నేను కథకుణ్ణికాను, జేబు కత్తిరించుకొనే వాణ్ణి

Spread the love

నా జీవితంలో మూడు ముఖ్యమయిన సంఘటనలు జరిగాయి. మొదటిది-
నాపుట్టుక. రెండోది- నా పెళ్లి. మూడోది-నేను కథకుణ్ణి కావటం.
నాకు రాజకీయాలంటే పెద్దగా అభిరుచి లేదు. నా దృష్టిలో లీడరు, మందులు
అమ్ముకునేవాడు ఒకలాంటివారే! గాంధీగారికి సినిమాలంటే ఎంత సయోధ్యో, నాకు
రాజకీయాలన్నా అంతే! గాంధీజీ సినిమాలు చూడరు. నేను దినపత్రిక చదవను.
నిజానికి మేమిద్దరమూ తప్పుచేస్తున్నాం. గాంధీజీ సినిమాలు చూడాలి. నేను
తప్పక దినపత్రికలు చూస్తూ ఉండాలి.
నన్ను తరచూ అడుగుతూ వుంటారు నేను కథలు ఎలా రాస్తానా అని.
దానికి నా జవాబు ఇలా ఉంటుంది-
గదిలో సోఫాలో కూచుంటాను. కాగితం, కలం తీసుకొని, ‘బిస్మిల్లా (ప్రారంభం)
అనుకుంటూ కథ రాయటం మొదలెడ్తాను. నా ముగ్గురమ్మాయిలూ గదిలో గొడవచేస్తూనే
వుంటారు. మధ్య మధ్య వారి మాటల్లో మాటలు కలుపుతూ వుంటాను. వారి తగువులకీ,
తస్కాలకీ తీర్పులు ఇస్తాను. నన్ను కలియటానికి వచ్చినవారికి అతిథి మర్యాదలు
చేస్తాను. అయినా కథ రాయటం కొనసాగుతూనే వుంటుంది.
వాస్తవానికి అన్నం తిన్నంత సహజంగా, స్నానంచేస్తున్నంత సుళువుగా, సిగరెట్టు
తాగుతున్నంత హాయిగా కథ “రాసేస్తూ వుంటాను.

‘అసలు నువ్వు కథలు ఎందుకు రాస్తున్నావయ్యా?’ అని ఎవరయినా నన్ను ప్రశ్నిస్తే,
నాది ఒకటే జవాబు,
‘సారాయి తాగే దురలవాటులాగానే నాకు కథలు రాయటం కూడా’
నాది వానాకాలం చదువు. నిజానికి కథ నేను రాయను. కథే నన్ను రాస్తుంది. ఓ
పాతిక పుస్తకాలదాకా రాశాను.
ఒకోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ‘ఎవరబ్బా! ఇంత మంచి కథలు రాస్తున్నది’
అని.
తదనంతరకాలంలో ఆ కథలపై కోర్టుకేసులు కూడా జరిగాయి. నా చేతిలో కలం
లేకపోతే నేను కేవలం ‘సాదత్ హసన్’ నే అయిపోయి వుండేవాణ్ణి.
కథ నా బుర్రలో వుండదు. నా జేబులో వుంటుంది. ఆ విషయం నాకు
తెలీదు.విషయం నాకు తెలీదు. కథ రావాలంటూ బుర్రమీద వత్తిడి తెస్తాను. కథ
రాయటానికి శతధా ప్రయత్నిస్తాను.
సిగరెట్ దమ్ము మీద దమ్ము లాగించేస్తున్నా కథ బుర్రలోంచి బయటికి రాదే!
ఎట్టకేలకు అలసిసొలసిన గొడ్రాలికి మల్లే పక్కమీద పడుకుంటాను.
కథ ఇంకా రాయకుండానే రాస్తానని చెప్పి సంపాదకుణ్ణించి అడ్వాన్సు
తీసేసుకున్నాను. అందుకే నాకు వర్రీ ఎక్కువ. పక్కమీద దొర్లుతాను. ఊహుఁ!…
ప్రయోజనంలేదు. లేచివెళ్లి పెంపుడు పక్షులకు గింజలు వేసివచ్చి పిల్లల వుయ్యాలలు
వూపుతాను. ఇల్లు వూడ్చి శుభ్రం చేస్తాను. ఇంట్లో చిందరవందరగా పడివున్న పసిపిల్లల
జోళ్లను తీసుకొచ్చి ఒకచోట పెడ్తాను. అయినా దొంగముండా కధ జేబులోనే
పడివుంటుంది. బుర్రలోకి రాదు. నేను గింజుకుపోతాను.

బాగా చికాకనిపిస్తే బాత్రూంలోకి చొరబడ్తాను. అక్కడా ప్రయోజనం లేకపోతుంది.
గొప్ప వ్యక్తులంతా బాత్రూంలోనే ఆలోచిస్తారని ప్రతీతి. నా స్వభావం నాకు తెలుసు గనక
నేను గొప్ప వ్యక్తి కానని నాకు తెలుసు. అందుకే బాత్రూంలోకి వెళ్లి కూడా నేను
ఆలోచించలేకపోతాను. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏవిటంటే హిందుస్థాన్,
పాకిస్థాన్ రెండు దేశాల్లోనూ నేను గొప్ప కథకుణ్ణి! దానికి నాదొకటే సమాధానం. నా
విమర్శకులకి నామీద అతి అభిమానమయినా వుండి వుండాలి లేదా వాళ్ల కళ్లల్లో నేను
దుమ్ము కొడ్తూనయినా వుండాలి.
ఎంత గింజుకున్నా బుర్రలోంచి కథ బయటికి రానప్పుడు నా భార్య చక్రం
అడ్డువేస్తుంది. “ఇక ఏవీ ఆలోచించకుండా, కలంచేతిలోకి తీసుకొని, ఫటాఫట్
రాసెయ్యండీ” అని. అంతే! కలం అందుకొని, రాయటం మొదలెడ్తాను. ఆ సమయంలో
బుర్రంతా ఖాళీగానూ, జేబునిండుగానూ వుంటుంది. తనంతతానుగా కథ ఒక్క గెంతు
గెంతి బయటికి వచ్చేస్తుంది.
పొరబాటున నేను కథకుణ్ణి అయ్యాననుకోను. జేబులు కత్తిరించుకొనే
వాణ్ణనుకుంటాను. నా జేబులు నేనే కత్తిరించుకొని, ప్రజలకి అప్పగించేస్తాను.
రేడియోకోసం రాసే నాటకాలు భుక్తి కోసం పడే తంటాలలో ఓ భాగం. రచయిత
మానసికంగా, రోగిగా మారేదాకా ఈ సమస్య అతనిముందు వుండకమానదు. ఆకలి
అంటూ ఒకటుంది. రేడియో నాటకాలు రాస్తాను. నా బుర్ర నా కడుపు లోకి దూరి,
ఇతరుల్ని నవ్వించే హాస్యనాటకాలు రాయించింది. అయినా నా పెదాలమీద చిరునవ్వుని
కూడా తేలేకపో యింది. అందుకు నా బుర్రని నేను అభినందిస్తున్నాను.

తిండికీ, కళకీమధ్య వున్న సంబంధం చిత్రంగా ధ్వనిస్తుంది. కానీ ఏంజేస్తాం?
ఖుదా దయ అలా వుంటే మనం ఏంచేయ గలం? ఖుదా ప్రతి విషయంలోనూ నిర్లిప్తంగా
వుంటాడనీ, ఏవిషయంలోనూ కోర్కె వుండదనటం తప్పు. వాస్తవానికి ఆయనకి భక్తి
కావాలి. భక్తి మెత్తని, సున్నితమయిన రొట్టె. దానితో ఖుదా కడుపు నింపుకుంటాడు.
సాదత్ హసన్ మంటో రచనా వ్యాసంగం చేస్తాడు. తను దేవుడంత కథకుడూ. కవీకాడు.
అయినా కడుపు కక్కుర్తి కోసం రాయక తప్పటం లేదు మంటోకి.
నా వ్యక్తిత్వం విశిష్టమయినదనీ, ఉర్దూ సాహిత్యంలో గొప్ప రచయితనని నాకు
తెలుసు. ఆ తృప్తే గనక లేకపోతే నా జీవితం దుర్భరమయిపోయేది. పాకిస్థాన్ అనే నా
దేశంలో నేను సముచిత స్థానం ఏర్పర చుకోలేదన్నది వాస్తవం. అందువల్ల నా
అంతరంగం ఎప్పుడూ అశాంతితో వేగిపోతుంది. అందువల్ల ఒకప్పుడు పిచ్చాసుత్రిలోనూ,
వేరొకప్పుడు మామూలు ఆసుపత్రిలోనూ వుంటూ వుంటాను.
‘నువ్వు తాగుడునించి బయట పడ లేవా?’ అని తరచు నన్ను ప్రశ్నిస్తూ వుంటారు.
జీవితంలో ముప్పాతిక భాగం విధి నిషేధాల్లో గడవక తప్పిందికాదు. అందువల్ల నా
డిక్షనరీలో నిషేధం అనే మాటని ఎత్తివేశాను.
నిషేధాలమధ్య జీవితం గడపాల్సి రావడమంటే అది ఖైదుతో సమానమే. ఏదో
ఒకవిధంగా మేజోడు దారం పట్టుకొని, లాగెయ్యటం-అంతే!
అతను గొప్ప కథకుడు మంటోనామా
జననం: 1912 మే 11
భార్య పేరు: సాఫియా

సంతతి: ముగ్గురు అమ్మాయిలు-నిగహత్, నజహత్, నుసరత్.
విద్య: అమృతసర్ , అలీఘడ్ లో
నివాసం: అమృతసర్, లాహోరు, ఢిల్లీ, బొంబాయి.
మరణం: 1955 జనవరి, 18-లాహో రులో కబ్రస్తాన్లో పూడ్చివేశారు.
తొలికథ: ‘తమాషా’ అమృతసర్ ఉర్దూ వారపత్రికలో.
తొలికథాసంపుటి: చినగారియా’ (నిప్పురవ్వలు) 1935.
106 విపుల ఆగస్ట్ 2001
చివరి కథారచన: కబూతర్ ఔర్ కబూ తరీ (మగపావురం, ఆడపావురం)
అతను రాసిన ఈ దిగువ కథలపై (పాకిస్థాన్లో) కేసులు నడిచాయి.

‘కాలీసల్వార్’ (నల్లసల్వారు), ‘బూ’ (కంపు), ‘రండా గోష్’ (చల్లని మాంసం) ‘ధువాఁ’
(పొగ), ‘ఖోల్ దో ‘ (తెరిచెయ్), ‘ఊపర్ నీచే, దరియ్యాన్’ (పైన, కింద,
నడుమ)
పుస్తకాలు: 30 సంపుటాలకు పైగా
అమృతసర్ లో కూచావకీలాలో ‘మంటో లపేట’ వుంది. సాదత్ అంటూ వుండే వాడు.
“మంట్ అంటే అంటే కాశ్మీర్ భాషలో త్రాసు. కాశ్మీరులో మా నాయన ధనాన్ని త్రాసులో
తూచే వారు. అందువల్ల మమ్మల్ని ‘మంటో’లని పిలవసాగారు”
మంటో సమాధిమీద
“దయార్ద్ర హృదయుడు- కష్టాలు కోరితెచ్చుకునేవాడు

పుట్టుక: 1912 మే 11. మరణం: 1955 జనవరి 18.

786

ఇక్కడ సాదత్ హసన్ మంటోని పూడ్చి పెట్టారు. అతని గుండెల్లోని కథాశిల్ప విద్య,
రహస్యాలూ అన్నీ ఈ భూమిలో పాతిపెట్టబడ్డాయి. అతనిప్పుడు మట్టికింద కూచొని
ఆలోచిస్తూ వున్నాడు ‘తను గొప్ప కథా శిల్పా? లేక ఖుదావానా?

సాదత్ హసన్ మంటో
1954 ఆగస్టు 18″

అనిచనిపోవటానికి కొన్ని నెలలు ముందు గానే తన గోరీ మీద స్వయంగా మంటో
పైవిధంగా రాశాడు. ఆ తర్వాత ఎక్కువ కాలం అతను బతకలేదు.
అనువాదం: నిర్మలానంద


మంటో
నిర్మలానంద
కీర్తిశేషులు ముప్పన మల్లేశ్వరరావు గారు హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలంపేరు పెట్టుకున్నారు.తన 84 ఏళ్ల జీవితంలో 66 ఏళ్లపాటు సాహిత్య సేవలోనే నిమగ్నమయ్యారు.1952లో భారతి పత్రికలో ఆయన స్వీయ రచన మార్పు కథ ప్రచురితమైంది. నిర్మలానంద, విపుల్ చక్రవర్తి, తెలుగు దాసు, ముప్పన రుక్మిణి, కొండపల్లి శైలజ వంటి అనేక పేర్లతో వందలాది కథలను తెలుగులోకి  అనువాదం చేశారు.  ఆయన ఆప్త మిత్రుడు జీవరక్షణ రావు(జీవన్) సూచన మేరకు స్వీయ రచనలకు స్వస్తి పలికాడు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో అనువాద రంగానికే పరిమితమయ్యారు. నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత మహా శ్వేతాదేవితో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాససంకలనాన్ని ప్రచురించారు. దీన్ని మహా శ్వేతాదేవి చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు తెలుగు నుంచి చలం, శ్రీశ్రీ,రావి శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పాలగుమ్మి పద్మరాజు, వి.రాజారామ్మోహన్ రావు, అల్లం శేషగిరి రావు, బలివాడ కాంతారావు, భాలగంగాధర్ తిలక్, కుందుర్తి, శేషేంద్ర శర్మ, శీలా వీర్రాజు, శివారెడ్డి, ఛాయరాజ్, శీలా సుభద్రా దేవీ, కొప్పుల భానుమూర్తి, ఖదీర్ బాబు రచనలను హిందీ, మలయాళం, సింధీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, మైథిలీ, డోగ్రీ తదితర భాషల్లోకి అనువదింప చేశారు.. కేరళ నుంచి వెలువడే యుగ ప్రభాత్ పత్రికలో 1960లో అప్పటి పత్రిక ఎడిటర్ రవి వర్మ సహకారంతో దాదాపు మూడేళ్ల పాటు ఉగాది ప్రత్యేక సంచికలను హిందీలోకి తీసుకు వచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *