర్శకు కోకూ,శ్రీ శ్రీ చేసిన కృషిని చెప్తూ అభ్యుదయ విమర్శకు కావలసిన సామాగ్రిని అందించినవాడు కోకు అంటాడు అద్దేపల్లి.అభ్యదయ సాహిత్యం పట్ల అభిప్రాయాలు స్థిరపడుతున్న ద్రవదశ అది. అభ్యుదయ సాహిత్యాన్ని యిష్టపడుతున్న వాళ్లంతా అడుగడుగునా ప్రాచీన వాదులతో తలపడి, తమ భావాలను ప్రత్యేకంగా సమర్ధించుకోవలసిన రోజులలో ఆవేశంతో కాకుండా లోతైన ఆలోచనతో వివిధ భావాల్ని అందించిన వారు కోకు అంటాడు అద్దేపల్లి.అభ్యుదయ రచన గురించి వివరించేటప్పుడు కోకు వివేచనలో విస్తృతి తెలుస్తున్నది. సామ్యవాదం కానిదంతా పనికిరాని రచన అని చెప్పరు. రాజకీయ ప్రధానంగానూ వుండదు.అయితే ప్రజాదృక్పథం, హేతువాదం లాంటి మౌలికాంశాల్ని వివరించి సమకాలీన జీవితానికి రచనల్ని అన్వయించాడని అద్దేపల్లి వివరించాడు.
నిబధ్ధ మార్క్సిస్టు విమర్శ తెలుగులో రావడానికి (1968) ముందు 1948 ల నుండి జరిగిన కొన్ని పరిణామాలను అద్దేపల్లి మూడు చిన్న వ్యాసాల్లో వివరించాడు. మార్క్సిస్టు విమర్శ తెలుగులో ఒక సమగ్ర రూపాన్ని పొందే ముందు కొన్ని అంచెల్ని దాటింది.మొదట సామాజిక ప్రగతిశీలతగా వున్న యీ విమర్శ క్రమంగా రాజకీయ దృక్పథం చేరడం వల్ల గుణాత్మకమైన మార్పు పొందింది. 1948 లో ముద్దుకూరి చంద్రం గారు రాసిన ‘ఆంధ్రసాహిత్యంలో కొత్త పోకడలు ‘ ఇందులో అభ్యుదయ సాహిత్యానికి రాజకీయ ఘటనల నేపథ్యాన్ని చెప్పడం ద్వారా సాహిత్య విమర్శను మలుపు తిప్పింది అంటాడు.ఈ వ్యాసం మీద పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా స్పందించి యింకొంత వివరణలు రాస్తూ రచయితల పాత్రనూ ఎత్తిచూపడం ద్వారా నిబధ్ధత అనే భావన విమర్శలోకి యింకించాడు.ఈ నేపథ్యంలో ప్రగతిశీల విమర్శకు దారులు పడ్డాయి. అవి కేవీయార్, సోమసుందర్ లాంటి వారి వల్ల మలుపులు తీసుకున్నాయి. ఆ మలుపులో అద్దేపల్లి రామమోహనరావు కూడా శ్రీశ్రీ కవిత్వం మీద తాను రాసిన వ్యాసాలతో తానూ పాలుపంచుకున్నాడు.
రమణారెడ్డి, సోమసుందర్ యిద్దరూ మొదటి నుంచి సాంప్రదాయ విరోధులుగా బయలుదేరిన వారు కాదు.విమర్శలో ప్రగతిశీలత వున్నా విభిన్న శిల్ప రీతుల పట్ల, అభిలాష వున్నవారే. రమణారెడ్డి విమర్శ లో గతితార్కికమైన సాంప్రదాయం పట్ల గౌరవం కన్పిస్తుంది.సామాజిక శాస్త్రాల నేపథ్యంలో ఒక రచనను విశ్లేషించడం కన్పిస్తుంది.అందుకే తిలక్ మానవ వాదం గురించి వ్యాసం రాయగలిగాడు. మో మీద వ్యాసం రాసాడు. శ్రీ శ్రీ, ఆరుద్ర లపై ఎక్కువగా రాసాడు. ఇక సోమసుందర్ లో ప్రగతిశీల భావాల వివేచనతో పాటు విరుద్ధమైన కళావాదం కూడా వుంది.సోమసుందర్ గారిలో అనుభూతి నిమగ్నత ప్రత్యేకంగా కనిపిస్తుంది అంటాడు అద్దేపల్లి.ఆయన సమీక్ష ల్లోఅనుభూతి ఆవిష్కరణకు సంబంధించిన అభివ్యక్తి మార్గాలు రూపుదిద్దుకుంటై. ఆయనది వ్యాఖ్యాత్మక విమర్శ అంటాడు అద్దేపల్లి.
ఇట్లా మార్క్సిస్టు సిద్ధాంతం విమర్శను నేరుగా నడిపించని దశలోని విమర్శకులైన వీళ్ళు నిజానికి సామ్యవాదులే అయినప్పటికీ వీళ్ళు రాసిన విమర్శలో సాంప్రదాయం భావాలూ, అలంకారిక ప్రభావాలూ వున్నాయి. ఈ ధోరణిని ఖండిస్తూ రారా లాంటి మార్క్సిస్టు తత్వశాస్త్రం, సాహిత్య రాజకీయాల్ని అవగాహన చేసుకున్న విమర్శకుడు బయలు దేరాడు. అద్దేపల్లి వారు తన శ్రీ శ్రీ వ్యాసాలు మీద రారా విమర్శను(శ్రీ శ్రీ ని మార్క్సిస్టు దృష్టి తో చూడకపోవడం, అలంకారిక శాస్త్ర పరిభాష ను వాడడం లాంటి కారణాల తో), ఒప్పుకోవడం ఆయనలోని ప్రజాస్వామిక విలువను సూచిస్తుంది.
కవిత్వ విమర్శ పరిణామాలను చెప్పడంలో, అద్దేపల్లి వచన కవితా ప్రయాణాన్ని గూడా చెప్పకనే చెప్పాడు. తెలుగు కవిత్వం సంప్రదాయ వాసనలు వదులు కోవడానికి, విమర్శకుల కృషి జరుగుతూ వున్న క్రమం లో కవిత్వం వచన కవిత్వంగా మారడం ప్రధానమైన దశ. ఆ దశకు కారణం కుందుర్తి కార్యకర్తుత్వం. దాన్ని అద్దేపల్లి వారు యీ పుస్తకంలో వివరించాడు. ఈ పుస్తకంలోని ఎనిమిదవ వ్యాసం,’వచన కవితా విమర్శ పరిణామం – ఒక అవగాహన’లో వచన కవితా లక్షణాలని కుందుర్తి చెప్పిన వాటిని పేర్కొన్నాడు. సమకాలీన జీవిత చిత్రణ, తెలుగుదనం, ప్రగతిశీల దృక్పథం, వ్యవహారభాషా ప్రయోగం,ఛందోగ్రాంధిక బంధ విఛ్ఛేదనం,అష్పష్టతా దోష బహిష్కారం మొదలైనవి. ఈ లక్షణాలను ప్రచారం చేసాడు. డెబ్భైల తర్వాత నాటి పాత కొత్తల సంఘర్షణ జరుగుతున్న కాలంలో యీ కుందుర్తి కార్యాచరణను ఉద్యమశీలమైన దృక్పథంగా పేర్కొంటాడు అద్దేపల్లి.
ఈ పుస్తకంలో ఇతర చిన్న వ్యాసాల్లో తెలుగు కవిత్వ విమర్శ పరిణామాలను, ముఖ్యంగా దిగంబర కవిత్వం మీద, మినీ కవిత్వం మీద, కవిసేనా మేనిఫెస్టో మీదా వివరించాడు. అటు తర్వాత విప్లవ కవిత్వ విమర్శకుల కృషికి పెద్ద పీఠ కన్పిస్తుంది.
అభ్యుదయ విమర్శ మార్క్సిస్టు పునాది కలిగిందే కానీ మార్క్సిస్టు మూల సూత్రాల అన్వయం విప్లవ విమర్శ తోనే ముందుకు వచ్చిందంటాడు అద్దేపల్లి. మార్క్సిస్టు సాహిత్యంలో ప్రపంచ వ్యాప్తమైనవన్నీ అందుబాటులోకి రావడం, వాటిని అన్వయించిడానికి తగిన వాతావరణం వుండటం, ఆ సమయానికి తెలుగునాట విమర్శ నిదానంగా వ్యవస్థీకృతమవడం తోపాటు ఎదురుగా జరుగుతున్న వర్గపోరాటం సాహిత్య విమర్శను ప్రభావితం చేసిందంటాడు అద్దేపల్లి. ఈ క్రమంలో కొడవటిగంటి కుటుంబరావు, కె.వి.ఆర్ లు అభ్యుదయ విమర్శకులుగా వుండి విప్లవ విమర్శకులుగా పరిణామం చెందడాన్ని వివరించాడు.కె.వి.ఆర్ విమర్శను క్రిటికల్ గా చూస్తూనే మార్క్సిస్టు గ్రంధాల్నీ, పాశ్చాత్య విజ్ఞాన శాఖల్నీ ఆకళింపు చేసుకుని తెలుగు సాహిత్య విమర్శ లో వాటిని అన్వయిస్తూ ఒక మేధావితనాన్ని నింపిన వారిలో కెవీఆర్ ప్రముఖుడంటాడు అద్దేపల్లి.విప్లవోద్య
మంతోపాటు విమర్శకుడైనవాడు మధుసూదనరావు. అందుకే ఆయన విమర్శలో గాఢత వుందంటాడు. సాహిత్యానికున్న స్వయంప్రతిపత్తినీ, అనుభూతికి గల వైవిధ్యాన్నీ, శిల్పానికి గల ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు త్రిపురనేని లోని అసమగ్రత అవగాహనకు వస్తుందంటాడు అద్దేపల్లి.
ఈ పుస్తకంలోని 17 వ్యాసాల్లో ఆరు వ్యాసాలు అభ్యుదయ, విప్లవ విమర్శకులను పరిచయం చేసిన అద్దేపల్లి, నవ్య సంప్రదాయ మార్గ కవిత్వ విమర్శకుల గురించి ఒక్క వ్యాసమే రాసినప్పటికీ, అదే యీ పుస్తకంలోని అతి పెద్ద వ్యాసం.అందులో కోవెల సుప్రసన్న, జి.వి. సుబ్రహ్మణ్యం, సంపత్కుమార, ముదిగొండ వీరభద్రయ్యల విమర్శావిధానాలను ప్రశంసా పూర్వకంగా వివరించాడు.
ఈ పుస్తకంలోని వ్యాస శీర్షికలు తెలుగు కవిత్వ విమర్శ పరిణామాన్ని అంశాల వారీగా పేర్కొన్నప్పటికీ వ్యాసం లోపల మాత్రం ఆయా అంశాలపై వ్యక్తుల కృషి వివరించేవిగా వున్నాయి.దాని వల్ల కొందరు విమర్శకులు పదే పదే కన్పిస్తుంటారు. కొందరేమో అసలు పరిగణలోకే రాకుండా పోయారనిపిస్తుంది. అద్దేపల్లి వారు ఎంపిక చేసుకున్న రచనా వ్యూహం దానికి కారణంగా తెలుస్తోంది.ఈ పుస్తకంలో మినీ కవిత్వంలో తన కృషిని వివరించడానికి చిన్న వ్యాసాన్ని రచించినా అందులో సాధ్యమైనంత నిర్వికారంగా, నిర్మమగా రాసాడు. ఆయనలోని ప్రజాస్వామికవాది తన గురించి తాను చెప్పుకునే టప్పుడు మనకు స్పష్టంగా కన్పిస్తాడు.శ్రీశ్రీ మీద తన వ్యాసాలను రారా తీవ్రంగా విమర్శించినా, దానికి సంబంధించిన కారణాలను అద్దేపల్లి పేర్కొన్నప్పుడు, అందులో తన వైపు నుంచి జరిగిన పొరపాట్లను గూడా పేర్కొనడం దీనికి మంచి ఉదాహరణ.
ఈ పుస్తకంలోని అంశాలను పరిశీలించినప్పుడు, తెలుగు కవిత్వ విమర్శకుడిగా అద్దేపల్లి కళాత్మకత వైపు స్పష్టంగా నిలబడినట్లు తెలుస్తుంది. అనుభూతి కి ప్రాధాన్యత యిస్తున్నట్లు ఈ పుస్తకంలోని చాలా చోట్ల చేసిన విశ్లేషణ చూస్తే అనిపించే ఆస్కారం వుంది. సోమసుందర్ విమర్శ గురించి మాట్లాడుతూ, సోమసుందర్ కు సామాజిక వస్తువుపై అభిలాషా వుంది.కళా విలువలపై పరిధులు దాటిన ఆసక్తి వుంది.అంటాడు.కెవీఆర్ విమర్శా పద్దతి గురించి మాట్లాడుతూ,కె.వి.ఆర్ కవితా శిల్పాన్నీ, అభివ్యక్తి ధోరణుల్నీ ఏ మాత్రం తక్కువ చూపు చూసిన వారు కాదు అంటాడు. నినాదాల నుండి భిన్నమైన, అనుభూతి కలిగించే కవిత్వం కావాలని కెవీఆర్ చెప్పాడని రాస్తాడు. ‘కరుణ రసం వల్ల మనం పెట్టుకునే కన్నీరు శారీరక చర్య. అది ఆనందం కాదు’ అని త్రిపురనేని మధుసూదనరావు అనడాన్ని అద్దేపల్లి అంగీకరించడు.సాహిత్యపరమైన అనుభూతి ని గూడా లౌకికమైన ఆలోచన, ఆవేశం పరిధిలోనే చూడడం పొసగని విషయని అంటాడు.ఇక వీరభద్రయ్య విమర్శా పద్దతి గురించి మాట్లాడుతూ,
‘మార్క్సీయ అనుభూతి కవులు విదేశాలకు దాసులైన అకవులని’అనడాన్ని అద్దేపల్లి ఆక్షేపిస్తాడు.ఇట్లా తన పరిధిలో వివరించిన అందరి విమర్శకులూ అనుభూతి గురించి వాళ్లేమి భావించారో చెప్పడం ద్వారా తన విమర్శా పద్దతిలో అనుభూతికున్న ప్రాధాన్యతను అద్దేపల్లి నొక్కి చెప్పాడు.ఈ పుస్తకంలోని వ్యాసాల అమరిక, వస్తు ప్రాధాన్యత, విశ్లేషణా కేంద్రాన్ని గుర్తించినప్పుడు అద్దేపల్లి మార్క్సిస్టు పండితుడు కాకున్నప్పటికీ, ఆధునికతని, ప్రగతిశీలతని తన విమర్శకి నేపథ్యంగా చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. శిల్పాన్ని నిరాకరించడం త్రిపురనేని మధుసూదనరావులోని లోపంగా చూసినవాడే, ముదిగొండ వీరభద్రయ్య మార్క్సిస్టు కవులు అకవులనడాన్నీ అంగీకరించడు. ఆ మేరకు అద్దేపల్లి సంప్రదాయ వాదులకేమో మార్క్సిస్టుగా, అతివాద మార్క్సిస్టులకేమో ప్రగతిశీలవాదిగా నిలబడతాడు.
ఈ పుస్తకం అద్దేపల్లి మరణానంతరం వెలుగు చూస్తున్నది కాబట్టి ఇందులోకి తప్పకుండా రావలసి వుండీ రాలేకపోయిన అంశాల గురించి తీర్పరులుగా వ్యాఖ్యానించలేం గానీ, దళిత బహుజన వాదపు సాహిత్య విమర్శలో దళిత కవిత్వ విమర్శకు కొంత చోటు దక్కిందిగానీ బహుజన వాదపు ప్రసక్తే అసలు రాలేదు.మైనారిటీ వాద సాహిత్య విమర్శకూ, ప్రాంతీయ అస్తిత్వ వాద సాహిత్య విమర్శకూ చోటు దొరకలేదు.
ఈ పుస్తకం చదువుతుంటే అద్దేపల్లి రామమోహనరావు గారి విస్తృత అధ్యయనం, ప్రగతిశీల దృక్పథం మనకు పేజీ పేజీలోనూ అవగతమవుతుంది






