తెలుగు కవిత్వం” గచ్చంసెట్టు”కు అటూ యిటూ!

Spread the love

తెలుగు కవిత్వం ‘గచ్చంసెట్టు కు అటూ ఇటూ’ ( ఉత్తరాంధ్ర పలుకుబడిలో ‘రచ్చబండ’)అనడం ఎందుకంటే, తెలుగు ఆధునిక కవిత్వం బయల్దేరింది ఉత్తరాంధ్ర నుంచీనే మరి.

గురజాడ నుంచి శ్రీశ్రీ , బైరాగి మీదుగా వీవీ, శివారె దాకా ఒక ఎత్తు. ఆ తర్వాత వందల మంది కవులు అందరూ పేర్లు చెప్పదగిన వాళ్లే అయినా వీళ్లంతా ఒక ఎత్తు. గాలి గాజుగోళాల మీద ప్రతిబింబాల్ని లిఖించే వైయక్తిక నైపుణ్యాలను పక్కనబెడితే, మిగిలిన వాళ్లందరూ వస్తు ప్రాధాన్యతా కవులే అంటే తప్పేమీ కాదనుకుంటా. ఇరవైఒకటో శతాబ్దపు తెలుగు కవిత్వమంతా
సామూహిక వ్యక్తీకరణదే. ఒకే వస్తువు మీద అందరు కవులూ రాస్తారు. వాళ్ల వాళ్లదే అయిన వైయక్తిక తారతమ్యంతో రాస్తారు. ఈ గుంపుతనం వల్ల ఏ కవీ ప్రత్యేకం కాదు, అలా అని కాకుండానూ పోడు. తెలుగు కవి ఆలోచనను ప్రగతిశీల శిబిరం ప్రభావితం చేస్తున్నం
దున కవులంతా ఆచరణలో ఎలా వున్నా రాయడం వరకూ సమాజ అభ్యున్నతి కోసమే రాస్తారు. విరసం రాయడమూ , మాట్లాడడమూ కూడా ఆచరణే అంటుంది.

ఈ ప్రాతిపదికన సారుసగటు తెలుగు కవి మంచి సమాజాన్ని కలగనే కవి. ఇప్పుడు తెలుగు లో మహా కవులెవరూ లేరు అంతా మంచి కవులే. ఆ లెక్కన పాయల మురళీ కృష్ణ ఉత్తరాంధ్ర తెలుగు సారస్వతాన్ని వారసత్వంగా కల్గినవాడే. అందుకే అతని రెండో కవితా సంపుటి ‘ గచ్చంసెట్టు కు అటూ ఇటూ ‘ తెలుగు లో వస్తున్న మంచి కవిత్వానికి ఉదాహరణే.

హోరు ప్రచురణ ( అనిల్ డానీ, శ్రీరాం పుప్పాల) గా వచ్చిన యీ కవితా సంపుటి యాభై స్వంత, ఆరు అనువాద కవితలతో వుంది. ఎక్కువలో ఎక్కువ కవితలది చిన్న నిడివి. కవికి నేరుగా చెప్పి క్లుప్తంగా ముగించడం యిష్టమ
వడం వల్ల ఎక్కువ కవితలు రెండు పేజీలు మించవు. వస్తురీత్యా చూసినప్పుడు ఉత్తరాంధ్రకే ప్రత్యేకమైన వేదనలూ, అలజడులూ, ఉద్యమ ఛాయలూ పాఠకులకు అందుతాయి. కవి టీచర్ అయినందున స్కూల్ పిల్లల చుట్టూ, గురువుల చుట్టూ, సహచర ప్రయాణీకులనూ, సావిత్రి బాయి ఫూలే నూ కలుపుకుని పలికించాడు. వర్తమాన సామాజిక కల్లోలాలు ,అది కశ్మీర్ అయితేనేమీ, అసిఫా అయితేనేమీ, రైతు దురవస్థలైతేనేమీ ప్రతి కవినీ కదిలించినట్లే యీ కవినీ కదిలించాయి.అలాగే అంతర్జాతీయ దౌష్ట్యమైన గాజా గాయం కూడా.

ఈ యాబై కవితల్లో యాబైయింటితోనూ పాఠకుడ్ని కదిలిస్తాడని అనుకోనఖ్ఖర్లేదుగానీ, ఏదో దుఃఖం వుందీ కవితల్లో. తన దిగువ తరగతి వెనుక బడిన కులమో, అణచివేత, పోరాటం కలగలిసిన ఉత్తరాంధ్ర నేపథ్యమో, సముద్రం అంచునా, సముద్రం మీదా అనాథలవుతున్న మత్సకార సమూహమో,గెలుపు కోసం అర్రులు చాస్తూ అలసిపోతున్న రైతాగమో, కశ్మీర్ పోరాటమో, దండకా రణ్యోద్యమమో యీ కవిని కలవర పెడుతున్న ఆనవాళ్లు యీ కవితల్లో కనిపిస్తాయి. ఏదో తెలియని దిగులు, మంద్ర స్థాయిలో మోగే దుఃఖ తాంబుర నాదంలా గుంభనంగా, వొదిగి పరివేదనగా వినిపిస్తాడు ఆర్తిగా. ఒక నిర్వాసిత భావన పుస్తకమంతా పరుచుకుని వుంది. కవిత్వం ప్రాథమికంగా ఉద్వేగ స్వభావి అంటారు. ఈ కవి స్వరంలో ఉద్వేగం కంటే ఆవేదన కనిపిస్తుంది. ఒక శాశ్వత సత్యం తెలుసుకున్నవాడి నింపాదితనంతో కవిత్వం చెబుతాడు. యీ కవిలో క్రోధం లేదు , ఆగ్రహం లేదు, వైభవీకరణ లేదు , ఆనందం లేదు . ఇతనిదంతా ఒకానొక విధ్వంసానంతర దుఃఖ చిత్రణ.

నిర్వాసితమై పోయిన కుటుంబాలూ, సమూహాలూ, వ్యక్తులూ, వాళ్లకు ఆలవాలమైన ఇండ్లూ యీ కవి కవితల్లోకి చాలా సార్లు వస్తాయి. కొన్ని కవితలు పూర్తిగా యీ విషయం మీదనే వుండడమే కాదు, సందర్భాన్ని బట్టి యింకొన్ని కవితల్లో నిర్వాసిత యిండ్లనీ , గదులనీ పోలిక చేస్తాడు. జీవితం పాడైపోయింది, బతుకు చీకటి పాలైంది, దిక్కులేనిదైంది లాంటి భావాలు పలికించడానికి గదినీ, గోడలనీ, నిర్వాసిత వీధుల్నీ వుపయోగించి కుంటాడు. పద్మూడు కవితల్లో యీ సంవిధానాన్ని చూడొచ్చు. ఇదొక ప్రత్యేక అంశం యీ కవిలో.

‘మహా దుఃఖం ‘ అనే కవితుంది.’ ఆ ఇంట్లో నది ప్రవహిస్తుంటుంది/ ఆద్యంతాల చీకటి నది ‘ అని ప్రారంభ
మవుతుంది. మనుషుల వలస వెళ్లిపోతున్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక నిర్వాసిత యింటిగా సంకేతించి కవిత చెబుతున్నాడేమో అనిపిస్తుంది. ‘ ఇంటికి నోచుకోని మను
షులకన్నా/ మనుషులకు నోచుకోని ఇంటిదే మహాదుఃఖం’
అని ముగిస్తాడు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సంకేతిస్తాడు.
‘ఎడిటివ్ ఐడెంటిటీ’ అనే కవితలో కొన్ని అబ్ స్ట్రాక్ట్ పదచిత్రాలతో ఆధునిక జీవనశైలిని చెప్తూ
‘ అద్దంలా మెరిసిపోతుందని
సంబరపడే ఇంటికి ముఖచిత్రం
ఎదురుచూపును మోస్తున్న నయనం ‘
అంటూ నిర్వాసిత భావాన్ని ఒక పదచిత్రంగా చెప్తాడు.
‘రాత్రిపద్యం’ అనే కవితలో కవి శరీరాన్ని ఒక నివాసంగా పోల్చుతూ , ‘తనకు భావం తోచడం లేదు’ అనడానికి
‘ ఆఖరి ఉత్తరాన్ని
ఎప్పుడు పోగొట్టుకుందో
ఎంతైనా నోరు విప్పదు
ఈ శిధిలమైన నివాసం ‘ అంటాడు.

నిర్వాసిత జీవితాల గురించి నాలుగైదు కవితల్లో చెప్తాడు.
‘ దారి ప్రక్క ఏకాంతశోకంలా ఓ చెట్టు
దాని కొమ్మకు వేలాడుతున్న పగిలిన అద్దం
వెళ్తూ వెళ్తూ ఆ అద్దాన్ని చూస్తే
ఏం కనిపించొచ్చు ‘ అంటూ మొదలు పెట్టి ఆవిరైపోయిన, చెల్లాచెదురైపోయిన బతుకుల గురించి దృశ్యమానం చేస్తాడు.ఆ చెట్టు కింద విడిది చేసిన సమూహపు కష్టం చెబుతాడు.
‘అక్కడ దీపం వెలగలేదు ‘ అనే కవితలో
‘ అక్కడ దీపం వెలగలేదు
మూడు ప్రాణ దీపాలు
ఊరికి దూరంగా
చీకటి మాటున రెపరెపలాడుతున్నాయి’ అంటూ తుఫానుకు చిక్కిన బడుగు కుటుంబాన్ని కవిత చేసాడు.

‘ ఖాళీ గడప ‘ కవిత మత్స్యకారుల జీవితాల దైన్యం పలికిన కవిత. సముద్రమూ, తీరమూ ఒక గడపగా పోలిక చేసుకుంటూ, సముద్రం మీద వేటకు వెళ్లడం వల్ల గడపలన్నీ ఖాళీగా వుండడమూ, ఆ వేట కూడా ఖాళీగానే వుండడమూ, వాళ్లలో చైతన్యమూ ఖాళీగా మిగులుతున్న
దనే నిరాశా కలగలపి రాసిన కవిత.

‘అదృశ్యగాయం’ అనే కవిత ఒక సంచార సమూహాపు కథ.ఊరి బయట పాడుబడ్డ గోదాంలో తలదాచుకున్న కుటుంబంలోని పసిపిల్లకు విపత్తు వాటిల్లితే ఎవరాదుకు
నేందుకు వస్తారు? మృత్యువు తప్ప. ఆ రాత్రి వాళ్ల వ్యథని కథగా గానం చేస్తాడు కవి. ‘తలాపు దీపాలక్కూడా దిక్కు
లేని శవాలపై/ వీధిలైటు ధాటిగా వెలుగుతోంది ‘ అని ముగిస్తాడు.

శరీరాన్ని గదితో సామ్యం చేసుకోవడం రాత్రి పద్యం కవితలోనే కాదు ‘ చివరి గది’ కవితలో కూడా చూడొచ్చు.
రాంపల్లి గైరమ్మ అనే ధీరవనిత చివరి రోజుల్లో గదిలో మంచానికి పరిమితమైన స్థితిని చెప్తూ ఆమె శరీరమే ఆ గది అనేలా చిత్రీకరణ చేస్తాడు.
‘ ఈ గది చాలా చిన్నది
ఒక మంచమే దాని ప్రంపంచం ‘ అంటాడు.
పాయల మురళీ కృష్ణ కవిత్వంలో గది , యిల్లూ, ప్రాంతం, నదీ యీ నాలుగింటినీ ఒక సామ్యంలో వాడడం కనిపిస్తుంది. ఈ కవితలో ఒక స్త్రీ, గది, నదీ మూడింటిని
‘అప్పుడెప్పుడో చెమ్మగిల్లిన కళ్లు ఇంటి వసారాలో
కార్చిన వెలుగుని దాచుకున్న జ్ఞాపకాల్లో వెతుక్కొని
గది నదిలా గంభీరమైపోతుంది.’ అంటూ ఒక సామ్యంలో
చూపించాడు.

రాత్రి పద్యం కవితలో, కవి సృజన కీ రాత్రి సమయానికీ
గల లంకెను చెప్తూ గదినీ దేహాన్నీ సామ్యం చేసి కవిత చేసి
నట్లే, ‘ రాత్రిపగలు ‘ అనే కవితలో కూడా ఇల్లు లేని తనం, జీవితంలో ఖాళీ తనం, నిర్వాసిత భావాలను రాత్రి లాంటి పగలు తో పోల్చుతాడు. మళ్లీ పోలికలో పోలిక ఏమిటంటే
పగలు అంటే ఇల్లూ, వెలుగూ, జీవితం. చీకటి నిండిన ఇల్లు, చీకటి నిండిన జీవితం అని అనడానికి రాత్రి పగలు అంటాడు కవి. కవితంతా నాలుగు స్టాంజాలలో కుదమట్టంగా ఇంటి చుట్టూ నిర్మిస్తాడు. ఎంత సరళంగా కవిత అల్లగలడో, అదే సమయంలో అంతే సింబాలిక్ గానూ మలచగలడు. కవికి గల యీ నైపుణ్యం ‘ రాత్రిపగలు ‘ , ‘ గుర్తున్నంతవరకు ‘ కవితల్లో చూడగలం.

ఇప్పుడు వస్తున్న తెలుగు కవిత్వ సంపుటాలను చూస్తే
ఒక టెంప్లేట్ కన్పిస్తుంది. వర్తమాన సంక్షోభాల మీద తక్షణ స్పందనలతో కూడిన కవితలు కొన్ని, ఉద్యమాల గురించి కొన్ని , స్త్రీవాదం అందరిలోకీ ( కనీసం రచన వరకూ నైనా)
యింకింది కాబట్టి స్త్రీల చుట్టూ కొన్ని , సదరు కవి టీచర్ అయితే స్కూల్, పిల్లలూ, బడిచదువుల చుట్టూ కొన్ని, రైతుల గురించి కొన్ని తప్పనిసరిగా కూర్చి వుంటాయి. ఆయా కవుల ప్రత్యేక నైపుణ్యాల్ని బట్టి యింకొన్ని తరహా కవితలూ యీ కూర్పులోకి చేరి అలరించవచ్చు.ఇదంతా సగటు ప్రగతిశీల శిబిరపు కవుల సృజనకు సంబంధించి నదే. ఇట్లా అంటున్నామంటే యీ కవులనెవరినీ తప్పు పట్టాలని కాదు. ఇదంతా కాలప్రభావమని గుర్తించడమే.
పాయల మురళీ కృష్ణ కూడా యీ దారిలో నడిచిన కవే.

ఈ కవిలో గుర్తించాల్సిన ప్రస్ఫుటమైన కోణం ప్రాంతీయ అస్తిత్వమూ, బహుజన చేతనా, విప్లవోద్యమ ఛాయా కలగలిసిన తనం.
‘తనలో మనిషితనాన్ని చంపేసిన/ గత వెలిచూపుల బాణాలన్నీ/ ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి/
అతడు వెళ్లిపోతున్నాడు/ వెనుక నుండి అధికారమేదో
ఆజ్ఞల్ని విసురుతున్నా/ తిరిగి చూడని అతడి వెనుక/
అస్పష్టత నీడగానైనా వెంటపడడం లేదు.'(కరవాలం చెప్పిన రహస్యం)
తనను అమానవీయంగా మార్చే పరిస్థితిని గుర్తించి, అధిగమించే వైయక్తిక తీరు, పై వాక్యాల్లో వ్యక్తమైంది.ఇది కవి ఆశించే చైతన్యం.

‘ అతడు మాట్లాడుతూ మాట్లాడుతూ సమూహ మయ్యాడు/ ఒక్కసారిగా ఇసుక దిబ్బల మీద చలనచైతన్యం/ ఆ నిముషంలో నా ముందు రెండు సముద్రాలు/ రెండింటా కనిపించని అగ్నిపర్వతాలు/..
లోపల చర్యేదో జరుగుతూవుంది.'(ఇంకా తీరం దాటలేదు) ఉత్తరాంధ్ర మత్స్యకార ఉద్యమాన్ని చెప్పిన తీరిది.
‘ కాకుల్లేని ఆకాశం ‘ , ‘ మళ్లీ వెనక్కి రాడు ‘ , ‘ అరణ్యం
ప్రవేశించే సమయం’ యీ మూడు కవితలూ విప్లవోద్యమ
స్ఫూర్తితో రాసినవి.

సావిత్రి బాయి ఫూలేని ‘ నిషేధిత నలుపు వాకిళ్ల ప్రపంచంలో/ అక్షర విత్తులు జల్లిన నల్లబల్ల ‘ అంటాడీ కవి.

ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాణనుడిని తన కవిత్వపు
నేపథ్య సంగీతంగా అమర్చుకున్నాడు యీ కవి.చాలా కవితల సారాంశంలో తన ప్రాంతం వుంది. దాని వేదన వుంది. ‘ ఆండ్రొంకాయ’ , ‘ గచ్చంసెట్టు కు అటూ ఇటూ ‘
కవితలూ రెండూ ఉత్తరాంధ్ర నుడికారంలోనే రాసాడు. ఒకటేమో ఉత్తరాంధ్ర రసనకు వున్న వైవిధ్యం, ఇంకొకటి ఉత్తరాంధ్ర గ్రామీణ చిత్రం. గచ్చంసెట్టు కు అటూ ఇటూ జరుగుతున్న అభివృద్ధి దేన్ని తొక్కుకుంటూ వస్తోందో యీ
కవితలో చెప్పాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి అనేది మూడో ప్రపంచ దేశాల్లో ఆయా సమాజాల మూలుగులను పీల్చేస్తూ , సంస్కృతిని దెబ్బతీస్తూ మూల
మూలకూ వేయికాళ్లతో వ్వాపిస్తూ, వేయి చేతులతో దోచుకుంటూ వున్నది. ఆ నేపథ్యమే గచ్చంసెట్టు కు అటూ ఇటూ. ఆ వూరి రచ్చబండను అభివృద్ధి పేరుతో వస్తున్న రోడ్డు మింగేయడం కేవలం ఒక సంకేతం మాత్రమే. ఒక ప్రాంతీయ విధ్వంస రూపానికున్న అంతర్జాతీయ పునాది
గురించి అలవోకగా వివరించడంలో యీ కవి నైపుణ్యం వుంది.

ఈ సంపుటి లోని యాబై స్వంత కవితల్లో కనీసం ఆరేడు లేకుంటే కూడా నష్టమేమీ లేదు. ప్రతి కవికీ స్వంత అనుభవాల పట్ల వుండే మమకారం అక్షరబద్ధం చేయ
నీయకుండా నిలువనీదు. తనను తాను ఎడిట్ చేసు
కోవడంలోనే కవి నాణ్యత దాగి వుంటుందనేది నిజం.
‘ సృజన ఎలా మొదలైతేనేం
ప్రశ్నించే స్వేచ్ఛను గుప్పిట బంధించే
దేశమంత చేతుల్ని ఛేదించే తెగువను కదా
అతడు ప్రదర్శించాలనుకుంది’. ( వర్షం కవిత)
ఈ కవి కవిత్వం మీద ఎన్ని వంకలు వెతకాలనుకున్నా, పై వాక్యాల్లో వాటికి సమాధానం చెప్పుకున్నాడా అనిపిస్తుంది.
‘ ఈ అక్షరాల అడవిలోకి
మరో విలుకాడు రావడంకన్నా
పద్యం కోరుకునేదేముంటుంది ‘(పద్యం కోరుకునేది)
అని మనం కూడా అనుకుందాం అనిపిస్తుంది.
‘ పైపైనే నీ పద్యాన్ని హత్తుకున్న వాడు
అకస్మాత్తుగా నీపై దండిత్తితే
మరో పద్యానికి పూనుకుంటావు ‘.(అప్పటికింకా ముగిసిపోదు)
ఇంత నిర్మొహమాటంగా లోకసత్యం ఎరిగి కూడా తన నిజ ప్రవర్తన పట్ల నిబధ్ధత ప్రకటించిన యీ కవిని గుర్తించక
ఎలా వుండగలుగుతాం అనిపిస్తుంది.
*

G. Venkata Krishana

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *